డీటీహెచ్, డిజిటల్ కేబుల్ కనెక్షన్లలో ఏది ఉత్తమం?... వీటి మధ్య తేడా ఏంటి?
డిజిటల్ టీవీ ప్రసారాలు నేడు రెండు రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్). రెండు కేబుల్ టీవీ. ఈ రెండింటిలో ఎక్కువ మంది వీక్షించేది కేబుల్ టీవీ ప్రసారాలనే. డిష్ టీవీ వచ్చి పదేళ్లకుపైనే అయినప్పటికీ దీని విస్తరణ అంత వేగంగా లేదు. నాణ్యమైన డిజిటల్ టెలివిజన్ ప్రసారాలు ఈ రెండు మాధ్యమాల ద్వారా సాధ్యమే అయినప్పటికీ ఎన్నో విషయాల్లో ఈ రెండింటి మధ్య భేదాలున్నాయి. అవేంటన్నది తెలుసుకుంటే ఏ సేవలు అనువైనవో తేలిగ్గా నిర్ణయించుకోవచ్చు.
డిజిటల్ కేబుల్ ప్రసారాలు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారుల్లో చాలా మంది ఇప్పటికీ సెట్ టాప్ బాక్స్ లేకుండానే కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. దీనికి ఓ ముఖ్య కారణం సెట్ టాప్ బాక్స్ ఖరీదు ఎక్కువగా ఉండడం. అదే సమయంలో డిష్ టీవీ కనెక్షన్ తీసుకోకపోవడానికి కూడా దాని ఖరీదు సెట్ టాప్ బాక్స్ ఖరీదంత ఉండడమే. కారణాలు ఏవైనా సరే డీటీహెచ్, కేబుల్ టీవీ వీటిలో ఏ సేవలు పొందాలన్నది పూర్తిగా వినియోగదారుల ఇష్టం. అయితే, వినియోగదారుడిగా ఏది తీసుకుంటే తనకు ఎక్కువ ఉపయోగకరం అనే విషయంపై తప్పక అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది ఉత్తమం? అన్న ప్రశ్న కూడా రావచ్చు. అందుకే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను పరిశీలిద్దాం.
ఆర్థికంగా ఏది లాభదాయకం?
డీటీహెచ్ కంపెనీలు మన దేశంలో ఐదుకుపైనే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీల సెట్ టాప్ బాక్స్ ల ఖరీదు సుమారు రూ.1,600 స్థాయిలో ఉంది. కేబుల్ టీవీ సెట్ టాప్ బాక్స్ ల ఖరీదు సుమారు రూ.1,200 - రూ.1,300 స్థాయిలో ఉంది. డీటీహెచ్ కనెక్షన్ ద్వారా టీవీ ప్రసారాల వీక్షణకు నెలకు కనీస చందా రూ.150 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది దక్షిణాదిలో. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే నెలవారీ కనీస ధర రూ.200. ప్రారంభ ప్యాకేజీల్లో అన్ని చానళ్లూ రావు. కానీ కేబుల్ టీవీలో సెట్ టాప్ బాక్స్ కనెక్షన్ ద్వారా దాదాపుగా అన్ని చానళ్లను వీక్షించే అవకాశం ఉంది. వీటి నెలవారీ చందా కూడా టీడీహెచ్ తరహాలో రూ.150 - రూ.200 గా ఉంది.
అంతరాయాలు
డీటీహెచ్, కేబుల్ టీవీ ఈ రెండింటిలోనూ ప్రసారాలకు మధ్య మధ్యలో అంతరాయాలు ఏర్పడవచ్చు. ఆకాశం మేఘావృతమైనా, వర్షం మొదలైనా డీటీహెచ్ సిగ్నల్స్ సెట్ టాప్ బాక్స్ ను చేరడంలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో ప్రసారాలు నిలిచిపోతాయి. డిజిటల్ కేబుల్ టీవీ కనెక్షన్ పరంగా ఈ ఇబ్బంది అయితే లేదు. కానీ, విద్యుత్ లేకపోతే మాత్రం కేబుల్ ప్రసారాలు ఆగిపోయినట్టే. విద్యుత్ పరంగా మూడు ఫేస్ లు ఉంటాయని తెలుసు. ఇందులో మీ ఇంటికి కేబుల్ కనెక్షన్ తీసుకున్న జంక్షన్ బాక్స్ ఎక్కడైతే ఉందో, ఆ ఇంట్లో లేదా ఆ ఫేస్ పరంగా విద్యుత్ పోతే మీ ఇంట్లో ప్రసారాలు రావు. మీ ప్రాంతంలో విద్యుత్ లేకపోయినా, మీ ఇంట్లో ఇన్వర్టర్ లేదా జనరేటర్ ఉంటే టీడీహెచ్ కనెక్షన్ ద్వారా నిక్షేపంగా టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కానీ, కేబుల్ టీవీ కనెక్షన్ ద్వారా ఇది సాధ్యం కాదు.
ప్యాకేజీల్లో ఎన్నో
డీటీహెచ్ ప్రసారాలకు సంబంధించి ఒకటికి మించిన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన, కావాల్సిన చానల్స్ కు తగినట్టు ప్యాకేజీని ఎంచుకోవచ్చు. బేస్ ప్యాకేజీకి అదనంగా ప్రాంతీయ చానళ్లను జోడించుకోవచ్చు. క్రికెట్ సిరీస్ మొదలైతే స్పోర్ట్స్ ప్యాకేజీని సబ్ స్క్రయిబ్ చేసుకోవచ్చు. కేబుల్ టీవీకి సంబంధించి ప్రాంతీయ ఆపరేటర్ ను బట్టి కొన్ని చానల్స్ మారిపోతుంటాయి. ఏవో కొన్ని చానళ్లకు ఓ ప్యాకేజీ కాకుండా దాదాపు చాలా చానల్స్ ను ఒకే ప్యాకేజీ కింద అందిస్తుంటారు. అయితే, ఇలా ఇచ్చే చానళ్లలోనూ తరచుగా మార్పులు జరుగుతుంటాయి. కొన్ని చానల్స్ పోయి కొత్తవి దర్శనమిస్తుంటాయి.
నాణ్యత
సేవలు ఏవైనా నాణ్యంగా ఉంటేనే వీక్షకులకు సౌకర్యం, సంతృప్తి ఉంటాయి. డీటీహెచ్ సంస్థలు అందించే సెట్ టాప్ బాక్స్ ఏడాది కాలానికి వారంటీతో వస్తాయి. ఏ విధమైన లోపాలు తలెత్తినా ఉచితంగా సేవలు లభిస్తాయి. కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా తీసుకునే సెట్ టాప్ బాక్స్ పైనా ఏడాది వారంటీ ఉంటుంది. కానీ, డీటీహెచ్ కంపెనీల నుంచి ఈ విషయంలో లభించే నాణ్యమైన సేవలు కేబుల్ టీవీ ఆపరేటర్ల నుంచి లభించడం కష్టమే. ప్రసారాల నాణ్యత వియంలో డీటీహెచ్ ముందుంటుంది. అలా అని డిజిటల్ కేబుల్ ప్రసారాలు వెనుకబడి ఉన్నట్టేమీ కాదు. అవి కూడా నాణ్యమైనవే కానీ, వీటి కంటే డీటీహెచ్ కొంచెం మెరుగు.
ఇక వినియోగదారులకు సమస్య ఎదురైతే స్పందించడంలోనూ, పరిష్కరిచడంలోనూ డీటీహెచ్ కంపెనీలే ముందుంటాయి. రోజులో 24 గంటల పాటు వారంలో అన్ని రోజులూ కస్టమర్ కేర్ ను ఫోన్ ద్వారా సంప్రదించి సేవలు పొందొచ్చు. దాదాపు ఎక్కువ శాతం ఫిర్యాదులు 24 గంటల్లోనే పరిష్కారమవుతాయి. ఈ స్పందన డీటీహెచ్ సంస్థను బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇక కేబుల్ ఆపరేటర్ల సర్వీస్ గురించి అందరికీ తెలిసిందే. ఒకటికి పది సార్లు ఫోన్ చేస్తే ఎప్పుడో గానీ వచ్చి సమస్యను సరిచేయరు. ఎక్కువ శాతం ఆపరేటర్ల పరిస్థితి ఇంతే. అక్కడక్కడా కొంత మంది నుంచి మెరుగైన సేవలు లేకపోలేదు.
ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి...
డీటీహెచ్ కనెక్షన్ అయితే, దేశవ్యాప్తంగా ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. కేబుల్ టీవీ కనెక్షన్ లో పోర్టబులిటీ లేదు. పైగా ఒక నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచుగా మారే వారు, రెండు ప్రాంతాల మధ్య తరచుగా బదిలీ అయ్యే వారికి డీటీహెచ్ కనెక్షనే అనువైనది. ఎందుకంటే ఒక నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒకే కంపెనీ ఆపరేటర్ ఉండడం లేదు. ఒక ప్రాంతంలో ఉన్న కేబుల్ ఆపరేటర్ వద్ద కనెక్షన్ తీసుకుని సెట్ టాప్ బాక్స్ తీసుకుంటే, మరో ప్రాంతంలోని ఇంటికి మారిపోతే అప్పుడు అక్కడ మరో ఆపరేటర్ ఉండుంటే సెట్ టాప్ బాక్స్ పనికిరాకుండా పోతుంది. అక్కడున్న ఆపరేటర్ నుంచి మళ్లీ సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి వెళ్లినా ఇదే పరిస్థితి. అందుకే కనెక్షన్ బదిలీ పరంగా డీటీహెచ్ అత్యంత అనువైనది.
చెల్లింపులు
డీటీహెచ్ అన్నది ప్రీపెయిడ్ సర్వీసు. రీచార్జ్ చేసుకుంటేనే సేవలు అందుతాయి. ఒకవేళ మీరు కొన్నిరోజుల పాటు ఏదైనా ఊరెళ్ల దలచుకుంటే రీచార్జ్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అదే కేబుల్ టీవీ కనెక్షన్ అయితే, మీరున్నా, లేకున్నా, ప్రసారాలు చూసినా, చూడకున్నా నెలవారీ చందా చెల్లించాల్సిందే. కాకపోతే ఏదేనీ నెలలో సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే రిక్వెస్ట్ చేస్తే మరుసటి నెలలో చెల్లించేందుకు కేబుల్ ఆపరేటర్ వద్ద అవకాశం ఉంటుంది.
చానల్స్
కేబుల్ కనెక్షన్ తో పోలిస్తే డీటీహెచ్ లోప్రాంతీయ భాషా చానల్స్ అన్నీరావు. బేసిక్ ప్యాకేజీల్లో ఎక్కువ శాతం న్యూస్ చానల్సే ఉంటాయి. వినోదంతో కూడిన ఇతర ప్రాంతీయ చానల్స్ కోసం స్పెషల్ ప్యాక్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కేబుల్ కనెక్షన్ అయితే ప్రాంతీయ భాషా చానల్స్ దాదాపు అన్నీ వస్తాయి. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రంలో నివసిస్తూ మాతృభాషా చానల్స్ చూడాలనుకుంటే అది కేవలం డీటీహెచ్ కనెక్షన్ లోనే సాధ్యం.
ప్రత్యేక సౌకర్యాలు
డీటీహెచ్ కనెక్షన్ వల్ల కొన్ని అదనపు సౌకర్యాలు పొందడానికి అవకాశం ఉంది. స్టోరేజీ సామర్థ్యంతో, హెచ్ డీ రికార్డింగ్ సదుపాయం ఉన్న సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేస్తే చాలు. టీవీలో నచ్చిన కార్యక్రమాన్నిరికార్డు చేసుకోవచ్చు. కార్యక్రమం నడుస్తున్నప్పుడు కావాలంటే వెనక్కి వెళ్లి చూడొచ్చు. ఫార్వార్డ్ చేసుకోవచ్చు. నచ్చిన కార్యక్రమం టీవీలో వస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఉండడానికి వీలు పడడం లేదు. రికార్డింగ్ ఆప్షన్ సెట్ చేస్తే చాలు దానంతట అదే రికార్డు అయిపోతుంది. ఇంకా కోరుకున్న సినిమాను డీటీహెచ్ కనెక్షన్ ద్వారా కుటుంబమంతా చూడొచ్చు. ఇందుకు కేవలం రూ.50 చెల్లిస్తే చాలు. ఇలాంటి విలువ ఆధారిత ఫీచర్లు ఇంకెన్నో ఉన్నాయి. 4కే రిజల్యూషన్ పిక్చర్ క్వాలిటీ డీటీహెచ్ లోనే సాధ్యం.
డీటీహెచ్ సేవల సంస్థలు
ఎయిర్ టెల్ డీటీహెచ్, టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్, రిలయన్స్ డిజిటల్, వీడియోకాన్ డీటీహెచ్, దూదదర్శన్ డైరెక్ట్ టు హోమ్ మొదలైనవి. కేబుల్ టీవీ పరంగా ప్రధాన బ్రాండ్లు హాత్ వే, సిటీ కేబుల్.
టెక్నాలజీ
టాటాస్కై, డిష్ టీవీలు ఎంపీీఈజీ-2 టెక్నాలజీ, వీడియోకాన్, సన్ డైరెక్ట్, రిలయన్స్, ఎయిర్ టెల్ సంస్థలు ఎంపీఈజీ-4 టెక్నాలజీని కలిగి ఉన్నాయి. వీడియోకాన్, ఎయిర్ టెల్ సంస్థలు అయితే డీవీబీ ఎస్-2 టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. మరింత ఇంటరాక్టివ్ సేవలు అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
హై డెఫినిషనల్ (హెచ్ డీ), 3డీ
వీడియోకాన్ డీటీహెచ్ ఎక్కువ సంఖ్యలో హెచ్ డీ చానల్స్ ను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ సెట్ టాప్ బాక్స్ లో 1080పీకి మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. పోటీదారులు 1080ఐ రకం సెట్ టాప్ బాక్సులు వాడుతున్నారు. ఎయిర్ టెల్, వీడియోకాన్, రిలయన్స్ డీటీహెచ్ లలో 3డీ రెడీ ఆప్షన్ కూడా ఉంది. అన్నింటిలోనూ ఎయిర్ టెల్ డీటీహెచ్ మాత్రం భవిష్యత్తు టెక్నాలజీకి సిద్ధంగా ఉన్న ఆపరేటర్. అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నది కావాలనుకుంటే ఎయిర్ టెల్ డీటీహెచ్ అనువైనది. దీనికి తోడు కస్టమర్ సర్వీసు కూడా వేగంగా ఉంటుంది. డిష్ టీవీలో ప్యాకేజీలు కొంచెం చౌక. ఎక్కువ చానల్స్ కు అవకాం ఉంది. అయితే, సర్వీసు విషయంలో నాసిరకం అన్న ఫిర్యాదులు ఉన్నాయి. సన్ డైరెక్ట్ దక్షిణాదిలో ప్రముఖ డీటీహెచ్ సంస్థ. ప్రాంతీయ భాషా చానళ్లు అన్నీ కవరయ్యే ప్యాకేజీలు ఉన్నాయి.
కేబుల్, డీటీహెచ్ కాకుండా ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) కూడా ఒకటుంది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా టెలివిజన్ ప్రసారాలు అందిస్తారు. బీఎస్ఎన్ఎల్ దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కొన్నేళ్లుగా భావిస్తున్నా ఇంత వరకు సాధ్యం కాలేదు.
సెట్ టాప్ బాక్స్ అంటే...?
ఇదో పరికరం. కేబుల్ లేదా శాటిలైట్ డిష్ ద్వారా వచ్చిన డిజిటల్ లేదా ఎన్ క్రిప్టెడ్ సిగ్నల్స్ ను కంటెంట్ గా మారుస్తుంది. దీంతో ప్రసారాల వీక్షణ సాధ్యమవుతుంది. డిష్ టీవీలకు సంబంధించి మూడు రకాల సెట్ టాప్ బాక్స్ లు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్ డీ). రెండోది హై డెఫినిషన్ (హెచ్ డీ), ఇందులోనే హై డెఫినిషన్ డిజిటల్ వీడియో రికార్డర్ అనే రకం కూడా ఉంది. నిజానికి హై డెఫినిషన్ టెలివిజన్ ఉంటేనే హెచ్ డీ సెట్ టాప్ బాక్స్ ఉపయోగం. సాధారణ సీఆర్టీ టీవీ ఉన్న వారికి ఎస్ డీ సెట్ టాప్ బాక్స్ సరిపోతుంది.
కేబుల్ టీవీకి సెట్ టాప్ బాక్స్ ఎందుకు?
సెట్ టాప్ బాక్స్ ద్వారా నాణ్యమైన ప్రసారాల వీక్షణ ఉంటుంది. దేశంలో టీవీ ప్రసారాలు డిజిటల్ రూపంలోకి ఎప్పుడో మారిపోయాయి. సెట్ టాప్ బాక్స్ లేకుండా కేబుల్ ద్వారా సిగ్నల్స్ నాణ్యత పూర్తి స్థాయిలో ఉండదు. దాంతో దృశ్యాల్లో, మాటల్లో 100 శాతం స్పష్టత ఉండదు. అదే సెట్ టాప్ బాక్స్ ఉంటే నాణ్యమైన ప్రసారాల వీక్షణకు వీలుంటుంది. దీనికితోడు సెట్ టాప్ బాక్స్ ల ద్వారా అయితే, టీవీ ఉన్న ప్రతి ఇంటి సమాచారం ప్రభుత్వానికి చేరుతుంది. చట్టవిరుద్ధంగా నడిచే చానల్స్ వీక్షణకు వీలుండదు. నిజానికి డీటీహెచ్ మాదిరిగా కేబుల్ కనెక్షన్ ద్వారానూ విలువ ఆధారిత సేవలైన వీడియో ఆన్ డిమాండ్ తదితర సేవలను అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ, కేబుల్ టీవీ ప్రొవైడర్లు ఈ తరహా సేవలు అందించడం లేదు.
2003లో డీటీహెచ్ మొదలు
దేశంలో డీటీహెచ్ సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన 1996లోరాగా, జాతీయ భద్రత విషయంలో ఆందోళనలు వినిపించడంతో అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. 2003 అక్టోబర్ 2న డిష్ టీవీ తొలిసారిగా డీటీహెచ్ ప్రసారాలను ప్రారంభించింది. దూరదర్శన్ డీడీ ఫ్రీ డిష్ సేవలు 2004 డిసెంబర్ నుంచి మొదలయ్యాయి. ఇందులో కేవలం దూరదర్శన్ చానళ్లన్నీ ఉచితంగా లభిస్తాయి.
టీవీ ప్రసారాలు ... కేబుల్-డీటీహెచ్
టీవీ ప్రసారాల్లో బ్రాడ్ కాస్ట్ సెంటర్ కీలకమైనది. చానల్ కేంద్రం నుంచి వచ్చిన సిగ్నల్స్ ను తీసుకుని వాటిని శాటిలైట్లకు పంపిస్తుంది. బ్రాడ్ కాస్ట్ సెంటర్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ను శాటిలైట్ అందుకుని వాటిని కంప్రెస్ చేసి తిరిగి ప్రసారం చేయడానికి అనువుగా మార్చి భూమిపైకి పంపుతుంది. డీటీహెచ్ సంస్థ తన వినియోగదారులకు శాటిలైట్ నుంచి సిగ్నల్స్ ను అందుకునే రిసీవర్లను అందిస్తుంది. రీసీవర్ ఈ సిగ్నల్స్ ను అందుకుని సెట్ టాప్ బాక్స్ కు పంపుతుంది. ఈ సిగ్నల్స్ ను టెలివిజన్ కు అనుగుణంగా మార్చి అందించేది సెట్ టాప్ బాక్స్.
ప్రస్తుతం దేశంలో రెండు రకాల టీవీ ప్రసార (బ్రాడ్ కాస్ట్) నెట్ వర్క్ లు ఉన్నాయి. ఒకటి టెర్రెస్ట్రియల్. రెండోది కేబుల్ అండ్ శాటిలైట్. టెర్రెస్ట్రియల్ నెట్ వర్క్ ను ప్రస్తుతం దూదదర్శన్ మాత్రమే వినియోగిస్తోంది. కేవలం యాంటెన్నా ఉంటే చాలు ఎటువంటి ఇతర కనెక్షన్లు అవసరం లేకుండా టీవీలో దూదదర్శన్ ప్రసారాలను చూడొచ్చు. గతంలో ప్రతీ ఇంట్లోనూ ఇదే ఉండేది. నేటికీ దేశంలో మూడు కోట్ల మంది వరకు టెర్రెస్ట్రియల్ సౌకర్యాన్నే అందుకుంటున్నారు.
కేబుల్ అండ్ శాటిలైట్ (సీ&ఎస్) నెట్ వర్క్ లో టీవీ చానల్ బ్రాడ్ కాస్ట్ కేంద్రం సిగ్నల్స్ ను శాటిలైట్ కు పంపిస్తుంది. శాటిలైట్ నుంచి మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎమ్ఎస్ వో) ప్రత్యేక సెట్ టాప్ బాక్స్ ల ద్వారా డౌన్ లింక్ చేసుకుంటారు. టీవీ చానల్ ఉచిత ప్రసారాలు అయితే ఎన్ కోడ్ చేయబడవు. వాటిని ఎవరైనా సరే డౌన్ లింక్ చేసుకోవచ్చు. పే చానల్స్ అయితే ఎమ్ఎస్ వో డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నిర్ణీత చార్జీలను సంబంధిత చానల్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డౌన్ లింక్ చేసుకున్న సిగ్నల్స్ ను లోకల్ కేబుల్ ఆపరేటర్లకు అనలాగ్ లేదా డిజటల్ కేబుల్ నెట్ వర్క్ ద్వారా పంపుతారు. అనలాగ్ కేబుల్ అయితే, 70-80 చానల్స్ ను మాత్రమే ప్రసారం చేయగలదు. డిజిటల్ కేబుల్ అయితే 500కు పైగా చానల్స్ ను ప్రసారం చేసే సామర్థ్యం ఉంటుంది. సెట్ టాప్ బాక్స్ లేకుంటే 80 చానల్స్ కు మించి రానిది ఇందుకే.