మీ ఫోన్లో ఇవి ఉంటే... నోట్లతో పని లేదు
బ్యాంకు ఖాతాలో వేతనం పడడం ఆలస్యం... ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని రావడం సర్వ సాధారణం. ఒకేసారి, లేదంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఏటీఎంకు వెళ్లి నోట్లు తీసుకోవడం అవసరాల కోసం వినియోగించడం మన దేశంలో ఎక్కువ మంది చేస్తున్న పని. ఇక పల్లె వాసులు అయితే వారికి ఏటీఎంలు అందుబాటులో ఉండవు గనుక వారు కార్డులపై దాదాపుగా ఆధారపడలేని పరిస్థితి. అన్ని దుకాణాల్లో, సేవా కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సర్కారు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లమని పిలుపునిచ్చింది. ఆచరణలో అందరికీ ఇది కష్టమే అయినా... ఆచరణ సాధ్యం కానిది అయితే కాదు. నోట్లకు కిటకిట నెలకొన్న పరిస్థితుల్లో కొనుగోళ్ల సమయంలో చెల్లింపులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిద్దాం...
యూపీఐ (యూనీఫైడ్ ఇంటర్ ఫేస్ యాప్)
ఇది అప్పటికప్పుడే నగదును బ్యాంకు ఖాతా నుంచి ఇతరులకు పంపించేందుకు వీలు కల్పించే యాప్. ఇందుకు స్మార్ట్ ఫోన్ అవసరం. చెల్లింపుల తీరును మార్చే అతిపెద్ద ఆవిష్కరణగా దీన్ని నిపుణులు అంటున్నారు. 2016 ఏప్రిల్ లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ దీన్ని ఆవిష్కరించింది. కార్డుల అవసరం లేకుండా, నెట్ బ్యాంకింగ్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లతో పని లేకుండా... ఆన్ లైన్ విధానంలో, ఆఫ్ లైన్ విధానంలోనూ చెల్లింపులు చేయడం దీని ద్వారా చాలా సులభం. 30 బ్యాంకులు యూపీఐ యాప్ ను అందిస్తున్నాయి. ఖాతాదారులు గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి యూపీఐ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ ను బ్యాంకులో తప్పకుండా నమోదు చేసుకుని ఉండాలి. ఇలా చేసుకుని ఉన్నట్టయితే యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. సాధారణంగా వ్యాలెట్లకు ఇది భిన్నం. వ్యాలెట్లలో అయితే నగదు నింపుకుని లావాదేవీలు చేయాలి. కానీ ఈ యాప్ నేరుగా బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై చెల్లింపులు చేసేస్తుంది. ఉదాహరణకు ఓ దుకాణంలో రూ.500లకు వస్తువులు కొన్న తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర యూపీఐ యాప్ కు సంబంధించి మీ వర్చువల్ ఐడీని చెప్పాల్సి ఉంటుంది. క్యాషియర్ ఆ ఐడీని తన సిస్టమ్ లో ఎంటర్ చేయడం ఆలస్యం. కస్టమర్ మొబైల్ లోని యూపీఐ యాప్ లో అలర్ట్ కనిపిస్తుంది. అది అప్రూవ్ అనే ఆప్షన్ దగ్గర చూడొచ్చు. అక్కడ పిన్ నంబర్ ఎంటర్ చేయగానే మీ బ్యాంకు ఖాతా నుంచి దుకాణాదారుడి ఖాతాకు నగదు బదిలీ అవుతుంది. యూపీఐ యాప్ లో వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకున్న ఏ వ్యక్తికి అయినా నగదు పంపడం చాలా సులభం. మీ ఫోన్ లో పే అనే ఆప్షన్ దగ్గర వర్చువల్ ఐడీని, నగదును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ సీ నంబర్లతో అవసరం లేదు. దీని వినియోగం, ఎలా పనిచేస్తుందన్న దాని గురించి లోగడ మేం ఇచ్చిన 'మొబైల్ ఉంటే చాలు... పర్సుతో పనిలేదు' అన్న ఆర్టికల్ ను సందర్శించగలరు.
https://www.ap7am.com/telugu-articles-105-article.html
మొబైల్ వ్యాలెట్లు
పేటీఎం, ఫ్రీచార్జ్, పేయూ మనీ, మొబిక్విక్, ఎయిర్ టెల్ మనీ ఇవన్నీ కూడా డిజిటల్ వ్యాలెట్లే. వీటిలో నగదును నింపుకోవాల్సి ఉంటుంది. నెట్ బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు మార్గాల్లో ఈ పని చేసుకోవచ్చు. అలాగే ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేయడం ద్వారానూ తమ వ్యాలెట్ ను ఫిల్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆయా సంస్థల వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఈ వ్యాలెట్ల సేవలు పొందవచ్చు.
వీటిలో రిజిస్ట్రేషన్ ఉచితం. లావాదేవీలపై చార్జీలు కూడా లేవు. మొబైల్ బ్యాలెన్స్ రీచార్జ్, మొబైల్ బిల్లు, గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, డీటీహెచ్ రీచార్జ్, ఇలా చాలా రకాల సేవలకు ఈ వ్యాలెట్ల నుంచి డబ్బులు చెల్లించవచ్చు. ఇలా చేసే కొన్ని లావాదేవీలకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను సంస్థలు అందిస్తుంటాయి. సినిమా టికెట్లను, రైల్వే, బస్ టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఓలా, ఊబర్ ట్యాక్సీల సేవలు పొందిన తర్వాత చార్జీలను వ్యాలెట్ల నుంచి చెల్లించవచ్చు. ప్రముఖ మాల్స్ లలోనూ మొబైల్ వ్యాలెట్లతో చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంది.
వ్యాలెట్లు మూడు రకాలు
ప్రస్తుతం దేశంలోని మొబైల్ వ్యాలెట్ యూజర్లలో మొబైల్ రీచార్జ్ లకు 60 శాతం, ప్రయాణాల కోసం 52 శాతం, బిల్లుల చెల్లింపులకు 58 శాతం, ఆన్ లైన్ షాపింగ్ చెల్లింపులకు 58 శాతం వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. ఆర్ బీఐ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తున్న వ్యాలెట్లలో మూడు రకాలు. క్లోజ్ డ్ వ్యాలెట్లు, సెమి క్లోజ్ డ్ వ్యాలెట్లు, ఓపెన్ వ్యాలెట్లు. వీటిలో క్లోజ్ డ్ మొబైల్ వ్యాలెట్లు అన్నవి ప్రత్యేకంగా ఆ వ్యాలెట్ ను అందిస్తున్న సంస్థకు చెందిన ఉత్పత్తులు, సేవల చెల్లింపులకు మాత్రమే పరిమితం. అంటే వీటిలోకి ఒకసారి నగదు పంపిన తర్వాత ఆ నగదును వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉండదన్నమాట. ఉదాహరణకు అమేజాన్, అభిబస్, రెడ్ బస్ వంటి వ్యాలెట్లు. ఇవి కస్టమర్లను తమ సేవలకు అంటిపెట్టుకునేలా ఉండడం కోసం లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఉదాహరణకు రెడ్ బస్ లో ట్రావెల్స్ టికెట్ కొనుగోలు చేశారనుకుందాం. అప్పుడు ఈ సంస్థ ఎంతో కొంత క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. అది రెడ్ బస్ లోని ఆ ఖాతాదారుడి పేరిట నిల్వ ఉంటుంది. మరోసారి ప్రయాణ టికెట్ కొనుగోలు సమయంలో ఈ బ్యాలెన్స్ ఉపయోగపడుతుంది.
సెమీ క్లోజ్ డ్ వ్యాలెట్లు కూడా నగదును వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఇవ్వవు. వీటి ద్వారా వివిధ రకాల ఆన్ లైన్ వేదికలు, దుకాణాల్లో చెల్లింపులకు వ్యాలెట్ లోని నగదును వినియోగించుకోవచ్చు. అలాగే, సన్నిహితుల వ్యాలెట్లకు నగదును బదిలీ చేసుకోవచ్చు. పేటీఎం, మొబిక్విక్, పేయూ మనీ వంటివి. మన దేశంలో వినియోగమవుతున్న వ్యాలెట్లు ఇవే.
ఇక ఓపెన్ వ్యాలెట్లలో నగదును ఫిల్ చేసుకోవడం, కావాలంటే ఆ నగదును వెనక్కి తీసుకోవడం సాధ్యమే. ఇందుకు ఉదాహరణ వొడాఫోన్ ఎంపెసా వ్యాలెట్. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రతినిధుల ద్వారా నగదు జమ, ఉపసంహరణలకు వీలుంది. ఎయిర్ టెల్ మనీ వ్యాలెట్లో డబ్బులు నింపుకోవడానికి బ్యాంకు ఖాతా అక్కర్లేదు. ఆ సంస్థ రిటైల్ అవుట్ లెట్ కు వెళ్లి నగదు జమ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ల నుంచి చేసే ఒక లావాదేవీ విలువ గరిష్టంగా రూ.50వేలకే పరిమితం.
వ్యాలెట్లతో లాభాలు
నిజానికి సెమీ క్లోజ్డ్, ఓపెన్ వ్యాలెట్లలో ముందస్తుగా నగదును నింపుకోవాల్సిన అవసరం లేదు. లావాదేవీ సమయంలోనే క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును ఖాతా నుంచి పొంది చెల్లింపులు చేయవచ్చు. వ్యాలెట్లో కొంత రక్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతీ సారీ నెట్ బ్యాంకింగ్, కార్డులతో చెల్లింపులు చేయడం వల్ల లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లు, కార్డుల సమాచారం చోరీకి గురై అందులో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. అదే వ్యాలెట్ లో మహా అయితే రూ.500 లేదా రూ.1,000 మించి ఉండవు. దీంతో వ్యాలెట్ లోకి ఎవరైనా చొరబడినా నష్టం అంతకే పరిమితం అవుతుంది.
స్టేట్ బ్యాంక్ బుడ్డీ
ఇది మొబైల్ వ్యాలెట్ యాప్. బ్యాంకు ఖాతా నుంచి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఇందులోకి నగదు పంపుకోవచ్చు. ఇందులో ఉన్న నగదుతో బిల్లుల చెల్లింపు, రీచార్జ్ లు, హోటల్స్, షాపింగ్ సమయాల్లో చెల్లింపులకు అవకాశం ఉంది. ఇందులో ఉన్న మరో సౌలభ్యం ఏమిటంటే... బుడ్డీలోనే ఉన్న మరో యూజర్ కు నగదును బదిలీ చేయవచ్చు. స్వీకరించవచ్చు. అలాగే, ఏ వ్యక్తికి అయినా (ఏ బ్యాంకు ఖాతా దారుడైనా ఫర్వాలేదు) ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ ఉంటే వాటిని టైప్ చేసి నగదు మొత్తం ఎంటర్ చేసి ట్రాన్స్ ఫర్ చేసేయవచ్చు. 13 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇన్ స్టాల్ సమయంలో లాంగ్వేజ్ ఆప్షన్ అడుగుతుంది.
ఐసీఐసీఐ పాకెట్స్
ఇది ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు అందిస్తున్న మొబైల్ వ్యాలెట్ యాప్. ఈ యాప్ లోకి ఏ బ్యాంకు ఖాతా నుంచి అయినా నగదును యాడ్ చేసుకోవచ్చు. పాకెట్స్ ద్వారా నగదు బదిలీ, రీచార్జ్, టికెట్ల బుకింగ్, బహుమతులు పంపుకోవడం చేసుకోవచ్చు.
హెచ్ డీఎఫ్ సీ చిల్లర్ (చిల్ ఆర్)
ఇది ఇన్ స్టంట్ (అప్పటికప్పుడు) మనీ ట్రాన్స్ ఫర్ యాప్. నగదు బదిలీ, చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలుగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఈ యాప్ ను తీసుకొచ్చింది. తన ఫోన్ లోని కాంటాక్టుల్లో ఎవరికి అయినా ఎప్పుడైనా ఈ యాప్ సాయంతో నగదును పంపవచ్చు. బ్యాంకు ఖాతా నంబర్ అసవరం లేదు. బెనిఫీషియరీని యాడ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఈ యాప్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులకే పరిమితం. ఈ సంస్థే పేజాప్ పేరుతో మరొక యాప్ ను కూడా తీసుకొచ్చింది. చెల్లింపులు, షాపింగ్ కోసం, కాంటాక్టు లిస్ట్ లో ఉన్న ఎవరికైనా నగదు పంపుకోవడానికి వీలు కల్పిస్తుంది.
లైమ్
నగదు చెల్లింపులు, షాపింగ్ తదితర అవసరాల కోసం యాక్సిక్ బ్యాంకు ఈ యాప్ ను తీసుకొచ్చింది. ఏ బ్యాంకు ఖాతాదారులకైనా దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంది. తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదును యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నిజానికి చాలా బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఇలా ప్రత్యేకంగా మొబైల్ వ్యాలెట్లను తీసుకొచ్చాయి. ఉదాహరణకు ఒకే వ్యక్తికి పలు బ్యాంకుల్లో ఖాతాలుంటే అన్నేసి వ్యాలెట్లను ఉపయోగించడం తలనొప్పే. దానికి బదులు తనకు ఖాతా ఉన్న బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంకు యూపీఐ ఎనేబుల్డ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని ద్వారా వేరే ఖాతాల్లోని నగదును కూడా నిర్వహించుకోవచ్చు.
ప్లాస్టిక్ కరెన్సీ
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు ప్లాస్టిక్ కరెన్సీ కిందకు వస్తాయి. డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండే సాధనం. ఖాతాలోని నగదు నిల్వలకు అనుగుణంగా చెల్లింపులకు వాడుకోవచ్చు. మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం మంది బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డులు ఉండగా... అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగం మందికి కూడా డెబిట్ కార్డులు లేవు. కనుక బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా వెంటనే తీసుకోవాల్సింది డెబిట్ కార్డు. నిర్వహణ చార్జీల పేరుతో బ్యాంకులు ఈ కార్డుల వినియోగంపై ఏడాదికోసారి 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.
యూఎస్ఎస్ డీ
మొబైల్ వ్యాలెట్లు అన్నీ కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికే. కానీ సాధారణ మొబైల్ ఫోన్లు ఉన్న వారి పరిస్థితి ఏంటి...? వీరు తమ సాధారణ ఫోన్ల నుంచే యూఎస్ఎస్ డీ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. *99# టైప్ చేస్తే వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని తమ బ్యాంకు కోడ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎస్ బీఐ అయితే ఎస్ బీఐ లేదా ఐఎఫ్ఎస్ సీ కోడ్ ఇస్తే తర్వాత వచ్చే ఆప్షన్ల నుంచి తమకు నచ్చిన సేవను పొందవచ్చు. ప్రతీ వ్యక్తి తమ బ్యాంకు పేరులోని మొదటి మూడు అక్షరాలు ఇవ్వడం ద్వారా తదుపరి దశకు వెళ్లవచ్చు. అలాగే ఐఎఫ్ఎస్ సీ కోడ్ కూడా. యూఎస్ఎస్ డీ ఆధారిత నగదు బదిలీ ఇతర సేవలపై గతంలో మేము ఇచ్చిన ఆర్టికల్ ను ఇక్కడ చూడవచ్చు.
https://www.ap7am.com/telugu-articles-156-article.html
నెట్ బ్యాంకింగ్
బీమా, టెలిఫోన్ క్రెడిట్ కార్డు, మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు ఇలా అన్ని రకాల చెల్లింపులను ఆయా సంస్థల సైట్లలోకి వెళ్లడం, లేదా బిల్లుల చెల్లింపులకు మధ్యవర్తిగా ఉన్న పేటీఎం వంటి సైట్లకు వెళ్లి నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
పేమెంట్ బ్యాంకు
ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఇప్పటికే రాజస్థాన్ రాష్టంలో ప్రారంభమైంది. త్వరలో దేశవ్యాప్తంగా సేవల్ని ప్రారంభించనుంది. కస్టమర్ ఆధార్ నంబర్ ఒక్కటీ ఉంటే చాలు ఖాతా ప్రారంభమైపోతుంది. వారి ఎయిర్ టెల్ మొబైల్ నంబరే ఖాతా నంబర్ అవుతుంది. దీని ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఖాతాకైనా నగదును పంపుకోవచ్చు. ఎయిర్ టెల్ దుకాణాలకు వెళ్లి డిపాజిట్లు చేసుకోవచ్చు. నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. చెల్లింపులకు కూడా ఈ ఖాతాను వాడుకోవచ్చు. త్వరలో పేటీఎం, పోస్టల్ పేమెంట్ బ్యాంకులు కూడా వస్తున్నాయి.
ఆధార్ నంబర్ తో చెల్లింపులు
ఆధార్ నంబర్ కలిగిన వారు తమ స్మార్ట్ ఫోన్ నుంచి బయోమెట్రిక్ విధానంలో సురక్షిత మార్గంలో చెల్లింపులు చేసేయవచ్చు. ఇది త్వరలో సాకారం కానుంది. ఎలాంటి లాగిన్ ఐడీలతో పని ఉండదు. వేలి ముద్రలతోనే చెల్లింపులు చేయవచ్చు. ఇది అత్యంత సురక్షితం. అయితే, ఇందుకోసం స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండాలి. రూ.10వేల స్థాయి ఫోన్లలోనే ప్రస్తుతం ఈ సదుపాయాలు ఉన్నాయి. దీంతో అతి తక్కువ ధర కలిగిన ఫోన్లలోనూ బయోమెట్రిక్, కంటిపాపలను గుర్తించే ఐరిస్ టెక్నాలజీతో తయారు చేసేలా నిబంధనలు మార్చాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాయి. మన దేశంలో 23 కోట్ల మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేవు. పేమెంట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రాకతో బ్యాంకు సేవలు అందరికీ చేరనున్నాయి. వీటికి తోడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపులు, ఈ వ్యాలెట్లతో దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
వాస్తవాలు ఎలా ఉన్నాయి...
స్వైపింగ్ మెషిన్ల వినియోగం మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ప్రతీ పది లక్షల జనాభాకు అందుబాటులో ఉన్న స్వైపింగ్ యంత్రాలు (దుకాణాల్లో కార్డుల ద్వారా చెల్లింపులకు వీలు కల్పించే సాధనం) 690 మాత్రమే. మనలాగే ఇతర వర్థమాన దేశాలైన చైనాలో ఈ సంఖ్య 4,000. బ్రెజిల్ లో రూ.33,000గా ఉంది. అందుబాటులో ఉన్న 690 స్వైపింగ్ యంత్రాల్లోనూ 70 శాతం 15 పట్టణాల్లో ఉన్నవే. ఈ వాస్తవాలను గుర్తించిన కేంద్ర సర్కారు స్వైపింగ్ యంత్రాలపై ఎక్సైజ్ సుంకం ఎత్తివేసింది. మాస్టర్ కార్డు, వీసా సంస్థల డేటా సమాచారం ప్రకారం దేశంలో 14 లక్షల మంది వద్ద కార్డు స్వైపింగ్ యంత్రాలు ఉన్నాయి. మన దేశంలో వ్యయం, చెల్లింపుల్లో కేవలం 5 శాతమే కార్డులపై జరుగుతుండగా... అభివృద్ధి చెందిన దేశాల్లో డిజిటల్ చెల్లింపులు 50 - 60 శాతం మధ్య ఉన్నాయి. ఇక దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకు అందుబాటులో ఉన్న ఏటీఎంల సంఖ్య 2.2లక్షలు.
స్వైపింగ్ మెషిన్ల ఖరీదు రూ.4,000 నుంచి రూ.8,000 మధ్య ఉండడం, ప్రజలు ఎక్కువగా నగదు ఆధారిత చెల్లింపులనే ఇష్టపడడం డిజిటల్ చెల్లింపులకు అవరోధాలుగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి అంతే మొత్తంలో నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. ఇకపై వ్యవస్థలో నగదు లభ్యత కొంత తక్కువగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను ఆశ్రయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఈ చర్యలు డిజిటల్ చెల్లింపులను పెంచేవే. ఇక తమ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తున్నా చాలా మంది పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి వారు డిజిటల్ చెల్లింపులను ఇష్టపడరు. అలాగే, దేశంలో స్మార్ట్ ఫోన్ల సంఖ్య 25 కోట్లు. ఇవి ఖరీదుగా ఉండడం వల్ల ఇప్పటికీ సాధారణ ఫోన్లను వాడే వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ల ధరలను సైతం కనిష్ఠ స్థాయికి తీసుకురావాల్సి ఉంటుంది.