హీటరా, గీజరా..? రెండింటికీ తేడా ఏమిటి? ఏది ఉపయోగం?
వాటర్ హీటర్లు, గీజర్లు రెండూ ఒకటే. కాకపోతే గీజర్లకు స్టోరేజీ ట్యాంకు ఉంటుంది. హీటర్లకు అది ఉండదు. నిజానికి చాలా మంది ఈ రెండు వేర్వేరు అని అనుకుంటుంటారు. ఒకటే అయినా వాటి రూపం, ఇతరత్రా ఫీచర్లు చూస్తే వేర్వేరుగా కనిపిస్తాయి.
వాటర్ హీటర్లు
ఇమ్మర్షన్ రాడ్లు అని తెలుసుకదా. బకెట్ లో నీరు పోసి అందులో రాడ్ ఉంచి స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు కాగుతాయి. అలాగే, గ్యాస్ ఆధారంగా పనిచేసే హీటర్ అయితే అందులోని ఎలిమెంట్ వేడెక్కి దాంతో నీరు కూడా వేడిగా మారుతుంది.
గీజర్లు
గీజర్లకు వేడి నీటిని నిల్వ చేసే ట్యాంకు ఉంటుంది. దీన్ని ట్యాప్ కు అనుసంధానించి గోడకు ఫిక్స్ చేస్తారు. ట్యాప్ ద్వారా నీరు గీజర్ స్టోరేజీ ట్యాంకులోకి చేరుతుంది. స్విచ్ ఆన్ చేస్తే ట్యాంకులోని నీరు వేడెక్కుతుంది. ఆ తర్వాత దానంతట అదే విద్యుత్ ను ఆఫ్ చేసుకుంటుంది. ఇన్సులేషన్ కవర్ ఉండడంతో ఒకసారి వేడెక్కిన నీరు కొన్ని గంటల పాటు వేడిగానే ఉంటుంది. వేడి తగ్గితే తిరిగి గీజర్ ఆన్ అవుతుంది.
ఇందులో ఉన్న మైనస్ ఏమిటంటే స్టోరేజీ ట్యాంకులోని నీరు వేడెక్కిన తర్వాత ఎప్పుడో వాడుకుంటే కొంత విద్యుత్ వృధాగా పోయినట్టే. సమయం గడుస్తున్న కొద్దీ కొంత వేడి తగ్గిపోతుంటుంది. దీంతో గీజర్ తిరిగి ఆన్ అవడంతో ట్యాంకులోని మొత్తం నీరు మరోసారి వేడెక్కుతుంది. దీంతో విద్యుత్ వృధాకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గ్యాస్ ఆధారితంగా పనిచేసే గీజర్లు
విద్యుత్ కు బదులు గ్యాస్ తో పనిచేసే గీజర్లు కూడా ఉన్నాయి. వీటిని వాడడం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. విద్యుత్ గీజర్లతో పోలిస్తే వ్యయం సగంలోపే అవుతుంది. అయితే, గ్యాస్ ఆధారంగా పనిచేసే గీజర్ల ధర అధికంగా ఉంటుంది.
అప్పటికప్పుడు వేడి నీరు కావాలంటే...
ఈ రెండు కాకుండా ఇన్ స్టంట్ వాటర్ హీటర్/గీజర్ కూడా ఉంది. ఇది స్విచాన్ చేసి ట్యాప్ కు కనెక్ట్ చేస్తే అప్పటికప్పుడు వేడి నీటిని కిందికి పంపిస్తుంది. కాకపోతే వేడి నీరు సన్నని ధారగా వస్తుంది. ఒక బకెట్ నీటికి రెండు నిమిషాలు సరిపోతుంది. వేడి నీరు కావాల్సినప్పుడే స్విచాన్ చేసుకుని కావాల్సినంత నీరు పట్టుకున్న తర్వాత స్విచాఫ్ చేస్తాం. కాబట్టి విద్యుత్ వృధా ఉండదు. స్టోరేజీ అవకాశం ఉన్న గీజర్లలోనూ అప్పటికప్పుడు వేడి నీటిని అందించే మోడల్స్ కూడా ఉన్నాయి.
ఇన్ స్టంట్ వాటర్ హీటర్ లో చిన్న ట్యాంకు ఉంటుంది. అందులోని మధ్య భాగంలో వేడి చేసే ఎలిమెంట్ ఉంటుంది. ట్యాప్ నుంచి నీరు దానిపై పడగానే వేడెక్కి కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకటి నీరు చాలా వేడిగా ఉండాలంటే ఫ్లోను తగ్గించుకోవాలి. లేదంటే అధిక సామర్థ్యం గల కాయిల్ ను వినియోగించాల్సి ఉంటుంది.
సోలార్
సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే వాటర్ హీటర్లను అపార్ట్ మెంట్లు, పెద్ద భవనాలపై ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ హీటర్ల స్టోరేజీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కనుక ఒకే అపార్ట్ మెంట్ లో అధిక సంఖ్యలో నివాసం ఉండేవారికి అనువుగా ఉంటాయి. అయితే వర్షకాలం, శీతాకాలంలో వీటి పనితీరు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉండదు.
పరిశీలించాల్సినవి
కుటుంబ సభ్యులకు ఎన్ని లీటర్ల మేర వేడి నీరు కావాలన్న దాని ఆధారంగా గీజర్లు తీసుకోవాలి. ఇన్ స్టంట్ గీజర్ అయితే ఏ సమస్యా ఉండదు.
సైజు కూడా ముఖ్యమే. ఇంట్లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పట్టేంత సైజులో ఉన్న మోడలే తెచ్చుకోవాలి.
అన్ బ్రాండెడ్ ఉత్పాదనలు కొనడం ఏ మాత్రం సురక్షితం కాదు. కచ్చితంగా పేరున్న బ్రాండ్ నే తీసుకోవడం ఉత్తమం.
ఎక్కువ కాలం వారంటీ ఉన్న వాటిని తీసుకోవాలి. విద్యుత్ వినియోగాన్ని కూడా చూడాలి. ట్యాంకు ఇన్సులేషన్ సరిగ్గా ఉందేమో పరిశీలించాలి.
సరైన సైజు
గీజర్లలో స్టోరేజీ ట్యాంకు సామర్థ్యం అవసరం మేరకే తీసుకోవాలి. సరైన సైజు తీసుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. సాధారణంగా 6 నుంచి 10 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం ఉన్నవే నయం. శీతల ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంతకంటే ఎక్కువ లీటర్ల స్టోరేజీ ఉన్నవి అనువుగా ఉంటాయి.
స్టోరేజీ గీజర్లు, ఇన్ స్టంట్ గీజర్ల మధ్య తేడా
ఇన్ స్టంట్ గీజర్ కు తక్కువ స్థలం చాలు. స్టోరేజీ గీజర్లకు ఎక్కువ స్థలం కావాలి. ఇన్ స్టంట్ గీజర్లలో స్విచాన్ చేయడం ఆలస్యం, వేడి నీరు కిందకు వస్తుంది. స్టోరేజీ గీజర్లలో అయితే వేడీ నీరు రావడానికి 5 నిమిషాలు అయినా పడుతుంది. ఇన్ స్టంట్ గీజర్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ, తక్కువ సమయంలోనే నీటిని పొందడానికి వీలుంటుంది కనుక విద్యుత్ వినియోగంలో చెప్పుకోతగ్గ తేడా ఉండదు. స్టోరేజీ గీజర్లు అయితే ఒకసారి వేడి చేసి ఉంచితే కరెంట్ పోయినా స్నానం చేయడానికి వేడినీరు సిద్ధంగా ఉంటుంది. స్టోరేజీ గీజర్లలో నీటి ఉష్ణోగ్రత నిర్ణీత శాతానికి చేరిన తర్వాత ఆటోమేటక్ గా పవర్ ఆగిపోతుంది. ఇమ్మర్షన్ హీటర్లు ఏ మాత్రం సురక్షితం కాదు. విద్యుత్ షాకులకు, ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక గీజర్లు వాడడమే సురక్షితం.