ఈ యాప్స్ తో ఎన్నో లాభాలు

ప్రస్తుతం మనకు స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవదు. టైమ్ చూసుకోవడం దగ్గరి నుంచి రిమైండర్లు, అలారం వరకూ అన్నీ ఫోన్ లోనే.. కాంటాక్టుల దగ్గరి నుంచి ఫొటోలు, వీడియోలు ఎన్నో ఉంటాయి. సోషల్ మీడియా యాప్ లోకి అప్ లోడ్ చేసి, వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకున్న డేటా సహా.. మన ఫోన్లో మనకు ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఎంతో ఉంటుంది. మరి ఈ డేటాను సంరక్షించుకోవడం, కాపీ చేసుకోవడం, బ్యాకప్ తీసుకోవడం వంటివి ఎంతో అత్యవసరం. కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్ల (యాప్ ల) ద్వారా ఈ పనులు చేసుకోవచ్చు. ఇక మన ఫోన్ లోని సెన్సర్లు, సదుపాయాల పనితీరును పరిశీలించేందుకూ కొన్ని యాప్ లు తోడ్పడతాయి. వీటిలో కొన్ని పూర్తి ఉచితంగా లభిస్తుండగా.. మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి ఆ యాప్ లను పరిశీలిద్దామా..

ఫోన్ బుక్ కాంటాక్టులను ప్రింట్ చేసుకోవడం

ఎప్పుడూ ఎవరో ఒకరు కలుస్తుంటారు. వారి ఫోన్ నంబర్లు తీసుకుంటాం. తెలిసినవారు, తోటి ఉద్యోగులు, బంధువులు.. ఇలా వందల సంఖ్యలో ఫోన్ నంబర్లను ఫోన్ లో ఫీడ్ చేసుకుంటాం. అయితే పొరపాటున ఎప్పుడైనా మన ఫోన్ లో సాఫ్ట్ వేర్ కరప్ట్ కావడం, వైరస్ అటాక్, ఫోన్ కింద పడిపోయి ఆన్ కాకపోవడం, ఫోన్ మర్చిపోవడం, పోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఫోన్ చేయాలంటే వారి నంబర్ కావాల్సిందే. అందువల్ల ఫోన్ కాంటాక్టులను బ్యాకప్ తీసుకోవడం, టెక్స్ట్ ఫైల్ గానో, పీడీఎఫ్ ఫైల్ గానో మార్చి మన మెయిల్ లో పెట్టుకోవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకు తోడ్పడే ఎన్నో ఆండ్రాయిడ్ యాప్స్ గూగుల్ ప్లేస్టోర్ లో లభిస్తాయి. వాటిని ఇన్ స్టాల్ చేసుకుని.. కాంటాక్టులను బ్యాకప్ తీసుకోవడం, రీస్టోర్ చేసుకోవడం, పీడీఎఫ్ గా మార్చుకోవడం, ప్రింట్ చేసుకోవడం చేయవచ్చు. ఇందుకు తోడ్పడే కొన్ని మంచి యాప్ లు

  • ప్రింట్ మై కాంటాక్ట్స్, కాంటాక్ట్స్ టు పీడీఎఫ్, కాంటాక్ట్స్ బ్యాకప్ అండ్ ఎక్స్ పోర్ట్ వంటి మరెన్నో యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మెస్సేజీల బ్యాకప్

సాధారణంగా మనకు రోజూ ఎన్నో టెక్ట్స్ మెసేజీలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని ఎంతో ముఖ్యమైనవి కూడా ఉంటాయి. వాటిని రహస్యంగా స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నా.. ఫోన్ దెబ్బతింటే మెసేజీలు పోగొట్టుకోకుండా ఉండాలనుకున్నా.. ఇందుకు తోడ్పడే కొన్ని మంచి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్లౌడ్ స్టోరేజీలో, ఫోన్ లేదా మెమరీ కార్డుల్లో ఎస్సెమ్మెస్ ల డేటాను స్టోర్ చేసుకునేందుకు అవకాశమిస్తుండగా... మరికొన్నింటిలో అయితే నిర్ణీత సమయాల్లో మన ఎస్సెమ్మెస్ లను మనం ఇచ్చే ఈ-మెయిల్ ఐడీకి పంపుతాయి. మెయిల్ ఓపెన్ చేసుకుని మనం వాటిని చూసుకోవచ్చు. రోజు, రెండు రోజులకోసారి, లేదా వారానికోసారి.. ఇలా మనం ఎలాగైనా బ్యాకప్ సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఆటోమేటిగ్గా ఎస్సెమ్మెస్ లు బ్యాకప్ అవుతాయి. కావాలనుకున్నప్పుడు రీస్టోర్ చేసుకోవచ్చు కూడా. కొన్ని ఎస్సెమ్మెస్ బ్యాకప్ సాఫ్ట్ వేర్లలో కాల్ లాగ్ వివరాలనూ బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది.

  • ఎస్సెమ్మెస్ బ్యాకప్ ప్లస్, ఎస్సెమ్మెస్ బ్యాకప్ అండ్ రీస్టోర్, సీఎం బ్యాకప్, ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్, సూపర్ బ్యాకప్, ఎస్సెమ్మెస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ మొదలైనవి మంచి ఎస్సెమ్మెస్ బ్యాకప్ సాఫ్ట్ వేర్లు.
  • ప్రైవేట్ ఎస్సెమ్మెస్ బాక్స్ యాప్ లో బ్యాకప్ తో పాటు మరో అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. దీనిలో ఏవైనా కొన్ని కాంటాక్టులను, ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా యాడ్ చేసుకోవచ్చు. దాంతో ఆ కాంటాక్టులు, నంబర్ల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్ లు ఫోన్ ఇన్ బాక్స్ లో కనిపించవు. నేరుగా ప్రైవేట్ ఎస్సెమ్మెస్ బాక్స్ యాప్ ఓపెన్ చేసుకుని, అందులో చూడొచ్చు. ఈ యాప్ కు పాస్ వర్డ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది.
  • ఇక ఎస్సెమ్మెస్ టు టెక్ట్స్ యాప్ లో మరో అదనపు సౌకర్యం ఉంది. ఈ యాప్ ద్వారా మన ఇన్ బాక్స్ లోని ఎస్సెమ్మెస్ లు అన్నింటినీ టెక్ట్స్ ఫైల్ రూపంలో పొందవచ్చు. అంటే ఆ ఫైల్ ను మరే ఫోన్ లో అయినా, కంప్యూటర్ లో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.

ఇన్ఫ్రారెడ్, వైఫై రిమోట్ అప్లికేషన్లు

మన స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ సౌకర్యం ఉన్నప్పుడు దానికి సంబంధించిన యాప్ ను కూడా అందిస్తుంటారు. అయితే ఆ యాప్ అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. అందువల్ల టీవీ, డీవీడీ ప్లేయర్, ఏసీ, హోం థియేటర్, సెట్ టాప్ బాక్స్ లు వంటి వాటన్నింటినీ నియంత్రించేందుకు తోడ్పడే యాప్ లు లభిస్తాయి. ఇక వైఫై నెట్ వర్క్ ను ఆధారంగా చేసుకుని స్మార్ట్ ఫోన్ ను రిమోట్ కంట్రోల్ లా వినియోగించుకునేందుకు తోడ్పడే యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వైఫై రిమోట్ యాప్స్ కేవలం నెట్ వర్క్ ఆధారిత స్మార్ట్ టీవీల వంటి పరికరాలకు మాత్రమే పనిచేస్తాయి. కొన్ని యాప్ లలో ఇన్ఫ్రారెడ్ తో పాటు వైఫై రిమోట్ ఆప్షన్లు రెండూ ఉంటాయి కూడా.

  • ఐఆర్ రిమోట్ కు సంబంధించి కొన్ని మంచి యాప్ లు..  గెలాక్సీ యూనివర్సల్ రిమోట్, స్యూర్ యూనివర్సల్ రిమోట్, పీల్ స్మార్ట్ రిమోట్, ఐఆర్ యూనివర్సల్ రిమోట్.
  • వైఫై రిమోట్ లా పనిచేసే కొన్ని మంచి యాప్ లు.. స్యూర్ యూనివర్సల్ రిమోట్, వైఫై టీవీ రిమోట్, ఎనీమోట్ యూనివర్సల్ రిమోట్ ప్లస్ వైఫై, ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ కంట్రోల్.

జీపీఎస్ సరిగా పనిచేయడం లేదా..?

మనం ఎక్కడికి వెళ్లాలన్నా జీపీఎస్ ఎంతగానో తోడ్పడుతుంది. కేవలం సరైన ల్యాండ్ మార్క్ పేరు తెలిసి ఉంటే చాలు.. జీపీఎస్ సహకారంతో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా సులువుగా వెళ్లిపోవచ్చు. దగ్గరి దారులనూ వెతుక్కోవచ్చు. కానీ చాలా సార్లు జీపీఎస్ సిగ్నల్ సరిగా చూపించదు. సాధారణ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో అయితే జీపీఎస్ రిసీవర్లు నాసిరకంగా ఉండి సరిగా చూపించవు. అలాంటప్పుడు ‘జీపీఎస్ స్టేటస్, జీపీఎస్ టెస్ట్’ యాప్ ల సహాయంతో మంచి జీపీఎస్ సిగ్నల్ ను పొందవచ్చు. వీటి ద్వారా జీపీఎస్ సిగ్నల్ చాలా త్వరగా దొరుకుతుంది. కాస్త ఓపెన్ వాతావరణంలో ఉన్నప్పుడు ఈ యాప్ లను ఓపెన్ చేసి వాటిని బ్యాగ్రౌండ్ లో కాసేపు రన్ చేయడం వల్ల సిగ్నల్ మరింతగా మెరుగుపడుతుంది.

  • జీపీఎస్ స్టేటస్ యాప్ చాలా సింపుల్ ఇంటర్ఫేస్ తో ఉంటుంది. జీపీఎస్ తో పాటు శాటిలైట్ల పొజిషన్, సిగ్నల్ నాణ్యతలను కూడా చూపిస్తుంది. అంతేకాదు మన ఫోన్ లో ఉన్న లైట్, మాగ్నటిక్, ప్రాక్జిమిటీ, గైరోస్కోప్ వంటి సెన్సర్లు, వాటి పనితీరును.. ప్రస్తుత పరిస్థితిని కూడా చూపిస్తుంది. జీపీఎస్ మరింత బాగా పనిచేసేందుకు తోడ్పడే అసిస్టెడ్ జీపీఎస్ (ఏ-జీపీఎస్) డేటాను కూడా దీని ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తంగా ఎన్నో సౌకర్యాలు అందించే అత్తుత్తమమైన యాప్ ఇది. అయితే ఇది బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకుంటుంది.
  • ఇక జీపీఎస్ టెస్ట్ యాప్ కూడా సిగ్నల్ ను మరింత మెరుగుపర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇది గ్లోనాస్ (జీపీఎస్ తరహా పొజిషనింగ్ వ్యవస్థ) ను కూడా సపోర్ట్ చేస్తుంది. జీపీఎస్ స్టేటస్ యాప్ తో పోల్చితే బ్యాటరీ వినియోగం తక్కువ. జీపీఎస్ సిగ్నల్ ను, శాటిలైట్ల పొజిషన్ ను, ప్రస్తుత లొకేషన్ ను, మీరు ప్రయాణంలో ఉంటే ఆ ప్రయాణ వేగాన్ని, సమయాన్ని కూడా చూపిస్తుంది. అయితే ఇందులో సెన్సర్ల డేటాను, పరిస్థితిని గమనించే ఆప్షన్లు లేవు. మొత్తంగా అత్యుత్తమ యాప్ ఇది. 

లాకింగ్ యాప్ లు

ఫోన్ ను ఎవరికైనా ఇచ్చినప్పుడు అందులోని మన వ్యక్తిగత సమాచారాన్నివారు చూడలేకుండా ఉండేందుకు తోడ్పడే లాకింగ్ యాప్ లు లభిస్తాయి. వీటి ద్వారా మన ఫోన్ మొత్తాన్నీ లాక్ చేయడం కాకుండా మనకు కావాల్సిన వాటిని మాత్రమే లాక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫొటోలు, వీడియోలు చూడకూడదనుకుంటే గ్యాలరీని లాక్ చేస్తే చాలు. లేదా ఎస్సెమ్మెస్ లు, కాల్ లాగ్స్ చూడొద్దనుకుంటే వాటిని మాత్రమే లాక్ చేసుకోవచ్చు. మిగతా యాప్స్, గేమ్స్ వంటి వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని లాకింగ్ యాప్ లలో అయితే ఒక్కో యాప్ ను లాక్ చేయడానికి వేర్వేరు పాస్ వర్డ్ లు పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అంటే మొత్తంగా ఫోన్ ను లాక్ చేసి పెట్టుకోనవసరం లేకుండానే.. రక్షణ పొందవచ్చన్న మాట. ఈ యాప్ లలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా.. మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

  • యాప్ లాక్, స్మార్ట్ యాప్ లాక్, ఈఎస్ యాప్ లాకర్, క్లీన్ మాస్టర్, యాప్స్ లాక్ అండ్ గ్యాలరీ హైడర్, యాప్ లాక్ (ప్యాటర్న్), పర్ఫెక్ట్ యాప్ లాక్, లియో ప్రైవసీ గార్డ్, యాప్ లాకర్ మాస్టర్ మొదలైనవి బెస్ట్ యాప్స్ గా చెప్పవచ్చు.
  • సాధారణంగా ర్యామ్, క్యాచీ క్లీనింగ్ కోసం వినియోగించే క్లీన్ మాస్టర్ యాప్ తో పాటు అందులోనే లభించే యాప్ లాకర్ ను వినియోగించుకుంటే బెటర్. దాని వినియోగం కూడా సులభంగా ఉంటుంది.

ఇంటర్నెట్ లేకున్నా నావిగేషన్ చేసుకోవచ్చు..

మన ఫోన్ లో జీపీఎస్ ఉన్నా.. ఇంటర్నెట్ కనెక్షన్, సరైన సెల్యూలార్ నెట్ వర్క్ లేకపోతే దానిని సరిగా వినియోగించుకోలేం. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా.. సెల్యులార్ సిగ్నల్ సరిగా లేకున్నా... మంచి నావిగేషన్ సౌకర్యాన్ని అందించేందుకు ‘హియర్ (HERE)’ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతిష్టాత్మకమైన నోకియా సంస్థ రూపొందించిన యాప్ కావడం విశేషం. మనకు కావాల్సిన ప్రాంతాల మ్యాప్ లను ముందుగానే డౌన్ లోడ్ చేసుకుని... గూగుల్ మ్యాప్స్ తరహాలో పూర్తి స్థాయి నావిగేషన్ ను దీని ద్వారా అందుకోవచ్చు. అయితే హియర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత.. అందులో రిజిస్ట్రేషన్ చేసుకుని, మ్యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక దేశం మొత్తం మ్యాప్ నూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం.

  • హియర్ మ్యాప్స్ తరహాలోనే ‘Maps.Me’, ‘GPS Navigation & Maps by Sygic’ యాప్ లతోనూ ఆఫ్ లైన్ మ్యాప్ సదుపాయాన్ని పొందవచ్చు.

యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవాలా..?

యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వీడియోలు ఉంటాయి. కానీ మనకు నచ్చిన వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు. కంప్యూటర్లకు సంబంధించినంత వరకూ ఇందుకోసం చాలా వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లు ఉన్నా... స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రం కష్టమే. యూట్యూబ్ ఆఫ్ లైన్ ఫీచర్ ఉన్నా.. ఆ వీడియోలు ఫోన్ లో ముక్కలు, ముక్కలుగా ఎన్ క్రిప్ట్ చేయబడి సేవ్ అవుతాయి. వాటిని చూడడం తప్ప కాపీ చేసుకోలేం. ఈ సమస్యను తీర్చేందుకు కొన్ని రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ‘ట్యూబ్ మేట్ (TubeMate), వీడియోడర్ (Videoder)’ బాగా పనిచేస్తాయి. అయితే ఇవి గూగుల్ ప్లేస్టోర్ లో లభించవు. ఈ పేర్లతో సెర్చ్ చేసి.. వాటి వెబ్ సైట్ల నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందే.

  • ఈ యాప్ లలోనే ఇన్ బిల్ట్ గా బ్రౌజర్ ఉంటుంది. ఉదాహరణకు మనం ట్యూబ్ మేట్ యాప్ ను ఓపెన్ చేయగానే.. నేరుగా యూట్యూబ్ వెబ్ సైట్ కు వెళుతుంది. అందులో మనకు కావాల్సిన వీడియోను సెర్చ్ చేసి, ఆ వీడియోను ఓపెన్ చేయాలి. తర్వాత యాప్ లో కుడివైపు పైన ఉండే డౌన్ లోడ్ బటన్ ను ప్రెస్ చేయాలి. దాంతో ఆ వీడియోకు సంబంధించిన వివిధ రిజల్యూషన్లను చూపిస్తుంది. మనకు కావాల్సిన రిజల్యూషన్ ఎంచుకుని ఓకే ప్రెస్ చేస్తే డౌన్ లోడ్ అవుతుంది.

స్కానింగ్ యాప్స్

ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఉండాల్సిన అత్యంత ప్రయోజనకరమైన యాప్ లు ఇవి. సాధారణంగా మనం ఏదైనా డాక్యుమెంట్ ను ఫొటో తీసి ప్రింట్ చేసుకుంటే నల్లగా, డల్ గా వస్తాయి. కానీ స్కానింగ్ యాప్ లను వినియోగిస్తే... నేరుగా స్కానింగ్ చేసిన తరహాలో, జిరాక్స్ తీసుకున్న తరహాలో నీట్ గా వస్తాయి. ఏవైనా బిల్లుల దగ్గరి నుంచి మనకు నిత్యం అవసరమయ్యే ఐడీ కార్డులు, ప్రూఫ్ లవంటి వాటిని మంచి నాణ్యతతో స్కాన్ చేసి పెట్టుకునేందుకు స్కానింగ్ యాప్ లు ఉపయోగపడతాయి. కొన్ని రకాల యాప్ ల ద్వారా సాధారణ కెమెరా ఉన్న ఫోన్లతోనూ మంచి నాణ్యతతో డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోవచ్చు. వాటిని బ్లాక్ అండ్ వైట్ గా కూడా మార్చుకోవచ్చు. అవసరాన్ని బట్టి డార్క్ గా, లైట్ గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు.. ఈ డాక్యుమెంట్లను జేపీజీ (ఫొటో ఫార్మాట్), పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. 

  • టినీ స్కానర్, కామ్ స్కానర్, జీనియస్ స్కాన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్, స్కాన్ బోట్, మొబైల్ డాక్ స్కానర్, హ్యాండీ స్కానర్, టర్బో స్కాన్ వంటి పలు యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని పూర్తి ఉచితంగా లభిస్తుండగా.. మరికొన్నింటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


More Articles