డెంగీ, చికున్ గున్యా... తస్మాత్ జాగ్రత్త

డెంగీ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న మహమ్మారి. చికున్ గున్యా అయితే కొన్నేళ్ల క్రితం చాలా మందిని మంచాన పడేసి వెళ్లిపోయింది. ఇప్పటికీ నాటి చికున్ గున్యా ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోని వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీని డెంగీ, చికున్ గున్యాలు వణికిస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ జ్వరాల బారిన పడి ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండేందుకు తస్మాత్ జాగ్రత్త అవసరం.

చికున్ గున్యా

ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వేయడం వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షనే చికున్ గున్యా జ్వరం. దీన్ని చికున్ గున్యా వైరస్ (ఆల్ఫా వైరస్) అంటారు. అలాగే, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే ఆడదోమ చికున్ గున్యాతో బాధపడుతున్న రోగిని కుట్టడం ద్వారా ఆ వైరస్ బారిన పడుతుంది. ఆ తర్వాత ఈ దోమ కుట్టిన వారికి కూడా చికున్ గున్యా వైరస్ సోకుతుంది. టాంజానియా, మొజాంబిక్ దేశాల్లో మాట్లాడే కిమకొండే భాషలో చికున్ గున్యా అంటే కీళ్లు వంకరపోవడమని అర్థం. చికున్ గున్యా జ్వరం వస్తే ఎక్కువగా కీళ్లపైనే ప్రభావం పడుతుంది. పదేళ్ల క్రితం చికున్ గున్యా తెలుగువారిని గజగజ వణికించింది. అప్పట్లో లక్షల మంది దీని బారిన పడ్డారు. 

representation image

లక్షణాలు

దోమ కుట్టిన తర్వాత 3 నుంచి 7 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఉన్నట్టుండి జ్వరం అధికంగా కనిపిస్తుంది. 102 నుంచి 104 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతతో బాధితులు వణికిపోతారు. జాయింట్లలో వాపు, నొప్పి వుంటాయి. వెన్నుపూస దిగువ బాగంలో, మోకీళ్లు, కాలి మడమలు, వేళ్లు, చేతి మణికట్టు వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. జ్వరం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ వైరస్ మాత్రం మన శరీరంలో వారం వరకూ బతికే ఉంటుంది. ఈ కాలంలోనే ఆ వైరస్ శరీరమంతా వ్యాపిస్తుంది. జాయింట్లలోని కణాలను చికున్ గున్యా వైరస్ దెబ్బతీస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో జాయింట్లలో విపరీతమైన నొప్పి అందుకే వస్తుంది. చికున్ గున్యా ప్రాణాంతకం కాదు. అయితే, అప్పటికే ఏవైనా వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు మాత్రం ప్రాణాపాయం ముప్పు ఉంటుంది. అలాగే చిన్నారులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. 

పరీక్ష

రివర్స్ ట్రాన్స్ క్రిప్టేస్ పాలీమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనే పరీక్ష నిర్వహించడం ద్వారా చికున్ గున్యా వైరస్ ఉన్నదీ లేనిదీ తెలుసుకుంటారు. రక్త పరీక్షలో ఐజీఎం, ఐజీజీ యాంటీ చికున్ గున్యా యాంటీబడీస్ ఉన్నాయేమో నిర్ధారించుకుంటారు.

ఈ లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి

60 ఏళ్లకుపైబడి మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు, కిడ్నీ సమస్యలున్న వారిలో జ్వరం, కీళ్ల నొప్పులు కనిపిస్తే తక్షణమే ఆస్పత్రిలో చేర్పించాలి. లేకుంటే వీరికి ప్రాణాంతకం అవుతుంది. అలాగే, జ్వరంతో కంటి చూపు మందగించినా, అదే పనిగా వాంతులు అవుతున్నా, వికారంగా ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా కూడా ఆస్పత్రికి వెళ్లడం తప్పనిసరి. 

representation image

చికిత్స

చికున్ గున్యా నివారణకు వైద్యం లేదు. కాకపోతే దీని బారిన పడిన వారికి జ్వరం, నొప్పులు తగ్గేందుకు పెయిన్ రిలీవర్స్ ఇస్తారు. కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉండి బాధిస్తుంటే వైద్యులు స్టెరాయిడ్స్ సూచిస్తారు.


డెంగీ 

డెంగీ కూడా ఏడిస్ ఈజిప్టి దోమ కాటుతో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ లో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో కనిపిస్తున్నది మూడో రకం. ఇది అంత ప్రమాదకరం కాదు. 2, 4 రకాలు ప్రాణాంతకమైనవి. వైరస్ సోకిన దోమ కాటు వేయడం ద్వారా దాని లాలా జలం మన రక్తంలోకి విడుదల అవుతుంది. దీని ద్వారా వైరస్ మన శరీరం అంతటికీ వ్యాపిస్తుంది. తెల్ల రక్త కణాలు, యాంటీబాడీలపై దాడి చేస్తుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి అచేతనంగా మారిపోతుంది. డెంగీ మానవుల నుంచి మానవులకు రక్త మార్పిడి ద్వారా, అవయవదానం ద్వారా, తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే ప్రమాదం ఉంది. 

representation image

లక్షణాలు

దోమ కాటు వేసిన ఏడు రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వారం నుంచి పది రోజుల పాటు కొనసాగుతుంది. 103 డిగ్రీల ఫారిన్ హీట్ వరకు రావచ్చు. తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, కడుపులో తిమ్మిర్లు, చిగుర్లు, ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం, ఎర్రటి పొక్కులతో కూడిన దద్దుర్లు కనిపిస్తాయి. 

మరీ ముఖ్యంగా డెంగీతో వచ్చిన సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడం, రక్తస్రావం. ప్లేట్ లెట్స్ అన్నవి రక్తం గడ్డకట్టేందుకు దోహదం చేసి రక్తస్రావం కాకుండా చూస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతులైన వారిలో ప్రతీ ఎంఎల్ రక్తంలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్ లెట్స్ కౌంట్ ఉండాలి. ఈ ప్లేట్ లెట్స్ తగ్గిపోతే అంతర్గతంగా బ్లీడింగ్ అయి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయే  ప్రమాదం ఉంటుంది. 

రోగ నిర్ధారణ

డెంగీ అని అనుమానిస్తే వైద్యులు రెండు రకాల పరీక్షలు సూచిస్తారు. ఎన్ఎస్1 ఎలీసా యాంటీజెన్ టెస్ట్ ను జ్వరం వచ్చిన మూడు రోజుల్లో సూచిస్తారు. దీంతో పాటు ప్లేట్ లెట్స్ కౌంట్ పరీక్ష కూడా చేయించాల్సి ఉంటుంది.

డెంగీ ఇన్ఫెక్షన్ లో ప్రధానంగా ఈ ప్లేట్ లెట్స్ కౌంట్ కూడా తగ్గుతుంది. 30వేలకు పడిపోతే అత్యవసర పరిస్థితిగా భావించి ప్రత్యేక పర్యవేక్షణలో లిక్విడ్స్ ఎక్కిస్తూ వైద్యం అందించాల్సి ఉంటుంది. ఈ కౌంట్ 10వేల కంటే తక్కువకు వస్తే వెంటనే రక్తమార్పిడి అవసరం అవుతుంది. అందుకే ప్లేట్ లెట్ కౌంట్ 30వేల స్థాయికి పడిపోతే, చిగుర్లు, ముక్కు, చెవుల నుంచి రక్తం కారినా, మలం, మూత్రంలో రక్తం కనిపించినా, కడుపులో నొప్పిగా ఉన్నా, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా, చర్మంపై దద్దుర్లు కనిపించినా వెంటనే ఆస్పత్రిలో చేరాలి. 

చికిత్స

డెంగీకి నివారణ లేదు. జ్వరానికి పారాసిటమాల్ మాత్రతో ఉపశమనం పొందవచ్చు. ఈ జ్వరంలో ఉన్న వారు యాస్పిరిన్ మాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. 

ముందు జాగ్రత్తలు

కాళ్ల నుంచి చేతుల వరకు శరీరమంతటినీ కప్పి ఉంచే వస్త్రాలు వేసుకోవాలి. మస్కిటో స్ప్రేలు, క్రీమ్స్, దోమ తెరల ద్వారా రక్షణ కల్పించుకోవాలి. ఏడిస్ ఈజిప్టి మంచినీటిపై ఆశ్రయం పొందుతుంది. అంటే మురికి కాల్వల్లో నివాసం ఉండదు ఇది. ఇంట్లో వాటర్ ట్యాంకులు, కూలర్లలో నీళ్లు, వంటి చోట ఉంటుంది. అందుకే ఈ విధమైన నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంకును తెరిచి ఉంచకుండా క్లోజ్ చేసి ఉంచాలి. అలాగే కిటికీ తలుపులను సైతం తెరవకుండా వర్షాకాలంలో జాగ్రత్త పడాలి. దాని వల్ల బయటి నుంచి దోమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

జ్వరం ఎక్కువగా ఉన్నప్పటికీ వాంతులు అవకుండా, బీపీ సాధారణంగానే ఉంటే ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదు. చాలా నీరసపడినా, వాంతులు అదే పనిగా అవుతున్నా, శరీరంలో లవణాలు కోల్పోయే డీహైడ్రేషన్ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితి కనిపించినా, శరీరంలో ఎక్కడైనా రక్తం కారుతున్నట్టు అనిపించినా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం అవసరం. 24 గంటలకు మించి తీవ్ర జ్వరం కొనసాగుతుంటే పారాసిటమాల్, యాంటీబయోటిక్ మందులు తీసుకోకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. జ్వరంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. త్వరగా రికవరీ అయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి. 

representation image

డెంగీలో రక్తస్రావం ఎందుకవుతుంది?

రక్తస్రావం ఎందుకు అవుతుందంటే శరీర భాగాల్లోని సూక్ష్మ రక్తనాణాలపై వైరస్ దాడి చేయడం వల్ల. దీంతో రక్తనాళాలు పగిలి రక్తస్రావం అవుతుంది. రక్తం పోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. నాడీ వేగం కూడా తగ్గుతుంది. దీంతో షాక్ కు లోనై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చిగుళ్లు, ముక్కులో సూక్ష్మ రక్త నాళాలు ఉంటాయి గనుక ఇక్కడి రక్తస్రావం మనకు కనిపిస్తుంది. అలాగే, చర్మంపై సన్నటి ఎర్రపొక్కులు కూడా దీని ఫలితమే.

రెండింటి మధ్య చాలా పోలికలు

డెంగీ, చికున్ గున్యా రెండూ కూడా ఏడిస్ ఈజిప్టి అనే రకం దోమతో వచ్చేవే. అయితే, చికెన్ గున్యా వైరస్ ను ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే ఏషియన్ టైగర్ దోమ కూడా వ్యాధికి గురైన ఇతరుల నుంచి మోసుకొస్తుంది. రెండింటిలోనూ దోమ కుట్టిన దగ్గర్నుంచి అస్వస్థతకు గురయ్యే మధ్య వ్యవధి కూడా ఇంచుమించుగా సమానం. ఇది మూడు నుంచి ఏడు రోజులుగా ఉంటుంది. తీవ్ర తలపోటు ఉంటే మాత్రం అది దాదాపుగా డెంగీనే అయి ఉంటుంది.

వ్యాధి లక్షణాలు కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. కాకపోతే డెంగీలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతుంటుంది. రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. కళ్ల కింద నొప్పి ఉంటుంది. రెండింటిలోనూ కీళ్ల నొప్పులు ఉన్నప్పటికీ... చికున్ గున్యా బారిన పడిన వారిలో ఈ కీళ్ల నొప్పుల తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. చికున్ గున్యా బారిన పడిన వారు కొన్ని రోజులకు పూర్తిగా కోలుకుంటారు. అయితే, అప్పటికే కీళ్లు కొంచెం బలహీన పడిన వారిలో నొప్పులు నెలలు, సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు. చికున్ గున్యా జ్వరంలో మూడో రోజు వంటిపై దద్దుర్లు కనిపిస్తాయి. అరుదైన నాడీ సంబంధ, కంటి సంబంధ, గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. అలాగే, జీర్ణాశయ సమస్యలు కూడా కనిపించవచ్చు. ఏడిస్ ఈజిప్టి దోమలు పగటి పూడే కుడతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున వీటి దాడి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం చీకటి పడేలోపు ఉంటుంది.   

representation image

టెంపరేచర్ ఎందుకంతగా పెరిగిపోతుంది?

నిజానికి చికున్ గున్యా, డెంగీలలో జ్వరం ఎందుకు పెరిగిపోతుందో తెలుసా...?  ఎందుకంటే శరీరం వైరస్ పై దాడి చేసి దాన్ని చంపేసేందుకు ఉష్ణోగ్రతను పెంచుతుంది. మిగతా ఇన్ఫెక్షన్ సమయాల్లో ఈ స్థాయిలో టెంపరేచర్ పెరిగిపోదు.  


More Articles