ఎవరికి ఏ ఆహారం...? పండ్లను ఎప్పుడు తింటే మేలు...?
నిత్య జీవితంలో నచ్చినది తినడం ఎక్కువ మంది చేసే పని. తినే పరిమాణం విషయంలోనూ వారికి ఎలాంటి తూకాలు ఉండవు. అసలు దాని గురించి ఆలోచించడం కూడా వారికి నచ్చదు. నోటికి నచ్చినది తినాలి అంతే. అయితే, ఆహారమే ఆరోగ్యానికి కీలకం అన్న విషయాన్ని ఆధునిక వైద్య శాస్త్రం పుట్టక ముందే మన మహర్షులు వేదాల్లో చెప్పారు. దాన్ని వైద్య శాస్త్రం కూడా సమర్థిస్తోంది. అందుకే నచ్చినదల్లా తినడం కాకుండా ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలంటే హెల్దీ డైట్ చాలా కీలకమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నేడు ప్రాసెస్డ్ (శుద్ధి చేసిన) ఆహార పదార్థాల వినియోగం చాలా పెరిగిపోతోంది. ఇంట్లో పెద్దగా కష్టపడడానికి మనసు అంగీకరించక సుఖపడే ధోరణిలో ఈ ఆహారాన్ని ఆశ్రయిస్తున్నాం. ఎక్కువ కేలరీలు, ఫ్యాట్స్, షుగర్, సాల్ట్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. వీటి పట్ల ఉన్న మక్కువ రోజుకో పండు తినడంపై, కూరగాయల వినియోగంపై అంతగా ఉండడం లేదు. పైగా శారీరక వ్యాయామం కూడా తగ్గిపోయింది.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలనే విషయంలో అంతగా అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో అందరికీ ఒకే ఆహార నియమావళి వర్తించదు. వయసు, జీవన విధానం, శారీరక శ్రమ ఆధారంగా తీసుకోవాల్సిన ఆహారం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతుందో చూద్దాం.
పెద్దలకు
పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు (నాటు చిక్కుళ్లు, గోరు చిక్కుళ్లు, బీన్స్), నట్స్, తృణ ధాన్యాలు (వరి, రాగి, ఓట్స్, గోధుమ, బ్రౌన్ రైస్) తప్పకుండా ఆహారంలో భాగం కావాలి. రోజులో 400 గ్రాముల వరకు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిని రోజులో ఐదు భాగాలుగా ఐదు సమయాల్లో తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఫైబర్ లభిస్తుంది. పైగా పలు రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. కూరగాయలను స్నాక్స్ కు బదులు తీసుకోవాలి. ప్రతీ సీజన్ లో కొన్ని రకాల పండ్లు లభిస్తుంటాయి. ఈ సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తప్పక తినాలి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. బంగాళాదుంపలు, స్వీట్ పొటాటో, కస్సావా వంటి రకాలు అటు కూరగాయల కిందకు రావు. ఇటు పండ్ల కిందకూ రావు. తీసుకునే మొత్తం కేలరీల్లో ఫ్రీ షుగర్స్ నుంచి లభించేవి 10 శాతం కంటే తక్కువ ఉండాలి. 5 శాతానికే పరిమితం చేస్తే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువుతో ఉన్న వారు రోజులో 2 వేల కేలరీలను తీసుకుంటుంటారు. ఫ్రీ షుగర్స్ అంటే ఆహార పదార్థాలు, డ్రింక్స్ లో కలిపే తీపి పదార్థం. తేనె, పండ్ల రసాల్లో సహజంగానే ఇది ఉంటుంది.
ఫ్యాట్స్
ఫ్యాట్స్ నుంచి అందే కేలరీలు 30 శాతం లోపు ఉండాలి. ఈ ఫ్యాట్స్ లో శాచురేటెడ్ ఫ్యాట్స్ (మాంసం, వెన్న, పామాయిల్, కోకోనట్ ఆయిల్, క్రీమ్, జున్ను, నెయ్యి, పెరుగు) కంటే అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ (చేపలు, అవకాడో, నట్స్, సన్ ఫ్లవర్, కనోలా, ఆలివ్ నూనెల్లో లభిస్తాయి) మంచివి. అందుకని శాచురేటెడ్ ఫ్యాట్స్ ను వీలైతే తీసుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఒకవేళ తీసుకున్నా ఈ 30 శాతంలోనూ శాచురేటెడ్ ఫ్యాట్స్ ను 10 శాతం లోపునకే పరిమితం చేయాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ కూ దూరంగా ఉండాలి. లేదంటే ఒక శాత ంలోపునకే పరిమితం చేయాలి. ఉప్పు రోజు మొత్తం మీద 5 గ్రాముల కంటే మించకుండా చూసుకోవాలి. అంటే ఒక టీ స్పూన్ అన్నమాట. ఉప్పులోనూ అయోడైజ్డ్ ఉప్పు వాడకం మంచిది.
శిశువులు, చిన్నారులకు
చిన్నారుల పరంగా మొదటి రెండు సంవత్సరాలు ఆరోగ్యం విషయంలో చాలా కీలక సమయం. సరైన పోషకాహారం అందిస్తే వారిలో ఆరోగ్యకరమైన ఎదుగుదల పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీవితంలో తదనంతర కాలంలో అధిక బరువు, ఊబకాయం, ఎన్ సీడీ సమస్యలైన కార్డోయో వాస్క్యులర్ వ్యాధులు, కేన్సర్, క్రానిక్ రెస్పిరేటర్ వ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుంది.
చిన్నారులకు రెండేళ్లు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లి పాలు పట్టించాలి. వీలైతే మరికొంత కాలం అదనంగా పట్టించినా మంచిదే. మొదటి ఆరు నెలలు తల్లి పాల పరంగా ఎటువంటి లోటు లేకుండా పట్టించాలి. అరుగుదల ఉండదంటూ పాలు తగ్గించరాదు. ప్రతీ గంటకోసారి పాలు పట్టించడం మంచిది. అరుగుదల లేదన్న సందేహం ఉంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా పసివారి విషయంలో సొంత అభిప్రాయాలకు బదులు వైద్యుల సలహాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరు నెలలు వచ్చిన తర్వాత తల్లిపాలతో పాటు వైద్యులు సూచించిన ఇతర ఆహారాన్ని కూడా శిశువులకు అందించాలి. తీపి, ఉప్పు పదార్థాలను వారికి పెట్టవద్దు. ఆరు నెలలు, ఏడాది కాల వ్యవధి మధ్య పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో పోషాకాహార నిపుణులను నేరుగా సంప్రదించి తెలుసుకోవడం మంచిది. ఏడాది తర్వాత కుటుంబంలో మిగిలిన వారు తీసుకునే ఆహారాన్నే పిల్లలకు ఇవ్వవచ్చు.
గర్భిణులు
గర్భధారణ సమయంలో మహిళలు అదనంగా ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలోని శిశువుకు కూడా శక్తి అందాలి కాబట్టి. రోజులో 350 కేలరీలు అదనంగా తీసుకోవాలి. 0.5గ్రాముల ప్రొటీన్ మొదటి త్రైమాసికంలో, 6.9 గ్రాముల ప్రొటీన్ రెండో త్రైమాసికంలో, 22.7 గ్రాముల ప్రొటీన్ మూడో త్రైమాసికంలో తీసుకోవడం తప్పనిసరి. అలాగే ఫోలిక్ యాసిడ్ ను గర్భవతిగా ఉన్నంత కాలం మాత్రల రూపంలో తీసుకోవడం తప్పనిసరి. ఆకు కూరల్లో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో లభిస్తుంది. ఐరన్ సమృద్ధిగా అందాలి.
గర్భవతిగాను, తర్వాత పాలు అందించే సమయంలోనూ క్యాల్షియం తగినంతగా తీసుకోవాలి. అలాగే ఐయోడిన్ అవసరం కనుక ఐడోడైజ్డ్ సాల్ట్ వంటల్లో వాడుకోవాలి. ముడి ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, తాజా పండ్లను, మొలకెత్తించిన ధాన్యాన్ని కూడా తీసుకోవాలి. కాఫీ, టీలు తగ్గించి పాలు తగినంత తీసుకోవాలి. ఒకటి రెండు గుడ్లను కూడా రోజులో తీసుకోవడం మంచిది. రోజులో 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. వైద్యుల సూచన మేరకు రోజులో కొంత సేపు నడక చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఊబకాయులకు
ఊబకాయం సమస్యకు ఆహారం లేదా జీన్స్ కూడా కారణం కావచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అందుకని ఊబకాయంతో బాధపడుతున్న వారు ఫ్యాటీ ఫుడ్స్ ను చాలా తక్కువగా తీసుకుంటూ, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో రైస్ పరిమాణం కంటే ఆకుపచ్చని కాయగూరలను ఎక్కువ తీసుకోవాలి, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజులో స్వల్ప పరిమాణం చొప్పున నాలుగు సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. వీటికితోడు శారీరక వ్యాయామం సైతం అవసరం.
సాల్ట్ సోడియం
ఉప్పు (సోడియం సాల్ట్) పాళ్లు ఎక్కువగా ఉండి, అదే సమయంలో పొటాషియం తగినంత (3.5 గ్రాములు) లభించకుంటే హై బ్లడ్ ప్రెషర్ కు దారి తీస్తుంది. దీంతో గుండెకు ముప్పు ఏర్పడుతుంది. రోజులో సూచించిన పరిమితి 5 గ్రాములు లోపే ఉప్పును తీసుకోవడం ద్వారా ఏటా 17 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు అన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది. చాలా మందికి ఏ ఆహారంలో ఎంత ఉప్పు ఉంటుందన్న దానిపై అవగాహన లేదు. అందుకని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు.
ఆహార పదార్థాల్లో విడిగా ఉప్పు కలుపుకునే అలవాటును విడిచిపెట్టాలి. ఉప్పు అధికంగా ఉండే చిప్స్, స్నాక్స్ వంటి వాటిని పూర్తిగా వదిలేయాలి లేదా తగ్గించాలి. తక్కువ సోడియం ఉన్న ఆహార పదార్థాలను డైట్ లో భాగం చేసుకోవాలి. ప్రతీ ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తి ప్యాక్ పై సాల్ట్ పరిమాణం గురించి వివరాలు ఉంటాయి. సోడియం వల్ల వచ్చే అనర్థాలను పొటాషియం ఉపశమింపజేస్తుంది. సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.
షుగర్స్
రోజులో తీసుకునే మొత్తం కేలరీల్లో షుగర్స్ నుంచి వచ్చేవి పది శాతం లోపే ఉండాలి. అంటే ఆ మేరకు ఆహారాన్ని నియంత్రించుకోవాలి. షుగర్స్ తీసుకోవడం వల్ల దంత సమస్యలు ఎదురవుతాయి. షుగర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కేలరీలు అధిక స్థాయిలో అంది ఊబకాయం, అధిక బరువుకు దారి తీసే ప్రమాదం ఉంది. తీపి పదార్థాలకు బదులు తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. పైగా ఆహారం వండిన తర్వాత గంటలోపే తినేయాలి. నీరు కూడా రోజులో తగినంత తీసుకోవాలి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, యూనీసెఫ్ నిర్వహించిన సర్వేలో దేశంలో 46 శాతం ప్రీస్కూల్ చిన్నారులు, 30 శాతం పెద్దవారు మోస్తరు స్థాయిలో ప్రొటీన్ కేలరీ లోపాలను ఎదుర్కొంటున్నారు. 10 శాతం గ్రామీణులు, 20 శాతం పట్టణాల్లోని పెద్దవారిలో ఓవర్ న్యూట్రిషన్ (అధిక పోషకాల) సమస్య ఉందని కూడా తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో ప్రొటీన్ల పరంగా లోపం, సూక్ష్మ పోషకాలు, విటమిన్ ఏ, ఐరన్, ఐయోడిన్ లోపాలతో వచ్చే డిజార్డర్లు, విటమిన్ బీ కాంప్లెక్స్ లోపం ఎక్కువగా ఉంటున్నట్టు తెలిసింది.
పనితీరును బట్టి కేలరీల అవసరం
ఎప్పుడూ కూర్చుని పనిచేసే మగవారికి రోజులో 2425 కేలరీలు, మోస్తరుగా పనిచేసేవారికి 2875 కేలరీలు, శారీరీకంగా ఎక్కువ కష్టించే వారికి 3800 కేలరీలు అవసరమని హైదరాబాద్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటోంది. అదే మహిళలు అయితే కూర్చుని పనిచేసే వారు రోజులో 1875 కేలరీలు, మోస్తరుగా కష్టించే వారు 2225, అధిక శ్రమతో కూడిన పనిచేసే వారు 2925 కేలరీలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆహారం పలు వర్గీకరణలు
శక్తినిచ్చే ఆహార పదార్థాలు: అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్. వీటి కిందకు ముడి తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు వస్తాయి. వీటి ద్వారా ప్రొటీన్, ఫైబర్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి క్లాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. వంట నూనెలు, నెయ్యి, వెన్నలో ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. నట్స్, ఆయిల్ సీడ్స్ లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. షుగర్ ఉండదు.
శరీర సౌష్టవాన్ని పెంచే ఆహారం: ప్రొటీన్లు వీటి కిందకు వస్తాయి. ఈ ప్రొటీన్లు పలు రకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి. పప్పులు, నట్స్, ఆయిల్ సీడ్స్ లో వీటిలో బీ కాంప్లెక్స్ విటమిన్లు, ఇన్విసిబుల్ ఫ్యాట్, ఫైబర్ ఉంటాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం, విటమిన్ ఏ, రిబోఫ్లావిన్, విటమిన్ బీ12 ఉంటాయి. మాంసం, చేప, పౌల్ట్రీ ఉత్పత్తుల్లో బీ కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్, ఐయోడిన్, ఫ్యాట్ ఉంటాయి.
రక్షణనిచ్చే ఆహారం: విటమిన్లు, మినరల్స్. ఆకుపచ్చని కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కెరటోనాయిడ్స్ ఉంటాయి. ఇతర కూరగాయలు, పండ్లలో ఫైబర్, షుగర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. గుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్, ఫ్యాట్ ఉంటాయి.
కార్బొహైడ్రేట్లు
శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బొహైడ్రేట్లు. 70 నుంచి 80 శాతం కేలరీలు కార్బొహైడ్రేట్ల ద్వారానే అందుతున్నాయి. ఇవి తృణ ధాన్యాలు, పప్పులు, చిరు ధాన్యాల నుంచి లభిస్తాయి. మొత్తం కేలరీల్లో సగం కార్బొహైడ్రేట్ల ద్వారా అందాల్సి ఉంటుంది. మన దగ్గర బ్రెడ్లు, బిస్కట్లు, వైట్ రైస్, గోధుమ పిండిని ఎక్కువ వాడుతుంటారు. వీటి ద్వారానే కాదు ముడి ధాన్యాలైన బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి వాటి ద్వారానూ కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. పైగా వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తికి తోడ్పడుతుంది. తీసుకునే ఆహారం ఏదైనా అందులో ఫైబర్ తప్పకుండా ఉండాలని పోషకాహార నిపుణుల సలహా.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచన ప్రకారం 30 గ్రాముల సీరియల్స్, మిల్లెట్స్, 100 గ్రాముల స్టార్చీ వెజిటబుల్స్ (మొక్కజొన్న, బంగాళాదుంప, గుమ్మడికాయ ఇలాంటివి) ఆహారంలో భాగం కావాలని చెబుతోంది. ఉదయం అల్పాహారం కింద తృణ ధాన్యాలు లేదా అరటి పండు తప్పకుండా తీసుకోవాలని, ఇవి మధ్యాహ్నం భోజనం వరకు తగినంత శక్తిని అందిస్తాయని నిపుణుల సూచన. పురుషులైతే రోజులో 2320 కేలరీలు, మహిళలైతే 1900 కేలరీలు అవసరం.
ప్రొటీన్లు
అమైనో ఆమ్లాలను మన శరీరం ఉత్పత్తి చేయలేదు. ఆహారం ద్వారా వీటిని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. పాలు, మాంసం, జున్ను, చేపలు, గుడ్లలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఒక గ్రాము ప్రొటీన్ నాలుగు కేలరీల శక్తిని అందిస్తుంది. తీసుకునే ఆహారంలో 35 శాతం ప్రొటీన్లతో ఉండాలి. పప్పులు, పాలు, ఆకుపచ్చని కూరలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు (శనగలు, పెసలు, బొబ్బర్లువంటివి) తినాలి. మన దేశంలో చాలా మందిలో ప్రొటీన్ లోపం ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజులో పురుషులు అయితే 60 గ్రాములు, మహిళలైతే 55 గ్రాముల పొట్రీన్ తీసుకోవాలి.
ఫ్యాట్స్
ఫ్యాట్స్ కూడా ఎనర్జీలో భాగమే. ఆహారంలో 20 శాతం ఫ్యాట్స్ ఉండాలి. అవి పాలీ అనుశాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్, ఒమెగా ఫ్యాటీ-3 యాసిడ్స్ రూపంలో ఉండాలి. సాధారణంగా వంట నూనెల ద్వారా ఇవి మనకు అందుతుంటాయి. ఎన్నో జీవ క్రియలకు ఇవి అవసరం. ఇవి రోజులో 600 మిల్లీ గ్రాములు అవసరం. ఇక ఐరన్ అనేది పురుషులకు 17ఎంజీ మహిళలకు 21 ఎంజీ నిత్యం అవసరం.
లంచ్, డిన్నర్ ఇలా...
మహిళలు అయితే మధ్యాహ్న భోజనం (లంచ్) కింద ఒక కప్పు రైస్ + 2 చపాతీలు, పప్పు అర కప్పు, కూరగాయలు అరకప్పు, పెరుగు అరకప్పు తీసుకోవాలి. రాత్రి భోజనంలో ఒక కప్పు రైస్ + 2 చపాతీలు, పప్పు అరకప్పు, కూరగాయలు అరకప్పు, పెరుగు పావు కప్పు, ఒక పండు తీసుకోవాలి.
అదే పురుషులు అయితే మధ్యాహ్న భోజనంలో రెండు కప్పుల రైస్ + 2 చపాతీలు, పప్పు అరకప్పు, కూరగాయలు కప్పులో మూడో వంతు, అరకప్పు పెరుగు తీసుకోవాలి. రాత్రి భోజనం కింద రెండు కప్పుల రైస్, 2 చపాతీలు, అరకప్పు పప్పు, కప్పులో మూడో భాగం కూరగాయలు, పెరుగు పావు కప్పు, ఒక పండు తినాలి.
వీటికి దూరం
ప్రాసెస్డ్ ఫుడ్, స్నాక్స్, ఫ్రయిడ్ ఫుడ్, ఫ్రోజెన్ పిజ్జా, కుకీస్, వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది కనుక వీటికి దూరంగా ఉండాలి.
పండ్లను ఎప్పుడు తినాలి...?
పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే తినడం మంచిదని కొందరు వైద్య నిపుణుల సూచన. డాక్టర్ స్టీఫెన్ మార్క్స్ కేన్సర్ రోగులకు పరగడుపున పండ్లను ఇచ్చి చూడగా అద్భుత ఫలితాలు వచ్చినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆహారం తర్వాత పండ్లు తినవద్దని స్టీఫెన్ సూచన. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే తినాలంటారు. శరీరంలోని నుంచి మలినాలను తొలగించే కార్యక్రమంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందట. ఉదాహరణకు ఏదైనా ఆహారాన్ని తీసుకుని, తర్వాత పండు తిన్నారనుకుందాం. తిన్న పండు నేరుగా కడుపులోకి వెళ్లి అక్కడి నుంచి పేగుల్లోకి వెళుతుంది. కానీ, పండు తినడానికి ముందు తీసుకున్న ఆహారం పండును పేగుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇక జీర్ణరసాల విడుదలతో ఆహారం, పండు అన్నీ కలసి యాసిడ్స్ గా మారతాయి. ఇది గ్యాస్ గా మారుతుంది. పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల కేశాల రంగు వెలసిపోవడం, , జుట్టు రాలడం, కళ్ల చుట్టూ నల్లటి చారికలు, ఒత్తిడి ఉండదని వైద్యులు అంటున్నారు.