మన శరీరానికి ఈ పోషకాలు కూడా కావాల్సిందే!

శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉండాలన్నా, అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలన్నా పలు రకాలైన పోషకాలు తప్పనిసరిగా అవసరం. అందులో ఎంతో ముఖ్యమైనవి సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు ఆహారం ద్వారా విస్తృతంగా లభ్యమైనా.. సూక్ష్మ పోషకాలు లభించడం కొంత కష్టమైన విషయం. సూక్ష్మ పోషకాల్లో ప్రధానమైనవి క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినమ్, సెలీనియం, జింక్. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన ఈ పోషకాల వివరాలు, అవి లభించే ఆహారం, లోపంతో ఏర్పడే సమస్యలేమిటో తెలుసుకుందాం..

మధుమేహాన్ని దూరంగా ఉంచే క్రోమియం

శరీరంలో ఎంతో ముఖ్యమైన హార్మోన్ అయిన ఇన్సూలిన్ ను క్రియాశీలం చేసేది క్రోమియం. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు జీర్ణం కావడానికి, నిల్వకు ఇది తోడ్పడుతుంది. క్రోమియం లోపం వల్ల బరువు తగ్గిపోవడం, గందరగోళం, దేనిపైనా ఏకాగ్రత నిలపలేకపోవడం, రక్తంలోని గ్లూకోజ్ శాతాలు నియంత్రణలో ఉండక మధుమేహం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

  • కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా మాత్రమే క్రోమియం మన శరీరానికి అందుతుంది. అందులోనూ విటమిన్ సి, నియాసిన్ (విటమిన్ బి3)లతో కలిపి తీసుకున్నప్పుడే దానిని శరీరం సంగ్రహించగలుగుతుంది.
  • కాలేయం, ప్రాసెస్ చేసిన మాంసం, పొట్టు తీయని ధాన్యాలు, బాదం వంటి గింజల్లో క్రోమియం లభిస్తుంది.
  • రోజుకు 50 ఏళ్లలోపు వయసున్న పురుషులకు 35 మైక్రోగ్రాములు, మహిళలకు 25 మైక్రోగ్రాములు.. 50 ఏళ్లు దాటిన వారిలో పురుషులకు 30 మైక్రోగ్రాములు, మహిళలకు 20 మైక్రోగ్రాములు క్రోమియం అవసరం. ఎనిమిదేళ్లలోపు పిల్లలకు 15 మైక్రోగ్రాముల వరకు అందాలి.

ఎంజైమ్ లను తయారు చేసే కాపర్

శరీరంలో అనేక జీవక్రియలకు అవసరమైన ఎంజైముల తయారీకి కాపర్ మూలకం అత్యవసరం. ఆహార పదార్థాలు జీర్ణమై శక్తి ఉత్పత్తి కావడానికి, ఎర్ర రక్తకణాలు, ఎముకలు, కండర, అనుసంధాన కణజాలం ఉత్పత్తి కావడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ కారణంగా కణాలు దెబ్బతినకుండా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చాలా రకాల ఆహారం నుంచి కాపర్ లభిస్తుంది కాబట్టి సాధారణ వ్యక్తుల్లో దీని లోపం పెద్దగా కనిపించదు. అయితే నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు, పోషకాహార లోపం, డయేరియా, మెంకెస్ సిండ్రోమ్ గా పిలిచే జన్యుపరమైన వ్యాధి, బరువు తగ్గే సర్జరీ (బేరియాట్రిక్) చేయించుకున్నవారిలో కాపర్ లోపం కనిపిస్తుంది. ఈ లోపం కారణంగా రక్త హీనత (ఎనీమియా), నీరసం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం, కండరాల బలహీనతతో పాటు లోపం ఎక్కువకాలం కొనసాగితే ఎముకలు బలహీనం కావడం, నాడులు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

  • ఇక శరీరంలో కాపర్ స్థాయులు పరిమితికి మించి పెరగడం కూడా ప్రమాదకరమే. పుల్లని, ఆమ్ల లక్షణాలున్న ద్రవాలను రాగి పాత్రల్లో ఎక్కువ కాలం తీసుకోవడం.. రాగి, ఇత్తడి పాత్రల్లో పాలు మరగబెట్టడం, రాగి, ఇత్తడి పాత్రల్లోనే నిల్వ చేసుకుని తాగడం వల్ల శరీరానికి అవసరానికి మించి కాపర్ అందుతుంది. కాపర్ అధికంగా చేరడం వల్ల వికారం, డయేరియా, కిడ్నీలు, కాలేయం దెబ్బతినడంతోపాటు మోతాదు మరీ ఎక్కువైతే మరణం కూడా సంభవిస్తుంది.
  • ఆర్గాన్ మీట్ (కాలేయం, కిడ్నీలు వంటి అవయవాల మాంసం), షెల్ ఫిష్, నట్స్, ఎండబెట్టిన బఠాణీ, చిక్కుడు వంటి గింజలు, ఎండబెట్టిన పండ్లు, పొట్టు తీయని ధాన్యాలు, వేరుశనగ, కొకోవా, పుట్టగొడుగులు, టమాటా ఉత్పత్తుల్లో కాపర్ ఎక్కువగా లభిస్తుంది.
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 700 నుంచి 900 మైక్రోగ్రాముల కాపర్ అవసరం. ఎనిమిదేళ్లలోపు పిల్లలకు 200 నుంచి 440 మైక్రోగ్రాములు అందాలి. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులకు 1000 నుంచి 1,300 మైక్రోగ్రాములు అవసరం. 10,000 మైక్రోగ్రాములు మించితే విషపూరితంగా పరిణమిస్తుంది. మూత్రం, రక్త పరీక్షల ద్వారా శరీరంలో కాపర్ స్థాయులను గుర్తించవచ్చు.

బలమైన ఎముకలు, దంతాలకు ఫ్లోరైడ్

శరీరంలో ఎముకలు, దంతాలు ఏర్పడడానికి ఫ్లోరైడ్ అవసరం. సరైన మోతాదులో ఫ్లోరైడ్ శరీరానికి అందితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. మనకు సరిపడినంతగా ఫ్లోరైడ్ దాదాపు నీటి ద్వారానే అందుతుంది. అయితే ఫ్లోరైడ్ మోతాదుకు మించి అందడం చాలా ప్రమాదకరం. కొన్ని ప్రాంతాల్లోని భూమి పొరల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉండడం వల్ల అది తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతుంది. దాంతో దీర్ఘకాలంపాటు అధిక ఫ్లోరైడ్ కు గురై వివిధ సమస్యలు తలెత్తుతాయి. ఫ్లోరైడ్ మోతాదు మించడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకల సాంద్రత పెరిగినా.. ఎముకల పెరుగుదల అస్తవ్యస్తంగా తయారవుతుంది. వెన్నెముక వంగిపోతుంది. పక్కటెముకలు సాగి వంగి.. గూడులాగా తయారవుతాయి. దంతాల పెరుగుదల అస్తవ్యస్తంగా తయారవుతుంది. దంతాలు పసుపురంగులోకి మారుతాయి. 

  • ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వారు నీటిని బాగా మరిగించి, చల్లార్చి తాగాలి.
  • చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, తేనీరు, భూగర్భ జలాల ద్వారా ఫ్లోరైడ్ ఎక్కువగా అందుతుంది.
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 2 నుంచి 4 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ అవసరం. ఎనిమిదేళ్లలోపు పిల్లలకు 0.5 మిల్లీగ్రాముల నుంచి 1 మిల్లీగ్రాము వరకు అందాలి. రోజుకు 10 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ అందడం ప్రమాదకరం. 

సంపూర్ణ ఎదుగుదలకు తోడ్పడే అయోడిన్

మన శారీరక వికాసంతో పాటు మానసిక వికాసానికి అత్యంత కీలకమైన హార్మోన్లలో ఉండేది అయోడిన్. థైరాక్సిన్ (టీ4), ట్రయోడోథైరోనిన్ (టీ3), థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ (టీఎస్ హెచ్) హార్మోన్ల తయారీకి, గర్భంలో శిశువు ఎదగడానికి అయోడిన్ అత్యవసరం. దీని లోపం వల్ల పెద్దవారిలో థైరాయిడ్ గ్రంథి వాచిపోయి గాయిటర్ వ్యాధి వస్తుంది. చర్మం ఉబ్బిపోతుంది. స్వరం బొంగురుగా మారుతుంది. మానసిక స్థితి దెబ్బతింటుంది. బరువు పెరుగుతారు, వెంట్రుకలు రాలిపోతాయి. గర్భంతో ఉన్న మహిళలు తగిన మోతాదులో అయోడిన్ తీసుకోకపోతే... అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. గర్భంలో శిశువు ఎదుగుదల దెబ్బతింటుంది. మెదడు అభివృద్ధి నిలిచిపోతుంది. పుట్టిన తర్వాత కూడా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. మూగ, చెవుడు వస్తాయి. సముద్ర తీరప్రాంతాలకు దూరంగా ఉండే వారిలో, అయోడిన్ ఉన్న ఆహారం, ఉప్పు తీసుకోని వారిలో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు అయోడిన్ మోతాదు ఎక్కువగా అందడం కూడా ప్రమాదకరమే. దాని వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. 

  • చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు, గుడ్లు, పాలు, వెన్న, పెరుగు, తాగు నీటి ద్వారా అయోడిన్ శరీరానికి అందుతుంది. అయితే ఆయా ప్రాంతాల్లో భూమిలో ఉన్న అయోడిన్ శాతాన్ని బట్టి నీటి ద్వారా అందే అయోడిన్ శాతం మారుతుంది. 
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 120 నుంచి 150 మైక్రోగ్రాముల వరకు అయోడిన్ అవసరం. ఏడాదిలోపు చిన్నారులకు 130 మైక్రోగ్రాములు, ఏడాది నుంచి ఎనిమిదేళ్ల వరకు చిన్నారులకు 90 మైక్రోగ్రాములు అందాలి. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులకు 220 నుంచి 290 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. రోజుకు 1,100 మైక్రోగ్రాములకు మించి అయోడిన్ అందడం ప్రమాదకరం.
  • రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిని పరీక్షించడం ద్వారా అయోడిన్ స్థాయులను గుర్తిస్తారు.

మనుగడకు కీలకం ఐరన్

భూమిపై సకల ప్రాణుల మనుగడకు ఐరన్ అత్యవసరం. మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ జరిపేందుకు, మనలో ఊపిరితిత్తుల నుంచి కణాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా అయ్యేందుకు ఐరన్ ఎంతో కీలకం. ఎర్రరక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్ తో పాటు చాలా రకాల ఎంజైములు, ప్రొటీన్లు, తయారుకావడానికి, కండరాలు, మెదడు సరిగా పనిచేయడానికి ఐరన్ అవసరం. పోషకాహార లోపం, రక్త నష్టం, అతిగా ఆల్కాహాల్ తీసుకోవడమే ప్రధానంగా ఐరన్ లోపం ఏర్పడడానికి కారణాలు. 

ఈ లోపం వల్ల ప్రధానంగా రక్త హీనత తలెత్తుతుంది. గ్లాసైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. బలహీనంగా, నీరసంగా తయారవుతారు. ఏకాగ్రత లేకపోవడం, నేర్చుకోవడంలో లోపం, మట్టి తినడం వంటి అలవాట్లు రావడం, గోర్లు పాడవడం, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. రుతుక్రమం కొనసాగుతున్న మహిళల్లో రక్తం కోల్పోవడం వల్ల ఐరన్ లోపం తలెత్తుతుంది. అందువల్ల వారు తగిన మోతాదులో ఐరన్ అందేలా చూసుకోవాలి. సాధారణంగా ఎర్రరక్త కణాల జీవితకాలం పూర్తికాగానే.. ఎముక మజ్జ వాటిలోని ఐరన్ ను సంగ్రహించి, కొత్త ఎర్ర రక్త కణాల తయారీలో వినియోగించుకుంటుంది. అంటే శరీరంలో కొంత ఐరన్ రీసైకిల్ అవుతుంది. ఇక శరీరంలో ఐరన్ మోతాదు ఎక్కువైతే హిమోక్రోమాటోసిస్, సిర్రోసిస్, మధుమేహం, చర్మంపై మచ్చలు, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పేగులు దెబ్బతింటాయి. 

  • ఐరన్ రెండు రూపాల్లో లభిస్తుంది. హెమి ఐరన్ రూపంలో మాంసం, కాలేయం, కిడ్నీలు, చికెన్, చేపలు, గుడ్లలో ఉంటుంది. నాన్ హెమి ఐరన్ రూపంలో ఖర్జూరం, వేరుశనగ, బెల్లం, సోయాబీన్ పిండి, ఆకుకూరలు వంటి వాటిలో అధికంగా లభిస్తుంది. దాదాపుగా అన్ని రకాల కూరగాయల్లోనూ స్వల్పంగా ఉంటుంది. నాన్ హెమి ఐరన్ కంటే.. మాంస పదార్థాల నుంచి లభించే హెమి ఐరన్ ను శరీరం ఎక్కువగా సంగ్రహించగలుగుతుంది.
  • సాధారణంగా పురుషులకు, 13 ఏళ్లలోపు అబ్బాయిలు, అమ్మాయిలకు రోజుకు 8 నుంచి 11 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. 13 ఏళ్లు దాటిన స్త్రీలకు 15 నుంచి 18 మిల్లీగ్రాములు అందాలి. గర్భిణులకు మాత్రం రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. రోజుకు 40 మిల్లీగ్రాములకు మించి ఐరన్ తీసుకోవడం ప్రమాదకరంగా మారుతుంది.
  • రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించడం ద్వారా శరీరంలో ఐరన్ స్థాయులను గుర్తించవచ్చు.

కణాలు దెబ్బతినడాన్ని నిరోధించే సెలీనియం

శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ను నిరోధించే మంచి యాంటీ ఆక్సిడెంట్ గా సెలీనియం పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనిచేసేందుకు ఇది తోడ్పడుతుంది. విటమిన్ ఈ తో కలసి అది ఈ పనిని నిర్వర్తిస్తుంది. ఇక గ్లూటాథియాన్ పెరాక్సైడ్, అయోడినేజ్ హార్మోన్ ల తయారీకి సెలీనియం అవసరం. కొన్ని రకాల కేన్సర్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. దీని లోపం వల్ల కండరాలు బలహీనమవుతాయి. కేషన్ డిసీజ్ (వైరల్ కార్డియోమయోపతి.. అంటే గుండె గోడలు దెబ్బతింటాయి) వస్తుంది. పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అందే సెలీనియం మోతాదు పరిమితికి మించితే వెంట్రుకలు రాలిపోవడం, వికారం, నీరసం, చర్మ వ్యాధులు, గోర్లు దెబ్బతినడం, ఫెరిఫెరల్ న్యూరోపతి (నాడులు దెబ్బతినడం), డయేరియా, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వారిలో శ్వాస వెల్లుల్లి వాసన వస్తుంది.  

  • మాంసం, చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, నట్స్, తృణ ధాన్యాల్లో సెలీనియం లభిస్తుంది. 
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 40 నుంచి 55 మైక్రో గ్రాముల సెలీనియం అవసరం. ఎనిమిదేళ్లలోపు పిల్లలకు 15 నుంచి 30 మైక్రో గ్రాములు అందాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు 60 నుంచి 70 మైక్రోగ్రాములు అవసరం. పిల్లలకు 80 మైక్రోగ్రాములకు మించి, పెద్ద వారికి 250 మైక్రోగ్రాములకు మించి సెలీనియం అందడం ప్రమాదకరం.
  • సెలీనియం స్థాయులను రక్త పరీక్షలతో గుర్తించలేరు. బాధితుల లక్షణాలు, ఇతర విధానాల ఆధారంగా వైద్యులే లోపాన్నిగానీ, ఎక్కువగా ఉండడాన్ని గానీ అంచనా వేస్తారు.

చర్మ ఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తికి జింక్

శరీరంలో చాలా రకాల ఎంజైముల తయారీకి.. ముఖ్యంగా ఇన్సూలిన్ తయారీకి జింక్ అవసరం. అంతేకాదు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, గాయాలు త్వరగా మానడానికి, శరీరం ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. కడుపులో అల్సర్లు, సికిల్ సెల్ ఎనీమియా, కొన్ని రకాల హెర్పిస్ లను నియంత్రిస్తుంది. పోషకాహార లోపం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, కొన్ని రకాల మందుల వినియోగం, మధుమేహం, కిడ్నీలు, కాలేయం సరిగా పనిచేయకపోవడం కారణంగా జింక్ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా శరీరం ఎదుగుదల మందగిస్తుంది. లైంగిక అభివృద్ధి ఆలస్యమవుతుంది. వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. హైపోగొనడిజం, హైపోజూసియా వంటి వ్యాధులు వస్తాయి. ఆకలిమందగిస్తుంది. రుచి చూడగలిగే శక్తిని కోల్పోతారు. వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. వెంట్రుకలు రాలిపోతాయి. చర్మంపై దద్దుర్లు రావడం, కళా విహీనం కావడం జరుగుతుంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు తగిన మోతాదులో జింక్ అందకపోతే పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, పలు లోపాలతో జన్మించడం వంటివి ఏర్పడవచ్చు. ఇక జింక్ పరిమితికి మించి శరీరంలో చేరడం కూడా ప్రమాదకరమే. జింక్ కోటింగ్ వేసిన ప్యాకేజింగ్ ఫుడ్, కొన్ని రకాల పరిశ్రమల నుంచి వెలువడే జింక్ ఆక్సైడ్ వాయువును పీల్చడం, జింక్ అతిగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా శరీరంలో జింక్ ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల వికారం, డయేరియా, వాంతులు, జ్వరం, రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

  • మాంసం, కాలేయం, సముద్ర ఉత్పత్తులు, నత్తలు, వేరుశనగ, పొట్టు తీయని ధాన్యాల్లో జింక్ ఎక్కువగా లభిస్తుంది. 
  • ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు శరీరం జింక్ ను సంగ్రహించకుండా అడ్డుకుంటాయి.
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 8 నుంచి 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం. ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు 2 నుంచి 5 మిల్లీగ్రాములు కావాలి.
  • రక్త, మూత్ర పరీక్షల ద్వారా శరీరంలో జింక్ స్థాయులను కచ్చితంగా నిర్ధారించడం కష్టం. బాధితుల లక్షణాలు, జింక్ సప్లిమెంట్లతో ఉపశమనం, ఇతర అంశాల ఆధారంగా వైద్యులు జింక్ లోపాన్ని లేదా ఎక్కువగా ఉండడాన్ని నిర్ధారిస్తారు.

ఎంజైముల తయారీకి మాంగనీస్

శరీరంలో పలు రకాల ఎంజైములు తయారు కావడానికి, ఎముకలు ఏర్పడడానికి మాంగనీస్ అవసరం. పొట్టు తీయని ధాన్యాలు, పైనాపిల్, నట్స్, తేనీరు, బీన్స్, టమాటా పేస్ట్ లలో మాంగనీస్ ఎక్కువగా లభిస్తుంది. దీని లోపం వల్ల ఏర్పడే సమస్యలపై సరైనా నిర్ధారణ జరగలేదు. అయితే ఎంజైముల ఉత్పత్తి తగ్గి శరీరంలోని ఇతర జీవక్రియలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • ఇది సాధారణ వ్యక్తులకు రోజుకు 1.8 నుంచి 2.3 మిల్లీగ్రాముల వరకు అవసరం. రోజుకు 11 మిల్లీగ్రాములకు మించి శరీరంలో చేరడం ప్రమాదకరం. 

కణాల పనితీరుకు తోడ్పడే మాలిబ్డినం

శరీరంలో నైట్రోజన్ పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి, పలు రకాల ఎంజైములను ఉత్తేజితం చేయడానికి మాలిబ్డినం తోడ్పడుతుంది. కణాలు సరిగా పనిచేయడానికి.. ఆహారంలోని సల్ఫైట్లను విడగొట్టడానికి ఇది అవసరం. దీని లోపం వల్ల తలనొప్పి, వికారం, సల్ఫైట్ శరీరంలో అధికంగా చేరి విషపూరితం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

  • పాలు, పాల పదార్థాలు, చిక్కడు జాతికి చెందిన గింజలు, పొట్టు తీయని ధాన్యాలు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయల్లో మాలిబ్డినం ఎక్కువగా ఉంటుంది. 
  • సాధారణ వ్యక్తులకు రోజుకు 34 నుంచి 45 మైక్రోగ్రాముల మాలిబ్డినం అవసరం. ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు 5 నుంచి 20 మైక్రోగ్రాములు అందాలి. రోజుకు 2,000 మైక్రోగ్రాములు దాటడం ప్రమాదకరం.


More Articles