కంటి చూపు మందగిస్తోందా... మరి జాగ్రత్త!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న నానుడి వినే ఉంటారు. అన్ని అవయవాల్లోకి కళ్లు చాలా కీలకం. అన్నింటికీ కంటి చూపు ప్రధానం. తన కళ్ల ముందున్న ప్రపంచాన్ని చూసే అదృష్టం ఈ భూమిపై నూటికి నూరు శాతం మందికీ లేదు. ఆ అదృష్టం ఉన్నవారు దాన్ని కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కంటి సమస్య చిన్నదైనా సరే 'ఆ ఏముందిలే' అని తీసిపారేయవద్దు. ఏ సమస్య దేనికి దారితీస్తుందో...? చివరికి ఆ అదృష్టం లేకుండా చేస్తుందేమో...? తస్మాత్ జాగ్రత్త.

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఏటా లక్షల సంఖ్యలో కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత అంధత్వానికి దారితీసేవి కూడా ఉంటున్నాయి. కొందరికి కళ్లద్దాలు, మందులతోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొందరికి సర్జరీలతో నయం చేయడానికి అవకాశం ఉండవచ్చు. కొందరి విషయంలో అప్పటికే చేయి దాటి ఉండవచ్చు.

పైకి కనిపించకపోవచ్చు...

కొన్ని సమస్యలు పైకి కనిపించవు. అయితే, కొంత కాలానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అదే వైద్యులను సంప్రదించినట్టయితే పరీక్షల ద్వారా సమస్యలను గుర్తించేందుకు వీలుంటుంది.

కాంప్రహెన్సివ్ డైలేటెడ్ ఐ ఎగ్జామ్: చాలా వరకు కంటి సమస్యలు ఈ పరీక్ష ద్వారా బయటపడతాయి. గ్లకోమా, డయాబెటిక్, వయసును బట్టి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ఏఎండీ సమస్యలు తెలుస్తాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర

కొన్ని వ్యాధులు వారసత్వంగా సంక్రమిస్తుంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయడం అవసరం. అప్పటికే కుటుంబంలో ఎవరైనా కంటి వ్యాధులతో బాధపడుతుంటే అవి వారసత్వంగా మీకూ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికే ఏదైనా కంటి సమస్య ఉన్నట్టు బయటపడితే అది వారసత్వంగా వచ్చిందా, కాదా? అన్నది తెలుస్తుంది. దాన్నిబట్టి వైద్యం చేసేందుకు వీలుంటుంది.

representation image

కన్ను పనితీరు

కంటిలో ముందు భాగంలో కనిపించే కార్నియా ద్వారా కాంతి లోపలికి ప్రసారం అవుతుంది. ఐరిస్ ఈ కాంతి ఎంత మేరకు అవసరమో ఆ మేరకే కనుపాప తెరచుకునేలా నియంత్రిస్తుంది. కనుపాప వెనుక లెన్స్ ఉంటాయి. ఇది తనకు చేరిన చిత్రాలను ఎలక్ట్రానిక్ సంకేతాల రూపంలో రెటీనాకు పంపిస్తుంది. ఈ సంకేతాలు రెటీనా నుంచి ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెదడుకు వెళతాయి. దాంతో మన కళ్ల ముందు ఏముందీ మెదడుకు తెలిసిపోతుంది. 

ఎలాంటి ఆహారం

ముదురు ఆకుపచ్చటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలకూర మంచి చాయిస్. చేపలు కంటిచూపును కాపాడే మంచి బలమైన ఆహారమట. వీటిలో ఉండే ఓమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ కంటిని కాపాడతాయంటున్నారు నిపుణులు. చేపలు తినలేని వారు వాల్ నట్స్ తీసుకోవడం బెటర్. వీటిలోనూ ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారట్లు కళ్లకు మంచివి. అలా అని ఒక్క క్యారట్లే తినడం కూడా సరికాదు. పైన చెప్పుకున్నవి కూడా ఆహారంలో భాగం కావాలి. మొలకెత్తిన గింజలు కూడా మంచివి. 

representation image

కళ్లకు, మెదడుకు మధ్య అనుసంధానం చాలా కీలకమైనది. ప్రతీ కణం చక్కగా పనిచేసేందుకు వీలుగా ఎన్నో చానల్స్ నిర్మాణమై ఉంటాయి. కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేయడం వల్ల కంటి చూపు బాగుంటుంది. ఇందులో రెటీనా, స్కెలరా, పుపిల్, ఐరిస్, కార్నియా, లెన్స్, మాక్యులా, ఆక్వియెస్, విట్రయెస్ హ్యుమర్, ఆప్టిక్ డిస్క్, ఆప్టిక్ నెర్వ్ మొదలైనవి ఉంటాయి. వీటి మధ్య సమాచారం సరిగా జరిగేందుకు వీలుగా తగిన పోషకాలు అవసరపడతాయి. ల్యూటీన్, జెక్సాంతిన్, క్రిప్టోక్సాంతిన్, బెటా కెరోటిన్, జింక్, బయోఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఏ, సీ అనేవి రెటీనాలోని కణాలు సరిగా పనిచేసేందుకు చాలా చాలా అవసరం. 

బరువు పెరిగినా కళ్లకు ముప్పే

ఊబకాయం వంటి సమస్యలతో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం నాడీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. అలాగే గ్లకోమాకు దారితీస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగకుండా చూసుకోవాలి. అది మీ వల్ల కాకపోతే వైద్యులను సంప్రదించాలి.

పొగతాగినా ముప్పే...

చాలా మందికి తెలియని విషయం. పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో కంటిచూపు దెబ్బతింటుందని. పొగతాగడం వల్ల మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ) సమస్యకు దారితీస్తుంది. కేటరాక్ట్, ఆప్టిక్ నెర్వ్ దెబ్బతింటాయి. దీంతో అంతిమంగా అంధత్వం ఏర్పడుతుంది.

సాధారణంగా కనిపించే సమస్యలు

మయోపియా లేదా దగ్గరి చూపు మందగించడం, హైపరోపియా లేదా దూరదృష్టి తగ్గడం, ఆస్టిగ్ మ్యాటిజమ్, ప్రెస్బియోపియా. ఇంకా...

ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ)

ఈ సమస్య 50 ఏళ్లకు పైబడిన వారిలో వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ కూడా అధికం అవుతుంది. పొగతాగేవారిలో ఏఎండీ రిస్క్ రెండు రెట్లు అధికంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసులకు వచ్చే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏఎండీ సమస్యలో రెటీనాలోని మాక్యులాకు రక్త ప్రసారం తగ్గుతుంది. దీని వల్ల చూపు క్షీణిస్తుంది. దీనికి చికిత్స లేదు.

representation image

కేటరాక్ట్

వయసు పెరుగుతుంటే కంటిలో శుక్లం ఏర్పడడం ఎక్కువ శాతం కనిపించే సమస్య. ప్రపంచంలో 51 శాతం అంధత్వానికి ఇదే కారణమట. మధుమేహం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు, ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం వంటివి కేటరాక్ట్ రావడానికి దారితీస్తాయి. 

డయాబెటిక్ రెటినోపతీ

టైప్1, టైప్ 2 మధుమేహంతో బాధపడే వారిలో డయాబెటిక్ రెటినోపతీ సమస్య ఎదురవుతుంది. ఎక్కువ కాలం మధుమేహంతో బాధ పడేవారిలో రెటీనా పరమైన సమస్యలు బయటపడే అవకాశాలు ఎక్కువ. రెటీనా రక్త నాళాల్లోంచి లీకేజీ ఏర్పడడం వల్ల చూపు కోల్పోతారు. అందుకే డయాబెటిస్ వచ్చినప్పటికీ దాన్ని అన్ని వేళలా అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.

గ్లకోమా

అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా వచ్చి ఉంటే, వయసు 60 దాటితే వారిలో గ్లకోమా ముప్పు అధికంగా ఉంటుంది. ఇది రెటీనా నుంచి మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే ఆప్టిక్ నెర్వ్ దెబ్బతినడం వల్ల ఏర్పడే సమస్య. పైకి లక్షణాలు కనిపించవు, కానీ చూపు మాత్రం దెబ్బతినిపోతుంది. ఆలస్యంగా గుర్తిస్తే కంటి చూపు పూర్తిగా కోల్పోతారు. గ్లకోమా వచ్చి కంటి చూపు కోల్పోతే ఇక దాన్ని పునరుద్ధరించడం దాదాపుగా అసాధ్యం.

అధిర రక్తపోటు సమస్య వల్ల కూడా కంటిలోని కణాలు దెబ్బతిని చూపుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. పర్యావరణ కాలుష్యం, స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్ మందులు, సంతాన నిరోధం కోసం నోటి ద్వారా తీసుకునే మాత్రలు కంటికి కావాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయి. దీంతో చూపునకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.

శస్త్రచికిత్సలు

చూపు మందగించి కళ్లద్దాలు ధరించడం ఇబ్బందిగా అనిపిస్తే... వైద్యులను సంప్రదించినట్టయితే శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అలాగే కంటిలో శుక్లం సమస్యకు, గ్లకోమాకు కూడా శస్త్రచికిత్సలు ఉన్నాయి.

కంట్లో ఏవైనా పడితే

సబ్బు నీరు పొరపాటుగా కంటిలోకి వెళితే వెంటనే భగ్గుమని మండుతుంది. కంటిని నలపకుండా వెంటనే ధారగా కంటిలోకి ఫిల్టర్ వాటర్ ను స్ప్రే చేయండి. లేదా దోసిలితో తీసుకుని కంటిలోకి నీటిని చిమ్మండి. ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ కంట్లో పడినా ఇలానే చేయండి. లేదా సెలైన్ వాటర్ తో అయినా కంటిని శుభ్రం చేసుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటున్నారా..?

సాధారణంగా మనలో చాలా మంది చేసే పని కళ్లద్దాలను అసలు శుభ్రం చేయకపోవడం. కానీ దీనివల్ల కూడా పలు సమస్యలు రావచ్చు. ఎందుకంటే ఎక్కడపడితే అక్కడ పడేసి, ఏ చేతులతో పడితే ఆ చేతులతో కళ్లద్దాలను పట్టుకుంటాం గనుక కళ్లద్దాలపై ఎంతో బ్యాక్టీరియా చేరుతుంది. కళ్లద్దాలను శుభ్రం చేసుకునేందుకు ఐవేర్ స్టోర్లలో క్లీనింగ్ లిక్విడ్ లభిస్తుంది. దాంతో రోజుకొకసారి అయినా కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటుండాలి. అలాగే కాంటాక్ట్ లెన్సులు కూడా. ఇవి పెట్టి తీసుకునే ముందు చేతులను సబ్బుతో కడుక్కోవడం తప్పనిసరి.

representation image

ఏడాదికి ఒక్కసారైనా...

మనం తరచూ కళ్ళ రెప్పలను మనకు తెలియకుండానే ఆడిస్తుంటాం. ఇది సహజ చర్య. ఎందుకంటే కంటిలోపల ఎప్పుడూ తేమగా ఉండాలి. పొడిబారకూడదు. అలా తడిని ఉంచేందుకే రెప్పులు మూసి తెరుస్తుంటాం. కానీ, ఏదైనా చాలా ఆసక్తిగా చదువుతున్నప్పుడు, కంప్యూటర్ పై పనిచేస్తున్న సమయాల్లో కను రెప్పలు ఆర్పడాన్ని మనకు తెలియకుండానే నియంత్రిస్తాం. దాంతో కళ్లలో తేమ తగ్గుతుంది. కొన్ని రకాల ఇతర సమస్యల్లోనూ కంట్లో డ్రైనెస్ ఏర్పడుతుంది. అందుకే కంటి వైద్యులను ఏడాదిలో ఒక్కసారైనా సంప్రదించడం ఎంతో అవసరం.

కళ్లకు విశ్రాంతి

కంప్యూటర్ల ముందు పనిచేస్తున్నారా...? అయితే, మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు 20, 20, 20 సూత్రాన్ని పాటించాలి. ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది.

representation image

చలువ అద్దాలు

కళ్లకు చలువ అద్దాలతో తగిన ఉపయోగం ఉంది. ఎండ సమయంలో వీటిని ధరించడం వల్ల సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, కొనే ముందు అద్దాలు అల్ట్రా వయలెట్-ఏ, అల్ట్రా వయలెట్-బీ కిరణాలను నిరోధించేవా, కావా అన్నది చూడాలి. ఈ కిరణాలు కళ్లపై పడితే శుక్లం సమస్య ఎదురవుతుందని, ఏఎండీకి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. చలువ కళ్లద్దాలు ధరించడం వల్ల క్యాటరాక్ట్ సమస్య రాకుండా చూసుకోవచ్చట. ముఖ్యంగా చిన్నారులు, యుక్తవయసులోని వారికి కళ్లద్దాల ద్వారా రక్షణ కల్పించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరిని సంప్రదించాలి...?

ఆప్టీషియన్: వైద్యులు రాసిన గ్లాసెస్ ను ఇవ్వడం వరకే వీరి పాత్ర పరిమితం

ఆప్టో మెట్రిస్ట్: వీరు కళ్లను పరీక్షించి ఏమైనా వ్యాధులు ఉన్నాయా? అన్నది నిర్ధారిస్తారు. చూపును పరీక్షించి తగిన గ్లాసులను సూచిస్తారు.  అవసరం మేరకు వ్యాధుల నియంత్రణకు మందులు సైతం సూచిస్తారు.

ఆప్తమాలజిస్ట్: వీరు పూర్తి స్థాయి కంటి వైద్య నిపుణులు. వ్యాధి నిర్ధారణ చేయడంతోపాటు వాటికి చికిత్స సూచిస్తారు. అవసరం మేరకు సర్జరీలు సైతం నిర్వహిస్తారు. గ్లాసులు, కాంటాక్ట్ లెన్స్ లను కూడా సూచిస్తారు.

ఇవి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి

- ఎర్రబారి, కంట్లో నొప్పిగా ఉంటే ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్ వద్దకు వెళ్లాలి.

- ఉన్నట్టుండి పాక్షికంగా, పూర్తిగా కంటి చూపు మందగిస్తే...

- ఎదురుగా ఉన్నవి రెండుగా కనిపిస్తే

- కంటి పాప ముందు నల్లటి చుక్కలు కనిపిస్తే

- ఏదో కంటిచూపునకు అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంటే...

- కుడి ఎడమవైపుల ఉన్నవి కనిపించకుంటే... రాత్రి సమయాల్లో చూపు మందగించినట్టు అనిపిస్తే...

- రంగుల మధ్య తేడాను గుర్తు పట్టలేకుంటే

- దగ్గర్లో ఉన్న వస్తువులు మసకబారినట్టు అనిపిస్తుంటే

- కళ్ల వెంట నీరు కారుతుంటే... బాగా దురదగా అనిపిస్తుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స పొందాలి.

- అధిక కాంతి వల్ల రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతుంటే కంటి వైద్యుడి సూచన మేరకు యాంటీగ్లేర్ కోటింగ్ ఉన్న గ్లాసెస్ ను వాడుకోవాలి. 

- చలువ కళ్లద్దాలు పెట్టుకున్నప్పటికీ సూర్యుడి వైపు చూడొద్దని నిపుణుల సూచన.

- కళ్ల నుంచి మానిటర్ కనీసం అడుగు దూరంలో ఉండాలి. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మీ వెనుక వైపున లైట్, విండో ఉండరాదు. ఎందుకంటే ఆ వెలుగు స్క్రీన్ పై పడి గ్లేరింగ్ ఉంటుంది. దీంతో కళ్లు శ్రమకు గురవుతాయి.

- బ్లూ రంగు కళ్లకు హానికరం. అందుకే గ్రాఫిక్ ప్రాపర్టీస్ లోకి వెళ్లి కలర్ సెట్టింగ్స్ లో ఈ మేరకు మార్పులు చేసుకోవాలి.

- కళ్లలో పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ అయితే, ఆ లెన్స్ లో కళ్లలో అమర్చుకునే ముందు, తర్వాత తీసే సమయంలోనూ కళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. 


More Articles