బేబీమూన్ గురించి విన్నారా...? వెళ్లొచ్చారా...?

కొత్తగా పెళ్లయిన దంపతులు ఏకాంతంగా గడిపేందుకు, మరింత దగ్గరయ్యేందుకు హనీమాన్ కు వెళ్లడం తెలుసు. దాంపత్య జీవితం రసవత్తరంగా సాగిపోతే వారి జీవితాల్లోకి చిన్నారులు ప్రవేశిస్తారు. వారి రాకముందు చేసే యాత్ర బేబీమూన్...

పిల్లలు పుట్టే వరకే వారి మధ్య ఏకాంతం. పిల్లలతో జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. బాధ్యతలు పెరిగి తమకోసం సమయం కేటాయించుకోలేనంత బిజీగా మారిపోతారు. అందుకే పిల్లలు రాక ముందు మధుర స్మృతులను మూట గట్టుకునేందుకు మరో యాత్ర బేబీమాన్...

గర్భం దాల్చిన తర్వాత వారసుల విషయంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కోర్కెలు, ఇలా మనసు నిలకడగా ఉండదు. ఆలోచనలు గిర్రున తిరుగుతుంటాయి. ఆస్పత్రులు, వైద్య పరీక్షలతో ఆందోళన చెందేవారూ ఉంటారు. ఇలాంటి వాటికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా దంపతులిద్దరూ కలసి సేదతీరడమే బేబీమూన్! 

ఏంటీ బేబీమూన్

పాశ్చాత్య వాసులకు బేబీమూన్ కొత్తేమీ కాదు. చాలా విషయాల్లో పాశ్చాత్య దేశాల బాటలో నడుస్తున్న ఇక్కడి యువతరాన్ని బేబీమూన్ కూడా ఆకర్షిస్తోంది. దాంతో ప్రత్యేక యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. బ్రిటన్ యువరాజు విలియమ్ తన శ్రీమతి కేట్ మిడిల్ టన్ తో కలసి బేబీ మూన్ యాత్రకు వెళ్లొచ్చినవారే. అమెరికాలో సగం మంది దంపతులు బేబీమూన్ కు వెళుతుంటారు. బేబీమూన్ అనే పదాన్ని షీలా కిట్జింగర్ అనే రచయిత మొదటిసారిగా 1996లో ఉపయోగించారు. బేబీ పుట్టిన తర్వాత తల్లిదండ్రులతో కలసి ఏకాంతంగా ఉండేందుకు ఈ యాత్రను ఉద్దేశించారు. కానీ ఆచరణలో ఇది గర్భంతో ఉన్నప్పుడు చేసే యాత్రగా మారిపోయింది. 

representation image

ఎప్పుడు వెళ్లడం అనువుగా ఉంటుంది...

స్త్రీకి తొమ్మిది నెలలు చాలా కీలకమైనవి. వీటిలో ప్రతి మూడు నెలల కాలాన్ని ఓ భాగంగా (ట్రైమెస్టర్) పేర్కొంటారు. బేబీమూన్ కు రెండో త్రైమాసికం అనువైనది. అంటే నాలుగో నెల నుంచి ఆరో నెల ముగిసేలోపు యాత్రకు వెళ్లడం అనువుగా ఉంటుందని నిపుణుల సూచన. ఎందుకంటే మొదటి మూడు నెలల కాలంలోనూ, చివరి మూడు నెలల కాలంలో గర్భిణులకు పలు సమస్యలు ఎదురవుతుంటాయి. మొదటి మూడు నెలల కాలంలో కళ్లు తిరగడం, నీరసంగా ఉండడం, ఉదయం వికారంగా ఉండడం, వాంతులు (మాణింగ్ సిక్ నెస్) తదితర సమస్యలు కనిపిస్తుంటాయి. దీంతో వారు ప్రయాణం చేయలేని పరిస్థితి. చివరి త్రైమాసికంలో ఎక్కువగా శ్రమకు గురి కావడం మంచిది కాదు. పైగా ఎయిర్ లైన్స్ సంస్థలు 28 వారాల గర్భంతో ఉంటే ప్రయాణానికి అనుమతించేందుకు వైద్యుల ధ్రువీకరణ కోరతాయి.

వీటిని పరిగణనలోకి తీసుకోవాలి

గర్భంతో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా సత్వరమే వైద్య సాయం లభించేలా ఉండాలి. అలా వైద్య సదుపాయం, మంచి ఆహారం, విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ సౌకర్యం ఉన్న పర్యాటక ప్రదేశాలు అనుకూలం. ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా మనసును తేలిక పరుస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మెడికల్ డాక్యుమెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, అత్యవసర ఫోన్ నంబర్లను వెంట ఉంచుకోవాలి. జస్టేషనల్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇతరత్రా సమస్యలతో ఉన్న వారు బేబీమూన్ కు వెళ్లాలంటే వైద్యుల ఆమోదం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు సరికాదు. వెళ్లే ముందు ఓ సారి డాక్టర్ ను కలసి వారి సలహాలు తీసుకుంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు. పర్యటనలో భాగంగా గర్భిణులు బరువులు మోయకూడదు. రోజులో రెండు సార్లు నడకకు వెళ్లడం ఉపయోగకరం. ముఖ్యంగా అత్యంత ఎత్తయిన పర్వత ప్రాంతాలు తగినవి కావని వైద్యుల సూచన. 

ఎలాంటి కేంద్రాలు

ఊరి పక్కనున్న కాల్వ గట్టు దగ్గరకు వెళ్లవచ్చు. భాగ్యనగరంలో ఉంటే ట్యాంక్ బండ్ పై విహరించవచ్చు. కానీ, అవి బేబీమూన్ గమ్యస్థానాలు ఎంత మాత్రం కాబోవు. కాలుష్యానికి, సాధారణ జీవితానికి భిన్నంగా కొంచెం దూరంలో జన సమూహం తక్కువగా ఉండే పర్యాటక కేంద్రాలను ఎంచుకోవడం బావుంటుంది. ఎక్కువ మంది తమ బేబీమూన్ పర్యటనలో భాగంగా సాగర తీరాల్లో సేద తీరుతుంటారు. అదేంటో గానీ బీచ్ లో ఏకాంతంగా గడిపితే మనసు అలలతో ఎక్కడికో వెళ్లిపోతుంటుంది. ఊటీ వంటి హిల్ స్టేషన్లు కూడా బేబీమూన్ కు మంచి చాయిస్. అంతేకాదు విడిది చేసే హోటళ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలని నిపుణుల సలహా.  

representation image

పర్యటనకు వెళ్లొచ్చిన వారు సూచించేవి

కుమరకోమ్, అలెప్పీ ఈ రెండూ కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడి బ్యాక్ వాటర్స్, పచ్చదనం ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. అలాగే కోజికోడ్ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న వేనాడ్ కూడా పరిశీలించవచ్చు. ఇక గోవా అంతా తీర ప్రాంతమే. పనజి సమీపంలోనే డబోలిన్ అంతర్జాతీయ వివానాశ్రయం ఉంది. ఇక రాచరిక ప్రదేశాలకు నిలయమైన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్, జోధ్ పూర్, జైపూర్ లలో విమానాశ్రయాలు ఉన్నాయి. పుదుచ్చేరి నుంచి చెన్నై విమానాశ్రయానికి రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఇక కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి రెండు గంటలు ప్రయాణిస్తే కూనూర్ వెళ్లవచ్చు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో, మహారాష్ట్రలోని పంచగని వంటివి ఎన్నో ఉన్నాయి. దగ్గర్లో వసతి, రవాణా సదుపాయాలు ఉన్న జలపాతాలను కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కేరళలో ఆరోమా థెరపీతో సేదతీర్చే కేంద్రాలు సైతం ఉన్నాయి.

సానుకూలతలు ఎన్నో...

కొత్త జీవితం గురించి, పిల్లల గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకునేందుకు, చర్చించుకునేందుకు, కలలు కనేందుకు, ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకునేందుకు, ప్రకృతి అందాలతో మనసుకు ప్రశాంతత చేకూర్చేందుకు బేబీమూన్ యాత్రలో వీలవుతుంది. కలలు కనేందుకు ఎక్కడికో వెళ్లాలా...? నిజమే అక్కర్లేదు. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉండి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉండవచ్చు. లేదా ఏకాంతంగా ఉన్నాగానీ... ఉద్యోగాలతో తగినంత సమయం కేటాయించలేని పరిస్థితి ఉండవచచ్చు. రొటీన్ జీవితంపై అసంతృప్తి ఉండచ్చు. బోర్ గా ఫీలవ్వచ్చు. వీటన్నింటి నుంచి అటు కాబోయే తల్లిగా ఆమె... దంపతులుగా ఇద్దరూ రీచార్జ్ అయ్యేందుకు బేబీమూన్ ఓ చక్కని అవకాశం. కనీసం 5 రోజుల నుంచి 7 రోజులు పర్యటన చేయడం వల్ల మార్పును తప్పకుండా గమనిస్తారు.


More Articles