మంచి బ్యాటరీ ఉంటేనే మొబైల్ సూపర్.. మరి ఏ బ్యాటరీ మంచిది?
మన ఫోన్ వినియోగం మొత్తం దాదాపుగా బ్యాటరీ బ్యాకప్ పైనే ఆధారపడి ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ కొనే ముందు బ్యాటరీ కెపాసిటీ ఎంత అని తప్పనిసరిగా చూస్తాం. కానీ ఫోన్ వినియోగించేటప్పుడు బ్యాటరీ చార్జింగ్ వేగంగా తగ్గిపోతుంటుంది. వినియోగించిన కొద్దీ చార్జింగ్ కెపాసిటీ తగ్గిపోతుంటుంది. మరి దీనికి కారణాలేమిటి? చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలి, అసలు బ్యాటరీల్లో ఎన్ని రకాలున్నాయి? మనం వాడే ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఏది? ఎలాంటి బ్యాటరీ ఉంటే బెటర్, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనే పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాటరీ టైప్ కూడా చూడాలి..
స్మార్ట్ ఫోన్ తో కాలింగ్ దగ్గరి నుంచి ఇంటర్నెట్, గేమ్స్ దాకా ఎన్నో ప్రయోజనాలున్నా.. అన్నీ బ్యాటరీ చార్జింగ్ పైనే ఆధారపడి ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటే చార్జర్ జేబులో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. అందువల్ల మంచి బ్యాటరీ సామర్థ్యమున్న ఫోన్ ను ఎంచుకోవాలి. లేదా రిమూవబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్ ను తీసుకోవాలి. దీనివల్ల బ్యాటరీ పాడైపోయినప్పుడు, దాని సామర్థ్యం తగ్గిపోయినప్పుడు మరో బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీల్లో నాలుగైదు రకాలు ఉన్నా.. ప్రస్తుతం లీథియం-అయాన్, లీథియం-పాలిమర్ అనే రెండు రకాల బ్యాటరీలు ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి.
నికెల్-కాడ్మియం:
తొలి తరం మొబైల్ ఫోన్లలో వినియోగించిన బ్యాటరీలు ఇవి. వీటి పరిమాణం ఎక్కువ. విద్యుత్ నిల్వ సామర్థ్యం తక్కువ. వీటికి ‘మెమరీ ఎఫెక్ట్’ ఉంటుంది. అంటే బ్యాటరీలను పూర్తిగా ఖాళీ అయ్యేదాకా వినియోగించి.. ఆ తర్వాత రీచార్జింగ్ చేసుకోవాలి. లేకుంటే బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేగాకుండా దీనిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అయితే ఈ బ్యాటరీల ధరలు మాత్రం చాలా తక్కువ. వీటిని ఇప్పటికీ గడియారాలు, రిమోట్లు, ఆటబొమ్మల్లో వినియోగిస్తున్నారు.
నికెల్-మెటల్ హైబ్రిడ్ బ్యాటరీలు:
ఇటీవలి వరకూ వీటిని సెల్ ఫోన్లలో వినియోగించారు. వీటి, బరువు పరిమాణం ఎక్కువ. విద్యుత్ నిల్వ సామర్థ్యం తక్కువ. నికెల్-కాడ్మియంతో పోల్చితే విద్యుత్ సామర్థ్యం ఎక్కువ. హానికర రసాయనాలు కూడా లేనందున ఈ టెక్నాలజీతో రూపొందించిన బ్యాటరీలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఇప్పటికీ కెమెరాలు, కామ్ కార్డర్లలో ఈ తరహా బ్యాటరీల వినియోగం ఉంది. అయితే ఈ బ్యాటరీలు కూడా ‘మెమరీ ఎఫెక్ట్’కు లోనవుతాయి.
లీథియం-అయాన్ బ్యాటరీలు:
ఇవి చాలా పాపులర్. స్మార్ట్ ఫోన్ల శకం మొదలైన తర్వాత వీటి వినియోగం బాగా పెరిగింది. ఇవి లీథియం-పాలిమర్ బ్యాటరీలకన్నా ఎక్కువగా విద్యుత్ ను నిల్వ చేసుకోగలవు. ఇవి ఎక్కువగా వేడెక్కుతుంటాయి. అందువల్ల వీటికి యాక్టివ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది. బరువు, పరిమాణం కూడా లీథియం-పాలిమర్ బ్యాటరీలతో పోలిస్తే కొంత ఎక్కువ. ధర కొంత తక్కువ. ఈ బ్యాటరీలకు కూడా ‘మెమరీ ఎఫెక్ట్’ ఉండదు. వీటి చార్జింగ్ సైకిల్ లైఫ్ (ఎన్నిసార్ల వరకు చార్జింగ్ చేసుకోవచ్చనే లెక్క) 500 నుంచి 1000 వరకు ఉంటుంది.
లీథియం-పాలిమర్ బ్యాటరీలు:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీల్లో అత్యంత అధునాత టెక్నాలజీతో రూపొందినవి ఇవి. నికెల్ హైబ్రిడ్ బ్యాటరీలతో పోలిస్తే సగం పరిమాణంలోనే ఉండి, తక్కువ బరువుతో ఎక్కువ విద్యుత్ ను నిల్వ చేసుకోగలవు. వీటికి ‘మెమరీ ఎఫెక్ట్’ ఉండదు. (‘మెమరీ ఎఫెక్ట్’ అంటే బ్యాటరీలు పూర్తిగా ఖాళీకాక ముందే చార్జింగ్ పెట్టడంతో అంతమేరకే చార్జింగ్ అయి, అంతమేరకే తిరిగి విడుదల చేస్తాయి. దీంతో బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది). ఇవి ఎక్కువగా వేడెక్కవు. అందువల్ల ఎన్నో ఆకారాలు, పరిమాణాల్లో ఈ బ్యాటరీలను రూపొందిస్తుంటారు. ఈ బ్యాటరీల ధరలు కూడా కొంత ఎక్కువ. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. అందువల్ల మొబైల్ ఫోన్ల తయారీదారులు ఈ బ్యాటరీలను ఫోన్ల బ్యాక్ కవర్ కు అనుసంధానం చేస్తారు. వీటి చార్జింగ్ సైకిల్ లైఫ్ 300 నుంచి 500 సార్ల వరకు మాత్రమే ఉంటుంది.
లీథియం మైక్రో బ్యాటరీలు:
ఇవి ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. మనం ఇప్పుడు వినియోగిస్తున్న బ్యాటరీలతో పోల్చితే ఏకంగా వంద రెట్లు విద్యుత్ ను కొత్త తరహా బ్యాటరీలు నిల్వ చేసుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం ఒకటి రెండు నిమిషాల్లోనే పూర్తిగా రీచార్జింగ్ అవుతాయని అంటున్నారు. కొన్నేళ్లలోనే ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
బ్యాటరీ ఓఈఎం తరహానా, నాన్ ఓఈఎం తరహానా..?
- సెల్ ఫోన్లతో పాటు అందించే బ్యాటరీల్లో ‘ఓఈఎం’, ‘నాన్-ఓఈఎం’ అని రెండు వేర్వేరుగా ఉంటాయి. ‘ఓఈఎం’ అంటే ఆ ఫోన్ లేదా బ్యాటరీని అసలైన సంస్థ (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్) నేరుగా తయారు చేసినది అని అర్థం. కంపెనీలు స్వయంగా తమ పరిశ్రమల్లో తయారుచేసే ‘ఓఈఎం’ బ్యాటరీల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. కానీ నాణ్యత, వారంటీ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ కు తగిన వోల్టేజీలో విద్యుత్ సరఫరా చేసేలా తయారు చేయబడి ఉంటాయి.
- ఇక ‘నాన్-ఓఈఎం’ అంటే ఇతర కంపెనీలు తయారు చేసిన అదే మోడల్ బ్యాటరీ. వీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. తక్కువగా చార్జింగ్ కావడంతోపాటు త్వరగా పాడైపోతాయి. వీటి ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ బ్యాటరీల నుంచి విడుదలయ్యే వోల్టేజీ ఫోన్ కు అనుగుణంగా ఉండే అవకాశాలు తక్కువ. అందువల్ల ఫోన్ లోని అంతర్గత భాగాలు దెబ్బతింటాయి. ఫోన్ పనితీరు మందగిస్తుంది.
సరైన చార్జర్ వాడకపోతే అంతే..
ప్రతి బ్యాటరీకి సంబంధించి ఒక నిర్ణీత చార్జింగ్ విద్యుత్, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. అదే స్థాయిలో విద్యుత్, అదే ఫ్రీక్వెన్సీలో అందితే బ్యాటరీ మెరుగ్గా చార్జింగ్ అవుతుంది. ఎక్కువ కాలం మన్నుతుంది. లేకపోతే వేగంగా చార్జింగ్ అవడం లేదా చాలా స్లోగా చార్జింగ్ అవడం, పూర్తిగా చార్జింగ్ అయినట్లు చూపించినా.. చాలా వేగంగా తగ్గిపోతుండడం వంటి సమస్యలు వస్తాయి. పరిమితికి మించి విద్యుత్ అందితే బ్యాటరీలు విపరీతంగా వేడెక్కుతాయి. ఒక్కోసారి పేలిపోతాయి కూడా. అందువల్ల ఫోన్ తో పాటు వచ్చిన చార్జర్ ను వాడడం చాలా మంచిది. అవసరమైతే అంతే స్థాయిలో విద్యుత్ ఫ్రీక్వెన్సీ అందించే బ్రాండెడ్ చార్జర్ ను వినియోగించాలి.
ఇవి గుర్తుంచుకోండి..
- బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఫోన్ ను ఎక్కువ సేపు వినియోగించుకోవచ్చు. కానీ బ్యాటరీ సామర్థ్యం పెరిగినకొద్దీ ఫోన్ పరిమాణం, బరువు బాగా పెరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
- బ్యాటరీ తయారైన తేదీని కచ్చితంగా చూడాలి. ఎందుకంటే లీథియం-అయాన్ బ్యాటరీల సామర్థ్యం వాటిని వినియోగిస్తున్నా, వినియోగించకున్నాతగ్గిపోతూ ఉంటుంది. రెండు, మూడేళ్ల కింద తయారైన బ్యాటరీ అయితే అప్పటికే 30 శాతం దాకా సామర్థ్యం కోల్పోయి ఉంటుంది.
- ఏదైనా మోడల్ ఫోన్ తో పాటు వచ్చే బ్యాటరీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీలు కూడా లభిస్తుంటాయి. అదే కంపెనీ లేదా ఏదైనా మంచి కంపెనీ తయారు చేసినవి లభిస్తే నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు.
- సాధారణంగా ఫోన్లలో వచ్చే బ్యాటరీల సామర్థ్యం సరిపోకపోవడమో, లేకుంటే చార్జింగ్ పెట్టుకునే అవకాశం లేకపోవడంతోనో పవర్ బ్యాంకులను వినియోగిస్తుంటారు. ఈ పవర్ బ్యాంకులు కూడా కొంత కాలం తర్వాత వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయని గుర్తుంచుకోవాలి. అందువల్ల మంచి కంపెనీలను చెందిన పవర్ బ్యాంకులను కొనుగోలు చేయడం మంచిది.
- స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ శక్తిని ఎక్కువగా వినియోగించుకునేది దాని డిస్ప్లేనే. ఒకే సామర్థ్యమున్న బ్యాటరీ అయినా పెద్ద డిస్ప్లే ఉండే ఫోన్లలో చార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేగాకుండా డిస్ప్లే మరీ పెద్దగా ఉన్న ఫోన్లతో ఇబ్బందులు కూడా ఉంటాయి. అందువల్ల మనకు ఏ స్థాయి ఫోన్ అవసరమో అది తీసుకుంటే బెటర్.
చార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ప్రస్తుతం వస్తున్న ఫోన్ లలో ఎక్కువ శాతం లీథియం-అయాన్ బ్యాటరీలు ఉంటున్నాయి. ఈ బ్యాటరీలు పరిమితికి మించి చార్జింగ్ చేసినా.. పూర్తిగా ఖాళీ అయ్యే దాకా వాడినా త్వరగా దెబ్బతింటాయి. అందువల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోకుండా ఉండాలంటే.. చార్జింగ్ 20 శాతానికి తగ్గకుండా, 90-95 శాతానికి మించకుండా చూసుకుంటే మంచిదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
- ఫోన్ డిస్ప్లే బ్రైట్ నెస్ ను వీలైనంత వరకూ తగ్గించడం మంచిది. ఆటో బ్రైట్ నెస్ మోడ్ పెట్టడం వల్ల బ్యాటరీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అవసరమైనప్పుడు పెంచుకుని, తర్వాత మళ్లీ తగ్గించేయాలి.
- ఫోన్ స్క్రీన్ దానంతట అదే ఆఫ్ అయ్యే ‘స్క్రీన్ టైం అవుట్’ను వీలైనంత తక్కువ సమయానికి.. అంటే 30 సెకన్ల కన్నా తక్కువ సమయానికి సెట్ చేయండి
- అవసరం లేనప్పుడు వైఫై, బ్లూటూత్, మొబైల్ డాటా, జీపీఎస్, ఆటో రొటేషన్ వంటి వాటిని ఆఫ్ చేయాలి. అవి ఆన్ లో ఉంటే బ్యాగ్రౌండ్ లో చాలా బ్యాటరీని తినేస్తాయి.
- అవసరం లేకుండా ఎక్కువగా యాప్ లను ఇన్ స్టాల్ చేయవద్దు. కొన్ని యాప్స్ బ్యాగ్రౌండ్ లో రన్ అవుతూ చార్జింగ్ ను ఖర్చు చేస్తాయి.
- హోం స్క్రీన్ పై టైమ్, వాతావరణం, ఉష్ణోగ్రత, సోషల్ మీడియా నోటిఫికేషన్ విడ్జెట్ లను పెట్టుకోవడం వల్ల అవి ఎప్పటికప్పుడు సింక్రనైజేషన్ కోసం ప్రయత్నిస్తూ బ్యాటరీని వినియోగించుకుంటాయి. అవసరం లేని విడ్జెట్లను తొలగిస్తే మేలు.
- సరైన సిగ్నల్ లేని ప్రాంతంలో ఉన్నప్పుడు ఫోన్ సిగ్నల్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ చాలా చార్జింగ్ ను వినియోగిస్తుంటుంది. అలాంటి సమయంలో వీలైతే ఏరోప్లేన్ మోడ్ ను సెట్ చేసుకోండి. డ్యూయల్ సిమ్ ఫోన్లలో అయితే ఏ సిమ్ కు సిగ్నల్ సరిగా లేదో.. ఆ సిమ్ ను ఆ సమయంలో డిసేబుల్ చేస్తే సరిపోతుంది.
- 2జీ కంటే 3జీ, 4జీ నెట్ వర్కులు ఎక్కువగా బ్యాటరీని వినియోగించుకుంటాయి. అందువల్ల ఇంటర్నెట్ వాడని సందర్భాల్లో ఫోన్ ను 2జీ ఓన్లీ ఆప్లన్ కు సెట్ చేసుకోవడం మేలు.
- డ్యూయల్ సిమ్ ఫోన్ అయి ఉండి ఒకే సిమ్ వినియోగిస్తే.. మరో సిమ్ కు సంబంధించిన ఆప్షన్ ను సెట్టింగ్స్ లో డిసేబుల్ చేయాలి. లేకపోతే రెండో సిమ్ లేకున్నా దానికి సంబంధించిన ఆప్షన్లు పనిచేస్తూ బ్యాటరీ వృథా అవుతుంది.
- ఫోన్ లో యానిమేషన్ ఎఫెక్ట్స్ ను తీసేస్తే కూడా బ్యాటరీ ఆదా అవుతుంది.
- టచ్ వైబ్రేషన్, టచ్ సౌండ్స్ (అంటే డిస్ప్లేపై ఏదైనా ఆప్షన్ ను టచ్ చేసిన ప్రతిసారి వచ్చే వైబ్రేషన్, సౌండ్స్) ను డిసేబుల్ చేస్తే బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది.
- ఫోన్ డిస్ప్లే బ్యాక్ గ్రౌండ్ లో లైవ్, 3డీ వాల్ పేపర్లను అమర్చుకుంటే బ్యాటరీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లైవ్, 3డీ వాల్ పేపర్ అప్లికేషన్లు.. సంబంధిత గ్రాఫిక్స్ ను చూపేందుకు మొబైల్ టచ్ డిస్ప్లేను, గైరోస్కోప్, కంపాస్, వైబ్రేటర్ లను వినియోగించుకుంటాయి.
- డిస్ప్లే బ్యాక్ గ్రౌండ్ లో ప్రకాశవంతమైన, ఎక్కువ రంగులున్న హై రిజల్యూషన్ ఫొటోను వాల్ పేపర్ గా పెట్టుకోవడం కంటే.. నలుపు రంగు ఎక్కువగా ఉండే వాల్ పేపర్ వల్ల బ్యాటరీ కొంత వరకు ఆదా అవుతుంది.
- స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో బ్యాటరీ చార్జింగ్ ఓ నిర్ణీత స్థాయికంటే తక్కువకు చేరగానే.. విద్యుత్ ను ఆదా చేసేలా అత్యవసరం కాని ఆప్షన్లన్నీ డిసేబుల్ చేసేలా ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. వైఫై, మొబైల్ డేటా, ఆటోమేటిక్ అప్ డేట్లు, సింక్రనైజింగ్, విజువల్ ఎఫెక్టులు, జీపీఎస్ వంటివి ఆటోమేటిగ్గా ఆఫ్ అవుతాయి. అయితే మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోని బ్యాటరీ సెట్టింగ్స్ లో ‘లో పవర్ మోడ్, బ్యాటరీ అసిస్టెంట్’ వంటి పలు పేర్లతో ఈ ఆప్షన్ ఉంటుంది. దీనిని మనకు కావాల్సినట్లుగా 30 శాతం లేదా 20 శాతం కన్నా తక్కువకు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోయినప్పుడు యాక్టివేట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.
- బ్యాటరీ సేవర్లు, ర్యామ్ క్లీనింగ్ యాప్ లు, యాంటీ వైరస్ లు కూడా బ్యాటరీ చార్జింగ్ ను విపరీతంగా వినియోగించుకుంటాయి. ఇలాంటి వాటిని డౌన్ లోడ్ చేసుకునే బదులు ఫోన్ తో పాటే ఇన్ బిల్ట్ గా ఇచ్చే యాప్ లనే వినియోగించుకోవడం బెటర్.
- ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ కూడా బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకుంటాయి.
- ఫోన్లో ఎక్కువ సంఖ్యలో బ్రౌజర్లు వేసుకోవడం వృథా. ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్ తో పాటు ఫైర్ ఫాక్స్, ఒపెరా, క్రోమ్, యూసీ బ్రౌజర్ ఇలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల అవి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ చార్జింగ్ తగ్గిపోతుంటుంది.
- బ్యాటరీని అవసరానికి మించి ఎక్కువ సేపు చార్జర్ కు కనెక్ట్ చేయవద్దు. 100 బ్యాటరీ చార్జింగ్ అయినా.. చార్జర్ కు కనెక్ట్ అయి ఉండడం వల్ల వేడెక్కి, దెబ్బతింటుంది. అవసరమైతే 95 నుంచి 98 శాతం చార్జింగ్ కాగానే చార్జింగ్ కేబుల్ తీసేసినా మంచిదే.