బంగారాన్ని ఎన్ని విధాలుగా కొనవచ్చు...?
ఆభరణాలు చేయించుకుని ధరించవచ్చు. గొప్పతనాన్ని చాటవచ్చు. పెట్టుబడి పెట్టి ప్రతిఫలం పొందవచ్చు. అవసరమైతే కుదువపెట్టి నిమిషాల్లో అప్పు తెచ్చుకుని అవసరాల నుంచి గట్టెక్కవచ్చు. ఇదంతా భారతీయులు మనసు పారేసుకునే బంగారం గురించే. బంగారాన్ని కొనేందుకు నేడు ఎన్నో మార్గాలున్నాయి. ఏ రూపంలో కొంటున్నాము... అవసరం ఏమిటి? అన్నదాన్ని బట్టి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
ఆభరణాలు, బంగారం ముద్దలు, కాయిన్లు, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వ బంగారు పథకం... బంగారం భౌతిక రూపంలో, ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయడానికి ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఆభరణాలు
బంగారం అనేది ఆభరణాల కోసమే. ఇది ఒకప్పటి మాట. కానీ నేడు బంగారం ఎన్నో విధాలుగా సామాన్యులను ఆకర్షిస్తోంది. అయితే, ఎక్కువ మంది ఆభరణాల రూపంలోనే ఇప్పటికీ బంగారాన్ని కొంటుండడం విశేషం. గొప్పగా ఉండాలన్న ఆశ, అందంగా కనిపించాలన్న ఆకాంక్ష కొద్దీ ఆభరణాలు కొనేవారున్నారు. అలాగే, బలవంతపు పొదుపులో భాగంగా ఆభరణాలనూ కొనేవారున్నారు. ఎంతో కొంత పెట్టి బంగారం కొనకుంటే మరో రూపంలో ఉన్న డబ్బులు ఖర్చయిపోతాయని భయపడి బంగారాన్ని కొని తెచ్చుకునే వారు కూడా ఉన్నారు.
ఆభరణాల పట్ల మక్కువతో వాటిని కొనుక్కోవడం సరైనదే. కానీ, పొదుపు కోసం ఆభరణాలు కొనడం సరైనది కానే కాదు. ఎందుకంటే తయారీ, వృధా చార్జీలు, కొన్నప్పుడు, విక్రయించినప్పుడు కొంత నష్టపోవాల్సి వస్తుంది. అందుకని పెట్టుబడి కోణంలో అయితే బంగారాన్ని భౌతికంగా కంటే ఎలక్ట్రానిక్ రూపంలో కొనడం లాభదాయకం. పైగా పొదుపు కోసం కొన్న ఆభరణాలను భద్రంగా దాచడం కూడా తలనొప్పే. బ్యాంకు లాకర్లలో పెట్టుకునేట్టు అయితే లాకర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆభరణాల కోసమే బంగారం కొనాలనుకునే వారు హాల్ మార్క్ గుర్తింపుతో ఉన్నవే కొనాలి. బ్రాండెడ్ స్టోర్స్ లో ఇప్పుడు హాల్ మార్క్ ఆభరణాలే లభిస్తున్నాయి. వీధిలో ఉన్న బంగారం వ్యాపారి తెలిసిన వాడు కదా అనే అభిప్రాయంతో అక్కడే కొనాలనుకోవద్దు. ఏ వ్యాపారీ చుట్టం కాదు. డబ్బులు మీవి. విలువకు తగ్గ వస్తువును పొందడం మీ బాధ్యతే.
బంగారం ముద్దలు, కాయిన్లు
కొంత మందికి బంగారాన్ని కళ్లారా చూసుకుంటేనే వారికి అదో తృప్తి. అలాంటి వారు ఆభరణాలే కొంటామంటారు. అలాంటి వారు ఆభరణాలకు బదులు కాయిన్లు, ముద్దలు కొనడం నయం. కోరుకున్నప్పుడు వీటితో ఆభరణాలు చేయించుకోవచ్చు. దగ్గరి వారికి బహుమతిగానయినా సమర్పించుకోవచ్చు. లేదా ఎలాంటి తరుగు, తయారీ చార్జీల పేరుతో నష్టపోకుండా అవసరమైనప్పుడు వెంటనే అమ్ముకోవడానికి అనుకూలత ఉంటుంది. అయితే, బంగారం ముద్దలు కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే శక్తి ఉండాలి.
గ్రాము నుంచి పది గ్రాముల వరకు కాయిన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు అమ్ముకోవడానికే పరిమితం అవుతున్నాయి. తిరిగి వెనక్కి తీసుకోవడం లేదు. అందుకే తిరిగి కొనుగోలు చేసే సంస్థల దగ్గర్నుంచి కాయిన్లు కొనుగోలు చేయడం సౌలభ్యంగా ఉంటుంది. కాయిన్లను ఐసీఐసీఐ సహా వివిధ బ్యాంకుల వెబ్ సైట్లు, ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.
ఈటీఎఫ్
పెట్టుబడుల కోసం అయితే గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ను పరిశీలించవచ్చు. డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి. ఒక గ్రాము ఒక యూనిట్ గా ఉంటుంది. ట్రేడింగ్ కమ్ డీమ్యాట్ ఖాతా కలిగిన వారు స్టాక్ మార్కెట్ పని దినాల్లో ఈటీఎఫ్ లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు, బ్రోకరేజీ చార్జీలు, డీమ్యాట్, ఫండ్ చార్జీలు భరించాల్సి ఉంటుంది. బ్రోకరేజీ చార్జీలు 0.25 నుంచి 0.50 శాతం మధ్యలో ఉంటాయి. అలాగే, 0.50 నుంచి 1 శాతం వరకు ఫండ్ నిర్వహణ చార్జీలు కూడా భరించక తప్పదు.
ఈటీఎఫ్ లు పూర్తి భద్రంగా ఉంటాయి. దొంగలు ఎత్తుకుపోతారన్న భయం అక్కర్లేదు. నెలనెల ఒక గ్రాము కొంటూ వెళ్లినా ఏడాదికి తులంపైన బంగారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో మీ సొంతం చేసుకోవచ్చు. డబ్బులు అవసరం పడితే స్టాక్ మార్కెట్ పని దినాల్లో నిమిషంలోనే విక్రయించి రెండు రోజుల్లోపు నగదు వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంది.
బంగారం ఫండ్స్
పైన ఈటీఎఫ్ గురించి చెప్పుకున్నాం. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉన్న వారు ఎవరైనా వాటిలో నేరుగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే డ్యీమ్యాట్ ఖాతా లేని వారు ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్ ఫథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అవే బంగారం ఫండ్లు. ఈటీఎఫ్ లలో ఒక గ్రాము బంగారం ఒక యూనిట్ గా ఉంటుంది. కనుక కనీసం మూడు వేల రూపాయలు ఉంటే గానీ కొనుగోలు చేయలేము. అదే బంగారం మ్యూచువల్ ఫండ్లలో నెలకు కనీసం 500 రూపాయల నుంచి అయినా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే నిమిషాల్లోనే ఆన్ లైన్ ద్వారా అమ్ముకోవచ్చు.
కాకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టే పథకం కనుక అటు ఈటీఎఫ్ చార్జీలు, ఇటు ఫండ్ చార్జీలు చెల్లించుకోక తప్పదు. ఇవే కాకుండా బంగారం గనులు, వెలికితీత కార్యకలాపాల్లో ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఉన్నాయి. రాబడి అన్నది ఆయా స్టాక్స్ ధరల పెరుగుదలపైనే ఉంటుంది. అందులోనూ మన దగ్గర బంగారం రంగంలో పనిచేసే కంపెనీలు పెద్దగా లేవు. అందుకని విదేశీ మార్కెట్లలోని స్టాక్స్ లో పెట్టుబుడులు పెడుతుంటాయి. కరెన్సీ మారకం విలువల్లో తేడాలు కూడా రాబడులపై ప్రభావం చూపుతాయి.
ప్రభుత్వ బంగారం పథకం
బంగారాన్ని పెట్టుబడి సాధనంగా భావిస్తూ, దీర్ఘకాలంలో లాభాలనిచ్చే సాధనంగా భావించే వారు పెరుగుతున్నారు. ఇలాంటి వారు భౌతిక రూపంలో బంగారం కొంటుండడంతో దిగుమతులు పెరిగిపోయి ద్రవ్యలోటు సైతం పెరుగుతుండడంతో ప్రభుత్వం గోల్డ్ బాండ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
బంగారం బాండ్ రూపంలో ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ పథకంలో చందాలను ఆహ్వానిస్తోంది. ఈ బాండ్లను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా స్టాక్స్ వలే ఎప్పుడు కోరుకుంటే అప్పుడు పెట్టుబడికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఏడాది పొడవునా ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవచ్చు.
ఒక గ్రాము, 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బాండ్ కొనుగోలుకు అవకాశం ఉంది. ఆ రోజు మార్కెట్ ధర ఎంతుంటే ఆ మేరకు గ్రాము ధర నిర్ణయిస్తారు. అప్పటి నుంచి పథకం కాల వ్యవధి పూర్తయ్యే వరకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం 2.75 శాతం వార్షిక వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తుంది. చివరిలో అప్పటి మార్కెట్ ధర ఎంతుంటే ఆ మేరకు గ్రాములతో లెక్కించి పెట్టుబడిదారులకు తిరిగిచ్చేస్తారు.
డీమ్యాట్, పేపర్ రూపంలో ఉండే ఈ పథకం కాల వ్యవధి 8 సంవత్సరాలు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి కనుక అవసరం అనుకుంటే ఎప్పుడైనా విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. రుణాలు పొందడానికి హామీగానూ ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. అయితే, గడువు తీరే నాటికి బంగారం ధర కొనుగోలు ధరతో పోలిస్తే పడిపోయిందనుకోండి. అప్పుడు తగ్గిన ధర ఆధారంగానే డబ్బులు చెల్లిస్తారు. దాంతో నష్టాలకు కూడా అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.
ఫ్యూచర్స్
బంగారంలో పెట్టుబడులు, వ్యాపారం కోసం ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారాన్ని ఒక లాట్ రూపంలో కొనుగోలు చేసి మొత్తం విలువలో కొంత శాతం మార్జిన్ మనీగా చెల్లిస్తే సరిపోతుంది. కాల వ్యవధి నెల, రెండు నెలలు ఉంటుంది. ఎంసీఎక్స్, ఎన్ సీడీఎక్స్ తదితర ఫ్యూచర్ మార్కెట్లు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 100 గ్రాములు ఒక లాట్. ఈ లాట్ ను కొనుగోలు చేస్తే గ్రాము రూ.3వేలు ఉందనుకుంటే మొత్తం విలువ రూ.3 లక్షలు అవుతుంది. సుమారు 5 శాతం మార్జిన్ మనీగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే రూ.15వేలు. ఒక వేళ బంగారం ధర తగ్గి కొన్న 100 గ్రాముల విలువ మార్జిన్ మనీ కంటే ఎక్కువ తగ్గిపోతే తిరిగి మార్జిన్ మనీ చెల్లించాలి. ట్రేడింగ్ చేయాలనుకునే వారికి ఈ మార్కెట్లు అనువైనవి.
ఎన్ఎస్ఈఎల్
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ఉంటే నేషనల్ స్పాట్ ఎక్సేంజ్ లిమిటెడ్ లో ట్రేడయ్యే గ్రాము బంగారాన్ని కొనుగోలు చేసి డీమ్యాట్ లో భద్ర పరచుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు తిరిగి విక్రయించుకోవచ్చు. లేదా బంగారం రూపంలో డెలివరీ తీసుకోవచ్చు.
నగల దుకాణాల్లో నెలవారీ పథకాలు
పేరున్న బంగారం విక్రయ సంస్థలు తమ దుకాణాల్లో నెల వాయిదాల రూపంలో పొదుపు చేసుకుని కావాలునుకున్నప్పుడు బంగారం కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. ఇలాంటి పథకాలను ఆర్ బీఐ నిషేధించింది. అయినా కొన్ని సంస్థలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు నెల నెల ఒక గ్రాముకు సరిపడా సొమ్ము జమ చేస్తే 12 నెలలకు 12 గ్రాములకు తోడు తాము ఒక గ్రాము బంగారాన్ని అదనంగా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.
ఆన్ లైన్ లో బంగారం, వెండి
బులియన్ ఇండియా.కామ్ అనే వెబ్ సైట్ ఆన్ లైన్ లో బంగారం, వెండి కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ. ప్రభుత్వ పరంగా భద్రతకు ఎలాంటి భరోసా ఉండదు. నెలవారీ సిప్ (క్రమానుగత పెట్టుబడి) విధానంలో గ్రాము నుంచి కొనుగోలుకు అవకాశం ఉంది. ఆన్ లైన్ లో ఒక గ్రాము కొనుగోలు చేసిన వెంటనే ఆ మేరకు తాము భౌతిక రూపంలో లోహాన్ని వాల్ట్ లో నిల్వ చేస్తామని సంస్థ చెబుతోంది. 1.6 నుంచి 7.4 శాతం వరకు ( లోహం ఎంతన్న దాని బట్టి) చార్జీలు చెల్లిస్తే కొనుగోలు చేసిన లోహాన్ని నేరుగా వినియోగదారుడికి అందిస్తామని సంస్థ హామీ ఇస్తోంది.
ఇక పేటీఎం సంస్థ రూపాయితోనూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చంటూ సరికొత్త అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. తమకు వీలైనప్పుడల్లా రూపాయి నుంచి ఎంత విలువ మేర అయినా పేటీఎంలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. 24 క్యారట్ల బంగారం మార్కెట్ ధర ప్రకారం కేటాయిస్తారు. ఒక గ్రాము అయిన తర్వాత ఎప్పుడు కోరితే అప్పుడు దాన్ని కాయిన్ లేదా బిస్కట్ రూపంలో ఇంటికి పంపిస్తారు. ఇందుకోసం ప్రభుత్వరంగ ఎంఎంటీసీ, స్వట్జర్లాండ్ కు చెందిన పీఏఎంపీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూజర్లు కొనే బంగారాన్ని ఎంఎంటీసీ వోల్ట్ లలో భద్రపరుస్తారు.బంగారంపై పెట్టుబడి ఎంత వరకు లాభం
బంగారం చూసేందుకే నిగనిగలాడుతుంది. కానీ రాబుడులు ఆ స్థాయిలో ఉంటాయని అనుకుంటే పొరబడినట్టే. చారిత్రక గణాంకాలను చూసినా దీర్ఘకాలంలో బంగారం 10 శాతంలోపే ప్రతిఫలాన్ని ఇచ్చింది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేసి చూస్తే నికర రాబడి ఒకటి రెండు శాతంగానే ఉంటుంది.
బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?
లండన్ లో ఐదు బ్యాంకులు ప్రతీ రోజు బంగారం ధరను నిర్ణయిస్తాయి. 1919 నుంచి ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. బార్క్ లేస్, డ్యూచే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా, హెచ్ ఎస్ బీసీ హోల్డింగ్స్, సొసైట్ జనరల్ ఈ ధరను నిర్ణయించే సంస్థలు. రోజులో బంగారం ధరను రెండు సార్లు ప్రకటిస్తుంటాయి. గ్రీన్ విచ్ మీన్ టైమ్ ప్రకారం 10.30 గంటలు (భారత్ లో తెల్లవారుజామున 4 గంటలు), 15.00 గంటలు (రాత్రి 9 గంటలు) సమయంలో ధరలను ప్రకటిస్తాయి. ఈ ధరనే అన్ని దేశాలు అనుసరిస్తుంటాయి. పెద్ద మొత్తంలో బంగారం లావాదేవీలకు లండన్ కేంద్రంగా ఉంది. కరెన్సీ మారకం ధరలు, బంగారం ఉత్పత్తి, వడ్డీ రేట్లు ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
మన దగ్గర బంగారం ధర ఎలా?
అమెరికా మార్కెట్లో ధరను మన మార్కెట్ అనుసరిస్తుంటుంది. అమెరికాలో బంగారాన్ని ట్రాయ్ ఔన్స్ గా కొలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ 31.10 గ్రాములతో సమానం. ఉదాహరణకు అమెరికాలో ట్రాయ్ ఔన్స్ 1200 డాలర్లు ఉందనుకుందాం. డాలర్ తో రూపాయి మారకం విలువ 67 రూపాయలు అనుకుంటే... ట్రాయ్ ఔన్స్ ధర మన రూపాయల్లో రూ.80,400. దీన్ని 31 గ్రాములకు విభజిస్తే గ్రాము బంగారం రూ.2,585 అవుతుంది. ఈ ధరను మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటుంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ స్పాట్ మార్కెట్లో క్రితం రోజు ముగింపు ధరను ప్రభుత్వం ఆ రోజుకు గాను ధరగా ప్రకటిస్తుంది. ఇంతేకాదు, ఈ ధరకు దిగుమతి సుంకం కూడా కలుస్తుంది. ఇదే ధర ఈటీఎఫ్ కు కూడా వర్తిస్తుంది. అయితే, ఈటీఎఫ్ ను నిర్వహించే ఫండ్ సంస్థలు ధరలను కొద్దిగా అటు, ఇటుగా నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.