బైక్ బీమా మూడేళ్లకు ఓ సారే...!
వాహనం ముందుకు కదిలేందుకు ఇంధనం ఎంత అవసరమో... ఆ వాహనాన్ని నడిపేవారికీ, వాహనానికీ బీమా అంత అవసరం. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆదుకునేది బీమానే. ఒక్కసారి తీసుకుంటే చాలదు. గుర్తుంచుకుని ఏటా రెన్యువల్ చేసుకోవాలి. మర్చిపోయినా, ఆలస్యమైనా పాలసీ మనుగడలో ఉండదు. ప్రమాదం జరిగితే రూపాయి పరిహారం అందదు. ఈ సమస్యలకు పరిష్కారమే దీర్ఘకాలిక వాహన బీమా పాలసీ...
కొత్తగా ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో ఏడాది వ్యవధితో కూడిన బీమా పాలసీని షోరూమ్ వారే చేతిలో పెడతారు. ఇక ఆ తర్వాత దాన్ని ఏటా రెన్యువల్ చేయించుకోవాలి. కానీ, 75 శాతం మంది ఆ పని చేయడం లేదట. చాలా మంది మర్చిపోతున్నారు. కొద్ది మంది కూడా ట్రాఫిక్ పోలీసులతో పడలేక రెన్యువల్ చేయించుకుంటున్నవారే. భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఓ సర్వేలో పాలసీలు రెన్యువల్ చేసుకోకపోవడానికి ప్రధాన కారణాలు... ఏటా వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి రావడం, మర్చిపోవడం అని పేర్కొన్నారు. కొంత మందికి గుర్తున్నా... చేసుకునే తీరిక లేకపోవడం కూడా ఓ కారణం. 80 శాతం మంది దీర్ఘకాలిక పాలసీలు అయితే అనుకూలంగా ఉంటాయని చెప్పారు. వాహన బీమా రెన్యువల్ (పునరుద్ధరణ) ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దీనికి దీర్ఘకాల పాలసీలను జారీ చేయడం ఓ పరిష్కారమని ఐఆర్డీఏ కూడా భావించింది. దీంతో వీటి జారీకి 2014లో బీమా కంపెనీలకు అనుమతి మంజూరు చేసింది. దీర్ఘకాల పాలసీలతో ప్రయోజనాలు ఉన్నాయ్... పరిశీలించుకోవాల్సినవీ ఉన్నాయ్.
ప్రయోజనాలు
ఏటా గుర్తుంచుకుని రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. మర్చిపోవడం, సకాలంలో చేయించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల కారణంగా నష్టాల పాలు కాకుండా చూసుకోవచ్చు. దీర్ఘకాల పాలసీల్లో ఓన్ డ్యామేజ్ (ప్రకృతి విపత్తుల వల్లే వాటిల్లే నష్టం) పార్ట్ పై బీమా కంపెనీలు తగ్గింపునిస్తున్నాయి. దీర్ఘకాల పాలసీలు అయితే బీమా కంపెనీలకు కొన్ని ఖర్చులు తగ్గుతాయి. వీటిని పాలసీలపై డిస్కౌంట్ల రూపంలో ఆఫర్ చేస్తాయి. సాధారణ బీమా పాలసీల ప్రీమియాన్ని ఐఆర్డీయే ఖరారు చేస్తుంటుంది. కనుక అన్ని కంపెనీల్లోనూ ప్రీమియం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అయినప్పటికీ కంపెనీలను అడగడం ద్వారా కొంత తగ్గింపు పొందవచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ మొదటి సారి దీర్ఘకాల పాలసీ కొనుగోలు చేస్తున్న వారికి ప్రీమియంపై డిస్కౌంట్ ఇస్తోంది.
ఏటేటా పెరిగిపోయే ప్రీమియాలు
సాధారణంగా బీమా కంపెనీలు థర్డ్ పార్టీ ప్రీమియాన్ని ఏటేటా పెంచుతుంటాయి. ఈ పెంపు 10 -15 శాతం స్థాయిలో ఉంటుంది. తమకు వచ్చిన క్లెయిమ్ లు, చేసిన పరిహారం చెల్లింపుల రిస్క్ ను బట్టి ఈ ప్రీమియం ధరలను పెంచుతుంటాయి. అదే మూడేళ్ల పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే ఏటా ధరల భారం పడకుండా చూసుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్
కొన్ని కంపెనీలు దీర్ఘకాల పాలసీలపై నో క్లెయిమ్ బోనస్ ను ఎక్కువగా అందిస్తున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ అయితే మొదటి సారి ఈ తరహా పాలసీ తీసుకుంటున్న సమయంలో అంతకుముందున్న పాలసీపై నో క్లెయిమ్ బోనస్ ఎంతుంటే అంత ప్రీమియంలో తగ్గింపు ఇస్తోంది. మూడేళ్ల పాటు క్లెయిమ్స్ లేకపోతే రెన్యువల్ సమయంలో 35 శాతం వరకూ తగ్గింపు అందుకోవచ్చు.
ప్రమాదాలకు సంబంధించి ఒకసారి క్లెయిమ్ చేసినా పాలసీ రద్దయిపోదు. కేవలం వాహనం పూర్తిగా దెబ్బతిన్న సందర్భాల్లో, చోరీకి గురైతే చేసే క్లెయిమ్ తోనే పాలసీ ముగిసిపోయినట్టు. ఒకవేళ మూడేళ్ల పాలసీ తీసుకున్న తర్వాత మొదటి ఏడాదిలోనే వాహనం ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిందనుకోండి. 70 శాతానికి పైగా వాహనానికి డ్యామేజ్ జరిగితే దాన్ని టోటల్ లాస్ గా పరిగణిస్తారు. అప్పుడు పరిహారంతోపాటు మిగిలిన సంవత్సరాలకు సంబంధించి కొంత ప్రీమియాన్ని వెనక్కి ఇస్తుంది బీమా కంపెనీ. మూడేళ్ల కాలానికి తీసుకున్నా ఆ లోపు రద్దు చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన సంవత్సరాలకు సంబంధించి కొంత మేరే పరిహారం వెనక్కి వస్తుంది.
వేటికి కవరేజీ..
కేవలం థర్డ్ పార్టీ మాత్రమే కాకుండా కాంప్రహెన్సివ్ కవరేజీ లభిస్తుంది. గాయపడినా, మరణించినా, మూడో పక్ష వ్యక్తికి ఏమైనా జరిగినా, వారి ఆస్తులకు నష్టం వాటిల్లినా కవరేజీ ఉంటుంది. అగ్ని ప్రమాదం, పేలుడు, పిడుగుపాటు, అల్లర్లు, సమ్మెలు, భూకంపం, హానికారక చర్య, ఉగ్రవాదుల చర్యలు, వాహనం రోడ్డు, రైలు, జల రవాణాలో ఉన్నప్పుడు వాటిల్లే నష్టాలకు సైతం కవరేజీ ఉంటుంది.
వీటికి పరిహారం ఉండదు..
ఎలక్ట్రికల్, మెకానికల్ సమస్య వల్ల వాహనం నిలిచిపోయినా, మద్యం మత్తులో డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అనధికారిక వ్యక్తి వాహనాన్ని నడుపుతున్న సమయంలో జరిగే ప్రమాదాలకు కవరేజీ ఉండదు.
రెండు ముఖాలు
వాహన బీమా పాలసీ ప్రీమియాన్ని ఐడీవీ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వేల్యూ) ఆధారంగా కంపెనీలు నిర్ణయిస్తాయన్న విషయం తెలిసిందే. ఐడీవీ అంటే బీమాగా నిర్ణయించిన మొత్తం అని. వాహన బీమా పాలసీపై ఏటా ఐడీవీ తరుగుతూ ఉంటుంది. ఆ మేరకు ప్రీమియంలోనూ తగ్గింపు ఉంటుంది. అదే మూడేళ్ల పాలసీలపై ఐడీవీ మొదటి ఏడాది నిర్ణయించిన దానిపైనే మూడేళ్లకూ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. దీనివల్ల ప్రీమియంలో తగ్గింపును కోల్పోతారు.
ఉదాహరణకు బైక్ ఐడీవీ 40,000 అనుకుందాం. దీనిపై ప్రీమియం రూ.1,200 అనుకుందాం. మూడేళ్లూ ఇంతే మొత్తాన్ని ప్రీమియంగా రాబడతాయి. పోనీ ప్రీమియం తీసుకుంటే తీసుకున్నారు... ఐడీవీ అంతే ఉంటుందా అంటే వుండదు. రెండో ఏడాది, మూడో ఏడాది ఐడీవీ తరిగిపోతుంది. మొదటి ఏడాది క్లెయిమ్ లకు మాత్రమే రూ.40,000 వర్తిస్తుంది. రెండో ఏడాది సుమారు రూ.36,000, మూడో ఏడాది రూ.32,400 ఐడీవీగా ఉంటుంది. క్లెయిమ్ లు వస్తే ఈ మేరకే పరిహారం అందుతుంది.