ఆన్ లైన్ పేమెంట్స్ సురక్షితంగా చేసేందుకు ఇవి ఫాలో అయిపోండి...

నోట్లు తగినంత లభించడమే గగనంలా ఉంది. క్యాష్ కరవు పరిస్థితుల్లో దేశంలో చాలా మంది కార్డులు, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. నిజానికి డిజిటల్ లావాదేవీల్లో ఎంత సౌకర్యం ఉందో... అన్ని సమస్యలూ ఉన్నాయ్. అందుకే తగిన జాగ్రత్తలు అవసరం.

మీరు  పుట్టిన సంవత్సరం, వార్షికోత్సవ తేదీ, చిన్నారుల పుట్టినతేదీ ఇవి సాధారణంగా పెట్టుకునే పిన్ నంబర్లు. కానీ, ఇవి ఇతరులకు తెలియవన్న హామీ ఉందా...? వీటికి బదులు మీరు కొన్న కళ్లద్దాల ధరో లేక ఇటీవలే కొనుగోలు చేసిన వస్తువు ధరనో పిన్ నంబర్ గా ఎందుకు పెట్టుకోరాదో ఆలోచించండి. ఇలా చేస్తే మరొకరు ఊహించేందుకు కూడా అవకాశం ఉండదు.

representative image

కంప్యూటర్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ పాతది కాకుండా కరెంట్ వర్షనే ఉపయోగించడం సురక్షితమైనది. ఎందుకంటే పాత ఓఎస్ లు వైరస్ నుంచి అంతగా రక్షణ ఇవ్వలేవు. సాఫ్ట్ వేర్ అప్ డేట్లు కూడా ఉండవు. అందుకే ప్రస్తుత వెర్షన్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ నే ఉపయోగించడం సురక్షితం. 

పాస్ వర్డ్ చాలా పకడ్బందీగా ఉండాలి. అల్ఫాబెట్స్, నంబర్లు, అల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్లు, సింబల్స్ కలబోతగా ఉంటే మరొకరు ఊహించడానికి కూడా అవకాశం ఉండదు. ఉదాహరణకు narendra కు గాను N@rendr@0* ఈ రెండో విధంగా పాస్ వర్డ్ ఖరారు చేసుకుంటే దాన్ని మరొకరు ప్రయత్నించడం సాధ్యం కాదు. ఇక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటి అన్ని కార్డులకు ఒకే పాస్ వర్డ్ ఉండడం కూడా సురక్షితం కానేకాదు. నేరస్థుడు ఒక పాస్ వర్డ్ సంపాదిస్తే మిగిలిన వాటిని కూడా చక్కబెట్టుకోగలడు. పాస్ వర్డ్, పిన్, సీవీవీ, ఎక్స్ పయిరీ తేదీ, ఓటీపీ మరొకరికి చెప్పకుండా జాగ్రత్తపడాలి. నిజానికి ఇవి మీ కళ్లులాంటివి. పొరపాటుగా మరొకరికి చెబితే కనుక కార్డులో బ్యాలన్స్ చోరీ అయిపోయే ప్రమాదం వుంది. 

వాడుతున్న సైట్ సురక్షితమేనా...? 

వాడుతున్న సైట్ సురక్షితమేనా కాదా అన్నది గుర్తించేందుకు పైన యూఆర్ఎల్ బార్ మొదట్లో పాడ్ లాక్ (తాళం గుర్తు) సింబల్ ఉందేేమో చూడాలి. అది లేకుంటే సురక్షితం కాదని అర్థం. వెబ్ సైట్ చిరునామా https:// దీనితో ప్రారంభం కావాలి. హెచ్ టీటీపీఎస్ లో ఎస్ అండే సెక్యూర్ అని అర్థం. కేవలం హెచ్ టీటీపీ మాత్రమే ఉంటే ఆ వెబ్ సైట్ సురక్షితం కాదు. ఇక మీరు లేటెస్ట్ బ్రౌజరే వాడుతున్నట్టయితే యూఆర్ఎల్ అడ్రస్ బార్ ప్రారంభంలో హెచ్ టీటీపీఎస్ వరకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. 

వెబ్ సైట్ డిజిటల్ సర్టిఫికెట్

ఆన్ లైన్ లో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు అయితే సేఫ్ డిజిటల్ సర్టిఫికెట్ ఉందేమో ముందే చెక్ చేసుకోవాలి. వెరీసైన్ అనేది ప్రముఖ ఆథెంటికేషన్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ఉంటే లావాదేవీ చేస్తున్న సైట్ సరైనదా, నకిలీదా అన్నది తెలుసుకోవచ్చు. ప్రతీ సైట్ లోనూ ఈ వివరాలు ఉంటాయి.

కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్లో యాంటీ వైరస్

జిటల్ లావాదేవీలకు పర్సనల్ కంప్యూటర్ ను వాడడం భద్రతా పరంగా నయం. యాంటీవైరస్/యాంటీ స్పైవేర్ సాఫ్ట్ వేర్, ఫైర్ వాల్ సాఫ్ట్ వేర్ లు ఇన్ స్టాల్ చేసుకోవాలి. దానివల్ల హ్యాకర్లు చొరబడకుండా రక్షణ ఉంటుంది. 

వర్చువల్ కీ బోర్డు / ఆన్ స్క్రీన్ కీ బోర్డు

ఆన్ లైన్ లో నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు అయితే బ్యాంక్ సైట్ కు కనెక్ట్ అయిన తర్వాత యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను మీ కంప్యూటర్ కీ బోర్డు ఉపయోగించి టైప్ చేయకండి. బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీలో యూజర్ ఐడీ కాలమ్ పక్కనే వర్చువల్ కీబోర్డు ఉంటుంది. మౌస్ సాయంతో అక్కడ కనిపించే లెటర్స్ ను సెలక్ట్ చేసుకోవడం అత్యంత సురక్షితం.

లాగవుట్ అయితే చాలదు...

నెట్ బ్యాంకింగ్ కానీయండి, మరో సైట్ కానీయండి ఒక్కసారి లాగవుట్ అయితే వెంటనే ఆ బ్రౌజర్ ను క్లోజ్ చేయాలి. వేరే వెబ్ సైట్ ను సందర్శించాలనుకున్నా సరే అంతకుముందు వాడిన బ్రౌజర్ ను క్లోజ్ చేసి మళ్లీ బ్రౌజర్ ను ఫ్రెష్ గా ఓపెన్ చేసుకోవడమే మంచిది. లాగవుట్ అవకుండా పొరపాటుగా బ్రౌజర్ ను క్లోజ్ చేయవద్దు.

క్లీన్ క్యాచే

బ్రౌజర్లు యూజర్ల నెట్ సర్ఫింగ్ పేజీల వివరాలను సేవ్ చేసి ఉంచుతాయి. కీ బోర్డుపై బ్యాక్ బటన్ సెలక్ట్ చేసుకుంటే వెంటనే ఆ సైట్లకు వెళ్లిపోవచ్చు. కానీ, నెట్ బ్యాంకింగ్ వినియోగం తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్రౌజర్ హిస్టరీని క్లీన్ చేసుకోవాలి. బ్రౌజర్ పాస్ వర్డులు, పేర్లను సేవ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వకండి.

స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ లోనూ నెట్ బ్యాంకింగ్, బ్యాంకు యాప్స్ వినియోగం పెరిగిపోతోంది. కనుక యాప్స్ ను అప్ డేటెడ్ గా ఉంచుకోవాలి. మొబైల్ ఫోన్ లో లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ల వంటి సున్నిత సమాచారాన్ని సేవ్ చేసుకుని ఉంచుకునేవారు ఎందరో. ఒకవేళ పోన్ పోతే సున్నిత సమాచారం వేరే వారి చేతిలో పడకుండా లాక్ చేసుకునే ఆప్షన్ ఉన్నది చూసుకోవాలి.

ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ లతో గాలం

స్కామర్లు మీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు, కార్డు వివరాలు కొల్లగొట్టే ప్రయత్నంలో ఉంటారు. ఈ మెయిల్, ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా వారు సంప్రదిస్తుంటారు. ఇటీవల డిజిటల్ నేరగాళ్లు అసలు వెబ్ సైట్లకు ఎంత మాత్రం తేడా రాకుండా అచ్చు గుద్దినట్టు నకిలీ వెబ్ సైట్లను రూపొందించి యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. యూజర్లు అసలు బదులు అది నకిలీదన్న సంగతి తెలియక లాగిన్ అయ్యేందుకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు ఇస్తుంటారు. వీటిని నేరగాళ్లు తెలుసుకుని వాటితో అసలు సైట్ లో లాగిన్ అయ్యి అంతా ఊడ్చేస్తున్నారు. కనుక వెబ్ సైట్ యూఆర్ఎల్ లింక్ లో హెచ్ టీటీపీఎస్ అని ఉందేమో చూడండి. అలా ఉంటే అవి సురక్షితం.

తెలియని సైట్ల జోలికి వెళ్లొద్దు

పైరసీ వీడియోలు, ఊరూ, పేరూ తెలియని వెబ్ సైట్లలో విహారం మానుకోండి. కొత్తగా విడుదలైన సినిమా కాపీ టోరెంట్స్ లో ఉందని డౌన్ లోడ్ చేసేయకండి. వీటి ద్వారా అత్యంత ప్రమాదకర వైరస్ లు డౌన్ లోడ్ అయిపోతాయి. లేదా సైట్ లో కనిపించే క్లిక్ అనే బటన్ ను ఓకే చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లోని కీలక సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఒకవేళ పొరపాటుగా ఏదైనా ఓకే చేయడం వల్ల ఫైల్ డౌన్ లోడ్ అయిపోతే దాన్ని రన్ చేయకండి. బదులుగా యాంటీవైరస్ స్కాన్ చేసేయండి.

representative image

వివరాలు జాగ్రత్త...

సురక్షితమైన ఏటీఎం కేంద్రాలు, పీఓఎస్ మెషిన్లు ఉన్న షాపింగ్ లలోనే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు స్వైప్ చేయడం సురక్షితం. మ్యాగ్నటిక్ స్ట్రిప్స్ తో ఉన్న కార్డులను చిప్ కార్డులకు మార్చుకోవాలి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ లలో సమాచారానికి అంత భధ్రత లేదు. అదే చిప్ ఆధారిత కార్డుకు మాత్రం చాలా వరకు రక్షణ ఉంటుంది. ఓ సారి మీ కార్డును చెక్ చేసుకోండి. ముందు భాగంలో బంగారం రంగుతో చిన్న చిప్ మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇలా చిప్ ను అమర్చిన కార్డు, మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డు కంటే అత్యంత భద్రమైనది. ఇక, వ్యాలెట్ యాప్స్ ద్వారా లావాదేవీలు చేస్తున్న సమయంలో ఓటీపీ వచ్చేలా ఉంటే అది సురక్షితంగా ఉంటుంది.  

డిజిటల్ లావాదేవీలకు చట్టమే లేదు

డిజిటల్ లావాదేవీలు చేస్తున్న సమయంలో డబ్బులను కోల్పోతే... నేరగాళ్లు మోసం చేస్తే వినియోగదారులను రక్షించే చట్టాలు దేశంలో లేవని నిపుణుల అభిప్రాయంగా ఉంది. మరీ ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి చట్టం లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. భద్రత, గోప్యతా ప్రమాణాలను ఆర్ బీఐ నిర్ణయిస్తుంటుంది. కానీ ఆర్థిక సేవలను అందించే కంపెనీలకు సంబంధించి భద్రతా ప్రమాణాలు ఐటీ చట్టంలోని సెక్షన్ 43ఏ కిందకు వస్తాయి. దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కూడా ఈ సెక్షన్ ను పాటించడం లేదని బెంగళూరుకు చెందిన ఇంటర్నెట్ అండ్ సొసైటీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. నిజానికి డిజిటల్ లావాదేవీలకు సంబంధించి సమస్య ఎదురైతే పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ కూడా లేదు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నా దానికి సమయం పడుతుందని నిపుణుల అభిప్రాయంగా ఉంది. 

representative image

లావాదేవీల సమయంలో సమస్యలు

డిజిటల్ లావాదేవీల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు మనదేశంలో ఉన్నాయి. సాంకేతిక సమస్యలే ఇవి. ఆన్ లైన్ లో డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేస్తున్న సమయంలో ఇవి ఎదురవుతూ ఉంటాయి. బ్యాంకును ఎంచుకుని పేమెంట్ గేట్ వేకి కనెక్ట్ అయిన తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది. అప్పుడు చెల్లింపు దారుడు తన మొబైల్ కు వచ్చిన ఓటీపీని పేమెంట్ పేజీలో ఎంటర్ చేసిన తర్వాత ఆ చెల్లింపు పూర్తయ్యి తిరిగి అసలు సైట్ కు రీకనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియలో పేమెంట్ గేట్ వే పేజీకి కనెక్ట్ అవకపోవడం కొన్ని సందర్భాల్లో ఎదరుయ్యే సమస్య. బ్యాక్ బటన్ సెలక్ట్ చేసినా తిరిగి వెనక్కి వెళ్లకపోవచ్చు. దీంతో తిరిగి మళ్లీ అదే ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియలో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయిపోతుంది. కానీ ఆ పేమెంట్ రిసీవర్ ను చేరదు. దీనికి సమస్య బ్యాంకు వైపు నుంచి ఉండవచ్చు. ఇలాంటి సమయాల్లో బ్యాంకుకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకు వారు సదరు లావాదేవీని పరిశీలించి సంబంధిత మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారు. ఒక్కోసారి ఈ పేమెంట్ బ్యాంకు నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అలాంటప్పుడు రిసీవర్ కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సమస్య ఉన్నా పేమెంట్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో పేజీ ఆగిపోతుంది. ఇలాంటి సమయాల్లో సహనం ఎక్కువగా ఉంటేనే డిజిటల్ లావాదేవీలను సౌకర్యంగా భావించవచ్చు. 


More Articles