అవసరానికి 'లోన్' పొందడం ఎలా?
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా... అన్న గేయం ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటలో చెప్పినట్టు అందరూ పప్పు కూడు కోసమే అప్పు చెయ్యరు. కొంత మందికి అవసరం. కొంత మందికి ఆకలి బాధ. అప్పు లేనిదే పూట గడవని వారు ఎందరో ఉన్నారు. మరి అవసరంలో ఆదుకునే రుణాలు ఏమున్నాయి...?. ఒక్కసారి అన్నింటినీ తెలిసేసుకుంటే అవసరంలో అప్పు పుట్టించడం తేలికవుతుంది!
రుణాలు
వ్యక్తిగత రుణాలు, ఆస్తులపై రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డ్, బంగారంపై రుణాలు, వినియోగదారుల రుణాలు, పెన్షన్ పై రుణాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు ఇలా అవసరంలో అక్కరకు వచ్చే రుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ రుణాలన్నీ కూడా వ్యక్తిగత ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకోతగినవే. అదే గృహరుణం, విద్యా రుణాలు, వ్యవసాయ రుణాల వంటి వాటిని ప్రత్యేకంగా ఆయా అవసరాలకు మాత్రమే వినియోగించుకోతగిన రుణాలు.
పర్సనల్ లోన్... వాస్తవాలు
అవసరం ఏదైనా గానీ అర్హత ఉంటే వ్యక్తిగత రుణం వెంటనే లభిస్తుంది. ఈ రుణం కోసం చాంతాండంత ప్రక్రియ ఉండదు. వేతన జీవులు లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు తగిన ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం ద్వారా రుణాన్ని సంపాదించవచ్చు. నికరంగా వచ్చే నెలవారీ ఆదాయంలో 40 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని ఖరారు చేస్తారు. రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు అర్హతను బట్టి రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్లలోపే ఉంటుంది. వడ్డీ ఎంతుంటుందన్న విషయాన్ని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. రుణం తిరిగి చెల్లించే సత్తా, వేతన స్థాయి, రుణ చరిత్ర ఇలాంటి విషయాలను కంపెనీలు, బ్యాంకులు చూస్తాయి. 13 శాతం నుంచి 32 శాత వరకు వడ్డీ విధించవచ్చు. అర్హత సరిపోకపోతే మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల్లో దరఖాస్తుదారుల అర్హతకు అనుగుణంగా ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంకులు విధిస్తున్నాయి.
రుణం జారీ చేసే ముందు...
ఏ కంపెనీ అయినా ప్రస్తుతం రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) రిపోర్టు చూస్తున్నాయి. ఇందులో ఓ వ్యక్తికి సంబంధించి అప్పటి వరకు తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అది సిబిల్ రికార్డుల్లోకి చేరిపోతుంది. దీని వల్ల ఒక వేళ రుణం లభించినా వడ్డీ రేటు పెరిగిపోతుంది. రుణం తీర్చే గడువు నాలుగేళ్లు. కానీ మూడేళ్లకే మొత్తం తీర్చేస్తే కొంత జరిమానా భరించాల్సి ఉంటుంది. ఇది మిగిలి ఉన్న బకాయిలో 5 శాతం మేర ఉండవచ్చు. ఇది కూడా చూడాల్సిన అంశమే.
భిన్న రకాల వడ్డీ
స్థిర వడ్డీ, చర వడ్డీ ఉంటుంది. అలాగే, ఫిక్స్ డ్ ఫ్లాట్ రేట్, రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు అని కూడా ఉంటాయి. ఫిక్స్ డ్ ఫ్లాట్ రేటు విధానంలో నెల నెల వాయిదాలు చెల్లిస్తున్నా గడువు తీరే వరకు రుణం మొత్తం అలానే ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు విధానంలో రోజువారీ, నెలవారీ, మూడు నెలలకోసారి, లేదా వార్షికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణం మొత్తం గడువు తీరే లోపు అసలు, వడ్డీ కలిపి మొత్తం ఎంత వ్యయం అవుతుందో ముందుగానే అడిగి తెలుసుకోవాలి. తక్కువ వ్యయం అయ్యే రుణమే నయం. అలాగే, నిబంధనలు, షరతులు చూడాలి.
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంకు 11.59% - 18.49% వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కింద 0.5 - 2.25% వరకు చార్జ్ చేస్తోంది. ముందస్తు రుణం చెల్లింపులపై 5 శాతం జరిమానాగా చెల్లించుకోవాలి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 10.99% - 19.80% వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ చార్జీ 1.75 - 2.25% ఉంది. రుణం పది లక్షల రూపాయలు దాటి ఉంటే ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. లేకుంటే 4 శాతం వసూలు చేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.60% - 1510% వడ్డీను వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు 1.01% శాతమే. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు.
బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేట్లు 15 శాతం నుంచీ ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంది. ముందస్తు రుణం తీర్చివేతపై 4 శాతం రాబడుతోంది.
క్రెడిట్ కార్డుపై రుణం
ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ నెలకు 25వేల రూపాయలు అంతకంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్నవారికి బ్యాంకులు ఇతర సంస్థలు పిలిచి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. అయితే, 1.50 లక్షల నుంచి 1.80 లక్షల్లోపు వేతనం ఉన్నవారికి కూడా ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులను సంస్థలు జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ విజయా బ్యాంకు అయితే రూ.60వేల వేతనం ఉన్నవారికి కూడా క్రెడిట్ కార్డు అందిస్తోంది. లేదంటే కనీసం 25వేల రూపాయల నుంచి 50వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ తర్వాత క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కార్డు తప్పకుండా జారీ అవుతుంది.
క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు తమ పే స్లిప్, బ్యాంకు స్టేట్ మెంట్, నివాస, గుర్తింపు ధ్రువీకరణలు, పాన్ కార్డు కాపీని అందజేయాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి, వృత్తుల్లో ఉన్నవారు ఆదాయపన్ను రిటర్నుల కాపీలను లేదా చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు సాధారణంగా నెలకు 1.5 నుంచి 2.99 శాతం వరకు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.50 శాతం స్థాయిలో వడ్డీని చార్జ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీలపై వడ్డీ పడుతుంది.
బంగారంపై రుణం
బంగారు ఆభరణాలు ఇంట్లో బీరువాలో ఉంటే పిల్లలు పెడతాయా...? తీసుకెళ్లి దాన్ని కుదువపెట్టి చక్కగా రుణాన్ని పొందవచ్చు. అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. సాధారణంగా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డుపై రుణాలు సంస్థలకు సురక్షితమైనవి కావు. వీటిలో రిస్క్ ఉంటుంది. ఆభరణాలు, లేదా స్వచ్ఛ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలు సురక్షితమైనవి. తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చకుండా ఉండే అవకాశాలు తక్కువ. ఒకవేళ చెల్లించకున్నా బంగారాన్ని వేలం వేసుకుంటాయి.
బంగారంపై రుణం గంటల్లో మహా అయితే ఒకటి రెండు రోజుల్లో లభిస్తుంది. బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. నెలనెలా వడ్డీ చెల్లించవచ్చు. లేదంటే కాల వ్యవధి చివర్లో వడ్డీ, అసలు మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంది. అయితే, వడ్డీ రేటు ఎంతుంటుంది అన్నది పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రూపాయి కంటే తక్కువ వడ్డీకి ఏ సంస్థా రుణాన్ని ఇవ్వడం లేదు. వాస్తవంగా చూస్తే వడ్డీ రేటు రూపాయి నుంచి రెండు రూపాయల వరకు ఉంటోంది .
10 లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తనఖా పెడితే ఏడున్నర లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. కానీ, మీరు ఐదు లక్షల రూపాయలే తీసుకున్నారని అనుకుంటే అప్పుడు మార్జిన్ పరంగా మీపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒకవేళ బంగారం విలువ తగ్గి తనఖా పెట్టిన బంగారం విలువ ఏడు లక్షల రూపాయలకు దిగిపోతే అప్పుడు రుణం తీసుకున్న వారు హామీగా అదనంగా రూ.50వేల బంగారాన్ని హామీగా ఉంచాలి. లేదా నగదు చెల్లించాలి. అందుకే రుణం వెసులుబాటును పూర్తిగా వినియోగించుకోకుండా కొంత తక్కువే తీసుకున్నట్టయితే ఆటు పోట్ల సమయంలో నిశ్చింతగా ఉండవచ్చు. ఇలా అర్హత కంటే తక్కువ రుణం తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సంస్థలు ఉన్నాయి.
18 నుంచి 24 క్యారట్ల బంగారాన్ని తనఖా పెట్టుకోవచ్చు. స్టోన్స్ ఇతరత్రా ఉంటే వాటిని మొత్తం బరువులోంచి తగ్గిస్తారు. సాధారణంగా బంగారం రుణాన్ని పొందడానికి పాన్ కార్డు, వోటర్ ఐడీ లేదా పాస్ పోర్టు వంటి ఏదో ఒక పత్రం ఇస్తే సరిపోతుంది. చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి. కొన్ని సంస్థలు ఇంటి ఇల్లాలి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని కూడా అడుగుతున్నాయి. రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు కూడా అవసరం.
వెయ్యి నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. వడ్డీ రేటును రోజువారీ బ్యాలన్స్ పై విధిస్తుంటాయి. మధ్య మధ్యలో అసలుకు కొంత మొత్తం అదనంగా కట్టేందుకు అనుమతిస్తున్నాయి. సమయానికి వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే 2 శాతం వరకు జరిమానా చెల్లించుకోవాలి. రుణం జారీ సమయంలో ప్రాసెసింగ్ చార్జీ 2శాతం వరకూ ఉంటుంది. బంగారంపై రుణం సమయంలో విలువ మదింపు చార్జీ పేరుతో కొంత చెల్లించుకోవాలి. రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే సంస్థలు ఒకటికి మూడు సార్లు నోటీసులు జారీ చేస్తాయి. అప్పటికీ స్పందించకుంటే తనఖాగా ఉన్న బంగారాన్ని వేలం వేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి.
బంగారం భౌతిక రూపంలోనే ఉండాలని లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో... అంటే గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) పైనా రుణాన్ని సులభంగా పొందవచ్చు. రుణం చెల్లింపు కాల వ్యవధి సాధారణంగా ఏడాది ఉంటుంది. కొన్ని సంస్థలు మూడు నెలలుగానే నిర్దేశించి ఆ గడువు తర్వాత పునరుద్ధరించుకుంటూ వెళుతున్నాయి.
బంగారంపై తాకట్టు, నెలవారీ వాయిదాలు చెల్లించడం అసౌకర్యంగా భావించే వారు ఆభరణాలను మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవచ్చు. రుణం తీసుకుంటే నెలవారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆభరణాలు విక్రయించినట్టయితే నెలనెలా కొంత మొత్తంతో తిరిగి బంగారం కొనుగోలు చేస్తూ వెళితే అమ్మేసిన మొత్తాన్ని తిరిగి కొంత కాలంలోనే సొంతం చేసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాలు
ఇన్సూరెన్స్ అన్నది అనుకోని సంఘటనే జరిగితే తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకునేది. కానీ, అత్యవసరంగా నగదు అవసరం అయితే ఇన్సూరెన్స్ పాలసీ పత్రాన్ని హామీగా ఉంచి రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు సైతం బీమా పత్రాలను తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తున్నాయి. అయితే, సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలపైనే రుణం లభిస్తుందని మర్చిపోవద్దు. అది కూడా పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాతే. మూడేళ్లు పూర్తి అయిన పాలసీలకే సరెండర్ వేల్యూ (స్వాధీన విలువ) వస్తుంది. ఆ విలువపైనే ఎంత రుణం ఇవ్వాలనేది సంస్థలు నిర్ణయిస్తాయి. స్వాధీన విలువలో 90 శాతం వరకు రుణం లభిస్తుంది.
గోల్డ్ లోన్ వలే బీమా పత్రాలపై రుణం కూడా సులభంగానే పొందవచ్చు. సెక్యూర్డ్ రుణాలు కనుక తిరస్కరించే అవకాశాలు చాలా చాలా తక్కువ. హామీగా బీమా పాలసీ పత్రం ఉంటుంది కనుక పెద్ద ప్రహసనం ఏమీ ఉండదు. ఫొటో ఐడెంటిటీ, చిరునామా గుర్తింపు పత్రాలు, ఫొటో కాపీలు అందజేస్తే సరిపోతుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 12.50 నుంచి 19.50 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజును 2.5 శాతం విధిస్తోంది. గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తోంది. కాల వ్యవధి ఏడాది నుంచి ఐదు సంవత్సరాలు.
టాటా క్యాపిటల్ సంస్థ కూడా 12.50 శాతం నుంచి 19.50 వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు 11.49 నుంచి 17.50 శాతం వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ అయితే 15.75 శాతం వరకు వడ్డీ రేటు, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ఎస్ బీఐ 17.65 శాతం వడ్డీ, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోంది. కాల వ్యవధి అనేది దాదాపుగా అన్ని కంపెనీల్లోనూ ఏడాది నుంచి ఐదేళ్ల వరకే ఉంది.
ఎల్ఐసీ మాత్రం తన పాలసీదారులకు పాలసీ పత్రాలపై 10 శాతం వడ్డీ రేటుకే రుణాలను అందిస్తోంది. వడ్డీ కూడా ఆరు నెలలకు ఓ సారి చెల్లిస్తే సరిపోతుంది. అసలు రుణాన్ని పాలసీ కాల వ్యవధి తీరే వరకు కొనసాగించుకునే సదుపాయం ఉంది. చివరిగా సెటిల్ మెంట్ అప్పుడు రుణాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే పాలసీలపై రుణం కోసం బీమా కంపెనీలను ఆశ్రయించడం వల్ల తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది.
బ్యాంకు లేదా ఎన్ బీఎఫ్ సీ సంస్థ లేదా బీమా కంపెనీ నుంచి రుణాలను పొందేందుకు ముందుగా ఆయా సంస్థలను సంప్రదించాలి. దరఖాస్తును ఇవ్వడంతోపాటు పాలసీ పత్రాన్ని తనఖా పెడుతున్నట్టు రాసి ఇవ్వాలి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవు. రుణ చరిత్ర ఇతర గోల కూడా ఉండదు. సులభంగా రుణం లభిస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి పాలసీలపై రుణం మంచి ఐడియాగా చెబుతారు.
విఫలమైతే...
బీమా పాలసీలపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఓ వ్యక్తి విఫలమయ్యాడని అనుకుందాం. ఓ రోజు ప్రమాదవశాత్తూ పాలసీదారుడు మరణించినట్టయితే... అప్పుడు నామినీలు పాలసీదారుడు బతికున్న సమయంలో తీసుకున్న రుణం, వడ్డీని పూర్తిగా చెల్లించి పాలసీ పత్రాన్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. తీర్చలేకుంటే బీమా సంస్థ అందించే పరిహారంలో రుణం, వడ్డీలకు చెల్లింపులు పోను మిగిలిన మొత్తం నామినీకి అందుతుంది. అసలు రుణం, వడ్డీ బకాయిలు కలిపి పాలసీ స్వాధీన విలువకు చేరిన వెంటనే ఆ పాలసీ కథ ముగిసినట్టే. దాన్ని సరెండర్ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని రుణం ఇచ్చిన సంస్థ మాఫీ చేసుకుంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం
రెండు మూడేళ్ల తర్వాత ఓ ముఖ్య అవసరం కోసమని కొంత నగదును ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ లోపు అత్యవసరం ఏర్పడింది. వెంటనే నగదు కావాలి. బంగారం కుదువపెడదామంటే ఆభరణాలే లేవాయె. స్నేహితులును, బంధువులను అడిగితే కాదన్నారు. ఇక మీకున్న ఒకే ఒక అవకాశం ఫిక్స్ డ్ డిపాజిట్. డిపాజిట్ రద్దు చేసి నగదు వెనక్కు తీసుకుంటే మళ్లీ పొదుపు చేయలేమో...? అన్న సందేహం. దీంతో డిపాజిట్ చేసిన బ్యాంకుకు వెళ్లి దానిపై రుణం తీసుకోవచ్చు. దీన్నే ఓడీ ఫెసిలిటీ అని కూడా అంటారు. హామీగా ఆ డిపాజిట్ పత్రాన్ని తమ దగ్గర ఉంచుకుని డిపాజిట్ విలువలో 80 శాతం నుంచి 90 శాతం వరకు బ్యాంకులు రుణం ఇస్తాయి. వడ్డీ కూడా చాలా తక్కువే. డిపాజిట్ పై బ్యాంకు ఇస్తున్న వడ్డీ రేటు కంటే రెండు శాతం అదనం.
ఉదాహరణకు డిపాజిట్ పై 7 శాతం వడ్డీ రేటు ఉంటే 9 శాతం వడ్డీకే రుణాన్ని తీసుకుని నింపాదిగా ఉండవచ్చు. పైగా డిపాజిట్ ను కదిలించకుండా ఉంటారు. దానిపై వచ్చే వడ్డీ రేటును చూసుకుంటే తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ రేటు నికరంగా 2 శాతమే. దాదాపుగా చాలా బ్యాంకులు రుణం జారీకి ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయడం లేదు. రుణం కాల వ్యవధి డిపాజిట్ మెచ్యూరిటీ గడువు వరకు ఉంటుంది. వడ్డీ రోజువారీగా లెక్కిస్తారు కనుక ముందస్తు చెల్లింపులపై ఎలాంటి జరిమానాలు విధించడం లేదు. ఒక వేళ మీ దగ్గర డిపాజిట్ కూడా లేదనుకుందాం. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర కనీసం డిపాజిట్ పత్రం ఉంటే ఓడీ ద్వారా ఇవ్వమని కోరండి. బ్యాంకు వడ్డీ రేటు కంటే అదనంగా రెండు శాతం ఇస్తామని ఆఫర్ చేయండి.
ఆస్తులపై రుణాలు
ఇళ్లు, ఇతర ఆస్తులను తనఖా ఉంచి వాటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. మార్కెట్ విలువపై 50 శాతం వరకు రుణం వచ్చేందుకు అవకాశం ఉంది. కొన్ని 70 శాతం వరకూ రుణాలిస్తున్నాయి. లేదా రుణం తీసుకునే వారు నెలవారీ ఆర్జనకు 30 నుంచి 40 రెట్ల వరకు రుణం వస్తుంది. ఉదాహరణకు నెలకు 20వేల రూపాయలు అందుకుంటుంటే గరిష్ఠంగా రూ.8లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 13 నుంచి 16 శాతంగా ఉంది. సాధారణంగా ముఖ్యమైన అవసరాలకే ఆస్తులపై రుణానికి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
ఈ రుణాలపై వడ్డీ స్థిరంగా లేదా చలనంగా ఉండవచ్చు. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా వంటివి తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. పైగా ముందస్తు రుణం తీర్చివేతపై రుసుములు విధించడం లేదు. సాధారణంగా ప్రాపర్టీ రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ 0.5 శాతం నుంచి 1.5 శాతం (రుణం విలువపై) వరకు ఉంది. ఏడాది నుంచి పదేళ్ల వరకు రుణం తీర్చేందుకు గడువు ఉంటుంది. తర్వాత మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంది. వడ్డీ రేటు పరంగా చూస్తే వ్యక్తిగత రుణం కంటే ప్రాపర్టీపై రుణమే చౌక. పైగా వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఐదేళ్లు. ప్రాపర్టీ రుణాన్ని నిదానంగా అయినా తీర్చేయవచ్చు.
ఇల్లు, ఫ్లాట్, ప్లాట్, వాణిజ్య భవనం వీటిలో ఏదైనా సరే రుణానికి చెల్లుబాటు అవుతాయి. తీసుకునే వారి పేరుపైనే ఆస్తి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఆస్తి ఇద్దరు ముగ్గురు పేరిట ఉంటే అందరూ కలసి రుణానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆస్తులకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఉండాలి. బ్యాంకులు నివాస, గుర్తింపు ధ్రువీకరణల కింద రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా టెలిఫోన్ బిల్లు, పాన్ కార్డు అడగవచ్చు. వేతన జీవి అయితే గత ఆరు నెలల కాలానికి బ్యాంకు స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వయం ఉపాధిలో ఉన్నవారు గత రెండేళ్ల ఆదాయంపై చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుని సమర్పించాలి.
పీపీఎఫ్ ఈపీఎఫ్ పై కూడా రుణం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లపై కూడా రుణం తీసుకునే సౌకర్యం ఉంది. ప్లాట్ కొనుగోలు, వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు లేదా గృహరుణం తీర్చేందుకు, ఇల్లు నవీకరణ, ముందస్తు పదవీ విరమణ సందర్భాల్లోనే ఈఫీఎఫ్ పై రుణం తీసుకోగలరు. పీపీఎఫ్ పై ఇలాంటి పరిమితులు లేవు. మూడో ఏడాది నుంచి ఆరో ఏడాదిలోపు రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు పీపీఎఫ్ ఖాతాను 2011-12వ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తే... మూడో ఏడాది అయిన 2014-2015 నుంచి ఆరో ఏడాది అయిన 2017-2018 లోపు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. రుణం తీసుకుంటున్న తేదీకి అంతకుముందు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉన్న బ్యాలన్స్ పై 25 శాతం రుణమే లభిస్తుంది. ఆరో ఏడాది తర్వాత రుణానికి అవకాశం లేదు.
ఎందుకంటే పీపీఎఫ్ ప్రారంభించి ఆరేళ్లు పూర్తయితే నేరుగా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. నాలుగో ఏడాది చివరికి ఖాతాలో ఉన్న నగదు బ్యాలన్స్ పై 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. పీపీఎఫ్ పై రుణాన్ని ఏక మొత్తంలో లేదా 36 నెలల కాలంలో నెలవారీగా తీర్చివేయవచ్చు. పీపీఎఫ్ పై ప్రభుత్వం చెల్లించే వడ్డీ రేటుకు అదనంగా రెండు శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. 36 నెలల్లోపు రుణం తీర్చివేయకపోతే అదనంగా ఆరు శాతం వడ్డీ రేటు విధింపు ఉంటుంది. దీన్ని ఏటా పీపీఎఫ్ ఖాతా బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించేస్తే తిరిగి మళ్లీ తీసుకోవచ్చు.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి అమ్మేద్దామంటే మార్కెట్లు బలహీనంగా ఉన్నాయా...? ఏం పర్వాలేదు. వీటిపై కూడా రుణం తీసుకోవచ్చు. కాకపోతే విలువ మొత్తంపై రుణం 50 శాతానికి మించదు. దీన్నే మార్జిన్ లేదా హెయిర్ కట్ అంటారు. పైగా అన్ని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై రుణం ఇవ్వరు. ఎంపిక చేసిన జాబితాలోని షేర్లు, ఫండ్స్ పైనే రుణం లభిస్తుంది.
ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే 10 నుంచి 12 శాతం వడ్డీయే వసూలు చేస్తోంది. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ అయితే, ఇంకా తక్కువ వడ్డీకే ఇస్తోంది. రుణం తీర్చివేసే వరకూ వాటిని విక్రయించుకునే వీలుండదు.
వేతన ఖాతా నుంచి ఓవర్ డ్రాఫ్ట్
సేవింగ్స్ ఖాతాల నుంచి బ్యాలన్స్ కంటే అధిక మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ వేతన ఖాతా నుంచి ఓ నెల వేతనాన్ని అత్యవసరాల్లో డ్రా చేసుకునే సౌకర్యాన్ని పలు బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచి రూ.10వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. వడ్డీ రేటు 12 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుుంది.
వడ్డీ వ్యాపారులే దిక్కు...!
ఇక ఎక్కడా రుణం పుట్టకపోతే చివరిగా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యక్తుల దగ్గర నుంచి సాయం పొందడమే. వీరు 2 నుంచి 5 రూపాయల వడ్డీ వరకు వసూలు చేస్తుంటారు. ఇంతకంటే ఎక్కువ పిండుకునే వారు కూడా ఉన్నారు.