వాట్సాప్ కాదు... ఈ యాప్స్ ట్రై చేశారా...?
‘ఎప్పుడూ వాట్సాప్ లోకమేనా....? ఓ సారి బయటకు వచ్చి చూడు. ఎన్నెన్ని కొత్త చాటింగ్ యాప్స్ ఉన్నాయో తెలుస్తుంది. కొత్తగా ట్రై చేయి డూడ్’ ఇది ఓ ఇద్దరు కాలేజీ విద్యార్థుల సంభాషణ. నిజమే టెక్ ప్రపంచంలో ఎప్పుడూ ఒకేదాన్ని పట్టుకుని వేలాడడం నేటి యువతకు అస్సలు నచ్చదు. మరి సరికొత్త యాప్ ప్రపంచం గురించి తెలుసుకుందామా..?
హైక్
హైక్ అతి స్వల్ప కాలంలోనే ఎక్కువ మందికి చేరువైన మెస్సేజింగ్ యాప్. గత జనవరికి పది కోట్ల మంది హైక్ కుటుంబంలో చేరినట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లపై పనిచేస్తుంది. వాటికి సంబంధించిన ప్లే స్టోర్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హైక్ కుటుంబంలో లేని వారికి ఉచితంగా మెస్సేజ్ లు పంపుకోవచ్చు. హిడెన్ (కనిపించకుండా) చాట్ చేసుకునే సదుపాయం. ఒకేసారి పీడీఎఫ్, జిప్ ఫైల్స్ ను 100 ఎంబీ వరకు పంపించుకోవచ్చు.
నేడు దాదాపుగా ప్రతీ స్మార్ట్ ఫోన్ యూజర్ వాట్సాప్ తో కనెక్ట్ అయి ఉన్నారు. కానీ, హైక్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. వాట్సాప్ లో యాడ్స్ కనిపించవు. వాట్సాప్ ను విండోస్ డెస్క్ టాప్ కంప్యూటర్లలో, క్రోమ్ వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. హైక్ లో ఇంకా ఈ సదుపాయం రాలేదు. భారతీ ఎయిర్ టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుమారుడు కవిన్ భారతీ మిట్టల్ దీని వ్యవస్థాపకుడు.
ఆఫ్ లైన్ చాట్
డేటా లేకపోయినా హైక్ యాప్ ద్వారా మెస్సేజ్ పంపుకోవచ్చు. హైక్ లో ఉన్న అత్యుత్తమ ఫీచర్లలో ఇది కూడా ఒకటి. ఇలాంటి ఫీచర్ ను అందిస్తున్న తొలి ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ కూడా ఇదే. వాట్సాప్ లో ఇది లేదు. ఆఫ్ లైన్ చాట్ అంటే ఎలా పనిచేస్తుందన్న సందేహం వస్తుంది. హైక్ యాప్ ద్వారా మెస్సేజ్ పంపాలంటే కచ్చితంగా డేటా ఉండి తీరాలి. డేటా లేకుండా మెస్సేజ్ పంపడం సాధ్యం కాదు. అయితే, ఆ మెస్సేజ్ అందుకోవాల్సిన అవతలి వైపు వ్యక్తి డేటా ఆఫ్ లో ఉంచితే అప్పుడు ఆఫ్ లైన్ చాట్ పని మొదలవుతుంది.
మెస్సేజ్ సెండ్ చేసిన నిమిషం వరకు ఆ మెస్సేజ్ డెలివరీ తీసుకోవాల్సిన యూజర్ ఆఫ్ లైన్ లో ఉంటే వారి రిజిస్టర్ మొబైల్ నంబర్ కు హైక్ టెక్ట్స్ మెస్సేజ్ పంపించాలా? అని అడుగుతుంది. సెండ్ అని ఓకే చెప్తే ఎస్ఎంఎస్ వెళ్లిపోతుంది. అప్పుడు సదరు వ్యక్తి బదులు ఇవ్వాలంటే డేటా ఆన్ చేసుకుని హైక్ మెస్సెంజర్ ద్వారా చాట్ చేయాల్సి ఉంటుంది. లేదా మెస్సేజ్ ద్వారా రిప్లయ్ ఇవ్వవచ్చు.
ప్రతీ హైక్ యూజర్ కు నెలలో 100 ఎస్ఎంఎస్ ల వరకే ఉచితం. ఆ పరిమితి దాటిన తర్వాత సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి.. హైక్ డైరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని ద్వారా దగ్గర్లో ఉన్న వారితో ఆఫ్ లైన్ లోనూ మెస్సేజ్ చేసుకోవచ్చు. ఇది షేర్ ఇట్ ను ఉపయోగించి దగ్గర్లోని ఫోన్ కు కనెక్ట్ అవుతుంది. కేవలం 100 మీటర్ల పరిధిలోనే ఉన్న వారి ఫోన్లతోనే అనుసంధానం సాధ్యం. అయితే, దీనికి బదులు సాధారణ ఎస్ఎంఎస్ లే పంపుకోవచ్చుగా అన్నది యూజర్ల అభిప్రాయంగా ఉంది.
స్టిక్కర్లు
హైక్ లో మంచి మంచి స్టిక్కర్ల కలెక్షన్ ఉంది. హావ భావాలను చక్కని గుర్తుల రూపంలో తెలియచేయడానికి ఇవి ఉపకరిస్తాయి. అంటే వాట్సాప్ లో ఎమోటికన్స్ లేవని కాదు. కానీ స్టిక్కర్లు హైక్ లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన మెస్సేజింగ్ యాప్స్ తో పోలిస్తే హైక్ లో చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయని యూజర్లు చెబుతున్నారు.
రహస్య చాటింగ్
మీ ఫోన్ లో హైక్ ద్వారా చేసే చాట్ ఇతరుల కళ్ల పడకుండా ఉండేందుకు హిడెన్ చాట్ మోడ్ ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం కాంట్టాక్ పై ఫింగర్ తో ప్రెస్ చేసి ఉంచితే మరొక స్మాల్ విండో ఓపెన్ అయ్యి అందులో హిడెన్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి పాస్ వర్డ్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది. ఇక ఆ కాంటాక్ట్ తో చేసే చాట్ ను వేరెవరూ చూడలేరు. తిరిగి అన్ హైడ్ చేసే వరకు మీ మధ్య సంభాషణ పూర్తిగా రహస్యమే.
చాట్స్ విండో పై భాగంలోని హైక్ ఐకాన్ వద్ద టాప్ చేస్తే పాస్ వర్డ్ సెలక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ కాంటాక్ట్ ను అయినా హిడెన్ మోడ్ లో ఉంచాలన్నా, తొలగించాలన్నా పాస్ వర్డ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. పాస్ వర్డ్ మర్చిపోతే రీసెట్ హిడెన్ మోడ్ ని ఎంచుకోవడం మినహా వేరే మార్గం లేదు.
అన్ని ఫార్మాట్ ఫైల్స్ ను పంపుకోవచ్చు
హైక్ నుంచి హైక్ వాడని వారికి కూడా ఎస్ఎంఎస్ లు పంపుకునే అవకాశం కూడా ఉంది. అయితే, ఒక నెలలో ఇలా పంపుకునే ఉచిత ఎస్ఎంఎల్ లు కేవలం కొన్నే. హైక్ లో రివార్డులు అందుకునే మరో అదనపు ఆకర్షణ ఉంది. వాట్సాప్ లో ఫొటో, వీడియో, మ్యూజిక్, పీడీఎఫ్ వంటి ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. కానీ హైక్ లో అన్ని రకాల ఫార్మాట్ ఫైల్స్ ను షేర్ చేసుకునే అటాచ్ మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీ వరకు ఒకే ఫైల్ గా పంపుకోవచ్చు.
నెలనెలా అప్ డేట్
హైక్ ప్రతీ నెలా అప్ డేెటెడ్ వర్షన్ తో ముందుకు వస్తోంది. ప్రతిసారీ అదనపు హంగులు అద్దుకుంటోంది. చాట్ హిస్టరీని సింపుల్ గా బ్యాకప్ తీసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయినా ఇబ్బందేమీ లేదు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాట్స్ బ్యాకప్ లో స్టోర్ అవుతాయి. వాటిని రిస్టోర్ చేసుకోవచ్చు. హైక్ అప్ డేషన్ సమయంలోనూ చాట్ బ్యాకప్ చేయాలా? అని అడుగుతుంది. హైక్ లో 128 బిట్ పైరసీ రక్షణ ఉంటుంది. వైఫై వాడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని మరీ దీన్ని రూపొందించారు. పైగా హైక్ లో 500 మంది వరకు ఒకే గ్రూప్ కింద ఉండవచ్చు. వాట్సాప్ లో ఇది 250గానే ఉంది. వాట్సాప్ ను మించిన ప్రపంచ స్థాయి ఫీచర్లు హైక్ లోనే ఎక్కువని నిపుణుల అభిప్రాయం.
కకావో టాక్ Kakao Talk
ఈ ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 15 బాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. వీడియో కాలింగ్ చేసుకునే ఫీచర్, యానిమేషన్ ఎమోటికన్స్, యూజర్ల మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడం దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్ల యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దక్షిణ కొరియాలో 93 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో కకావో టాక్ కనిపిస్తుంది. సియోల్ కు చెందిన కకావో ఇంక్ ఈ యాప్ ను డెవలప్ చేసింది. ప్రపంచంలోని ప్రముఖ ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్స్ లో ఇది కూడా ఒకటి. యూజర్లు యూనిక్ థీమ్స్ ను వారంతట వారే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ తో కలసి ఈవెంట్స్ ను యాప్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కొరియాలో మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల మంది ఈ యాప్ లో సభ్యులుగా ఉన్నారు. ఒక గ్రూప్ లో ఇంత మందే అన్న నియంత్రణ లేదు. కకావో టాక్ ఐడీ సాయంతో కొత్త ఫ్రెండ్స్ ను అన్వేషించుకోవచ్చు. చాట్ హిస్టరీని సేవ్ చేసుకునే సదుపాయం ఉంది.
ఇందులో ప్లస్ ఫ్రెండ్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు, బ్రాండ్స్, సెలబ్రిటీలను ఫాలో అవడం ద్వారా వారు చేసే పోస్ట్ లను ప్రత్యేకంగా అందుకోవచ్చు. కకావో టాక్ పీసీ ద్వారా కంప్యూటర్ పై కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ పై లాగవుట్ అవకుండా మర్చిపోయి బయటకు వచ్చేశారు. అయినా ఆందోళన చెందక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ నుంచే డిస్ కనెక్ట్ చేయవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి పీసీ వర్షన్ టు లాగవుట్ ఆఫ్ యువర్ పీసీ యాక్టివిటీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కకావో పీసీ నుంచి కాల్స్ కూడా చేసుకోవచ్చు. 100 ఎంబీ ఫైల్ సైజు వరకు పంపుకునే వెసులుబాటు ఉంది. ఎక్సెల్ షీటు తెలిసే ఉంటుంది. యూజర్లు ఈ ఎక్సెల్ షీటు మోడల్ లో చాట్స్ చేసుకునే సదుపాయం ఇందులో ప్రత్యేకం.
లైన్ మెస్సెంజర్ http://line.me/en/
ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్ బెర్రీ ఫోన్లకు ఇది కంపాటిబుల్. విండోస్, మాక్ పీసీలపై కూడా పనిచేస్తుంది. ఇందులోనూ స్టిక్కర్ల సదుపాయం ఉంది. వాటి ద్వారా హావభావాలను చక్కగా తెలియజేయవచ్చు. ఇందులో యూనిక్ ఫీచర్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్ ను వెంటనే యాడ్ చేసుకోవాలంటే సింపుల్ గా మీ ఫోన్, ఫ్రెండ్ ఫోన్ ను పక్క పక్కనే పట్టుకుని షేక్ చేస్తే చాలు... మీ యాప్ లో ఫ్రెండ్ యాడ్ అయిపోతారు. 60 కోట్లకుపైనే యూజర్లు ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. జపాన్ లో అత్యధికంగా వినియోగించేది దీన్నే. ఈ యాప్ జపాన్ కు చెందిన కంపెనీ జపాన్ ప్రజల కోసం రూపొందించినది. తర్వాత మిగిలిన దేశాలకు వ్యాపించింది.
హిడెన్ చాట్స్ సదుపాయం ఇందులోనూ ఉంది. అంటే యూజర్లు తమ ఫ్రెండ్స్ తో చేసే చాట్, పంపుకునే ఇతర సమాచారం సెకండ్లలోనే కనిపించకుండా పోతుంది. ఎంత సమయం అన్నది యూజర్లే సెట్ చేసుకోవచ్చు. నిమిషం అని సెట్ చేసుకుంటే నిమిషం క్రితం చేసిన చాట్ అంతా కనిపించకుండా పోతుంది. లైన్ సర్వర్లలోనూ డిలీట్ అయిపోతుంది. ఇందులో ఉన్న మరో చక్కని ఫీచర్ గ్రూప్ కాలింగ్. గ్రూప్స్ లో ఒకరికంటే ఎక్కువ మందితో ఏకకాలంలో మాట్లాడుకునే వెసులుబాటు ఉంది. ఏకకాలంలో 200 మంది వరకూ ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. లైన్ ఫోన్ కాలింగ్, చాటింగ్ విషయంలో స్కైప్ కంటే ఫాస్ట్.
ఫేస్ బుక్ మెస్సెంజర్
ఫేస్ బుక్ వాట్సాప్ ను కొనుగోలు చేయడానికంటే ముందే మెస్సేంజర్ పేరుతో ఓ ఇన్ స్టంట్ యాప్ ను తీసుకొచ్చింది. దీనిలోనూ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. మెస్సేజ్ పంపించిన తర్వాత అది ఎప్పుడు డెలివరీ అయ్యింది, అవతలి వ్యక్తి దాన్ని ఎప్పుడు చూశారు అన్న విషయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికైనా హెచ్ డీ వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అవతలి వైపున్న వారిని చూసుకోవచ్చు. కేవలం డేటాకే చార్జ్ పడుతుంది.
ఏదైనా లొకేషన్ కు సంబంధించి మ్యాప్ ను సెండ్ చేయవచ్చు. మీరు ఎక్కడున్నారు, ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ కలుసుకోవాలనే విషయాలను తెలియజేస్తూ సంబంధిత లొకేషన్ కు ఎలా రావాలో మ్యాప్ రూపంలో సులభంగా తెలియజేయవచ్చు. రకరకాల స్టిక్కర్లను పుంపుకునే ఫీచర్ ఇందులోనూ ఉంది. డెబిట్ కార్డ్ యాడ్ చేసుకోవడం ద్వారా మనీ పంపేందుకు, స్వీకరించేందుకు అవకాశం ఉంది. ఈ సదుపాయం మన దగ్గర లేదు. అయితే, త్వరలోనే ఇక్కడ కూడా ప్రారంభించాలనే సన్నాహాల్లో ఫేస్ బుక్ ఉంది.
100 కోట్ల మంది సభ్యుల మార్క్ ను ఫేస్ బుక్ మెస్సెంజర్ ఇటీవలే చేరింది. డెస్క్ టాప్ కంప్యూటర్ పై కూడా ఫేస్ బుక్ మెస్సెంజర్ ను ఉపయోగించుకోవచ్చు. కావాలనుకుంటే లొకేషన్ ను షేర్ చేసుకోవచ్చు. వీడియో చాట్ సదుపాయం ఉంది. ఫేస్ బుక్ అకౌంట్ తో సంబంధం లేకుండా ఎవరైనా సరే తమ ఫోన్ నంబర్ ఆధారంగా మెస్సెంజర్ లో యాడ్ అయిపోవచ్చు. ఒకటికి మించిన అకౌంట్స్ ను యాడ్ చేసుకోవచ్చు. ఫేస్ బుక్ లో లాగిన్ అయ్యే అవసరం లేకుండానే మెస్సెంజర్ డాట్ కామ్ యాప్ వినియోగించుకోవచ్చు.
మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేకుండా మీకు మెస్సేజ్ లను పంపుతుంటే వాటిని మెస్సేజ్ రిక్వెస్ట్ గా మెస్సెంజర్ పరిగణిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో వారి రిక్వెస్ట్ లను చూపించదు. చూడాలంటే యాప్ లో దిగువ భాగంలో కుడివైపు మీ దగ్గర టాప్ చేయాలి. అక్కడ మెస్సేజ్ రిక్వెస్ట్ లు కనిపిస్తాయి. సీ ఫిల్టర్డ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఫేస్ బుక్ హైడ్ చేసి వాటిని చూడవచ్చు. గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. ఏక కాలంలో 50 మందికి కాల్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
బీబీఎం
బ్లాక్ బెర్రీ మెస్సెంజర్ బ్లాక్ బెర్రీ ఫోన్లపై మాత్రమే కాదు ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్లపైనా పనిచేస్తుంది. దీనిలో అత్యంత భద్రతకు హామీ ఉంది. ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్ తో పనిలేకుండా ప్రతీ యూజర్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్) ఆధారంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే యూజర్ నేమ్ అంటారు. ఇటువంటి విధానం బ్లాక్ బెర్రీలోనే ఉంది. అంటే మీకు తెలిసిన వారు, మీరు అనుమతిస్తే తప్ప మీ కాంటాక్ట్ లిస్ట్ లోకి చేరలేరు, మీకు మెస్సేజ్ చేయలేరు. యూజర్ల సంభాషణలను బ్లాక్ బెర్రీ సైతం తెలుసుకోలేదు. మెస్సేజ్ సెండ్ చేసిన తర్వాత అది ఫైర్ వాల్ ద్వారా బ్లాక్ బెర్రీ సర్వర్లను చేరుతుంది. రిసీవర్ ఫోన్ లో ఉండే ప్రైవేటు కీ ద్వారానే అవి డీక్రిప్ట్ అవుతాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వలే డెస్క్ టాప్ అప్లికేషన్ సదుపాయం ఇందులో లేదు. యూజర్ లొకేషన్ ను షేర్ చేసుకోవచ్చు.
ఒకేసారి అందరికీ మెస్సేజ్ లు పంపుకునేందుకు ఇందులో అవకాశం ఉంది. గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. 50 మంది వరకు గ్రూప్ చాట్ లో యాడ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. గ్రూప్ చాట్ లో భాగంగా ఇమేజ్ లు, వీడియో, ఆడియో, కాంటాక్ట్ సమాచారాన్ని పంచుకోవచ్చు. బీబీఎం వర్షన్ ను బట్టి ఒక గ్రూపులో 30 నుంచి 50 మందికి మించి యాడ్ చేసుకునే అవకాశం లేకపోవడం ప్రతికూలతగా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ కు కూడా అవకాశం ఉంది. పంపించిన మెస్సేజ్ లకు టైమ్ సెట్ చేయవచ్చు. 1, 3, 5, 10, 15, 25 సెకండ్లలో ఏదో ఒకదాన్ని సెట్ చేస్తే ఆ సమయం తర్వాత మెస్సేజ్ లు కనిపించవు. వాట్సాప్ తో పోలిస్తే బీబీఎంలో ఎమోజీ ఐకాన్స్ తక్కువ.
స్నాప్ చాట్
ఇది ఫొటో, వీడియో మెస్సేజింగ్ యాప్. ఫొటోలు, వీడియోలను పంపుకోవడానికి చాలా అనువైనది. పంపిన వాటిని అవతలి వైపు వారు చూసిన తర్వాత పది సెకండ్లలోనే డిలీట్ అయిపోతాయి. ఫొటో లేదా వీడియోలకు కేప్షన్ చేర్చి పంపుకోవచ్చు. కేప్షన్ ను బోల్డ్, అండర్ లైన్ చేసే ఫీచర్ కూడా ఉంది. వీడియో స్నాప్స్ కు యానిమేట్ కేప్షన్లు కూడా యాడ్ చేయవచ్చు. అంటే ఎమోజీలన్న మాట. స్నాప్స్ కు స్టిక్కర్లను కూడా యాడ్ చేయవచ్చు. ఇవి చదివిన వెంటనే కనుమరుగవుతాయి. ఇలా కాకుండా 24 గంటల పాటు కనిపించే ఫొటోలను కూడా మిమ్మల్ని అనుసరించే వారు లేదా ప్రపంచ వ్యాప్తంగా స్నాప్ చాట్ యూజర్లకు పంపవచ్చు. ఇందుకోసం పంపే సమయంలో మై స్టోరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అలా అయితేనే అవి వెంటనే డిలీట్ అయిపోకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. మీరు పంపిన ఫొటోలను ఎవరెవరు చూశారో కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ కు నేరుగా మెస్సేజ్ చేసుకోవచ్చు. లైవ్ వీడియో చాట్ ఆప్షన్ కూడా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఫొటోలు, వీడియో ప్రియులకు ఇది అనువైన యాప్. 2011లోనే ఈ యాప్ మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది స్నాప్ చాట్ లో సభ్యులు, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంది.
కిక్ మెస్సేంజర్
కెనడా కంపెనీ కిక్ ఇంటరాక్టివ్ రూపొందించిన యాప్ ఇది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్లపై పనిచేస్తుంది. దీని ద్వారా మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలు, స్కెచ్ లు షేర్ చేసుకోవచ్చు. 2015 డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో 40 శాతం మంది అమెరికాలోని టీనేజర్లే. ఫొన్ నంబర్ లేకుండా ఈ యాప్ లో చేరే అవకాశం ఆకర్షణీయం. పేరు, ఈ మెయిల్, పుట్టినతేదీ ఇస్తే చాలు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు అన్నీ పంపించిన కొద్ది సేపటికే డిలీట్ అయిపోతాయి. మీ నెట్ వర్క్ పరిధిలో లేని వారు మీకు మెస్సేజ్ చేస్తే అది బ్లర్ గా కనిపిస్తుంది. ఇలాంటి సందేశాలు కూడా చూడాలంటే దానికో ఆప్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరినైనా మీ సమూహంలోకి ఆహ్వానించవచ్చు. గ్రూప్ చాట్ కు కూడా అవకాశం ఉంది. ఇన్ స్టా గ్రామ్, సోషల్ కామ్, విడ్డీ వంటి వాటితో అనుసంధానం అయిపోవచ్చు. మీ స్టేటస్ ఏంటో అందరికీ తెలిసేలా పెట్టుకోవచ్చు. అంటే రిలేషన్ లో ఉన్నారా, బ్రేక్ అప్ అయ్యిందా, ఎంగేజ్డ్, మ్యారీడ్ ఇలా అన్నమాట.
వీ చాట్
వాయిస్, వీడియో కాలింగ్, ఫొటో షేరింగ్, గేమ్స్, వాయిస్ మెస్సేజ్, టెక్స్ట్ మెస్సేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. నిజానికి యూనిక్ ఫీచర్లతో కూడిన యాప్ ఇదని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయ్యేందుకు ఉద్దేశించినదీ యాప్. వాకీ టాకీ సదుపాయం ఉంది. దీనిలో చాటింగ్ సమయంలో గ్రూప్ సభ్యులతో లైవ్ లో మాట్లాడుకోవచ్చు. వాయిస్ చాట్ లో రికార్డ్ చేసిన మెస్సేజ్ ను వెంటనే పంపించేందుకు వీలుంది.
వీ చాట్ అకౌంట్ ను ఫేస్ బుక్, ట్విట్టర్ కు అనుసంధానం చేసుకుంటే ఫొటో క్లిక్ మనిపించిన వెంటనే వాటిల్లోకి చేరిపోతుంది. అయితే, అది మీ నియంత్రణలోనే ఉంటుంది. స్టిక్కర్స్ సదుపాయం ఇందులోనూ ఉంది. ఫ్రెండ్ రాడార్ ద్వారా స్నేహితులను పట్టుకోవచ్చు. మీకు సమీపంలో వీ చాట్ లో ఉన్న వారి గురించి ప్రొఫైల్ పిక్స్, యూజర్ నేమ్స్ తో పాటు చూపిస్తుంది. వారిలో నచ్చిన వారి ఐకాన్ పై ఓకే చేయడం ద్వారా ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోవచ్చు. చివరి ఏడు రోజుల చాట్ హిస్టరీని బ్యాకప్ పొందవచ్చు. కొత్త ఫోన్లోకి బదిలీ కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్ పైనా యాప్ ను యాక్సస్ చేసుకోవచ్చు. కాకపోతే వాట్సాప్ లో వలే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.
షేక్...
ఇది షేక్ చేసే ఫీచర్. వీ చాట్ యాప్ ను ఓపెన్ చేసి ఫోన్ ను షేక్ చేయడం ద్వారా కొత్త ఫ్రెండ్స్ ను పరిచయం చేసుకోవచ్చు. అదే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో షేక్ చేస్తున్న వారిలోంచి కొంత మందిని పట్టుకొచ్చి స్ర్కీన్ పై చూపిస్తుంది. వారిలో ఎవరికైనా మెస్సేజ్ పంపుకోవడం ద్వారా స్నేహితులను చేసుకోవచ్చు. షేక్ చేసే ముందు లొకేషన్ ను ఆన్ చేసుకోవాలి. మీకు సమీపంలో వీ చాట్ వాడుతున్న వారి గురించి తెలియజేస్తుంది. వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించుకోవచ్చు.
డ్రిఫ్ట్ బాటిల్...
ఇది కూడా గమ్మత్తయిన ఫీచర్. టెక్ట్స్, వాయిస్ మెస్సేజ్ లను బాటిల్ రూపంలో పంపుకోవచ్చు. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీ చాట్ యూజర్లలో రాండమ్ విధానంలో ఎవరికో ఒకరికి వెళుతుంది.
టెలిగ్రామ్ https://telegram.org/
సెకండ్లలోనే మెస్సేజ్ దానంతట అదే డిలీట్ అయ్యే ఆప్షన్ ఇందులోనూ ఉంది. ఒకేసారి రెండు వైపులా ఫోన్లలోనూ డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత సర్వర్లలోనూ ఉండదు. కాకపోతే ఎంత టైమ్ తర్వాత డిలీట్ అవ్వాలన్నది యూజర్ల ఇష్టం. 1.5 జీబీ సైజు ఫైల్ ను కూడా సులభంగా పంపుకోవచ్చు. ఒకే గ్రూప్ లో ఐదు వేల మందికి కూడా చోటు ఉండడం అదనపు ఆకర్షణీయాంశం. ఇందులోనూ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంది. అంటే చాట్ సంభాషణ చాట్ చేసుకుంటున్న వారు తప్ప ఇంకెవరూ చదవలేరు. విండోస్, లైనక్స్ డెస్క్ టాప్ లపైనా పనిచేస్తుంది. జర్మీనికి చెందినది ఈ యాప్. ఎటువంటి డాక్యుమెంట్లు అయినా పంపుకోవచ్చు. మీడియాను క్లౌడ్ ప్లాట్ ఫామ్ లో సేవ్ చేసుకోవడం ద్వారా ఎక్కడి నుంచైనా యాసెస్ చేసుకోవడానికి వీలుంది. సబ్ స్క్రీప్షన్ ఫీజులు, ప్రకటనల తలనొప్పి లేదు. ఒక విధంగా చాట్, మీడియా సైజు పరంగా నియంత్రణలు లేవు. పది కోట్ల మందికి పైనే యూజర్లు టెలిగ్రామ్ కుటుంబంలో చేరిపోయారు.
డెస్క్ టాప్ పై పూర్తి స్థాయి యాప్
వాట్సాప్ ను డెస్క్ టాప్ పై వాడుకోవాలంటే... వెబ్.వాట్సాప్.కామ్ సైట్ ను తెరచి, వాట్సాప్ యాప్ ను ఫోన్లో ఓపెన్ చేసి అందులో వెబ్ వాట్సాప్ ఫీచర్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తేనే గానీ కనెక్ట్ అవదు. ఫోన్ ను తీసుకుని ఓ సారి బయటకు వెళ్లి వచ్చే లోపల అది డిస్ కనెక్ట్ అయినా అయిపోవచ్చు. పైగా మొబైల్ డేటా కూడా ఉండి ఉండాలి.
కానీ, టెలిగ్రామ్ అలా కాదు. చాలా సులభం. కంప్యూటర్ పై టెలిగ్రామ్ యాప్ ను మొదటి సారి తెరిచినప్పుడు మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. దీన్ని ఎంటర్ చేయడం ఆలస్యం టెలిగ్రామ్ యాప్ రెడీ. ఇక ఆపై మొబైల్ తో పనిలేదు. అంటే మొబైల్ డేటా కూడా అవసరం లేదు. ఇక ఆపై కోరుకున్నంత వరకూ ఈ యాప్ డెస్క్ టాప్ పై పనిచేస్తుంది. అచ్చంగా మొబైల్ యాప్ వలే పనిచేయడం దీని ప్రత్యేకత.
వాట్సాప్ లో ఒకేసారి పది వీడియోలు లేదా ఫొటోలు మాత్రమే పంపుకోవడమనే పరిమితి ఉంది. టెలిగ్రామ్ లో 500 వీడియోలు అయినా పంపుకోవచ్చు. వాట్సాప్ లో ఒక సినిమాను షేర్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే 16ఎంబీ సైజును మించి వీడియో ఉండరాదు. అదే డాక్యుమెంట్లు అయితే 100 ఎంబీకే పరిమితం. కానీ, టెలిగ్రామ్ లో మూవీని ఎలాంటి పరిమితి లేకుండా పంపుకోవడం సాధ్యం. అన్ని రకాల ఫార్మాట్ లను సపోర్ట్ చేస్తుంది.
వాట్సాప్ లో సన్నిహితులతో చాట్ చేస్తున్నారు. అవతలి వ్యక్తి మీకో స్వీట్ వీడియో పంపించారు. దాన్ని చూడాలంటే ఓపెన్ చేయాలి. అంటే ప్రత్యేకంగా వీడియో విండో ఓపెన్ అయిపోతుంది. దాన్ని చూస్తూ చాట్ చేయడం సాధ్యం కాదు. కానీ, అదే వీడియోను టెలిగ్రామ్ లో పంపించి ఉంటే వీడియో చూస్తూనే చాట్ చేసుకోవచ్చు. జీఐఎఫ్ ఇమేజ్ లను టెలిగ్రామ్ లో పంపుకోవచ్చు. టెలిగ్రామ్ లో యూజర్ నేమ్ ను ఎంచుకునే ఆప్షన్ ఉంది. దాని ద్వారా ఇతర యూజర్లు మీ యూజర్ నేమ్, కాంటాక్ట్ ఐడీని మాత్రమే చూడగలరు. వాట్సాప్ లో కాంటాక్ట్ నంబర్లే కనిపిస్తాయి. టెలిగ్రామ్ యాప్ లో రెండు అకౌంట్లు మీ పేరున క్రియేట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లో ప్రైమరీ మెయిల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. కావాలంటే మరిన్ని మెయిల్ అకౌంట్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ లోనూ. రెండు నంబర్లు ఉంటే వేర్వేరు అకౌంట్లను ఒకేసారి ఓపెన్ చేసి ఉంచడం ద్వారా వేర్వేరు కాంటాక్ట్స్ తో టచ్ లో ఉండవచ్చు. టెలిగ్రామ్ లో ఉన్న ప్రతికూలత వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం లేకపోవడమే.
సిగ్నల్
భద్రతతో కూడిన యాప్స్ లలో ఇది కూడా ఒకటి. ప్రతీ సందేశానికి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. గ్రూప్ చాట్ కు కూడా ఎన్ క్రిప్షన్ ఉంది. ఈ ఎన్ క్రిప్షన్ కోసం ఇరువైపుల వారు ఒకటే వర్షన్ అప్లికేషన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై పనిచేస్తుంది. మొబైల్ నంబర్ ఆధారంగా ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్ట్స్, ఫొటో, వీడియో సందేశాలను పంపుకోవచ్చు.
నింబజ్
కాల్, మెస్సేజింగ్ యాప్ ఇది. ఫైల్స్ ను కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ విండోస్, మ్యాక్ కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కామన్ లాగిన్ కింద ఫేస్ బుక్, గూగుల్ టాక్ ఫ్రెండ్స్ తోనూ నింబజ్ ద్వారా కనెక్ట్ అయిపోవచ్చు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ఐఫోన్, కంప్యూటర్లపై వీడియో కాల్స్ ను సపోర్ట్ చేస్తుంది. కాల్ క్వాలిటీ బాగుంటుంది. వాయిస్ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. నింబజ్ యూజర్ల మధ్య కాలింగ్ ఉచితం. కాన్ఫరెన్స్ విధానంలో వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఫేస్ బుక్, విండోస్ లైవ్ మెస్సెంజర్, యాహూ, ఐసీక్యూ, ఏఐఎం, గూగుల్ టాక్, మై స్పేస్, హైవెస్ వంటి నెట్ వర్క్ లలో ఉన్న ఫ్రెండ్స్ తోనూ నింబజ్ యాప్ ద్వారా చాట్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి పైగా దీన్ని వినియోగిస్తున్నారు. నెథర్లాండ్స్ కు చెందిన నింబజ్ బీవీ దీని రూపకర్త.
గూగుల్ హ్యాంగవుట్స్
ఇది కూడా పాప్యులర్ యాప్. వీడియోచాట్, టెక్ట్స్ చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. పది మంది వరకు యూజర్లతో గ్రూప్ వీడియో చాట్ కు కూడా అవకాశం ఉంది. చాట్ హిస్టరీ ఆన్ లైన్ లో సేవ్ అవుతుంది. పంపిన సందేశం అవతలి వైపు వ్యక్తి చదవడానికి ఎంత సమయం పడుతుందీ తెలియజేస్తుంది. సంభాషణల సమయంలోనే ఫొటోలను పంపుకోవచ్చు. అవి ఆటోమేటిక్ గా గూగుల్ + ఆల్బమ్ లో అప్ లోడ్ అవుతాయి. యానిమేటెడ్ ఎమోజీ, స్టిక్కర్ల ఆప్షన్ కూడా ఉంది. హ్యాంగవుట్ యాప్ లోనే కాకుండా జీమెయిల్, గూగుల్ + వెబ్ సైట్ ద్వారానూ ఈ సేవలు వినియోగించుకోవచ్చు.
స్కైప్
దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలుసు. విండోస్, ఓఎస్ఎక్స్, లైనక్స్ ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్ ఆధారిత కంప్యూరట్లలో పనిచేస్తుంది. అలాగే, విండోస్ ఫోన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్ బెర్రీ ఫోన్లలోనూ పనిచేస్తుంది. కాల్స్, మెస్సేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ కూడా ఉంది. స్క్రీన్లు, ఫొటోలు, ఫైల్స్ ను కూడా సెండ్ చేసుకోవచ్చు. స్కైప్ వీడియో కాలింగ్ కు చక్కని యాప్. పీసీ పై కూడా చక్కగా పనిచేస్తుంది. దీని వీడియో స్పష్టతను ఇతర యాప్స్ తో పోల్చలేం.
వైబర్
ఉచితంగా కాల్స్, మెస్సేజ్ లు, వీడియో మెస్సేజ్ లకు అనువైనది ఈ యాప్. అన్ని రకాల స్మార్ట్ పోన్లు, కంప్యూటర్లపై పనిచేస్తుంది. మొబైల్ నంబర్ ఆధారంగా అన్ని డివైజ్ లపై ఒకటే ఖాతా నిర్వహించుకోవచ్చు. ఒకే సారి ఒకరికి మించి ఎక్కువ మందితో చాట్ చేస్తుంటే సులభంగా చాట్ రూమ్ కు మారిపోయేందుకు వెసులుబాటు ఉంది. యూజర్లను బ్లాక్ చేసుకునే సౌలభ్యం ఉంది. మీరు ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ తెలుసుకోకుండా ప్రైవసీ ఆప్షన్ ఉంది. నోటిఫికేషన్లతో డిస్టర్బ్ లేకుండా వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ప్రతీ సందేశానికి ఫోన్ స్క్రీన్ లైట్ ఆన్ అవకుండా కూడా చేసుకోవచ్చు. 78 కోట్ల మంది దీనిలో సభ్యులుగా ఉన్నారు.
విక్ ఆర్ Wickr
ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, విండోస్ ప్లాట్ ఫామ్ లపై పనిచేసే యాప్ ఇది. దీని ద్వారా పంపే ప్రతి సందేశానికి ఎక్స్ పయిరీ తేదీని నిర్ణయించవచ్చు. ఆ సమయానికి అది డిలీట్ అయిపోతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీ ఉంది. గ్రూప్ చాట్ లో భాగంగా ఒకేసారి పది మందితో చాట్ చేసుకోవచ్చు. టెక్ట్స్, వాయిస్ సందేశాలు, వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన విక్ ఆర్ దీన్ని రూపొందించింది.