ఈ భద్రతా దళాల కంట్లో పడితే ఇక అంతే..!
వారి అడుగులు, వారి చేతలు, వారి ఆలోచనలు ధ్వనికంటే వేగంగా స్పందిస్తాయి. చూపు, మనసు, చేత ఒకే క్షణంలో కలగలిపి శత్రువును తుత్తునియలు చేసేస్తాయి. వారి చేతిలో ఆయుధాలు ముష్కరుడి అంతు తేల్చేస్తాయి. దేశమన్నా, దేశ పౌరులన్నా వారికి వారి ప్రాణం కంటే ఎక్కువ. విధి నిర్వహణ కోసం ప్రాణాలకు తెగిస్తారు. దేశ భద్రత కోసం ఇలా పనిచేస్తున్న దళాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. వాటిలోనూ ప్రత్యేక నైపుణ్యమున్నవి, ముష్కరులకు సైతం వణుకు పుట్టించేవి కూడా ఉన్నాయి...
మార్కోస్
భారతీయ నౌకాదళంలో మెరైన్ కమండోస్ (మార్కోస్) కూడా భాగం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన భద్రతా బలగాల్లో ఇదీ ఒకటి. అమెరికా నేవీ సీల్స్ తర్వాత నీటిపై ఆయుధాలతో పూర్తి స్థాయిలో పోరాడగల సామర్థ్యంలో మార్కోస్ ది ప్రత్యేక స్థానం. అమెరికా నేవీసీల్స్ తో, బ్రిటిష్ ఎస్ఏఎస్ విభాగంతో శిక్షణ, గెరిల్లా యుద్ధ విద్యల్లో, మానసిక, శారీరక సామర్థ్య శిక్షణతో మార్కోస్ రాటుదేలుతుంది. పారాచ్యూట్ లతో శిక్షణ, యుద్ధ సామగ్రిపై శిక్షణ, అత్యాధునిక ఆయుధాల వాడకంలో వీరికి ఇచ్చే శిక్షణ ఎంతో ప్రత్యేకతతో వుంటాయి. కార్గిల్ వార్, ఆపరేషన్ లీచ్, ఆపరేషన్ స్వాన్ లో ఈ దళం పాలుపంచుకుంది. ముంబై తాజ్, ట్రిడెంట్ హోటళ్లపై 2008లో ఉగ్రమూకలు సాగించిన కాల్పుల సమయంలోనూ వీరే రంగంలోకి దిగి వారిని మట్టి కరిపించారు.
మార్కోస్ దళంలోకి ఎంపికైన వారికి రెండున్నర నుంచి మూడేళ్ల పాటు అన్ని రకాల యుద్ధ విద్యల్లోనూ కఠోర శిక్షణ ఉంటుంది. ఎంపికలో భాగంగా మూడు రోజుల పాటు శారీరక సామర్థ్య, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడే 80 శాతం మంది అభ్యర్థులు వడపోతకు గురవుతారు. ఆ తర్వాత ఐదు వారాల పాటు నరకం కనిపిస్తుంది. నిద్ర పోనివ్వకుండా వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అలాగే, కఠోరమైన శారీరక శిక్షణ ఇస్తారు. దీంతో సత్తా లేని వారు వారంతట వారే వైదొలగుతారు. తట్టుకుని నిలబడితే వారికి కమోండోగా శిక్షణ ఉంటుంది.
ఐఎన్ఎస్ అభిమన్యు యుద్ధ నౌకలో ముంబైలో శిక్షణ, ఆగ్రాలోని పారా ట్రూపర్ ట్రైనింగ్ స్కూల్లో పారా జంపింగ్ పై శిక్షణ, కోచిలోని నేవీ డైవింగ్ (లోతైన నీటిలో ఈత) స్కూల్లో శిక్షణ వుంటాయి. భుజానికి లోడ్ తగిలించుకుని హెలికాప్టర్ లోంచి సముద్రంపై దిగడంలోనూ శిక్షణ. అరుణాచల్ ప్రదేశ్ లోని పర్వత్ ఘటక్ స్కూల్లో హై ఆల్టిట్యూడ్ కమెండో కోర్సులో శిక్షణ ఇస్తారు. అలాగే రాజస్థాన్ లో ఏడారుల్లో శిక్షణ, సోన్ మార్గ్ లోని హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్లో, కౌంటర్ ఇంటెలిజెన్స్, మిజోరాంలోని అటవీ యుద్ధ విద్యల శిక్షణ కేంద్రంలో వీరిని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతారు. శిక్షణ అనంతరం మూడు నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. ఆగకుండా 12 కిలోమీటర్ల దూరం ఈత కొట్టే సామర్థ్యం ఈ దళానికి ఉంటుంది
ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధాలను వీరికి అందిస్తారు. ఇజ్రాయెలీ టీవోర్ టార్-21 రైఫిల్, రే 40ఎంఎం గ్రనేడ్ లాంచర్, హెక్లెర్ అండ్ కోచ్ ఎంపీ 5 సబ్ మెషిన్ గన్, ఎస్ఐజీ సావెర్ పీ226, గ్లాక్ 17 పిస్టల్స్, డ్రుగనోవ్ అండ్ గాలి రైఫిల్స్, ఓఎస్వీ96 సెమీ ఆటో హెవీ క్యాలిబర్ యాంటీ మెటీరియల్ రైఫిల్, నీటిలోపల ఆపరేషన్స్ కోసం రెండు ఇటాలియన్ సబ్ మెరైన్లు వీరికి అందుబాటులో ఉంటాయి.
పాకిస్థాన్ స్పెషల్ సర్వీసు గ్రూపు (ఎస్ఎస్ జీ)
12 గంటల్లో సుమారు 54 కిలోమీటర్ల దూరం నడవాలి. 20 నిమిషాల్లో ఏడున్నర కిలోమీటర్ల దూరం వేగంగా పరుగు తీయాలి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసు గ్రూప్ కమాండోల శిక్షణలో భాగంగా పెట్టే పరీక్షలు. భారత్ తో 1971లో జరిగిన యుద్ధం, కార్గిల్ యుద్ధ సమయలోనూ, సోవియట్ అఫ్ఘాన్ యుద్ధంలోనూ ఈ దళం కీలక పాత్ర పోషించింది. ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద 35 మందిని ఉగ్రవాదులు నిర్బంధించగా వీరే విడిపించారు. 73 మందితో కూడిన విమానం హైజాక్ అయిన సందర్భంలోనూ వీరే రంగంలోకి దిగి కథ సుఖాంతం చేశారు. అఫ్ఘాన్ స్కూల్ బస్సు హైజాక్ కు గురికాగా 20 నిమిషాల్లోనే ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్ ముగించేశారు.
అమెరికా స్పెషల్ ఫోర్సెస్ శిక్షణ విధానాన్నే వీరికి కూడా అనుసరిస్తున్నారు. ఏడారి, పర్వతాలు, నీటిలోపల, అటవీ ఇలా అన్ని విభాగాల్లోనూ యుద్ధ రీతులపై శిక్షణ ఉంటుంది. ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో వేర్పాటువాదులపై వీరు యుద్ధం సాగిస్తున్నారు. అమెరికా డెల్టా ఫోర్స్ కు ఎస్ఎస్ జీ సమ ఉజ్జీ అని విశ్లేషకుల మాట. మరికొంత మంది నిపుణులు ఎస్ఎస్ జీ సామర్థ్యాలే అధికమని కూడా అంటుంటారు.
అసమాన యుద్ధ విద్య, ప్రత్యేక ఆపరేషన్స్, ఉగ్రవాద వ్యతిరేక, సంప్రదాయేతర యద్ధ విద్య, ప్రత్యేక పర్యవేక్షక, బందీల విడుదలలో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఎస్ఎస్ జీ పాక్ ఆర్మీలో భాగం.
యూఎస్ నేవీ సీల్స్
అమెరికా నేవీ సీల్స్ యుద్ధ విద్యల పరంగా విశిష్ట దళంగా, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దళాల్లో ఒకటిగా ఉంది. తమ అవసరం ఉంటే చాలా వేగంగా ఈ దళం అక్కడ వాలిపోతుంది. సముద్రం, గగనతలం, భూమిపై యుద్ధం చేయగల నైపుణ్యం ఈ దళం సొంతం. ఒకరిద్దరు సభ్యులు ఒక దళంగా పనిచేస్తుంటారు. అవసరమైతే 16 మందితో ప్లాటూన్ రంగంలోకి దిగుతుంది. ఏడారి, అడవి, అతి వేడి, శీతల వాతావరణం, పట్టణాల్లోనూ వీరిక ిశిక్షణ ఇస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనయినా పనిచేసేలా తీర్దిదిద్దుతారు. ఇరాక్, అప్ఘానిస్తాన్ యుద్ధాల్లోనూ ఈ దళాలు పాల్గొన్నాయి.
హ్యాండ్ గన్స్, రైఫిల్స్, స్నిఫర్ రైఫిల్స్, సబ్ మెషిన్ గన్స్, మెషిన్ గన్స్ ఇలా ఎన్నో అత్యాధునిక ఆయుధాలు ఈ దళం వద్ద రెడీగా ఉంటాయి. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. 25వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి కిందకు దూకేసి పారాచ్యూట్ సాయంతో దిగడం, సముద్ర తీరంలో శిక్షణ, సాగరంలో ఈత, తీరంలో ఇసుకపై పరుగెత్తడం ఇలా ఎన్నో రూపాల్లో శిక్షణనిస్తారు. ప్రపంచంలో అత్యంత కఠోరమైన శిక్షణ యూఎస్ నేవీ సీల్స్ కు ఇచ్చేదేనని చెబుతారు.
విధుల్లో భాగంగా సబ్ మెరైన్స్ లో నెలల తరబడి ఉండాల్సి వస్తుంది. ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో ఉండే సబ్ మెరైన్ లో రాత్రి, పగలు తేడా తెలియకుండా నెలల తరబడి బయటకు వచ్చే అవకాశం లేకుండా విధులు నిర్వహించాలి. పక్కనే రియాక్టర్, గట్టిగా 15 అడుగులకు మించని స్థలంలో విధులు అంటే మాటలు కాదు.
ఆల్ఫా గ్రూప్ రష్యా
స్పెట్స్ గ్రుప్ప ఏ, ఆల్ఫా గ్రూపు, ఆల్ఫా ఇలా పలు పేర్లతో పిలవబడే ఈ దళం రష్యా స్పెషల్ ఫోర్స్ లో భాగం. బహిరంగ ప్రదేశాల్లో హింసాత్మక సంఘటనలను నియంత్రిస్తుంది. సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇది ఏర్పాటైనా విదేశాల్లో ఆపరేషన్స్ కోసం కూడా వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన, అత్యాధునిక దళాల్లో ఇది కూడా ఒకటి.
జీఐజీఎన్, ఫ్రాన్స్
ఫ్రాన్స్ కు చెందిన జీఐజీఎన్ ఫ్రెంచ్ సాయుధ దళాల్లో ఒకటి. హింసాత్మక దాడుల నిరోధానికి దీన్ని వినియోగస్తున్నారు. దేశానికి, దేశ పౌరులకు తలెత్తే ఎలాంటి ముప్పునైనా ఈ దళం ఇట్టే పసిగట్టి రంగంలోకి దిగిపోతుంది. ఈ విభాగం చాలా రహస్యంగా పనిచేసుకుపోతుంటుంది. ఈ దళంలోని సభ్యుల చిత్రాలను సైతం ప్రచురించరాదు. 1979 మక్కాలో వేర్పాటు వాదులు పవిత్ర మసీదును తమ నియంత్రణలోకి తీసుకున్నప్పుడు భగ్నం చేసింది ఈ దళమే. ముస్లిమేతరులు ప్రవేశించకూడదన్న నిబంధన కారణంగా ముగ్గురు జీఐజీఎన్ కమెండోలు ముస్లిం మతం స్వీకరించి, దుండగులను పట్టుకోవడంలో సౌదీ దళాలను వెనుకనుండి నడిపించారు. ఇప్పటి వరకు వేర్వేరు ఘటనల్లో 600 మందికిపైగా బందీల ప్రాణాలను కాపాడగలిగారు.
సయేరెత్ మత్కల్, ఇజ్రాయెల్
ఉగ్రవాదంపై పోరుకు ఏర్పాటైందే ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్స్. శారీరక, మేథోపరంగా ఈ దళం ఎంతో బలంగా ఉంటుంది. పాలస్తీనా ఉగ్రవాద చర్యల నుంచి రక్షిస్తుంటుంది.
జాయింట్ ఫోర్స్ టాస్క్ (జేటీఎఫ్2), కెనడా
ప్రత్యేక కార్యకలాపాల దళం. ఉగ్రవాదంపై పోరుకు వినియోగిస్తున్నారు. అవసరమైతే ఇతర దేశాల్లో పౌరుల రక్షణ బాధ్యతల్లోనూ పాలు పంచుకుంటుంది. బందీలను విడిపించడం, ప్రాణాలను రక్షించడం వంటి వాటిలో దిట్ట.
బ్రిటిష్ స్పెషల్ ఎయిర్ సర్వీసెస్ (ఎస్ఏఎస్)
ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక దళాలకు స్ఫూర్తి ఈ దళమే. అమెరికా డెల్టా ఫోర్స్ ఏర్పాటు చేసిన అధికారి కూడా ముందుగా ఎస్ఏఎస్ తో కొంత కాలం పనిచేసిన వ్యక్తే. ప్రపంచంలో నంబర్ 1 గా దీన్ని పేర్కొంటారు. బ్రిటిష్ ఆర్మీలో భాగంగా ఉంది. ఉగ్రవాదంపై పోరాటం, బందీల విడుదల వంటి ప్రత్యేక బాధ్యతలను చూస్తుంటుంది.
షయేటెట్ 13, ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ రక్షణ దళాల్లో ఇదీ ఒకటి. సముద్రం ద్వారా దేశంలోకి చొరబాట్లు, ఉగ్రవాదం, విద్రోహ చర్యలు, తీర ప్రాంత పరిరక్షణ, బందీల రక్షణ తదితర కీలక రక్షణ బాధ్యతలను చూస్తుంటుంది. అమెరికా నేవీ సీల్స్ వలే పనిచేస్తుంది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా ఇజ్రాయెల్ అథ్లెట్లపై దాడుల సమయంలో ఈ దళం నిర్వహించిన పాత్ర కీలకమైనది.
యూఎస్ ఎయిర్ ఫోర్స్ పారా రెస్క్యూ టీమ్
ఈ దళ సభ్యులకు రెండేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. పారాచ్యూట్ల సాయంతో ఆపరేషన్ నిర్వహిస్తుంటుంది. అమెరికాకు చెందిన ముఖ్యమైన దళాలకు ఈ దళ సభ్యులను అటాచ్ చేస్తారు. రేంజర్స్, కోస్ట్ గార్డ్, డెల్టా, సీల్స్, ఫోర్స్ రెకాన్ దళాలతో కలసి పారా రెస్క్యూ సభ్యులు పనిచేస్తుంటారు. ఇంకా పోలిష్ జీఆర్ఓఎం, ఇటలీకి చెందిన జీఐఎస్ వంటి దళాలు కూడా ప్రత్యేకమైనవే.
కఠోర శిక్షణకు కొన్ని నిదర్శనాలు
అమెరికాకు చెందిన మెరైన్ కార్ప్స్ 2014లో థాయ్ నేవీతో కలసి కోబ్రా గోల్డ్ 2014 పేరుతో సంయుక్త విన్యాసాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అడవిలో నిలదొక్కుకునే పరీక్షలో భాగంగా యూఎస్ మెరైన్ కార్ప్స్ బలగాలకు కోబ్రా రక్తాన్ని తాగించారు. యూఎస్ నేవీ సీల్స్ శిక్షణలో చేరే ముందే అభ్యర్థులు రెండు నిమిషాల్లో 42 పుషప్ లు తీయాల్సి ఉంటుంది. రెండు నిమిషాల్లో 50సిటప్ లు చేయాలి. 11 నిమిషాల్లో రెండున్నర కిలోమీటర్లు పరుగెత్తాలి. యూకేకి చెందిన స్పెషల్ బోట్ సర్వీస్ శిక్షణలో భాగంగా అభ్యర్థులను బెలిజ్ రెయిన్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి కఠినమైన పరీక్షలు పెడతారు. ఇక సయేరెత్ మత్కల్ ఎంపిక కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులకు డాక్టర్ల పర్యవేక్షణలో కఠిన పరీక్షలు నిర్వహిస్తారు.
భారత్ లో ప్రత్యేక దళాలు
పారా కమెండోలు: 1966లో ఏర్పాటైంది. భారతీయ ఆర్మీకి చెందిన పారాచ్యూట్ రెజిమెంట్ ఇది. దేశంలోని ప్రత్యేక, విశిష్ఠ భద్రతా దళాల్లో ఇది కూడా ఒకటి. శత్రుదేశాల సరిహద్దుల్లో క్షణాల్లో ఈ దళ సభ్యులను దించేస్తారు. అత్యంత వేగంగా వీరు శత్రువులపై దాడికి దిగి వారి భద్రతా వలయాన్ని భగ్నం చేస్తారు. తర్వాత సైన్యం తన పనిచేసుకుపోతుంది. కార్గిల్ యుద్ధమప్పుడు ఈ దళం కూడా పాలు పంచుకుంది.
ఫోర్స్ వన్: ముంబైలో 2008లో ఉగ్రదాడుల అనంతరం రక్షణ కోసం 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై నగరాన్ని ఉగ్రదాడుల నుంచి రక్షించేందుకు దీన్ని కేటాయించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రతిస్పందించే దళాల్లో ఇది కూడా ఒకటి.
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్: 1962 చైనాతో యుద్ధం అనంతరం కోవర్ట్ ఆపరేషన్స్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. భారత విదేశీ గూఢచర్య సంస్థ రా పర్యవేక్షణలో పనిచేస్తుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ విభాగం ద్వారా నేరుగా ప్రధాన మంత్రికి నివేదిస్తుంది. ఈ విభాగం ఏం చేస్తోందన్నది ఆర్మీకి కూడా తెలియదు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ): దేశంలో వీఐపీలకు రక్షణ కల్పించే విభాగం. ఉగ్రదాడుల నుంచి సైతం రక్షణ కల్పిస్తుంది. ముంబై ఉగ్ర దాడుల సమయంలో ఈ దళం కూడా రంగంలోకి దిగింది. 7500 మందితో కూడిన ఈ విభాగం స్పెషల్ యాక్షన్ గ్రూప్, స్పెషల్ రేంజర్ గ్రూప్ కింద రెండు భాగాలుగా పనిచేస్తుంటుంది.
గార్డ్ కమెండో ఫోర్స్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో భాగమైన ప్రత్యేక దళం ఇది. గార్డ్ గా మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. మరే భారతీయ దళంలోనూ ఇంత సుదీర్ఘకాలం పాటు శిక్షణ ఇవ్వరు. వాయుసేన కేంద్రాలకు భద్రత కల్పించడం ఈ విభాగం బాధ్యత. విపత్తుల సమయంలో ఈ దళమే సహాయక చర్యల్లో ముందుండేది. కోబ్రా: సీఆర్పీఎఫ్ లో భాగం. నక్సల్స్ కార్యకలాపాల నిరోధానికి ఈ విభాగాన్ని ప్రత్యేకించారు. గెరిల్లా యుద్ధ విద్యలో వీరికి అత్యంత కఠిన శిక్షణనిస్తారు. 2008లో ఇది ఏర్పాటు కాగా, తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో నక్సల్స్ గ్రూపులను మట్టుబెట్టింది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్ పీజీ): ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే రక్షణ కల్పించే ప్రత్యేక విభాగం. గూడఛర్య సమాచారం ఆధారంగా ముప్పును ముందుగానే పసిగట్టి తగిన భద్రతా చర్యలు తీసుకుంటుంది. రాజీవ్ గాంధీపై దాడి మినహా, మరే ప్రధాని, మాజీ ప్రధానులపై దాడులు జరగకుండా నియంత్రించడంలో ఈ విభాగం సమర్థంగా పనిచేస్తోంది.