‘యాపిల్’ దారిలో పిల్ల యాపిల్స్.. ‘గూగుల్’ దారిలో గూగ్లేలు
ఒక విత్తు నుంచే ఎన్నో విత్తనాలు ఉద్భవిస్తాయి. ఒక కంపెనీ మరెన్నో కంపెనీల ఆవిష్కరణకు మార్గం చూపుతుంది. గూగుల్, యాపిల్, ఫేస్ బుక్ దిగ్గజ కంపెనీలు. వీటిలో పనిచేయడాన్ని గౌరవంగా, అదృష్టంగా భావించే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. కానీ, వీటిలో పనిచేసిన అవకాశంతో తమ భవిష్యత్తుకు బంగారు బాట నిర్మించుకున్న ఔత్సాహికులు కూడా ఉన్నారు.
గూగుల్ ఉద్యోగులు 50కుపైగా స్టార్టప్ లు ప్రారంభించారు. యాపిల్ ఉద్యోగుల నుంచి 30 స్టార్టప్ లు మొగ్గతొడిగాయి. 12 విజయవంతమైన కంపెనీలు మాజీ యాపిల్ ఉద్యోగులు ప్రారంభించినవే. ఫేస్ బుక్ కూడా ఎంతో మందిని స్టార్టప్ బాట పట్టించింది. ఇవే కాదు విజయవంతమైన కంపెనీలు ఎన్నో ఇలా కొత్త కంపెనీల ఆవిష్కరణకు మార్గం చూపుతూనే ఉంటాయి.
సేల్స్ ఫోర్స్ డాట్ కామ్
మార్క్ బెనీఫ్ యాపిల్ మాజీ ఉద్యోగి. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామర్ గా ఆయన యాపిల్ లో కొంత కాలం పాటు పనిచేశారు. ఒరాకిల్ కార్పొరేషన్ లోనూ 13 ఏళ్ల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం బెనీఫ్ సొంతం. 1999లో శాన్ ఫ్రాన్సిస్కోలో క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో పనిచేయడానికి అనుకూలమైన 100 ఉత్తమ కంపెనీల్లో సేల్స్ ఫోర్స్ కూడా ఒకటని ఫార్చ్యూన్ మేగజైన్ 2013లోనే గుర్తించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ ఇన్నోవేషన్ అవార్డు కూడా ఈ కంపెనీని వరించింది. ‘సొంతంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసేందుకు నన్ను స్టీవ్ జాబ్స్ ఎంతో ప్రోత్సహించారు’ అని మార్క్ చెబుతారు.
ఫ్లిప్ బోర్డ్
ఇదొక సోషల్ నెట్ వర్కింగ్ మొబైల్ యాప్. యాపిల్ మాజీ ఉద్యోగి ఎవాన్ డాల్ దీనికి రూపకర్త. యాపిల్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తూ 2009లో బయటకు వచ్చి స్టార్టప్ పెట్టేశారు. ఈ యాప్ 20 భాషల్లో అందుబాటులో ఉంది. ఎక్కడెక్కడి వెబ్ సైట్ల నుంచో సమాచారాన్ని సేకరించి తమకంటూ ఓ మేగజైన్ రూపొందించుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తోంది. దీనికి మంచి స్పందన లభించడంతో 2010లో యాపిల్ ఐప్యాడ్ యాప్ గా ఎంపికైంది.
ఉబిక్విటి నెట్ వర్క్స్
టెక్నాలజీ కంపెనీ ఇది. ఇంటర్నెట్ వినియోగ విస్తరణకు వీలుగా వైర్ లెస్ ప్రొడక్ట్ లను వర్ధమాన మార్కెట్లకు అందిస్తోంది. క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో 2005లో రాబర్ట్ పెరా దీన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన యాపిల్ లో వైర్ లెస్ ఇంజనీర్ గా పనిచేశారు. 2011లో ప్రపంచ యువ బిలియనీర్ గా ఖ్యాతి పొందారు.
పాథ్
ఫొటో షేరింగ్, మేస్సేజింగ్ కు సంబంధించినది ఈ యాప్. యాపిల్, ఫేస్ బుక్ కంపెనీల మాజీ ఉద్యోగి డేవ్ మోరిన్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇన్ స్టాగ్రామ్ సహా మరికొన్ని యాప్స్ కు గట్టి పోటినిస్తూ లక్షల మందిని ఆకర్షిస్తోంది. మొదట యాపిల్ ఐఓఎస్ యాప్ గా మొదలైనా, తర్వాత విండోస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.
స్టాక్ ట్విట్స్
ఇదొక పాప్యులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. పెట్టుబడి దారులకు, వ్యాపారస్తుల కోసం ఏర్పాటైంది. యాపిల్ లో సెక్యూరిటీ అనలిస్ట్ గా పని చేసిన సోరెన్ మాక్ బెత్ దీన్ని సంయుక్తంగా ప్రారంభించారు. టాప్ 10 ఇన్నోవేటివ్ కంపెనీల్లో ఒకటిగా, ప్రపంచ అత్యుత్తమ వెబ్ సైట్లలో ఒకటిగా ఇలా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 2013 నాటికే రెండున్నర లక్షల మంది యూజర్లను కలిగి ఉంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలాగన్న దాన్ని తెలిపే వాటిలో ముందుంది.
నెట్ ల్యాబ్స్
గృహాలకు సంబంధించి ఇన్నోవేటివ్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ ఇది. ధర్మోస్టాట్స్, కార్బన్ మోనాక్సైడ్, స్మోక్ డిటెక్టర్లు ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ఉన్నాయి. 2010లో యాపిల్ మాజీ ఉద్యోగులైన టోనీ ఫాడెల్, మ్యాట్ రోగర్స్ దీన్ని ఏర్పాటు చేశారు. సోనీ, ఫిలిప్స్ వంటి ఎన్నో ప్రముఖ కంపెనీలతో ఈ కంపెనీకి భాగస్వామ్యం ఉంది. అయతే, 2014లో దీన్ని గూగుల్ కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్, కెనడాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇన్ క్లింగ్
ఇది ఎంటర్ ప్రైజ్ పబ్లిషింగ్ ప్లాట్ ఫామ్. ఈ-పుస్తకాలు, ఇతర డిజిటల్ సమాచారాన్ని విక్రయిస్తోంది. మ్యాట్ మాక్లిన్స్ అనే యాపిల్ మాజీ ఉద్యోగి దీన్ని 2009లో ఏర్పాటు చేశారు. 2013లో క్యాలిఫోర్నియా విద్యార్థుల కోసం 50 పుస్తకాలను తయారు చేసింది. మొదటి సంవత్సరం ఉచితంగానే చదువుకునే అవకాశం కల్పిస్తోంది.
హాట్ మెయిల్
1996లో ఏర్పాటైన హాట్ మెయిల్ గురించి నెట్ ప్రియుల్లో తెలియని వారుండరు. దీన్ని యాపిల్ మాజీ ఉద్యోగులైన భాటియా, జాక్ స్మిత్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో తొలి మెయిల్ సర్వీసుల్లో ఇది కూడా ఒకటి. అయితే 1998లో దీన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అవుట్ లుక్ డాట్ కామ్ గా మారింది. 36 భాషల్లో అందుబాటులో ఉన్న దీన్ని 40 కోట్ల మందికి పైగా ఉపయోగిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ ఆర్ట్స్
ట్రిప్ హాకిన్స్ దీని ఆవిష్కర్త. ఈయన యాపిల్ మాజీ ఉద్యోగి. స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ గా పనిచేశారు. ప్రపంచంలోని ప్రముఖ గేమింగ్ కంపెనీల్లో ఒకటిగా ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ ను తీర్చిదిద్దారు. తర్వాత ఆన్ లైన్ టీచింగ్ కోసం గాను ఇఫ్ యు కెన్ అనే స్టార్టప్ ను కూడా ప్రారంభించారు.
లింక్డ్ ఇన్
అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ అని తెలిసిందే. యాపిల్, పేపాల్ సహా చాలా కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో రీడ్ హాఫ్ మన్ దీన్ని క్యాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి 43 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.
నెక్ట్స్ అండ్ పిక్సర్
యాపిల్ సహ భాగస్వామి అయిన స్టీవ్ జాబ్స్ దీని ఏర్పాటు వెనుక ఉన్నారు. 1985లో యాపిల్ నుంచి బయటకు వచ్చి మరీ దీన్ని ఏర్పాటు చేశారు. 1996లో యాపిల్ దీన్ని కొనుగోలు చేయడంతో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీకి తిరిగొచ్చారు.
ఆండ్రాయిడ్
ప్రస్తుతం ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ఏలుతున్న ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్ అన్న విషయం తెలిసిందే. 1989 నుంచి 1992 వరకు యాపిల్ లో ఇంజనీర్ గా పనిచేసిన ఆండీ రూబిన్ 2003లో ఆండ్రాయిడ్ ను ప్రారంభించారు. అయితే, 2005లో దీన్ని గూగుల్ కొనుగోలు చేసి తన పెద్ద అస్సెట్ గా మార్చుకుంది.
ట్విట్టర్
దీన్ని 2006లో జాక్ డార్సీ, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్, నోహ్ గ్లాస్ అనే వారు ఏర్పాటు చేశారు. నేడు ప్రపంచంలోని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వీరిలో ఎవాన్ విలియమ్ గూగుల్ మాజీ ఉద్యోగి.
డేసియంట్
సైబర్ నేరగాళ్లు వెబ్ సైట్లపై మాల్వేర్ తో విరుచుకుపడడం తెలిసిందే. వీరి బారిన పడి చాలా సైట్లు మూతపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో సైట్లు మాల్వేర్ బారిన పడకుండా డేసియంట్ రక్షణ కల్పిస్తుంది. నీల్ దస్వాని, షారిఖ్ రిజ్వి ఇద్దరూ గూగుల్ లో పనిచేసిన ఇంజనీర్లే. మెకిన్సే లో పనిచేసిన అమీత్ రణదివేతో కలసి డేసియెంట్ ను స్థాపించారు.
ఊయాలా
ఆన్ లైన్ వీడియో పబ్లిషింగ్ కు అనువైనది ఊయాలా. గూగుల్ మాజీ ఉద్యోగులు సియాన్ కాప్, బిస్ మార్క్ లెపే, బెల్సాసర్ లెపే 2007 లో దీన్ని ఏర్పాటు చేశారు. వీడియో కంటెంట్ కు యాడ్స్ ను జోడించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. డెల్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, హెర్ట్స్ కార్పొరేషన్, టెలిగ్రాఫ్ మీడియా గ్రూపు వంటి దిగ్జజ కంపెనీలు సైతం తమ వీడియో కంటెంట్ కోసం ఈ ప్లాట్ ఫామ్ ను వినియోగించుకుంటున్నాయి.
ఆర్డ్ వార్క్
ఇది ప్రశ్నలు, జవాబుల వేదిక. గూగుల్ మాజీ ఉద్యోగులే దీన్ని ప్రారంభించారు. ఏదైనా యూజర్ ఓ ప్రశ్న అడిగితే దాన్ని యూజర్లకు పంపి వచ్చిన సమాధానాలను ప్రశ్నించిన వారికి చేరవేస్తుంది. ఇదో మంచి ఐడియాగా భావించిన గూగుల్ దీన్ని 5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
ఫ్రెండ్ ఫీడ్
ట్విట్టర్ కు పోటీగా ఏర్పడిందే ఫ్రెండ్ ఫీడ్. దీని ద్వారా యూజర్లు ఫొటోలను, ఆర్టికల్స్ ను, న్యూస్ ను ఫ్ర్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. పౌల్ బుచెత్ గూగుల్ నుంచి బయటకు వచ్చి గూగుల్ లో తనతో కలసి పని చేసిన జిమ్ నోరిస, సంజీవ్ సింగ్, బ్రెట్ టేలర్ తో కలసి ఫ్రెండ్ ఫీడ్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఫెస్ బుక్ 2009లో దీన్ని 5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
మిక్సర్ ల్యాబ్స్
దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి గూగుల్స్ మొబైల్ టీమ్ ఆద్యుడు. గూగుల్ మొబైల్ యాప్స్ లో తొలి ప్రాజెక్ట్ మనేజర్. దీన్ని 2009లో ట్విట్టర్ కొనుగోలు చేసింది. సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇది ట్రాక్ చేస్తుంది.
వెబ్ బేస్డ్ అప్లికేషన్ల అభివృద్ధికి వీలైన యాప్ జెట్ అనే వెబ్ సైట్ కూడా గూగుల్ మాజీ ఇంజనీర్లు ఏర్పాటు చేసిందే. ఇంకా, ఫాస్ట్ స్ప్రింగ్, గ్రీన్ ప్యాచ్, హౌక్యాస్ట్ మీడియా, నెక్ట్స్ స్టాప్ ఇలా ఎన్నో కంపెనీలకు మూలం గూగులే కావడం విశేషం.
గూగుల్ ఇంకుబెటర్
గూగుల్ కంపెనీ ఉద్యోగులు స్టార్టప్ లకు ఆద్యులుగా నిలుస్తుండడంతో యాజమాన్యం వాస్తవాన్ని గ్రహించింది. స్టార్టప్ ల కోసం ఉద్యోగులు బయటకు వెళ్లకుండా నిరోధించేందుకు ఇంకుబేటర్ ను ఏర్పాటు చేయనుంది. కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికైనా సృజనాత్మక ఐడియాలు ఉండి సొంతంగా కంపెనీ ఏర్పాటు చేయాలని భావిస్తే, కంపెనీలో పనిచేస్తూనే తమ కలలను సాకారం చేసుకునేందుకు వీలుగా ఈ ఆలోచనను అమల్లో పెట్టింది. ఇందుకోసం ఏరియా 120 పేరుతో ఓ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం ఉద్యోగులు తమ పని సమయంలో 20 శాతాన్ని తమ సొంత వ్యాపార ప్రాజెక్టుల కోసం కేటాయించుకోవచ్చు.
లిబ్రేట్
ఆన్ లైన్ లో వైద్యులను సంప్రదించి అనారోగ్య సమస్యలపై సలహాలను పొందేందుకు ఏర్పాటైందే లిబ్రేట్ యాప్. దీని ద్వారా డాక్టర్ల అపాయింట్ మెంట్ సైతం పొందవచ్చు. దీన్ని ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి, భారత్ కు చెందిన సౌరభ్ అరోరా ఏర్పాటు చేశారు. అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో డేటా సైంటిస్ట్ గా పనిచేసిన అరోరా 2015లో లిబ్రేట్ ను ఆవిష్కరించారు. లక్ష మంది వైద్యులు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నారు.
క్వోరా
అడామ్ డి ఏంజెలో ఫేస్ బుక్ లో ఒకప్పుడు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఇంజనీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. కానీ, తనలోని నైపుణ్యాలతో ప్రశ్నలు, జవాబులకు వేదికగా నిలిచే క్వోరా అనే వెబ్ సైట్ ను 2009లో ఏర్పాటు చేశారు. అంతకు ఏడాది ముందే ఆయన ఫేస్ బుక్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రశ్న, జవాబుల పరంగా ప్రముఖ వెబ్ సైట్లలో క్వోరా ఒకటిగా పేరు సంపాదించుకుంది. దీని విలువ 40 కోట్ల డాలర్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఫేస్ బుక్ లో పనిచేసిన చార్లీ చీవర్ కూడా క్వోరా ఏర్పాటులో భాగస్వామిగా ఉన్నారు.
ఇంకా ఆసనా, న్యూ రిపబ్లిక్ వార్తా పత్రిక, ఆప్ సుమ్మో, రేడియస్, ఆర్టిల్లరీ, క్లౌడ్ ఎరా, మెమ్ ఎస్ క్యూఎల్, యాప్ స్టోర్స్ వంటి సంస్థలు కూడా ఫేస్ బుక్ మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసినవే.
ఫ్లిప్ కార్ట్
ప్రపంచంలో అమేజాన్ అగ్రగామి కంపెనీ అన్న విషయం తెలుసు. భారత్ లో సైతం అమేజాన్ ఈ కామర్స్ సైట్ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోంది. చిత్రమేమిటంటే ఇక్కడ అమేజాన్ కు గట్టి పోటీదారుగా ఉన్న ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు ఏవరో కాదు. అమేజాన్ మాజీ ఉద్యోగులే. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇద్దరూ కూడా 2007లో ఫ్లిప్ కార్ట్ ఏర్పాటు చేసేంత వరకు అమేజాన్ లో పనిచేశారు.
హ్యాకర్ ర్యాంకర్
దీన్ని అమేజాన్ మాజీ ఉద్యోగి రవిశంకర్ ప్రారంభించారు. హ్యాకర్ ర్యాంకర్ అనేది ఓ సాఫ్ట్ వేర్ టూల్, దీని ద్వారా సంస్థలు తమకు కావాల్సిన ఉద్యోగులను నియమించుకునే సమయంలో వారి నైపుణ్యాలు పరీక్షించడానికి వీలవుతుంది. ఈ టూల్ ను అమేజాన్ సైతం వినియోగిస్తోంది.