ఆదాయపన్ను ఆదాకు బోలెడు అవకాశాలు... ఈ సెక్షన్లపై కన్నేయండి!
ఆదాయపన్ను కట్టాల్సి వస్తే చాలా మంది మనసు అందుకు అంగీకరించదు. కష్టపడి సంపాదించిన మొత్తంలో కొంత పన్ను రూపేణా చెల్లించాలంటే కష్టంగా భావిస్తారు. కానీ, చట్ట ప్రకారం పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఆదాయపన్ను ఆదాకు బోలెడు మినహాయింపులు, వెసులుబాట్లు చట్టంలో ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే పన్ను చెల్లించకుండా లేదా కొద్ది మొత్తం మాత్రమే చెల్లించే సౌలభ్యం ఉంది.
2015-2017 ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో ఉన్న నిబంధనల మేరకు ఏటా రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. ఆపై రూ.1.50 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకునేందుకు సెక్షన్ 80సీ అవకాశం కల్పిస్తోంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కోరితే కొన్ని రకాల పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, కొన్ని రకాల వ్యయాలను కూడా దీని కింద చూపించి పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్
ప్రతీ ఉద్యోగీ భవిష్య నిధి కోసం నెలనెలా చందా చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్ణీత శాతం కట్టడంతోపాటు... కావాలంటే స్వచ్చందంగా తన వంతు అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తాలకు సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రూపంలో రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.4 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ప్రజా భవిష్య నిధి. ఉద్యోగులతోపాటు ఎవరైనా సరే స్వచ్చందంగా ఇన్వెస్ట్ చేసుకునే సాధనం ఇది. సెక్షన్ 80సీ కింద మిగిలిన లేదా ఈ ఒక్కదానిలో అయినా మొత్తం మీద రూ.1,50,000 పెట్టుబడులకు పన్ను ఉండదు.
జీవిత బీమా ప్రీమియం
జీవిత బీమా అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమైనదే. పన్ను పరిధిలో ఉన్న వారికి చాలా చాలా అవసరం. ఎందుకంటే జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకటికి మించిన పాలసీలు ఉంటే అన్నింటి ప్రీమియంను కలిపి చూపించుకోవచ్చు. తల్లిదండ్రుల జీవిత బీమాకు మీరు ప్రీమియం చెల్లిస్తే క్లెయిమ్ కు అవకాశం లేదు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)
పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న పథకాలు ఈఎల్ఎస్ఎస్ లు. ఈ పథకాల్లో పెట్టుబడులకూ సెక్షన్ 80సీ పరిమితి (రూ.1,50,000) మేరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. ఈఎల్ఎస్ఎస్ పథకాలు ఐదేళ్లకు మించిన కాలానికి రెండంకెల స్థాయిలో రాబడులను అందిస్తున్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడుల ద్వారా ఒక వైపు పన్ను మినహాయింపుతోపాటు మరోవైపు దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవచ్చు.
ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు
ఆదాయపన్ను ఆదా పథకాల్లో ఇది అత్యుత్తమమైనది. ఎందుకంటే సొంతిల్లు సమకూర్చుకోవడమే కాకుండా పన్ను పోటు లేకుండా చేసుకోవచ్చు. ఇంటి రుణం తీసుకున్న వారు... ఆ రుణంపై వడ్డీతోపాటు, అసలు కూడా కొంత కలిపి నెల నెలా సమాన వాయిదాల్లో చెల్లించాలన్న విషయం తెలిసిందే. ఉదాహరణకు రూ.10 లక్షల రుణానికి ఓ ఏడాదిలో రూ.లక్ష చెల్లించారనుకుందాం. ఈ లక్ష రూపాయల్లో వడ్డీకి కొంత, అసలుకు కొంత వెళుతుంది. రుణం అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే, రుణంపై చెల్లించే వడ్డీని సెక్షన్ 80ఈఈ, సెక్షన్ 24ల కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది.
సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకం ఆడ పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు ఉద్దేశించినది. చిన్నారులైన తమ కుమార్తెల పేరిట పొదుపు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. గరిష్ఠంగా ఇద్దరు కుమార్తెల పేరిటే ఖాతాలు తెరిచేందుకు అవకాశం. రూ.1,000 నుంచి రూ.1,50,000 వేల వరకు ఏటా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ)
దీనిపైనా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఐదేళ్ల కాలావధి గల పొదుపు పత్రాలు ఇవి. రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆరు నెలలకోసారి ఈ వడ్డీ అసలుకు కలుస్తుంటుంది. దీనిపై పన్ను ఉంటుంది. అయితే, ఈ వడ్డీని ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్లకు చెల్లించకుండా తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటారు. దాంతో సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. ఒక్క చివరి ఏడాది వడ్డీని తిరిగి ఇన్వెస్ట్ చేయరు గనుక దానిపై పన్ను ఉంటుంది.
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు
ఇన్ ఫ్రా బాండ్లగా సుపరిచితమైన వీటిలో చేసే పెట్టుబడులకూ సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు.
బ్యాంకు ఎఫ్ డీలు
బ్యాంకుల్లో చేసే ఫిక్స్ డ్ డిపాజిట్లపైనా పన్ను ప్రయోజనం ఉంటుంది. ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన టర్మ్ డిపాజిట్ అయి, ఏదేనీ షెడ్యూల్డ్ బ్యాంకులో చేసే డిపాజిట్ మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
పేరులో ఉన్నట్టే ఇది పెద్దలకు ఉద్దేశించిన పొదుపు పథకం. 60 ఏళ్లు, అంతకంటే పైబడిన వయసు గల వారు ఈ పథకం కింద ఖాతాను ప్రారంభించుకోవచ్చు. స్వచ్చందంగా లేదా ప్రత్యేకంగా రిటైర్మెంట్ తీసుకున్న వారు 55 ఏళ్లకే ఈ ఖాతాలో చేరవచ్చు. రక్షణ దళాల నుంచి రిటైర్ అయిన వారు అయితే ఎటువంటి వయసు పరిమితులు లేకుండా ఇందులో చేరిపోవచ్చు. ఈ ఖాతాలో చేసే పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. దీన్ని అసలుకు కలపకుండా చెల్లిస్తారు. ఒకవేళ ఈ వడ్డీ మొత్తాన్ని తీసుకోకపోతే... ఆ తర్వాత దానిపై వడ్డీ రాదు. పైగా ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది.
ఐదేళ్ల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం
ఇదీ బ్యాంకు డిపాజిట్ వంటిదే. ఏడాది, రెండు, మూడు, ఐదేళ్ల కాలవ్యవధి గల డిపాజిట్లు ఉన్నాయి. అయితే సెక్షన్ 80సీ కింద ఐదేళ్ల ఇన్వెస్ట్ మెంట్ పైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వడ్డీని మూడు నెలలకోసారి అసలుకు కలుపుతూ ఏడాదికోసారి చెల్లిస్తారు. వడ్డీపై పన్ను ఉంటుంది. దాన్ని వార్షికాదాయానికి కలిపి చూపించాలి.
నాబార్డ్ రూరల్ బాండ్లు
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు జారీ చేసే రూరల్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారానూ సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. పైగా వడ్డీ రేట్లు కూడా ఆశాజనకంగానే ఉంటాయి.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్)
ఇది జీవిత బీమా పథకం. జీవిత బీమా అందిస్తూనే, కొంత మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా మెరుగైన ప్రయోజనాలను అందించేందుకు ఉద్దేశించిన పథకాలు. దీని ద్వారా దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గ స్థాయిలో రాబడులను ఆశించవచ్చు. అదే సమయంలో ప్రీమియం చెల్లింపులకు పూర్తిగా పన్ను మినహాయింపు పొందవచ్చు.
ట్యూషన్ ఫీజుల చెల్లింపులు
పిల్లల ట్యూషన్ ఫీజుల రూపంలో భారీగానే ఖర్చవుతుంది. దీన్ని సెక్షన్ 80సి కింద చూపించడం ద్వారా ఆ మేరకు పన్ను మినహాయింపు అందుకోవచ్చు. డొనేషన్, డెవలప్ మెంట్ ఫీజులు కాకుండా కేవలం ట్యూషన్ ఫీజులకే ఇది వర్తిస్తుంది. అదీ స్కూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ విద్యార్థులు అయినా వర్తిస్తుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్)
ఉద్యోగులకు, సాధారణ పౌరులకు విశ్రాంత జీవితంలో ఆదాయం కోసం ఉద్దేశించిన పథకం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఈ పథకమే అమలవుతోంది. ఈ పథకంలో సాధారణ పౌరులు కూడా చేరవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని రెండు సెక్షన్ల కింద ఎన్ పీఎస్ లో పెట్టుబడులకు మొత్తం రూ.2 లక్షల వరకు పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ కింద ఈ పథకంలో పెట్టే రూ.1,50,000 పెట్టుబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికితోడు సెక్షన్ 80సీసీడీ (ఏబీ) కింద అదనంగా మరో రూ.50వేల మొత్తంపైనా మినహాయింపు ఉంటుంది.
సెక్షన్ 80సీ కింద ఓ వ్యక్తి స్థూల వార్షిక ఆదాయంలో రూ.1,50,000 వరకు పలు పథకాల్లో పెట్టుబడి ద్వారా, ఇంటి రుణానికి చేసే చెల్లింపుల ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని ఇక్కడ తెలుసుకున్నాం. చాలా మందికి వీటిలో అన్నిటిపై అవగాహన ఉండదు. అలాగే, కేవలం ఇవే కాకుండా, ఇతర సెక్షన్ల కింద ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. పైన చెప్పుకున్న రూ.1,50,000వేలకు ఇవి అదనం.
వైద్య బీమా ప్రీమియంసెక్షన్ 80డీ కింద వైద్య బీమా కోసం చెల్లించే ప్రీమియం మొత్తంపై పన్ను ఉండదు. చిన్న అనారోగ్యానికే భారీగా వ్యయమవుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ వైద్య బీమా తప్పనిసరి అయిపోయింది. వైద్య బీమాను తన పేరిట లేదా తను, తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను సైతం తీసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రీమియాన్ని నగదు రహితంగా చెల్లించాల్సి ఉంటుంది. బీమా కంపెనీ కూడా ప్రభుత్వం, ఐఆర్డీఏ ఆమోదం పొంది ఉండాలి. గరిష్టంగా రూ.60,000 వరకు ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఓ వ్యక్తి తన భార్య, పిల్లల పేరిట పాలసీ తీసుకుంటే రూ.25,000 ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రుల వైద్య బీమా కోసం కూడా ప్రీమియం చెల్లిస్తుంటే దానిపైనా 25,000 వరకు అదనంగా పన్ను ప్రయోజనం దక్కించుకోవచ్చు. ప్రీవెంటివ్ హెల్త్ చెకప్ కింద మరో 5,000పై పన్ను మినహాయింపు కోరవచ్చు.
అంగ వైకల్యం ఉన్న వారి ఆరోగ్యంపై చేసిన ఖర్చు
జీవిత భాగస్వామి, పిల్లలు, సోదరుడు, సోదరి వీరిలో ఎవరైనా తమపై ఆధారపడి ఉంటే, వారి సంరక్షణ, ఆరోగ్యం కోసం చేసిన వ్యయం రూపేణా రూ.75,000 వరకు సెక్షన్ 80డీడీ కింద మినహాయింపు చూపించుకోవచ్చు. ఇలా ఆధారపడిన వారు తీవ్ర అనారోగ్యంతో ఉంటే 1,25,000 వరకు కూడా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అయతే రిటర్నులతోపాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మానసిక వైకల్యం వీటిలో ఏ సమస్య అయినా 80శాతానికి పైగా ఎక్కువ ఉన్న వారి సంరక్షకులకే ఈ పన్ను ప్రయోజనాలు పరిమితం.
వ్యాధులపై చేసే ఖర్చుకు...
పన్ను చెల్లింపు దారుడు, తన జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరుడు, సోదరికి సంబంధించి కొన్ని వ్యాధులపై చేసిన ఖర్చుకు సెక్షన్ 80డీడీబీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. వార్షికంగా రూ.40,000 లేదా అసలు వ్యయం ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వీరిలో 60ఏళ్లు వయసు పైన ఉన్న వారికి చేసిన ఖర్చు అయితే రూ.60,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 80ఏళ్లు ఆ పైన ఉన్నవారు అయితే ఈ పరిమితం రూ.80,000కు పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా వైద్య బీమా ఉండి ఉంటే, రీయింబర్స్ మెంట్ పోను మిగిలిన మొత్తాన్ని వ్యయం కింద చూపించి పన్ను మినహాయింపు అందుకోవచ్చు.
డిమెన్షియా, డిస్టోనియా మస్కులోరమ్ డీఫర్మన్స్, మోటార్ న్యూరాన్ డిసీజ్, అటాక్సియా, చోరియా, హెమీ బాలిస్ మస్, అఫాసియా, పార్కిన్ సన్స్, మాలిగ్నంట్ కేన్సర్, ఎయిడ్స్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, హీమోఫీలియా, థలసీమియా వంటి హెమటోలాజికల్ డిజార్డర్లపై చేసే వ్యయానికే ఈ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తాయి. నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్లో వైకల్యం అయితే, కనీసం 40 శాతానికి పైగా ఉందని వైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
విద్యారుణంపైనా...
సెక్షన్ 80ఈ కింద... తన విద్య కోసం లేదా తన జీవిత భాగస్వామి, పిల్లల విద్యావసరాల కోసం రుణం తీసుకుని ఉంటే, దానిపై వడ్డీ రూపేణా చేసే చెల్లింపులకు ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనిపై పరిమితి లేదు. అంటే ఉదాహరణకు రూ.20 లక్షల విద్యా రుణం తీసుకుని ఓ ఏడాదిలో లక్షన్నర రూపాయలు వడ్డీ చెల్లించినా ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. అయితే, ఈ విద్యారుణం కేవలం ఉన్నత విద్య కోసమే తీసుకుని ఉండాలి. అంటే ఇంటర్ తర్వాత విద్యాభ్యాసం కోసం. వడ్డీ చెల్లించడం మొదలు పెట్టిన ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పాటు ఇలా మినహాయింపులు అందుకోవచ్చు.
గృహ రుణంపై వడ్డీకీ మినహాయింపే
గృహ రుణం అసలుకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుందన్నది తెలిసిందే. అయితే, ఈ రుణంపై వడ్డీ రూపంలో చెల్లించిన దానిపైనా పన్ను లేకుండా చూసుకునేందుకు సెక్షన్ 80ఈఈ అవకాశం కల్పిస్తోంది. గరిష్టంగా ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వడ్డీ చెల్లింపుపైనే ఈ మినహాయింపు లభిస్తుంది. అయితే, ఈ రుణం 2016-17 ఆర్థిక సంవత్సరంలోపే తీసుకుని ఉండాలి. రుణం మొత్తం రూ.35 లక్షలలోపే ఉండాలి. ఇంటి విలువ రూ.50 లక్షల్లోపే ఉండాలి. ఇల్లు మొత్తం కూడా ఒక్కరి పేరిటే ఉండాలనే షరతులు ఉన్నాయి.
విరాళాలతో పన్ను తగ్గించుకోవచ్చు...
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద ప్రభుత్వం నోటఫై చేసిన ఫండ్లకు విరాళాలు ఇవ్వడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ విరాళం వార్షిక మొత్తం ఆదాయంలో 10 శాతం దాటరాదు. ఆలయాలు, మసీదులు, చర్చిల నవీకరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలకు చేసే విరాళాలకూ ఈ సెక్షన్ కింద పన్ను ఉండదు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్స్ డ్రౌట్ రిలీఫ్ ఫండ్, నేషనల్ చిల్డ్రన్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్, స్వచ్చ్ భారత్ కోష్, క్లీన్ గంగా ఫండ్ మొదలైనవి.
ఇంటి అద్దె చెల్లింపులపైనా...
వేతనంలో హౌస్ రెంట్ అలవెన్స్ అందుకుంటున్న వారు దానిపై ఆదాయపన్ను మినహాయింపు పొందడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. 1. వాస్తవంగా కంపెనీ అందిస్తున్న హౌస్ రెంట్ అలవెన్స్ 2.ఇంటి యజమానికి వార్షికంగా చెల్లిస్తున్న అద్దె మొత్తంలోంచి 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం 3. బేసిక్ వేతనం+డీఏ మొత్తంలో 50 శాతం (మెట్రోల్లో నివసిస్తుంటే), నాన్ మెట్రోల్లో అయితే 40 శాతం... వీటిలో ఏది తక్కువ అయితే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న ఊరిలోనే తన పేరిట లేదా భార్య పేరిట లేదా మైనర్ పిల్లల పేరిట సొంత ఇల్లు కలిగి ఉండి, అందులో నివసిస్తుంటే ఈ వెసులుబాటు లేదు. హెచ్ ఆర్ఏ మొత్తాన్ని ఆదాయంలో భాగంగానే చూపించి శ్లాబు రేటు ప్రకారం పన్ను కట్టాలి.
హెచ్ఆర్ఏ అందుకోని వారి పరిస్థితి....?
తమ వేతనంలో ఇంటి అద్దె అలవెన్స్ అందుకోని వారు లేదా స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం వార్షిక ఆదాయంలో హెచ్ ఆర్ఏ రూపంలో మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి. బేసిక్ వేతనం, కరువు భత్యం ఈ రెండింటి మొత్తంలో 10 శాతం, వార్షిక వేతనంలో 25 శాతం, నెలకు రూ.5వేలు... ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.
విద్యా సంస్థలకు ఇచ్చే విరాళాలు
శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీ లేదా కాలేజీ (ప్రభుత్వ ఆమోదం ఉన్నవి) కు ఇచ్చే విరాళాలపై సెక్షన్ 80జీజీఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ.10వేలు దాటితే ఆ మొత్తాన్ని నగదు రహితంగా చెల్లించి ఉండాలి.
రాజకీయ పార్టీలకు విరాళాలు
సెక్షన్ 80జీజీసీ కింద ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన ఏదేనీ రాజకీయ పార్టీకి నగదు రహిత రూపంలో ఇచ్చే విరాళాలు ఎంత మొత్తమైనా ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది.
సేవింగ్స్ బ్యాంకు ఖాతా నిల్వలపై వచ్చే వడ్డీ
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు నిల్వలపై వడ్డీ ఒక ఏడాదిలో రూ.10వేల వరకు పన్ను మినహాయింపు కింద చూపించుకోవచ్చు. ఆదాయంలో భాగంగానే చూపించాలి. కానీ, సెక్షన్ 80టీటీఏ కింద ఇతర రూపంలో వచ్చిన ఆదాయంగా పేర్కొని మినహాయింపు పొందవచ్చు.
రాయల్టీ రూపంలో
ఓ రచయిత తాను రాసిన పుసక్తాన్ని ఒక పబ్లికేషన్ సంస్థ విక్రయిస్తూ అందులో కొంత మొత్తాన్ని రచయితకు రాయల్టీగా చెల్లిస్తుంది. దీన్ని సెక్షన్ 80క్యూక్యూబీ కింద ఏకమొత్తంగా వచ్చి రూ.3,00,000 మొత్తంపై లేదా విడతల వారీగా వచ్చినది అయితే... వార్షికంగా మొత్తం ఆదాయంలో 15 శాతం వరకు పన్ను మినహాయింపు ఆదాయంగా చూపించుకోవచ్చు.