ఈ గాడ్జెట్స్ తో పాత స్మార్ట్ ఫోన్ కి అదనపు హంగులు!

రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది.. వాటిలో రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది.. ఎన్నో అద్భుతమైన సదుపాయాలూ అందుబాటులోకి వస్తున్నాయి. కరెంటు పోయినప్పుడు గది నిండా వెలుతురు ఇవ్వగలిగే ఎల్ఈడీ లైట్ దగ్గరి నుంచి టీవీలు, ఏసీల వంటి వాటిని ఆపరేట్ చేయగలిగే ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వరకు, మినీ ఫ్యాన్ వరకూ స్మార్ట్ ఫోన్లలోనే కొలువుదీరుతున్నాయి. 

మరి ఇలాంటి సౌకర్యాలను చిన్న చిన్న గాడ్జెట్ల ద్వారానే మన పాత స్మార్ట్ ఫోన్ లోనే పొందగలిగితే చాలా బాగుంటుంది కదూ? అంతేకాదు పాత, కొత్త స్మార్ట్ ఫోన్లను మరింత ‘స్మార్ట్’గా చేసే గేమింగ్ డివైజ్ లు, కెమెరా లెన్స్ లు, సెక్యూరిటీ డివైజ్ లు, ప్రొజెక్టర్లు, ఎన్ లార్జ్ స్క్రీన్లు, ట్రైపాడ్ లు, స్పీకర్ మైక్ లు, మినీ ప్రింటర్లు వంటివెన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రూ.100 నుంచి రూ.500 వరకు ధరలోనే లభించే కొన్ని గాడ్జెట్లు, పరికరాలతో అద్భుతమైన, వెరైటీ అనుభూతిని కూడా సొంతం చేసుకోవచ్చు. కొన్నయితే సరదాగా వినియోగించేందుకూ ఎంతో బాగుంటాయి. ఆ పరికరాలేమిటో తెలుసుకుందామా...

ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ (IR Blaster)

దాదాపు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లతోపాటు యాపిల్ ఐఫోన్లలోనూ రిమోట్ కంట్రోల్ సౌకర్యాన్ని పొందడానికి ఐఆర్ బ్లాస్టర్ డాంగిల్స్ ఉపయోగపడతాయి. స్మార్ట్ ఫోన్ లోని 3.5 ఎం.ఎం ఆడియో జాక్ (హెడ్ ఫోన్ జాక్)కు దీనిని అమర్చి వినియోగించుకోవచ్చు. ఇవి బయట మార్కెట్లో లభించే అవకాశం తక్కువ. అమెజాన్, ఈబే వంటి విదేశీ ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్లలో వీటిని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ డాంగిల్ ను కొనుగోలు చేశాక.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి దానికి సంబంధించి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్ల టీవీలు, ఏసీలు, డీవీడీ ప్లేయర్లు, హోం థియేటర్లు, సెట్ టాప్ బాక్స్ లకు సంబంధించి రిమోట్లు ఉంటాయి. సంబంధిత కంపెనీ, మోడల్ ను ఎంచుకోవడం ద్వారా రిమోట్ లా వినియోగించుకోవచ్చు. మూడు నుంచి పది మీటర్ల దూరం వరకు ఇవి పనిచేస్తాయి. ఈ ఐఆర్ బ్లాస్టర్ల ధరలు రూ.300 నుంచి రూ.1000 వరకు ఉంటాయి.

కెమెరా లెన్స్ (Camera Lens)

సాధారణంగా మొబైల్ ఫోన్లలో కెమెరాలకు ఆప్టికల్ జూమ్ ఉండదు. డిజిటల్ జూమ్ మాత్రమే ఉంటుంది. డిజిటల్ జూమ్ అంటే తీసిన ఫొటోనే మరింత జూమ్ చేసి చూడడం లాంటిదన్న మాట. అందువల్ల ఫొటో క్వాలిటీ తగ్గిపోతుంది కూడా. ఇందుకు ప్రత్యామ్నాయంగానే మొబైల్ కెమెరా లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించి తీస్తే.. పూర్తి క్వాలిటీతో దూరంగా ఉన్న వాటిని ఫొటో తీయవచ్చు. రూ.100 నుంచి రూ.2000 వరకు వివిధ రకాలైన, వివిధ ఆప్టికల్ జూమ్ ను అందించే లెన్సులు లభిస్తాయి. అంతేకాదు సాధారణంగా మొబైల్ కెమెరాలో ఒకసారికి కొంత వెడల్పు వరకే ఫొటో తీయవచ్చు. కానీ వైడ్ యాంగిల్ లెన్స్ తో దాదాపుగా 180 డిగ్రీల వరకు కనబడేలా ఫొటోలు తీసేందుకు అవకాశముంటుంది. దీనిని ఫ్రంట్ కెమెరాకు అమర్చితే ఫోన్ దగ్గరగానే పట్టుకున్నా.. ఎక్కువ మందితో సెల్ఫీ తీసుకోవచ్చు. లెన్స్ లలో వివిధ ఉపయోగాలను బట్టి మైక్రో, మాక్రో, ఫిష్ ఐ, వైడ్ యాంగిల్, టిల్ట్ లెన్సులు, 5x నుంచి 12x వరకూ వివిధ జూమ్ లెన్సులు దొరుకుతాయి. దాదాపు అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లలో వీటిని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు.

కెమెరా ఫ్లాష్ (Camera Flash)

వెలుతురు ఎంత బాగుంటే మొబైల్ ఫోన్ కెెమెరాతో తీసే ఫొటోలు అంత బాగా వస్తాయి. చీకటి పడితే ఫొటోలు సరిగా రావు. చాలా మొబైల్ ఫోన్లలో ఇచ్చే ఫ్లాష్ అంత ప్రభావవంతంగా ఉండదు. అంతేకాదు వెలుతురు తక్కువగా ఉండడం, చీకటి పడిన సందర్భాల్లో సెల్ఫీలు కూడా తీసుకోలేం. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా వచ్చినవే మొబైల్ ఫ్లాష్ డాంగిల్ లు. వీటిని కూడా 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లో అమర్చుకోవడానికి వీలుంటుంది. ఇవి రీచార్జబుల్ కూడా. చార్జర్ కేబుల్ కూడా అందిస్తారు. అంటే మొబైల్ లోని బ్యాటరీని వినియోగించుకోవు. ఈ ఫ్లాష్ లను విడిగా టార్చ్ లైట్ గా కూడా వినియోగించుకోవచ్చు. వెలుగును పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. ఫొటో తీసినప్పుడే ఫ్లాష్ లాగా వెలుగు రావాలంటే మొబైల్ లోదీనికి సంబంధించిన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు వెనుకవైపుకు, ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ దిగినప్పుడు ముందు వైపుకు ఈ ఫ్లాష్ ను తిప్పుకోవచ్చు. ఈ ఫ్లాష్ లు కేవలం రూ.130 నుంచి రూ.400 వరకు దాదాపు అన్ని ఈ కామర్స్ సైట్లలో లభిస్తాయి.

స్మార్ట్ కీ (Smart Key)

స్మార్ట్ ఫోన్ ను మరింత అడ్వాన్స్ డ్ గా వినియోగించడానికి తోడ్పడే అతిచిన్న డాంగిల్ ఈ స్మార్ట్ కీ. కేవలం హెడ్ ఫోన్ జాక్ లో పట్టేంత చిన్నదిగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేక యాక్సెసరీలా కనిపించదు. దీనికి కేవలం ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ను ఒకసారి నొక్కడం, వరుసగా రెండు సార్లు నొక్కడం, వరుసగా మూడు సార్లు నొక్కడం, అలాగే కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచడం ద్వారా.. నాలుగు రకాలైన కమాండ్లను వినియోగించుకోవచ్చు. ఈ నాలుగు రకాల పనులు ఏమిటన్నది కూడా మనమే నిర్ణయించుకోవచ్చు కూడా. అయితే దీనికి సంబంధించిన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ కీని ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్ గా లాక్ స్క్రీన్ నుంచి కెమెరానుగానీ, ఫేస్ బుక్, వాట్సప్ వంటి ఏదైనా యాప్ లేదా గేమ్ ను నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. కరెంటు పోయినప్పుడు ఈ బటన్ ను ప్రెస్ చేసి లైట్ ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ లిఫ్ట్ చెయ్యడం, కట్ చెయ్యడం వంటి చేయొచ్చు. దాదాపు అన్ని ఈ కామర్స్ సైట్లలో రూ.200 నుంచి రూ.250 వరకు ఈ స్మార్ట్ కీలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ కీతో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే హెడ్ ఫోన్ జాక్ ద్వారా ఫోన్ లోకి దుమ్ము, ధూళి చేరకుండా ఉంటుంది.

స్క్రీన్ ఎన్ లార్జర్/ స్క్రీన్ మ్యాగ్నిఫయర్

మొబైల్ లో వీడియోలు, సినిమాలు మరింత పెద్దగా చూసేందుకు ఉపయోగపడే చాలా సాధారణమైన యాక్సెసరీ ఇది. ఇందులో ఒక మ్యాగ్నిఫైయింగ్ స్క్రీన్, దాని వెనుక ఒక చిన్న స్టాండ్ ఉంటాయి. మొబైల్ లో ఏదైనా వీడియో/సినిమా ఆన్ చేసి వెనుక స్టాండ్ పై పెట్టేస్తే చాలు. ముందు ఉన్న మ్యాగ్నిఫైయింగ్ స్క్రీన్ పై అది పెద్దగా కనిపిస్తుంది. ఎక్కడైనా టేబుల్, కుర్చీ లాంటి వాటిపై పెట్టేసి చూడొచ్చు. వీటిలో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ నాణ్యతను బట్టి మనకు చిత్రం క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. ఫోన్ స్క్రీన్ సైజులకు అనుగుణంగా వెనుక స్టాండ్ ను ముందుకు, వెనుకకు జరిపేలా ఏర్పాటు ఉంటుంది. వీటి ధరలు చాలా తక్కువ. అందువల్ల సరదాగా ఓ సారి ప్రయత్నించొచ్చు. సుమారు రూ.100 నుంచి రూ.400 వరకు దాదాపు అన్ని ఈ కామర్స్ సైట్లలో ఈ స్క్రీన్ ఎన్ లార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ నాణ్యతను బట్టి ధర పెరుగుతుంది. 

మైక్రో యూఎస్ బీ లైట్లు/ఫ్యాన్లు

ఎప్పుడైనా వెలుగు అవసరమైనప్పుడు మొబైల్ లోని ఎల్ఈడీ ఫ్లాష్ ను ఆన్ చేసుకుని వాడుతుంటారు. కానీ దాని ద్వారా వచ్చే వెలుగు తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫోన్ వేడెక్కుతుంది కూడా. మరోవైపు కరెంటు పోయినప్పుడు ఉక్కపోత. కొంచెం గాలి వస్తే బాగుండుననేలా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడేలా అందుబాటులోకి వచ్చినవే యూఎస్ బీ ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు. ఈ లైట్ మూడు నాలుగు ఎల్ఈడీ బల్బులతో కూడి ఉంటుంది. ఫ్యాన్ కూడా చిన్నగా ఒకరికి గాలి అందించగలిగేలా ఉంటుంది. ఫ్యాన్ రెక్కలను కూడా ఒక చోటికి చేర్చి, జేబులో పెట్టుకుని పోయే సదుపాయం కూడా ఉంది. ఈ లైట్, ఫ్యాన్ మొబైల్ బ్యాటరీని వినియోగించుకుని పనిచేస్తాయి. ధరలు కూడా చాలా తక్కువ. ఈ రెండూ కలిపి కూడా కేవలం రూ.150 నుంచి రూ.400 వరకు అన్ని ఈ కామర్స్ సైట్లలో దొరుకుతాయి. వీటిలో కొన్నింటికి నేరుగా మైక్రో యూఎస్ బీ (స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పోర్ట్)కి అమర్చుకోవడానికి వీలుగా ఉండగా.. కొన్ని నేరుగా కంప్యూటర్ యూఎస్ బీకి అమర్చేలా ఉంటాయి. ఇలాంటి వాటికోసం యూఎస్ బీ టు మైక్రో యూఎస్ బీ అడాప్టర్లను వినియోగించుకోవచ్చు. 

కెపాసిటివ్ స్టైలస్/పెన్ (Capasitive Stylus/Pen)

తొలినాళ్లలో వచ్చిన ఫోన్లలో రెసిస్టివ్ టచ్ స్క్రీన్ ఉండేది. దాంతో దేనితో తాకినా అవి స్పందించేవి. అప్పట్లో స్టైలస్ పట్టుకుని ఫోన్ ను ఆపరేట్ చేయడం ఓ ఫ్యాషన్ కూడా. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లన్నీ కెపాసిటివ్ టచ్ రకానివి. మనం తాకితే తప్ప టచ్ పనిచేయదు. అయితే కెపాసిటివ్ టచ్ పైనా పనిచేసేలా ప్రత్యేకమైన టచ్ స్టైలస్/పెన్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఫోన్ స్క్రీన్ ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఏవైనా బొమ్మలు వేయడం, సంతకాలు పెట్టడం, పిల్లలకు సంబంధించిన కొన్ని రకాల యాప్ లలో రంగులు నింపడం, రాయడం వంటి పనులను చేసుకోవచ్చు. గ్లాస్ లపై గీతలు పడకుండా ఈ స్టైలస్/పెన్ లకు మెత్తటి క్లాత్ వంటి ఏర్పాటు ఉంటుంది. ఇందులో కీ చైన్ గా కూడా ఉపయోగించగలిగేలా, వివిధ పరిమాణాలు, ఆకృతుల్లో కూడా ఇవి లభిస్తాయి. ధర కూడా చాలా తక్కువ. నాణ్యతను బట్టి రూ.70 నుంచి రూ.500 వరకు దాదాపు అన్ని ఈ కామర్స్ స్టోర్లలో లభిస్తాయి.

బ్లూటూత్ ట్రాకర్ (Bluetooth Tracker)

మీరెక్కడికైనా వెళ్లినప్పుడు లగేజీ పోతుందేమో, పిల్లలు దూరంగా వెళ్లిపోతారేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ ను దూరం చేసే పరికరమే బ్లూటూత్ ట్రాకర్. దీనిని పిల్లల దుస్తుల్లోగానీ, మెడలో లాకెట్ లాగా గానీ పెట్టుకోవచ్చు. ప్రయాణాల సమయంలో సూట్ కేసులు, ఇతర లగేజీ, పర్సుల వంటి వాటిలో అమర్చుకోవచ్చు. ఒక వేళ పిల్లలు దూరంగా వెళ్లడంగానీ, వస్తువులను ఎవరైనా పట్టుకెళ్లిపోతుండడం వంటివిగానీ జరిగితే ట్రాకర్ తో ఫోన్ లింక్ తెగిపోయి.. అలారం మోగుతుంది. దాంతో మనం వెంటనే అప్రమత్తం కావచ్చు.

 ఈ ట్రాకర్ల ధర, స్థాయిని బట్టి అవి పనిచేసే దూరం మారుతుంది. అతి తక్కువ ధరలో లభించే ట్రాకర్ కూడా సాధారణంగా 25 మీటర్ల  దూరం, ఎలాంటి అడ్డుగోడల వంటివి లేకపోతే 75 మీటర్ల దూరం వరకు పనిచేస్తాయి. అంతేకాదు, మన చుట్టూ ఆ ట్రాకర్ ఉన్న దిశను కూడా చూడొచ్చు. ట్రాకర్ ను కెమెరా క్యాప్చర్ బటన్ గా కూడా వినియోగించుకోవచ్చు.  ఈ ట్రాకర్లకు సంబంధించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 4.3 అంతకన్నా ఎక్కువ వెర్షన్, ఐఫోన్ 4ఎస్ కన్నా పై వెర్షన్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. వీటిలో ఇన్ బిల్ట్ బ్యాటరీ ఉండదు. చేతి గడియారాల్లో వినియోగించే తరహాకు చెందిన బ్యాటరీని కొని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి ఆధునికమైన బ్లూటూత్ 4.0 టెక్నాలజీతో పనిచేస్తాయి కాబట్టి బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది. ఈ బ్లూటూత్ ట్రాకర్లు దాదాపు అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లలో రూ.260 నుంచి రూ.1,500 వరకు లభిస్తాయి.

ఎంతో ఉపయోగపడే అడాప్టర్లు, స్ప్లిట్టర్లు

స్మార్ట్ ఫోన్ తో ఎన్నో రకాల పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సార్లు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిని సులువుగా చేసుకోగలిగేలా అడాప్టర్లు, స్ప్లిట్టర్లు, కేబుళ్లు వంటి చిన్న చిన్న పరికరాలెన్నో మనకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని ఈ కామర్స్ వెబ్ సైట్లలో ఇవి అత్యంత చవకగా రూ.50 నుంచి రూ.200లోపు ధరకే లభిస్తాయి. డేటా కాపీ చేసుకోవడం, ఒకే సారి రెండు హెడ్ సెట్ లు పెట్టుకుని ఇద్దరు పాటలు వినడం, మౌస్ వంటి వాటిని వినియోగించుకోవడానికి ఈ అడాప్టర్లు, స్ప్లిట్టర్లు పనికి వస్తాయి. వీటిలో కొన్ని రకాలు కలిపి బండిళ్లుగా కూడా లభిస్తుంటాయి. వీటిలో బాగా ఉపయోగపడేవేమిటో పరిశీలిద్దాం.

ఓటీజీ కేబుల్:

స్మార్ట్ ఫోన్ కు పెన్ డ్రైవ్ లు, కార్డ్ రీడర్లు వంటి వాటిని అనుసంధానం చేసుకోవడానికి ఉపయోగపడే కేబుల్ ఇది. తప్పనిసరిగా ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ దగ్గరా ఉండాల్సిన యాక్సెసరీ ఇది. పెన్ డ్రైవ్ లు, మెమరీ కార్డుల్లోని డేటాను నేరుగా యాక్సెస్ చేసుకోవడానికి.. కీబోర్డు, మౌస్ లను కూడా మొబైల్ కు కనెక్ట్ చేసుకోవడానికి వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఓటీజీ కేబుల్ తరహాలో పనిచేసే ‘మైక్రో యూఎస్ బీ టు యూఎస్ బీ అడాప్టర్లు కూడా లభిస్తాయి. కేబుల్ వంటివేమీ లేకుండా ఇవి మరింత చిన్నగా, సౌకర్యవంతంగా ఉంటాయి. వీటి ధరలు రూ.40 నుంచి రూ.150 వరకు ఉంటాయి.

హెడ్ ఫోన్ జాక్ స్ప్లిట్టర్:

ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ లో పాటలు వింటూనో, ఏదైనా సినిమానో, వీడియోనో చూస్తూంటారు. బయటి చప్పుళ్లతో ఇబ్బంది లేకుండా ఇయర్ ఫోన్స్ వాడుతారు. కానీ ఇద్దరుండి, ఒకే ఫోన్ వాడాల్సి వస్తే..? ఇలాంటి సందర్భాల్లో హెడ్ ఫోన్ జాక్ స్ప్లిట్టర్ పనికొస్తుంది. దీనికి రెండు నుంచి ఐదు వరకూ అదనంగా ఇయర్ ఫోన్లను అమర్చుకునేలా అందుబాటులో ఉన్నాయి. మన సౌకర్యాన్ని బట్టి కేబుల్, అడాప్టర్ రూపాల్లో వివిధ డిజైన్లలో దొరుకుతాయి. ధర కూడా చాలా తక్కువ. కేవలం రూ.50 నుంచి రూ.200 వరకు లభిస్తాయి.

మైక్రో యూఎస్ బీ (టూఇన్ వన్) కార్డ్ రీడర్:

వివిధ రకాల మెమరీ కార్డులను నేరుగా ఫోన్ కు కనెక్ట్ చేసి వినియోగించుకోవడానికి ఈ కార్డ్ రీడర్లు పనికివస్తాయి. కొన్ని రకాల కార్డ్ రీడర్లకు అటు కంప్యూటర్ యూఎస్ బీకి, ఇటు ఫోన్ కు కనెక్ట్ చేసుకునేలా రెండు పోర్ట్ లూ ఉంటాయి. సాధారణ మెమరీ కార్డులతో పాటు డిజిటల్ కెమెరాలు, పాత తరం పెద్ద మెమరీ కార్డులను కూడా ఈ కార్డ్ రీడర్ల సహాయంతో నేరుగా ఫోన్ కు అనుసంధానం చేసుకుని, వాడుకోవచ్చు. వీటి ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు ఉంటాయి.

మల్టీపుల్ చార్జర్లు:

ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఫోన్లను చార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన మల్టీపుల్ చార్జర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కుటుంబంతో కలసి, ఫ్రెండ్స్ తో కలసి ఎక్కడికైనా వెళ్లినప్పుడుగానీ, ప్రయాణాల్లోగానీ.. సాధారణంగా ఇంట్లో గానీ ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు.. వీటిలో ఉండే మూడు నాలుగు చార్జింగ్ పోర్టుల్లో స్టాండర్డ్ చార్జింగ్ కెపాసిటీ, క్విక్ చార్జింగ్ , వేర్వేరు ఫ్రీక్వెన్సీల చార్జింగ్ సౌకర్యాలు కూడా లభిస్తాయి. యూఎస్ బీ చార్జర్ కేబుల్ లను ఈ చార్జర్ కు కనెక్ట్ చేసి.. చార్జింగ్ చేసుకోవచ్చు. నాణ్యతను, సదుపాయాలను బట్టి రూ.200 నుంచి రూ.2,000 వరకు ఈ మల్టీపుల్ చార్జర్లు లభిస్తాయి.

సెల్ఫీ స్టిక్స్:

ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందినదే అయినా.. ఎక్కువ మంది ఫోన్ వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడం లేదు. కేవలం రూ.150 నుంచి రూ.500 వరకు ఈ సెల్ఫీ స్టిక్ లు లభిస్తాయి. సెల్ఫీలకే కాకుండా పెళ్లిళ్లు, ఏవైనా కార్యక్రమాల వంటి సమయంలో.. జనమెవరూ అడ్డురాకుండా కాస్త ఎత్తు నుంచి ఫొటోలు తీసుకోవడానికీ ఇవి పనికొస్తాయి. వీటిలో స్టిక్ లోనే బటన్స్ ఉండేవి, బ్లూటూత్ రిమోట్ లు ఉండేవీ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా విహారయాత్రలకు వెళ్లినప్పడు సెల్ఫీ స్టిక్ లు చాలా బాగా పనికొస్తాయి.

అక్స్ (Aux) కేబుల్:

కార్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కుగానీ, ఇంట్లో హోం థియేటర్లు, బ్లూటూత్ సౌకర్యం లేని స్పీకర్ సిస్టమ్ లకు మన ఫోన్ ను కనెక్ట్ చేసుకుని ఆడియోలు వినేందుకు అక్స్ కేబుల్ పనికొస్తుంది. ఇవి ఎక్కడైనా రూ.50 నుంచి రూ.250 వరకు లభిస్తాయి.

యాంటీ స్లిప్ మ్యాట్: 

చాలా సాధారణంగా అనిపించినా.. ఎంతో ఉపయోగపడే యాక్సెసరీ ఇది. కారులో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లతో పాటు కీలు, ఇతర చిన్న పరికరాల వంటి వాటిని డ్యాష్ బోర్డుపై పెడుతుంటాం. కానీ కుదుపులకు అవి ఎగిరిపడుతుండడం, కొన్నిసార్లు కార్లో కింద పడిపోతుండడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో ఉపయోగపడేవే యాంటీ స్లిప్ మ్యాట్ లు. ఇవి రెండు వైపులా ‘సక్షన్ గమ్మింగ్ (శూన్యాన్ని సృష్టించి అతుక్కునే బుడిపెలు)’తో ఉంటాయి. అందువల్ల ఓ వైపు కార్ డ్యాష్ బోర్డుకు అతుక్కుంటాయి. మరోవైపు దానిపై పెట్టిన వస్తువులను కూడా పట్టుకుంటాయి. వీటిలో మంచి నాణ్యమైనవి అయితే దాదాపు నున్నగా ఉన్న ఉపరితలాలపై నిలువుగా కూడా అతుక్కుని, వస్తువులను పట్టుకుంటాయి కూడా. వీటి ధరలు రూ.60 నుంచి రూ.500 వరకు ఉంటాయి.

ప్రొటెక్టివ్/షాక్ ప్రూఫ్ కేస్:

సాధారణ లెదర్ పౌచ్ లు, కవర్లు ఫోన్లకు కొంత వరకే రక్షణ కల్పించగలుగుతాయి. కానీ ఫోన్లు ఓ మోస్తరు ఎత్తు నుంచి పడిపోయినా దెబ్బతినకుండా తోడ్పడేవే ప్రొటెక్టివ్/షాక్ ప్రూఫ్ కేస్ లు. వీటిలో షాక్ ప్రూఫ్ గా ఉండే అదనపు భాగాన్ని తీసేసుకుని, మళ్లీ అమర్చుకునే అవకాశం ఉంటుంది. షాక్ ప్రూఫ్ భాగాన్ని తీసేస్తే సాధారణ ప్రొటెక్టివ్ కేస్ లా సింపుల్ గా ఉంటుంది. ఔట్ డోర్ కు వెళ్లినప్పుడు షాక్ ప్రూఫ్ ను అమర్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు వీటిలోనే మొబైల్ ను పక్క నుంచి నిలబెట్టేలా స్టాండ్ వంటివీ ఉంటాయి. రూ.250 నుంచి రూ.450 వరకు ఇవి లభిస్తాయి.

అండర్ వాటర్ పౌచ్:

వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు, ఎక్కువగా తడిగా ఉండే ప్రదేశాల్లో పనిచేయడం, అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి రావడం వంటి సందర్భాల్లో అండర్ వాటర్ పౌచ్ లు ఉపయోగపడతాయి. వర్షం పడినప్పుడు ఏదైనా కవర్ తీసుకుని ఫోన్లను అందులో చుట్టేసి పెట్టుకుంటూ ఉంటాం. అవి కొంత మేరకే నీటిని ఆపగలుగుతాయి. వాటికి ఉండే చిన్న రంధ్రాల నుంచి నీళ్లు లోపలికి వెళతాయి. కానీ అండర్ వాటర్ పౌచ్ లు చాలా దృఢంగా, ఒకవేళ ఏవైనా కాస్త పదునైన వస్తువులు తగిలినా చిరగకుండా ఉంటాయి. పౌచ్ లో ఫోన్ పెట్టాక దానిని పైన ఉన్న ప్లాస్టిక్ పరికరం పూర్తిగా సీల్ చేసేస్తుంది. రూ.200 నుంచి రూ.500 వరకు ఈ పౌచ్ లు లభిస్తాయి.

ల్యాన్ కేబుల్ అడాప్టర్:

చాలా వరకు ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లలో నేరుగా కేబుల్ ఇంటర్నెట్ కు అనుసంధానమయ్యే సదుపాయం కూడా ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి డాటా అండ్ నెట్ వర్క్స్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ను గమనించవచ్చు. ఇంట్లో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉంటే.. ఈ ల్యాన్ కేబుల్ అడాప్టర్ ద్వారా నేరుగా ట్యాబ్లెట్, ఫోన్ లో ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ఎటువంటి రూటర్ల అవసరం లేకుండా, పూర్తి వేగంతో ఇంటర్నెట్ ను పొందవచ్చు. పైగా బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోదు. రూ.300 నుంచి రూ.1500 వరకు ఈ అడాప్టర్లు లభిస్తాయి.

ఓటీజీ (టూఇన్ వన్) పెన్ డ్రైవ్ లు: 

డేటాను కాపీ చేసుకుని వెళ్లాలంటే మనం పెన్ డ్రైవ్ లను వినియోగిస్తుంటాం. సాధారణ పెన్ డ్రైవ్ లను కంప్యూటర్ యూఎస్ బీకి కనెక్ట్ చేసుకోగలం. ఇటీవల నేరుగా ఫోన్ కు కనెక్ట్ చేసుకుని వాడుకోగలిగే పెన్ డ్రైవ్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటినే ఓటీజీ పెన్ డ్రైవ్ లుగా పేర్కొంటారు. వీటికి అటు సాధారణ యూఎస్ బీ, ఇటు మైక్రో యూఎస్ బీ రెండు పోర్టులూ ఉంటాయి. అందువల్ల కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీల వంటి వాటితో పాటు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లలోనూ వీటిని వినియోగించుకోవచ్చు. ఈ తరహా పెన్ డ్రైవ్ లు కూడా సాధారణ పెన్ డ్రైవ్ ధరలోనే లభిస్తుండడం అదనపు సౌలభ్యం.

బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు

బ్లూటూత్ ద్వారా పనిచేస్తూ కాస్త పెద్ద ధ్వనితో ఆడియో వినేందుకు ఈ స్పీకర్లు తోడ్పడుతాయి. ఇవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చినా ఇంకా వినియోగం పెరగలేదు. సాధారణంగా ఫోన్ లో అవుట్ స్పీకర్ పెట్టుకుని పాటలు వింటే బ్యాటరీ తొందరగా అయిపోతుంది. సౌండ్ కూడా పెద్దగా రాదు, క్వాలిటీ కూడా ఉండదు. అదే బ్లూటూత్ స్పీకర్ లో ధ్వని ఓ మోస్తరు వరకు వస్తుంది. క్లియర్ గా కూడా ఉంటుంది. కొన్ని రకాల బ్లూటూత్ స్పీకర్లలో ఇన్ బిల్ట్ మైక్ కూడా ఉంటుంది. అంటే దాని ద్వారా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. కొన్నింటిలో ఎఫ్ఎం సౌకర్యం, నేరుగా మెమరీ కార్డులు పెట్టుకుని పాటలు వినే సదుపాయం కూడా ఉంటుంది.  అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ఇవి రీచార్జబుల్. అందువల్ల మొబైల్ ఫోన్లలో చార్జింగ్ తగ్గిపోతుందన్న బాధ ఉండదు. ఔట్ డోర్ కు వెళ్లినప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. నాణ్యత, సామర్థ్యాన్ని బట్టి బ్లూటూత్ స్పీకర్లు రూ. 250 నుంచి రూ.2,500 వరకు లభిస్తాయి.

స్టాండ్ లు:

మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్లకు సంబంధించి వివిధ అవసరాలకు వాడుకునే పలు రకాల స్టాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి ధర చాలా తక్కువగా ఉండడంతోపాటు మనకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఫోన్/ట్యాబ్లెట్ ను ఏదైనా టేబుల్ పైగానీ, మరెక్కడైనా గానీ నిలబెట్టడానికి ఇవి పనికి వస్తాయి. ఇక కారులో అద్దానికిగానీ, డాష్ బోర్డుకుగానీ బిగించుకునేందుకు ఉపయోగపడతాయి. క్లిప్ సౌకర్యం, వైర్ మెష్ తో వచ్చే స్టాండ్లను అయితే ఎక్కడైనా మనకు నచ్చిన కోణంలో ఏర్పాటు చేసుకునేందుకు పనికి వస్తాయి. చార్జింగ్ పెట్టినప్పుడు కింద పడకుండా కరెంటు ప్లగ్ వద్దే మొబైల్ ను పెట్టుకునే స్టాండ్లూ దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా రూ.50 నుంచి రూ.300 వరకు ఉంటాయి.


More Articles