పెట్రోల్ పంపుల వద్ద అప్రమత్తంగా వుండాలి... లేకుంటే జేబు గుల్లే!

పెట్రోల్ పంప్ దగ్గర ఆపరేటర్లు పాల్పడే మోసాలకు లెక్కేలేదు. కన్ను తిప్పేలోపే మాయ చేసేస్తారు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు ఏవో చర్యలతో సరిపెట్టేస్తుంటారు. మళ్లీ యథామామూలే. అంతిమంగా కస్టమర్లు నష్టపోవడమే కనిపిస్తుంది. అందుకే ఈ మోసాలను ఎలా ఎదుర్కోవాలన్నది తెలుసుకోవాలి. అవసరమైతే ఏం చేయాలన్నది కూడా తెలిసి ఉండాలి.  

బైక్ ఆగుతుంది. ఆపరేటర్ పంపు పట్టుకుని ఆయిల్ ట్యాంకులో పెట్టి ఆగమేఘాలపై పెట్రోల్ పోసేస్తుంటాడు. వినియోగదారుడు పెట్రోల్ మీటర్, పంపును గమనించే ప్రయత్నం చేస్తుండగా... చేతిలో క్యాష్ బ్యాగును తగిలించుకున్న మరొకడు డబ్బులు అని అడుగుతాడు. వాళ్ల ప్రయత్నం అంతా... వచ్చిన వాహనదారుడు మీటర్, పంపు వైపు చూడకూడదని. ఎందుకంటే అక్కడే మోసం జరుగుతుంది కనుక.

మీటర్ పై కన్నేయండి

సాధారణంగా ప్రతీ కస్టమర్ కు పెట్రోల్ పోసే సమయంలో మీటర్ రీడింగ్ 0 గానే ఉండాలి. కానీ, ఆపరేటర్లు 0 చేయరు. అంతకుముందు కస్టమర్ పోయించుకున్న రీడింగ్ ను అలానే ఉంచి దానికి కొనసాగింపుగా పెట్రోల్ పోస్తుంటారు. ఉదాహరణకు ముందు వాహనదారుడు 50 రూపాయలు లేదా 100 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నాడని అనుకుందాం. వెనుకనున్న వాహనదారుడు 200 రూపాయలు పెట్రోల్ పోయమని చెప్పడం ఆలస్యం పెట్రోల్ పంపు ఆన్ అయిపోతుంది. మీటర్ పాత రీడింగ్ 100 రూపాయల నుంచే తిరగడం మొదలవుతుంది. నికరంగా వాహనంలోకి వచ్చే పెట్రోల్ 100 రూపాయలు. ఆపరేటర్ నొక్కేసిన మొత్తం 100 రూపాయలు.

representation image

అయితే, కొన్ని ప్రాంతాల్లో మరో రకమైన మోసం కూడా జరుగుతుంది. మీటర్ చూడ్డానికే 0కి వెళుతుంది. కానీ నిజంగా వెళ్లదు. అది కేవలం మీటర్ రీడింగ్ పరంగా చేసే సాంకేతిక మాయాజాలం. అందుకోసం వారు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసుకుంటారు. పై రకమైన మోసం కేవలం ఆపరేటర్లు చేసేది. రెండో రకమైన మోసం కొన్ని చోట్ల యాజమాన్యాలు చేస్తుండగా... కొన్ని చోట్ల మాత్రం ఆపరేటర్ల పాత్ర కూడా ఉంటోంది.

మరో రకమైన మోసం ఏంటంటే... 500 రూపాయల పెట్రోల్ పోయమని చెప్పారు. ఆపరేటర్ మాటల్లో పెట్టి కేవలం 100 రూపాయలతోనే ఆపేస్తాడు. మీటర్ చూసుకోకుండా డబ్బులిస్తే 400 రూపాయల మేర మోసపోయినట్టే. ఒకవేళ గమనించి... 100 రూపాయలతోనే ఆపేశావు ఏంటని అడిగితే... అంతే అనుకున్నానని  చెబుతూ మళ్లీ పోయడం మొదలు పెడతాడు. మీటర్ 100 రూపాయల నుంచే తిరుగూ వెళ్లి 400 రూపాయల దగ్గర ఆగిపోతుంది. 500 కదా కొట్టమన్నది అని మళ్లీ ప్రశ్నిస్తే... 500 కొట్టాను సర్. ముందు 100 రూపాయలు పోశాను. అదనంగా ఇప్పుడు 400 రూపాయలు పోశాను అని చెబుతాడు. అంటే 100 రూపాయల మోసం చేశాడనమాట.

200 రూపాయల పెట్రోల్ పోయమని చెబుతారు. ముల్లు సెకండ్లలోనే గిర్రున తిరిగి 50 రూపాయల దగ్గర ఆగిపోతుంది. నిజానికి అప్పటి వరకు వాహనంలోకి అసలు పెట్రోల్ వచ్చి ఉండదు. 200 రూపాయలకు కొట్టమని చెప్పానని మరోసారి కస్టమర్ అడిగితే 50 రూపాయల నుంచి పంపు నిజాయతీగా పనిచేస్తుంది. నికరంగా 50 రూపాయల నష్టం కలిగింది.

అలాగే, సాధారణంగా 200 రూపాయలు అని చెబితే రెండు లీటర్లు మాత్రమే కొట్టి ఆపేసి హడావిడిగా డబ్బులు తీసుకుని పంపించేస్తారు. ఒకవేళ కస్టమర్ చూసుకుని 2 లీటర్లు కాదు, 200 అని చెబితే అప్పుడు కానీ మిగతా మొత్తం కొట్టరు.

పెట్రోల్ పైపు చాలా పొడవుగా ఉందా..?

డిస్పెన్సింగ్ యూనిట్ నుంచి వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ పోసే పైపు ఎక్కువ పొడవు ఉందా...?, నిర్ణీత పరిమాణం మేర పెట్రోల్ రాదు. పైపు ఎంత పొడవు ఉంటే పెట్రోల్ పోసిన ప్రతీ సారి పైపులో నిర్ణీత మొత్తంలో ఇంధనం మిగిలిపోతుంది. అలా మిగిలిందే వారికి లాభం. పెట్రోల్ పంపు చివరలో ఆపరేటర్ పట్టుకునే చోట ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని మారుస్తుండడం ద్వారా కొంత మిగుల్చుకుంటారు. బటన్ ను పూర్తిగా నొక్కి పట్టుకోవాలని కోరండి. లేదంటే పూర్తి స్థాయిలో పెట్రోల్ రాదు. 

కల్తీలతో లాభార్జన

నాఫ్తాతో పెట్రోల్ ను కల్తీ చేయడం ద్వారా లాభాలను మిగుల్చుకుంటారు. అలాగే, పెట్రోల్ లో కిరోసిన్, ఇతరత్రా వాటిని కూడా కలుపుతుంటారు.

representation image

మెషిన్లలో మాయాజాలం

కొన్ని చోట్ల డీలర్లు మెషిన్లలో మార్పులు చేయిస్తున్నారు. అంటే ఉదాహరణకు రీడింగ్ 0 నుంచి ప్రారంభం అయినట్టు బయటకు కనిపించినా మెషిన్ లోపల మాత్రం కొన్ని పాయింట్ల నుంచి ప్రారంభం అయ్యేట్లు సెట్ చేస్తున్నారు. ఉదాహరణకు లీటర్ కు 1000 ఎంఎల్ అని తెలుసు కదా. మీటర్ 10 ఎంఎల్ నుంచో 20 ఎంఎల్ నుంచో లోపల ప్రారంభం అవుతుంది. అంటే ఆ మేరకు వినియోగదారుడు నష్టపోయినట్టే. 

కొన్ని ప్రాంతాల్లో రిమోట్ ద్వారా మెషిన్ ను ఆపరేట్ చేస్తూ కస్టమర్లను మోసగిస్తున్నారు. ఎలా అంటే మెషిన్లను ట్యాంపర్ చేసి రిమోట్ కంట్రోలింగ్ విధానంలో అనుసంధానిస్తారు. వాహనంలో పెట్రోల్ ప్రారంభం అయిన తర్వాత డిస్పెన్సింగ్ యూనిట్ లో ముల్లు బరబరా తిరుగుతుంది. కానీ ఆన్ చేసిన కొన్ని సెంకండ్లకే ఆపరేటర్ రిమోట్ సాయంతో దాన్ని ఆపేస్తాడు. కానీ, మీటర్ రీడింగ్ మాత్రం తిరుగుతుంది. పెట్రోల్ రాదు. కానీ వచ్చినట్టుగానే చూపించడం ద్వారా మోసం చేస్తారు.  

కొలత తక్కువగా

పట్టణాలు నగరాల్లో 0.3శాతం నుంచి 2 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో 5 శాతం వరకు తక్కువ పోయడం ద్వారా డీలర్లు కొంత మిగుల్చుకుంటారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. పెట్రోలియం విక్రయంపై మార్జిన్ 2 శాతం లోపే. పైగా పెట్రోల్ కొంత ఆవిరి అవుతుంది. అలాగే, అధిక విద్యుత్తు చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చుల రూపంలో వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధమైన మోసాలకు పాల్పడుతుంటారు. 0.3 శాతం అంటే లీటర్ కు 3 ఎంఎల్. చాలా తక్కువ పరిమాణం కనుక ఎవరూ గుర్తించలేరు.

కార్డులతో మస్కా

అసలు పెట్రోలు పంపుల వద్ద జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోనూ మోసం చేసేందుకు అక్కడి సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. పెట్రోల్ పోయించుకుని డబ్బులు చెల్లించేందుకు వీలుగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డును పంప్ ఆపరేటర్ కు ఇచ్చి బండి దగ్గరే ఉండిపోకండి. ఆపరేటర్ ఆ కార్డులతో ఏ విధంగానయినా మోసం చేసేందుకు అవకాశం ఉంది. మహారాష్ట్రలోని పుణె నగరంలోని ఓ పెట్రోల్ పంపులో ఓ కస్టమర్ తాను ఎదుర్కొన్న మోసాన్ని ఓ ఆన్ లైన్ ఫోరంలో వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీరామ్ (పేరు మార్చాం) తన కారుతో హింజెవాడీ ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. కారును నిలిపి అక్కడే ఉన్న అటెండెంట్ కు క్రెడిట్ కార్డు ఇచ్చి రూ.1400 తీసుకోవాలని సూచించాడు. రూ.1400 మేర పెట్రోల్ పోయాలని ఆపరేటర్ కు చెప్పాడు. కార్డు తీసుకుని అటెండెంట్ పక్కకు వెళ్లాడు. పెట్రోల్ పోయడం పూర్తి కాకముందే వచ్చి సర్ కార్డు పనిచేయడం లేదని చెప్పాడు. దాంతో మరో కార్డు ఇచ్చాడు. ఈ లోపు పంప్ ఆపరేటర్ పెట్రోల్ పోయడం ముగించేసి రీడింగ్ ను కూడా జీరో చేసేశాడు. అటెండెంట్ రెండో కార్డుతో లావాదేవీ పూర్తి చేసుకుని రావడం కూడా అయిపోయింది. 

ఇంతలో తన మొబైల్ కు వచ్చిన సందేశాలు చూసుకుని కస్టమర్ అవాక్కయ్యాడు. రెండు సార్లు రూ.1400 చొప్పున లావాదేవీలు జరిగాయి. అంటే అటెండెంట్ రెండు కార్డుల నుంచి నగదు డ్రా చేసుకున్నాడు. అదే సమయంలో పెట్రోల్ కూడా పూర్తి స్థాయిలో కొట్టలేదని అతడికి అనుమానం. దాంతో పెట్రోల్ డిస్పెన్సర్ మెషిన్ లో రీడింగ్ చూపించమని డిమాండ్ చేశాడు. విషయం ఏమిటంటే అన్ని పెట్రోల్ ఫిల్లింగ్ యంత్రాల్లో ప్రతీ లావాదేవీ సమయం, ఎంత పెట్రోల్, నగదు వివరాలు లోపల రికార్డయ్యి ఉంటాయన్న విషయం అతడికి తెలుసు. అందుకే పెట్రోల్ బంక్ సిబ్బంది మోసాలు అతడి దగ్గర చెల్లలేదు. 

కారును పెట్రోల్ ఫిల్లింగ్ యంత్రం ముందు నుంచి తీయకుండా రీడింగ్ చూపించాలని పట్టుబట్టాడు. లేదు లేదంటూ దబాయించినా అతడు చలించలేదు. చివరికి గత్యంతరం లేక లోపల రీడింగ్స్ చూపించగా... రూ.1,231 రూపాయలుగా ఉంది. అంటే ఆపరేటర్ 169 రూపాయల మేర మోసం చేసినట్టు బట్టబయలు అయింది. ఇక, అటెండెంట్ రెండు సార్లు డ్రా చేసుకున్నట్టు సందేశం రావడంతో వెంటనే కంప్లయింట్ బుక్ ఇవ్వాలని కోరాడు. దీంతో బంక్ లోని సిబ్బందంతా అతడి దగ్గరకు చేరుకుని కాళ్లమీద పడిపోయారు. కంప్లయింట్ బుక్ లేదన్నారు. 169 రూపాయలు తిరిగిచ్చేస్తామని, అదనంగా డ్రా చేసుకున్న రూ.1400 కూడా క్రెడిట్ చేస్తామని ప్రాధేయపడ్డారు. చివరికి పెట్రోల్ కోసం వసూలు చేసుకున్న అసలు రూ.1400 కూడా వెనక్కిచేస్తామని ఆశచూపారు. అరగంట సేపు బతిమాలినా మనోడు అంగుళం కూడా కరగలేదు. చివరికి కంప్లయింట్ బుక్ ఇచ్చారు. సరే ఈ ఫిర్యాదు చివరికి ఇండియన్ ఆయిల్ ఉన్నతాధికారుల వరకు వెళ్లడం, ఏవో నామమాత్రపు చర్యలు తీసుకోవడం జరిగిందనుకోండి. కానీ, మోసానికి ఆస్కారం ఇవ్వకుండా మనోడు వ్యవహరించిన తీరుకు శభాష్ అనాల్సిందే.

హైదరాబాద్ లో...

మరో ఘటనలో హైదరాబాద్ కు చెందిన రజనీష్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కు వెళ్లి తన బైక్ లో 300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నాడు. క్రెడిట్ కార్డు ఇచ్చాడు. రివార్డు పాయింట్ల నుంచి నగదు మొత్తాన్ని మినహాయించుకోమని చెప్పాడు. అటెండెంట్ ఓ రెండు నిమిషాల తర్వాత వచ్చి సర్ పాయింట్లు పనిచేయడం లేదని బ్యాలన్స్ నుంచి డ్రా చేసుకున్నానని చెప్పాడు. ఏదో ఒకటిలే అనుకున్నరజనీష్ ఆఫీస్ కు వెళ్లి మొబైల్ చూసుకుంటే పాయింట్లు, బ్యాలన్స్ నుంచి కూడా డ్రా చేసుకున్నట్టు సందేశాలు వచ్చి ఉన్నాయి. పెట్రోల్ పంపుల్లో ఆపరేటర్లకు గానీ, మరెవరికైనా గానీ క్రెడిట్, డెబిట్ కార్డులు ఇచ్చి వాహనం దగ్గరే ఉండిపోతే ఆ కార్డులను క్లోన్ చేసుకుని వాటిపై ఉన్న వివరాలను తస్కరించడం ద్వారా డూప్లికేట్ కార్డులు రూపొందించి నగదు మొత్తం ఊడ్చేస్తారు. ఇలాంటి నేరాలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం ఇలాంటివి తగ్గినప్పటికీ అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందుకే సదా అప్రమత్తతే మోసాల బారి నుంచి కాపాడుతుంది. 

పెట్రోల్ పంప్ ఎంపిక, జాగ్రత్తలు

చమురు కంపెనీ ఆధ్వర్యంలో నడపబడుతున్న పెట్రోల్ బంకులపై ఉద్యోగుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మోసాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మోసం చేసినా కంప్లయింట్ ఇస్తే చర్యలు వేగంగా ఉంటాయి.

రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో మోసాలకు చాలా తక్కువ అవకాశం ఉంది. వీటిని కూడా పరిశీలించవచ్చు.

ఆటో డ్రైవర్లకు పెట్రోల్ పంపులపై బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే వారు ప్రతీసారీ మైలేజీని చూసుకుంటుంటారు. వారిని అడిగినా మోసాలు జరగని బంకుల గురించి తెలుస్తుంది.  

ఆధునిక పంపింగ్ మెషిన్లు ఉన్న బంకుల్లో పోయించుకోవడం బెటర్. మల్టీ ప్రొడక్ట్ డిస్పెన్సర్ (ఎంపీడీ) పంపుల్లో మోసాలకు అవకాశం తక్కువ. ముఖ్యంగా పాత తరహా మెషిన్లను తేలిగ్గా ట్యాంపర్ చేయవచ్చు. కనుక ఇలాంటి మెషిన్లు ఉన్న చోట పోయించుకోవద్దు.  

representation image

మీకు అందుబాటులో ఉన్న బంకుల్లో ఒక్కో దానిలో ఒక్కోసారి నిర్ణీత పరిమాణంలోనే కొట్టిస్తూ మైలేజీ చెక్ చేసుకోవాలి. నిర్ణీత మైలేజీ కంటే తక్కువ వస్తే అందులో మోసం జరిగినట్టే. ఇంజన్ పనితీరులో మార్పు కనిపిస్తే కల్తీ జరిగినట్టే. బండి మధ్య మధ్యలో తరచూ ఆగిపోతున్నా అది కూడా పెట్రోల్ కల్తీ ప్రభావమే అని గుర్తించాలి. అలా కాకుండా ఎక్కువ మైలేజీ గుర్తిస్తే అదే బంకులో తరచూ పెట్రోల్ పోయించుకోవడం శ్రేయస్కరం.  

పెట్రోల్ ఎంత పోయాలో చెప్పిన తర్వాత అంతమేర మెషిన్ లో సెలక్ట్ చేసి పంప్ ఆన్ చేసి ఉంచమని కోరండి. అంతమేర పెట్రోల్ పోయగానే మెషిన్ దానంతట అదే ఆఫ్ అవుతుంది.

పెట్రోల్ ను నిదానంగా పోయమని కోరండి. వేగంగా పోస్తే తక్కువ పెట్రోల్ వచ్చేలా లోపల సెట్ చేసి ఉంటారు. అందుకే వేగంగా పోస్తుంటారు. నిదానంగా పోయమని కోరడం వల్ల ఈ విధమైన మోసాన్ని నిరోధించవచ్చు.  

పెట్రోల్ ట్యాంకు మూతను ముందుగా తీయవద్దు. మీటర్ 0 చేసిన తర్వాతే ట్యాంకు మూత ఓపెన్ చేయండి. కారులోనే కూర్చుని పెట్రోల్/డీజిల్ కొట్టమని ఆదేశాలు ఇవ్వవద్దు. దిగి కొట్టేవాడి పక్కన నించుంటే మోసం చేయడానికి వెనుకాడతాడు. పంపు, మీటర్ రెండింటి వైపు తీక్షణంగా చూస్తుండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పంపు ఆపరేటర్ తో చర్చ వద్దు. ప్రతీసారి బిల్లు తీసుకోండి. 

50 రూపాయలు, 100, 150,  200, 300 ఈ డినామినేషన్ లో పోయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది చిల్లర సమస్య లేకుండా ఇంత మొత్తాల్లోనే పోయించుకుంటారు. కనుక తక్కువ వచ్చేలా సెట్ చేసి ఉండవచ్చు. అందుకే లీటర్లలో కొట్టించుకోండి. లేదా 222, 333, 444 ఇంత మేర కొట్టించుకోండి. అందుకు సరిపడా చిల్లర దగ్గర ఉంచుకోండి. 

మీ సమక్షంలో పరీక్షలు

ప్రతీ బంకులోనూ ఐదు లీటర్ల కాలిబరేటెడ్ కొలత ఉంటుంది. అందులోకి పెట్రోల్ పోయమని కోరండి. దాంతో కొలత సరిగా ఉందీ లేనిదీ తెలుస్తుంది. మెషిన్ లో డిఫాల్ట్ గా తక్కువ పెట్రోల్ వచ్చేలా సెట్ చేసి ఉంటే తప్పకుండా మోసం బయటపడుతుంది. ఒకవేళ ఆపరేటర్ మాయాజాలంతో జరిగేది అయితే బయట పడదు.

కల్తీ జరిగిందన్న అనుమానం వస్తే.... ఫిల్టర్ పేపర్ పరీక్ష చేయాలి. ప్రతీ బంకులోనూ డీలర్ తప్పకుండా దీన్ని అందుబాటులో ఉంచాలి. ఈ పేపర్ పై పెట్రోల్ చుక్క వేయాలి. రెండు నిమిషాల్లో ఇది ఆవిరి అయిపోవాలి. పేపర్ పై ఎలాంటి మరక పడరాదు. మరక పడిందంటే అందులో కచ్చితంగా కల్తీ జరిగిందనే అర్థం. దీనిపై వెంటనే పిర్యాదు చేయాలి. ఫిల్టర్ పేపర్ లేదని సమాధానం వస్తే అదే విషయాన్ని పేర్కొంటూ ఫిర్యాదు చేయాలి. లేదా ఫీల్డ్ మేనేజర్ ను పిలిపించి మీ సమక్షంలోనే పెట్రోల్ శాంపిల్ ను ల్యాబ్ కు పంపమని కోరవచ్చు. అలా కోరితే శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపడమే కాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని కస్టమర్ కు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 

పెట్రోల్ పంపుల్లో డిస్పెన్సింగ్ యూనిట్లను తూనికలు, కొలతల శాఖ వారు ఏటా పరీక్షించి వాటిని సీల్ చేసి, స్టాంప్ వేస్తారు. అయినా, ఈ సీళ్లను తొలగించి మెషిన్ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారు. 

representation image

ఫిర్యాదులు

ఫిర్యాదుల విషయంలో ఆయిల్ కంపెనీలు సీరియస్ గానే స్పందిస్తాయి. అందుకని మోసాలపై పెట్రోల్ పంపుల వద్ద అందుబాటులో ఉండే కంప్లయింట్ బుక్ లోనే ఫిర్యాదు నమోదు చేయాలనేమీ లేదు. మోసం జరిగినట్టు భావిస్తే తప్పనిసరిగా బిల్లు తీసుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదును ఆయిల్ కంపెనీ చిరునామాకు పంపవచ్చు. లేదా అన్ని చమురు కంపెనీలకు అధికారిక వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిలోనూ ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.

పెట్రోల్ పంపుల వద్ద ఆయిల్ కంపెనీ సేల్స్ మేనేజర్ నంబర్ తప్పకుండా రాసి ఉంటుంది. ఆ నంబర్ కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మీకు సందేహం వస్తే బంకుల్లో కొలిచి చూపించాలి. కల్తీ జరిగిందన్న సందేహం ఉంటే అప్పటికప్పుడు పరీక్ష ద్వారా కల్తీయా, ఒరిజినలా అన్నది చూపించాల్సిన బాధ్యత చమురు కంపెనీలదే.

మోసానికి గురైతే వెంటనే కంప్లయింట్ బుక్ అడిగి దానిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాయండి. కంప్లయింట్ బుక్ అడిగితే ఎక్కడో ఉందని చెబితే పంప్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లండి. మోసం చేస్తున్నారని చెబుతూ హడావిడి చేయండి. ఇతర కస్టమర్ల ముందు గుడ్ విల్ పోతుందన్న భయంతో దారికి వస్తారు. అందుబాటులో లేకుంటే మేనేజర్ లేదా యాజమాన్యం కాంటాక్ట్ నంబర్ తీసుకుని వారితో మాట్లాడండి. ఇలాంటివి నివారించకపోతే కంపెనీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేయాలి.

హిందూస్తాన్ పెట్రోలియం బంకులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1800 2333 555 లేదా 155233, http://www.hpretail.in/ http://www.hindustanpetroleum.com/  వెబ్ సైట్లలోనూ ఫిర్యాదులు చేయవచ్చు.

భారత్ పెట్రోలియం అయితే టోల్ ఫ్రీ నంబర్ 1800 22 4344, https://ebiz.bpc.co.in  

ఐఓసీ అయితే టోల్ ఫ్రీ నంబర్  1800 2333 555, లేదా వెబ్ సైట్ https://www.iocl.com


More Articles