పిల్లల పేరిట పాలసీలు తీసుకోవడం సరైనదేనా...?

దంపతులు ఎవరైనా కానీ వారి ఆశలన్నీ వారి వారసులపైనే. మరి వారి చిన్నారుల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే రక్షణకు బీమా పాలసీలు కచ్చితంగా ఉండాల్సిందే. బీమా కంపెనీలు అందిస్తున్న చైల్డ్ పాలసీలు చాలా వరకు వారి విద్య, వివాహం లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కల్పించేవే. వీటిలో ఏఏ రకాలున్నాయో చూద్దాం.

సంప్రదాయ (ఎండోమెంట్), యూనిట్ లింక్డ్ అని పాలసీలను రెండు రకాలుగా విభజించవచ్చు. సంప్రదాయ పాలసీల్లో రాబడి తక్కువగాను, యులిప్ లలో ఎక్కువగానూ ఉంటుంది. యులిప్ లలో పెట్టుబడులను బీమా కంపెనీలు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడతాయి కనుక రిస్క్ ఉంటుంది. ఈ పాలసీలు చిన్నారులు లేదా వారి పేరెంట్స్ కు లైఫ్ కవరేజీని అందిస్తాయి. అయితే, పేరెంట్ పేరిట లైఫ్ కవరేజీని అందించే పాలసీలే ఎక్కువ. వీటికి ప్రీమియం వైవర్ రైడర్ ను కూడా జోడించుకోవచ్చు. ఒకవేళ ఆ చిన్నారికి ఆధారమైన పేరెంట్ దురదృష్టవశాత్తూ మరణిస్తే ప్రీమియం చెల్లించే పని లేకుండానే పాలసీ కొనసాగుతుంది. పాలసీలో పేర్కొన్న మేరకు నిర్ణీత గడువుకు బెనిఫిట్ మొత్తం చెల్లింపు జరుగుతుంది. నిజానికి కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తాను లేని సందర్భం ఎదురైతే తన కుటుంబ అవసరాలన్నీ తీర్చేలా బీమా పాలసీ తీసుకోవడం చాలా అవసరం. అలా తీసుకుంటే అప్పుడు చిన్నారుల పేరిట ప్రత్యేకంగా పాలసీల అవసరం ఏర్పడదు. 

చిన్నారులకు కావాల్సిన ఆర్థిక భద్రత...

- చిన్నారి సంక్షేమానికి ఆధారమైన తండ్రి లేదా తల్లి దూరమైతే ఆదుకునే రక్షణతో ఉండాలి. 

- విద్య, వివాహం వంటి ముఖ్య లక్ష్యాలను తీర్చేలా ఉండాలి.

- తగిన హెల్త్ కవరేజీ కూడా ఉండాలి. 

కవరేజీ పేరెంట్స్ కే ఉండాలి

చైల్డ్ పాలసీ తీసుకున్నప్పటికీ బీమా కవరేజీ ఎప్పుడూ కూడా పేరెంట్స్ పేరిటే ఉండాలి. ఎందుకంటే వారికేమైనా జరిగితే వారి పిల్లలు సమస్యల్లో పడిపోకుండా చదువు కొనసాగించుకునేట్టు ఉండాలి. ఇతరత్రా అవసరాలు తీర్చేందుకు వీలుగా బీమా కవరేజీని పేరెంట్స్ పేరిట తీసుకోవడం సరైనది. బీమా కంపెనీలు సైతం పాలసీ హోల్డర్ మరణిస్తే వారి చిన్నారులకు పీరియాడికల్ గా (ఇంత కాలానికి ఒకసారి అని) పేమెంట్స్ చేస్తాయి. 

చైల్డ్ పాలసీల్లో మంచి పనితీరు ఉన్నది తగిన కవరేజీతో ఒకటి తీసుకుంటే చాలు. ఉదాహరణకు ఎండోమెండ్ అయినా, యులిప్ అయినా చైల్డ్ పాలసీలకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దానికి బదులు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుంటే అన్ని అవసరాలను తీరుస్తుంది. ఉదాహరణకు ప్రసాద్ వయసు 30 ఏళ్లు. భార్య, ఓ ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. సొంత ఇల్లు కూడా ఉంది. ప్రసాద్ కు అప్పులు లేవు. నెలకు రూ.30వేల వేతనం వస్తోంది. తాను మరణిస్తే తన కుటుంబ పోషణకు ఇబ్బంది రాకూడదు. ప్రసాద్ కు 50 ఏళ్లు వచ్చే సరికి అతడి కుమారుడికి 25 ఏళ్లు వస్తాయి కనుక అప్పటికి విద్య పూర్తయి ఉపాధి కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రసాద్ 25 ఏళ్ల సంపాదనను లెక్కలోకి తీసుకుని, కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఏటా రూ.12వేలు చెల్లిస్తున్నాడు. దీని ప్రకారం ఒకవేళ అనుకోనిదేమైనా జరిగితే ప్రసాద్ కుటుంబం రోడ్డున పడే అవకాశం లేదు. సొంత ఇల్లు ఉంటుంది. అద్దెల సమస్య ఉండదు. బీమా పరిహారం కోటి రూపాయలను బ్యాంకు ఎఫ్ డీలో ఉంచి వడ్డీ తీసుకున్నా సుమారు నెలకు రూ.50వేలు వస్తుంది. 


More Articles