పంచదార, ఉప్పు.. ఎంత ప్రమాదకరమో తెలుసా?

తినగ తినగ వేము తియ్యగనుండు.. అన్న నానుడి వినే ఉంటారు. నిజమే. చేదుగా ఉండే వేపను తినడం వల్ల శరీరానికి అంతటి సానుకూల ఉపయోగాలు ఉన్నాయి. అచ్చం ఇలాగే తినగ తినగ తీపి చేదవును అన్న విధంగా తీపి ఎక్కువైతే అది శరీరంపై చేదు ఫలితాలు చూపిస్తుంది. ఉప్పు కూడా అంతే. పరిమితి దాటితే మన శరీరంపై దాడి చేస్తుంది. అందుకే ఈ రెండింటితో ఉన్న మంచి చెడుల గురించి తెలుసుకుందాం.  

representation image

పంచదార ఆహారం కాదు

పంచదార అనేది ఆహార ఉత్పత్తుల విభాగంలోకి రాదు. ఇది సహజసిద్ధంగా చాలా పదార్థాల ద్వారా మన శరీరానికి లభిస్తూనే ఉంటుంది. అది చాలు మన శరీరానికి. కానీ మనమేం చేస్తున్నాం...? విడిగా పంచదార తినేస్తున్నాం. ప్రతీ దాన్ని మధురంగా మార్చుకునేందుకు  పంచదారపై ఆధారపడుతున్నాం.

పంచదారలో ఎటువంటి పోషకాలు లేవు. ప్రొటీన్లు లేవు. ఆరోగ్యానికి మేలు చేసే ఫ్యాట్స్ లేవు. ఎంజైమ్ లు కూడా లేవు. ఇది త్వరగా జీర్ణమై కేలరీలుగా మారే పదార్థం. పండ్లు, కూరగాయల్లోనూ చక్కెర ఉంటుంది. అయితే వీటిలో ఫైబర్, విటమిన్లు, ఎంజైమ్స్ కూడా ఉండడం వల్ల ఇందులోని చక్కెరను నిదానంగా జీర్ణమయ్యేట్టు చేస్తాయి. కానీ, విడిగా తీసుకునే పంచదార వెంటనే రక్తంలో కలసిపోవడం వల్లే వచ్చే అదనపు ప్రయోజనాలు ఏమీ లేవు.

representation image

చక్కెర పనితీరు

మనం తీసుకునే ఆహారం నుంచి వచ్చే కార్బొహైడ్రేట్లు అవసరానికి మించి అధిక పరిమాణంలో ఉంటే అవి గ్లైకోజెన్ గా మారి కాలేయం, కండరాల్లో నిల్వ వుంటాయి. ఇది పరిమిత స్థాయికి చేరిన తర్వాత అదనంగా వచ్చే ఫ్రక్టోజ్ ను లివర్ కొవ్వుగా మారుస్తుంది. ఇందులో కొంత భాగం వీఎల్ డీఎల్ కొలెస్టరాల్ గా మారుతుంది. కొంత వరకు బయటకు వెళ్లగా మిగిలినది లివర్ లోనే ఉండిపోతుంది. కొంత కాలానికి అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిగా మారడానికి దారి తీయవచ్చు. అంటే జీవక్రియలకు సంబంధించిన సమస్య అన్నమాట.   

శరీరానికి ఏ రూపంలోనూ చక్కెరలు అందకపోతే, లేదా తగినంత అందకపోతే, కాలేయంలో ఉన్న గ్లైకోజెన్ ను మన శరీరమే గ్లూకోజ్ గా మారుస్తుంది. ఈ ప్రక్రియ రాత్రి నిద్ర సమయాల్లో, పని చేసే సమయాల్లో జరుగుతుంటుంది. అందుకే శరీరానికి పరిమిత స్థాయిలో చక్కెరలు చాలా అవసరం. అవి పండ్లూ, కూరగాయల రూపంలో అందుతుంటాయి. విడిగా చక్కెర తీసుకోకపోవడమే నయం.  

చక్కెర ఎక్కువైతే అనర్థాలు

అసలు రోజువారీ ఆహారంలో అదనంగా చక్కెరను తీసుకోవడమే అనర్థాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. యాడెడ్ షుగర్ లో ఎలాంటి పోషకాలు కేవలం తక్షణం శక్తినిచ్చే కేలరీలు మాత్రమే ఉన్నాయి. పైగా పళ్లకు హానికరం. ఎందుకంటే తీపి పదార్థాలు పళ్ల దగ్గర ఆగడం వల్ల ఆ సుక్రోస్ చుట్టూ బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో పళ్లు పుచ్చిపోతాయి. అందుకే ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు పుక్కిలించి వదలమని చెబుతుంటారు. 

ఆరోగ్యవంతులైన వారు, చురుగ్గా ఉండేవారు అదనపు షుగర్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. అదే చురుగ్గా లేని వారు, అధిక కార్బొహైడ్రేట్లు, అధిక కేలరీలతో కూడిన పాశ్చాత్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారికి ముప్పు ఎక్కువ ఉంటుందని నిపుణుల హెచ్చరిక.  

ఇన్సులిన్ శరీరానికి చాలా అవసరం. రక్తం నుంచి కణాలకు గ్లూకోజ్ వెళ్లేందుకు ఇన్సులిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే అది మధుమేహం, కంటి చూపు తగ్గడానికి దారితీస్తుంది. జీవక్రియలు గతి తప్పితే ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయదు. దాంతో కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా మారతాయి. దీంతో ఊబకాయం, కార్డియోవాస్క్యూలర్, టైప్2 డయాబెటిస్, కేన్సర్ వ్యాధుల బారిన పడవచ్చు. 

చక్కెర మెదడును ఉత్తేజపరిచే డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా స్వీట్ తింటున్న కొద్దీ కొసరు కావాలనిపిస్తుంది.  

representation image

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

చక్కెర గుండెకు పెద్ద ముప్పు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2013 నాటి అధ్యయనం ప్రకారం... చక్కెర గుండెె రక్తాన్ని పంప్ చేసే వ్యవస్థపై ప్రభావం చూపించడం ద్వారా గుండె విఫలం అవడానికి దారితీస్తుందట. 2010లో చిన్నారులపై చేసిన అధ్యయనంలో అధిక ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలను తినడం వల్ల ఊబకాయానికి కారణమవుతున్నట్టు, దాని వల్ల దీర్థకాలంలో గుండె జబ్బుల ముప్పు ఉంటుందని తేల్చారు. 

2008లో జరిగిన మరో అధ్యయనంలో అధిక ఫ్రక్టోజ్ వినియోగం వల్ల లెప్టిన్ నిరోధకత పెరుగుతుందని తేలింది. తీసుకున్న ఆహారం సరిపోయింది, కడుపునిండింది అని తెలియజేసేది లెప్టిన్. లెప్టిన్ నుంచి మెదడుకు సరిగా సందేశాలు అందకపోతే తినే తిండి పెరిగిపోతుంది. దీంతో ఊబకాయం సమస్య ఎదురవుతుంది. 

representation image

చక్కెర అంటే?

ఇదొక కార్బొహైడ్రేట్. శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది. ఇది చాలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉంటుంది. మొక్కలు సూర్యరశ్మిని ఆహారంగా మార్చుకునే ఫొటో సింతసిస్ ప్రక్రియకు తోడ్పడేదే సుక్రోస్. ఈ కార్బోహైడ్రేట్లు రక్తంలో కలసి శరీరంలోని అన్ని కణాలను చేరడం ద్వారా వాటికి శక్తినిస్తాయి. చెరకులో సుక్రోస్ భారీ పరిమాణంలో లభిస్తుంది. చెరకు, షుగర్ బీట్స్ అనే దుంపల్లో అత్యధికంగా ఉంటుంది. చక్కెరనే సూక్రోస్ అని కూడా చెబుతారు. ఈ సుక్రోస్ ను చెరకు నుంచి వేరు చేసి శుద్ధి చేసి చక్కెర పలుకులుగా తయారు చేస్తారు. 

చక్కెర వివిధ రూపాలు

సుక్రోస్: దీన్ని టేబుల్ షుగర్ గా పేర్కొంటారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తో తయారవుతుంది. చెరకు, షుగర్ బీట్స్ నుంచి తయారు చేస్తారు.

ఫ్రక్టోజ్, గ్లూకోజ్: ఈ రెండూ పండ్లు, కూరగాయలు, తేనెలో ఉంటాయి.

లాక్టోజ్: పాలు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది.

మాల్టోజ్: మాల్ట్ షుగర్ అనేది మాల్టెడ్ డ్రింక్స్, బీర్ లో ఉండేది.

representation image

రోజులో ఎంత తీసుకోవచ్చు?

ఆహార ఉత్పత్తుల తయారీలో కంపెనీలు వివిధ రూపాలలో ఉన్న చక్కెరలను కలుపుతుంటాయి (యాడెడ్ షుగర్). అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదేనీ ఓ ఆహార ఉత్పత్తిలో ఉండే మొత్తం కేలరీల్లో యాడెడ్ షుగర్ 10 శాతానికి మించి ఉండరాదని సూచించింది. యూకే శాస్త్రవేత్తలు అయితే దీన్ని 5 శాతంగానే సూచించారు.

యాడెడ్ షుగర్ అంటే సహజసిద్ధంగా లభించే చక్కెర కాకుండా మనం టీలో, కాఫీలో, వంటకాల్లో విడిగా కలుపుకునే చక్కెర. రెడీమెడ్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలలో కలిపే చక్కెర అని అర్థం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు ప్రకారం ఒక రోజులో పురుషులు అయితే 150 కేలరీలు అంటే 37.5 గ్రాములు లేదా 9 టీ స్పూన్లు చక్కెర వరకు తీసుకోవచ్చు. మహిళలు అయితే ఇది 25 గ్రాములు లేదా 6 టీ స్పూన్లను మించరాదు. మన భారతీయులు వీటి కంటే ఓ ఐదు పది గ్రాములు తగ్గించి తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణుల సూచన.

మనదేశంలో  చక్కెర వినియోగం 

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మనదేశంలో సగటున ఓ వ్యక్తి చక్కెర వినియోగం 58 గ్రాములుగా ఉంది. చైనాలో ఇది 33 గ్రాములే ఉంది. బ్రెజిల్ లో ఇది 152 గ్రాములు, మెక్సికోలో 104 గ్రాములు ఉంది. పాకిస్థాన్, అమెరికా, ఇండోనేషియాల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 25 గ్రాముల పరిమితి కంటే ఎక్కువగానే ఉంది. 

చక్కెరతో ప్రయోజనాలు ఉన్నాయా?

ఆహారానికి కొరత ఉన్నప్పుడు పంచదార తీసుకోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. టేబుల్ షుగర్ ను ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం తయారీకి వినియోగిస్తారు. ఇందులో ఉప్పు కూడా ఉంటుంది. డయేరియా, వడదెబ్బ సమయాల్లో ఓఆర్ఎస్ ద్రావకం ప్రాణాలను కాపాడుతుంది.  సిమెంటు, వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో చక్కెరను వినియోగిస్తారు.

representation image

ఎందులో ఎంత చక్కెర

మిల్క్ చాక్లెట్ లో 44 గ్రాములు అంటే ఆరు టీ స్పూన్లకు సమానమైన చక్కెర ఉంటుంది. కోకకోలా ఒక క్యాన్ లో 8 టీ స్పూన్లకు సరిపడా చక్కెరలు ఉంటాయి. పెప్సీ కోలాలో 9 టీ స్పూన్లు, రెడ్ బుల్ లో 7 టీ స్పూన్లు, మౌంటెయిన్ డ్యూ లో 11 టీ స్పూన్లు, స్ప్రైట్ లో 8 టీ స్పూన్ల చక్కెరలు ఉంటాయి.

100 గ్రాముల చొప్పున.... మామిడి పండ్లలో 3 టీ స్పూన్లు, అరటి పండ్లలో 3, యాపిల్ పండ్లలో 2.6, పైనాపిల్ పండ్లలో 2.5, ద్రాక్షల్లో 4 టీ స్పూన్లు, టమాటాల్లో 0.7 టీ స్పూన్ల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఒక స్కూప్ ఐస్ క్రీమ్ లో 3 టీ స్పూన్లకు సమానమైన చక్కెర ఉంటుంది.

చక్కెరకు ప్రత్యామ్నాయాలుrepresentation image

స్టీవియా అనేది అమెరికాలో ఎక్కువగా వినియోగంలో ఉంది. ఇది మనదేశంలోనూ అందుబాటులో ఉంది. స్టీవియా అనేది ఒక మొక్క. ఈ చెట్టు ఆకులు ఎండబెట్టి పొడిగా చేస్తారు. ఈ పొడి చక్కెరతో పోలిస్తే 40 శాతం ఎక్కువ తీపిదనంతో ఉంటుంది. టీలు, కాఫీల్లో దీన్ని కలుపుకుని తాగవచ్చు. స్టీవియా పొడిలో కేలరీలు ఉండవు. దీంతో బ్లడ్ షుగర్ పెరగదు. కాకపోతే ఈ పొడి కొంచెం చేదుగా కూడా ఉంటుంది.

తేనెలో 53 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. కానీ ఇదంతా సహజసిద్ధమైనది. కనుక మోస్తరు పరిమాణంలో వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తేనెలో ఉన్నాయి. డేట్ షుగర్ అని ఖర్జూరాలను ఎండబెట్టి పొడిగా మారుస్తారు. తీపి వంటకాల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను వాడుకోవచ్చు. శాక్రీన్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు కూడా ఏమంత మంచివి కావని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

 representation image

సాల్ట్ అవసరం ఏంటి?

సోడియం క్లోరేడ్ అనేది మన రక్తంలో ప్రతీ 100 మిల్లీ లీటర్ కు గాను 0.9 గ్రాములు ఉంటుంది. శరీరంలో కొన్ని క్రియలు జరగడానికి సాల్ట్ చాలా అవసరం. ఎర్ర రక్త కణాల నిర్వహణకు, ప్రొటీన్లు కరగడానికి ఇది చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగినంత ఉంటేనే మన శరీర ఉష్ణోగ్రతలు కూడా సమ స్థితిలో ఉంటాయి. సోడియం అయాన్లు నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచేలా చూడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కండరాల సంకోచానికి, నాడీ ప్రేరేపణలకు ఇవి చోదకంగా పనిచేస్తాయి. 

గుండెలో హృదయ స్పందనలకు వీలుగా చాలా తక్కువ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది. ఈ విద్యుత్ చర్యలకు సోడియం అయాన్లు అవసరం. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం. ఇది ఏర్పడడానికి సోడియం సహకరిస్తుంది. వాంతులు, విరేచనాలు అయిన వారిలో సోడియం, పొటాషియం లవణాలు తగ్గిపోయి నీరసించిపోతారు. వారికి సోడియం క్లోరేడ్, పొటాషియం క్లోరైడ్ ను వైద్యులు సెలైన్ ద్వారా ఎక్కించడం చూసే ఉంటారు. రక్తం, లింఫ్ (శోషరసం), కన్నీరు, జీర్ణాశయంలోని స్రావాల్లో యాసిడ్ సమతుల్యతకు సోడియం అవసరం. 

రోజులో ఎంత తీసుకుంటే మంచిది?

నిపుణుల సూచన ప్రకారం ఒక రోజులో 5 గ్రాములకు మించి సాల్ట్ తీసుకోరాదు. ఒకవేళ వారి కుటుంబంలో రక్తపోటు చరిత్ర ఉండి ఉంటే రోజులో 2 గ్రాములకే పరిమితం కావాలి. ఈ పరిమితికి మించి తీసుకుంటే అదే సాల్ట్ మనకు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే, వేసవి వంటి కాలాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరంలోని సోడియం చెమట రూపంలో బయటకు వెళుతుంది. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కువ చెమట పట్టినప్పుడు మన వస్త్రాలపై తెల్లని చారికలు ఏర్పడడం గమనించే ఉంటారు. చెమటలోని సోడియం క్లోరైడ్ వస్త్రాలకు పట్టుకోవడం వల్ల అలా కనిపిస్తుంది. 

representation image

దుష్ప్రభావాలు

సోడియం ఎంత కీలకమైనదో తెలుసుకున్నాం. కానీ, ఇదే సోడియంతో దుష్ప్రభావాలు సైతం ఉన్నాయి. సోడియం పరిమితికి మించితే అది ఒత్తిడి చూపుతుంది. నాడీ వ్యవస్థను, అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుంది. దాంతో ఒత్తిడి కలుగజేస్తుంది. అందుకే దీన్ని స్ట్రెస్ ఫుడ్ అని అంటుంటారు. అధికంగా ఉన్న ఉప్పు శరీరంలో నీరును నిలిపి ఉంచుతుంది. దాంతో రక్త పరిమాణం పెరిగి గుండె ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. దీంతో అధిక రక్తపోటు ఏర్పడుతుంది. అందుకే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారిని ఉప్పు తగ్గించమని వైద్యులు సూచిస్తుంటారు.

అధికంగా సాల్ట్ తినడం వల్ల ఎముకల్లో ఉన్న క్యాల్షియం తగ్గిపోతుంది. దీంతో ఎముకలు గుల్లబారిపోతాయి. దీంతో మూత్రంలో సోడియం పరిమాణం పెరిగిపోతుంది. అధికంగా ఉన్న సోడియాన్ని బయటకు పంపేందుకు మూత్ర పిండాలు మరింతగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో మూత్రపిండాలు క్రమేపీ బలహీనపడతాయి. నిజానికి మన మూత్రపిండాలు ఒక రోజులో నాలుగైదు గ్రాములకు మించి సోడియాన్ని తొలగించలేవు. దీంతో మిగిలిన సోడియం శరీరంలోనే ఉండిపోవడం వల్ల బీపీ పెరిగిపోతుంది. 

సాల్ట్ ఎక్కువైతే బరువు పెరుగుతారు. ఎందుకంటే శరీరంలో సోడియం ఎక్కువగా ఉంటే నీరు ఎక్కువగా ఉండిపోతుంది. దాంతో బరువు కూడా అధికంగా ఉంటారు. గుండె పనితీరు, కిడ్నీల పనితీరు బాగుండాలంటే సోడియం వినియోగాన్ని కట్టడి చేయాలి. గుండె బలహీనపడితే కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పుడు కూడా కిడ్నీలు అధికంగా ఉన్న సాల్ట్ ను సమర్థవంతంగా బయటకు పంపలేవు.

టేబుల్ సాల్ట్

మనం వాడే సాల్ట్ ని టేబుల్ సాల్ట్ అంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద టేబుల్ సాల్ట్ ని తయారు చేస్తారు. ఇది నీటిలో పూర్తిగా కరగదు. ఉప్పు వల్ల యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. టేబుల్ సాల్ట్ లో సహజసిద్ధమైన సోడియం లోపించడం వల్ల బ్రాంకియల్, లంగ్స్ సమస్యలు ఏర్పడతాయి. సహజసిద్ధమైన సోడియం మనం పీల్చిన కార్బన్ డైఆక్సైడ్ (సీఓ2)ను తొలగించడానికి అవసరం. 

నిజానికి మనం నిత్య జీవితంలో తీసుకునే కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాల్లో సహజసిద్ధంగానే సోడియం ఉంటుంది. శరీరానికి ఇది సరిపోతుంది. వాంతులు, విరేచనాలు, వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమయాల్లో తప్ప అదనంగా సాల్ట్ అవసరం పడదు.  

representation image

సోడియం ఎందులో ఎంత?

(ప్రతీ వంద గ్రాములకు సాల్ట్ పరిమాణం మిల్లీ గ్రాముల్లో)... ఉల్లిగడ్డల్లో 5, నీటిలో ఒకటి నుంచి మూడు మిల్లీ గ్రాములు, పప్పుల్లో 40, బంగాళాదుంపలో 11, క్యారట్ లో 36, జామపండులో 6, యాపిల్ లో 28, గోధుమల్లో 18, టమాటాలో 46, పుచ్చకాయలో 6, వంకాయలో 3, అరటిపండులో 37, గుడ్డులో 129, పాలకూరలో 58, పెసల్లో 28, కీరదోసలో 10, సజ్జలు, మొక్కజొన్నల్లో 10, ముల్లంగిలో 33 ఎంజీ చొప్పున సోడియం ఉంటుంది.

ప్రస్తుతం ఎక్కువ మంది శుద్ధి చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్ ను ఇష్టపడుతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్, సాస్, కార్న్ ఫ్లేక్స్, ఉప్పు బిస్కెట్లు, బటర్ మిల్క్, లస్సీ, సలాడ్, పచ్చళ్లు, పాపడ్స్, పొటాటో చిప్స్, వేయించి ఉప్పు చల్లిన వేరుశనగ గింజలు, బాదం, జీడి పప్పులు, పిజ్జా, శాండ్ విచ్, సమోసా, చాట్, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇలాంటి ప్రతీ ఆహారంలోనూ ఉప్పు గణనీయంగా ఉంటుంది. చాలా వరకు నిల్వ ఉండే ఆహార పదార్థాల తయారీలో సోడియం నైట్రేట్ వాడుతుంటారు. ఇది కేన్సర్ కారకమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. టేబుల్ సాల్ట్ కంటే ఇది తక్కువ ఉప్పగా అనిపిస్తుంది. కానీ మూడు రెట్లు అధికంగా సోడియం ఉంటుంది. 

representation image

ప్రత్యామ్నాయాలు

రాక్ సాల్ట్ అనేది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది. దీంతో శరీరంలోని ఎంజైమ్స్ మరింతగా వినియోగించుకోగలుగుతాయి. పర్వత ప్రాంతాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తుంటారు. బ్లాక్ సాల్ట్ (కాలా నమక్) అనేది కూడా సహజసిద్ధంగా తయారవుతుంది. ఇది కూడా టేబుల్ సాల్ట్ కంటే నయమే. ఎందుకంటే టేబుల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ రెండింటిలో సోడియం ఒకే పరిమాణంలో ఉంటుంది. కానీ పొటాషియం క్లోరైడ్ బ్లాక్ సాల్ట్ లో అధిక పరిమాణంలో ఉంటుంది. అలాగే, ఔషధ గుణాల కారణంగా బ్లాక్ సాల్ట్ వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇక అధిక రక్తపోటు బాధితులు సోడియం సాల్ట్ తీసుకోకుండా పొటాషియం సాల్ట్ తీసుకుంటే మంచిది. అన్నపూర్ణా సాల్ట్, సఫోలా సాల్ట్ బ్రాండ్స్ లో ఇది అందుబాటులో ఉంది. 


More Articles