సున్నా వడ్డీలో ఉన్న రహస్యం ఏంటి...? ఈ రుణాలతో లాభం ఉందా?
కవిత ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. తనకు ఎప్పటి నుంచో మైక్రోవేవ్ ఓవెన్ కొనుక్కోవాలన్న కోరిక బలంగా ఉంది. ఎట్టకేలకు తన కల సాకారం చేసుకునేందుకు మంచి రోజు చూసి దగ్గర్లోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లి మంచి మోడల్ ను సెలక్ట్ చేసుకుంది. షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్ట్ గురించి చెప్పిన వివరాలన్నీ ఆమెకు నచ్చాయి. చివరిగా అతడు చెప్పిన మాట ఎంతో నచ్చేసింది. అదే జీరో పర్సంట్ వడ్డీ...
‘మేడమ్ ఎలాంటి వడ్డీ (జీరో పర్సంట్ ఇంట్రెస్ట్) లేకుండా ఆరు నెలల పాటు సమాన వాయిదాలుగా చెల్లించే సదుపాయం ఉంది. ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కేవలం 500 రూపాయలను ప్రాసెసింగ్ చార్జీగా చెల్లిస్తే సరిపోతుంది’ అని చెప్పాడు. నిజమా అంటూ కవిత తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. 0 శాతం ఈఎంఐపై ఓవెన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది.
నిజానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు 0 శాతం వడ్డీయేనా...? ఈ స్కీమ్ లో ఓవెన్ కొనడం ద్వారా కవిత లాభపడిందా...? వడ్డీ రూపంలో ఆమె ఆదా చేసుకున్నదెంత? వడ్డీ లేకుండా ప్రొడక్ట్ ను రుణంపై ఇవ్వడం వల్ల షాపు యజమానికి వచ్చిన లాభం ఏంటి..? ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
0 = ఎంత శాతం...?
కవిత కొన్న ఉత్పత్తి ఓవెన్ ఖరీదు రూ.10వేలు. సున్నా వడ్డీ రుణంపై తీసుకున్నందున రెండు నెలల వాయిదాల మొత్తం కొనే సమయంలోనే చెల్లించాల్సి వచ్చింది. మొత్తం 10వేల రూపాయల రుణాన్ని ఆరు నెలసరి సమాన వాయిదాలుగా విభజించిన తర్వాత అందులో రెండు నెలల వాయిదాలను కవిత చెల్లించింది. అదనంగా ప్రాసెసింగ్ చార్జీ 500 రూపాయలు కూడా చెల్లించింది. అంటే రెండు వాయిదాల మొత్తం రూ.3,333+500= 3,833. ఇక మిగిలిన వాయిదాల్లో ఆమె 6,667 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకు లెక్కలన్నీ స్పష్టంగానే ఉన్నాయి. కానీ పరిశీలించి చూస్తే... నిజానికి రూ.6,667 స్వల్ప మొత్తంపై ప్రాసెసింగ్ చార్జీ రూపంలో కవిత 500 చెల్లించాల్సి వచ్చింది. దీన్ని వడ్డీ కింద పరిగణించి చూస్తే కవితకు ఓవెన్ 0 శాతం వడ్డీపై వచ్చినట్టు కానేకాదు. 11 శాతానికి పైగా వడ్డీ చెల్లిస్తున్నట్టు లెక్క.
వ్యాపారులకు ఆకర్షణీయం..!
మారుతున్న వినియోగదారుల అభిరుచి, వైఖరులకు తగ్గట్టు వారిని ఆకర్షించేందుకు రూపొందించిన పథకాలే సున్నా వడ్డీ, ఈఎంఐలు. దీనివల్ల ఒకేసారి ప్రొడక్ట్ ధర మొత్తాన్ని చెల్లించాల్సిన ఇబ్బంది ఉండదు. నెలకింత చొప్పున కనుక చెల్లించడం ఎవరికైనా సాధ్యమే. ఈ సాధ్యాన్ని తమ వ్యాపార అవకాశంగా మలచుకునేందుకు రూపొందించిన పథకం ఇది. అయితే, ఇందులో ఉన్న ఫైనాన్షియల్ లాజిక్ ఏంటీ? అన్నది సామాన్య కస్టమర్లకు ఓ పట్టాన అర్థం కాదు. నికరంగా తన జేబులోంచి చెల్లిస్తున్నది ఎంత... ? వంటి విషయాలు వారికి అర్థం కావు.
కస్టమర్లను ఆకర్షించాలి. విక్రయాలు పెంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి...? తయారీదారులు, రిటెయిల్ వర్తకులు విక్రయాలు పెంచుకునే లక్ష్యంతో రుణాలు ఇచ్చే సంస్థతో జట్టు కట్టారు. రెండు రకాల సున్నా వడ్డీ పథకాలను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ఒకదానిపై ప్రాసెసింగ్ చార్జీ వసూలు చేయడం. రెండోది ప్రాసెసింగ్ చార్జీ లేకుండా ఉత్పత్తిని అందించడం. ఇలా చేస్తే ఉత్పత్తి అమ్ముడుపోవడం వల్ల కంపెనీకి, రిటైలర్ కు లాభమే కానీ అప్పు ఇచ్చిన సంస్థకు లాభం ఏంటి...? ప్రొడక్ట్ అమ్మడం ద్వారా లాభపడిన రిటైలర్ లేదా తయారీదారుడు ఆ వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తారన్నమాట.
ఆర్ బీఐ నిషేధం
నిజానికి ఈ విషయంలో ఆర్ బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సున్నా వడ్డీపై రుణాలు ఇవ్వవద్దంటూ బ్యాంకులను ఆదేశించింది.
క్రెడిట్ కార్డుల ఈఎంఐపైనా సున్నా శాతం వడ్డీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. సున్నా వడ్డీ పేరుతో ప్రాసెసింగ్ చార్జీలను కస్టమర్ నుంచి రాబట్టరాదని కూడా ఆదేశించింది.
రుణంపై విక్రయంచేట్టు అయితే పారదర్శకంగా ప్రతీ ఉత్పత్తిపై వడ్డీ రేటును విధిగా నిర్ణయించాలని, కస్టమర్లను పక్కదారి పట్టించే పథకాలను కొనసాగించరాదని ఆర్ బీఐ ఆదేశించడంతో బ్యాంకులు వీటిని నిలిపివేశాయి. కానీ ఎన్ బీఎఫ్ సీ సంస్థలు మాత్రం ఈ పథకాలను కొనసాగిస్తున్నాయి. ఈ పథకాలు అందరికి ప్రయోజనం కలిగిస్తున్నాయని, తమ వైపు నుంచి కస్టమర్లకు అన్ని విషయాలను తెలియజేస్తున్నామంటూ, ప్రొడక్ట్ పై వడ్డీని షాపు యజమాని లేదా తయారీ కంపెనీలే భరిస్తున్నాయంటూ వివిధ సంస్థలు ఆర్ బీఐకి వివరణ కూడా ఇచ్చాయి.
వడ్డీ కాదు వడ్డింపు
ఇంట్రెస్ట్ ఫ్రీ అనుకుంటారు కానీ, కానే కాదు. కాకపోతే నేరుగా వడ్డీ ఉండదు. ఫైనాన్స్ సంస్థకు డీలర్ లేదా తయారీ కంపెనీయే వడ్డీ చెల్లిస్తుందనకున్నా... పరోక్షంగా ఆ మేరకు వారు కస్టమర్ నుంచే రాబట్టుకుంటారు. ఉదాహరణకు ఉత్పత్తి ధరను పెంచడం.
కార్డులపైనా మర్మం ఉంది...?
కొన్ని రకాల క్రిడెట్ కార్డులపై రూ.5 వేలకు పైబడి కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని మూడు నెలసరి సమాన వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఇస్తున్నాయి. కానీ, దీనిపై 3 నుంచి 5 శాతం ప్రాసెసింగ్ చార్జీ ఉంటుందన్న విషయాన్ని మరవకూడదు. పరిశీలించి చూస్తే ఇలాంటి హిడెన్ చార్జెస్ తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫైనాన్స్ సంస్థ నుంచి స్టేట్ మెంట్ ఇంటికి వచ్చే వరకు అందులో దాగి ఉన్న హిడెన్ చార్జీలు అర్థం కావు.
ఉదాహరణలు చూద్దాం...
శివ ఏసీ కొందామని ఓ షోరూమ్ కు వెళ్లాడు. ధర ఎంతని అడగ్గా... 1.5 టన్ ఏసీ రూ.35,999 అని సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు. కానీ బడ్జెట్ చూస్తే రూ. 25 వేలే అతడి దగ్గర ఉన్నాయి. కానీ 35,999 రూపాయల ఏసీ చాలా నచ్చేసింది. దీంతో శివ బేరం ఆడడం మొదలుపెట్టాడు. షాపు అతను ఫైనల్ గా 5,999 రూపాయల కంటే తగ్గించలేమని తేల్చేశాడు. అయినా తన దగ్గరున్న బడ్జెట్ కు ఏసీ రావడం లేదు. అంత నగదు లేదని శివ చెప్పడం ఆలస్యం. ఈఎంఐ విధానంలో తీసుకెళ్లండి, వడ్డీ ఉండదని షాపు సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పాడు.
దాంతో మరో ఆలోచన లేకుండా అప్పే కదాని శివ ఓకే చెప్పాడు. ఫలితంగా అప్పటి వరకు షాపు అతను ఇస్తానన్న రూ.5,999 డిస్కౌంట్ లేకుండా పోయింది. పైగా ప్రాసెసింగ్ చార్జీ పేరుతో మరో వెయ్యి రూపాయలు రాబట్టారు. ఇప్పుడు 36వేల రూపాయలను 12 నెలసరి సమాన వాయిదాలకు విభజిస్తే నెలకు 3వేల రూపాయల చొప్పున చెల్లించాలి. సున్నా వడ్డీ కదా...! అందుకే నాలుగు ఈ ఎంఐలు ముందుగానే చెల్లించాలి. అంటే రూ.12వేలు కట్టాలి. ఈ 12వేల రూపాయలు మినహాయిస్తే నికరంగా ఏసీపై ఇంకా రూ.24వేలు చెల్లించాలి. ఏడాది కాలానికి రూ.24వేల రూపాయల మొత్తంపై శివ అదనంగా చేస్తున్న వ్యయం రూ.7వేలు. ఎంత భారీ వడ్డీయో ఇది అర్థమయ్యే ఉంటుంది.
ఎవరి నిర్ణయం సరైనది...?
శ్రీకాంత్, కారుణ్య ఇద్దరూ ఒకే సంస్థ ఉద్యోగులు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంటే వేసవి రాకముందు కారుణ్య తన భార్య కోరికపై ఓ కంపెనీ ఫ్రిడ్జ్ ను ఈఎంఐ విధానంలో కొన్నాడు. దగ్గర్లోని ఎలక్ట్రానిక్ స్టోర్ కు వెళ్లి నచ్చిన మోడల్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈఎంఐలో కావాలని చెప్పాడు. నిమిషంలో పని అంటూ షాపు అతను అప్రూవల్ తీసుకున్నాడు. చివరికి ఫ్రిడ్జ్ ధరను 15,600 గా షాపు యజమాని ఖరారు చేశాడు. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ ప్రాసెసింగ్ చార్జీ పేరుతో 600, ఈఎంఐ కార్డు పేరుతో 400 చార్జీలు రాబట్టాడు. 15,600 రూపాయలను 12 భాగాలు చేయగా ఈఎంఐ 1,300 రూపాయలు వచ్చింది. ముందుగా నాలుగు నెలల వాయిదాలు కట్టించుకున్నాడు. అంటే 5,200 రూపాయలు, ఇతర చార్జీలు రూ.1,000 రూపాయలు కూడా వసూలు చేశాడు. అంటే మొత్తం మీద ఫ్రిడ్జ్ ఖరీదు 16,200 రూపాయలు అని అనుకోవాలి. ఈఎంఐ కార్డు తర్వాత కూడా ఉపయోగపడుతుంది కనుక ఆ చార్జీలను మినహాయిద్దాం.
ఇక ఇటీవల శ్రీకాంత్ కూడా ఫ్రిడ్జ్ తీసుకోవాలనే కోరికతో నగరంలో షాపుల పర్యటన చేశాడు. చివరికి తన సహచర ఉద్యోగి కారుణ్య తీసుకున్న కంపెనీ, అదే మోడల్ ఫ్రిడ్జ్ సరైనదిగా భావించాడు. ఓ డీలర్ దగ్గరకు వెళ్లి బేరమాడగా స్పాట్ పేమెంట్ కింద 13,500 రూపాయలకు ఆ ప్రొడక్ట్ లభించింది. ఈఎంఐలో కాకుండా నేరుగా నగదు రూపంలో కొనడం వల్ల శ్రీకాంత్ 2,700 రూపాయలు ఆదా చేసుకున్నాడు. అదీ ఈఎంఐలో కనిపించని రహస్యం. ఫైనాన్స్ సంస్థలు, తయారీ కంపెనీలు, డీలర్ పంచుకునేది దీన్నే.
కన్జ్యూమర్ లోన్ వల్ల ప్రయోజనాలూ ఉన్నాయ్
ఈఎంఐ స్కీమ్ లో వస్తువులను కొనే ధోరణి మన దేశంలో ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. మొబైల్ దగ్గర్నుంచి ఇంట్లో వస్తువుల వరకు అన్నింటినీ ఉంది కదా వడ్డీలేని ఈఎంఐ అనుకుంటూ కొనేస్తున్నారు. నిజానికి ఇందులో సున్నా వడ్డీ అని ఉంటుందే గానీ ఇతర చార్జీలు, కోల్పోయే తగ్గింపుల రూపేణా కస్టమర్లు వడ్డీ చెలిస్తున్నట్టేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ప్రయోజనాలు ఉన్నాయా...?
నిజమే వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కదా అని ఈ పథకాలను తేలిగ్గా తీసిపారెయ్యడానికి కూడా లేదు. వీటివల్ల కొనుగోలు శక్తి లేనివారు సైతం ఆయా ఉత్పత్తులను పొందగలుగుతున్నారు. అవసరాలు ప్రతీ ఒక్కరికీ ఉంటాయి. కానీ వాటికి ఏకమొత్తంలో నగదు చెల్లించే ఆర్థిక సామర్థ్యం అందరికీ ఉండదు. అలాంటి వారికి ఈఎంఐ స్కీమ్స్ మంచివే. ఈ విధానంలో ప్రాసెసింగ్ చార్జీ విషయంలో, ధర విషయంలో బేరం ఆడవచ్చు. ఒకే షాపు కాకుండా రెండు మూడు షాపులు తిరిగి అడిగి చూడండి. కన్జూమర్ లోన్ కింద చాలా రకాల ఉత్పాదనలను కొనుగోలు చేసేందుకు వీలుంది.
కోరిక నెరవేరిన వేళ...
ఉదాహరణకు... రాజేష్ కు ఐ ఫోన్ అంటే ఎంతో మోజు. ఇక లాభం లేదనుకున్న అతడు ఓ రోజు రిలయన్స్ డిజిటల్ స్టోర్ కు వెళ్లి ఈఎంఐ విధానంలో కొనేశాడు. దాని విలువ రూ.80వేలు. అందుకోసం డౌన్ పేమెంట్ కింద రూ.10వేలు చెల్లించాడు. మిగిలిన 70వేల రూపాయలను మూడేళ్లపాటు తీర్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే, ఇక్కడ మనం పైన చెప్పుకున్నట్టు 0 శాతం వడ్డీ కాదు. 11.49 శాతం వడ్డీపై రాజేష్ రుణం పొందాడు. దీంతో ప్రతి నెలా 2,308 రూపాయల చొప్పున మూడేళ్ల కాలంలో అతడు 83,088 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నికరంగా 13వేల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నాడు. అయినా దాన్ని భారంగా అతడు భావించలేదు. ఎందుకంటే ఐఫోన్ వాడాలన్న కల నెరవేరింది.
ఆదా మంత్రం కూడా...
కొంత మంది నెలకు ఎంత వేతనం వస్తున్నా... రూపాయి ఆదా చేసుకోలేరు. అదే సమయంలో కనీసం ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొనరు. కారుణ్య కూడా ఈ రకం బాపతే. పైన చెప్పుకున్నట్టు ఒకే సంస్థలో పనిచేసే శ్రీకాంత్, కారుణ్య ఫ్రిడ్జ్ కొనగా... నగదు రూపంలో తీసుకోవడం ద్వారా కారుణ్యతో పోల్చి చూస్తే శ్రీకాంత్ 2,700 రూపాయలు ఆదా చేసుకున్నాడని చెప్పుకున్నాం. ఇది నిజమే. కానీ, ఇందులో మరో కోణం కూడా ఉంది. కారుణ్య రూపాయి ఆదా చేయడు. భార్య పోరు పడలేక కనీసం ఫ్రిడ్జ్ కొని ఈఎంఐ రూపంలో చెల్లించడం వల్ల ఏడాదిలో ఓ వస్తువు అయినా మిగిలింది. ఒక విధంగా దుబారా బాబులకు ఇది పొదుపు నేర్పే మంత్రంగానూ చెప్పుకోవచ్చు.