దంతాలు పచ్చబడుతున్నాయా.. కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
టీవీ యాడ్స్ లోనో, సినిమాల్లోనో సెలబ్రిటీల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది దంతాలు ఎంతో కొంత పసుపు రంగులోకి మారి కనిపిస్తుంటాయి. చాలా మంది దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణాలు, వాటి నుంచి బయటపడడం అనేది మన చేతిలోనే ఉంది. కొంచెం శ్రద్ధ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు. మరి దంతాలు ఎలా ఏర్పడుతాయి, దంతాలు, చిగుళ్లకు వచ్చే సమస్యలేమిటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం..
దంతాల నిర్మాణం ఎలా ఉంటుంది?
మన శరీరంలోనే అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి.అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్ ఎక్కువ దృఢంగా ఉంటుంది.
- ఎనామిల్ పొర కింద డెంటిన్ పొర ఉంటుంది. డెంటిన్ అంటే ఎముకల వంటి కణజాలం. ఇది కూడా దృఢంగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటుంది.
- ఈ రెండింటికన్నా లోపల సున్నితమైన కణజాలం ఉంటుంది. దీనినే పల్ప్ గా కూడా పేర్కొంటారు. దంతాలను, చిగుళ్లను కలిపి ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. దీనిలోనే రక్త నాళాలు, నాడులు ఉంటాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, పెరగడానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను రక్త నాళాలు సరఫరా చేస్తాయి.
దంతంలో మనకు పైన కనిపించే భాగాన్ని క్రౌన్ అని, చిగుళ్లలోపల ఉండే భాగాన్ని రూట్ (మూలం) అని అంటారు. ఈ క్రౌన్ మధ్య భాగం నుంచి మూలం వరకు దంతం మధ్యలో నిలువుగా కాలువలా లేదా సొరంగంలా ఉండే ప్రదేశాన్ని రూట్ కెనాల్ అంటారు. ఈ రూట్ కెనాల్ లోని సున్నిత కణజాలం (పల్ప్) ద్వారానే రక్త నాళాలు, నాడులు దంతం లోపలి వరకు అమరి ఉంటాయి.
క్యావిటీలు (పిప్పి పళ్లు) అంటే..
మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్లాక్ గా మారి.. దాని నుంచి కొన్ని రకాల యాసిడ్ (ఆమ్లాలు) లు వెలువడతాయి. ఈ యాసిడ్ ల కారణంగా దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వాటినే కావిటీలు లేదా పిప్పిపళ్లు అంటారు. ఈ కావిటీలను నిర్లక్ష్యం చేస్తే.. చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, రాలిపోవడానికి కారణమవుతాయి.
పన్ను నొప్పి ఎందుకు వస్తుంది?
దంతాలు గట్టి ఎముకలే కదా మరి నొప్పి ఎందుకు వస్తుందనే సందేహం చాలా మందికి వస్తుంది. దంతాలు ఎముకతో నిర్మితమైనా.. అత్యంత దృఢంగా ఉన్నా అవి పూర్తి స్థాయి ఎముకలు కాదు. పైన ఉండే ఎనామిల్ పొర మినహా లోపల మరో రెండు పొరల జీవ కణజాలంతో దంతాలు తయారవుతాయి. ఆ కణజాలానికి రక్త నాళాలు, నాడులు అనుసంధానమై ఉంటాయి కూడా. అయితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని క్యావిటీలు (రంధ్రాలు) ఏర్పడినప్పుడు.. ఏవైనా చల్లటి లేదా వేడి పదార్థాలు తీసుకుంటే నేరుగా డెంటిన్ పొరపై, దాని లోపల ఉన్న మెత్తని కణజాలంపై ప్రభావం పడుతుంది. దానిని నాడులు గ్రహించి, మెదడుకు సంకేతాలు పంపడంతో నొప్పి కలుగుతుంది.
రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఎందుకు?
క్యావిటీలు ఎనామిల్ పొరతోపాటు డెంటిన్ పొరకు కూడా విస్తరిస్తే.. దంతాల పరిస్థితి బాగా దెబ్బతిన్నట్లే లెక్క. దృఢమైన రెండు పొరలకు రంధ్రాలు పడడంతో లోపలి మెత్తని కణజాలం (పల్ప్)లోకి బ్యాక్టీరియా చొరబడుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్, వాపు వస్తాయి. దాని కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు, దంతం లోపలి వరకు రంధ్రాలు పడి, ఇన్ఫెక్షన్ వస్తే దంతంలో పగుళ్లు వస్తాయి. ఏదైనా ఆహారాన్ని నమిలినప్పుడు ఈ పగుళ్లు కదిలి.. చిగుళ్లు, పల్ప్ పై తీవ్ర ఒత్తిడి పడి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ కు లోనైన పల్ప్ భాగాన్ని తొలగించి, రబ్బరు వంటి పదార్థంతో నింపడమే రూట్ కెనాల్ చికిత్స అంటారు.ఇన్ఫెక్షన్ సోకిన పల్ప్ ను తొలగించడం కోసం దంతానికి పై నుంచి రంధ్రం చేస్తారు. రబ్బరు వంటి పదార్థాన్ని నింపిన అనంతరం దంతానికి దృఢమైన క్యాప్ ను ఏర్పాటు చేస్తారు.
చిగుళ్ల సమస్యలు ఎందుకు వస్తాయి?
నోటిలో పెరిగే ప్లాక్ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ల మధ్యలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చిగుళ్ల వాపు, నొప్పికి దారి తీస్తుంది. ఇక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్లాక్ బ్యాక్టీరియాను చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు బ్యాక్టీరియాకు బదులుగా చిగుళ్ల కణాలపైనా దాడి చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల వ్యాధి వస్తుంది.
- ఏదైనా ఆహారం తిన్నప్పుడు కాస్త గట్టిగా, పదునుగా ఉన్న ఆహారం గుచ్చుకుంటే చిగుళ్లకు గాయాలవుతాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది.
- చిగుళ్ల వాపు వచ్చినప్పుడు అవి దంతాలను బలంగా పట్టి ఉంచలేక వదులవుతాయి. అలాంటప్పుడు ఏదైనా నమిలితే దంతాలు కదిలి నొప్పి పుడుతుంది. చల్లటి, వేడి పదార్థాలు తీసుకుంటే చిగుళ్లు, దంతాల మధ్య ఏర్పడిన ఖాళీ నుంచి ప్రభావం చూపి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. చిగుళ్ల సమస్యలకు పలు రకాల ఔషధాలు, లోషన్లతో చికిత్స అందుబాటులో ఉంది.
మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. మనం తినే ఆహారం దగ్గరి నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా దంతాల పైపొర ఎనామిల్ తెలుపు రంగులో పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల ఉండే డెంటిన్ లేత పసుపు రంగులో ఉంటుంది. ఎనామిల్ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. సన్నగా ఉంటే పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్ మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. వీటిని ఎక్స్ ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.
- దంతాల్లోని పై పొర అయిన ఎనామిల్ పైన ఏర్పడే మరకలు, పసుపుదనాన్ని ఎక్స్ ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. ప్రధానంగా మన ఆహార అలవాట్లు, దంతాలు సరిగా శుభ్రపరచుకోకపోవడం దీనికి కారణాలు. ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి పండ్లు, రెడ్ వైన్, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలు ఎక్కువగా పసుపుబారుతాయి. దంతాలకు అంటుకుపోయే క్రోమోజెన్స్ అనే రసాయనాలు వాటిల్లో ఉండడమే దీనికి కారణం. ఇక కాఫీ, టీ, వైన్ లాంటి వాటిలో ఉండే టానిన్లు అనే రసాయనాల వల్ల కూడా ఎనామిల్ పై మరకలు ఏర్పడతాయి.
- దంతాల లోపలి భాగంలో ఏర్పడే మరకలను ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. వివిధ రకాల మందులు, అనారోగ్య కారణాల వల్ల ఇవి ఏర్పడుతాయి. పిల్లల్లో టెట్రాసైక్లిన్, డోక్సిసైక్లిన్ వంటి యాంటీ బయాటిక్స్ వినియోగించినప్పుడు వారి పళ్లు పసుపు బారుతాయి. చిగుళ్లవ్యాధికి చికిత్సలో ఇచ్చే మందులు, మొటిమలను నివారించేందుకు వాడే మందులు, రక్తపోటును నియంత్రణలో ఉంచే ఔషధాల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. ఇక తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల దంతాలు పూర్తిగా పచ్చబడతాయి.
- ఇక రెండు రకాల జన్యులోపాల కారణంగా కూడా దంతాల రంగు ప్రభావితం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాంటివారికి సంబంధించి.. దంతాలు ఏర్పడడమే మామూలు కన్నా బాగా తెల్లగా.. లేదా బాగా పసుపు రంగులో ఏర్పడతాయని తేల్చారు.
- దంతాలు దెబ్బతిన్న స్థాయిని, పరిస్థితిని బట్టి చికిత్స చేస్తారు. క్యావిటీలు ప్రారంభ దశలోనే ఉంటే ఎనామిల్ పునరుద్ధరణకు తోడ్పడేలా ఫ్లోరైడ్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్, జెల్, లిక్విడ్ రూపాల్లో దంతాలపై నేరుగా అప్లై చేసేలా.. మౌత్ వాష్ రూపంలోనూ క్యావిటీలకు చికిత్స చేస్తారు.
- క్యావిటీలు ఎక్కువగా లోతుగా ఏర్పడితే.. ఆ రంధ్రాన్ని శుభ్రపర్చి, పలు రకాల పదార్థాలతో నింపుతారు. దీనినే టూత్ ఫిల్లింగ్ లేదా రీస్టోరేషన్ అంటారు. ఇలా నింపడం కోసం దంతాల రంగులోనే ఉండే కాంపోజిట్ రెజిన్లు, పోర్సలీన్, పలు రకాల పదార్థాలతో కూడిన సిల్వర్ అమాల్గం వంటి వాటిని వినియోగిస్తారు.
- క్యావిటీలు దంతం చుట్టూ ఎక్కువగా ఏర్పడి, దంతం బలహీనపడితే.. దెబ్బతిన్న మేరకు పైపొరను తొలగించి కృత్రిమ క్యాప్ ను ఏర్పాటు చేస్తారు. దీనిని ‘క్రౌన్’ అంటారు. దీనిని బంగారం, పోర్సలీన్, రెజిన్, పోర్సలీన్-లోహ మిశ్రమం వంటి పదార్థాలతో ఏర్పాటు చేస్తారు. ఇలా బంగారం క్రౌన్ (బంగారు పన్ను)ను పెట్టించుకోవడం కొంతకాలం కింద ఫ్యాషన్ గా కూడా చలామణీ అయింది.
- దంతాలు ఏ మాత్రం పునరుద్ధరించేందుకు వీలు లేకుండా దెబ్బతింటే.. వాటిని పూర్తిగా తొలగించి, కృత్రిమ పన్నును అమర్చుతారు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు నోటి శుభ్రతకు, దంతాల రక్షణకు, బలంగా ఉండడానికి తోడ్పడతాయని పరిశోధకులు గుర్తించారు. వాటిని వినియోగిస్తే దంతాల సమస్యల నుంచి కొంత వరకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.
- బ్లాక్ టీ/ గ్రీన్ టీ: బ్లాక్ టీ (డికాక్షన్), గ్రీన్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే రసాయనాలు నోటిలో బ్యాక్టీరియా ఎదుగుదలను నియంత్రిస్తాయి. దాంతోపాటు నోటి దుర్వాసనను కూడా అరికడతాయి. రోజూ ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని బ్లాక్ టీతో నోరు పుక్కిలించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
- వెన్న(చీజ్): దంతాల మధ్య ప్లాక్ నుంచి ఉత్పత్తయ్యే యాసిడ్లు దంతాలపై ప్రభావం చూపించకుండా చీజ్ అడ్డుకుంటుందని పరిశోధకులు గుర్తించారు.
- ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష పళ్ల రుచి తియ్యగా ఉన్నా వాటిలో సుక్రోజ్ (సాధారణ చక్కెరలో ఉండే రసాయనం) ఉండదు. వీటిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కావిటీలకు, చిగుళ్ల సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సంహరిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
- క్యారెట్, యాపిల్స్, దోసకాయ: బాగా నమిలి తినాల్సిన పండ్లు, కూరగాయలు దంతాలపై ఏర్పడే ప్లాక్ ను తొలగిస్తాయి. ముఖ్యంగా క్యారెట్లు పళ్ల మధ్య సందుల్లో ఉండిపోయిన పదార్థాలను కూడా అక్కడి నుంచి తొలగిస్తాయి. దీనివల్ల దంతాలు, చిగుళ్లలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం తగ్గుతుంది.
- చక్కెర లేని బబుల్ గమ్స్: ఆహారం తీసుకున్న తర్వాత చక్కెర పదార్థాల్లేని బబుల్ గమ్ ను నమలడం ద్వారా దంతాలు దెబ్బతినకుండా రక్షించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇలా బబుల్ గమ్ నమలడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుందని.. అది బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని వారు చెబుతున్నారు.
- కాల్షియం ఎక్కువగా ఉండే చీజ్, బాదాం, ఆకు కూరలు.. ఫాస్పరస్ ఎక్కువగా ఉండే మాంసం, గుడ్లు, చేపలు వంటివాటితోపాటు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే దంతాలు, వాటిపై ఉండే ఎనామిల్ దృఢంగా మారుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆమ్లయుత ఆహారం, కూల్ డ్రింక్స్ కారణంగా దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుదని.. ఈ ఆహారం ద్వారా అది రికవరీ అవుతుందని వెల్లడిస్తున్నారు.
- ఎప్పటికప్పుడు నోటిని శుభ్రపర్చుకోవడం దంతాల సంరక్షణలో అన్నింటికన్నా ఉత్తమమైన అంశం. నోటిని శుభ్రపర్చుకోవడమంటే కేవలం బ్రషింగ్ చేయడమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత నీటితో పుక్కిలించి ఉమ్మేసే అలవాటు చేసుకుంటే దంతాలు దెబ్బతినే సమస్యను దాదాపుగా నివారించినట్లే.
- ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నా కూడా మధ్య మధ్యలో నీటితో పుక్కిలిస్తే దంతాల మధ్య బ్యాక్టీరియా పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఈ విధంగా నోటి దుర్వాసనను కూడా అరికట్టవచ్చు.
- రోజూ ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు దంతాలను బ్రష్ చేయడం వల్ల అవి దెబ్బతినకుండా ఉంటాయి.
- ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే అవి దంతాల మధ్య చేరి.. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి. అందువల్ల ఇవి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి.
- కూల్ డ్రింక్స్, యాసిడిటిక్ పదార్థాల్లోని యాసిడ్లు దంతాలను దెబ్బతీస్తాయి. అందువల్ల దంతాల సంరక్షణ కోసం అలాంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి. కూల్ డ్రింక్స్ వంటి వాటిని స్ట్రాలతో తాగడం వల్ల అవి దంతాలకు తగలకుండా జాగ్రత్తపడొచ్చు.
- దంతాలపై ఉండే ఎనామిల్ పొర మందం తగ్గిపోకుండా ఉండాలంటే శరీరానికి తగినంత ఫ్లోరైడ్ అందుతుండాలి. నోట్లో లాలాజలం ఊరుతూ ఉండాలి. ఫ్లోరైడ్ ఎనామిల్ ఏర్పడేందుకు తోడ్పడుతుంది. ఇక లాలాజలం ఎనామిల్ ను దెబ్బతీసే బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది.
- సాధారణంగా నిత్యం శుద్ధి చేసిన మంచి నీటిని తాగేవారికి ఫ్లోరైడ్ అందే అవకాశం తక్కువ. అందువల్ల వారు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను వినియోగించడం మంచిది. అయితే దీర్ఘకాలం అధిక స్థాయిలో ఫ్లోరైడ్ అందితే విపత్కర పరిణామాలు తలెత్తుతాయి. శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి.
- దంతాలు తెల్లగా అవుతాయి కదాని టూత్ వైటెనింగ్ ఉత్పత్తులు, మౌత్ వాష్ లు విపరీతంగా వాడడం మంచిదికాదు. దానివల్ల ఎనామిల్ దెబ్బతింటుంది.
- ఇక అప్పుడప్పుడూ దంత వైద్యుడిని సంప్రదించి దంతాలను పరీక్షించుకోవడం మంచిది. దానివల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రారంభ స్థాయిలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.