ఆరోగ్యాన్ని కాపాడే వంట నూనెలు ఏవో తెలుసా..?
సాధారణంగా ఎక్కువ మంది పొద్దుతిరుగుడు నూనె (సన్ ఫ్లవర్ ఆయిల్)ను వంటల్లో వినియోగిస్తుంటారు. వేరుశనగ నూనె, పామాయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడే వారూ ఉన్నారు. వంటలకు వినియోగించే ఇతర నూనెలు కూడా ఉన్నాయి. ప్రతీ నూనెకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అసలు నూనెల్లో ఏమి ఉంటాయి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ముప్పు ఏంటి? తదితర విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏ నూనెలు వాడాలో అవగాహన ఏర్పడడం వల్ల జాగ్రత్త పడేందుకు వీలుంటుంది.
ఒకప్పుడు దేశంలో ప్రాంతాల వారీగా ఓక్కో రకమైన వంట నూనె వినియోగం ఉండేది. కేరళలో కొబ్బరినూనె, ఆంధప్రదేశ్ లో వేరుశనగ, నువ్వుల నూనె, రాజస్తాన్ రాష్ట్రంలో నువ్వుల నూనె, తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవనూనె, మధ్య భారతం, గుజరాత్ లో వేరుశనగ నూనె వాడేవారు. కానీ ఆ తర్వాత కాలంలో వంట నూనెల వినియోగం పూర్తిగా మారిపోయింది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. గుండె జబ్బులు పెరిగిపోవడానికి కొలెస్ట్రాల్ కారణమనే విషయం తెలిసింది. దీంతో అప్పటి నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ నూనె వినియోగం పెరుగుతూ పోయింది. ఆ తర్వాత మరికొన్ని వంట నూనెలు కూడా కిచెన్ లోకి వచ్చి చేరాయి. నూనెల్లో ఏమేమి ఉంటాయి...?
కొలెస్టరాల్
ఇదొక కొవ్వు పదార్థం. రక్త నాళాల్లో, కణాల్లో ఉంటుంది. శరీరంలో జీవ క్రియలకు ఇది అవసరం. ముఖ్యంగా బ్రెయిన్ పనితీరుకు ఇది చాలా అవసరం. ఇది రెండు రకాలు. హై డెన్సిటీ లిపోప్రొటీన్. సంక్షిప్తంగా హెచ్ డీఎల్. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మరొకటి 'లో డెన్సిటీ లిపో ప్రొటీన్'. సంక్షిప్తంగా ఎల్ డీఎల్. దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ గా చెబుతారు.
ఆహార పదార్థాల్లో ఉండే ఫ్యాట్ మన శరీరానికి తప్పనిసరి కావాల్సిన పోషకం. శరీరంలో చాలా జీవ క్రియలకు శక్తినిచ్చేది ఇదే. ఈ ఫ్యాట్స్ ను ట్రైగ్లిజరైడ్స్ అని అంటారు. ఇందులోనూ రకాలు ఉన్నాయి.
శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎస్ఎఫ్ఏ)
ప్రతీ ఆహారంలోనూ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్స్ ను శాచురేటెడ్, పాలీ అనుశాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ అని వర్గీకరించి చెబుతారు.
శాచురేటెడ్ కొవ్వు ఉన్న వాటిని వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. పాలీ అనుశాచురెటెడ్ ఫ్యాట్లు వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు మేలు చేస్తుంది. ఒమెగా-6, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అనుశాచురేటడ్ రూపాలే.
మోనో అను్ శాచురేటెడ్ ఫ్యాట్ కూడా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు దోహదపడుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మంచివి కావు. ఇవి నూనెలను, ఫ్యాట్స్ ను మరింత చిక్కగా మారుస్తాయి. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నూనెలను వాడడం వల్ల టోటల్ కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో గుండె జబ్బులకు దారి తీస్తుంది.
మీరు గమనించే ఉంటారు...
అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్, పామాయిల్ పేరుకుపోవడాన్ని గమనించే ఉంటారు. మిగిలిన నూనెలు గడ్డకుండా ఎటువంటి టెంపరేచర్ లో అయినా ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే పామాయిల్, కోకోనట్ ఆయిల్ లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. అందుకనే అవి అలా సాలిడ్ గా మారతాయి.
మోనో అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎంయూఎఫ్ఏ)
జీవక్రియల పరంగా మోనో అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మేలు చేస్తాయి. ఎంయూఎఫ్ఏ ఉన్న నూనెలను వినియోగించినట్టయితే చెడ్డ కొలెస్ట్రా తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదాహరణకు ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్.
పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్(పీయూఎఫ్ఏ)
పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నూనెలను వాడితే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఉదాహరణకు సన్ ఫ్లవర్ ఆయిల్, శాఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్
ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్
పాలీ అనుశాచురేటెడ్ కుటుంబానికి చెందినవే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మనిషికి కావాల్సిన రెండు తప్పనిసరి ఫ్యాటీ యాసిడ్స్ లో ఇది కూడా ఒకటి. దీన్ని మన శరీరం ఉత్పత్తి చేయలేదు. ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. చేపనూనెలో, ఫ్లాక్స్ (లిన్సీడ్) ఆయిల్ లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మస్టర్డ్ (6-11శాతం), కనోలా/రేప్ సీడ్ ఆయిల్ లో 7శాతం ఓమెగా-3 యాసిడ్స్ ఉంటాయి. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ (ఏఎల్ఏ), ఎకోసాపెంటానోక్ యాసిడ్ (ఈపీఏ), డోకోసాహెక్సోనిక్ యాసిడ్ (డీహెచ్ఏ) వీటిని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గా పేర్కొంటారు.
ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్
ఆరోగ్యానికి చాలా అవసరం. ఓమెగా-6, ఒమేగా-3 ఈ రెండూ శరీర జీవక్రియలకు చాలా కీలకం. అయితే ఇవి సరైన నిష్పత్తిలో ఉంటేనే ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. ఒమెగా-6, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రేషియో 5:4 (1.25:1) గా ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. ఈ విధంగా చూస్తే మస్టర్డ్ ఆయిల్ ఈ రేషియోకు దగ్గరగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ లో ఒమేగా-6, 3 ఫ్యాటీ యాసిడ్స్ రేషియో 1.2:1. ఇంకా ఆరోగ్యానికి హాని చేసే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ నూనెలో తక్కువగా ఉంటాయి. లినోలెనిక్ యాసిడ్ (ఎల్ఏ), గామా లినోలెనిక్ యాసిడ్ (జీఎల్ఏ), అరాచిడోనిక్ యాసిడ్ (ఏఏ) వీటిని ఒమెగా-6 యాసిడ్స్ గా చెబుతారు.
ఒమెగా-9 ఫ్యాటీ యాసిడ్స్
ఒలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ లను ఒమెగా- ఫ్యాటీ యాసిడ్స్ గా పేర్కొంటారు. ఒమెగా-3 లేదా ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తగినంత అందితే సహజసిద్ధంగానే మన శరీరం ఒమెగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ను తయారు చేస్తుంది.
ఒరైజనాల్
రైస్ బ్రాన్ ఆయిల్ లో మాత్రమే ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఇది. ఒరైజనాల్ ను హెర్బల్ చికిత్సల్లో వాడుతుంటారు. ప్లాస్మా కొలెస్ట్రాల్ ను ఇది తగ్గిస్తుంది. ఇది హార్ట్ ఎటాక్ ను నివారిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. నాడీ పనితీరులో అసమతుల్యత, మెనోపాజ్ సమయంలో తలెత్తే సమస్యలకు ఓరైజనాల్ మంచి ఔషధంలా పనిచేస్తుంది.
టోకోట్రియోనోల్స్
విటమిన్ 'ఇ' కుటుంబానికి చెందినవి ఇవి. సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్. రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, కోకోనట్ ఆయిల్ లో లభిస్తాయి. కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, కేన్సర్ నివారణకు ఇవి ఉపకరిస్తాయి.
ఫైటో స్టెరోల్స్
ఇవి మొక్కల్లో సహజసిద్ధంగా తయారయ్యే మిశ్రమాలు. వీట్ జెర్మ్, సీసేమ్, కార్న్, కనోలా, ఆల్మండ్ ఆయిల్ లో ఇవి ఉంటాయి. ఫైటో స్టెరోల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రోజూ 2 గ్రాముల ఫైటోస్టెరోల్స్ ను తీసుకుంటే 10 శాతం చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా రక్షిస్తుంది. అలాగే కేన్సర్ నివారిణిగా కూడా ఉపయోగపడతాయి.
నూనెల్లో చూడాల్సిన అంశాలు....?
వంట నూనెలు అన్నింటిలోనూ కేలరీలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటాయి. ఒక టేబుల్ టీ స్పూన్ (సుమారు 13 గ్రాములు) నూనెలో 120 కేలరీలు ఉంటాయి.
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేదా ఎక్స్ పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్
ఆయిల్ ను ఎలా తయారు చేసిందీ తెలియజేసే విధానం ఇది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చేస్తారు. దీని వల్ల అందులో ఉండే ఆరోమా, పోషక గుణాలు, రుచికి విఘాతం కలగదు. ఎక్స్ పెల్లర్ ప్రెస్డ్ విధానంలో నూనెను మెకానికల్ విధానంలో వెలికితీస్తారు. కెమికల్స్ ను వాడరు.
స్మోక్ పాయింట్
ప్రతీ ఆయిల్ కూ స్మోక్ పాయింట్ అని ఉంటుంది. అంటే గరిష్ట ఉష్ణోగ్రత అన్నమాట. ఈ ఉష్ణోగ్రత స్థాయిని దాటిన తర్వాత ఆ నూనె విచ్చిన్నం అవుతుంది. సరిగ్గా గమనిస్తే నూనె బాగా మరుగుతూ ఉన్నప్పుడు పొగ వెలువడుతుంటుంది. కొన్ని నూనెలకు ఈ స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద చేసే వంటకాలకు ఇవి వాడుకోవడం మంచిది. పిండి వంటలను సలసల కాగే నూనెలో చేస్తారన్న విషయం తెలిసిందే. అలాగే పూరీలను కూడా కాగే నూనెలో వేసి తీస్తాం. ఇలాంటివి అన్నమాట.
నూనెలను కాచే సమయలో ఆక్సిజన్ కారణంగా ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. బాగా వేడెక్కిన తర్వాత నూనెల నుంచి ఉప ఉత్పత్తులు ఏర్పడతాయి. వీటిని పోలార్ కాంపౌండ్స్ అంటారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, గుండెపోటు ముప్పు ఎదురవుతుంది.
ముఖ్యంగా పాలీ అనుశాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండింటిలో మోనో అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వేడి, ఆక్సీడేషన్ ప్రక్రియ ప్రభావానికి తక్కువ లోనవుతాయి. అందుకని మోనో అనుశాచురేటెడ్ ఎక్కువ ఉన్న నూనెలు మెదటి చాయిస్ గా వాడుకోవడం మంచిదన్నది పోషకాహార నిపుణుల సూచన. అంటే ఆలివ్, అవకాడో, కనోలా, సన్ ఫ్లవర్, సిసేమ్, సోయాబీన్ ఆయిల్స్ అన్నమాట.
నూనెలను అదే పనిగా కాచి వాడితే...
నూనెలను అధిక ఉష్ణోగ్రత వద్ద చాలా సేపు కాచడం వల్ల అందులో ఉండే మంచి గుణాలే ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా మారిపోతాయి. కాచిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరమని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. మన దేశంలో హోటళ్లలో ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఒక రోజు మిగిలిన నూనెలోనే మరికొంత యాడ్ చేసి వాడుతుంటారు. పైగా రోజంతా ఆ నూనె కాగుతూనే ఉంటుంది. కేవలం మన దగ్గరే కాదు, ఖర్చు తగ్గించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది.
ప్రతీ నూనె కూడా దాని స్మోక్ పాయింట్ కంటే అధిక ఉష్ణోగ్రతకు వెళితే వాటిల్లో ఉండే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్ గా మారతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి చేటు చేస్తాయి. నూనెను అదే పనిగా కాచడం వల్ల ఫ్యాటీ యాసిడ్ల రూపాలు మారిపోతాయి. నూనె గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద బాగా మరిగితే ఆ సమయంలో ఆక్సిడేషన్, హైడ్రాలసిస్, పాలీమరైజేషన్ వంటి రసాయనిక ప్రక్రియలు జరుగుతుంటాయి. ఇలాంటి నూనెలను వాడడం వల్ల కేన్సర్, కార్డియో వాస్క్యులర్ వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది. శరీరంలో పలు అవయవాలు దెబ్బతింటాయి.
ఏ నూనె మంచిది..?
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), అలాగే, సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు వంట నూనెలపై అధ్యయనం నిర్వహించారు. ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలా భిన్న రకాల నూనెల్లోని రకరకాల అంశాలపై అధ్యయనం చేశారు. వీరి అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మస్టర్డ్ ఆయిల్ గుండెకు మంచిదని. ఒమెగా-3, ఒమెగా-6 వంటి మంచి ఫ్యాట్స్ అధికంగా ఉండాలి. అలాగే ఆ నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ప్యాట్స్ పరిమితంగా ఉండాలి.
రిఫైన్డ్ చేయని, మోనో అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉన్న నూనెలు ఆరోగ్యానికి మంచివి. శరీరానికి అవసరమైన వాటన్నింటినీ తగిన స్థాయిలో కలిగి ఉన్న ఆయిల్... రైస్ బ్రాన్ ఆయిల్ గా పేర్కొంటారు. మోనో అను శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 47 శాతం, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 33 శాతం, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 20 శాతం రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు అయిన విటమిన్ ఇ, ఓరైజనాల్ గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తాయి. అలాగే, వేరు శనగ నూనెలోని శాచురెటెడ్, మోనో అనుశాచురేటెడ్, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ల నిష్పత్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు దగ్గరగా ఉంది. మన దగ్గర అందుబాటులో ఉన్న వంట నూనెల్లో ధరల పరంగా చూసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ ఈ మూడు మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ఖరీదైనది. కనుక ఈ వంట నూనెలు వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
వేరుశనగ నూనె (గ్రౌండ్ నట్ ఆయిల్)
దీన్ని పీనట్ ఆయిల్ అని కూడా అంటారు. వేరు శనగ గింజల నుంచి తీసిన నూనెలో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చెడ్డ కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇవి మన గుండెకు ముప్పుగా మారే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ (దీన్నే చెడ్డ కొలెస్ట్రాల్ అని అంటారు)ను తగ్గిస్తాయి. ఇంకా వేరుశనగ నూనెలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. చర్మానికి రక్షణగా నిలుస్తుంది. కనుక వేరుశనగ నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు. అధిక ఉష్ణోగ్రత వద్ద చేసే వంటకాలకు ఇది అనువైనది.
ఎందుకంటే హై స్మోక్ పాయింట్ ఎక్కువ ఉన్న నూనె ఇది. ఆసియా ప్రాంత ప్రజలకు ఈ నూనె చక్కని సూచనగా పేర్కొంటారు. వేరు శనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టెరోల్స్ ఉండడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. కొలన్, బ్రెస్ట్, ప్రొస్టేట్ కేన్సర్ల నుంచి రక్షణకు వేరుశనగ నూనె వాడుకోతగినది. వేరుననగ గింజలను స్వయంగా నూనె పట్టించి వాడుకోవడం కంటే కంపెనీలు విక్రయించే నూనెను వాడుకోవడం మంచిది. ఎందుకంటే అలెర్జీకి దారితీసే ప్రొటీన్ ను కంపెనీలు ప్రాసెస్ చేసే సమయంలో తొలగిస్తాయి. ఈ నూనెలో ఎంయూఎఫ్ఏ 48 శాతం, పీయూఎఫ్ఏ 34 శాతం, ఎస్ఎఫ్ఏ 18 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 450 ఫారిన్ హీట్ డిగ్రీలు. స్మోక్ పాయింట్ ఎక్కువ ఉన్న నూనె ఇది. ఇందులో ఎక్స్ పెల్లర్ ప్రెస్డ్ రకం మంచిదని సూచన.
పొద్దుతిరుగుడు నూనె (సన్ ఫ్లవర్ ఆయిల్)
ఎంయూఎఫ్ఏ 16 శాతం, పీయూఎఫ్ఏ 72 శాతం, ఎస్ఎఫ్ఏ 12 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 440 డిగ్రీలు. దీని స్మోక్ పాయింట్ కూడా ఎక్కువగానే ఉంది. కనుక అన్ని రకాల వంటలకు అనుకూలమైనది. పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండడం వల్ల దీన్ని కూడా ఆరోగ్యకరమైన ఆయిల్ గానే పరిగణిస్తున్నారు. ఈ ఆయిల్ కు స్వతహాగా తేలికపాటి రుచి వల్ల ఏ పదార్థంలో వాడినా ఆ పదార్థం యెక్క సహజ రుచి మారిపోదు.
ఇందులో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఇ ఉండడం వల్ల కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగడపడుతుంది. విటమిన్ ఇ అధికంగా ఉండడం వల్ల ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. మధుమేహం ఉన్నవారికి సన్ ఫ్లవర్ ఆయిల్ అంత సూచనీయం కాదు. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు ఈ నూనె కారణమవుతుందంటారు.
ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్)
ఆవనూనె ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుంది. వంటల్లో దీని వాడడం వల్ల రుచిలో స్పష్టమైన మార్పు ఉంటుంది. అందుకే చాలా మంది ఆవనూనెను ఇష్టపడరు. అధిక ఉష్ణోగ్రత వద్ద వేగినా నూనెలోని గుణాలు దెబ్బతినవు. దీంతో వేపుళ్లకు అనుకూలం. జీర్ణవ్యవస్థను ఉత్తేజంగా మార్చగల శక్తి దీనికి ఉంది. అలాగే, రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేందుకు ఆవనూనె తోడ్పడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల చర్మానికి మంచిది. ఇందులో ఎస్ఎఫ్ఏ 13 శాతం, ఎంయూఎఫ్ఏ 60 శాతం, పీయూఎఫ్ఏ 21 శాతం, ఒమెగా-3 5.9 శాతం, ఒమెగా-6 15 శాతంగా ఉంటాయి. స్మోక్ పాయింట్ 489 డిగ్రీల ఫారిన్ హాట్. ఇందులో అన్ని సమపాళ్లలో ఉండడం వల్ల అన్ని రకాల వంటలకు, ఆరోగ్యానికి మంచిది.
ఆలివ్ ఆయిల్
రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నట్టయితే ఇందులో ఉండే మోనో అనుశాచురేటెడ్ ఫ్యాట్స్ చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల గుండె జబ్బు, కేన్సర్ ముప్పులను తగ్గిస్తుందట. రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. సలాడ్లు, ఆకలిని పెంచే అపిటైజర్లలో ఆలివ్ ఆయిల్ ను వాడుతుంటారు. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది. చర్మ సమస్యలున్నవారికి చర్మంపై రాసుకోవాలంటూ ఈ ఆయిల్ ను సూచిస్తుంటారు. క్యాల్షియాన్ని మన శరీరం స్వీకరించేందుకు ఈ ఆయిల్ తోడ్పడుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ ను పండ్ల గుజ్జు నుంచి సేకరిస్తారు. ఇందులో ఎంయూఎఫ్ఏ 77 శాతం, పీయూఎఫ్ఏ 9 శాతం, ఎస్ఎఫ్ఏ 14 శాతం చొప్పున ఉంటాయి. స్మోక్ పాయింట్ 375 నుంచి 470 డిగ్రీల ఫారిన్ హీట్ మధ్య ఉంటుంది. ఆయిల్ రకాన్ని బట్టి ఈ ఉష్ణోగ్రత అనమాట. అధిక ఉష్ణోగ్రతలతో చేసే వంటకాలకు అనువైనది కాదు. ఇందులో ఒమెగా ఫ్యాటీ 3, 6 యాసిడ్లు చాలా తక్కువగా ఉంటాయి.
కొబ్బరి నూనె (కోకోనట్ ఆయిల్)
కొబ్బరి నూనెలో 90 శాతం వరకు ఫ్యాటీ యాసిడ్లు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లే. ఈ నూనెను వాడడం వల్ల మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది. అదే సమయంలో అధికంగా వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ సైతం పెరుగుతుందన్న హెచ్చరికలు ఉన్నాయి. అధిక వేడిపై చేసే వంటకాల్లోనూ ఈ నూనెను వాడుకునేందుకు అనువైనది. ఇందులో లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కొలెస్టరాల్ ను తగ్గించి, బ్యాక్టీరియాను చంపేందుకు ఉపకరిస్తుంది. దీనిలో ఉండే కొవ్వులు జీవక్రియలను పెంచుతాయి. ఇది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే నూనె. అందుకే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో దీన్ని వినియోగిస్తుంటారు.
ఎంయూఎఫ్ఏ 6 శాతం, పీయూఎఫ్ఏ 2 శాతం, ఎస్ఎఫ్ఏ 92 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 350 డిగ్రీలు. ఇందులో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విషయానికొస్తే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎంసీఎఫ్ఏ) ఉంటాయి. ఎంసీఎఫ్ఏ లు లివర్ లో త్వరగా బర్న్ అయి శక్తిగా మారతాయి. అంతేకానీ శరీరంలో కొవ్వులా పేరుకుపోవు. పైగా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నప్పటికీ కోకోనట్ ఆయిల్ వాడుకోతగినదేనని నిపుణుల సూచన. ఎందుకంటే అన్ని రకాల నూనెలలో ఉండే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకే రకమైనవి కావన్నది వారి వివరణ. ఒమెగా-3 ఉండవు. ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం 1.8 శాతం ఉంటాయి.
రైస్ బ్రాన్ ఆయిల్
వరి తౌడు నుంచి సేకరించే నూనె ఇది. ఎస్ఎఫ్ఏ 20 శాతం, ఎంయూఎఫ్ఏ 47 శాతం, పీయూఎఫ్ఏ, ఒమెగా-3 1.6 శాతం, ఒమెగా-6 33 శాతం చొప్పున ఉంటాయి. స్మోక్ పాయింట్ 489 డిగ్రీల ఫారిన్ హీట్. అన్ని రకాల వంటలకు అనువైనది. అత్యంత ఆరోగ్యకరమైన నూనెగా దీన్ని చెబుతారు. దీనితో వండితే ఆహార పదార్థాల రుచి దెబ్బతినదు. ఒరైజనాల్ అనే కెమికల్ ఇందులో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీంతో గుండెకు రక్షణ రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పవచ్చు. మోనో అనుశాచురేటెడ్ ప్యాట్ అధికంగా ఉంటుంది. అలాగే పాలీ అనుశాచురేటెడ్ మోస్తరుగా ఉంటుంది. ఈ రెండు మంచి చేసే కొవ్వులే. అధిక ఉష్ణోగ్రత వద్ద చేసే వంటకాలకు కూడా అనువైనది. జపనీయులు ఎక్కువగా వినియోగించేది ఈ నూనే. ఈ నూనెలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.
నువ్వుల నూనె (సిసేమ్ ఆయిల్)
నువ్వుల నూనెను కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. తేలికపాటి రుచి, అధిక ఉష్ణోగ్రతల వద్ద వినియోగించుకోగలగడం అనుకూలతలు. రెండు రకాల్లోనూ పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా తోడ్పడుతుంది. నువ్వుల నూనె ఎక్కువ సేపు వేగించకూడదు. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, విటమిన్ బీ6 కూడా ఈ నూనెలో లభిస్తాయి. ఇందులో లైట్, డార్క్ అని రెండు రకాల నూనెలు ఉంటాయి.
పామాయిల్
పామాయిల్ చెట్ల పండ్ల నుంచి సేకరించే నూనె ఇది. శాచురేటెడ్, మోనో అనుశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తోపాటు మంచి కొలెస్ట్రాల్ ను కూడా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కూడా ఇందులో లభిస్తాయి. శుద్ధి చేయని పామాయిలే మంచిదిగా పేర్కొంటారు. ఎందుకంటే శుద్ధి చేయని నూనెలో విటమిన్ ఇ, కోఎంజైమ్ క్యూ10, ఇతర పోషకాలు ఉంటాయట.
స్మోక్ పాయింట్ 450 డిగ్రీలు. ఎంయూఎఫ్ఏ 39 శాతం, పీయూఎఫ్ఏ 11 శాతం, ఎఫ్ఎఫ్ఏ 50 శాతం ఉంటాయి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సగం శాతం ఉండడం వల్ల దీర్ఘకాలంపాటు వాడితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
సోయాబీన్ ఆయిల్
ఈ నూనెలో పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. ఒమేగా3,6 యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాలను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు ఈ నూనె అనువైనది. స్త్రీలలో హార్మోన్ల లోపం వల్ల ఏర్పడే సమస్యలకు ఇది మంచిది. ఇందులో ప్యూర్ ఫ్యాట్ ఉండడం వల్ల అధికంగా వాడితే అనర్థం. ఎంయూఎఫ్ఏ 24 శాతం, పీయూఎఫ్ఏ 61 శాతం, శాచురేటెడ్ 15 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 450 డిగ్రీలు.
వనస్పతి నూనె
ఈ వనస్పతి నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ.. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఈ నూనెను కంపెనీలు వాడుతుంటాయి. నూనెను అధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజెనేషన్ చేయడం వల్ల ద్రవ పదార్థం కాస్తా గట్టి ఫ్యాట్ గా మారుతుంది. కానీ ఇందులో ఉండే 25 శాతం ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు తలెత్తుతాయి.
ఆవునెయ్యి
ఆవునెయ్యిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఆవు నెయ్యితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాల్లోనూ వెల్లడైంది. కానీ, ఆవునెయ్యిలో అధిక శాతం ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్. కనుక ఆవునెయ్యిని మితంగా వాడుకోవడం శ్రేయస్కరం. ఎస్ఎఫ్ఏ 65 శాతం, ఎంయూఎఫ్ఏ 32 శాతం, పీయూఎఫ్ఏ 3 శాతం ఉంటాయి. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. స్మోక్ పాయింట్ 374-482 డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత. అన్ని రకాల వంటకాలకు అనువైనది.
కనోలా ఆయిల్
ఇది ఆవ జాతికి చెందినది. కనోలా చెట్టు గింజల నుంచి ఈ ఆయిల్ ను సేకరిస్తారు. దీని జన్మస్థానం కెనడా. ఇందులో ఎంయూఎఫ్ఏ 61 శాతం, పీయూఎఫ్ఏ 32 శాతం, ఎస్ఎఫ్ఏ 7 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 400 డిగ్రీల ఫారిన్ హీట్. ఒమెగా-3 9.1 శాతం, ఒమెగా-6 18 శాతం ఉంటాయి. ఎంయూఎఫ్ఏ అధికంగా ఉండడం, స్మోక్ పాయింట్ అధికం కూడా కావడం వల్ల అన్ని రకాల వంటలకు అనువైనది.
ఈ నూనెలో ఉండేే ఓమేగా3, 6, ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. కేవలం 7 శాతమే శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అందుకే దీన్ని ఆరోగ్యాన్నిచ్చే నూనెగా పేర్కొంటారు. అయితే, గరిష్ట ఉష్ణోగ్రత దాటి వేడి చేసినప్పుడు ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచి, మంచి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అందుకే బాగా కాచి చేసే వంటకాలకు ఈ నూనె తగినది కాదు. ఇది మన భారత దేశానికి కొత్తది. వినియోగం చాలా తక్కువగానే ఉంది.
అవిసెనూనె (ఫ్లాక్స్ సీడ్ ఆయిల్)
ఇందులో ఎంయూఎఫ్ఏ 18 శాతం, పీయూఎఫ్ఏ 73 శాతం, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 9 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 225 డిగ్రీలు. స్మోక్ పాయింట్ చాలా తక్కువ కనుక బాగా కాచి చేసే వంటకాల్లో దీన్ని వాడరాదు.
అవకాడో ఆయిల్
ఎంయూఎఫ్ఏ 71 శాతం, పీయూఎఫ్ఏ 13 శాతం, శాచురేటెడ్ 12 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 400 డిగ్రీలు. ఇందులోనూ ఎంయూఎఫ్ఏ అధికంగా ఉండడం, స్మోక్ పాయింట్ ఎక్కువ కావడంతో అన్ని రకాల వంటలకు అనువైనది. ఒమెగా-3 ఒక శాతం, ఒమెగా-6 12 శాతం ఉంటాయి.
ఆల్మండ్ ఆయిల్
ఎస్ఎఫ్ఏ 8 శాతం, ఎంయూఎఫ్ఏ 66 శాతం, పీయూఎఫ్ఏ 26 శాతం ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం 17 శాతం ఉంటాయి. స్మోక్ పాయింట్ 430 డిగ్రీల ఫారిన్ హీట్. బేకింగ్ ఉత్పత్తులు, సాస్ ల తయారీకి అనుకూలమైనది.
నూనె నిల్వ ఎలా?
వంట నూనెలను ఎప్పటికప్పుడు తాజావే వాడడం మంచిది. ఒకే సారి కొనుగోలు చేసి నెలల తరబడి నిల్వ చేసుకోవడం సరైనది కాదు. వేడి, అధిక వెలుతురు వల్ల నూనెలు పాడవుతాయి. వాడిన తర్వాత నూనె డబ్బా మూతను గట్టిగా బిగించి పెట్టాలి.