మీ బైక్ లోనే ఫోన్ చార్జర్, ఎంపీ3 ప్లేయర్.. మంచి బైక్ యాక్సెసరీస్ ఇవిగో

ఎవరైనా మన బైక్ ను ముట్టుకోగానే అలారం వస్తే.. మన బైక్ లోనే మొబైల్ చార్జర్, సిగరెట్ లైటర్ సదుపాయం ఉంటే.. అందరినీ ఆకట్టుకునేలా డిజైనర్ గ్రిల్స్, లైట్ యాక్సెసరీస్ ఉంటే.. చాలా బాగుంటుంది కదా! చాలా తక్కువ ధరతోనే చిన్న చిన్న యాక్సెసరీస్ తో మన బైక్ సూపర్బ్ గా మారుతుంది తెలుసా? ఈ యాక్సెసరీస్ బైకులకు అమర్చుకుంటే... బైక్ సరికొత్తగా ఉండడమే కాదు, మనకు ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. బైకును ఎవరూ ఎత్తుకుపోలేకుండా రక్షణ కూడా ఉంటుంది.


ఇక కొన్ని యాక్సెసరీస్ అయితే భలే సరదాగా ఉంటాయి. ఇవి బైకుల యాక్సెసరీస్ లభించే దుకాణాల్లో దొరుకుతాయి. లేకుంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి షాపింగ్ వెబ్ సైట్ల నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వీటిల్లో కొన్ని విద్యుత్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు వున్నాయి. వాటి కోసం మీ బైక్ లో మంచి బ్యాటరీ ఉండేలా చూసుకుంటే చాలు. మరి అలాంటి బైక్ యాక్సెసరీస్ గురించి తెలుసుకుందామా..


మొబైల్ చార్జర్లు
ఎక్కడికైనా బయటికి వెళ్లాం. సెల్ ఫోన్ లో బ్యాటరీ డౌన్. అర్జెంట్ గా ఎవరికైనా ఫోన్ చేయాలి. లేదా పాటలు వినాలని ఉంది. ఎలా..? ఇలాంటి సమయంలో తోడ్పడేలా.. మనం ఎక్కడికి వెళ్లినా ఫోన్ చార్జింగ్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు బైక్ మొబైల్ చార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. బైక్ హ్యాండిల్ కు బిగించి.. బైక్ బ్యాటరీకి అనుసంధానం చేసి వీటిని వాడుకోవచ్చు. నాణ్యతను బట్టి కేవలం రూ.250 నుంచి రూ.1,500 వరకు ధరలో ఇవి లభిస్తున్నాయి.

సిగరెట్ లైటర్లు
సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి తోడ్పడే పరికరం బైక్ సిగరెట్ లైటర్. దీనిని బైక్ హ్యాండిల్ కు బిగించి.. బ్యాటరీకి అనుసంధానం చేసి వాడుకోవచ్చు. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది కాబట్టి నిత్యం బ్యాటరీని వినియోగించుకోదు. కానీ బ్యాటరీ పవర్ ను ఎక్కువగా వాడుకుంటుంది. బైక్ ను ఆన్ చేసి ఈ సిగరెట్ లైటర్ ను వాడుకోవడం బెటర్. నాణ్యతను బట్టి ఇవి రూ.300 నుంచి రూ.1,800 వరకు లభిస్తున్నాయి. బైక్ మొబైల్ చార్జర్, సిగరెట్ లైటర్లు కలసి ఒకే డివైజ్ గా కూడా అందుబాటులో ఉన్నాయి.

యాంటీ థెఫ్ట్ అలారం
సాధారణంగా కార్లకు ఉండే యాంటీ థెఫ్ట్ అలారంను బైక్ లకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని వల్ల మన బైక్ ను ఎవరైనా ముట్టుకుంటే, కదిలిస్తే వెంటనే అలారం మోగుతుంది. దీనిలో ఇచ్చే రిమోట్ కీతో మాత్రమే దానిని ఆఫ్ చేయవచ్చు. అంతేకాదు పార్కింగ్ ప్లేస్ లో మన బైక్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. కొన్ని యాంటీ థెఫ్ట్ అలారంలలో రిమోట్ తోనే బైక్ ఇంజన్ ను ఆన్/ఆఫ్ చేయడానికి కూడా ఏర్పాటు ఉంటుంది. ఇప్పటికే కొన్ని హైఎండ్ బైక్ లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. కొంత ఖర్చుపెడితే సాధారణ బైక్ లకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నాణ్యతను, సదుపాయాలను బట్టి రూ.600 నుంచి రూ.2,500 వరకు బైక్ యాంటీ థెఫ్ట్ అలారంలు అందుబాటులో ఉన్నాయి.

బ్లూటూత్ కాల్ రిసీవర్, హెడ్ సెట్
మీరు బైక్ నడుపుతుండగా ఎదైనా కాల్ వస్తే.. ఫోన్ చేసింది ఎవరో చూడడానికి బైక్ ఆపాల్సిన అవసరం లేదు, జేబులోంచి ఫోన్ తీయాల్సిన అవసరం కూడా లేదు. కాల్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి తోడ్పడేలా బ్లూటూత్ కాల్ రిసీవర్, హెడ్ సెట్స్ అందుబాటులో ఉన్నాయి. బైక్ హ్యాండిల్ కు అమర్చుకోగలిగిన ఈ పరికరంలో డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. దీనిని ఫోన్ కు బ్లూటూత్ ద్వారా అనుసంధానించుకోవచ్చు. ఏదైనా కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా డిస్ప్లేపై చూపిస్తుంది. అది ముఖ్యమైనది అయితే బైక్ పక్కన ఆపేసి, ఫోన్ మాట్లాడుకోవచ్చు. అప్పుడు కూడా ఫోన్ జేబులోంచి తీయాల్సిన అవసరం లేకుండా ఈ బ్లూటూత్ కాల్ రిసీవర్ హెడ్ సెట్ సహాయంతో మాట్లాడొచ్చు. అంతేకాదు ఈ డిస్ప్లేపై టైమ్ కూడా కనిపిస్తుంది. దాంతో ప్రత్యేకంగా వాచీలోనో, మొబైల్ లోనో టైమ్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

బ్లూటూత్ ఎఫ్ ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్
కారు ఉంటే ఎక్కడైనా కూడా పెద్ద ధ్వనితో పాటలు వినొచ్చు. బైక్ లో మాత్రం అలాంటి సౌకర్యం లేదని అనుకోవద్దు. కార్లలో ఉండే స్థాయిలో కాకపోయినా.. బైక్ కు అమర్చుకునేలా ఎఫ్ ఎం రేడియో కం ఎంపీ3 ప్లేయర్ అందుబాటులో ఉంది. ఒకటి రెండు పెద్ద స్పీకర్లతో ఓ మోస్తరు సౌండ్ పెట్టుకుని వినవచ్చు. ఈ పరికరానికి మెమరీ కార్డు, పెన్ డ్రైవ్ వంటివి పెట్టుకునే వీలూ ఉంటుంది. ఫోన్లు ఉండగా దీనివల్ల పెద్దగా లాభమేమిటని అనుకోవద్దు. ఫోన్ లో అయితే ధ్వని తక్కువగా వస్తుంది లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఒకరే వినవచ్చు. కానీ ఈ పరికరంతో ఓ మోస్తరు సౌండ్ తో పాటు బయటికి వినిపిస్తుంది. ఎక్కడైనా ఔట్ డోర్ వెళ్లినప్పుడు బాగా పనికొస్తుంది. అందరూ పాటలు వినవచ్చు.మొబైల్ లో అయితే బ్యాటరీ డౌన్ అవుతుందనే టెన్షన్ ఉంటుంది. అదే బైక్ బ్లూటూత్ ఎఫ్ ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్ తో ఆ ఇబ్బంది లేదు. బైక్ బ్యాటరీ డౌన్ అయితే కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. కొంత సేపటికి తిరిగి బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ బ్లూటూత్ ఎఫ్ ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్లు రూ.250 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి.

హ్యాండిల్ బార్ మౌంట్ లు
ఏదైనా పెద్ద సిటీలో ఓ కొత్త అడ్రస్ కు వెళ్లాలి. మీ ఫోన్ లో జీపీఎస్ ఆన్  చేసుకున్నారు. కానీ ప్రతి వీధి మలుపు వద్దా బైక్ ఆపి ఫోన్ తీసి చూసుకోవాలంటే కష్టం కదా. అలాంటప్పుడు మన బైక్ హ్యాండిల్ కే ఫోన్ ను అమర్చుకుని చూస్తూ వెళ్లగలిగేందుకు తోడ్పడేలా హ్యాండిల్ బార్ మౌంట్ లు లభిస్తున్నాయి. ఫోన్లు మాత్రమే కాకుండా స్పీడో మీటర్లు, జీపీఎస్ డివైజ్ లు, ఇతర పరికరాలను అమర్చుకునేలా ఇవి లభిస్తున్నాయి. వీటిలో కేవలం టైట్ గ్రిప్ ద్వారా పట్టుకునేవే గాకుండా గట్టిగా అతుక్కునేలా మ్యాగ్నెట్ (అయస్కాంతం) ఉండే తరహావి కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్, నాణ్యత, సదుపాయాలకు అనుగుణంగా రూ.150 నుంచి రూ.500 వరకు ఇవి అందుబాటులో ఉన్నాయి.

హ్యాండిల్ గ్రిప్ లైట్లు, లైట్ స్ట్రిప్ లు
  • హ్యాండిల్ బార్ చివరన ఉండే గ్రిప్ స్థానంలో మెరుస్తూ ఆకర్షించే యాక్సెసరీయే హ్యాండిల్ గ్రిప్ లైట్లు. సాయంకాలం దాటిన తర్వాత ఈ డిజైనర్ హ్యాండిల్ గ్రిప్ లైట్లను ఆన్ చేసుకుని వెళుతుంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గ్రిప్ లైట్లు పలు రకాల డిజైన్లు, రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
  • ఇక బైక్ ముందు భాగంలోగానీ, వెనుక భాగంలోగానీ కొన్ని ఎల్ఈడీలతో ఆకర్షణీయంగా కనిపించేందుకు లైట్ స్ట్రిప్ లు వినియోగించుకోవచ్చు. నాలుగైదు ఎల్ఈడీల నుంచి ఇరవై ముప్పై ఎల్ఈడీల వరకూ ఉండే లైట్ స్ట్రిప్ లు లభిస్తాయి. వివిధ రంగుల్లో, అవసరమైతే కత్తిరించుకుని అమర్చుకునేలా కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. బైక్ లోని బ్యాటరీకి అనుసంధానం చేసుకోవడం ద్వారా ఈ లైట్లను వెలిగించుకోవచ్చు. ఒక స్విచ్ ను ఆన్/ఆఫ్ చేయడం ద్వారా లైట్లను ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ గ్రిప్ లైట్లు, లైట్ స్ట్రిప్ లు వాటర్ ప్రూఫ్ కూడా. వీటి ధరలు రూ.200 నుంచి రూ.600 వరకు అందుబాటులో ఉన్నాయి.

షాడో లేజర్ లైట్
మన బైక్ వేగంగా దూసుకెళుతున్నప్పుడు వెనుకాల కొంత దూరంలో ఓ ఆకర్షణీయమైన లేజర్ లైట్ లైన్ లేదా ఏదైనా పేరు, లోగో పడుతూంటే భలేగా ఉంటుంది కదా. ఇటీవలే ఇలాంటి సరికొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని మన బైక్ వెనుకాల టెయిల్ లైట్ కిందగానీ, పైనగానీ అమర్చుకోవచ్చు. బైక్ వెళుతుండగా వెనుకాల ఒకటి రెండు మీటర్ల దూరంలో లేజర్ లైట్ ప్రొజెక్ట్ అవుతుంది. ఇది వెరైటీ ఉండడం మాత్రమే కాదు వెనుకాల వస్తున్న వాహనాలకు ముందు వాహనం వెళుతుందన్న సూచికగానూ పనిచేస్తుంది. ఈ లైట్ పడే తీరును, డిజైన్ ను, నాణ్యతను బట్టి ఇవి రూ. 500 నుంచి రూ.3,000 ధరలో లభిస్తున్నాయి.

టైర్ ఎల్ఈడీ లైట్లు
బైక్ టైర్ లో గాలిని నింపే వాల్వుకు అమర్చుకోగలిగిన చిన్న ఎల్ఈడీ లైట్లు ఇవి. చాలా తక్కువ ధరలో రూ.40 నుంచి రూ.100 వరకు లభించే ఈ ఎల్ఈడీ లైట్లలో.. బైక్ నడుపుతున్నప్పుడు వాటంతట అవే ఆన్ అయ్యేలా మోషన్ డిటెక్టర్లు ఉంటాయి. బైక్ చక్రం వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ లైట్లు వెలిగి.. కాంతి చక్రం రూపంలో అందంగా కనిపిస్తుంది. వీటిని బ్యాటరీకి అనుసంధానించవలసిన అవసరం ఉండదు. చేతి గడియారాల్లో వాడే తరహా చిన్న సైజు బ్యాటరీలు వాటిల్లో ఉంటాయి. వాటిల్లో చార్జింగ్ అయిపోయినప్పుడు కొత్తవి వేసుకుంటే సరిపోతుంది.

కొత్త తరహా హారన్లు
సాధారణంగా బైకుల్లో ఒకే తరహా ధ్వని వచ్చే హారన్లు ఉంటాయి. కానీ వేర్వేరు ధ్వనులు వచ్చేలా పలు రకాల హారన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని బ్యాటరీకి అనుసంధానించుకుని వినియోగించుకోవచ్చు. బైక్ లో సాధారణంగా హారన్ ఉండే చోటుకు ఏదో ఒక వైపున హ్యాండిల్ బార్ కు స్విచ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడల్లా సాధారణ హారన్, కొత్త తరహా హారన్ లలో దేనినైనా మోగించవచ్చు. అయితే రవాణాశాఖ నిబంధనల ప్రకారం కొన్ని రకాల హారన్ ధ్వనులను మాత్రమే అనుమతిస్తారు. ఇతర హారన్లు అయితే నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది.

డిస్క్ బ్రేక్ లాక్, ఫ్రంట్ వీల్ లాక్
మన బైక్ ను ఎవరూ ఎత్తుకుపోకుండా, కదిలించకుండా ఉండేందుకు తోడ్పడేలా డిస్క్ బ్రేక్ లాక్, ఫ్రంట్ వీల్ లాక్ లు అందుబాటులో ఉన్నాయి. చిన్నగా ఉన్నా అత్యుత్తమ రక్షణ అందించడం వీటి ప్రత్యేకత. డిస్క్ బ్రేక్ సదుపాయం ఉన్న బైకులకు డిస్క్ బ్రేక్ లాక్, లేని వాటికి ఫ్రంట్ వీల్ లాక్ తోడ్పడుతుంది
  • డిస్క్ బ్రేక్ లాక్ చాలా చిన్నగా ఉంటుంది అవసరమైతే జేబులో వేసుకుని వెళ్లొచ్చు. డిస్క్ బ్రేక్ ప్లేట్ పై ఉండే రంధ్రం గుండా చిన్న పాటి ఐరన్ లాక్ ను చొప్పించి తాళం వేయవచ్చు. తాళం చెవి లేకుండా దీనిని తీయడం చాలా కష్టం. వీటి ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి.
  • ఫ్రంట్ వీల్ లాక్ ముందటి చక్రానికి మధ్యలో అమర్చవచ్చు. చక్రం పుల్లలు లేదా అల్లాయ్ వీల్ రాడ్ ను రెండు వైపులా అడ్డుకునేలా దీనిలో ఏర్పాటు ఉంటుంది. ఈ లాక్ వేస్తే బైకును ముందుకు, వెనుకకు ఏ మాత్రం కదిలించలేరు. తాళం కూడా గట్టిగా ఉంటుంది. ఇవి రూ.200 నుంచి రూ.300 మధ్య ధరలో లభిస్తాయి.
గ్రిల్ కవర్లు
బైకు హెడ్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్లు వంటి వాటికి రక్షణగా ఉండడంతోపాటు బైక్ కు ఓ స్థాయి లుక్ ను ఇచ్చేలా గ్రిల్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఇనుముతో తయారయ్యే ఈ గ్రిల్ కవర్లు ఎన్నో రకాల డిజైన్ల ఆకారాల్లోనూ లభిస్తూ.. చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. వీటి నాణ్యత, డిజైన్, బైక్ లో ఏ చోటులో అమర్చేందుకు వీలున్నదీ వంటి అంశాల ఆధారంగా రూ.150 నుంచి రూ.2,500 వరకు ఈ గ్రిల్ కవర్లు లభిస్తాయి.

డిజైనర్ టెయిల్ లైట్, ఇండికేటర్స్
మన బైక్ అందరినీ ఆకట్టుకునేలా ఉండేందుకు డిజైనర్ టెయిల్ లైట్, డిజైనర్ ఇండికేటర్స్ ను అమర్చుకోవచ్చు. వివిధ రకాల డిజైన్లలో, వివిధ రకాల బైకులకు అమర్చగలిగేలా ఈ డిజైనర్ టెయిల్ లైట్, డిజైనర్ ఇండికేటర్స్ దొరుకుతున్నాయి. కొన్ని మోడల్స్ ను అన్ని రకాల బైకులకూ అమర్చుకోవచ్చు. వీటి ధరలు మోడల్ ను, ప్రత్యేకతను బట్టి రూ.200 నుంచి రూ.1,500 వరకు లభిస్తున్నాయి.

డిజైనర్ రేర్ వ్యూ మిర్రర్స్
అన్ని బైకులకు రేర్ వ్యూ మిర్రర్లు ఉంటాయి. వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించేందుకు తోడ్పడే ఈ మిర్రర్లలో విభిన్నమైన, ఆకర్షణీయమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బైక్ కు తగిన విధంగా సరిపోయే వాటిని ఎన్నుకుని అమర్చుకోవచ్చు. వీటి వల్ల బైకు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. డిజైన్లు, మోడల్ ను బట్టి ఈ డిజైనర్ రేర్ వ్యూ మిర్రర్లు రూ.400 నుంచి రూ.1,200 వరకు అందుబాటులో ఉన్నాయి.

హ్యాండిల్ గ్రిప్ రేర్ వ్యూ మిర్రర్లు
సాధారణంగా బైకుల్లో రేర్ వ్యూ మిర్రర్లు హ్యాండిల్ బార్ మధ్య భాగంలో అమర్చి.. హ్యాండిల్ బార్ గ్రిప్ పై వరకు ఉంటాయి. దీనివల్ల ట్రాఫిక్ లో బైక్ నడిపేటప్పుడు రేర్ వ్యూ మిర్రర్లు ఎవరికైనా తగులుతాయేమో అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ ఇబ్బందిని తొలగించడంతోపాటు కాస్త విభిన్నంగా ఉండేలా హ్యాండిల్ బార్ గ్రిప్ వద్ద అమర్చేలా రేర్ వ్యూ మిర్రర్లు లభిస్తున్నాయి. కావాలనుకుంటే రెండు వైపులా లేకుంటే ఒక వైపు ఈ మిర్రర్ ను అమర్చుకోవచ్చు. వీటి ధరలు కూడా తక్కువగానే రూ.150 నుంచి రూ.400 వరకు లభిస్తుంటాయి.

వెరైటీ బంపర్లు
బైక్ పొరపాటున కింద పడిపోతే రక్షణ కోసం బంపర్లు ఉపయోగపడతాయి. అంతేకాదు బైక్ కు ఒక మాంచి లుక్ ఇవ్వడానికి కూడా పనికొస్తాయి. మార్కెట్లో ఎన్నో డిజైన్లలో బంపర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మన బైక్ కు అందంగా ఇమిడిపోయేలా ఉన్న వాటిని ఎంచుకుని అమర్చుకోవచ్చు. వీటి కోసం కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బంపర్ల ధరలు డిజైన్లు, నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.5,000 వరకు ఉంటాయి.

డిజైనర్ సైలెన్సర్లు
బైకులు ఆకర్షణీయంగా కనబడేందుకు, బైకు నుంచి వెలువడే ధ్వని విభిన్నంగా ఉండేందుకు కొన్ని రకాల సైలెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. బైక్ మోడల్ ను, పరిమాణాన్ని బట్టి ఈ డిజైనర్ సైలెన్సర్లను అమర్చుకోవచ్చు. వీటివల్ల బైకులు మిగతా వాటితో పోల్చితే విభిన్నంగా కనిపిస్తాయి. అయితే ఇలా ఇతర సైలెన్సర్లు అమర్చడం వల్ల బైకు మైలేజీపై ప్రభావం పడుతుంది. అంతేగాకుండా వీటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డిజైనర్ సైలెన్సర్లు రూ.2,500 నుంచి రూ.12,000 వరకు లభిస్తాయి.

హీట్ ప్రొటెక్షన్ వ్రాప్స్
బైక్ నడుపుతున్నప్పుడు ఇంజన్ నుంచి విపరీతమైన వేడి వెలువడుతుంది. దాని నుంచి వెలువడే పొగను బయటకు విడుదల చేసే ఎగ్జాస్ట్ పైప్, సైలెన్సర్లు కూడా బాగా వేడెక్కుతాయి. పొరపాటున వాటిని తాకినా, చిన్న పిల్లలున్న చోట వారు ముట్టుకున్నా తీవ్రంగా గాయం కావడం ఖాయం. అందువల్ల సైలెన్సర్, ఎగ్జాస్ట్ పైప్ కు హీట్ ప్రొటెక్షన్ వ్రాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో తయారయ్యే ఈ వ్రాప్ లు చూడడానికి మందపాటి డెనిమ్ వస్త్రం తరహాలో ఉంటాయి. వీటిని సైలెన్సర్, ఎగ్జాస్ట్ పైపులకు చుట్టడం వల్ల వేడి నుంచి రక్షణతో పాటు బైక్ కూడా విభిన్నంగా కనిపిస్తుంది.

సైడ్ బాక్సులు
బైకులకు పక్కన వెనుకభాగంలో ప్రత్యేకంగా అమర్చుకోవడానికి వీలుగా బాక్సులు లభిస్తున్నాయి. చాలా కాలం నుంచీ ఇవి అందుబాటులో ఉన్నా.. ఇటీవల విభిన్న ఆకారాలు, డిజైన్లలో ఈ బ్యాగులు లభిస్తున్నాయి. ఏవైనా ఫైళ్లు, తక్కువ పరిమాణంలో ఉండే సామగ్రితో ప్రయాణాలు చేసేవారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బైకు కూడా కాస్త ఆకర్షణీయగా కూడా ఉంటుంది. ఈ బాక్సులు ప్లాస్టిక్, ఫైబర్, ప్లైవుడ్, లెదర్, డెనిమ్ తరహా గట్టి క్లాత్ తదితర తరహాలో అందుబాటులో ఉన్నాయి. అవి తయారైన మెటీరియల్ ను బట్టి రూ.500 నుంచి రూ.3,000 వరకు ఈ బాక్సులు అందుబాటులో ఉన్నాయి.

లగేజీ నెట్
ఒక్కరే ఉండి బైక్ పై ఏదైనా సామగ్రి తీసుకురావాల్సిన అవసరం పడినప్పుడు ఉపయోగపడేలా లగేజీ నెట్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా చిన్నగా ఉండి, బైకు ట్యాంకుపై ఉండే బ్యాగులో పెట్టేయగలగడం అదనపు ప్రయోజనం. వీటి ధర కూడా చాలా తక్కువ. కేవలం రూ.50 నుంచి రూ.250 వరకు ఈ లగేజీ నెట్ లు అందుబాటులో ఉన్నాయి.

స్ప్రే పాలిష్/స్క్రాచ్ రిమూవర్స్
మీ బైకు పాత దానిలా కనిపిస్తోంటే.. దానికి కొత్త దనాన్ని ఇవ్వడానికి స్ప్రే పాలిష్ లు, స్క్రాచ్ రిమూవర్లు పనికొస్తాయి. బైక్ పై గీతలు పడిన చోట స్క్రాచ్ రిమూవర్ ను ఉపయోగించడం ద్వారా అవి కనబడకుండా చేసుకోవచ్చు. స్ప్రేపాలిష్ ద్వారా మన బైకుకు కొత్త మెరుపును అందించవచ్చు. వీటిని వినియోగించే ముందు బైకునుగానీ, వాటిని ఉపయోగించే భాగాలనుగానీ షాంపూతో రుద్ది.. దుమ్ము, మరకలు వంటివేవీ లేకుండా కడిగేయాలి. ఆ తర్వాత తుడిచి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత.. ఏదైనా దుమ్ము పడి ఉంటే తొలగించేందుకు కాటన్ వస్త్రంతో తుడిచి, స్క్రాచ్ రిమూవర్ ను గానీ, స్ప్రే పాలిష్ ను గానీ ఉపయోగించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయా ఉత్పత్తులపై పేర్కొన్న విధంగా.. వాటిని అప్లై చేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. స్ప్రే పాలిష్/స్క్రాచ్ రిమూవర్ లు నాణ్యతను, పరిమాణాన్ని బట్టి రూ. 100 నుంచి లభిస్తాయి.


More Articles