కేన్సర్ వ్యాధి కాదా...? విటమిన్ బి17 లోపమా...?

కేన్సర్ ఒక భయంకరమైన, ప్రాణాంతక వ్యాధి కాదని, విటమిన్ బి17 లోపమని ఓ విధమైన వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. బి17 విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలు కేన్సర్ కు దూరంగా ఉండవచ్చన్న అధ్యయనాలూ ఉన్నాయి. ఇది నిజమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఆ నిజా నిజాలేంటో తెలుసుకుందాం.

విటమిన్ బి 17


బి1, బి2, బి6, బి12 విటమిన్లు గురించి వినే ఉంటారు... మరి బి17 ఎక్కడి నుంచి వచ్చింది...? నిజానికి విటమిన్ బి17 అంటూ ఏదీ లేదు. అమిగ్డాలిన్ నుంచి రూపొందించే లాట్రిలే అనే ఔషధానికి పెట్టిన నామం బి17. చాలా రకాల మొక్కల్లో లభించే విషపూరిత సైనోజెనిక్ గ్లైకోసైడ్ నే అమిగ్డాలిన్ గా పేర్కొంటారు. ఈ అమిగ్డాలిన్ ను మెరుగుపరిచి లాట్రిలేగా మారుస్తారు. శాస్త్రీయ నామం మాండెలో నైట్రిల్ బీటా డీ జెంటియోబయోసైడ్. దీన్నే నైట్రిలోసైడ్ గానూ భావిస్తారు. ఇది సైనేడ్ ను కలిగి ఉండే సహజ పదార్థం. ఇది శరీరానికి కావాల్సిన కనీస పోషకమేమీ కాదు. హైడ్రోజెన్ సైనేడ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా కేన్సర్ విస్తరణను అడ్డుకుంటుందని కొందరు వైద్యులు సొంతంగా పరిశోధనలు చేసి ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ దీన్ని గుర్తించలేదు.

అమెరికాలో నిషేధం

బి17 అనేది చాలా విషపూరితమైనదంటూ దీని వినియోగాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి నిషేధించింది. దీన్ని సూచించడం చట్టవిరుద్ధంగా పేర్కొంది. లాట్రిలే కేన్సర్ ను నివారిస్తుందని ఆధారాలు లేనందున దాన్ని ఔషధంగా రికమెండ్ చేసేందుకు ఎఫ్ డీఏ ఆమోదించలేదు. లాట్రిలేను కేన్సర్ చికిత్సకు సూచించడమనేది బూటకపు వైద్యానికి నిదర్శనమన్న విమర్శలు ఉన్నాయి.  

పరిశోధకులు ఏమంటున్నారు...?


బి17 విషపూరితమన్న ఎఫ్ డీఏ వాదనతో చాలా మంది వైద్యులు విభేదిస్తున్నారు. వారిలో జి.ఎడ్వర్డ్ గ్రిఫిన్ ప్రముఖుడు. ఈయన బి17 పనితీరుపై లోతైన, విస్తృత పరీక్షలు నిర్వహించి... ‘వరల్డ్ వితవుట్ కేన్సర్’ అనే ఓ పుస్తకం కూడా రాశారు. అయితే, కేన్సర్ ప్రత్యామ్నాయ చికిత్సలో లాట్రిలే ఔషధం అనేది మొదటి నుంచీ ఓ వివాదాంశంగానే ఉంది. గతేడాది మేలో బ్రిటన్ లోని ఆహార ప్రమాణాల అథారిటీ అప్రికాట్ పప్పుల విక్రయాలపై నిషేధం గురించి ఓ ప్రకటన చేసింది. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హానికరమని పేర్కొంది. దీంతో లాట్రిలే విషయంలో మరోసారి సందేహాలు పెరిగిపోయాయి.

అమిగ్డాలిన్ వేటిల్లో...

అమిగ్డాలిన్ సోయాబీన్స్, ఓరెగ్రాన్ గ్రేప్స్ సీడ్స్, స్వీట్ పొటాటో, అప్రికాట్ సీడ్స్, యాపిల్ సీడ్స్, బాదం, పీచ్ సీడ్స్, ప్లమ్ తదితర వాటిలో సహజంగా ఇది లభిస్తుంది.  

పరిశోధనలు

1972 నుంచి 1977 మధ్య అమెరికాలోని మన్ హట్టన్ లో ఉన్న స్లోన్ కెట్టరింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ కేంద్రంలో లాట్రిలేపై పరిశోధనలు జరిగాయి. ఎలుకలకు లాట్రిలే ఇచ్చి చూడగా చిన్న గడ్డల పెరుగుదల ఆగిందని... నొప్పి నుంచి ఉపశమనం లభించిందని... కనెమట్సు సుగిరా అనే శాస్త్రవేత్త ప్రకటించారు. అయితే, ఇతడి ఫలితాలను ఇదే కేంద్రంలోని మరో ముగ్గురు పరిశోధకులు గుర్తించలేదు. ఆ తర్వాత ఇదే అంశంపై పరిశోధనను మరికొందరూ కొనసాగించారు. 14 రకాల గడ్డలపై ఈ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను బెరీజు వేశారు. లాట్రేలే వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవని స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ తేల్చింది.

అయితే, లాట్రిలే ఉపయోగాలను కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఇదే కేంద్రానికి చెందిన ఓ పరిశోధకుడు అప్పట్లో ఆరోపించారు. ఆ తర్వాత అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సైతం విడిగా తగిన పరిశోధనా పత్రాలను సేకరించడం ద్వారా.... కేన్సర్ పై అమిగ్డాలిన్ కొంచెం లేదా అసలు ఎటువంటి ప్రభావం చూపలేదన్న క్లినికల్ ప్రయోగాల ఫలితాల గురించి ప్రస్తావించింది. దక్షిణ కొరియాలోని కుంగ్ హీ యూనివర్సిటీలో ఫిజియాలజీ డిపార్ట్ మెంట్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రొస్టేట్ కేన్సర్ కణాలపై అమిగ్డాలిన్ గట్టి పోరాటమే చేయగలదని తేలింది.

కేన్సర్ వ్యాధి కాదా...?representative image

అమెరికాకు చెందిన వివాదాస్పద సిద్ధాంతకర్త, రచయిత, అధ్యాపకుడు అయిన జి.ఎడ్వర్డ్ గ్రిఫిన్ వరల్డ్ వితవుట్ కేన్సర్ అనే పుస్తకాన్ని 1974లోనే రచించారు. కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదని పోషకాహార లోపమని గ్రిఫిన్ అంటారు. అమిగ్డాలిన్ ను తీసుకోవడం ద్వారా కేన్సర్ ను నివారించుకోవచ్చని చెబుతారు. రాజకీయ కారణాల వల్లే లాట్రిలే, దాని ఆరోగ్య ప్రయోజనాలను కప్పిపెట్టారన్నది ఆయన వాదన. విటమిన్ బి17తో కేన్సర్ నయం చేయవచ్చని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైనా... బయటకు రానీయలేదని గ్రిఫిన్ వాదిస్తారు.

ముగింపు...

విటమిన్ బి17 కేన్సర్ ను నివారిస్తుందని, కేన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని కొన్ని పరిశోధనల ఫలితాలు ఉన్నాయి. అదే సమయంలో విటమిన్ బి17 కేన్సర్ నిరోధిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని మరి కొందరు పరిశోధకులు వాదిస్తారు. వీటిని కాసేపు పక్కన పెడితే... కేన్సర్ చికిత్సకు డి-అమిగ్డాలిన్ రూపంలో ఉన్న విటమిన్ బి17 ను ఓ సప్లిమెంట్ లా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నది చాలా మంది వైద్యుల అభిప్రాయం. అయితే, బి17 కేన్సర్ ను ఏ విధంగా నివారించగలదు? దాని ప్రభావం ఏ మేరకు? అనే దానిపై కచ్చితమైన ప్రామాణిక అధ్యయనాలు జరగాల్సి ఉంది.    


More Articles