ఓ జీవితానికి ఐదు తప్పనిసరి బీమాలు
బీమా పాలసీలు అంటే కొందరికీ అయిష్టత. వాటి కోసం డబ్బులు ఖర్చు చేయడం వారి దృష్టిలో వృథా. కానీ అనుకోని పరిస్థితులు ఎదురైతే... ఆర్థికంగా కష్టనష్టాల పాలు కాకుండా బీమా పాలసీలు అక్కరకు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ బీమా పాలసీలు తీసుకోవడం ఎంతో అవసరం. మరి ఏ పాలసీ తీసుకోవాలి? ఏది అనవసరం? అన్న సందేహం రావచ్చు. ఎవరైనా గానీ, తీసుకోవాల్సిన ఐదు తప్పనిసరి బీమాలు ఉన్నాయి.
జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణ, ప్రమాదం కారణంగా కలిగే అంగవైకల్యానికి బీమా, ఇల్లు, ఇంట్లోని వస్తువులకు బీమా, వాహనానికి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇవి ఎంత మొత్తానికి తీసుకోవాలి, ఎందుకన్నది చూద్దాం.
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనుకోకుండా దూరమైతే అతడిపై ఆధారపడిన వారిని ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. అందుకే ఒక వ్యక్తి లేకపోయినా, అతడి కుటుంబం కష్టాల పాలు కాకుండా, అతడి ప్రణాళిక మేరకు పిల్లల చదువులు, వివాహం సహా అన్ని బాధ్యతలు సాఫీగా పూర్తయ్యేందుకు బీమా పరిహారం అవసరం. కుటుంబంలో సంపాదించే ఓ వ్యక్తి పిల్లల చదువులకు, విశ్రాంత జీవనానికి, సొంతిల్లు, కారు కోసం ఇలా భిన్న రకాల ప్రణాళికలు వేసుకుని ప్రతీ నెలా ఎంతో కొంత కేటాయించడం సాధారణం. మరి అదే వ్యక్తి మరణిస్తే బీమా పాలసీ లేకుంటే ఇవన్నీ ఎలా సాకారం అవుతాయి. అతడి కుటుంబం ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలదో ఆలోచించండి.
ఎంత మొత్తం...?
జీవిత బీమా పాలసీ ఎంత మొత్తానికి తీసుకోవాలంటే ప్రతీ వ్యక్తి తన వార్షిక సంపాదనకు ఓ పది రెట్ల మొత్తానికి సరిపడా అన్నమాట. అతడి కుటుంబ అవసరాలను కనీసం ఓ పదేళ్ల పాటు తీర్చేలా ఉండాలి. ఇది కేవలం కుటుంబ మనుగడకు మాత్రమే. దీనికి అదనంగా అతడు ఏవైనా అప్పులు చేసి ఉంటే ఆ మొత్తాన్ని బీమాకు అదనంగా కలపాలి. ఇంకా ఇల్లు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు, అతడి జీవిత భాగస్వామి విశ్రాంత జీవితానికి కావాల్సిన మొత్తం అన్నీ కలుపుకుని బీమా పరిహారం ఎంతకు తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.
ప్రీమియం
ప్రీమియం ఎక్కువగా ఉందని వెనుకాడవద్దు. ఎందుకంటే బీమా అనేది ప్రతీ ఒక్కరికి ఎంతో ఆవశ్యకం. తన వార్షిక వేతనంలో ఒక శాతం మేర బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులకు కేటాయించవచ్చు. ఉదాహరణకు వార్షికంగా రూ.3 లక్షల వేతనం వస్తుంటే అందులో ఒక శాతం రూ.3 వేలను ప్రీమియం రూపంలో చెల్లించేందుకు కేటాయించవచ్చు.
ఏ తరహా ప్లాన్
తక్కువ ప్రీమియంలో ఎక్కువ బీమా కవరేజీ టర్మ్ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గుతుంటుంది కనుక ఏటేటా పరిహారం పెరిగే సౌకర్యమున్న ప్లాన్ తీసుకోవచ్చు. ఏక విడత ప్రీమియం చెల్లించి జీవితకాలానికి సరిపడా పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ భారీగా ఒకేసారి వచ్చి పడే పరిహారాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులది అయితే... అందుకోసం లంప్ సమ్ గా కాకుండా నెలవారీ ఇంత చొప్పున పదేళ్లపాటు పరిహారం అందించే పాలసీలు ఉన్నాయి. ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత బీమా కవరేజీని కూడా మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. గృహ రుణం తీసుకున్నా, కుటుంబ బాధ్యతలు పెరిగినా, ఇతర రుణం ఏదైనా తీసుకున్నా ఆ మేరకు కవరేజీని పెంచుకోవాలి.
వైద్య బీమా
జీవిత బీమా కంటే వైద్య బీమా ఇంకా చాలా చాలా అవసరం. ఎందుకంటే అనారోగ్యం ఎదురైతే భారీ వ్యయాన్ని భరించడం అందరికీ సాధ్యం కాదు. చిన్న అనారోగ్యానికే వేలు ఖర్చవుతున్నాయి. ఆస్పత్రిలో చేరి రెండు రోజులు ఉంటే రూ.50 వేలకు పైనే ఖర్చవుతున్నాయి. అందుకే కుటుంబ సభ్యులు అందరికీ వైద్య బీమా అందించే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. అవివాహితులు అయితే సింగిల్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది.
కుటుంబ సభ్యులు అందరికీ వైద్య బీమా కోసం ఏటా రూ.15వేల కంటే ఎక్కువ వ్యయం కాదు. రూ.60 ఏళ్ల వయసుకు మించిన వారు ఉంటే వారి కోసం విడిగా పాలసీ తీసుకోవడం ద్వారా వ్యయం తగ్గించుకోవచ్చు. పాలసీ ఏదైనా వాటికి అదనపు హంగులు అవీ, ఇవీ జోడించినవి అయితే, ప్రీమియం పెరిగిపోతుంది. వీటికి బదులు సాధారణ పాలసీలు తీసుకోవడం వల్ల అదనపు వ్యయ భారం తప్పించుకోవచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.3 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం అవుతుంది.
అయితే, సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు హాస్పిటల్ ఖర్చులన్నింటినీ చెల్లిస్తాయి. కానీ, అనుకోకుండా క్లిష్టమైన అనారోగ్యం బారిన పడితే వ్యయం బీమా కవరేజీ కంటే ఎక్కువైతే ఏంటి పరిస్థితి...? ఆలోచించండి. అప్పుడు మిగిలిన వ్యయం అంతా సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు లివర్ దెబ్బతిని దాన్ని మార్పిడి చేయాల్సి వస్తే అపరేషన్ కు రూ.10 లక్షలకు పైనే ఖర్చవుతుంది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా ఇంత కంటే ఎక్కువే అవుతుంది. అందుకే ఈ భారం వద్దనుకుంటే క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీని తప్పకుండా చేసుకోవాలి. ఈ కవరేజీని జీవిత బీమా పాలసీ లేదా వైద్య బీమా పాలసీలకు జతగా తీసుకునే వెసులుబాటు ఉంది.
ఉద్యోగులకు గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే అదనంగా రూ.2 లక్షలకు టాపప్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వైద్యానికి భారీగా వెచ్చించాల్సిన సందర్భం ఎదురైతే గ్రూప్ కవరేజీ చాలకపోతే అప్పుడు టాపప్ కవరేజీ అక్కరకు వస్తుంది.
ప్రమాద బీమా
మరణం సంభవిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పరిహారం చెల్లిస్తుంది. వైద్య బీమా అనారోగ్యం పాలైతే ఆదుకుంటుంది. మరి ప్రమాదం బారిన పడితే...? తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అంకవైకల్యానికి గురైతే...? పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మన దేశంలో నిత్యం భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పాలైనా పరిహారం చెల్లించేందుకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవసరం. పైగా ఈ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. జీవిత బీమా, వైద్య బీమా పాలసీలకు యాడాన్ కవర్ గా దీన్ని తీసుకోవచ్చు.
వాహన థర్డ్ పార్టీ కవరేజీ
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి థర్డ్ పార్టీ కవరేజీ కూడా తప్పకుండా తీసుకోవాలి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో బాధితులు పరిహారానికి వ్యాజ్యం దాఖలు చేస్తే అప్పుడు ప్రమాదానికి కారణమైన వాహనదారుడికి కష్టాలు మొదలవుతాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ ఉంటే బాధితులకు బీమా కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. బాధితులకు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ట్రై బ్యునల్ నుంచి తీర్పులు వెలువడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఓ సాధారణ వ్యక్తి ఇంత భారీ మొత్తంలో చెల్లించడం సాధ్యం కాని పని. అందుకే థర్డ్ పార్టీ కవర్ తప్పకుండా ఉండాలి.
కొంత మంది వాహనదారులు తమ వాహనం పాతది అయింది కదా ఇంకెందుకు బీమా అనుకుని పాలసీ తీసుకోరు. కానీ, బండి పాతదా, కొత్తదా? అని కాదు. కేవలం చోరీ అయితేనే పరిహారం చెల్లించే నామమాత్ర పాలసీ కాదు మోటారు వాహన బీమా అంటే. ప్రమాదంలో సొంత వాహనం దెబ్బతిన్నా, ప్రమాదంలో ఎవరికైనా హాని జరిగినా, ఎదుటి వారి వాహనం దెబ్బతిన్నా పరిహారం చెల్లించే సదుపాయం ఉంటుంది.
ప్రాపర్టీ ఇన్సూరెన్స్
రూ.60వేల మోటార్ సైకిల్ కు బీమా పాలసీ తీసుకుంటారు. మరి రూ.30 లక్షలకు పైగా విలువ చేసే ఇల్లు లేదా ఇంట్లోని వస్తువులకు బీమా ఎందుకు తీసుకోరు? ఏదైనా ప్రమాదం జరిగి ఇల్లు దెబ్బతిని, ఇంట్లోని విలువైన వస్తువులు బూడిదగా మారితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది...? నిజానికి మన దేశంలో ఇప్పటికీ చాలా మంది ఈ బీమా పాలసీని తీసుకోవడం లేదు. కేవలం 30లక్షల గృహాలకే ఈ బీమా కవరేజీ ఉంది. అనవసరం అనే భావనే ఇందుకు కారణం. వరదలు, దొంగతనాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ల కారణంగా ఇల్లు లేదా షాపు, వాటిలోని విలువైన వస్తువులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఆ సమయంలో ఆదుకునేందుకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ ఉపకరిస్తుంది. 20 లక్షల రూపాయల కవరేజీ కేవలం వెయ్యి రూపాయలకే లభిస్తుంది. కనుక ఈ పాలసీ పెద్దగా ఖర్చయ్యేది కాదు.
అయితే, ఈ పాలసీల్లో పరిమితులు కూడా ఉంటాయి. క్లెయిమ్ మొత్తంలో 5 శాతాన్ని కంపెనీలు పరిహారంగా ఇవ్వవు. ఇంట్లో ఉన్న నగదుకు కవరేజీ ఉండదు. ఆభరణాలు రూ.10వేల విలువ వరకు పరిహారం ఉంటుంది. అలా కాకుండా అన్నింటికీ పరిహారం కావాలంటే ప్రీమియం పెరుగుతుంది. అందుకే పాలసీ డాక్యుమెంట్ ను చూసి నిర్ణయం తీసుకోవాలి.
ఐదు పాలసీలకు ఖర్చెంత...?
ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి రూ.కోటి రూపాయలకు టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం వార్షికంగా కనీసం రూ.12 వేల మేర ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి రూ.5 లక్షల మేర ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కావాలంటే దీనికి సైతం వార్షికంగా రూ.12 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇక యాక్సిడెంట్ అండ్ డిజేబిలిటీ కవర్ రూ.25 లక్షలకు రూ.2,000 వరకు అవుతుంది. ఇంటికి, ఇంట్లోని వస్తువులకు రూ.60 లక్షల మేర ఇన్సూరెన్స్ కవరేజీ కావాలంటే ఏటా రూ.3 వేల ప్రీమియం ఉంటుంది. వాహనానికి థర్డ్ పార్టీ బీమా కవరేజీ అయితే వార్షికంగా రూ.300, కారు అయితే రూ.2,000 వరకు ఉండవచ్చు. అంటే వార్షికంగా సుమారు రూ.30,000. నెలకు రూ.2,500 మాత్రమే. నెలకు ఇంతెందుకు అనుకుంటే కష్టాలు ఎదురైనప్పుడు ఆర్థికంగా కుదేలు కావాల్సిన ప్రమాదం ఉంటుంది.