కాసులు కురిపించే కాంపౌండింగ్ వడ్డీ!
‘కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ) అనేది ప్రపంచంలో ఎనిమిదో వింత. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారో వారికి ఆదాయం వచ్చి పడుతుంది. ఎవరు దీన్ని అర్థం చేసుకోరో వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ స్వయానా చెప్పినది.
‘మీ దగ్గరున్న డబ్బు మీ కోసం పని చేయాలి. దాని కోసం మీరు పనిచేయరాదు’ ప్రఖ్యాత రచయిత నెపోలియన్ హిల్ చెప్పిన మాట ఇది. హిల్ దృష్టిలో మీ కోసం పనిచేసేదే చక్రవడ్డీ. నిజానికి చక్రవడ్డీలో అంత మహిమ ఉంది మరి. ఇది తెలిస్తే సంపద సృష్టించడం ఎంతో ఈజీ.
లెక్కలు తెలుసుకోవాలి మరి
ఆర్థిక నిపుణులు చెప్పేదేమంటే.. ఈ ప్రపంచంలో రెండు రకాల ఇన్వెస్టర్లు ఉంటారు. ఒకరు చక్రవడ్డీ అంటే ఎంతో అర్థం చేసుకునేవారు, మరొకరు అర్థం చేసుకోలేని వారు. ఈ ప్రపంచంలో ధనవంతులుగా మారిన వారిలో అధిక శాతం మంది కనీస ఆర్థిక విజ్ఞానం ఉన్నవారు, లెక్కల గురించి తెలిసి ఉన్నవారే. డబ్బులు సంపాదించడం ఎవరికైనా సాధ్యం కావచ్చు. కానీ ఆ సంపాదనను సంపదగా మార్చుకోవడం అందరి వల్లా కాదు. కేవలం కొద్ది మందే ఈ విషయంలో విజేతలుగా కనిపిస్తారు. ఎందుకంటే వారికి చక్రవడ్డీల్లాంటి సంపద సూత్రాలు తెలుసు గనుక.
డబ్బు పిల్లలు పెట్టాలంటే...?
మీ దగ్గరున్న ధనం తొందరగా రెట్టింపు కావాలంటే...? దీనికి సమాధానం టక్కున చెప్పగలరా? చాలా మందికి సాధ్యం కాదు. జవాబు చాలా సింపుల్. అధికంగా వడ్డీ లభించే సాధనాల్లో మదుపు చేయడమే. ఉదాహరణకు ఏడాదికి 10 శాతం చొప్పున మీ దగ్గరున్న ధనం వృద్ధి చెందుతోందని అనుకుంటే... పదిహేనేళ్లకు అది 4.18 రెట్లు అవుతుంది. కానీ అదే ధనం ఏటా 33 శాతం వృద్ధి చెందితే 4.18 రెట్లు కావడానికి 5 ఏళ్లు చాలు.
చక్రవడ్డీ అంటే..?
కాంపౌండింగ్ అంటే మీ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయం తిరిగి పెట్టుబడులకు మళ్లడం ద్వారా మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. వడ్డీ ఆదాయం వెళ్లి అసలు ఆదాయానికి కలుస్తుంది. దాంతో ఆ కలిసిన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీపై వడ్డీనే చక్రవడ్డీ అని పిలుస్తారు. అందుకే ఎంత ముందుగా సంపాదన మొదలు పెడితే అంత ఎక్కువగా సంపద పోగేసుకోవచ్చు. వడ్డీ వెళ్లి అసలుకు కలవడం ద్వారా మరింత రాబడి వస్తుంది.
పొదుపు చేసి మదుపు చేయాలి
సంపాదనను బ్యాంకు ఖాతాలో ఉంచేసుకుంటే చక్రవడ్డీ ఏం చేయలేదు. పొదుపు చేసి మదుపు చేయాలి. ఈ మదుపు ఏటా పెరుగుతుండాలి. ఉదాహరణకు జానకీరామ్ నెలకు 10వేల రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో గ్రోత్ ఆప్షన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వార్షికంగా 15 శాతం రాబడి ఉంటే 20 ఏళ్ల తర్వాత 1.4 కోట్ల రూపాయలు సమకూరతాయి. చూడ్డానికి కోటిన్నర అయినా ద్రవ్యోల్బణం ప్రభావం చూస్తే నిజానికి అతడు కోటీశ్వరుడు కానట్టే. ఇలా కాకుండా ఏడాదికోసారి నెల వాయిదాపై పది శాతాన్ని అదనంగా పెంచుకుంటూ వెళ్లాలి. అంటే రెండో ఏడాది 11 వేలు మూడో ఏడాది 12,100 రూపాయల చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే జానకీరామ్ 2.66 కోట్ల రూపాయలను సమకూర్చుకోగలడు.
ముందుగా స్టార్ట్ చేయాలి
చక్రవడ్డీ నుంచి మరింత లబ్ధి పొందాలంటే ఒకటి ముందుగా పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాలి. రెండోది ఎక్కువ వడ్డీ వచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే రాబడి ఎక్కువగా ఉంటే అది చక్రవడ్డీ విధానంలో అసలుకు వెళ్లి కలవడం ద్వారా మరింత అధికంగా ప్రతిఫలం అందుకోవచ్చు.
ఈ ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది
క్రాంతి వయసు 24 ఏళ్లు. నెలకు 2,000 రూపాయల చొప్పున 30వ ఏట వరకు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఆపేశాడు. 65వ ఏట వచ్చే వరకు వాటిని వెనక్కి తీసుకోలేదు. కనిముత్తు వయసు 30 ఏళ్లు. ఇతడు కూడా నెలకు 2వేల రూపాయల చొప్పున 65వ ఏట వరకు ఇన్వెస్ట్ చేశాడు. వార్షిక రాబడి 12 శాతంగా లెక్కిస్తే ఇప్పుడు క్రాంతి, కనిముత్తు దగ్గర ఎంతెంత ఫండ్ ఉంటుందో ఆలోచించండి. ఇద్దరి దగ్గరా 1.28 కోట్ల రూపాయలు ఉంటుంది. క్రాంతి ముందుగా పెట్టుబడి పెట్టి ఆపేశాడు. అంతే మొత్తాన్ని ముత్తు ఆలస్యంగా ప్రారంభించి చివరి వరకూ కొనసాగించినా అంతే సమకూరింది. ఇదే చక్రవడ్డీ మహిమ అంటే. మరి ఈ మహిమను అనువుగా మలచుకోవాలంటే చాలా ముందుగానే మదుపు మొదలుపెట్టాలి. ఆలస్యమైతే చక్రవడ్డీ కూడా ఏమీ చేయలేదు. పండుగా ఉన్నప్పుడే ఫలాన్ని తినేయాలి. ఆలస్యం చేస్తే ఏమవుతుందో తెలుసు కదా?
ఎక్స్ అనే ఇన్వెస్టర్ 24వ ఏట నుంచి ఏడాదికో 2వేల రూపాయల చొప్పున ఆరేళ్ల పాటు 12వేల రూపాయలను 12 శాతం రాబడినిచ్చే సాధనాల్లో పెట్టుబడి పెట్టి ఆపేశాడు. వై అనే ఇన్వెస్టర్ కూడా ఇంతే కాలం 8 శాతం రాబడినిచ్చే వాటిలో మదుపు చేశాడు. జెడ్ అనే ఇన్వెస్టర్ 4 శాతమే రాబడినిచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాడు. అప్పుడు 65వ ఏట ఎక్స్ అనే ఇన్వెస్టర్ కు 10.7 లక్షలు, వై ఇన్వెస్టర్ కు 2.5లక్షలు, జెడ్ అనే ఇన్వెస్టర్ కు 56వేల రూపాయలు లభించింది. అందరూ ఒకే మొత్తం పెట్టుబడి పెట్టారు. చూడ్డానికి వడ్డీలో తేడా కొంచెమే అనిపిస్తుంది. కానీ, రాబడిలో ఎంత తేడా ఉందో చూశారుగా?
క్రెడిట్ కార్డు రుణం భారంగా మారేదీ చక్రవడ్డీతోనే
క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని సకాలంలో చెల్లించకపోతే దానిపై అధిక వడ్డీ పడుతుంది. చెల్లించడం ఆలస్యమయ్యే కొద్దీ ఆ వడ్డీ వెళ్లి అసలు రుణానికి కలసి అలా వడ్డీపై వడ్డీతో రుణం తీర్చలేనిదిగా మారుతుంది.
డబ్బు ఎంత కాలంలో రెట్టింపు?
మీ దగ్గర పది వేల రూపాయలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేయాలనుకుంటున్నారు. ఎంత కాలంలో రెట్టింపు అవుతుంతో తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం వడ్డీ రేటుతో 72ను భాగించండి. ఉదాహరణకు ఏడాదికి 12 శాతం వడ్డీ రేటు ఉంటే... దాన్ని 72తో భాగిస్తే ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని అర్థం. అదే 7.5 శాతం వడ్డీ రేటు ఉందనుకుంటే అప్పుడు 9.6 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. ఇలా కాకుండా మీరు ఐదేళ్లలో రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నారని అనుకుంటే... అప్పుడు 72ను 5తో భాగించండి. అప్పుడు ఎంత వడ్డీ రేటు వచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టాలో తెలుస్తుంది.
25 రూపాయలతో రూ.9 లక్షలు
ఓ తండ్రి తన కుమారుడిపై ప్రేమతో అతడు బుజ్జాయిగా ఉన్నప్పటి నుంచే రోజుకు రూ.25 చొప్పున అతడికి 25ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. 10 శాతం వార్షిక చక్ర వడ్డీ ప్రాతిపదికన 25వ పుట్టిన రోజు నాటికి సమకూరిన మొత్తం 9.25లక్షల రూపాయలు. కేవలం 25 రూపాయలు ఎంత సంపదను సృష్టించిందో చూశారుగా. ఇది కాంపౌండింగ్ మహిమ. రోజుకు 150 రూపాయల చొప్పున 10 ఏళ్లు పెట్టుబడి పెట్టినా రూ.9లక్షలు సమకూరతాయి. రోజుకు రూ.25 రూపాయలకు బదులు నెలకు 3వేల రూపాయల చొప్పున అంతే చక్రవడ్డీ వచ్చే వాటిలో పెట్టుబడి పెడితే 25వ పుట్టిన రోజు నాటికి కోటి రూపాయలు సమకూరుతాయి. ఇలా కాకుండా రోజుకు 25 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వెళితే 25వ పుట్టిన రోజునాటికి 4 శాతం వడ్డీ రేటుపై వచ్చేది 3.8లక్షలే.
రిటైర్మెంట్ ప్రణాళికకు
రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకునేందుకు పై ఉదాహరణలు ఉపయోగపడతాయి. 25వ ఏట నుంచి నెలకు 3వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లితే 10 శాతం చక్రవడ్డీ ప్రకారం 60వ ఏటకు వచ్చే సరికి కోటి రూపాయలు సమకూరతాయి. అప్పటి నుంచి నెలకు 34వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ వెళితే ఆ కోటి రూపాయలు 85వ ఏట వచ్చే వరకు సరిపోతాయి.
చక్రవడ్డీ ఏం చెబుతోందంటే..?
సంపద అనేది రాత్రికి రాత్రే సాధ్యం కాదు. శక్తిమేర క్రమం తప్పకుండా మెరుగైన రాబడినిచ్చే వాటిలో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. అదీ ముందుగానే అంటే చాలా చిన్న వయసులోనే మొదలు పెట్టాలి. పెట్టే పెట్టుబడి కూడా ఏటేటా పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల ఖర్చులు ఏటేటా పెరుగుతుంటాయి. మరి అలా పెరుగుతూ పోయే ఖర్చులను తట్టుకునేంత మొత్తంలో నిధి కూడా సమకూరాలి కదా. అందుకని ప్రస్తుతం నెల సంపాదన 30 వేల రూపాయలు ఉంటే 3వేలు మదుపు చేస్తుంటే... ఏడాది తర్వాత వేతనం 5వేలు పెరిగిందనుకోండి. అప్పుడు మరో రూ.500 కలిపి రూ.3,500 మదుపు చేయాలి. ఇక్కడ పట్టిక చూడండి. మొదటి ఏడాది పది వేల రూపాయలు పెట్టుబడి పెడితే 15 శాతం రాబడి అంటే 1,500 వచ్చింది. రెండో ఏడాది అసలు 10వేలు + రాబడి 1,500 మొత్తం 11,500 రూపాయలపై వడ్డీ వస్తుంది. ఇలా చక్రవడ్డీ వల్ల సంపద సాధ్యమవుతుంది. వారెన్ బఫెట్ సైతం చాలా చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించాడు. అందుకే నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద సంపన్నుడయ్యాడు.
Year | Investment | Growth | |
1 | 10000 | 15% | 11500 |
2 | 11500 | 15% | 13225 |
3 | 13225 | 15% | 15208.75 |
4 | 15208.75 | 15% | 17490.06 |
5 | 17490.0625 | 15% | 20113.57 |
6 | 20113.57188 | 15% | 23130.61 |
7 | 23130.60766 | 15% | 26600.20 |
8 | 26600.1988 | 15% | 30590.23 |
9 | 30590.22863 | 15% | 35178.76 |
10 | 35178.76292 | 15% | 40455.58 |
11 | 40455.57736 | 15% | 46523.91 |
12 | 46523.91396 | 15% | 53502.50 |
13 | 53502.50105 | 15% | 61527.88 |
14 | 61527.87621 | 15% | 70757.06 |
15 | 70757.05764 | 15% | 81370.62 |
16 | 81370.61629 | 15% | 93576.21 |
17 | 93576.20874 | 15% | 107612.64 |
18 | 107612.64 | 15% | 123754.54 |
19 | 123754.5361 | 15% | 142317.72 |
20 | 142317.7165 | 15% | 163665.37 |