వైద్యం కోసం ఆస్పత్రి వరకూ వెళ్లాలా...? మరో మార్గం లేదా...?

రాత్రి 11 గంటలు. బీపీ చూసుకుంటే 180/100 ఉంది. భయంతో ఏం చేయాలో తోచక ఆస్పత్రికి పరుగు తీశాడు రామనాథం. వెంటనే జాయిన్ అవ్వాలని చెప్పి పేషెంట్ ను జాయిన్ చేసుకుని అన్ని రకాల మందులతో తెల్లారే సరికి తగ్గించారు ఆస్పత్రి సిబ్బంది. చివరిగా రూ.15వేలు బిల్లు చేతిలో పెట్టారు.

అర్ధరాత్రి వేళ... ఐదేళ్ల పాపకు విరేచనాలు అవుతున్నాయి. తండ్రిగా రాంబాబు పెద్దగా కంగారు పడలేదు. వెంటనే స్మార్ట్ ఫోన్ నుంచే డాక్టర్ ను సంప్రదించాడు. వైద్యుడు చెప్పిన విధంగా మందులు తెచ్చి వేశాడు. చిన్నారికి మళ్లీ విరేచనాలు కాలేదు. రెండు గంటలు చూసి అందరూ నిశ్చింతగా పడుకున్నారు.

పై ఘటనలో ఆన్ లైన్ డాక్టర్ గురించి తెలియకపోబట్టి రామనాథం ఆస్పత్రిలో చేరి భారీగా ఖర్చు పెట్టి స్వస్థత పొందాడు. రాంబాబు కొంచెం అడ్వాన్స్ డ్ కాబట్టి తెలివిగా వ్యవహరించాడు. వైద్యుడి ఫీజు, మందులకు కేవలం రూ.300 ఖర్చు పెట్టి సులభంగా వైద్య సేవలు పొందాడు. ఒకవేళ రాంబాబు తన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి ఉంటే కనీసం రూ.5వేలు అయినా ఖర్చయ్యేది.

ఇలా అత్యవసర సందర్భాల్లోనే కాదు, సాధారణ వ్యాధులకు చికిత్సలు, ఇతర వైద్య సలహాల కోసం ఆస్పత్రి వరకూ వెళ్లే శ్రమ లేకుండానే... ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా వైద్య సేవలు అందించే సంస్థలు ఎన్నో వచ్చాయి. ఈ సేవలను వినియోగించుకునే వారు కూడా పెరుగుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆన్ లైన్ ద్వారా వైద్య సేవలు పొందే విధానం ఎప్పటి నుంచో ఉంది. మన దగ్గర మాత్రం ఓ ఐదారేళ్ల క్రితం ప్రారంభమైంది.  

representation image

ఐ క్లినిక్ డాట్ కామ్ https://www.icliniq.com/

అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నారు. ఐక్లినిక్ యాప్ కూడా ఉంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని స్మార్ట్ ఫోన్ నుంచే వైద్య సలహాలు పొందవచ్చు. వైద్య పరమైన సలహాలు కావాలంటే ఉచితంగానే పొందే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అదే విషయాన్ని పోస్ట్ చేయవచ్చు. అప్పుడు అందుబాటులో ఉన్న వైద్యుల్లో ఒకరు స్పందిస్తారు.

పూర్తి స్థాయి కన్సల్టేషన్ 99 రూపాయలు చెల్లించి పొందవచ్చు. వేగంగా వైద్య సలహా కావాలనుకుంటే 299 రూపాయలు చెల్లించడం ద్వారా కాల్ చేసి వైద్యులతో మాట్లాడవచ్చు. వీడియో చాట్ కన్సల్టేషన్ కు కూడా ఇదే చార్జీ. వైద్యులు పరీక్షలు సూచిస్తే చేయించుకుని రిపోర్టులను అప్ లోడ్ చేస్తే పరిశీలించి చికిత్స సూచిస్తారు. అదే సైట్ ద్వారా పరీక్షలకు ఆర్డర్ ఇస్తే ఇంటి వద్దకే వచ్చి నమూనాలను తీసుకెళతారు. దేశీయంగా అందుబాటులో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ వైద్య సేవల సంస్థల్లో ఇది ఒకటి. ప్రతి రోజు వేల సంఖ్యలో ఈ సంస్థ ద్వారా వైద్య సలహాలు పొందుతున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా కొద్ది మేర అందుబాటులో ఉన్నారు. 80కుపైగా స్పెషాలిటీల నుంచి 1270కు పైగా డాక్టర్లు ఐక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచితంగా అడిగే ప్రశ్నలు, వైద్యుల సమాధానాలు ఇతరులు సైతం చదివి తెలుసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగతంగా చేసే విచారణలు మాత్రం గోప్యంగా ఉంచుతారు. వైద్యులు వివిధ వ్యాధులపై రాసిన ఆర్టికల్స్ ను సైతం చదువుకోచ్చు.

ప్రయాణాల్లో ఉండవచ్చు. అర్ధరాత్రులు కావచ్చు. అర్హత ఉన్న వైద్యులు, వైద్య నిపుణులు అందుబాటులో లేని గ్రామాలు కావచ్చు. ప్రత్యేక నిపుణులు లేని చిన్న పట్టణాలు కావచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా పీసీ ఉంటే వైద్య సాయం పొందడం తేలిక. నిజానికి ఈ సదుపాయం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ఎంతో మందికి అనవసరపు ఖర్చులను తగ్గిస్తుంది.

representation image

డాక్స్ యాప్  DocsApp  http://www.docsapp.in/

ఇది కూడా ఆన్ లైన్ విధానంలో వైద్య సలహాలు, సేవలు అందించే సంస్థ. డాక్స్ యాప్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు వైద్యులను సంప్రదించవచ్చు. వైద్య విభాగాన్ని బట్టి ఫీజులు 99 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయి. ఐదు నిమిషాల్లోనే వైద్యులను సంప్రదించడానికి ఈ యాప్ అవకాశం కల్పిస్తోంది. యాప్ ను ఓపెన్ చేసి డాక్టర్ ను ఎంచుకుని ఏం కావాలో తెలియజేసి ఫీజు చెల్లించడం ద్వారా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వైద్యులతో నేరుగా చాట్ చేయవచ్చు. ల్యాబ్ టెస్ట్ లకు ఆర్డర్ ఇస్తే ఇంటి దగ్గరకే వచ్చి నమూనాలను తీసుకెళతారు. మందులను సైతం ఇంటికే తెచ్చిస్తారు. 

కడుపులో నొప్పిగా ఉందని వైద్యుడి వద్దకు వెళ్లాడు శ్రీనివాస్. పరీక్షించిన వైద్యుడు చిన్న గడ్డ ఉందని, సర్జరీ చేసి దాన్ని తొలగించాలని చెప్పాడు. కానీ, శ్రీనివాస్ తో పాటు, అతడి కుటుంబ సభ్యుల్లో సందేహాలు మొదలయ్యాయి. నిజంగా గడ్డ ఉందా, డబ్బుల కోసం వైద్యుడు అలా చెబుతున్నాడా...? ఈ లోపు అక్కడే ఉన్న శ్రీనివాస్ స్నేహితుడు భాను ప్రకాష్ తన స్మార్ట్ ఫోన్ లోని డాక్స్ యాప్ గురించి వారికి చెప్పాడు. సందేహాన్ని తీర్చుకునేందుకు ఫీజు చెల్లించడం ద్వారా డాక్స్ యాప్ లో వైద్య నిపుణుడిని సంప్రదించారు. రిపోర్టులను పరిశీలించిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జరీ ద్వారా దాన్ని తొలగించడమే మంచిదని స్పష్టం చేశారు. దీంతో వారి ఆందోళన తొలగిపోయింది. 

representation image

ఈ క్లినిక్ https://www.eclinic247.com/

ఉచితంగా సలహాలు పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది. పెయిడ్ కన్సల్టేషన్ కూడా ఉంది. మెయిల్, ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా వైద్యులను సంప్రదించవచ్చు. కన్సల్టేషన్ సమ్మరీ, వైద్యులు డిజిటల్ సంతకంతో కూడిన ప్రిస్క్రిప్షన్ పొందవచ్చు. 

హెల్త్ ట్యాప్ https://www.healthtap.com

వైద్య పరమైన అంశాలు, అనారోగ్య సమస్యల గురించి ఈ సైట్ ద్వారా ప్రశ్నించవచ్చు. వైద్యులు తగిన విధంగా సమాధానమిస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. దాదాపుగా విదేశీ వైద్య నిపుణులే ఎక్కువ. ఒక్కోసారి మీరు వేసిన ప్రశ్నకు ఒకరి కంటే ఎక్కువ మంది వైద్యులు కూడా స్పందిస్తారు. పెయిడ్ సేవలు కూడా ఉన్నాయి. డబ్బులు చెల్లిస్తే వైద్యులకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వీడియో కన్సల్టేషన్ కూడా పొందవచ్చు.

representation image

వేయూ ఎండీ డాట్ కామ్ http://www.wayumd.com/

ఈ సంస్థ సత్వర వైద్య సేవలకు హామీ ఇస్తోంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న అనంతరం వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చు. సూచనలు, సలహాలు అందుకోవచ్చు.  

జస్ట్ డాక్ https://justdoc.com/#/

ఏ సమయంలోనైనా జస్ట్ డాక్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా, యాప్ ద్వారా వైద్యులను సంప్రదించే వీలుంది. ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మణిపాల్, నానావతి తదితర ప్రముఖ ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఈ సంస్థ తరఫున వైద్య సలహాలు, సేవలు అందిస్తున్నారు. ఉచిత ఫాలో అప్ కు కూడా అవకాశం ఉంది. ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారానూ వైద్యులతో సంప్రదింపులు చేసుకోవచ్చు. ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే సదుపాయం కూడా ఉంది.

ఉదాహరణకు తలనొప్పి బాగా వేధిస్తోంది. ఎంతకీ తగ్గడం లేదు. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, లక్షణాలు, వేరే బాధలు ఎవైనా ఉన్నాయా ఇలాంటి వివరాలను విచారణలో భాగంగా వైద్యులకు తెలియజేయాలి. ఒకవేళ చర్మానికి సంబంధించిన సమస్య అయితే, ఫొటో తీసి అప్ లోడ్ చేయాలి. దీంతో వైద్యులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. 

representation image

దేశీమెడ్ http://www.desimd.com/

ఇది కూడా ఆన్ లైన్ సేవల్లో ఓ ప్రముఖ సంస్థగా ఉంది. వైద్యుల సలహాలను ఉచితంగా పొందవచ్చు. పెయిడ్ కన్సల్టేషన్లు కూడా ఉన్నాయి. ఇంటి వద్దకే నర్సింగ్ సేవలను అందిస్తోంది.

మాంక్ మెడ్ https://www.monkmed.com/

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ భారతీయ వైద్య నిపుణుల సలహాలను ఈ సంస్థ ఆన్ లైన్ విధానంలో అందిస్తోంది. కన్సల్టేషన్ చార్జీ 10 డాలర్లు (సుమారు 670 రూపాయలు). అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది మరింత అనుకూలం. ముఖ్యంగా ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత ఫాలో అప్ సేవలు ఉచితంగా పొందే వెసులుబాటు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. వైద్యులతో ఫోన్ కాల్ ద్వారా ఎంత సేపయినా మాట్లాడవచ్చు. 

ప్రాక్టో https://www.practo.com/consult

వైద్యులను మీ సందేహాల గురించి అడిగి ఉచితంగానే సలహా పొందవచ్చు. మరిన్ని వివరాలు కావాలంటే వైద్యులను బట్టి ఫీజులు ఉంటాయి. ఫీజులు చెల్లిస్తే సంబంధిత  డాక్టర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తగిన మందులు, చికిత్సలు సూచిస్తారు. సెకండ్ ఓపినీయన్ తీసుకోవచ్చు. ఉచితంగా ఇతరులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు ఇచ్చిన సమాధానాలను తెలుసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆ ప్రశ్న వేసిన వారి పేర్లను హైడ్ లో ఉంచుతారు. వెబ్ సైట్, యాప్ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి.  

ఈ వైద్య https://www.evaidya.com/home.html#!/home

ఫ్యామిలీ డాక్టర్ కన్సల్టేషన్ కు 200 రూపాయలు, స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ కు 499 రూపాయల ఫీజును చెల్లించుకోవాలి. ఉచితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నప్పటికీ స్పందన వస్తుందన్న పూచీ లేదు. 999 రూపాయలు చెల్లించడం ద్వారా ఏడాది పాటు ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందవచ్చు. స్పెషలిస్టు డాక్టర్ వైద్య సేవలను ఒకరి కోసం ఏడాది పొడవునా ఎన్ని సార్లయినా ఉచితంగా పొందేందుకు 2,499 రూపాయలు చెల్లించి చందాదారులు అయిపోవచ్చు. 

representation image

క్యుపిడ్ కేర్ http://www.cupidcare.in/

దంపతుల మధ్య పైకి చెప్పుకోలేని ఎన్నో లైంగిక సమస్యలు ఉండవచ్చు. యుక్త వయసులో ఉన్న వారిలోనూ ఇలాంటి బిడియమే ఉంటుంది. లైంగిక, శృంగారపరమైన సమస్యలపై వైద్యుల విలువైన సలహాలను, చికిత్సలను ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవల కోసం ఉద్దేశించినదే క్యుపిడ్ కేర్. ఇది ప్రత్యేకంగా సెక్సాలజిస్టుల కోసం ఉద్దేశించిన ఆన్ లైన్ క్లినిక్. 

ఇంకా ఇలాంటి సేవలు అందిస్తున్న సంస్థలు 

https://www.geniedoc.com/

https://www.oyehelp.com/

https://www.imedilane.com/

యాప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేది CUREFY

ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణుల సలహాల కోసం అనువైనది https://www.askthedoctor.com/

కాలంతో పాటే మార్పులు...?

ఒకప్పుడు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఎంబీబీఎస్, ఎండీ వైద్యులు మంచి వైద్య సేవలే అందించేవారు. కానీ, నేడు గుండెకో డాక్టర్, మెదడుకో డాక్టర్, మూత్ర పిండాలకో డాక్టర్ ఇలా శరీరంలోని భాగాలను పంచేసుకున్నారు. పైగా అనుభవాన్ని బట్టి చేసే చికిత్సల్లోనూ తేడా ఉంటోంది. ఒకరు సర్జరీ అవసరమని భావిస్తే... అదే విభాగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీనియర్ వైద్యుడు మందులతో నయం అవుతుందంటారు. ముందు మందుల ద్వారా ప్రయత్నించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. మందుల ద్వారా తగ్గితే రోగికి అనవసర వ్యయం, ప్రయాసలు తప్పుతాయి. 

ఇలా ఒక వైద్య నిపుణుడి వద్దకు వెళితే చక్కని వైద్యం లభిస్తుందన్న భరోసా లేదు. చిన్న సమస్య అయితే వైద్యుడు సూచించే సాధారణ మందులతో సులభంగానే తగ్గిపోతుంది. కానీ, అనారోగ్య సమస్య సంక్లిష్టమైనది, అంతుబట్టనిది, క్రానిక్, క్రిటికల్ అయితే, దాన్ని నయం చేసేందుకు వైద్యుడి అనుభవం, సామర్థ్యం, ప్రతిభ కీలకం అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో మొదటి వైద్యుడి స్పందన సరిగా లేదని అనిపిస్తే సెకండ్ ఒపీనియన్ కు వెళ్లవచ్చు. అంటే ఒక వైద్యుడు చెప్పినది సమంజసంగా అనిపించకపోతే మరో వైద్యుడిని సంప్రదించడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆన్ లైన్ వైద్య సేవల సంస్థలు ఎంతో ప్రయోజనకరం. అత్యవసర సమయాల్లోనూ ఇవి అక్కరకు వస్తాయి. మన దగ్గర ఆస్పత్రులకు వెళ్లి వైద్యుడికి చూపించుకోవడం ఒక పూట పడుతుంది. అపాయింట్ మెంట్ తీసుకుని డాక్టర్ కోసం పడిగాపులు కాయాలి. సమయం వృధా. ఇలాంటి సమస్యలకు కూడా ఆన్ లైన్ వేదికలు పరిష్కారమే

ముఖ్య గమనిక: ఇక్కడ పేర్కొన్న సంస్థల సేవలను పరీక్షించి ఈ సమాచారాన్ని రూపొందించలేదు. కేవలం ఆయా వెబ్ సైట్లలోని ప్రాథమిక వివరాల ఆధారంగా పాఠకుల అవగాహన కొరకు ఇస్తున్న సమాచారం మాత్రమే. పూర్తి వివరాల కోసం స్వయంగా విచారించుకోవాలని మనవి.


More Articles