పెళ్లయిన తర్వాత మహిళ పేరు మార్చుకోవాలా..? చట్టాలు ఏం చెబుతున్నాయ్..?
భారతీయ స్త్రీ పెళ్లయి అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలసి నూతన జీవితం ప్రారంభించే ఆ మహిళ మానసికంగా ఎంతో సంఘర్షణకు లోనవుతుంది. కేవలం స్థలం, వ్యక్తుల్లో మార్పులే కాదు... చివరికి ఆమె పేరులోనూ మార్పులు వచ్చి చేరతాయి. నిజానికి పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా...? చట్టాలు ఏం చెబుతున్నాయ్?....
అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ ఉండే పిల్లగా మారిపోతుంది కనుక, 'ఆడ'పిల్ల అని మనం అంటుంటాం. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఇది సంప్రదాయంగా అనాదిగా వస్తున్నదే. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది వ్యక్తుల ఇష్టం. అయితే, పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి.
1. వివాహిత తనకు పెళ్లి కాక ముందు ఉన్న ఇంటి పేరునే (మెయిడెన్ నేమ్) కొనసాగించుకోవచ్చు. 2. పెళ్లికాక ముందు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండోది. మన దేశంలో అధిక శాతం మంది అనుసరించే విధానం ఇది. 3. పెళ్లి కాక ముందు ఉన్న ఇంటి పేరును మార్చుకోకుండానే... భర్త పేరును కూడా చేర్చుకోవడం మరొక విధానం. ఉదాహరణకు ఐశ్వర్యరాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్యారాయ్ తన పూర్తి పేరును మార్చుకోకుండానే చివర్లో బచ్చన్ ను చేర్చుకుంది.
పెళ్లి కాకముందు ఉన్న పేరునే కొనసాగిస్తే...?
పెళ్లి కాకముందున్న పేరుతోనే పెళ్లయిన స్త్రీ కొనసాగితే... భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ పరమైన వివాదాలు తలెత్తితే ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు ఉదయిస్తాయి. ఎటువంటి ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తినా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లయిన మహిళ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని కొందరు సూచిస్తుంటారు. ఒకవేళ పేరు మార్చుకునేట్టు అయితే, ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేయించుకోవాలి. రెండు, మూడో ఆప్షన్లలో ఏదైనా ఆ మేరకు కీలక డాక్యుమెంట్లలో పేర్లను కూడా మార్చుకోవాలి. దాంతో ఆర్థిక, ఆస్తి లావాదేవీల సమయంలో ఎటువంటి సమస్యలూ తలెత్తవు.
పేర్లను ఎక్కడెక్కడ మార్చుకోవాలి...?
ముందుగా వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. నిజానికి చట్ట ప్రకారం దేశంలో ప్రతీ వివాహాన్ని తప్పకుండా రిజిస్టర్ చేయించుకోవాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2005 ఇలా అని నిర్ధేశిస్తోంది. కానీ, ఈ చట్టం పటిష్ఠంగా అమలు కావడం లేదు. వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయం ఓ ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది చాలా కీలకం. పెళ్లయిన తర్వాత ఏ పేరుతో అయితే కొనసాగుతారో... అదే పేరు కూడా రిజస్ట్రేషన్ సర్టిఫికెట్ లో ఉండేలా చూసుకోవాలి. ఈ సర్టిఫికెట్ అన్నింటికీ ఆధారంగా పనికివస్తుంది. ఒకవేళ గుర్తింపు, వారసత్వ హక్కుల విషయంలో ప్రశ్నలు తలెత్తితే ఈ సర్టిఫికెట్ కీలకంగా మారుతుంది. పైగా ఇతర అన్ని చోట్లా పేర్ల మార్పునకు కీలక ఆధారంగా పనికివస్తుంది.
వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ కార్యాలయంలో పేరు మార్పుకోసం దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక పత్రికల్లో గెజిట్ కార్యాలయం ప్రకటన ఇచ్చిన తర్వాత పేరు మారుస్తుంది. లేదంటే భర్తతో కలసి సంయుక్తంగా అఫిడవిట్ తీసుకుంటే సరిపోతుంది.
వీటిల్లోనూ మార్చుకోవాలి...
భర్త ఇంటి పేరును స్వీకరిస్తే... ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ వంటి వాటిలో ఆ మేరకు మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలోనూ పేరు మార్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కీలకం బ్యాంకు ఖాతా. ఇక మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిల్లో పేర్ల మార్పుకోసం అఫిడవిట్ జిరాక్స్ కాపీ లేదా వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం కాపీలను సమర్పించాల్సి రావచ్చు.
అప్పటికే పాత పేరుతో బీమా పాలసీలను కలిగి ఉంటే బీమా కంపెనీలకు పేరు మార్పు గురించి తెలియజేయాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇతరత్రా ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవహారాలను బట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే కార్యాలయంలోని రికార్డుల్లోనూ మార్పులు చేయించుకోవడం తప్పనిసరి.
ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా...?
పేరు మార్చుకోవడం వల్ల అన్నింటికంటే ముఖ్యమైన ప్రయోజనం. చట్టపరంగా గుర్తింపు సమస్యలు ఎదురు కావు. అత్తారింటిని గౌరవించినట్టు, ఆ కుటుంబ తనదిగా భావించినట్టు భర్త తరఫు వారిలో సానుకూలత ఏర్పడుతుంది. పేరు మార్చుకోను, పెళ్లికి ముందున్న పేరునే కొనసాగిస్తానని తేల్చి చెబితే వారిలో ఎటువంటి అభిప్రాయం కలుగుతుందో ఒకసారి ఆలోచించాలి. కాకపోతే పేరు మార్చుకునేందుకు కొంత శ్రమించాల్సి ఉంటుంది. తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం, ఆ కుటుంబంలో భాగమైన తన పేరు మారిపోతుందనే మానసిక సంఘర్షణ ఎదురవుతుంది. వీటిని మర్చిపోగలిగితే పేరు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలతో ఆనందంగా ఉండడం సాధ్యమే.
గుర్తింపు
పెళ్లయిన తర్వాత స్త్రీ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరు చేర్చుకోవడం వల్ల వారిద్దరూ ఒకే కుటుంబ పేరుతో పిలవబడతారు. రేపు వారికి పుట్టే పిల్లలు కూడా అదే ఇంటి పేరుతో కొనసాగుతారు. దీంతో వారంతా ఒకే కుటుంబం అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఒకవేళ ఆమె తన ఇంటిపేరునే కొనసాగించి, పిల్లలు తండ్రి ఇంటి పేరుతో ఉంటే, వారికి ఊహ వచ్చిన తర్వాత తల్లి పేరు పక్కన తమకు వలే పేరు లేకపోవడంతో ఎమోషనల్ కనెక్షన్ బలహీనంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కడికైనా వెళితే...
పార్టీలకు, వేడుకలకు వెళ్లినప్పుడు పెళ్లయిన మహిళను ఇంటి పేరుతో పిలవడం సర్వసాధారణం. అంతేకాదు ఎక్కడైనా పేరు రాయాల్సి వచ్చినప్పుడు పూర్తి పేరు అడక్కుండానే సర్ నేమ్ గా భర్త తరఫు పేరును చేర్చేస్తారు.
ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలు
మోహిత్ శుక్లా, సౌమ్య శ్రీవాస్తవను పెళ్లాడాడు. కానీ వీరు పేర్లను మార్చుకోకుండా పూర్వపు పేర్లనే కొనసాగించారు. అయితే, కొన్ని సందర్భాల్లో కొన్ని చిత్రమైన సమస్యలు ఎదురయ్యాయి. అవేంటో చూద్దాం. ముఖ్యంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో మహిళ పెళ్లి తర్వాత కొనసాగించదలచుకున్న పేరు మాత్రమే వచ్చేలా జాగ్రత్త పడాలి. లేకుంటే అదో తలనొప్పి అవుతుంది. మోహిత్, సౌమ్య రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వివాహ నమోదు ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. కానీ, అందులో సౌమ్య శ్రీవాస్తవ బదులు సౌమ్య అని మాత్రమే వచ్చింది. దాన్ని సరిచేయాలని కోరగా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తిరస్కరించారు.
కానీ, కొంత కాలం తర్వాత అమెరికా వెళ్లే సమయంలో ఇదే సమస్యగా ఎదురైంది. సౌమ్యను మోహిత్ శుక్లా పెళ్లి చేసుకున్నాడు కనుక ఆమె పేరు మారుతుంది కదా? అని అధికారుల సందేహం. పైగా పాస్ పోర్ట్ లో సౌమ్య శ్రీవాస్తవ అని ఉంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించగా సౌమ్య అని మాత్రమే ఉంది. అధికారులకు సందేహాలు రావడంతో వారిని అనుమతించలేదు. చేసేదిలేక వారు మరోసారి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుని తప్పుల్లేకుండా సరైన పత్రాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
పెళ్లయిన స్త్రీ తన ఇంటి పేరునే కొనసాగించేట్టే అయితే పేరు ముందు లేదా తర్వాత కచ్చితంగా ఇంటి పేరును పేర్కొనాలి. లేకుంటే సమస్య రావచ్చు. ఎలా అంటే మోహిత్ భార్యగా సౌమ్య ఓటర్ లిస్ట్ లో పేరు చేర్చుకుంది. దరఖాస్తులో సౌమ్య అని రాసి ఊరుకుంది. దీంతో అక్కడి సిిబ్బంది పెళ్లయింది కనుక సౌమ్య శుక్లాగా ఫిక్స్ అయ్యి దాన్నే రికార్డుల్లో నమోదు చేశారు. దాన్ని మార్చాలని కోరగా, వివాహ నమోదు పత్రాన్ని తీసుకురావాలని అడిగారు.
పేరును పూర్తిగా రాయాలి
మరో సందర్భంలో మోహిత్ శుక్లా, తన భార్యను లేడీ స్పెషిలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ ప్రిస్కిప్షన్ పై సౌమ్య శ్రీవాస్తవ, వైఫ్ ఆఫ్ మోహిత్ శ్రీవాస్తవ అని రాశారు. దీన్ని చూసి వారికి ఏం చేయాలో పాలు పోలేదు. ఈ అనుభవాల నేపథ్యంలో పెళ్లయిన స్త్రీ ప్రతీ దరఖాస్తులోనూ తన పేరును చాలా స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి.
ఇది చూడండి...
తేజశ్వికి పెళ్లయింది. ఆమె భర్త ఎటువంటి బాధ్యత లేకుండా సంపాదించకపోగా, డబ్బుల కోసం తేజశ్విపై ఆధారపడ్డాడు. వీరికి ఓ ఆరేళ్ల బాబు ఉన్నాడు. పరిస్థితుల నేపథ్యంలో తేజశ్వి తన ఇంటి పేరును మార్చుకోకుండా అలానే కొనసాగించింది. ఒకరోజు ఆమె కంగుతినే డైలాగ్ ను వినాల్సి వచ్చింది. ఆమె ఆరేళ్ల కొడుకు కన్నతల్లిని పట్టుకుని ‘నువ్వు ఈ కుటుంబంలో భాగం కాదు. ఎందుకంటే డాడీ, నా పేరు ముందున్న పేరు నీకు లేదు’ అన్నాడు. తేజశ్వి నోట మాటరాలేదు.
మరో సందర్భంలో తేజశ్వి ఇల్లు కొనుక్కోవాలనుకుంది. తల్లిదండ్రులు డౌన్ పేమెంట్ చెల్లిస్తామన్నారు. తనని ఈఎంఐ కట్టుకోమన్నారు. బ్యాంకుకు వెళ్లిన తేజశ్వి దరఖాస్తు ఇచ్చింది. కో బారోవర్ గా తల్లిని చేర్చింది. భర్తను ఎందుకు కో బారోవర్ గా పేర్కొనలేదంటూ ఆమెకు సవాలక్ష ప్రశ్నలు ఎదురయ్యాయి. భర్త పేరు ఉంటే ఆ ఇల్లు తనదంటూ ఆమెను ఎప్పుడు బయటకు గెంటేస్తాడోనన్న అనుమానంతొ తేజశ్వి అలా చేసింది.
మహరాష్ట్రలో మేడెన్ నేమ్ చట్టబద్ధమే
పెళ్లయిన తర్వాత మహిళలు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరును కొనసాగించుకోవడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ఆమె తన తండ్రి ఇంటి పేరును లేదా భర్త ఇంటి పేరును వీటిలో ఏదో ఒకదానితో కొనసాగవచ్చు. ఆ దంపతుల పిల్లలు సైతం ఏదో ఒక పేరుతో కొనసాగడం చట్టబద్ధమే అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా...
భర్త తరఫు పేరును మహిళ తన పేరులో చేర్చుకోవడం కేవలం మన దేశంలో మాత్రమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంప్రదాయమే. బ్రిటన్ లో 75 శాతం మంది మహిళలు పెళ్లి తర్వాత భర్త పేరును స్వీకరిస్తున్నారు.