సీలింగ్ ఫ్యాన్లకూ బ్లూటూత్ రిమోట్, బెడ్ లైట్.. ఫ్యాన్ కొనేముందు ఇవి తెలుసుకోండి!
మనం ఫ్యాన్ లేకుండా కొంత సేపు కూడా ఉండలేం. చివరికి చలికాలంలోనూ తక్కువ వేగంతో అయినా ఫ్యాన్ పెట్టుకోనిదే నిద్ర కూడా పట్టదు. చాలా మంది ఇళ్లలో ఏదో ఒక ఫ్యాన్ బిగించుకుంటుంటారు. వాటితో వచ్చే గాలి, కరెంటు వినియోగం వంటి అంశాలను పెద్దగా పట్టించుకోరు. కొందరు బాగా వేగంగా తిరిగే ఫ్యాన్ అయితే చాలనుకుంటారు, మరికొందరు తక్కువ ధరలో లభిస్తుందా? లేదా? అన్నది మాత్రమే చూస్తారు. ఫ్యాన్ల నుంచి వచ్చే గాలి, ధరతో పాటు వాటి నాణ్యత, కరెంటు ఖర్చును కూడా పరిశీలిస్తే.. ఎలాంటి ఫ్యాన్ తీసుకోవడం మంచిదో తెలుస్తుంది. అత్యంత తక్కువ విద్యుత్ తో బాగా గాలిని ఇచ్చే సూపర్ ఫ్యాన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. నేరుగా రిమోట్, బ్లూటూత్ రిమోట్ లతో వేగం పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివి చేయగలిగే ఫ్యాన్లూ వచ్చాయి. మరి ఆ వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
ఎలా పనిచేస్తాయి?
సీలింగ్ ఫ్యాన్లుగానీ, టేబుల్ ఫ్యాన్లుగానీ నేరుగా ఎలాంటి చల్లదనాన్నీ ఇవ్వవని అందరికీ తెలిసిందే. కానీ అవి గాలిని గదిలో అన్ని వైపులా వీచేలా చేయడంతో.. సాధారణంగా మనలోంచి నిత్యం విడుదలయ్యే వేడి చల్లబడుతుంది. అదే సమయంలో మనకు పట్టిన చెమట వెంటనే ఆరిపోతూండడంతో.. హాయి గొలిపే అనుభూతి కలుగుతుంది. అంతే తప్ప ఫ్యాన్ నేరుగా ఎలాంటి చల్లదనాన్నీ ఇవ్వదు.
ఎవరు కనిపెట్టారు?
జర్మన్-అమెరికన్ అయిన ఫిలిప్ హెచ్.డీహెల్ అనే శాస్త్రవేత్త 1882లో సీలింగ్ ఫ్యాన్లను రూపొందించారు. చిత్రమైన విషయం ఏమిటంటే అప్పటికే మోటార్లు అందుబాటులో ఉన్నాయి. అలా కుట్టు మిషన్ కోసం రూపొందించిన ఒక మోటార్ ను వినియోగించుకుని ఫిలిప్ సీలింగ్ ఫ్యాన్ ను తయారు చేయడం గమనార్హం. దాదాపు ఇదే సమయంలో అమెరికాకు చెందిన షులేర్ స్కాట్స్ వీలర్ అనే శాస్త్రవేత్త అటూ ఇటూ తిరుగుతూ గాలి వీచే టేబుల్ ఫ్యాన్ ను తయారు చేశారు.
ఎంత ప్రదేశానికి ఎంత సామర్థ్యమున్న ఫ్యాన్ అవసరం?
సాధారణంగా వేగంగా తిరిగే ఫ్యాన్ కావాలంటూ కొనుగోలు చేస్తుంటాంగానీ.. గది వైశాల్యం ఎంత ఉంటే, ఎంత పరిమాణంలోని ఫ్యాన్ అవసరమన్నది చాలా మంది పట్టించుకోరు. మరి ఎంత ప్రదేశానికి ఏ ఫ్యాన్ అవసరమో చూద్దామా..
- గది పరిమాణం 8x10 అడుగుల లోపు ఉంటే 900 మిల్లీమీటర్లు పరిమాణమున్న ఫ్యాన్ సరిపోతుంది.
- 8x10 అడుగుల నుంచి 10x10 అడుగుల లోపు ఉంటే 1,050 మిల్లీమీటర్లు పరిమాణమున్న ఫ్యాన్ కావాలి.
- గది పరిమాణం 10x10 అడుగుల నుంచి 10x12, 10x14 అడుగుల మధ్య ఉంటే 1,200 ఎంఎం ఫ్యాన్ కొనుగోలు చేయాలి.
- 10x14 నుంచి 10x16, 12x14 అడుగుల వరకు ఉంటే 1,400 ఎంఎం ఫ్యాన్ తీసుకోవాలి.
- 12x14 అడుగుల కన్నా పెద్దగా ఉన్న చోట అయితే అవసరాన్ని రెండు, అంతకుమించి ఫ్యాన్లను అమర్చుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా మనం కొన్నేళ్లుగా సీలింగ్ ఫ్యాన్లు వినియోగిస్తున్నాం. కాస్త పెద్ద పరిమాణంలో ఉండే ఈ ఫ్యాన్లలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్ లోపలి కాయిల్ స్థాయిని బట్టి అతి తక్కువగా రూ.400 నుంచి అత్యధికంగా రూ.2,000 వరకు ఈ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి.
- సాధారణ సీలింగ్ ఫ్యాన్ల విద్యుత్ వినియోగం మిగతా వాటితో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. ఇవి 1వ నంబర్ స్పీడ్ పై 13 వాట్ల నుంచి 15 వాట్ల వరకు.. 2వ నంబర్ స్పీడ్ పై 26 వాట్ల వరకు, 3వ నంబర్ పై 40 వాట్ల వరకు, 4వ నంబర్ పై 55 వాట్ల వరకు, 5వ నంబర్ టాప్ స్పీడ్ పై 80 వాట్ల వరకు విద్యుత్ వినియోగించుకుంటాయి.
- అయితే ఈ ఫ్యాన్లకు వాడే రెగ్యులేటర్ ఆధారంగా కూడా స్వల్పంగా విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
దాదాపు రెండు మూడేళ్లుగా బీఈఈ 5 స్టార్ రేటింగ్ సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఫ్యాన్లకంటే మరింతగా మెరుగుపర్చిన మోటార్లతో, విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేశారు. వివిధ కంపెనీలు ఈ 5 స్టార్ రేటెడ్ ఫ్యాన్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. వీటి ధరలు రూ.1,800 నుంచి రూ.4,500 వరకు ఉన్నాయి.
- సాధారణ సీలింగ్ ఫ్యాన్లతో పోలిస్తే 5 స్టార్ రేటెడ్ సీలింగ్ ఫ్యాన్లు దాదాపు 35% తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. ఇవి 1వ నంబర్ స్పీడ్ పై 13 వాట్ల నుంచి 15 వాట్ల వరకు విద్యుత్ తీసుకుంటాయి.
- 2వ నంబర్ స్పీడ్ పై 24 వాట్ల వరకు, 3వ నంబర్ పై 32 వాట్ల వరకు, 4వ నంబర్ పై 40 వాట్ల వరకు, 5వ నంబర్ టాప్ స్పీడ్ పై 55 వాట్ల వరకు విద్యుత్ వినియోగించుకుంటాయి.
- అయితే ఈ ఫ్యాన్లకు వాడే రెగ్యులేటర్ ఆధారంగా కూడా స్వల్పంగా విద్యుత్ వినియోగంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల సీలింగ్ ఫ్యాన్లతో పోలిస్తే అత్యుత్తమ పనితీరు కనబరిచే సూపర్ ఎఫిషియెంట్ సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటినే సూపర్ ఫ్యాన్ లుగా పిలుస్తున్నాం. వీటి ధరలు ఓ మోస్తరుగా ఎక్కువగా ఉన్నా.. వాటి పనితీరు విద్యుత్ ఆదాతో పోల్చితే ధర పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వాటి నుంచి వీచే గాలి కూడా సాధారణ ఫ్యాన్లతో సమానంగానే ఉంటుంది కూడా. మోడల్ ను, రిమోట్ సౌకర్యాన్ని బట్టి సూపర్ ఫ్యాన్లు రూ. 2,800 నుంచి రూ.5,500 వరకు లభిస్తాయి.
- సూపర్ ఫ్యాన్లు ఎంత తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయంటే.. 1వ నంబర్ స్పీడ్ పై కేవలం 3.8 వాట్ల నుంచి 5 వాట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. అంటే ఇది సెల్ ఫోన్ చార్జర్ వినియోగం కంటే కూడా తక్కువ.- 2వ నంబర్ స్పీడ్ పై 8 వాట్లు, 3వ నంబర్ పై 14 వాట్ల వరకు, 4వ నంబర్ పై 23 వాట్ల వరకు, 5వ నంబర్ టాప్ స్పీడ్ పై 36 వాట్లు విద్యుత్ వినియోగించుకుంటాయి. ఇది సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే మూడో వంతు కావడం గమనార్హం.
- సూపర్ ఫ్యాన్లకు రెగ్యులేటర్ అవసరం ఉండదు. వాటిని నేరుగా విద్యుత్ పోర్టుకు అనుసంధానం చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ తో నేరుగా ఫ్యాన్ వేగాన్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసుకోవచ్చు.
- రిమోట్ సౌకర్యం లేని తక్కువ ధరలో లభించే సూపర్ ఫ్యాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటికి మాత్రం రెగ్యులేటర్లను అమర్చుకోవాల్సి ఉంటుంది.
- సూపర్ ఫ్యాన్లకు మధ్యలో ఎల్ఈడీ లైట్ అమర్చబడి ఉంటుంది. మనం కావాలనుకున్నప్పుడు దానిని ఆన్ చేసుకుని బెడ్ లైట్ గానూ వినియోగించుకోవచ్చు.
సీలింగ్ ఫ్యాన్లలో ఉండే కాయిల్ దేనితో తయారైందనేది చాలా ముఖ్యం. కొన్నేళ్లుగా చాలా తక్కువ ధరకు సీలింగ్ ఫ్యాన్లు లభిస్తున్నాయి. వాటిలో అల్యూమినియం కాయిల్ ను వినియోగిస్తున్నారు. దానివల్ల ఫ్యాన్ నాణ్యత తక్కువగా ఉండడంతో పాటు త్వరగా చెడిపోతాయి. అవి తిరిగే సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా పేరు లేని కంపెనీలు తక్కువ ధరలో విక్రయించేందుకు ఈ తరహా ఫ్యాన్లను తయారు చేస్తుంటాయి. కాపర్ కాయిల్ ఉన్న ఫ్యాన్లు నాణ్యమైనవి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. వీటి తిరిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫ్యాన్ల ధర ఎక్కువగా ఉంటుంది. దాదాపు అన్ని పేరున్న కంపెనీలు పూర్తిగా కాపర్ కాయిల్ తోనే ఫ్యాన్లు తయారు చేస్తాయి.
కాయిల్ మందం, పరిమాణాన్ని బట్టి ఫ్యాన్ వేగం
ఫ్యాన్ లో ఉండే కాయిల్ (తీగ) మందం, ఎంత పరిమాణంలో ఉందనే దానిని బట్టి ఫ్యాన్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. కాయిల్ మందం ఎక్కువగా ఉంటే ఫ్యాన్ ఎక్కువ కాలం మన్నుతుంది. తిరిగే సామర్థ్యం కూడా బాగుంటుంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వంటి వాటితో పెద్దగా ఇబ్బంది ఉండదు.
- ఇక కాయిల్ పరిమాణం ఎక్కువగా ఉంటే ఫ్యాన్ సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. చాలా వేగంగా కూడా తిరుగుతుంది. అయితే ఇలాంటి ఫ్యాన్లు విద్యుత్ ను కూడా ఎక్కువగా వినియోగించుకుంటాయి.
- సాధారణంగా తక్కువ ధర ఉండే ఫ్యాన్లలో కాయిల్ పరిమాణం తక్కువగా ఉంటుంది, కాయిల్ మందం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి వేగంగా తిరగలేవు. విద్యుత్ సరఫరాలో తేడాలు వస్తే కాయిల్ కాలిపోతుంది.
సీలింగ్ ఫ్యాన్ ను అమర్చేటపుడుగానీ, శుభ్రం చేసేటప్పుడు, మరమ్మతు చేసేటప్పుడుగానీ దాని రెక్కల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్ రెక్కల అమరికలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్యాన్ పనితీరు దెబ్బతింటుంది. గాలి కూడా సరిగా రాదు. రెక్కలు కనీసం 12 నుంచి 15 డిగ్రీల కోణంలో వంగి ఉండాలి. సమతలంగా ఉంటే గాలి రాదు. మరీ ఎక్కువ కోణంలో వంగి ఉంటే ఫ్యాన్ మోటార్ పై భారం పడి త్వరగా పాడవుతుంది.
- ఫ్యాన్ రెక్కల్లో మిగతావన్నీ బాగుండి ఏదైనా ఒక్కటి వంగిపోయినా, సరిగా లేకున్నా కూడా ఫ్యాన్ గాలి సరిగా రాదు. ఫ్యాన్ నుంచి చప్పుడు వస్తుంది. దానిని గుర్తించి వెంటనే సరిచేయాలి. లేకుంటే ఫ్యాన్ లోని బేరింగులు దెబ్బతింటాయి. చప్పుడు మరింత ఎక్కువగా వస్తుంది.
- ఫ్యాన్ ను సీలింగ్ కు కనీసం 15 నుంచి 20 అంగుళాల దిగువన ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దగ్గరగా ఏర్పాటు చేసుకుంటే గాలి సరిగా రాదు. అంతేగాకుండా ఒకే అంతస్తున్న ఇళ్లయితే సీలింగ్ కు దగ్గరగా ఉన్న ఫ్యాన్లతో సీలింగ్ కింది వేడి గాలి గదిలోకి వీస్తుంది.
సీలింగ్ ఫ్యాన్లకు మొదట్లో సాంప్రదాయ ఎలక్ట్రిక్ రెగ్యులేటర్లు వచ్చాయి. ఐదారు అంగుళాల పొడవు, నాలుగు అంగుళాల వెడల్పుతో చిన్న పెట్టెలా ఉండేవి. కొన్నేళ్ల కింద ఇళ్లలో అమర్చుకున్న ఫ్యాన్లకు సంబంధించి ఇప్పటికీ అలాంటి రెగ్యులేటర్లు ఉన్నాయి. చాలా తక్కువ ధరలో లభించే ఈ సాంప్రదాయ రెగ్యులేటర్లు కూడా కొంత విద్యుత్ ను ఉపయోగించుకుంటాయి. అయితే వీటిలో ఫ్యాన్ వేగాన్ని తగ్గించేందుకు వాడే రెసిస్టర్లు వేడెక్కి త్వరగా దెబ్బతినడంతో ఫ్యాన్ సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అనంతరం చిన్నగా స్విచ్ బోర్డులో పట్టేలా ఉండే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రెసిస్టర్లకు బదులుగా కెపాసిటర్లు వినియోగిస్తారు. ఇవి విద్యుత్ ను వినియోగించుకోవు. ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లలో నాబ్ టైప్, స్టెప్ టైప్ అని రెండు రకాలు ఉన్నాయి.
- పాత సాంప్రదాయ రెగ్యులేటర్ లా స్విచ్ మాదిరిగా కాకుండా.. సున్నితంగా తిప్పగలిగేలా ఉండేది నాబ్ టైప్ రెగ్యులేటర్. వీటిలో ఒకటి, రెండు అంటూ స్పీడ్ సెట్టింగులేమీ ఉండవు. తిప్పిన కొద్దీ ఫ్యాన్ వేగం పెరగడం, తగ్గడం జరుగుతుంది. కానీ దీని నుంచి ఒకే తరహా కచ్చితమైన విద్యుత్ సరఫరా ఉండనందున ఫ్యాన్ వేడెక్కే అవకాశం ఉంటుంది. వీటి నుంచి స్వల్పంగా ధ్వని కూడా వస్తుంది. వీటి ధరలు రూ.80 నుంచి రూ.120 వరకు ఉంటాయి.
- ఒకటి, రెండు, మూడు అంటూ కచ్చితమైన పాయింట్స్ ఉండేలా స్విచ్ తరహాలో పని చేసేది స్టెప్ టైప్ రెగ్యులేటర్. వీటిలో ఒకే కచ్చితమైన విద్యుత్ సరఫరా ఉండడం వల్ల ఫ్యాన్ మోటార్ వేడెక్కదు. అన్నింటిలోకీ ఇది సమర్థవంతమైన రెగ్యులేటర్. వీటి ధరలు రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటాయి.
సాధారణంగా ఏసీ పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం అనవసరం అని భావిస్తుంటారు. కానీ ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. సాధారణంగా గదిలో ఏసీకి దగ్గరగా కూర్చున్నవారికి ఎక్కువ చల్లగా ఉంటుంది. దూరంగా కూర్చున్నవారికి కాస్త తక్కువ చల్లదనం అందుతుంది. అదే కాస్త పెద్ద గది అయితే ఈ తేడా మరింత ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్యాన్ వేసుకుంటే ఏసీ చల్లదనం గది నిండా సమానంగా పరుచుకుని.. గదిలో ఉన్నవారందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.
- ఏసీ ఉన్న గదిలో ఫ్యాన్ వేసుకుంటే.. ఏసీలో ఉష్ణోగ్రతను రెండు మూడు డిగ్రీలు ఎక్కువకు సరిచేసుకున్నా సౌకర్యవంతంగానే ఉంటుంది. దీనివల్ల ఏసీ విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది.
- అయితే సాధారణ టెంపరేచర్ వద్ద (అంటే బయటి ఉష్ణోగ్రతకు, గదిలో ఏసీలో సెట్ చేసిన ఉష్ణోగ్రతకు నాలుగైదు డిగ్రీలలోపే తేడా ఉంటే) మాత్రం ఏసీ ఉన్న గదిలో ఫ్యాన్ వేసుకోవడం అనవసరం. దానివల్ల ఫ్యాన్ వినియోగించుకునే విద్యుత్ వృథా అవుతుంది.
చిన్నగా ఉండి ఎక్కడికైనా తీసుకెళ్లి వినియోగించుకునేలా అందుబాటులో ఉన్నవే టేబుల్ ఫ్యాన్లు, పెడస్ట్రల్ ఫ్యాన్లు. చిన్న చిన్న గదులు, క్యాబిన్లు, సీలింగ్ ఫ్యాన్లు అమర్చుకోలేని చోట్లలో వినియోగానికి ఇవి అనుకూలం. ఏదైనా ఓ చోటుకు ప్రత్యేకంగా, ఎక్కువగా గాలి వీచాలనుకున్న సందర్భాల్లో ఉపయోగపడతాయి. వీటినే గోడకు అమర్చడానికి వీలుగా రూపొందించిన వాల్ మౌంట్ ఫ్యాన్లు అంటారు. వీటి విద్యుత్ వినియోగం మోటార్ సామర్థ్యాన్ని బట్టి 45 వాట్ల నుంచి 150 వాట్ల వరకు ఉంటుంది.