ఇంటిపైనే సోలార్ ప్లాంట్... నెలనెలా ఆదాయం... కరెంటు బిల్లుల భారానికి చెక్...!
ఏటేటా పెరుగుతున్న విద్యుత్ చార్జీలు వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. విద్యుత్ నిత్యావసరమే. అది లేకుంటే ఎన్నో వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితి. ఒకప్పుడు ఎక్కువ శాతం ఇళ్లు లైట్లు, ఫ్యాన్ లకే పరిమితం అయ్యేవి. కానీ, నేడు ఫ్రీజర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, వెట్ గ్రైండర్లు, గీజర్లు లేదంటే హీటర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాన్యుల ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. దాంతో నెలవారీ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. దాంతో బిల్లు వేలల్లో వచ్చేస్తోంది. మరి ఈ భారాన్ని తప్పించుకునేందుకు ఉన్న మార్గం ఇంటిపైన సొంతంగా చిన్న విద్యుత్ ప్లాంట్ పెట్టేసుకోవడమే.
ఒకప్పుడు సోలార్ ఉత్పత్తులు చాలా ఖరీదు. విద్యుదుత్పత్తి కూడా ఖరీదైన వ్యవహారంగానే ఉండేది. కారణం, సోలార్ విద్యుత్ కు ఇంధనం సూర్యుని కిరణాలే. అవి ఎంత వాడుకున్నా తరిగిపోయేవి కావు. పైగా సూర్యుడి కాంతిని వాడుకున్నందుకు ఎటువంటి చార్జీలు కూడా చెల్లించక్కర్లేదు. అయితే, సూర్యుని కాంతిని గ్రహించి దాన్ని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలు చాలా ఖరీదుగా ఉండేవి. దాంతో సోలార్ విద్యుత్ వినియోగం అంతగా వ్యాప్తి చెందలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం సోలార్, పవన విద్యుత్ ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా భారీ ప్రోత్సాహక చర్యలు, రాయితీలను ఇస్తూ వస్తోంది. దీంతో నేడు సోలార్ ప్యానళ్లు, సోలార్ విద్యుత్ ఉపకరణాల ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గత ఆరేడేళ్ల కాలంలో సోలార్ ప్యానెల్స్ ధరలు 85 శాతం వరకు క్షీణించాయి. విద్యుదుత్పత్తి డిమాండ్ ను తగ్గించేందుకు వీలుగా ఇంటిపైనే సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టుకోవచ్చంటూ ప్రభుత్వం కొత్త విధానానికి తెరతీసింది. మీకు కావాల్సినంత వాడుకుని మిగిలింది విద్యుత్ సంస్థలకు విక్రయించుకోవచ్చని ప్రకటించింది. దీని వివరాలేంటో చూద్దాం.
పెట్టుబడి తక్కువే...
ఒక కిలోవాట్ సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యంగల రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ ప్లాంట్ కు అయ్యే వ్యయం రూ.60,000. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ 30 శాతాన్ని తీసేస్తే ప్లాంట్ వ్యయం రూ.42,000 మాత్రమే అవుతుంది. కిలోవాట్ అంటే 1000 యూనిట్లకు సమానం. విద్యుత్ తయారీ ప్లాంట్ పరికరాల జీవిత కాలం 25 ఏళ్లుగా భావించవచ్చు. కిలోవాట్ విద్యుదుత్పత్తికి వీలుగా సోలార్ మాడ్యుళ్లను ఏర్పాటు చేసేందుకు ఇంటిపైన 120 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. ఈ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్తు రెండు బల్బులు, రెండు ఫ్యాన్ల వినియోగానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో రెండు ఫ్యాన్లూ, రెండు లైట్లూ పగటి పూట అవసరం లేదు. కనుక ఆ సమయంలో మిగిలిన ఉపకరణాల వినియోగానికి విద్యుత్ ను వాడుకోవచ్చు. అయితే, ఏసీలు, హీటర్ల వంటి అధిక సామర్థ్యం గల పరికరాల వినియోగానికి సోలార్ విద్యుత్ సరిపోదు. కాకపోతే మిగిలిన ఉపకరణాలకు అవసరమైన విద్యుత్ లభిస్తుంది గనుక భారీ బిల్లులను సగానికి తగ్గించగలదు. సోలార్ పవర్ తో టీవీలు, లైట్లు, ఫ్యాన్లు వాడుకోవచ్చు. రూ.3 లక్షల పెట్టుబడి పెట్టగలిగితే ఐదు కిలోవాట్ సామర్థ్యం గల ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మీ విద్యుత్ అవసరాలను బట్టి ప్లాంట్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
మిగిలిన పవర్ గ్రిడ్ కు
గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్ ను అమర్చుకోవడం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ లో మిగిలినదాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేయవచ్చు. దీన్ని విద్యుత్ సంస్థలు ఇతరులకు సరఫరా చేస్తాయి. దాంతో కొంత ఆదాయం కూడా లభిస్తుంది. ఇందుకోసం విద్యుత్ సంస్థలు ప్రత్యేక మీటర్ ను ఏర్పాటు చేస్తాయి. అధిక వినియోగం ఉన్న సమయాల్లో సోలార్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్ సరిపోదు. అప్పుడు విద్యుత్ కనెక్షన్ ద్వారా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగించుకోవచ్చు. సోలార్ విద్యుత్ అదనంగా ఉన్నప్పుడు విక్రయించుకోవడం... తక్కువ అయినప్పుడు గ్రిడ్ నుంచి విద్యుత్ వాడుకోవడం ద్వారా బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక నెలలో మీరు 100 యూనిట్లు వాడుకున్నారు. రూఫ్ టాప్ ద్వారా గ్రిడ్ కు 40 యూనిట్లు సరఫరా చేశారనుకుందాం. అప్పుడు 60 యూనిట్లకే చార్జ్ చేస్తారు. ఒకవేళ మీ వాడకం కంటే గ్రిడ్ కు ఇచ్చిందే ఎక్కువుంటే దానిపై యూనిట్ కు నామమాత్రపు ధరను విద్యుత్ సంస్థలు చెల్లిస్తాయి. చిన్న చిన్న వాణిజ్య సంస్థలు, కుటీర పరిశ్రమలు సైతం తమ విద్యుత్ అవసరాలను సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తీర్చుకోవచ్చు.ఆదాయపన్ను మినహాయింపులను కూడా పొందవచ్చు.
మూడు రకాలు
సోలార్ పవర్ ప్లాంట్ లో ఒకటి గ్రిడ్ కు అనుసంధానించే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్. దీన్నే ఆన్ గ్రిడ్ అంటారు. అంటే ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో మీరు వాడుకోగా మిగిలినది గ్రిడ్ కు వెళుతుంటుంది. రెండోది ఆఫ్ గ్రిడ్. అంటే ఉత్పత్తి అయిన విద్యుత్ లో వాడకం పోను మిగిలినది బ్యాటరీల్లో నిల్వ అవుతుంది. మూడోది వినియోగంపోను మిగిలిన విద్యుత్ బ్యాటరీల్లో నిల్వ అయి, ఆ తర్వాత అదనంగా వచ్చే కరెంట్ గ్రిడ్ కు సరఫరా చేయాలనుకుంటే అప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
సోలార్ పీవీ సెల్?
సోలార్ పీవీ సెల్ ఓ ప్రత్యేకమైన సెమీ కండక్టర్ డియోడ్. ఇది సూర్యరశ్మిని గ్రహించి ఫొటో వోలటిక్ ఎఫెక్ట్ తో డైరెక్ట్ కరెంట్ (డీసీ) గా మారుస్తుంది. సోలార్ విద్యుదుత్పత్తి అన్ని వేళల్లో ఒకే స్థాయిలో ఉండదు. సూర్యుని కిరణాల తరంగదైర్ఘ్యాన్ని బట్టి మారుతుంటుంది. సోలార్ పీవీ సెల్ మేఘంగా ఉన్న సమయాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కానీ, తక్కువగా ఉంటుంది.
సాధారణంగా బేసిక్ సోలార్ పీవీ సెల్ కొంచెం పరిమాణంలోనే విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు. సామర్థ్యాన్ని బట్టి ఒకటికి మించిన సెల్స్ ను కలపడం ద్వారా ఎక్కువ పరిమాణంలో విద్యుదుత్పత్తి సాధ్యపడుతుంది. ఎంత శాతం సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మారుస్తుందన్న దాని ఆధారంగా సోలార్ సెల్ సామర్థ్యాన్ని పేర్కొంటారు. మార్కెట్లో 4, 8, 12, 16 శాతం సామర్థ్యం గల సోలార్ పీవీ సెల్స్ ఉన్నాయి. వెయ్యి వాట్ల విద్యుదుత్పత్తికి 12 శాతం సామర్థ్యం గల పీవీ సెల్స్ ఏర్పాటుకు ఇంటిపైన 100 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది.
సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి రోజులో అన్ని వేళలా, ఏడాదంతా విద్యుత్ తయారవదు. ప్యానెల్ సామర్థ్యం, సూర్యరశ్మి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఇది ఉంటుంది. దీన్ని సామర్థ్య వినియోగ అంశంగా పేర్కొంటారు. మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 19 శాతాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక కిలోవాట్ కెపాసిటీ సోలార్ సిస్టమ్ 1600 కిలోవాట్ ఎలక్ట్రిసిటీని ఏడాదిలో ఉత్పత్తి చేయగలదు.
ఇంటిపైన ఏర్పాటు చేసుకునే సోలార్ పీవీ ప్యానెల్స్ పై సూర్యరశ్మి ఎక్కువగా పడే విధంగా చూసుకోవాలి. ప్యానెల్స్ కు సూర్యకిరణాల ప్రసారానికి అడ్డుగా చెట్లు, పక్కన బిల్డింగ్ లు ఉండరాదు. రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ఉపకరణాలను సరఫరా చేసే సంస్థ అమర్చే సేవనూ అందిస్తుంది. కనుక ఈ విషయంలో పెద్దగా మధన పడాల్సిన పనిలేదు. కాకపోతే చదరపు మీటర్ పరిధిలో అమర్చే ప్యానెల్స్ బరువు 15 కిలోలు ఉంటుంది. కనుక ఇంత మేర బరువును ఇంటి పైకప్పులు మోయగల స్థితిలో ఉండడం మాత్రం తప్పనిసరి.
పరికరాలు
బ్యాటరీలు, ఇన్వర్టర్, సోలార్ పీవీ సెల్స్ మాడ్యూళ్లు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లో ఉండే పరికరాలు. డీప్ సైకిల్ బ్యాటరీలు (లీడ్ యాసిడ్) సోలార్ పీవీ సిస్టమ్ కు అనువైనవి. ఈ బ్యాటరీలు ఐదు నుంచి పదేళ్ల పాటు మన్నుతాయి. 80 శాతం వరకు విద్యుత్ ను నిల్వ చేసుకోగలవు. ఎక్కువ సమయం పాటు విద్యుత్ ను సరఫరా చేసేలా బ్యాటరీలను డిజైన్ చేస్తారు. ఆటోమోటివ్ బ్యాటరీలు పనికిరావు. సీల్ చేసిన, నిర్వహణ రహిత టూబ్యులర్ పాజిటివ్ ప్లేట్ బ్యాటరీలు కూడా పీవీ సోలార్ సిస్టమ్ కు అనువుగా ఉంటాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్ ను స్టోర్ చేసుకునేందుకు వీలుగా ఇన్వర్టర్లను అమర్చుకోవచ్చు. ప్యూ సైన్ వేవ్ లేదా మోడిఫైడ్ సైన్ వేవ్ ఇన్వర్టర్లు సోలార్ పీవీ సిస్టమ్ కు సరిపోతాయి. గ్రిడ్ కు అనుసంధానించే విద్యుత్ ప్లాంట్ కు అయితే, ఇన్వర్టర్, బ్యాటరీల అవసరం ఉండదు. అలా కాకుండా ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టోర్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం బ్యాటరీలు, ఇన్వర్టర్ అవసరం అవుతాయి. ఈ మేరకు ప్లాంట్ ఏర్పాటు ఖర్చు కూడా పెరిగిపోతుంది.
వారంటీ
సోలార్ పీవీ మాడ్యుల్ 25 ఏళ్ల వారంటీతో వస్తుంది. సోలార్ హోమ్ లైట్ సిస్టమ్ (ఇన్వర్ట్ తో) ఐదేళ్ల వారంటీతో లభిస్తుంది. బ్యాటరీల్లో సీల్డ్ మెయింటెనెన్స్ అవసరం లేనివి రెండేళ్ల వారంటీతో, లీడ్ యాసిడ్ ఫ్లడెడ్ రకం బ్యాటరీలు ఐదేళ్ల వారంటీతో వస్తాయి.
ప్రయోజనాలు
విద్యుత్ బిల్లుల భారం చాలా వరకు తగ్గిపోతుంది. పర్యావరణంకు ఏ మాత్రం హాని చేయనిది. ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడి తక్కువ. ప్లాంట్ వల్ల ఎటువంటి శబ్దాలు రావు. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. ప్లాంట్ ఏర్పాటుకు పెద్దగా సమయం పట్టదు.
ప్లాంట్ ఏర్పాటు ఖర్చు
సోలార్ విద్యుత్ ప్లాంట్ ఖర్చు అన్నది సరఫరా చేసే సంస్థను బట్టి మారిపోతుంది. బ్రాండ్, సర్టిఫికేషన్స్, స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా, వారంటీలు, బ్యాటరీలు, ఇన్వర్టర్లు కూడా కావాలా, ఇలా చాలా రకాల అంశాలు ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయిస్తాయి. అవగాహన కొరకు టాటా సోలార్ పవర్ తో పాటు ఈ సైట్ ను సందర్శించవచ్చు... http://www.eai.in/ref/ae/sol/rooftop/cost