ఎన్ఆర్ఐలకు స్వదేశంలో ఉన్న పెట్టుబడి మార్గాలు
విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) తమ కష్టార్జితాన్ని స్వదేశంలో పెట్టుబడులుగా పెట్టడం ద్వారా మంచి సంపదను సృష్టించుకోవాలని ఆశపడుతుంటారు. ఇది ఆచరణ సాధ్యమే. వారు పెట్టుబడి పెట్టి మంచి రాబడులను అందుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. అవేంటో తెలిపేదే ఈ కథనం.
ఎన్ఆర్ఐలు స్వదేశంలో చేసే పెట్టుబడులు ఫెమా నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఒకప్పటితో పోలిస్తే నేడు ఎన్ఆర్ఐల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలతతో ఉంది. వారి కష్టార్జితం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే ఆలోచనతో నిబంధనలను సరళీకరించింది. ప్రభుత్వ ఆమోదంతోనూ, ఆమోదం లేకుండానూ ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా కేటగిరీలను చేసింది.
ఎన్ఆర్ఐల పెట్టుబడులు
ఎన్ఆర్ఐ డిపాజిట్లు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 13.65 శాతం పెరిగి 15.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చాలా మంది ఎన్ఆర్ఐలు స్వదేశంలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. .
ఎన్ఆర్ఐలకు సంబంధించి ప్రతీ పెట్టుబడి మార్గంలో నిబంధనలను స్పష్టంగా పేర్కొన్నారు. పెట్టబడులను ఎప్పుడైనా వెనక్కి తీసుకెళ్లవచ్చా, లేదా? అనేది కూడా తెలియజేశారు. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు చేసేందుకు ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు, ట్రెజరీ బిల్స్, మ్యూచువల్ ఫండ్స్, పీఎస్ యూల బాండ్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, స్టాక్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, డిపాజిట్లు ఇలా వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి.
షేర్లు, కంపెనీలు జారీ చేసే డిబెంచర్లు
ఎన్ఆర్ఐలకు అధిక రాబడులను అందించేవి ఇవి. భారతీయ పౌరుడి వలే నేరుగా డ్యీమాట్, ట్రేడింగ్ ఖాతా తెరిచి ఈక్విటీ మార్కెట్లో షేర్లను కొని, అమ్ముకోవడానికి వీలుండదు. ఆర్బీఐ అనుమతించిన పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ కింద ఎన్ఆర్ఐలు గుర్తింపు పొందిన బ్రోకర్ల వద్ద ఖాతాను తెరవాలి. దాని ద్వారా షేర్లు, కంపెనీల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం పాన్ నంబర్ కలిగి ఉండాలి. ఈ ఖాతా ద్వారా కొనుగోలు చేసే షేర్లను భారత్ లో ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. ఈ ఖాతాను ఒకటికి మించి తెరవడానికి కూడా వీల్లేదు. అదే విధంగా స్థానికుల మాదిరిగా ట్రేడింగ్ చేయడం కుదరదు. రిస్క్ ఎక్కువ. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అనుకూలం. రాబడులు మార్కెట్ ఆధారితం. రాబడుల విషయంలో ఇంత అని చెప్పలేం. ఎంపిక చేసుకునే స్టాక్స్ ను బట్టి ఏడాదిలో పెట్టిన పెట్టుబడి మైనస్ లోకి వెళ్లవచ్చు. లేదా రెట్టింపు కావచ్చు. రెండు మూడు రెట్లు పెరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. మూలం వద్ద 20 శాతం పన్ను కోత విధిస్తారు.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ లోనూ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు ఫెమా నిబంధనలు వర్తిస్తాయి. ఎన్ఆర్ఐ ఖాతా తెరవడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అయితే కనీసం మూడు సంవత్సరాల పాటు పెట్టుబడులను కొనసాగించిన తర్వాతే ఆ పెట్టుబడులను నివాసిత దేశానికి తరలించుకుపోయేందుకు అవకాశం లభిస్తుంది. ఏక మొత్తంలో, నెలనెలా సిప్ విధానంలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ మధ్యస్థం నుంచి అధికం. రాబడులు 20 నుంచి 25 శాతం మధ్య ఉంటాయి. స్వల్ప కాలంలో వెనక్కి తీసుకుంటే మూలం వద్ద పన్ను 15 శాతం కోత విధిస్తారు. దీర్ఘకాలంలో పన్ను లేదు.
ఆఫ్ షోర్ ఫండ్స్/ఈటీఎఫ్
విదేశాల నుంచి పనిచేస్తున్న ఫండ్స్ ఇవి. వీటిలో పెట్టుబడులు ఎన్ఆర్ఐలకు అత్యంత సులభం. భారతీయ చట్టాలతో పని లేదు. వీటిలో ఉన్న చిన్న ప్రతికూలత విదేశీ మారక ద్రవ్యంలో మార్పుల ప్రభావం ఉంటుంది. అంటే రాబడులు ఒక్కోసారి ఎక్కువగాను, ఒక్కోసారి తక్కువగానూ ఉంటాయి. రిస్క్ మధ్యస్థం నుంచి అధికంగా ఉంటుంది. దీర్ఘాకలిక ఇన్వెస్ట్ మెంట్ కు అనుకూలం. 15 నుంచి 26 శాతం మధ్య రాబడులు ఉంటాయి. పన్ను 10 నుంచి 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్లు
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంకు ఖాతా, ఎన్ఆర్ఈ ఖాతా ద్వారా ఎన్ఆర్ఐలు బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. మూడు సంవత్సరాల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే పన్ను పరమైన ప్రయోజనాలు అందుతాయి. ఎన్ఆర్వో ఖాతా ద్వారానూ ఎఫ్ డీ చేయవచ్చు. అయితే, వడ్డీ ఆదాయాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడం ప్రతికూలం. ఉదాహరణకు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేటు ప్రకారం (7.25-7.30) ఎన్ఆర్ఐ రూ.5 లక్షలను ఐదేళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే 7,17,890 రూపాయలు అందుకోవచ్చు. అదే పదేళ్ల కాలానికి పది లక్షల రూపాయలు చేస్తే 20,61,468 రూపాయలు వస్తాయి. రిస్క్ తక్కువ. రాబడులు కూడా 7-8 శాతంగానే ఉంటాయి. భారత్ లో లేదా స్వదేశంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)
ఇది నాన్ నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్. డీమ్యాట్ లేదా ప్రామిసరీ నోట్ల మార్గంలో జారీ చేస్తారు. ఏడు రోజుల నుంచి ఏడాది లోపు వరకు మెచ్యూరిటీ ఉంటుంది. ఎన్ఆర్ఐలు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ లో చేసే పెట్టుబడులను కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడి వస్తుంది.
రియల్టీపై పెట్టుబడులు
ఎన్ఆర్ఐలు స్వదేశలో వాణిజ్య, నివాసిత స్థలాలు, భవనాల కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. అయితే, వ్యవసాయ భూమిపై పెట్టుబడులకు చట్టం అనుమతించడం లేదు. నేరుగా ఆస్తులు కొనవచ్చు. లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్టుల్లో పెట్టుబడి చేసుకోవచ్చు. త్వరలోనే ఇటువంటి ట్రస్ట్ లు ఇష్యూకి రానున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా రియల్టీ మార్కెట్ ప్రయోజనాలను ఎలక్ట్రానిక్ రూపంలోనే అందుకోవచ్చు. అంటే భూమి కొనడం, దాన్ని అమ్మడం వంటివి అవసరం ఉండదు. పైగా లిక్విడిటీ ఎక్కువ. దీంతో నగదు ఎప్పుడు తీసుకోవాలన్నా వెంటనే విక్రయించుకోవడానికి వీలుంటుంది. రిస్క్ తక్కువ. దీర్ఘకాలంలో అధిక రాబడులు అందుకోవచ్చు. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలంలో 50 శాతానికిపైనే రాబడి వస్తుంది. 20 శాతం మూలం వద్ద పన్ను వర్తిస్తుంది.
పోస్టాఫీసుల్లోనూ
పోస్టాఫీసు పథకాల్లోనూ పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు అవకాశం ఉంది. నేరుగా కాకుండా భారత్ లో మరో వ్యక్తితో కలసి సంయుక్త ఖాతా తెరిచి పెట్టుబడులు చేసుకోవచ్చు.
బాండ్లలో
బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లోనూ ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్ఆర్ఈ, ఎఫ్ సీఎన్ఆర్ ఖాతాల ద్వారా కనీసం మూడేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే పన్ను పరమైన ప్రయోజనాలు లభిస్తాయి.
వ్యాపారం
ఎన్ఆర్ఐలు నేరుగా కంపెనీల్లో యాజమాన్యం, భాగస్వామ్యం కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. కాకపోతే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లేందుకు చట్టాలు అనుమతించవు.
ఈ ఖాతాల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి
ఎన్ఆర్వో: భారత్ లో రాబడులను నివాసం ఉంటున్న దేశానికి తరలించుకుపోయేందుకు ఈ ఖాతా అనువైనది. ఇలా ట్రాన్స్ ఫర్ చేసుకునే పరిమితి 10 లక్షల డాలర్లు. ఇలా తరలించుకుపోయేందుకు పన్ను చెల్లించినట్టు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నుంచి సర్టిఫికెట్ తీసుకుని బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ నిధులను కూడా ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ఆర్జించే వడ్డీ ఆదాయంపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా భారత్ లో ఆదాయాల నిర్వహణ కోసం ఈ ఖాతా అనమాట.
నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ): విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని స్వదేశానికి పంపుకోవాలనుకునే వారికి ఈ ఖాతా ఉపయోగకరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీని జమ చేసుకుని రూపాయిల్లో డ్రా చేసుకోవడానికి అనువైనది. బ్యాంకు ఖాతాలోని అసలు, వడ్డీ ఆదాయం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంకు అకౌంట్ (ఎఫ్ సీఎన్ఆర్): టర్మ్, ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా ఇది. ఏడాది నుంచి ఐదేళ్ల కాల వ్యవధి కోసం డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ద్వారా అందుకునే వడ్డీ ఆదాయంపై పన్ను ఉండదు. ఈ ఖాతాలను సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలు లేదా టర్మ్ డిపాజిట్ ఖాతాలుగానూ వినియోగించుకోవచ్చు.
ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్లు ఏం చెబుతున్నారంటే...?
భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు మంచి ఇన్వెస్ట్ మెంట్ సాధనాలు ఏంటన్న ప్రశ్నకు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ గౌరవ్ మష్రువాలా ఓ మీడియా సంస్థకు ఇలా వివరించారు.
భారత్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. గృహ రుణం ఈఎంఐలు చెల్లించాల్సి ఉందా...? తనపై తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత ఉందా...? ఇవేమీ కాకుండా స్వదేశంలో రాబడులు పొందాలనుకుంటున్నారా...? వీటిపై స్పష్టత ఉండాలి. ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తగినవి. అందులోనూ భారత్ కు వెలుపల పనిచేస్తున్న ఆఫ్ షోర్ ఫండ్స్ అనువైనవి. వీటి వల్ల నగదును ప్రత్యేకంగా స్వదేశానికి తీసుకెళ్లాలన్న ఇబ్బంది ఉండదు.
ఇలా విదేశాల్లోంచి పనిచేస్తూ భారత్ లో ఇన్వెస్ట్ చేసే ఆఫ్ షోర్ ఫండ్స్ చాలానే ఉన్నాయి. వీటితో భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండే పని లేకుండానే భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఆఫ్ షోర్ రూట్ అయితే డబ్బులు వెనక్కి తీసుకోవడం తేలిక. పన్ను పరమైన చిక్కుముళ్లు ఉండవు. స్వదేశంలో బంగారంపై పెట్టుబడులు పెట్టడం కంటే ఎన్ఆర్ఐ తాను నివసిస్తున్న దేశంలోనే కొనుగోలు చేసుకోవడం తేలిక. దానివల్ల తిరిగి అమ్ముకోవడం సులభం. కాకపోతే స్థానిక చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలి.