భారత్, అమెరికాలో జీవనం, ఉద్యోగం పరంగా ఉన్న తేడాలేమిటి...?

అమెరికాలో విద్య, ఉద్యోగం చాలా మందికి ఓ స్వప్నం. అగ్రరాజ్యంలో అత్యుత్తమ విద్య పూర్తి చేసుకుని, మంచి అవకాశం సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలనుకునేవారు కోకొల్లలు. మరి మన భారతీయ యువతీ, యువకులకు స్వప్న రాజ్యంగా మారిన అమెరికాలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయి...? అక్కడకు, మన దగ్గర పరిస్థితులకు మధ్య ఉన్న భేదాలు ఏంటో తెలుసుకోవాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. ఇందుకు సంబంధించి వివిధ ఆన్ లైన్ వేదికల్లో పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సమాచారాన్ని అందించే ప్రయత్నం ఇది.

విద్య
ముఖ్యంగా పిల్లలకు అత్యుత్తమ విద్య అందుతున్న ఉద్దేశ్యంతో ఎక్కువ మంది అమెరికాకు వస్తుంటారు. కానీ, అమెరికాలో ప్రాథమిక విద్య ఏమంత గొప్పగా ఉండదు. డిగ్రీ, పీజీ డాక్టరేట్ కోర్సుల నాణ్యత మాత్రం అత్యున్నతంగా ఉంటుంది. పైగా విద్యా వ్యయం కూడా చాలా భారీగా ఉంటుంది. అయినప్పటికీ భారత్ కంటే అమెరికాలోని ప్రభుత్వ స్కూళ్లు మెరుగ్గా ఉంటాయి. భారత్ లోనూ ఉన్నత విద్య పరంగా క్రమంగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. యూనివర్సిటీలు పరిశోధనపై మరింత వ్యయం, శ్రద్ధ పెడుతున్నాయి. ప్రముఖ ప్రొఫెసర్లు తిరిగి భారతీయ యూనివర్సిటీల్లో చేరిపోతున్నారు. కొంత కాలానికి పరిస్థితులు చాలా మెరుగయ్యే అవకాశం ఉంది. భారత్ లో విద్య ఎక్కువగా పుస్తక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో ప్రాక్టికల్ అంశాలపై ఉంటుంది.

అమెరికాలో...
టీచర్ పాఠాలు చెప్పేందుకు స్టేట్ సర్టిఫికెట్ కలిగి ఉండడం తప్పనిసరి. 20 నుంచి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ తప్పకుండా ఉండాలి. క్రీడలు, ఇతర అంశాలకూ ప్రాధాన్యత ఉంటుంది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు సాధారణ స్థాయిలో ఉండవు.  ప్రతీ విద్యార్థి ప్రాథమిక విద్య పూర్తి చేసేందుకు వీలుగా పాఠ్యాంశాలను సులభంగా తీర్చిదిద్దుతారు. మ్యాథ్స్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్. పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధనపై దృష్టి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లు చక్కని సదుపాయాలతో మెరుగైన నిర్వహణ ఉంటుంది. దిగువ తరగతుల విద్యార్థులకు ఎటువంటి అధికారిక పరీక్షలు ఉండవు. ఉన్నత తరగతుల విద్యార్థులకే పరీక్షలు ఉంటాయి. విద్యార్థులు ఎక్కువగా పుస్తకాలు తీసుకెళ్లే పని ఉండదు.

భారత్ లో
బ్యాచిలర్స్ లేదా మాస్టర్ డిగ్రీ అయిన తర్వాత ప్రాథమిక విద్యార్థులకు పాఠాలు చెప్పొచ్చు. తరగతికి 50 మంది విద్యార్థులు కూడా ఉంటారు. పాఠ్యాంశాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. క్రీడలు, ఇతర అంశాలనేవి విద్యార్థులు ఆసక్తి ఉంటే నేర్చుకునేవి మాత్రమే. మ్యాథ్స్ పదో తరగతి వరకు తప్పనిసరి సబ్జెక్ట్. దిగువ తరగతుల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా ఉన్నత తరగతుల్లో పాఠ్యాంశాల రూపకల్పన ఉంటుంది. చదవడం, గుర్తుంచుకోవడంపైనే దృష్టి. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ అంత బావుండదు. పుస్తకాల బ్యాగులు బియ్యం బస్తాల మాదిరిగా ఉంటాయి.

చిన్నారుల సంరక్షణ
భారత్ లో మహిళ గర్భం దాలిస్తే ఆమెను చూసుకునేందుకు తల్లీ, తండ్రీ లేదా భర్త తరఫువారు ఉంటారు. అదే అమెరికాలో అయితే, ఇందు కోసం ఓ సంరక్షకురాలిని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు చాలా  ఖర్చు అవుతుంది.

జాతి వివక్ష
అమెరికాలో జాతి వివక్ష ఉంది. తమ ఉద్యోగాలను భారతీయులు తన్నుకుపోతున్నారన్న ఆగ్రహం వారిలో ఉంది. డౌన్ టౌన్ ప్రాంతంలో నీగ్రోలు, నల్లజాతీయుల చేతిలో దాడికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పని ప్రదేశాల్లోనూ వివక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బయటి ఆహారం
అమెరికాలో హోటళ్లలో పరిశుభ్రమైన ఆహారం లభిస్తుంది. బయట తిన్నా ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఖర్చు అధికం. బయట ఖర్చు భరించలేని వారు ఇంట్లో చేసుకుంటారు.

పనివారు, చార్జీలు ఎంతో ఎక్కువ
అమెరికాలో కార్మికుల భత్యాలు ఎక్కువగా ఉంటాయి. ఓ డ్రైవర్ ను పెట్టుకోవాలన్నా, ఓ పనిమనిషిని పెట్టుకున్నా బాగానే ఖర్చు భరించాల్సి ఉంటుంది. భారత్ లో సాధారణ మధ్యతరగతి ఇళ్లల్లోనూ పనిమనుషులు కనిపిస్తారు. కానీ అమెరికాలో చాలా మంది తమ పనులను తామే చేసుకునే అలవాటు ఉంటుంది. పూర్తి స్థాయి ఇంటి పనివారు ఉన్నత వర్గాల వారి ఇండ్లలోనే కనిపిస్తారు. అమెరికాలో ఇంటి పనులు చేసినందుకు ఒక రోజుకు తీసుకునే చార్జీ 50 డాలర్లుగా ఉంటుంది. వారానికి 75 డాలర్ల వరకు ఉంటుంది. కానీ మన దగ్గర నెలకు రూ.4 వేలకే ఇంటి పనులు చేసే వారు లభిస్తారు. అంటే 60 డాలర్లు.

పన్నులు భారీగా
అమెరికాలో 40 శాతం వరకు పన్ను రేటు ఉంది. కానీ భారత్ లో పన్ను ఆదా కోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. రూ.10 లక్షలపైన సంపాదించే వారికే 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.  

యుటిలిటీలు
భారత్ లో ఎక్కడికైనా 25 నుంచి 30 పైసలకే మాట్లాడుకునే అవకాశం ఉంది. ఉత్తర అమెరికాలో కాల్ చార్జీ ఒకటిన్నర డాలరుగా ఉంది. కేబుల్ లేదా శాటిలైట్ టీవీ చార్జీలు భారత్ లో కంటే అమెరికాలో ఎక్కువ. అమెరికాలో కార్లు చాలా చౌక. తిరిగి వినియోగానికి అనువుగా మరమ్మతులు చేసిన కార్ల కండిషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపుగా రెండు చోట్ల ఒకే విధంగా ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులను ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు తొలుత భారత్ లోనూ విడుదల చేస్తున్నాయి.

ప్రజా రవాణా
అమెరికాలో ప్రజా రవాణా సదుపాయాలు చాలా తక్కువ. సొంత కార్లు. లేదంటే క్యాబ్స్ వినియోగం ఎక్కువ. రెండు పట్టణాల మధ్య అయితే విమాన సర్వీసులు ఎక్కువ. లేదా మెట్రో రైళ్లు. మన దేశంలో బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు, ట్యాక్సీలు, ఆటోలు ఇలా ఎన్నో రవాణా సదుపాయాలు ఉన్నాయి. అమెరికాలో జన సాంద్రత మన దేశంతో పోల్చినప్పుడు పదింట ఒక వంతే ఉంటుంది. కానీ, ప్రజా రవాణా వ్యవస్థకు జనాభా ఎక్కువగా ఉండడం అవసరం. అందుకే అక్కడ సదుపాయాలు అంతగా విస్తరించలేదు.  

వైద్యం
వైద్య సదుపాయాలు చాలా మెరుగ్గా ఉంటాయి. వైద్య బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఆస్పత్రి వ్యయాలను బీమా కంపెనీలే భరిస్తాయి. ప్రీమియం భారమైనా అన్ని అనారోగ్య సమస్యలు కవరయ్యేలా బీమా తీసుకోవాలి. లేదంటే హాస్పిటల్ బిల్లు చూసి షాక్ కు గురికావాల్సి వస్తుంది. పెద్ద సర్జరీలు, వైద్య చికిత్సలు మనదేశంలోనే చౌక. అయితే, మనదేశంలో  నాణ్యమైన వైద్య సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం.  

కుటుంబం - సంస్కృతి
మన దేశంలో చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచి పూర్తి రక్షణ, శ్రద్ధ, ప్రేమ అందుతాయి. వృద్ధాప్యంలో పిల్లల నుంచి ప్రేమాభిమానాలు లభించే పరిస్థితి భారత్ లో ఉంటుంది. కానీ, అమెరికాలో పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒంటరిగానే మిగిలిపోతారు. మన దేశంలో కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. కానీ, అమెరికాలో వ్యక్తులు వారికే తొలి ప్రాధాన్యం ఇచ్చుకుంటారు. వారి సామర్థ్య అభివృద్ధికి, వారి ఎదుగుదల చూసుకుంటారు. ఆ తర్వాతే కుటుంబం. అమెరికన్లు లక్ష్యంతో సాగిపోతుంటారు.

మన దేశంలో చిన్నారుల నుంచి వారు వివాహితులై, పిల్లలు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులతో కలసి ఉండడం కనిపిస్తుంది. కానీ అమెరికాలో పిల్లలు ఎంతో కాలం తల్లిదండ్రులతో ఉండరు. 18 ఏళ్లు రావడం ఆలస్యం తల్లిదండ్రుల నుంచి విడిగా వెళ్లి ఉంటారు. భారతీయులు కుటుంబ విలువలను గౌరవిస్తారు. అమెరికాలో వ్యక్తిగత విలువలకే గౌరవం. అమెరికన్ల కంటే భారతీయుల్లో పోటీ తత్వం ఎక్కువ. భారతీయులు కుటుంబ అవసరాల కోసం కష్టించి పనిచేస్తుంటారు. అమెరికన్లు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు లేదా సంపన్నులు అయ్యేందుకు శ్రమిస్తుంటారు.

వివాహం
మన దగ్గర పిల్లల వివాహాల్లో పెద్దల పాత్ర ఉంటుంది. సంబంధాలు చూడడం దగ్గర్నుంచి వివాహం చేయడం, ఆ తర్వాత మంచి, చెడు పర్యవేక్షణ ఉంటుంది. వ్యక్తుల హోదా, స్థాయి, చదువు, వయసు, గుణ గణాలు ఎన్నో కీలకమవుతాయి. కానీ అమెరికాలో వివాహం అన్నది వారి భావోద్వేగాలు, ఇష్టాల ఆధారంగా ఉంటుంది. దంపతులు ఇద్దరూ స్వేచ్ఛను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. తమ హక్కులకు విఘాతం కలిగితే అక్కడ కలసి ఉండడం దాదాపు కష్టమే. అమెరికాలో ఇద్దరు కలసి మాట్లాడుకుని, తమ గురించి పూర్తిగా తెలుసుకుని ఇష్టపడి ప్రేమించుకుంటే, పెళ్లి చేసేసుకుంటారు. కానీ, భారత్ లో పెళ్లికి ముందు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకునేది చాలా తక్కువ. మరి అమెరికాలో 40 నుంచి 50 శాతం జంటలు విడాకులు తీసుకుంటుంటే... విడాకుల రేటు మన దేశంలో కేవలం ఒక శాతంగానే ఉంది. మనదేశంలో సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు సామాన్యుల జీవనంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇళ్లను వాస్తు ఆధారంగా, వివాహం సంప్రదాయాల ఆధారంగా, మంచి పనులు మంచి సమయాల్లో మొదలు పెట్టడం వంటివి కనిపిస్తాయి. కానీ, అమెరికాలో నమ్మకాల ఆధారంగా నడుచుకునే విధానం కనిపించదు.

సమాచార సంబంధాలు
అమెరికాలో వ్యాపారం, కార్యాలయాలు, ఇతర చోట్ల సంప్రదింపులు రాతపూర్వకంగా జరుగుతుంటాయి. అది ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా కావచ్చు. కానీ, భారత్ లో మాత్రం మాటల రూపంలో ముఖాముఖి చెప్పుకోవడం ఎక్కువగా చూస్తుంటాం.  

ట్రాఫిక్
మన దేశంలో ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ను పాటించేవారు తక్కువ. అమెరికాలో అలా కాదు. ట్రాఫిక్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తుంటారు. డ్రైవింగ్ కు వచ్చేసరికి కుడిచేతి వైపు అనుసరణ ఉంటుంది. నాలుగు చక్రాల వాహనంలో స్టీరింగ్ ఎడమచేతివైపు ఉంటుంది. భారత్ లో విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అమెరికాలో కార్ల నియంత్రణ చాలా సులభం. కార్లకు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, పవర్ స్టీరింగ్ ఉంటాయి. రోడ్డు మారాలంటే పక్క రోడ్డులో వాహనాలు లేకుండా క్లియర్ గా ఉన్నప్పుడే ఇండికేటర్స్ ఆన్ చేసి మారాల్సి ఉంటుంది. వీధిలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్ బోర్డులు ఉంటాయి. వాటిపై వేగ నియంత్రణ, ఇతర నిబంధనలు రాసి ఉంటాయి. వాటి ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుంది. ఆ రోడ్డులో మీకు రైట్ ఆఫ్ వే ఉందేమో చూసుకోవాలి. పాదచారులు రోడ్డు దాటుతుంటే కారును నిలిపివేసి వారికి మార్గం ఇవ్వాలి. ఎందుకంటే వారికి రైట్ ఆఫ్ వే ఉంటుంది.

ఇళ్లు-షాపులు
అమెరికాలోని పట్టణాల్లో భిన్నరకమైన ఏర్పాట్లు కనిపిస్తాయి. అక్కడ జోన్ ల వారీగా ఉంటాయి. పని ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, ఇళ్లకు దూరంగా ఉంటాయి. సొంత వాహనాల్లో అక్కడ వరకు వెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాలు అన్నీ ఒక్కచోటే ఉండటం సర్వ సాధారణం. అమెరికాలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె 2,500 డాలర్ల వరకు ఉంటుంది.  మన దేశంలో ఫ్లాట్ అద్దె రూ.12 వేలుగా ఉంటే, ఇదే తరహాలో ఫ్లాట్ కు అమెరికాలో అద్దె వెయ్యి డాలర్లు(రూ.67వేలు) గా ఉంటుంది.

చర్మ సౌందర్యం
మన దేశంలో తెల్లగా ఉండాలన్న కోరిక ఎక్కువ మందిలో ఉంటుంది. అమెరికాలో చర్మ రంగు అంత ముఖ్యం కాదు. తెల్ల, నల్ల జాతీయుల మధ్య డేటింగ్ సంస్కృతి కూడా అక్కడ కనిపిస్తుంది. చర్మం తెల్లగా ఉండాలన్న శ్రద్ధ అక్కడి వారిలో కనిపించదు. మన దగ్గర తెల్లగా ఉండాలన్న కాంక్షతో ఫెయిర్ గా మారేందుకు ఎన్నో చిట్కాలు అనుసరిస్తుంటారు.

పనికి గౌరవం
అమెరికాలో ప్రతీ ఉద్యోగానికి గౌరవం ఇస్తుంటారు. కానీ మన దేశంలో అధికారాలు, పాప్యులారిటీ, ఆదాయాన్ని బట్టి వ్యక్తులను గౌరవించే చెడ్డ సంస్కృతి కనిపిస్తుంది. నేరస్థులు సైతం ధనార్జన తర్వాత గౌరవాన్ని పొందుతుంటారు. అమెరికాలో ఉద్యోగాలు రిజర్వేషన్ల ఆధారంగా ఇవ్వరు. అర్హతలే వారికి అవకాశాన్నిస్తాయి. మన దేశంలో కులం, లింగం ఆధారంగా రిజర్వేషన్ల అమలు ఉంది. ఉద్యోగ దరఖాస్తుల్లోనూ మతం గురించి అడుగుతుంటారు. కానీ అమెరికాలో ఇలా అడిగితే అది నేరం అవుతుంది. కులం, రంగు, లింగం ఆధారంగా ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అమెరికా రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అమెరికాలో రెగ్యులర్ ఉద్యోగి వేతనాలు మన దేశంతో పోలిస్తే చాలా రెట్లు అధికం.

రాజకీయ పార్టీలు
మనదేశంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇవన్నీ జాతీయ పార్టీలు. జాతీయ పార్టీల జాబితాలో ఇంకా చాలా ఉన్నప్పటికీ అవన్నీ ప్రాంతీయ పార్టీల స్థాయివే. ప్రతీ రాష్ట్రంలోనూ పదుల సంఖ్యలో పార్టీలున్నాయి. దేశం మొత్తం మీద వందల సంఖ్యలో పార్టీలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయి. అమెరికాలో మాత్రం ద్విపార్టీ వ్యవస్థే అమల్లో ఉంది,. రిపబ్లికన్లు. డెమొక్రాట్లు.  

ప్రపంచాన్ని మార్చిన వారు...
మనదేశంలో విజయవంతమైన పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ, ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చిన వారు అరుదు. కానీ, అమెరికా నుంచి గ్రాహమ్ బెల్, రైట్ బ్రదర్స్, హెన్నీ ఫోర్డ్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, లారీ పేజ్ వంటి వారు చాలా మందే ఉన్నారు.

ఖగోళ శాస్త్రం, రేఖాగణితం, మ్యాథమేటిక్స్ ను, లెక్కల్లో కీలకమైన సున్నాను ఈ ప్రపంచానికి అందించింది భారతే. అంతరిక్షం, ఇంజనీరింగ్, మెడికల్, టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలను అందించింది అమెరికా. భారత్ ఆయుర్వేదం, యోగా, మెడిటేషన్ విధానాలను ఈ ప్రపంచ ప్రజలకు అందించింది. అమెరికా ఆధునిక అల్లోపతి, ఎన్నో వైద్య విధానాలు, ఔషధాలను ప్రపంచానికి అందించింది.

అభివృద్ధిలోనూ తేడా
మనదగ్గర కంపెనీలు ప్రధానంగా పెద్ద నగరాల చుట్టూ కేంద్రీకృతమవుతాయి. కానీ, అమెరికాలో చిన్న పట్టణాల్లోనూ కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటాయి.  

పోల్చలేము
నిజానికి అమెరికా, భారత్ రెండూ పూర్తి విరుద్ధమని భారత్ లో ఏడాది పాటు నివసించిన అమెరికా విద్యార్థి ర్యాన్ జే ఫారిక్ పేర్కొన్నారు. ఆయన చెబుతున్నదాని ప్రకారం... అమెరికాలో తుపాకులు స్వేచ్ఛగా లభిస్తాయి. టెక్సాస్ లోని వాల్ మార్ట్ స్టోర్ కు వెళ్లి గన్ కొనుక్కోవచ్చు. సౌకర్యాల పరంగా అమెరికా నిస్సందేహంగా భారత్ ను వెనక్కి నెట్టేస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, స్వచ్ఛమైన తాగునీరు, అంబులెన్స్ లు, పోలీసులకు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. అవినీతి చాలా తక్కువ. వడగళ్ల వానలు వచ్చి స్తంభాలు కూలిపోతే తప్ప నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంటుంది.

ఇలా ఎన్నో సదుపాయాలు అమెరికాలో కనిపిస్తాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. పేదరికం తక్కువ. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. కొన్నిప్రాంతాలు మినహా నేరాల రేటు తక్కువ. కానీ, అమెరికాలోతరచుగా బోర్ కొడుతుంది. ప్రజలు బయట తిరగడం తక్కువ. నడక కోసం కూడా బయటకు రారు. అపరిచితులతో సంబంధాలకు వారు దూరంగా ఉంటారు. శీతాకాలంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పాఠశాల విద్య చాలా ఖరీదైనది. భారత్ లో సంపద అసమానత్వం, పేదరికం అనేది అమెరికా కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఏటా పెద్ద సంఖ్యలో అమెరికాకు వస్తుంటారు. అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి జీడీపీ తక్కువ. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన అన్నీ సమకూర్చుతారు. వేసవిలో నీటి కొరత, విద్యుత్ కోతలు ఎక్కువ.


More Articles