ఏంటీ ద్రవ్యోల్బణం.. ఇదంటే ఎందుకంత దడ?
డబ్బుకు జబ్బు చేయడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ఏంటో ఒకప్పుడు జేబునిండా డబ్బులతో వెళితే సంచినిండా సరుకులు తెచ్చుకునే వారం. ఇప్పుడేమో సంచినిండా డబ్బులతో వెళితే గానీ జేబులో పట్టే సరుకులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అన్న చతురోక్తి వినే ఉంటారు. ద్రవ్యానికి అనారోగ్యం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోని అనారోగ్యానికి ప్రతిబింబం. శరీరంలో ఎక్కడైనా అనారోగ్యం మొదలైతే కొన్ని రోజులకు అది జ్వరం రూపంలో బయటకు చూపిస్తుంది. ఉష్ణోగ్రత పెరగడం అంటే అన్ని సమయాల్లోనూ అది సాధారణంగానే ఉండకపోవచ్చు. ఇతరత్రా అనారోగ్యానికి అది ప్రాథమిక లక్షణం కావచ్చు.
అలానే ద్రవ్యోల్బణం పెరగడం ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యానికి లక్షణం వంటిదే. ఒక దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పాదకత, ఉద్యోగావకాశాలు, స్థూలంగా ప్రజల ఆర్జన శక్తి, వారి కొనుగోలు శక్తి, డిమాండ్ కు తగినట్టు వస్తువుల అందుబాటు ఇవన్నీ కలిపి ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తాయి. ఫలితంగా డబ్బు విలువలో మార్పులు జరుగుతుంటాయి. ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంటుంది. దాని ప్రభావాలేంటో తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. 2003లో పెప్సి డ్రింక్ 300ఎంఎల్ 7 రూపాయలు పెడితే వచ్చేది. మరి దానికి ఇప్పుడు 12 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. 15 ఏళ్ల క్రితం లీటర్ పాలు 20 రూపాయలు. ఇప్పుడు 40 రూపాయలు. 1980లో బియ్యం ధర కేజీ 8 రూపాయలే. మరి ఇప్పుడు 40 రూపాయలు. ధర ఎందుకు పెరిగింది? నిజంగా ధర పెరిగినట్టు పైకి అనిపిస్తుంది కానీ, డబ్బు విలువ తరగడం వల్లే ఈ పరిస్థితి. అంతెందుకు 25 ఏళ్ల క్రితం స్కూలుకు వెళ్లే చిన్నారికి పాకెట్ మనీగా పావలా, అర్ధ రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూపాయికి కూడా విలువ లేదన్నది నిజం. పది రూపాయల నోటిచ్చినా ఇంతేనా? అనే రోజులివి.
కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది...
కొనుగోలు శక్తి తగ్గిపోవడాన్నే ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు. ప్రస్తుతం 6 శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొన్నదాన్ని ఏడాది తర్వాత కొనాలంటే 106 రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు మీ జీతం 100 రూపాయలు ఉంటే ఏడాది తర్వాత కనీసం 106 రూపాయలకు అయినా పెరగాలి. లేదంటే ఆ మేర ఖర్చులు తగ్గించుకోవాలి. వాస్తవానికి ఇంటి అద్దె, జీవనానికి అవసరమైన అన్ని వనరులనూ ద్రవ్యోల్బణంలోకి పరిగణనలోకి తీసుకోరు. కనుక వాస్తవానికి ఈ ద్రవ్యోల్బణం 10 శాతం వరకూ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. 1-3 శాతం మధ్య ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగానే ఉన్నట్టు భావిస్తారు.
ఆహార ద్రవ్యోల్బణం
2016 వేసవిలో పచ్చిమిరపకాయలు కిలో 140 రూపాయల వరకు పలికాయి. కానీ, అదే మిర్చి అంతకు మూడు నెలల ముందు కిలో 20 రూపాయలుగానే ఉంది. యాపిల్ పండ్లు సెప్టెంబర్ లో 10 రూపాయలకు లభిస్తాయి. అదే పండు వేసవిలో 40 రూపాయలు పెట్టందే రాదు. ఇటీవలే పలు సంస్థలు లీటరు పాలకు రూ.2 పెంచాయి. అలాగే కందిపప్పు ఏడాది వ్యవధిలోనే 180 రూపాయలకు చేరి ఆటు ఇటుగా చలిస్తోంది. 2015 వేసవిలో మామిడి పండ్లు కిలో 40 రూపాయలకు లభించాయి. కానీ 2016 వేసవికి వచ్చే సరికి పంట దిగుబడి సరిగా లేకపోవడంతో కిలో మామిడి పండ్లు 100 రూపాయలు పలికాయి. ఈ ధరల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దీన్నే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. అవసరానికి తగినంత సరుకులు అందుబాటులో లేనప్పుడు ధరలు పెరిగిపోతాయి. ఫలితంగా జేబులో ఉన్న 100 రూపాయలకు వచ్చే వస్తువులు తగ్గిపోతాయి.
మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా 35ఏళ్ల క్రితం 125 రూపాయలు తొలి వేతనంగా అందుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఆయన పదవీ విరమణ సమయానికి తీసుకున్న ఆఖరి వేతనం సుమారు 30వేల రూపాయలు. ఇన్నేళ్లలో వేతనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే 125 రూపాయలు వచ్చినప్పుడు, 30వేల రూపాయలు అందుకున్నప్పుడు ఆయన తినగలిగింది అంతే. 125 రూపాయలున్నప్పుడు ఉప్మాలో జీడిపప్పులు లేవు. 30వేలు తీసుకున్నప్పుడు కూడా జీడిపప్పు ఉప్మా తినలేదు. వేతనంలో పెరుగుదల ఉంది. కానీ రూపాయి విలువ తరగిపోవడం వల్ల మిగిలిందేమీ లేదు.
హౌసింగ్ ఇన్ ఫ్లేషన్
గూడు అనేది ప్రతి ఒక్కరి జీవనావసరాల్లో భాగం. మిగతా వస్తువుల ధరల్లాగే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము, ఇటుక ఇతర వస్తువుల ధరలు సైతం పెరిగిపోవడం, నిర్మాణ రంగ కార్మికుల భత్యాలు పెరిగిపోవడం వల్ల అదనపు వ్యయం చేయాల్సి వస్తుంది. దీన్నే హౌసింగ్ ఇన్ ఫ్లేషన్ గా పేర్కొంటారు. మార్కెట్లో ధరలు పెరిగిపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం దెబ్బే.
వైద్య ద్రవ్యోల్బణం
వైద్యం ఏటేటా ఖరీదైపోతున్న విషయం తెలుసు. సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే వైద్య ద్రవ్యోల్బణం పెరుగుదలే ఎక్కువగా ఉంది. చికిత్సలు, మందుల ధరలు అనూహ్యంగా, అధికంగా పెరగడం మనకు అనుభవమే. డాక్టర్ ఫీజు 50 రూపాయల స్థాయి నుంచి 1000 రూపాయల స్థాయికి పెరగడం ఇందులో భాగమే.
లైఫ్ స్టయిల్ ఇన్ ఫ్లేషన్
వారాంతంలో మూవీకి వెళ్లే ప్లాన్ కావచ్చు. చేతిలో ఖరీదైన గాడ్జెట్ కావచ్చు. ఖరీదైన అమెరికన్ బ్రాండ్ వస్త్రాలు కావచ్చు. వేలాది రూపాయల గాగుల్స్ కావచ్చు. జీవనాన్ని ప్రతిబింబించే ఇత్యాది వస్తువుల ధరలు పెరుగుదలను లైఫ్ స్టయిల్ ద్రవ్యోల్బణంగా చెబుతారు.
విద్యా ద్రవ్యోల్బణం
20 ఏళ్ల క్రితం ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి వార్షిక ఫీజు 1000 రూపాయలు. ఇప్పుడు అదే తరగతికి ప్రైవేటు కార్పొరేట్ కళాశాల వసూలు చేసే ఫీజు 50వేల నుంచి లక్ష రూపాయలు. ఎంత తక్కువ అయినా 10 వేల రూపాయలు అయినా పెట్టక తప్పని రోజులివి. ఈ పెరుగుదల అంతా ఎడ్యుకేషన్ ఇన్ ఫ్లేషన్ కిందకే వస్తుంది.
హైపర్ ఇన్ ఫ్లేషన్
ఇది అడ్డు అదుపూ లేకుండా దౌడు తీసే ద్రవ్యోల్బణం. దీని వల్ల ఆ దేశ కరెన్సీ విలువలు వేగంగా పడిపోతాయి.
డిఫ్లేషన్
దీన్ని ప్రతికూల ఇన్ ఫ్లేషన్ అని అంటారు. అంటే ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుముఖం పట్టడాన్ని డిఫ్లేషన్ తెలియజేస్తుంది. డిఫ్లేషన్ 5 శాతం ఉంటే ఈ ఏడాది 100 రూపాయలు పెట్టి కొన్న వస్తువు ఏడాది తర్వాత 95 రూపాయలు పెడితే వచ్చేస్తుంది.
ద్రవ్యోల్బణం లెక్కింపు రెండు రకాలు
ద్రవ్యోల్బణంలో రెండు రకాలు. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ), కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ). హోల్ సేల్ ధరల ఆధారంగా డబ్ల్యూపీఐ లెక్కిస్తారు. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల ధరల ఆధారంగా సీపీఐ లెక్కిస్తారు. డబ్ల్యూపీఐని 435 ఉత్పత్తుల ధర ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో ప్రైమరీ ఆర్టికల్స్ (20.01శాతం), ఇంధనం, విద్యుత్ (14.9 శాతం), తయారీ ఉత్పత్తులు (65 శాతం) వాటా కలిగి ఉన్నాయి. వీటి ధరలు పెరగడం, తరగడాన్ని బట్టి ద్రవ్యోల్బణం కూడా మారుతుంటుంది. తయారీ ఉత్పత్తులు అంటే కెమికల్స్, లోహ ఉత్పత్తులు, యంత్రాలు, యంత్ర పరికరాలు, వస్త్రాలు, రవాణా, ఎక్విప్ మెంట్ మొదలైనవి.
సీపీఐ
తృణ ధాన్యాలు, పప్పుధన్యాలు, నూనెలు, గుడ్లు, చేపలు, మాంసం, మసాలా దినుసులు, పండ్లు కూరగాయలు, పాన్, టుబాకో, ఇంధనం, ఇళ్లు, వస్త్రాలు, పాదరక్షలు, ఆహారం, పానీయాలు, వైద్యం, విద్య, వినోదం, రవాణా, సమాచార సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి చిల్లర ధర ఆధారంగా సీపీఐని నిర్ణయిస్తారు. నెలకోసారి ఆ నెలలో ఉన్న ధరల ఆధారంగా కేంద్ర వాణిజ్య శాఖ ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రకటిస్తుంటుంది. కిందటి ఏడాది అదే నెలలో ఉన్న ద్రవ్యోల్బణంతో పోల్చి పెరిగిందా తగ్గిందా అన్నది నిర్ణయిస్తారు. గతంలో ఇది వారం వారం, విడుదలయ్యేది. ఇప్పుడు నెలకోసారి విడుదల అవుతోంది.
ఉత్పత్తివైపు...
దేశంలో 700 యూనిట్ల నిత్యావసర వస్తువుల అవసరం ఉంటే దేశీయంగా ఉత్పత్తి 550 యూనిట్లుగానే ఉంది. అంటే డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేదు. 550 యూనిట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడడం వల్ల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఉత్పత్తి తగ్గడానికి సరైన వర్షాలు లేకపోవచ్చు. నాసిరకం విత్తనాలు కారణం కావచ్చు. రుణాల వెసులుబాటు లేకపోవచ్చు.
సరఫరా వైపు
వ్యవసాయ రంగం వైపు నుంచి ఉత్పత్తి తగ్గడం వల్లో, రవాణాలో దెబ్బతినడం వల్లో కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. కూలీ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోవచ్చు. లేదా ఉత్పత్తి అంతా ఒక్కసారిగా మార్కెట్ కు రావడం వల్ల ధరలు పడిపోయి, సరుకు అయిపోయిన తర్వాత ధరల పెరుగుదల చోటు చేసుకోవచ్చు. సరఫరా వైపు ఉన్న రకరకాల సమస్యల వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు ఉంటాయి.
దేశీయ పరిణామాలు
సుస్థిర ప్రభుత్వం లేకపోవడం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మార్కెట్ వర్గాలు లాభార్జన ధ్యేయంతో వస్తువులను బ్లాక్ మార్కెట్ కు తరలించడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగిపోతుంది.
వెలుపలి పరిణామాలు
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే పరిణామాలు, భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే ఎగుమతుల్లో హెచ్చు తగ్గులు, రూపాయి మారకం విలువ హెచ్చు తగ్గులు కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపేవే.
ద్రవ్యోల్బణం ప్రభావం
ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అనేది ద్రవ్య విధానం (ఫిస్కల్), పరపతి విధానం (మానిటరీ) ఆధారంగా ఉంటుంది. ద్రవ్య విధానం అంటే ప్రభుత్వం తన వ్యయాన్ని ఎక్కువ, తక్కువ చేయడం, పన్ను రేట్లను మార్చడం ద్వారా నిర్వహించేది. పరపతి విధానాన్ని ఆర్ బీఐ నిర్వహిస్తుంది. ధరల స్థిరత్వం, అధిక ఆర్థిక వృద్ధి సాధనకు వీలుగా వ్యవస్థలోకి నగదు సరఫరాలను ఆర్ బీఐ నియంత్రిస్తుంది. వడ్డీ రేట్లలో మార్పుల ద్వారానే దీన్ని నిర్వహిస్తుంది.
ఆర్ బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే వ్యవస్థలోకి నగదు లభ్యత పెరుగుతుంది. దాంతో ప్రజల దగ్గర డబ్బులు పెరిగిపోయి అధిక వ్యయం చేయగల శక్తి సమకూరుతుంది. ఫలితంగా గూడ్స్, సర్వీసులకు డిమాండ్ పెరిగిపోతుంది. వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దీన్ని ఇన్ ఫ్లేషన్ అంటారు.
ఒకవేళ ఆర్ బీఐ వడ్డీ రేట్లను అధికంగా కొనసాగిస్తే నగదు లభ్యత తగ్గుతుంది. ప్రజల వినియోగం కూడా తగ్గిపోతుంది. దాంతో డిమాండ్ తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయి. ఎందుకంటే అమ్మకాలు తగినంత ఉండవు కనుక. దీన్నే డిఫ్లేషన్ అంటారు.
ఎగుమతులు, దిగుమతులు, ద్రవ్యోల్బణం
చమురు రెండు మూడేళ్ల క్రితం బ్యారల్ కు 110 డాలర్లు పలికింది. ప్రస్తుతం 30 డాలర్ల సమీపంలో ఉంది. అంటే ఎంత తేడానో గమనించండి. మన దేశం చేసుకునే దిగుమతుల్లో సింహ భాగం చమురు ఉత్పత్తులే. ఎందుకంటే మన దగ్గర చమురు ఉత్పత్తి చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. ఇలా దిగుమతులపై వెచ్చించే మొత్తం కూడా విదేశాలకు ఆదాయం రూపంలో వెళ్లిపోతుంది. చౌక దిగుమతులు ద్రవ్యోల్బణం తక్కువ ఉంచేందుకు తోడ్పడతాయి. ఎందుకంటే తక్కువ ధరలకు సరుకులు అందుబాటులోకి రావడం వల్ల స్థానికంగా ధరలు తగ్గి ద్రవ్యోల్బణం శాంతిస్తుంది.
వడ్డీ రేట్లను ఎందుకు పెంచడం?
ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్ బీఐ వడ్డీ రేట్లను ఎందుకు పెంచుతుంది? వడ్డీ రేట్లను పెంచడం వల్ల వ్యవస్థలోకి నగదు సరఫరా తగ్గుతుంది. దాంతో విపరీతమైన కొనుగోళ్లు తగ్గుతాయి. ఫలితంగా వస్తోత్పత్తుల ధరలు పెరగకుండా ఉండడం, తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం ఉపశమిస్తుంది. నగదు సరఫరా పెరిగితే కొనుగోలు శక్తి పెరిగి, వస్తువుల ధరలు సైతం పెరిగి అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
రూపాయి కూడా కీలకమే
డాలర్ తో రూపాయి మారకం విలువ పెరగడం సైతం ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే రూపాయి బలపడడం వల్ల తక్కువ వ్యయానికి విదేశీ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవచ్చు. దాని వల్ల ధరాభారం తగ్గి ద్రవ్యోల్బణాన్ని తగ్గుతుంది.
గత 60 ఏళ్లలో ద్రవ్యోల్బణం
దేశంలో సగటు ద్రవ్యోల్బణం శాతం సంవత్సరాల వారీగా ఇలా ఉంది.
భవిష్యత్తులో ఏమిటో...?
మన తల్లిదండ్రులు, తాతలు ఎంత దూరమైనా కాలినడకన వెళ్లి వచ్చే వారు. కానీ నేడు బయట కాలు పెట్టాలంటే బైక్ ఉండాలి లేదా కారు ఉండాలి. కాదంటే కనీసం ఆటో అయినా లేదా సిటీ బస్సయినా ఓకే. ఒకప్పుడు మధ్య తరగతి ప్రజలు ఏసీని ఎరుగరు. కానీ, నేడు చాలా మంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇక దాదాపుగా ప్రతి ఇంట ఫ్రిజ్, టీవీ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ, ఓ 50 ఏళ్ల క్రితం ఇవేవీ లేకుండానే మన పెద్దలు హాయిగా బతికేశారు. కానీ నేడు ఇవి ఉంటేనే హాయిగా భావిస్తారు. దీన్నిబట్టి అర్థం అయిందేంటి, జీవనం ఖరీదైపోయింది. అవసరాలు కాలానికి తగినట్టు కొంత పుంతలు తొక్కుతున్నాయి.
20 ఏళ్ల క్రితం 10 రూపాయలుంటే సినిమా చూసేవారు. ఇప్పుడు ఐమ్యాక్స్, ఐనాక్స్, పీవీఆర్ వంటి ఆధునిక థియేటర్లలో మూవీ చూడాలంటే 200 ఉండాల్సిందే. మరో పది ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? సినిమా కోసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువే పెట్టాల్సి రావచ్చు. ముందు ముందు ప్రతి ఇంట రోబో ఉండవచ్చు. మధ్య తరగతి వారికి కారు తప్పనిసరి కావచ్చు. అరచేతిలో సర్వస్వం అన్నట్టు కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి రావచ్చు. మరిన్ని జీవన తరహా వ్యాధులు ఉనికిలోకి రావచ్చు. వైద్యంపై వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోవచ్చు. అందుకే ఆదాయం పెంచుకుంటేనే భవిష్యత్తు జీవనానికి తగినట్టు జీవించగలం.
భానుప్రసాద్ కుమార్తె వయసు ఏడాది. ఆమెను డాక్టర్ చదివించాలనుకున్నాడు. ప్రస్తుతం వైద్య విద్యకు కోటి రూపాయలకుపైనే అవుతోంది. మరి 20 ఏళ్ల తర్వాత ఎంతవుతుంది? సగటున వార్షికంగా ఎడ్యుకేషన్ ఇన్ ఫ్లేషన్ 8 శాతంగా ఉంటే 20 ఏళ్ల తర్వాత వైద్య విద్యకు భాను ప్రసాద్ 4,66,09,571 అంటే 4.66 రెట్లు అధికంగా చేయాల్సిన పరిస్థితి. ఒక్క వైద్య విద్యకే ఇది పరిమితం కాదు. పాఠశాల విద్య అయినా, ప్రతి ఐదేళ్లలో 100 శాతం పెరుగుదల ఉంటుందని భావించవచ్చు.
అందుకే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకుడు అయినా... అప్పుడే గృహస్థ జీవనంలోకి అడుగుపెట్టిన దంపతులు అయినా... నడి వయసులో ఉన్న వారు అయినా... పిల్లల విద్యావసరాల కోసం, వారి వివాహ ఖర్చుల కోసం, వైద్యం కోసం, వృద్ధాప్యంలో ప్రశాంత జీవనం కోసం నిర్ణీత ప్రణాళికల మేరకు తమ ఆదాయంలో పొదుపు చేసి దాన్ని లాభాలు వచ్చే చోట మదుపు చేసుకోవడం ద్వారానే నిశ్చింతగా ఉండగలరు.
అంకెలకు, వాస్తవాలకు మధ్య తేడా
నిజానికి మన దగ్గర ద్రవ్యోల్బణం గణాంకాలు వాస్తవికంగా లేవన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. గతేడాది కిరాణా సరుకులకు రూ.1500 అయితే ఇప్పుడు 2000 రూపాయలు పెట్టాల్సి వస్తోందని చాలా మంది అనడం వినే ఉంటాం. అంటే పెరుగుదల 25 శాతం. మరి ఇది ద్రవ్యోల్బణ ప్రభావమే కదా. అలాగే, మిగిలిన వ్యయాల్లోనూ ఇలా భారీ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. మొత్తం మీద ఏటేటా జీవన వ్యయం పెరుగుదల ఎంతలేదన్నా 10 శాతంగానైనా ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం 6 శాతంగానే పేపర్ పై కనిపిస్తుంది.