బినామీ ఆస్తులపై కేంద్రం ఉక్కుపాదం..? చట్టంలో మార్పులు
నల్లధనంపై పోరు సాగిస్తున్న మోదీ సర్కారు త్వరలో బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆధారంగా నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కఠినమైన బినామీ లావాదేవీల నిషేధిత చట్టాన్ని పేర్కొంటున్నారు. మోదీ సర్కారు చర్యలు ఎలా ఉన్నా... కఠిన చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీని గురించి తెలుసుకోవడం అత్యావశ్యకం.
బినామీ ట్రాన్సాక్షన్స్ (ప్రొహిబిషన్) అమెండ్ మెంట్ యాక్ట్, 2016కు ఆగస్ట్ లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది నవంబర్ నుంచి అమల్లోకి కూడా వచ్చేసింది. ఎక్కువ శాతం నల్లధనం బినామీ ఆస్తుల రూపంలో కూడా పోగుబడుతుందన్న నివేదికల నేపథ్యంలో ఈ తరహా లావాదేవీల కట్టడికి గాను ప్రభుత్వం అంతకు ముందు వరకు అమల్లో ఉన్న బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ 1988కు సవరణలు చేసి... ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988గా తీసుకొచ్చింది. బినామీలపై కఠిన చర్యలను ఈ చట్టంలో చేర్చారు.
బినామీ అంటే...?
ఒకరి పేరుపై ఉన్న ఆస్తి వాస్తవానికి వారిది కాదని అర్థం. ఉదాహరణకు రూ.30 లక్షలు పెట్టి శ్రీరామ్ ఇల్లు కొన్నాడనుకుంటే... ఆ రూ.30 లక్షలను శ్రీరామ్ కాకుండా మరో వ్యక్తి చెల్లించినట్టయితే అది బినామీ ఆస్తియే అవుతుంది. ఇందులో పలు అంశాలు ఉన్నాయి. ఓ వ్యక్తి తన నల్లధనాన్ని మరో వ్యక్తి పేరు మీద దాచుకోవడం అయి ఉండవచ్చు. లేదా ఓ వ్యక్తి అక్రమార్జన లేదా లెక్కల్లో చూపని సక్రమాజర్జనపై పన్ను ఎగ్గొట్టి అలా దాచిన ధనంతో తన సన్నిహితులు, బంధువులకు ఆస్తులు సమకూర్చినా బినామీ లావాదేవీయే అవుతుంది. చెల్లింపులు ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా ఉండవచ్చు. ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వారు బినామీదారు అవుతారు. దానికి డబ్బులు చెల్లించిన వారు అసలు యజమాని అవుతారు. ఎవరో ఒకరి పేరుపై చేసే లావాదేవీ కూడా బినామీ లావాదేవీయే అని కొత్త చట్టం చెబుతోంది. ఇలాంటి కేసుల్లో యజమానిని గుర్తించలేని పరిస్థితి ఉంటుంది.
కొత్త చట్టం ఏం చెబుతోంది...?
ఈ నూతన చట్టం బినామీ లావాదేవీలను నిషేధిస్తోంది. ఈ చట్టం కింద అధికారులు ఎటువంటి బినామీ లావాదేవీ విషయంలోనయినా విచారణ చేపట్టవచ్చు. ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ప్రాపర్టీ మార్కెట్ విలువలో 25 శాతాన్ని జరిమానా విధించేందుకు చట్టం అనుమతిస్తోంది. గతంలో ఉన్న చట్టం ప్రకారం జైలు శిక్ష గరిష్ఠంగా మూడేళ్ల వరకు లేదా జరిమానా లేదా రెండూ విధించే అధికారం ఉంది. ఇది కఠినంగా లేదని భావించిన సర్కారు జైలు శిక్షను పెంచడంతోపాటు జరిమానాను కూడా తప్పనిసరి చేస్తూ చట్టంలో మార్పులు చేసింది.
తప్పుడు సమాచారం ఇచ్చినా ఐదేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అంతేకాదు ఈ నూతన చట్టం బినామీదారు నుంచి ఆస్తిని అసలు యజమాని పొందకుండా నిషేధిస్తోంది. పైగా బినామీ ఆస్తి అని గుర్తించిన తర్వాత దాన్ని జప్తు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. ఇలా జప్తు చేస్తే రూపాయి కూడా చెల్లించరు. దీన్ని విచారణాధికారి నిర్ణయిస్తారు.
తొలుత ఇనీషియేటింగ్ ఆఫీసర్ తన దర్యాప్తులో ఓ ఆస్తి బినామీదారు పేరిట ఉందని గుర్తిస్తే దాని యజమానికి నోటీసు జారీ చేస్తారు. ఆ తేదీ నుంచి 90 రోజుల పాటు సంబంధిత ఆస్తిని జప్తు చేస్తారు. ఆ తర్వాత కూడా అదే ఆదేశాలు కొనసాగించేట్టయితే సంబంధిత కేసును అడ్జుకేటింగ్ అథారిటీకి రిఫర్ చేస్తారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం అడ్జుకేటింగ్ అథారిటీ తీర్పు ఇస్తుంది. అడ్జుకేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ లను అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారిస్తుంది. అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఇచ్చిన ఆదేశాలపై దాఖలయ్యే వ్యాజ్యాలను హైకోర్టు విచారిస్తుంది.
మినహాయింపులు
ఈ చట్టంలోని సెక్షన్ 58 కింద సేవా సంస్థలు, మత సంస్థల ఆస్తులకు బినామీ చట్టం కింద విచారణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అంతేకాదు మరి కొన్ని లావాదేవీలను సైతం బినామీ నిర్వచనం కింద మినహాయింపు ఇచ్చింది. హిందూ అవిభాజ్య కుటుంబం (ఉమ్మడి)లో భాగమైన ఒక వ్యక్తి, అదే కుటుంబలోని మరో వ్యక్తి కోసం తన పేరిట ఆస్తి కలిగి ఉంటే అది బినామీ కాదు. అయితే, ఈ ఆస్తి కొనుగోలుకు వెచ్చించిన ధనం కటుంబ ఆదాయం నుంచే అయి ఉండాలి. అలాగే ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామి, తన పిల్లల పేరిట కొన్న ఆస్తులు సైతం బినామీ ఆస్తులు కావు.