తిరుమల బ్రహ్మాండ నాయకునికి జరిగే విశేష సేవలు
ఓం నమో వేంకటేశాయ నమ:.. నాలుగు ప్రధాన వైష్ణవ ఆగమాల్లో ఒకటైన వైఖానస ఆగమం ప్రకారం తిరుమలలో వేంకటేశ్వరస్వామికి నిత్య, వార, పక్ష, మాస, వార్షిక సేవలు జరుగుతుంటాయి. వైఖానస ఆగమం రోజులో ఆరు సార్లు శ్రీవేకంటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించాలని సూచించింది. ఆరోగ్యకరమైన జనాభా కోసం ప్రత్యూష కాలంలో, ప్రాత:కాలంలో, రాజ్యం కోసం మధ్యాహ్నం, దుష్ట శక్తుల నివారణకు అపరాహ్న సమయంలో, వ్యవసాయ ఉత్పాదన పెరిగేందుకు సాయంకాలం, పశు సంపద వృద్ధికి నిశి ఆరాధన అని మొత్తం ఆరు కాలాల్లోనూ పూజలను వైఖానస ఆగమం పేర్కొంది.
అయితే, ఆరు సార్లు పూజలు నిర్వహించడం వీలవక ప్రస్తుతం తిరుమలలో త్రికాలాల్లోనే పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తోమాల సేవ. దీన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తున్నారు. ఇది ఆర్జిత సేవ. మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున పూజలు జరుగుతుంటాయి. రాత్రి పూట గర్భగుడిలో స్వామి వారికి నిర్వహించే పవళింపు సేవలో అర్చక స్వాములు, పరిచారకులు, ఆచార్య పురుషులు మాత్రమే ఉంటారు.
నిత్య సేవలు
స్వామి వారికి అనునిత్యం కొన్ని రకాల ఆర్జిత సేవలు జరుగుతుంటాయి. ఈ సేవలను భక్తులు నిర్వహించుకోవచ్చు. వేకువజామున 3 గంటల తర్వాత సుప్రభాత సేవ ఉంటుంది. స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలుపుతారు. తర్వాత తోమాల సేవ ఉంటుంది. తర్వాత అర్చన జరుగుతుంది. చివరిగా జరిగే ఏకాంత సేవకు భక్తులకు అనుమతి ఉండదు.
సుప్రభాతం
స్వామి వారికి జరిగే తొట్ట తొలి సేవ ఇది. గర్భుగుడి లోపల శయన మండపంలో ఈ సేవ జరుగుతుంది. నిద్ర నుంచి స్వామి వారిని మేల్కొలుపుతారు. ఆచార్య పురుషులు బంగారు వాకిలి వద్ద ఉండి కౌసల్యా సుప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సుప్రభాతాన్ని పఠిస్తారు. అదే సమయంలో తాళ్లపాక అన్నమాచార్య వంశస్థుడు ఒకరు అన్నమయ్య కీర్తనలలో కొన్నిటిని ఆలాపిస్తారు. సంస్కృతంలో సుప్రభాతం అంటే శుభోదయం/గుడ్ మార్నింగ్ అని అర్థం.
సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనంతో ఈ సేవ ముగుస్తుంది. సుప్రభాతంలో 29 శ్లోోకాలు, స్తోత్రంలో 11 శ్లోకాలు, ప్రపత్తిలో 16 చరణాలు, మంగళా శాసనంలో 14 చరణాలు ఉంటాయి. సుప్రభాత సేవ ముగిసిన తర్వాత శయన మండపం నుంచి భోగ శ్రీనివాస మూర్తిని గర్భగుడిలోకి తీసుకెళతారు. సుప్రభాత సేవకు అరగంట సమయం తీసుకుంటుంది. సుప్రభాతం ముగిసిన వెంటనే బంగారు వాకిలిని తెరుస్తారు. సుప్రభాత సేవ టికెట్లను టీటీడీ వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ విధానంలో కొనుగోలు చేసుకోవచ్చు. ఏడాదిలో ధనుర్మాసం మినహా మిగిలిన అన్ని రోజులూ వేకువజామున తప్పనిసరిగా జరిగే సేవ ఇది. కాకపోతే ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై సేవ ఉంటుంది.
సహస్రనామార్చన (అర్చన)
వారంలో మూడు రోజులు మంగళవారం, బుధవారం, గురువారం స్వామి వారికి తెల్లవారుజామున 4.30 గంటలకు అర్చన జరుగుతుంది. మే, జూన్, జూలై నెలల్లో సోమవారం ఈ సేవకు టికెట్లు అందుబాటులో ఉండవు. దీన్నే సహస్ర నామార్చన అని కూడా అంటారు. తిరుమలలో స్వామి వారికి మాత్రమే జరిగే సహస్ర నామార్చన గురించి 1518కి ముందునాటి శాసనాల్లోనూ ఉంది.
తోమాల సేవ
సుప్రభాత సేవతో నిద్ర నుంచి మేల్కొలిపిన తర్వాత స్వామి వారికి నిర్వహించే సేవ ఇది. తోమాల అంటే పూల దండ. రకరకాల పూలు, తులసి దళాలతో కట్టిన దండను స్వామి వారికి అలంకరిస్తారు. యమునాదురై నుంచి పూల దండలను ఆలయానికి చెందిన పెరియ జీయర్ తీసుకుని వస్తారు. వాటితో సేవ జరుగుతుంది. ఈ సేవ సమయం 30 నిమిషాలు. ఈ సేవ మంగళ, బుధ, గురువారాల్లోనే జరుగుతుంది.
ఏకాంత సేవ
నిత్య సేవల్లో చివరిది ఏకాంత సేవ. భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలోని బంగారు పడకపై ఆశీనులను చేస్తారు. స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు అన్నమాచార్య వంశస్థులు పద్యాలు పాడతారు. ఏకాంత సేవకు మరో పేరు పాన్పు సేవ. తరిగొండ వెంగమాంబ హారతి అని కూడా ఇస్తారు. ఏడాదిలో 11 నెలలు భోగ శ్రీనివాసమూర్తిని, ఒక నెల ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడిని శయనింపజేస్తారు.
వారపు సేవలు
వారంలోని ఏడు రోజుల్లోనూ స్వామి వారికి ప్రత్యేక సేవలు జరుగుతుంటాయి. సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం, వస్త్రాలంకార సేవ, నిజపాద దర్శనం సేవలు ఉంటాయి.
విశేష పూజ (సోమవారం)
ప్రతీ సోమవారం రెండో గంట తర్వాత ఉత్సవ విగ్రహాలను చతుర్దశ కలశ విశేష పూజ కోసం మండపానికి తీసుకొస్తారు. 14 కలశాలతో స్వామి వారికి పూజ ఉంటుంది. శ్రీ మలయప్ప స్వామి వారి అనుమతి తీసుకున్న అనంతరం స్వామి వారికి అంకురార్పణ, పుణ్యహవచనం చేస్తారు. పంచసూక్తాలైన, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, పురుష, నారాయణ సూక్తాలను పఠిస్తారు. ఉత్సవమూర్తులకు తిరుమంజనం ఉంటుంది. 14 కలశాలలో ఏడు కలశాలలలో శుద్ధోదకం (జలం) ఉంటుంది. మిగిలిన ఏడు కలశాలు నువ్వుల నూనె, పాలు, పెరుగు, నెయ్యి, అక్షతలు, దర్భ, పంచగవ్యాలతో ఉంటాయి. వాటితో అభిషేకం నిర్వహిస్తారు. అభిషేక హారతి ఇచ్చిన అనంతరం పూర్ణాహుతి ఉంటుంది. చివరిగా నైవేద్యం సమర్పిస్తారు. విశేష పూజను టీటీడీ 1991 ఏప్రిల్ 8న తొలిసారిగా ప్రారంభించింది. ఆ తర్వాత ఇది ఆర్జిత సేవగా మారింది.
అష్టదళ పాదపద్మారాధన (మంగళవారం)
రెండో గంట తర్వాత జరిగే సేవ ఇది. 1984లో శ్రీవారి ఆలయంలో ఈ సేవను ప్రారంభించారు. ఓ ముస్లిం భక్తుడు స్వామి వారికి 108 స్వర్ణ కమలాలు విరాళంగా అందించగా వాటితో ఈ సేవను మొదలు పెట్టారు. గర్భగుడిలో స్వామి మూలవిరాట్ కు జరిగే పూజ ఇది. అష్టోత్తర నామాలను చదువుతూ ఒక్కోనామానికి ఒక్కో స్వర్ణ కమలాన్ని స్వామి వారి పాదాల వద్ద ఉంచుతారు. రథహారతి, సాధారణ హారతి ఇవ్వడంతో సేవ ముగుస్తుంది.
సహస్ర కలశాభిషేకం (బుధవారం)
మూల విరాట్ కు ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేక సేవ ఇది. ఉదయం రెండో గంట తర్వాత బంగారు వాకిలిలో జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి మలయప్ప స్వామి వార్లు విష్వక్సేనులవారి సమక్షంలో ఈ సేవ జరుగుతుంది. భోగ శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలిలో ఉంచిన అనంతరం ఒక సిల్క్ తాడును తీసుకుని దాన్ని ఒక చివర భోగ శ్రీనివాసమూర్తి పాదం చుట్టూ కడతారు. మరో వైపు గర్భాలయంలోని మూల విరాట్ కథితష్ట ప్రాంతంలో ఉంచుతారు. అంటే రెండు మూర్తులను కలిపి ఉంచడం ఇందులోని అంతరార్థం. అలాగే, భోగ శ్రీనివాసమూర్తి మూల విరాట్ ప్రతిరూపమని, ఆయనకు నిర్వహించే పూజ మూలవిరాట్ కు జరిగినట్టేనన్న అర్థంలో ఈ తాడుతో అనుసంధానం జరుగుతుంది.
1,008 కలశాలలో అభిషేక తీర్థాన్ని సిద్ధం చేసి బంగారు వాకిలి ముందు మంటపంలో ఉంచుతారు. అలాగే, మరో 8 పరివార కలశాలు, ఓ బంగారు కలశంలోనూ నీటిని ఉంచుతారు. గంధం కలిపిన ఈ నీటిని పరిమళ తీర్థంగా పేర్కొంటారు. అర్చకులు పంచసూక్తాలు, పంచ శాంతి మంత్రోచ్చారణల మధ్య శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి తిరుమంజన అభిషేకం జరుగుతుంది. అలాగే, శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి వార్లకు కూడా 108 కలశాలు, 8 పరివార కలశాల్లోని జలంతో అభిషేకం జరుగుతుంది. తిరుమంజనం ముగింపుకు సూచనగా బంగారు కలశంతో అర్చకులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఆనంద విమాన ప్రాకారం చుట్టూ, ధ్వజస్తంభం చుట్టూ తిరిగి వచ్చి గర్భగుడిలోని స్వామి మూలవిరాట్ పాదాలపై నీటిని సంప్రోక్షిస్తారు. ఆ తర్వాత సహస్రకలశాభిషేకం కూడా ఉంటుంది. తెర వేసి ఈ సేవ నిర్వహిస్తారు.
తిరుప్పావడ సేవ (గురువారం)
ఉదయం పూజ అనంతరం మూల విరాట్ కు ఉన్న ఆభరణాలు, పూలదండలను తొలగించి స్వామి వారిపై ధోతి, ఉత్తరీయం మాత్రమే ఉంచుతారు. స్వామివారి తిరునామం సైజు కూడా తగ్గిస్తారు. సాధారణ రోజుల్లో నుదుటిపై స్వామికి వారికి పెట్టే బొట్టు వల్ల స్వామి వారి నేత్రాలు సగం సరిగా కనిపించవు. కానీ గురువారం తిరుప్పావడ సేవ సమయంలో మంత్రాలు చదువుతుండగా స్వామి వారి తరునామాన్ని తొలగించి ఆ తర్వాత పలుచటి నామాన్ని నుదిటిపై దిద్దుతారు. తిరునామం సైజును తగ్గించడం వల్ల స్వామి వారి నేత్రాలను పూర్తి స్థాయిలో చూసే అదృష్ట భాగ్యం దక్కుతుంది. తిరుప్పావడ సేవను బంగారు వాకిలి ముందున్న మండపంలో ఆర్జిత సేవగా నిర్వహిస్తారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న టబ్ లో పులిహారను ఉంచుతారు. పాయసం, లడ్డూ, జిలేబి, అప్పమ్ మొదలైన పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, నిజపాద దర్శనం (శుక్రవారాల్లో)
ప్రతీ శుక్రవారం సుప్రభాత సేవ అనంతరం తోమాల, అర్చన సేవలు జరుగుతాయి. వీటి తర్వాత స్వామి వారికి అభిషేక సేవ ఉంటుంది. ఆకాశ గంగ నుంచి తీసుకొచ్చిన తీర్థంతో స్వామివారిని అభిషేకిస్తారు. అనంతరం పాలు, సుద్ధోదకం, చందనం, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, పునుగుపిల్లి తైలంతో అభిషేకం ఉంటుంది. వీటన్నింటినీ వెండి కలశాలలో ముందే సిద్ధం చేసుకుని ఉంచుతారు. మూల విరాట్ కు అభిషేకం జరిగే సమయంలో పురుష సూక్త, నారాయణసూక్త, శ్రీసూక్త, భూ సూక్త, నీలా సూక్తాలను పఠించడంతోపాటు, దివ్య ప్రబంధంలోని పసురాములను చదువుతారు.
అనంతరం స్వామి వారి వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను ఉంచి పసుపును అద్ది అభిషేకం చేస్తారు. ఆర్జిత సేవలో పాల్గొనే ప్రతీ భక్తుడికి ఒక వెండి కలశాన్ని ఇస్తారు. అందులో పచ్చకర్పూరం, కుంకుమపువ్వు పేస్ట్, పునుగుపిల్లి తైలం, చందనం కలిపిన జలం ఉంటుంది. వీటిని తీసుకుని మంగళవాయిదాల్య నడుమ భక్తులు బంగారు వాకిలి చేరుకుంటారు. అక్కడ అర్చకులు ఆ కలశాలను సేకరించి స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. 966 సంవత్సరంలో పల్లవ రాణి సమావై ప్రస్తుత వెండి రూపంలో ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించినట్టు ఆలయ శాసనాలు చెబుతున్నాయి. ఇది అచ్చం మూల విరాట్ ను పోలి ఉంటుంది. ఆమె సమర్పించిన రోజు శుక్రవారం కావడమే కాకుండా స్వామి జన్మ నక్షత్రం అయిన శ్రవణం, జ్యేష్ట త్రితీయ కావడం విశేషం.
వస్త్రాలంకరణ సేవ (మేల్ చాట్ వస్త్రం)
ప్రతి శుక్రవారం అభిషేకం అయిన వెంటనే జరిగే సేవ ఇది. కేవలం ఇద్దరు దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఇందులో భాగంగా స్వామి వారికి పట్టు ధోవతి, ఉత్తరీయం ధరింపజేస్తారు.
నిజపాద దర్శనం
ప్రతీ శుక్రవారం అర్చనానంతర దర్శనం ఇది. నిత్యం స్వామి వారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి. కానీ నిజపాద దర్శన సమయంలో స్వామి పాదాలపై తులసి దళాలు లేకుండా చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులు కులశేఖర పడి వరకు వెళ్లి పాదాలను దర్శించుకోవచ్చు.
అప్పుడప్పుడు జరిగే సేవలు, ఉత్సవాలు
కొన్ని పర్వదినాలు, ప్రత్యేక రోజులను పురస్కరించుకుని తిరుమలలో కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి.
తెప్పోత్సవం
ఏటా ఐదు రోజులు చైత్ర మాసం (మార్చి)లో ఇది జరుగుతుంది. స్వామి వారు రోజూ సాయంత్రం వేళ పుష్కరిణిలో విహరిస్తారు. నాద స్వరం, మంత్రోచ్చారణ నడుమ స్వామి వారి విగ్రహాలను పడవలో ఉంచి పుష్కరిణలో విహరింపజేస్తారు. మొదటి రోజు స్వామి వారు శ్రీరామ, సీత, లక్ష్మణ, హనుమంతుడు సమేతంగా విహరిస్తారు. రెండో రోజు శ్రీకృష్ణ, రుక్మిణీ దేవి సమేతులై బోటులో విహరిస్తారు. చివరి మూడు రోజులు త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మలయప్ప (బాలాజీ) స్వామి వారు శ్రీదేవి, భూదేవీ సమేతంగా పుష్కరిణిలో విహరిస్తారు.
వసంతోత్సవం
ఏటా చైత్ర మాసంలో శుక్ల త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో వార్షిక వసంతోత్సవం జరుగుతుంది. వేసవి నుంచి స్వామి వార్లకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా సుగంధ ద్రవ్యాలతో కూడిన వసంతోత్సవం నిర్వహిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ఇందుకు అంకురార్పణ జరుగుతుంది. పుణ్యహవచనం, వాస్తు శాంతి, సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూడు రోజులు అందంగా అలంకరించిన వసంత మండపంలోకి మలయప్ప, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తీసుకొస్తారు. మొదటి రెండు రోజులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం (సుగంధ ద్రవ్యాలతో కూడిన అభిషేకం) నిర్వహిస్తారు. మూడో రోజు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వార్లు, శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామలు కూడా ఇందులో పొల్గొంటారు. ఈ ఉత్సవ మూర్తులందరికీ స్నపన తిరుమంజనం ఉంటుంది. భక్తులు రూ.300 టికెట్ తో శ్రీవారి వార్షిక వసంతోత్సవం కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
పద్మావతీ పరిణయం
ఏటా మే నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నారాయణగిరి ఉద్యానవనంలో ఇందుకోసం మండపాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీనివాసుడికి, పద్మావతీ అమ్మవారికి కల్యాణం నిర్వహిస్తారు. ఏటా మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం ఇది. వైశాఖ మాసంలో నవమి, దశమి, ఏకాదశి పర్వదినాల్లో సాయంత్రం వేళల్లో చంద్రుని వెలుగుల మధ్య కార్యక్రమం జరుగుతుంది. మూడు రోజుల్లోనూ మలయప్పస్వామి వారు గజ, అశ్వ, గరుడ వాహనాల్లో వరుసగా నారాయణగిరి ఉద్యానవనానికి విచ్చేస్తారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకీల్లో వస్తారు. ప్రతీ రోజు పెళ్లి తంతు తర్వాత కొలువు ఉంటుంది. వేద మంత్రాలు, ఆధ్యాత్మిక గీతాలాపన తర్వాత స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయానికి వెళ్లిపోతారు. సంప్రదాయ హిందూ వివాహాల్లో ఉన్నట్టుగానే ఎదుర్కోలు, బంతాట, నూతన వస్త్రధారణ తదితర వేడుకలు ఉంటాయి. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత టపాసులను కాల్చడం కూడా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
అభిద్యేయక అభిషేకం
ఏటా జ్యేష్టమాసంలో మూడు రోజుల పాటు ఇది జరుగుతుంది. దీనినే జ్యేష్టాభిషేకం అని కూడా అంటారు. ఏడాదిపాటు ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల విగ్రహాలకు జరిగే అభిషేకాల కారణంగా అవి దెబ్బతినకుండా రక్షించుకునేందుకు అభిద్యేయక అభిషేకం మొదలైంది. ప్రతీ రోజు రెండో గంట తర్వాత ఉత్సవమూర్తులను కల్యాణోత్సవ మండపంలోకి తీసుకొస్తారు. వేద మంత్రాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పసుపు, గంధం, తేనె, పాలు, పెరుగు కలిపి అభిషేకం చేస్తారు. మూడు రోజులు మూడు రకాల కవచాలను ధరింపజేస్తారు. మొదటి రోజు వజ్రకవచం, రెండో రోజు ముత్యాల కవచం, మూడో రోజు సువర్ణ కవచం ధరింపజేస్తారు. మళ్లీ అభిద్యేయక అభిషేకం జరిగేంత వరకు ఏడాది పాటు ఉత్సవమూర్తులకు మూడో రోజు అలంకరించిన బంగారు కవచాలే ఉంటాయి.
పుష్ప పల్లకి
ఏటా దక్షిణాయనంలో టీటీడీ ఖాతాలు ప్రారంభమవుతాయి. అనివార ఆస్తానం, దర్బార్ ఫెస్టివల్ ను జూలై నెలలో ఒక రోజు నిర్వహిస్తారు. ఈ రోజు అంతకుముందు సంవత్సరానికి చెందిన ఖాతాలను స్వామివారికి సమర్పిస్తారు. కొత్త పుస్తకాల ద్వారా కొత్త సంవత్సరం ప్రారంభిస్తారు. ఆలయ అధికారులు స్వామి వారి పాదాల వద్ద తమ చిహ్నాలను ఉంచి తిరిగి తీసుకుంటారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు పుష్పాలతో అలంకరించిన పల్లకిపై మాడ వీధులలో ఊరేగింపునకు వెళతారు.
పుష్ప యాగం
ఏటా వార్షిక బ్రహ్మోత్సవం అనంతరం నిర్వహించే సేవ ఇది. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం రోజున నిర్వహిస్తారు. యాగానికి ముందు అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. యాగం రోజున రోజువారీ పూజల అనంతరం సంపంగి మండపంలో మలయప్ప స్వామి వారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలసి బంగారు వేదికపై ఆసీనులవుతారు. తొలుత స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం వేల టన్నుల పుష్పాలతో యాగం చేస్తారు. భూకంపాలు, తుపానులు, అంటువ్యాధుల నుంచి కాపాడమని కోరుతూ స్వామి వారికి ఈ యాగం చేస్తారు. 15వ శతాబ్దంలో అమల్లో ఉన్న ఈ కార్యక్రమాన్ని టీటీడీ తిరిగి 1980 నుంచి నిర్వహిస్తోంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం అని అర్థం. ఆళ్వార్ అంటే భక్తుడు, తిరుమంజనం అంటే ఔషధ ద్రవ్యాలతో శుద్ధి చేయడం అని. తిరుమలలోని మూల విరాట్ ను, ఆలయ పరిసరాలను భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం ఇది. స్వామి వారి విగ్రహానికి ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించి ప్లాస్టిక్ తొడుగు వేసి శుద్ధి చేస్తారు. ఉప దేవతల విగ్రహాలకు కూడా ఇదే రీతిలో జరుగుతుంది. అలాగే, గర్భగుడిలోని నేల, గోడలు, పరిసరాలన్నింటినీ, పూజా సామగ్రిని శుభ్రం చేస్తారు. నీటిలో కర్పూరం, గంధం, కుంకుమపువ్వు, పసుపు, కిచిలి గడ్డను కలిపి దానితో ఈ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అనంతరం అన్ని వస్తువులను యథా స్థానంలో ఉంచి స్వామి వార్లకు తిరిగి ఆభరణాలను అలంకరింపజేసి ప్రత్యేక పూజల అనంతరం నైవేద్య సమర్పణ చేస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారం నియమ నిష్టల మేరకు ఈ తంతు జరుగుతుంది. ఏటా నాలుగు పర్యాయాలు ఉగాదికి ముందు, అనివార ఆస్తాన సమయంలో, వైకుంఠ ఏకాదశికి, వార్షిక బ్రహ్మోత్సవానికి ముందు కోయిల్ అళ్వార్ తిరుమంజన సేవ ఉంటుంది.
పవిత్రోత్సవం
పవిత్రోత్సవాన్ని టీటీడీ ఏటా శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాల్లో నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగా స్వామి మూల విరాట్ కు, ఆలయంలోనే స్వామికి చెందిన ఇతర విగ్రహాలకు తిరుమంజనం, హోమం నిర్వహిస్తారు. ఏడాది పాటు స్వామి వారికి చేసే పూజలు, సేవల్లో తెలిసో, తెలియకో చేసే తప్పులు, అపరాధనలు, లోపాలను మన్నించాలని స్వామి వారిని వేడుకోవడమే ఇందులోని విశేషం.
పవిత్రోత్సవం మొదటి రోజు ఆలయ లోపలి భాగంలోని యాగశాలలో హోమం ఉంటుంది. అనంతరం శ్రీ మలయప్ప, భూదేవి, శ్రీదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. రెండో రోజు స్నపన తిరుమంజనం అనంతరం పవిత్రాలకు ప్రత్యేక పూజ జరుగుతుంది. సిల్క్ తో నేసిన తాడు ఇది. దీన్ని ఉత్సవమూర్తులకు తల, మెడ, నడుము భాగంలో కడతారు. అలాగే ఆలయంలో మిగిలిన స్వామి వార్లకు, భూవరాహ స్వామికి కూడా ధరింపజేస్తారు. మూడో రోజు స్నపన తిరుమంజనం, హోమం వుంటాయి. ప్రధాన ఆలయంలో పూర్ణాహుతితో పవిత్రోత్సవం ముగుస్తుంది.
బ్రహ్మోత్సవం
నిజానికి తిరుమలలో ప్రతీ రోజూ ఓ పండుగే. నిత్య, వార, పక్ష, మాస, వార్షికంగా సుమారు 450 పండుగలు తిరుమలలో జరుగుతాయి. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది బ్రహ్మోత్సవం. ఏటా తిరుమల బ్రహ్మాండనాయకునికి సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించే మహోత్సవమే ఇది. తాను సృష్టించిన ఈ జీవరాసిని కాపాడుతున్నందుకు బ్రహ్మే సంతోషంతో మొదటి సారి తిరుమల వెంకటేశ్వరస్వామి పాదాలను కడిగి ఈ సేవను ప్రారంభించినట్టు ఆలయ చరిత్ర, పురాణాలు చెబుతున్నాయి. అందుకే అన్నమయ్య ’బ్రహ్మకడిగిన పాదమూ’ అంటూ స్తుతించారు. ఏటా అశ్వీయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. లక్షల సంఖ్యలో భక్తులు ఈ సమయంలో తిరుమలకు విచ్చేస్తుంటారు.
ముందు అంకురార్పణ ఉంటుంది. మలయప్ప, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు తొమ్మిది రోజుల్లోనూ ఉదయం, రాత్రి వేళ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. తొలి రోజు ఉదయం ధ్వజారోహణం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం, మూడో రోజు ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనం, నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, ఐదో రోజు ఉదయం పల్లకి ఉత్సవం (స్వామి మోహినీ అవతారంలో దర్శనమిస్తారు), రాత్రి గరుడ వాహనం...
ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ, స్వర్ణ రథంపై ఊరేగింపు, రాత్రికి గజహవాన సేవ, ఏడో రోజు ఉదయం సూర్య ప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహన సేవలు, ఎనిమిది రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ... తొమ్మిదో రోజు ఉదయం పల్లకి ఉత్సవం, రాత్రి స్వామి వారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతీ మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసాన్ని పురస్కరించుకుని ఆ ఏడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడం తిరుమలలో ఆనవాయితీ. అంటే ప్రతీ మూడేళ్లకోమారు ఒక ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.
కల్యాణోత్సవం
ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు స్వామి వారి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ముందుగానే టికెట్ ను కొనుగోలు చేసి ఉంటే స్వామి వారి కల్యాణంలో పాల్గొనే భాగ్యం దక్కించుకోవచ్చు. కల్యాణం అనంతరం స్వామి దర్శనం ఏర్పాటు చేస్తారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం
కల్యాణోత్సవం తర్వాత ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపంలో ఉత్సవ మూర్తులకు ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. పెద్ద శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలపై స్వామి, అమ్మవార్లు ఆసీనులను చేస్తారు.
డోలోత్సవం
ప్రతి రోజు ఉదయం 10 గంటలకు జరిగే సేవ ఇది. దీన్నే ఊంజల్ సేవ అని కూడా అంటారు. అద్దాల మండపంలోని ఉయ్యాలపై స్వామి అమ్మవార్లను ఉంచి ఉయ్యాలను అటూ ఇటూ కదిలిస్తారు. నాదస్వరాలు, వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సేవకు ముందే అద్దాల మండపాన్ని మొత్తం దీపాలతో వెలిగిస్తారు.
ఆర్జిత వసంతోత్సవం
వైభవ మండపంలో రోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సేవ ఇది. ఈ సేవలో భాగంగా స్వామి అమ్మవార్ల విగ్రహాలకు పవిత్ర జలం, పాలు, తేనెతో అభిషేకం జరుగుతుంది. పసుపు, చందన లేపనం చేస్తారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, వేద మంత్రాలను పండితులు చదువుతారు.
సహస్ర దీపాలంకరణ సేవ
ప్రధాన ఆలయానికి ముందు ఓ పక్కగా ఉండే ఊంజల్ మండపంలోని ఉయ్యాలపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు ఊయల ఊపుతూ మంత్రాలు చదువుతారు. సహస్ర (వెయ్యి) దీపాలను వెలిగిస్తారు. అన్నమాచార్య సంకీర్తన గానం కూడా ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా సేవా టికెట్ల బుకింగ్
టీటీడీ సేవా ఆన్ లైన్ డాట్ కామ్... ద్వారా తిరుమల ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసుకునే సదుపాయం ఉంది. సుప్రభాతం, నిజపాద దర్శనం, తోమాల సేవ, అర్చన, విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో కొనుగోలు చేయలేని వారు తిరుమలలో ఒక రోజు ముందు తదుపరి రోజుకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను పొందే అవకాశం కూడా ఉంది. ఇందు కోసం కొన్ని టికెట్లను కేటాయించారు. వీటిలో సుప్రభాతం టికెట్లను 100 కేటాయిస్తారు. అలాగే, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంత్సోతవం, సహస్ర దీపాలంకరణ సేవ, నిజపాద దర్శనం, విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ టికెట్లలోనూ కరెంట్ బుకింగ్ కోటా ఉంది. ఏ సేవకు ఎన్ని టెకెట్లను ఆన్ లైన్, కరెంట్ కోటాలో పొందవచ్చనేది, సేవల రుసుములను టీటీడీ లింక్ http://www.tirumala.org/Advancebooking.aspx ద్వారా తెలుసుకోవచ్చు.
వివిధ రకాల దర్శనాలు
తిరుమలకు నిత్యం లక్ష మంది లోపు భక్తులు వస్తుంటారు. స్వామి వారిని రోజులో 40 వేల నుంచి 80వేల మంది వరకు దర్శించుకుంటుంటారు. ఇంత మందికి దర్శనం కల్పించడం సులభ విషయమేమీ కాదు.
స్వామి వారిని రూపాయి ఖర్చు లేకుండానే దర్శించుకునే అవకాశాన్ని సర్వదర్శనం కల్పిస్తుంది. అయితే ఎక్కువ మంది భక్తులు సర్వ దర్శనాన్ని ఆశ్రయిస్తుంటారు కనుక స్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
సాధారణ రోజుల్లో సర్వ దర్శనం భక్తులకు రోజులో 18 గంటలు కేటాయిస్తుంటారు. ప్రత్యేక పర్వ దినాలు, ఉత్సవ సమయాల్లో ఈ సమయం తగ్గుతుంది. సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కో కంపార్ట్ మెంట్ వారీగా భక్తులను దర్శనానికి విడుదల చేస్తారు. క్యూ కాంప్లెక్స్ లలో ప్రతి మూడు గంటలకోసారి ఉచితంగా పాలు, టీ, కాఫీ, అన్న ప్రసాదాన్ని అందిస్తారు. మధ్య మధ్యలో టాయిలెట్స్ కూడా ఉన్నాయి.
ప్రత్యేక ప్రవేశ దర్శనం
2009 సెప్టెంబర్ 21 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. భక్తులు ఎక్కువ సమయం పాటు వేచి ఉండే ఇబ్బందిని తప్పిస్తూ దీన్ని తీసుకొచ్చారు. 300 రూపాయలు చెల్లించడం ద్వారా ఆన్ లైన్ లో టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. నిర్ణీత తేదీ, సమయం దానిపై ఇస్తారు. ఆ సమయానికి ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియాకు చేరుకోవాల్సి ఉంటుంది. సమయాని కంటే అరగంట దాటి వస్తే అనుమతించరు. ఆన్ లైన్ లోనే కాకుండా తిరుమలలో సైతం 300 రూపాయల దర్శనం టికెట్లను కరెంట్ బుకింగ్ కౌంటర్ల నుంచి పొందవచ్చు. కాకపోతే ఈ కోటా తక్కువగా ఉంది. ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకుని వెళ్లడమే అత్యుత్తమం.
మూడు నెలల ముందుగానే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కోటా అందుబాటులో ఉంటే అదే రోజు దర్శనానికి కూడా మూడు గంటల ముందుగాను బుక్ చేసుకోవచ్చు. ఒక రోజు ముందు బుక్ చేసుకున్నా సాధారణ రోజుల్లో టికెట్లు లభిస్తాయి. రద్దీ లేని రోజుల్లో గంటలోపే దర్శనం, రద్దీ ఉంటే రెండు నుంచి మూడు గంటల్లోపు, అత్యంత రద్దీ ఉంటే మూడు గంటలకుపైన సమయం తీసుకుంటుంది. నేరుగా తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లు పొందాలనుకుంటే సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీసు ఎదురుగా ఉన్న సింగిల్ విండో కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ రూ.300 టికెట్లతో పాటు, రూ.100, రూ.50 టికెట్లను కూడా పొందే సౌలభ్యం ఉంది.
కాలినడకన వచ్చిన వారికి...
అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కాలి నడకన తిరుమలకు వచ్చే భక్తులకు సత్వర దర్శనం కల్పించాలన్న ఉద్దేశ్యంతో టీటీడీ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేసింది. వీరిని సైతం రద్దీకి అనుగుణంగా క్యూ కాంప్లెక్స్ ల ద్వారా దర్శనానికి పంపిస్తుంటారు. సర్వ దర్శనానికి కంటే తక్కువ సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలిపిరి వద్ద తమ లగేజీని డిపాజిట్ చేస్తే రశీదు ఇస్తారు. తిరిగి తిరుమల చేరుకున్న తర్వాత లగేజీని కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సేవ పూర్తిగా ఉచితం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ టీటీడీ కార్యాలయం ఉంది. అక్కడ సైతం ఈ దర్శనం, వసతి కోసం గదులను బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నెల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
వికలాంగులు, వృద్ధుల కోసం
వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయం ఉంది. దక్షిణ మాడ వీధిలో ప్రత్యేక గేటు ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన భక్తుల మాదిరిగా వీరు చుట్టూ తిరిగి రావాల్సిన పని లేకుండా గంటలోనే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుంది. ఉదయం 10 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఓ సారి భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. దానికి రెండు గంటల ముందుగానే వైకల్య సర్టిఫికెట్, వృద్ధాప్యాన్ని నిర్ధారించే పుట్టిన తేదీ ధ్రువీకరణలతో భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది.
వసతి సదుపాయాలు
తిరుపతి, తిరుమలలో భక్తుల వసతి కోసం గాను టీటీడీ 4,850కు పైగా కాటేజీలు, చౌల్ట్రీలు, గెస్ట్ హౌస్ లను నిర్మించింది. ఉచితం దగ్గర్నుంచి పెయిడ్ వరకు వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతిలో...
తిరుపతి చేరుకున్న తర్వాతే తిరుమల వెళ్లాల్సి ఉంటుందనే విషయం తెలుసు. దూర ప్రయాణం చేసి ఉన్న వారు తిరుపతిలో కాస్త సేద తీరి తిరుమలకు వెళదామనుకుంటే తగినన్ని వసతులు ఉన్నాయి. అలాగే, తిరుపతి చుట్టు పక్కల ప్రదేశాలను చూసి వెళ్లాలనుకున్నా ఇక్కడ బస చేయవచ్చు. బస్ స్టేషన్ నుంచి అరకిలోమీటరు దూరంలో శ్రీనివాసం అనే పెద్ద వసతి సముదాయం ఉంది. ఇక్కడ 200 నుంచి 600 రూపాయల గదులను పొందవచ్చు. ఏసీ గదుల చార్జీ 600 రూపాయలు. భక్తులు 45 రోజులు ముందుగానే శ్రీనివాసంలో వసతిని బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ కు ఎదురుగా శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హస్ ఉంటుంది. ఇక్కడ 45 రూమ్స్ ఉన్నాయి. చార్జీ 150 రూపాయలు.
రైల్వే స్టేషన్ వెనుక భాగంలో శ్రీ గోవిందరాజస్వామి చౌల్ట్రీ (2చౌల్ట్రీ), శ్రీ కోదండరామ స్వామి చౌల్ట్రీ (3చౌల్ట్రీ) ఉన్నాయి. ఇక్కడ వసతి ఉచితం. వంట చేసుకునేందుకు కామన్ కిచెన్స్ కూడా ఉంటాయి. అలిపిరికి సమీపంలో అలిపిరి గెస్ట్ హౌస్ ఉంది. 40 గదులు ఉండగా రోజుకు చార్జీ 100 రూపాయలు. అలాగే అలిపిరి గెస్ట్ హౌస్ సమీపంలో భూదేవి పిలిగ్రిమ్ అమెనిటీస్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ ఉచిత లాకర్లు ఉంటాయి. వీటిలో తమ లగేజీని ఉంచి భక్తులు కాలకృత్యాలు తీర్చుకుని వెళ్లిపోవచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సమీపంలో శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ కూడా ఉంది. 35 ఏసీ రూమ్స్ ఉంటాయి. రూ.300 నుంచి రూ.2వేల వరకు ధర ఉంది. రద్దీ రోజుల్లో వీఐపీలకు మాత్రమే కేటాయిస్తారు. రద్దీ లేని రోజుల్లో రిక్వెస్ట్ పై సాధారణ భక్తులకు కూడా కేటాయిస్తుంటారు. శ్రీ శ్రీనివాస కల్యాణ మండపం (రోజుకు రూ.5వేల చార్జీ), శ్రీ పద్మావతీ కల్యాణ మండపం (రోజుకు రూ.6వేలు) కూడా ఉన్నాయి. రేణిగుంటలోేనూ పిలిగ్రిమ్ అమెనిటీస్ కాంప్లెక్స్ ఉంది.
తిరుమలలో
ఆన్ లైన్ లో, జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కౌంటర్లు, డీడీలను పంపడం ద్వారా తిరుమలలో వసతిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుమలకు వచ్చిన తర్వాత సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం వద్ద క్యూలో ఉండి వీలునుబట్టి వసతిని పొందవచ్చు. గదులు ఖాళీగా ఉంటేనే కేటాయిస్తారు. అందుకే ముందుగా బుక్ చేసుకుని వెళ్లాలి.
తిరుమలలో 625 గదులు ఉచితంగా కేటాయిస్తుంటారు. ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 చెల్లిస్తే ఖాళీ చేసి వెళ్లే సమయంలో తిరిగిస్తారు. అలాగే, తిరుమలలో మూడు చోట్ల పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా లాకర్లు తీసుకోవచ్చు. బాత్ రూమ్, టాయిలెట్స్ సదుపాయాలు ఉన్నాయి.
తిరుమలలో 50 రూపాయల కేటగిరీలో 2361 గదులు, రూ.300 కేటగిరీలో 386 గదులు ఉన్నాయి. ఏడాది అంతటా ఆన్ లైన్ రిజర్వేషన్ కోసం 2185 గదులను అందుబాటులో ఉంచుతారు. వీఐపీ, వీవీఐపీలకు కొన్ని వసతి సముదాయాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచుతారు. తిరుమలలో వసతి కేటాయించిన రోజున గదుల్లో చేరకుంటే ఆ రిజర్వేషన్ రద్దయిపోతుంది. చార్జీలు తిరిగి వెనక్కి రావు.
డీడీల విధానంలో
గది ఒకరోజు చార్జీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ, తిరుపతి పేరిట, తిరుపతిలో చెల్లింపు అయ్యేలా జాతీయ బ్యాంకు నుంచి డీడీ తీసి దానిని... ఏఈవో (రిసెప్షన్ 1) టీటీడీ, తిరుమల 517504 చిరునామాకు పంపించాలి. ఇది అందిన తర్వాత వసతి కేటాయింపు లెటర్ ను టీటీడీ పంపిస్తుంది.
తిరుమలలో గెస్ట్ హౌస్ లు, కల్యాణ మండపాల గురించి ఈ లింక్ http://tirumala.org ద్వారా తెలుసుకోవచ్చు.
శ్రీవారి సేవా భాగ్యం
తిరుమలకు వచ్చే అసంఖ్యాక భక్తులకు సేవలందించే సదుపాయం కూడా ఉంది. 18 నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఆరోగ్యవంతులు టీటీడీ ఆన్ లైన్ వేదికపై తమ పేర్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించే పరకామణిలోనూ సేవలు అందించవచ్చు. సాధారణంగా హుండీ లెక్కింపుల కోసం టీటీడీ 40 మంది ఉద్యోగులను కేటాయించింది. కానీ భారీగా వచ్చే కానుకల లెక్కింపునకు ఎంత మంది అదనంగా ఉన్నా ఎక్కువ కాబోరు. పరకామణిలో సేవ చేయాలనుకునే వారు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో పని చేసి ఉండాలి. లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు సైతం తమ పేర్లను నమోదు చేసుకుని సేవాభాగ్యాన్ని పొందవచ్చు. ఇవి సేవలు మాత్రమే. వీటికి టీటీడీ ఎలాంటి చెల్లింపులు చేయబోదు.
తిరుచానూరు
తిరుపతి పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవేరి అయిన శ్రీ పద్మావతీ అమ్మవారు కొలువై ఉన్నారు. తిరుచానూరుకే అలవేలు మంగాపురం అనే పేరు కూడా ఉంది. పద్మావతీ అమ్మవారు శ్రీలక్ష్మీదేవీ అవతారంగా చెబుతారు. ఆలయం సమీపంలో పద్మ సరోవరం అనే పుష్కరిణి ఉంది. కార్తీక మాసంలో శుక్ల పంచమి తిథి రోజున ఇదే పుష్కరిణిలో బంగారు పద్మంలో అమ్మవారు ప్రత్యక్షమైనట్టు భావిస్తారు. ఈ విశిష్టతను పురస్కరించుకుని ఏటా కార్తీక మాసంలో పద్మావతీ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఇదే పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది. అదే రోజున లక్షలాదిగా భక్తులు పుష్కరిణలో పవిత్ర స్నానం కోసం తరలివస్తారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీకృష్ణ స్వామి, శ్రీ సుందరరాజస్వామి ఆలయాలను సైతం చూడవచ్చు. పద్మసరోవరం ఎదురుగా సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది.
అమ్మవారికి జరిగే సేవలు
సుప్రభాతం ప్రతి రోజు ఉదయం 5 గంటలకు. శుక్రవారాల్లో 3.30గంటలకు జరుగుతుంది. ఒక టికెట్ పై ఒకరికి ప్రవేశం.
సహస్ర నామార్చన ప్రతి రోజు ఉదయం 5.30 గంలకు. శుక్రవారాల్లో 4గంటలకు.
పద్మావతీ పరిణయం అమ్మవారికి జరిగే కల్యాణం. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ఒక టికెట్ పై దంపతులకు ప్రవేశం.
ఊంజల్ సేవ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకు. శుక్రవారం 6 గంటల నుంచి 7 గంటల వరకు.
కుంకుమార్చన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది.
ఏకాంత సేవ రోజూ రాత్రి 9 గంటలకు.
అష్టదళ పాదపద్మారాధన సోమవారం ఉదయం 6.45 గంటలకు
తిరుప్పావడ సేవ గురువారం ఉదయం 7 గంటలకు
అభిషేకం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు
ఉత్తరాషాడ నక్షత్రం రోజున లక్ష్మీపూజ ఉదయం 9 గంటలకు
సహస్ర దీపాలంకరణ సేవ ప్రతి శుక్రవారం సాయత్రం 5 గంటలకు
పుష్పాంజలి సేవ ప్రతి శనివారం ఉదయం 6.45 గంటలకు.
వస్త్రాలంకరణ సేవ ప్రతి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు
సహస్ర కలశాభిషేకం ప్రతి నెలా మొదటి బుధవారం 6.45 గంటలకు
వసంతోత్సవం ఏటా మే నెలలో
వరలక్ష్మీ వ్రతం ఏటా ఆగస్ట్ లో
పవిత్రోత్సవం ఏటా సెప్టెంబర్ లో
లక్ష కుంకుమార్చన ఏటా నవంబర్ లో
గజవాహన, గరుడ వాహన సేవలు బ్రహ్మోత్సవాల సమయంలో
పుష్పయాగం పంచమీతీర్థం మరుసటి రోజు
దర్శనాలు
సర్వదర్వనం, ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనం, అభిషేకానంతర దర్శనం (శుక్రవారం మాత్రమే), వేద పండితులతో ఆశీర్వచనం అందుబాటులో ఉన్నాయి.