వివిధ దేశాల్లో అల్పాహారంగా ఏం తీసుకుంటారో తెలుసా..?

నాలుగు ఇడ్లీ... లేదంటే వడ, కాదంటే ప్లేట్ పూరీ... ఉల్లి దోశ, మసాలా దోశ, బజ్జీ ఇలా రోజుకో వెరైటీతో అల్పాహారాన్ని ముగించడం చాలా మందికి భలే ఇష్టం. ఈ వెరైటీలన్నీ భారతీయుల సొంతం. మరి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలు అల్పాహారంగా ఏం తీసుకుంటారు? అనే ఆసక్తి చాలా మందిలో ఉండే ఉంటుంది. వాటిని వివరించే ప్రయత్నమే ఇది..

భోజనం కంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటేనే చాలా మంది ఉత్సాహంగా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఉదయం అల్పాహారం మనకు కావల్సినంత శక్తినిస్తుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అల్పాహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎన్నో వెరైటీలను అల్పాహారంలో భాగం చేసుకుంటారు. 

representation image

అన్నింటిలోకీ బ్రేక్ ఫాస్టే మిన్న!

క్రితం రోజు రాత్రి 9 గంటల్లోపు భోజనం చేసి ఉంటారు. అప్పటి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఎక్కువ గంటల పాటు జీర్ణాశయం ఖాళీగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న ఉపవాసాన్ని బ్రేక్ చేస్తుంది కనుక అల్పాహారాన్ని బ్రేక్ ఫాస్ట్ అని అంటుంటారు. బ్రేక్ ఫాస్ట్ శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ నిస్తుంది. ఇతర పోషకాలను ఇవ్వడం ద్వారా ఆ రోజు చురుగ్గా ఉండడానికి కావాల్సినంత ఎనర్జీనిస్తుంది.

తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ కండరాల్లో, లివర్ లో గ్లైకోజెన్ గా నిల్వ ఉంటుంది. రాత్రంతా క్రమ క్రమంగా కొద్ది కొద్దిగా ఇది విడుదల అవుతుంది. దీంతో రాత్రంతా 12 గంటల పాటు ఆ గ్లైకోజెన్ శరీరానికి అందుతుంది. కనుక ఉదయానికి ఇది తగ్గిపోతుంది. అందుకే ఆహారం ద్వారా మళ్లీ భర్తీ చేసుకోవాలి. లేకపోతే ఆ మేరకు ప్రతికూల ప్రభావం శరీర జీవక్రియలపై పడుతుంది.

స్కిప్ చేస్తే...?

బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం, తీసుకోకపోవడానికి మధ్య తేడాలు ఏమిటంటే... ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం ప్రకారం... అల్పాహారం తినని చిన్నారులు తినేవారి కంటే లావుగా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారు తెలివితేటల పరంగా చురుగ్గా ఉండలేరు. బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల వారికి నేర్చుకునే సామర్థ్యం తగినంత ఉంటుంది. అల్పాహారం తినడం వల్ల మిగిలిన రోజులో చిరుతిళ్ల అవసరం అంతగా ఉండదు.

ఇరాన్

ఇరానీయుల అల్పాహారం కింగ్ సైజులో ఉంటుంది. గుడ్లను బ్రేక్ చేసి పెనంపై పోసి ఒకవైపు కాల్చి తీసేస్తారు. దానితోపాటు బ్రెడ్, కీరదోస, టమాటా, చీజ్, ఇరానియన్ టీ ఇవన్నీ అల్పాహారంలో భాగమే. చిన్నారులకు సైతం బ్రెడ్, చీజ్, జామ్ కలిపి ఇస్తారు. అలాగే, టీ కూడా తాగేందుకు ఇవ్వడం సాధారణం.

చైనా

చైనా చాలా పెద్ద దేశం. ఎన్నో ప్రాంతాలతో ఉంటుంది. ప్రాంతీయంగా ఒక్కోచోట ఒక్కో విధమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఆచరణలో ఉంది.

representation image courtesy hostel bookers

దిమ్ సమ్: కూరగాయాలు, రొయ్యలు, టోఫు లేదా మాంసం ఈ పదార్థాలన్నింటినీ కలిపి గోధుమలు, లేదా బియ్యం పిండితో కవర్ చేసేస్తారు. వీటిని ఉడికించి తింటుంటారు. ఆ తర్వాత టీ కూడా తప్పనిసరి. గ్రీన్, ఊలాంగ్, జాస్మిన్, క్రిసాంతమెమ్ రకాల్లో ఏదో ఒక టీ తాగుతారు.

స్టీమ్డ్ స్టఫెడ్ బన్స్: పంది మాంసం, కూరగాయాలు, గుడ్లు లేదా బీన్స్ పేస్ట్ అన్నీ కలిపి బన్స్ లా తయారు చేస్తారు. షాంఘై, తియాంజిన్ ప్రాంతాల్లో ఈ వెరైటీ కనిపిస్తుంది.

కాంగీ: ఇది గంజిలాంటిది. బియ్యాన్ని ఎక్కువ నీటిలో రాత్రంతా బాగా ద్రావకంలా ఉడికిస్తారు. దీనికి వారి వారి ఇష్ట ప్రకారం గుడ్లు, కూరగాయలు, మాంసం వంటివి కలుపుకుని తింటారు. ఈ కాంగీ అనేది ఆసియా దేశాల్లో కనిపిస్తుంది.  

నూడుల్స్: ఒక కప్పు నూడుల్స్ ను చైనాలోని పలు ప్రాంతాల్లో బ్రేక్ పాస్ట్ గా తీసుకోవడం ఆచరణలో ఉంది. గోధుమలతో చేసిన నూడుల్స్ ను ఉత్తర చైనా ప్రజలు తింటుంటారు. దక్షిణ చైనాలో రైస్ నూడుల్స్ తీసుకుంటారు. నూడుల్స్ ను లంచ్, బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవడం చైనాలో ఎక్కువగా ఆచరణలో ఉంది.  

representation image courtesy hostel bookers

ఇటలీ

ఫ్రెంచ్ బ్రేక్ ఫాస్ట్ నోరూరిస్తుంది. బాదం గింజలను పొడి చేసి వాటికి వెన్న, చాకొలేట్ క్రీమ్ కలిపి టోస్ట్ చేసి బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఇష్టంగా లాగించేస్తుంటారు.

స్పెయిన్

టమాటా స్లైసెస్ ను బ్రెడ్ ముక్కలతో కలిపి అల్పాహారంగా తీసుకుంటారు. అలాగే, ఆమ్లెట్ ను కూడా అల్పాహారంగా లాగిస్తారు.

ఫుల్ ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్

గుడ్లు, సాస్, బీన్స్, పందిమాంసం, పుట్టగొడుగులు, ఇంకా మరికొన్ని పదార్థాలు, కాఫీ లేదా టీ వీటన్నింటినీ కలిపి ఫుల్ ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ గా చెబుతారు. ఎక్కువగా బ్రిటన్, ఐర్లాండ్ లో ఇది పాప్యులర్.

ఇజ్రాయెల్

తాజాగా తయారు చేసిన బ్రెడ్, చీజ్, జ్యూస్, జామ్, వెన్న ఇవన్నీ ఇజ్రాయెలీల అల్పాహారంలో భాగం.

నెథర్లాండ్స్

యాపిల్ ముక్కలను అట్టుగా పోసుకుని నెథర్లాండ్ లో అల్పాహారంగా తింటారు. దానికి స్ట్రూప్ అనే సిరప్ ను కూడా జోడించుకుంటారు.

అమెరికా

అమెరికాలో మెక్ డొనాల్డ్స్ ఎగ్ మెక్ మఫిన్ అనే ఫాస్ట్ ఫుడ్ ను 19 శాతం మంది అల్పాహారంగా తీసుకుంటుంటారు. ఇంకా కెల్లాగ్స్ ను పాలలో కలుపుకుని, వాటికి పండ్ల ముక్కలు కావాలంటే కలుపుకుని తీసుకుంటారు. ఓట్ మీల్ ను మజ్జిగతో కలుపుకుని తీసుకుంటుంటారు. అలాగే, ఇంట్లోనే మందపాటి దోశ వేసుకుని దాన్ని నల్ల ద్రాక్షలతో కలిపి తింటారు.

స్కాట్లాండ్

గుడ్డు ఆమ్లెట్ గా వేసుకుని దానికి బ్రెడ్, టమాటా, ఆనియన్, ఓట్ మీల్, మాంసం ఇలా నచ్చిన పదార్థాలను యాడ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా స్కాట్లాండ్ లో తీసుకుంటారు.

పోలండ్

గుడ్లు, పాలు, పిండి కలిపి అట్టులా చేసుకుంటారు. దానికి ఫ్రూట్ జెల్లీని కులుకుని తీసుకుంటారు.  

representation image courtesy hostel bookers

ఫిలిప్పీన్స్

మామిడి పండ్ల ముక్కలు, ఆమ్లెట్, రైస్ ను ఫిలిప్సీన్ ప్రజలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేందుకు ఇష్టపడతారు.

థాయ్ ల్యాండ్

చేపలు, పంది మాంసం, ఉడికించిన బియ్యంతో కలిపి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం థాయ్ ల్యాండ్ లో కనిపిస్తుంది.

పెరూ

పెరూలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయినా... తాజా సముద్ర చేపలకు నిమ్మరసం, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడిని జల్లించి డిష్ లా ప్రిపేర్ చేస్తారు. దీన్ని దిట్టంగా లాగించడం అక్కడి వారికి అలవాటు.

బొలీవియా

మన దగ్గర కజ్జికాయలని వినే ఉంటారు. నక్షత్రాకారంలో ఉండే వీటి లోపల మాంసం, కూరగాయలను పెట్టి వాటిని కాల్చి కొంచెం పంచదార యాడ్ చేసుకుని బొలీవియా ప్రజలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

representation image courtesy hostel bookers

ఈజిప్ట్ ప్రజల సూపర్ బ్రేక్ ఫాస్ట్

ఫావా బీన్స్, ముడి శనగలు, వెల్లుల్లి, నిమ్మరసం కలిపి ఉడికిస్తారు. ఇందులో ఆలీవ్ ఆయిల్ కూడా కలుపుతారు. వీటికి కొన్ని కూరగాయల ముక్కలను జోడించుకుని, ఉడికించిన గుడ్డును జత చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఈజిప్ట్ లో చూడవచ్చు.

జపాన్

జపాన్ లోని అల్పాహారాల్లో టోఫు కూడా ఒకటి. టోఫు అంటే సోయా పాలు గడ్డకట్టేట్టు చేసి ముక్కలుగా చేస్తారు. టోఫుకు చేపలు, రైస్ కూడా కలిపి తీసుకుంటారు.

మలేసియా

మలేసియాలో ఎగ్, వెజ్ నూడుల్స్ బ్రేక్ ఫాస్ట్ గా తింటారు. నూడుల్స్ కు గుడ్డును కలిపి కూరగాయల ముక్కలు కలుపుకుని తీసుకుంటుంటారు.

పాకిస్తాన్

అలూ పరాటాను పాక్ ప్రజలు అల్పాహారం ఎక్కువగా తింటుంటారు. ఉడికించిన ఆలుగడ్డలకు మసాల కలిపి, గోధుమపిండితో కలిపి పరాటగా తయారు చేస్తారు. పాక్ లో అలూ పరాటాకు బ్రెడ్, నెయ్యి, కూరగాయల ముక్కలను కూడా కలుపుతారు. వెన్న, స్పైసీ సాస్ తో కలిపి తీసుకుంటారు.

టర్కీ

చీజ్, వెన్న, ఆలివ్స్, గుడ్లు, టమాటాలు, కీరదోస, జామ్, తేనె, స్సైసీతో కూడిన మాంసం ఇవన్నీ టర్కీ ప్రజల బ్రేక్ ఫాస్ట్ లో భాగం.

representation image courtesy hostel bookers

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో ఎక్కువగా తీసుకునే అల్పాహారాల్లో వెజ్ మైట్, బ్రెడ్ అనేది ఒకటి. కూరగాయలు, ఈస్ట్ తో కలిపి పేస్ట్ లా (జామ్ లా) చేస్తారు. దీనికే వెజ్ మైట్ అని పేరు. దీన్ని బ్రెడ్ ముక్కలపై రాసుకుని తింటుంటారు. అలాగే, పందిమాంసం, గుడ్లు, ఉడికించిన బీన్స్ ను కలిపి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు.

ఇక్కడ కేవలం కొన్నింటి గురించే చెప్పుకున్నాం. ఇవి మాత్రమే కాదు. ప్రతీ దేశంలో ప్రాంతాల వారీగా పలు రకాల అల్పాహారాలు ఉన్నాయి.


More Articles