బహుమతి తీసుకుంటున్నారా... పన్ను పడుద్ది!
పెళ్లి, బారసాల, అన్న ప్రాసన ఇలా వేడుక ఏదయినా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వ సాధారణం. ఇది మన సమాజంలో పూర్వ కాలం నుంచి ఉన్న సంప్రదాయం. అయితే, బహుమతులు ఇస్తున్నా, తీసుకుంటున్నా... పన్ను పడుద్ది మరి. దాని గురించి తెలుసుకోవడం కనీస బాధ్యత.
ప్రేమతో నాన్న మీ బ్యాంకు ఖాతాకు మనీ ట్రాన్స్ ఫర్ చేశారనుకుందాం. మరి దానిపై పన్ను ఉంటుందా...? అత్యవసరంగా డబ్బులతో పని పడి స్నేహితుడ్ని సాయం అడిగితే మీ బ్యాంకు ఖాతాకు ఓ లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. మరి పన్ను పడుద్దా...? ఇలాంటి అంశాలు ఎన్నో మనకు సాధారణంగా ఎదురవుతుంటాయి.
ఆదాయపన్ను చట్టంలో బహుమతులపై పన్ను గురించి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ వీటి గురించి తెలిసిన వారు చాలా అరుదు. ఆదాయపన్ను శాఖ బూతద్దం పట్టుకుని మరీ అన్ని లావాదేవీలను పరిశీలిస్తున్న రోజులివి. అందుకే ఖరీదైన బహుమతులపై పన్ను కట్టాల్సి వస్తే కట్టాలి. మినహాయింపులు ఉంటే వాటిని ఉపయోగించుకుని పన్ను ఆదా చేసుకోవాలి.
గిఫ్ట్ అంటే...?
బహుమానంగా ఇచ్చే నగదు లేదా ఆస్తి. అది స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు. భూమి, భవనాలు, షేర్లు, సెక్యూరిటీలు, నగలు, పురాతన వస్తువులు, డ్రాయింగ్స్, చిత్రాలు, శిల్పాలు, ఇతర కళాత్మక వస్తువులు, బంగారం, వెండి కాయిన్లు ఇవన్నీ కూడా గిఫ్ట్ లే అవుతాయి. ఈ జాబితాలో లేనివి గిఫ్ట్ లు కింద రావు.
50 వేల రూపాయల వరకు నో పన్ను
ఓ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అన్ని బహుమతుల విలువ రూ.50 వేలు దాటితే పన్ను వర్తిస్తుంది. ఆ లోపు ఉంటే మాత్రం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
బంధువులు ఇస్తే...
బంధువుల నుంచి వచ్చే గిఫ్ట్ లు, వివాహ సమయంలో వచ్చే కానుకలు, వారసత్వంగా వచ్చే లేదా విల్లు ద్వారా సంక్రమించే ఆస్తి, ధనంపై పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అయితే, బంధువు ఎవరు అన్న దానికి ఆదాయపన్ను శాఖ వివరణ ఇచ్చింది. జీవిత భాగస్వామి, సోదరుడు, సోదరుడి భార్య, సోదరి, సోదరి భర్త, జీవిత భాగస్వామి సోదరుడు, జీవిత భాగస్వామి సోదరుడి భార్య, జీవిత భాగస్వామి సోదరి, జీవిత భాగస్వామి సోదరి భర్త, జీవిత భాగస్వామి తల్లి తండ్రులు, జీవిత భాగస్వామి తాతయ్య, నాయనమ్మ, జీవిత భాగస్వామి ముత్తాత, ముత్తవ్వ, అమ్మ, అమ్మ సోదరుడు, అమ్మ సోదరుడి భార్య, అమ్మ సోదరి, అమ్మ సోదరి భర్త, నాన్న, నాన్న సోదరుడు, నాన్న సోదరుడి భార్య, నాన్న సోదరి, నాన్న సోదరి భర్త, తాత, అమ్మమ్మ, ముత్తవ్వ, ముత్తాత, కుమారుడు, కుమారుడి భార్య, కుమార్తె, కుమార్తె భర్త, మనవడు, మనవడి భార్య, మనవరాలు, మనవరాలి భర్త... వీరి మధ్య బహుమతులపై నిబందనల మేరకు పన్ను మినహాయింపులు ఉన్నాయి.
అంటే వీరిలో ఎవరైనా సరే మీ బ్యాంకు ఖాతాకు ఎంత మొత్తం నగదును ట్రాన్స్ ఫర్ చేసినా, ఎంత ఖరీదైన బహుమతిని ఇచ్చినా కంగారు పడిపోనవసరం లేదు. నిశ్చింతంగా ఉండవచ్చు. ఎన్ఆర్ఐలు తమ ఎన్ఆర్ఈ ఖాతా ద్వారా భారత్ లో ఉండే తల్లిదండ్రులకు ఇచ్చే వాటిపైనా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది.
ఇది గమనించండి
పై బంధాలకు పన్ను పోటు ఉండదని తెలుసుకున్నాం. కనుక ఓ వ్యక్తి తన భార్యకు 10 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చాడు. దీనిపై పన్ను లేదు. అయితే, ఈ డబ్బులను పెట్టుబడి పెట్టడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం సమకూరిందనుకోండి. అప్పుడు ఆ ఆదాయం భర్తది అవుతుందా? లేక భార్యది అవుతుందా...?
నిజానికి ఇక్కడ భార్యకు ఇచ్చే నగదు కానుకపై భర్తకు పన్ను పరంగా ఎటువంటి మినహాయింపులు లేవు. అంటే బహుమతి రూపంలో ఇచ్చే మొత్తాన్ని కూడా తన ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిన ఉంటే చెల్లించాలి. ఆ నగదును స్వీకరించిన భార్య మాత్రం పన్ను చెల్లించాల్సిన పని ఉండదు.
బహుమతులు ఇచ్చే వారికి పన్ను ఉండదా...?
బహుమతి ఇచ్చినందుకు పన్ను విధిస్తే అప్పుడు బహుమతులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. అందుకే వాటిని స్వీకరించే వారిపైనే పన్ను విధింపు ఉంటుంది. బంధువుల నుంచి ఎంత విలువ బహుమతులను స్వీకరించినా పన్ను ఉండదు. ఒక ఏడాదిలో రూ.50వేల విలువ వరకు బహుమతులను బంధువులు కాని వారి నుంచి తీసుకున్నా పన్ను చెల్లించక్కర్లేదు. అంతకు మించితే తీసుకున్న వారు పన్ను కట్టాల్సిందే.
ఇక బహుమతులుగా ఇచ్చే వాటి విలువను తమ ఆదాయంలోంచి తీసి వేసి మిగిలిన ఆదాయంపైనే పన్ను చెల్లించాలని చాలా మంది పొరబడుతుంటారు. కానీ ఇది తప్పు. ఉదాహరణకు రాజారామ్ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు. పన్ను మినహాయింపులు రూ.4 లక్షల వరకు పోను... మిగిలిన లక్ష రూపాయలపై అతడు 10 శాతం అంటే 10వేలు పన్ను కట్టాలి. ఈ భారం తప్పించుకుకోవాలనే ఉద్దేశంతో అతడు ఆ లక్ష రూపాయలను తన సోదరుడికి బహుమతిగా ఇచ్చాడు.
కానీ, ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే బహుమతిగా ఇచ్చుకోవడం అన్నది రాజారామ్ ఇష్టం. కానీ ఆ ఇచ్చే లక్ష రూపాయలపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకుంటే అది పన్ను వర్తించే ఆదాయం. ఇలా బహుమతులు ఇవ్వడం ద్వారా పన్ను కట్టే పని లేకుంటే, మన దేశంలో చాలా మంది భార్యకో, తల్లికో, తండ్రికో, సోదరుడికో బహమతులుగా ఇచ్చి పన్ను కట్టరు. అందుకే ఈ విధమైన వెసులుబాటు లేదు.
పెళ్లిలో కానుకల సంగతి
పెళ్లిలో బంధువులే కాదు, బంధువులు కాని వారు ఇచ్చే బహుమతులపై కూడా పన్ను లేదు. ఎంత విలువ అన్నదానితో సంబంధం లేకుండా అన్నింటికీ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అయితే, ఇది కేవలం పెళ్లి రోజు మాత్రం ఇచ్చే వాటిపైనే. ఒకవేళ పెళ్లికి ముందు తర్వాత వచ్చే వాటిని పెళ్లి కానుకల ఖాతాలో వేస్తానంటే మాత్రం ఆదాయపన్ను శాఖ నిబంధనలు ఒప్పుకోకపోవచ్చు.
వారసత్వంగా వచ్చే ఆస్తిపై
విల్ రూపంలో వచ్చిన ఆస్తి, లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని పన్ను ఆదాయంగా ఐటీ శాఖ పరిగణించదు. ఇలా వచ్చిన ఆస్తి కోటి రూపాయలయినా సరే పన్ను వర్తించదు.
చరాస్తి
అంటే షేర్లు. సెక్యూరిటీలు, బంగారం, వెండి నగలు, పురాతన వస్తువులు, డ్రాయింగ్స్, చిత్రాలు, శిల్పాలు, చేతి పనులు, ఆర్ట్, బంగారం, వెండి కాయిన్లు. వీటి ఫెయిర్ మార్కెట్ వేల్యూ (సరైన మార్కెట్ విలువ) 50వేల రూపాయల్లోపు ఉంటే తీసుకునే వారిపై పన్ను ఉండదు. 50వేల రూపాయలు దాటితే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 50వేల రూపాయలకు మించితే ఆ ఆదాయాన్ని ఇతర ఆదాయంగా రిటర్నుల్లో పేర్కొని శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కార్లు, టీవీలపై పన్ను ఉండదు.
స్థిరాస్తి
స్థిరాస్తి ఏదైనా గానీ దానిపై స్టాంప్ డ్యూటీ 50వేల వరకు ఉంటే స్వీకరించే వారిపై పన్ను ఉండదు. అంతకు మించి చెల్లించే స్టాంప్ డ్యూటీపై పన్ను భారం ఉంటుంది.
ఐటీ రిటర్నుల్లో పేర్కొనాలా?
పన్ను వర్తించకపోయినా గానీ బంధువులు ఇచ్చేవి, వివాహ సమయంలో అందుకున్న బహుమతుల గురించి ఐటీ రిటర్నుల్లో పేర్కొనాలి. ఎగ్జెంప్ట్ ఇన్ కమ్ కింద చూపించాలి.
ఇవి పాటిస్తే బెటర్
గిఫ్ట్ ఏదైనాగానీ అందుకు సంబంధించిన ఆధారాలను దగ్గరే భద్రంగా ఉంచుకోవడం మంచిది. భవిష్యత్తులో ఆదాయపన్నుశాఖ నుంచి నోటీసులు వస్తే బదులివ్వడానికి వివరాలు ఉంటాయి. సాధారణ పేపర్ పై రాసి ఉంచుకున్నా సరిపోతుంది.
ఒకవేళ పన్ను పడుతుందంటే...?
బహుమతుల రూపంలో అందుకున్న వాటిపై పన్ను పడకుండా చూసుకునే మార్గాలు కూడా ఉన్నాయి. ట్యాక్స్ మినహాయింపు ఉన్న బాండ్ల వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను తప్పించుకోవచ్చు. రాజు, రాణి భార్య భర్తలు. రాజు తన భార్యకు రూ.10 లక్షలు బహుమతిగా ఇచ్చాడు. దాన్ని రాణి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టింది. దానిపై రెండేళ్ల తర్వాత చూస్తే 10 లక్షల రూపాయల లాభం వచ్చింది. దీన్ని రాజు ఆదాయంగానే పరిగణిస్తారు. ఈ లాభం రూ.10లక్షలు మించకుండా ఉంటే పన్ను పడదు. అంతకు మించితే ఆ పై మొత్తం కూడా రాజు నికర ఆదాయంలో కలపాల్సి ఉంటుంది. అప్పుడు అతడు పన్ను పరిధిలో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కేవలం మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, పన్ను మినహాయంపు ఉన్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ సహా ఇతర సాధనాలపై వచ్చే రాబడిపైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
తల్లిదండ్రులకు ఇస్తే
ఒకవేళ రాజు రూ.10 లక్షలను తన తల్లిదండ్రులకు ఇచ్చి ఉంటే దానిపై వచ్చే లాభాన్ని రాజు ఆదాయంగా పరిగణించరు.
మేజర్, మైనర్లకు వచ్చే బహుమతులపై?
మేజర్, మైనర్ పిల్లలకు వచ్చే బహుమతులపై పన్ను గురించి చూస్తే.... ఉదాహరణకు రాజుకు 15 సంవత్సరాలు, 19 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో రాజు పెద్ద కుమారుడు మేజర్. అతడికి రాజు లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తే అది ఆ యువకుడి ఖాతాలోకే వెళుతుంది. ఈ లక్ష రూపాయలు తీసుకున్నందుకు ఆ యువకుడు పన్ను చెల్లించక్కర్లేదు. దీనిపై వచ్చే ఆదాయం కూడా ఆ యువకుడి ఖాతాలోకే వెళ్తుంది.
ఇలా కాకుండా రాజు తన 15 ఏళ్ల కుమారుడికి కూడా లక్ష రూపాయలు బహుమానంగా ఇచ్చాడనుకుందాం. అప్పుడు జీవిత భాగస్వామి వలే 15 సంవత్సరాల కుమారుడి ఆదాయం కూడా రాజు ఆదాయంగానే పరిగణిస్తారు. తల్లీ, తండ్రీ ఇద్దరూ ఆర్జనా పరులైతే వీరిలో అధిక ఆర్జన కలిగిన వారి ఆదాయానికి మైనర్ కు వచ్చిన బహుమతి విలువ కలిపి చూపించాల్సి ఉంటుంది.
విలువ ఎలా కడతారు...?
స్థిరాస్తులు అయితే స్టాంప్ డ్యూటీని ప్రామాణికంగా తీసుకుంటారు. నగలు, పురాతన వస్తులు, కళాత్మక వస్తువులు, శిల్పాలను రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కొని ఉంటే బిల్లు ప్రకారం విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ బిల్లు లేకపోతే రిజిస్టర్డ్ వేల్యూయర్ నుంచి బహుమతుల విలువపై నివేదిక తీసుకురావాల్సి ఉంటుంది. దీన్నే రిటర్నులకు జత చేయాలి. షేర్లు, సెక్యూరిటీలు అయితే, మార్కెట్లో కోట్ అయిన విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఈ నిబంధనలకు లోబడి పన్ను వర్తిస్తే ఆ విలువను తమ ఆదాయానికి కలిపి శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఫ్రెండ్ కోసం క్రెడిట్ కార్డు నుంచి ఇస్తే...
కొంత మంది అత్యవసరాల్లో ఫ్రెండ్స్ నుంచి కొంత నగదు చేబదులుగా తీసుకుంటుంటారు. అలాగే, ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డులతో వస్తువులు కొంటుంటారు. చిన్న మొత్తాలైతే ఆందోళన చెందక్కర్లేదు. కానీ, పెద్ద మొత్తమైతే ఆధారాలు తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. ఉదాహరణకు రాజుకు 50వేల రూపాయలు అవసరం అయింది. తన మిత్రుడు పవన్ ను అడిగాడు. పవన్ తన క్రెడిట్ కార్డు నుంచి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేశాడు. దీన్ని తన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రాజు రూ.50వేలను పవన్ బ్యాంకు ఖాతాకు నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించాడు.
ఇది రివర్స్ ట్రాన్సాక్షన్ అవుతుంది. తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించడం. కానీ ఆదాయపన్ను అధికారులు తమ పరిశీలనలో భాగంగా పవన్ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన రూ.50వేల లావాదేవీ వివరాలు అడిగితే తన మిత్రుడికి ఇచ్చి, తీసుకున్నాను అనేందుకు ఆధారాలు చూపించాలి. అందుకోసం క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్, బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ దగ్గర ఉంచుకోవాలి.