ధనాన్ని పొదుపు చేయడం ఎంతో సులభం... ఇలా చేయండి చాలు... గ్రోసరీ షాపింగ్ లోనూ ఆదా!
ఎంత సంపాదిస్తున్నా... నెల చివరికొచ్చే సరికి అంతా ఖర్చయిపోయి, డబ్బుకి కటకట ఏర్పడే పరిస్థితి ఎదురుకావడం చాలా మందికి అనుభవమే. పొదుపు చేద్దామన్న సంకల్పం ఉన్నా... ఆచరణలో అది సాధ్యం కాదు చాలా మందికి. నిజమే, కానీ కొన్ని సూత్రాలను పాటిస్తే పొదుపు చేయడం సులభమే. అవేంటో నిపుణులు చెబుతున్నారు...
మొబైల్ బిల్లు
చాలా మంది మొబైల్ బిల్లు విషయంలో కంట్రోల్ గా ఉండలేరు. ఇక పోస్ట్ పెయిడ్ అయితే, అడ్డే లేదు. కనుక పొదుపు చేయాలంటే ముందు చేయాల్సింది పోస్ట్ పెయిడ్ కు గుడ్ బై చెప్పేయడమే. పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే ఎంత వాడుతున్నామన్న పర్యవేక్షణ ఉండదు. బిల్లొస్తే గానీ అసలు వినియోగం తెలియదు. పొరపాటున డేటా ఆన్ చేశారా...? వినియోగం తారాజువ్వలా ఎగసి బిల్లు వాచి పోతుంది. వాడుకున్న మేర బిల్లు ఒక ఎత్తు. దానిపై 15 శాతం సేవా పన్ను చెల్లించాల్సి రావడం అదనపు భారం. దీన్నే నిలువు దోపిడీ అని కూడా పేర్కొనవచ్చు. అందుకే వెంటనే పోస్ట్ పెయిడ్ కు సెలవు చెప్పేయండి. ప్రీపెయిడ్ తీసుకోండి. ప్రీపెయిడ్ లో ఉన్నన్ని ప్లాన్స్, ఆఫర్లు పోస్ట్ పెయిడ్ లోనూ ఉండవు. ప్రీపెయిడ్ లోనూ జియో వచ్చి నెలకు రూ.149కే అపరిమితంగా మాట్లాడుకునే అవకాశాన్ని, అలాగే 2జీబీ ఉచిత డేటాను అందిస్తోంది. సామాన్య, మధ్య తరగతి వారికి ఇది చక్కగా సరిపోతుంది.
షాప్ ఆన్ లైన్
ఎన్నో డిస్కౌంట్లు, డీల్స్ ఆన్ లైన్ షాపింగ్ లో కనిపిస్తుంటాయి. కనుక ఆన్ లైన్ షాపింగ్ లో కొంత అదనంగా పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఆన్ లైన్ వేదికల్లో ఓ వస్తువు ఎక్కడ తక్కువుందో చెప్పేందుకు Makkhi Choose టూల్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. మనం ఓ వెబ్ సైట్ లో ఒక దాని కోసం శోధిస్తున్న సమయంలోనే అదే వస్తువు ఇతర సైట్లలో ఎంతున్నదీ తెలియజేస్తుంది. ధర ఒక్కటీ తక్కువుండడం కాదండోయ్. షిప్పింగ్ చార్జీ (కొన్న వాటిని మన ఇంటి వరకు చేర్చేందుకు) ఎంత వసూలు చేస్తున్నదీ చూడండి. కొన్ని ఉచితంగా డెలివరీ చేస్తాయి. కొన్ని వస్తువు ధర తక్కువ చూపించి, షిప్పింగ్ చార్జీలను భారీగా పేర్కొంటాయి. అటువంటి ట్రిక్స్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లోనూ కనిపిస్తుంటాయి. అమేజాన్ డాట్ ఇన్ అయతే రూ.499పైన కొనుగోలుకు ఉచితంగా డెలివరీ అందిస్తోంది. అదే పేటీఎంలో షాపింగ్ చేస్తే పది వస్తువులు కొంటే పదింటిపైనా షిప్పింగ్ చార్జీ పడుతుంది. దోపిడీ అంటే ఇదే!
ఆఫర్ల మోజులో పడొద్దు
మీరు ఒక జత దుస్తులు కొనాలని ఆన్ లైన్ షాపింగ్ సైట్ కో, బయట స్టోర్ కో వెళ్లారు. అక్కడ ఒక జీన్ రూ.1,000 అని ఉంది. అదే సమయంలో ఆఫర్ కూడా కనిపించింది. రెండు కొంటే ఒకటి ఉచితం అని ఉంది. రెండు కొంటే మూడొస్తున్నాయి. అంటే ఒక్కోటీ రూ.666కే ఒక్క జీన్ వచ్చేస్తుంది కదా అని మూడూ కొనేస్తే బిల్లు రూ.2,000 అవుతుంది. కానీ మీకు కావాల్సింది ఒకటే జీన్స్ ప్యాంట్. బడ్జెట్ రూ.1,000. దీనికి బదులు రూ.2,000 పెట్టి షాపింగ్ చేయడం వల్ల బడ్జెట్ దాటిపోతుంది.ఆన్ లైన్ లో క్యాష్ బ్యాక్ ను అందించే మధ్యవర్తిత్వ సైట్లు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు క్యాష్ కరో, గోపైసా. ఈ సైట్ల ద్వారా షాపింగ్ చేస్తే కొంత క్యాష్ బ్యాక్ ను అందిస్తాయి. అలా అని వీటి ద్వారా ఫ్లిప్ కార్ట్, అమేజాన్ సైట్లను ఆశ్రయించడం వల్ల వస్తువుల ధరలు అదనంగా ఉంటాయని పొరపడవద్దు. పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి కొన్ని వ్యాలెట్ల ద్వారా నగదు చెల్లింపులు చేయడం వల్ల కొంత శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్లు ఉన్నదీ లేనిదీ ముందే తెలుసుకోవాలి. ఇక మూవీ, ట్రావెల్ టికెట్లను ఆన్ లైన్ వేదికల్లో బుక్ చేసుకోవడం ద్వారా ఫ్లాట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా వేరే ప్రయోజనాలు ఉంటాయి.
క్రెడిట్ కార్డుతో మరి కాస్త ఆదా
వాడుతున్న క్రెడిట్ కార్డును బట్టి నెలలో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కిరాణా సరుకులు, ఇంధనంపై 5 శాతం వరకు, మూవీ టికెట్లు, రెస్టారెంట్లలో విందులపై 20 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డు ద్వారా ఒక నెలలో రూ.10,000 చెల్లింపులు చేశారనుకోండి. వడ్డీ లేకుండా తిరిగి చెల్లించేందుకు 50 రోజుల వరకు గడువు ఉంటుంది. అప్పటి వరకు బ్యాంకులో బ్యాలన్స్ ఉంచుకోవడం వల్ల దానిపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.
బ్యాంకు ఖాతాలోనూ కిటుకు
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలన్స్ కంటే అదనంగా ఉంచడం వల్ల వడ్డీ రాబడి తక్కువే వస్తుంది. కనుక ఆటో స్వీప్ సదుపాయం పెట్టుకోవాలి. దాని వల్ల కనీస నగదు నిల్వకు మించి ఉన్న నగదు డిపాజిట్ గా మారిపోతుంది. దానిపై 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. పైన చెప్పుకున్నట్టు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలో మిగిలి ఉన్న రూ.10,000పై 7 శాతం వడ్డీని పొందొచ్చు. లేదంటే కోటక్ మహింద్రా వంటి ప్రైవేటు బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలోని నగదు నిల్వలపై 6 శాతాన్ని వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో ఖాతా తెరుచుకోవడం లాభదాయకం.
లిస్ట్ లేకుండా షాపింగ్ వద్దు
వాస్తవానికి కిరాణా, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల బిల్లే ప్రతీ కుటుంబానికీ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటికి సంబంధించిన కొనుగోళ్లలో తెలివిగా, క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. నెలలో ఫలానా దానికి ఇంత అన్న బడ్జెట్ కేటాయించుకుని ఆ పరిధిలోనే కొనుగోళ్లు ఉండేలా కట్టుబడాలి. ఆపై ఏమి అవసరం అయినా త్యాగం చేయడమే. ముందుగా వాస్తవంగా ఇంట్లోకి కిరాణా సామగ్రి ఏమేమి కావాలన్న జాబితా లేకుండా షాపింగ్ కు వెళ్లొద్దు. అలా చేస్తే అప్పుడు కంటికి కనిపించినదల్లా అవసరమే అనిపిస్తుంది. చివరికి భారీ బిల్లు, సంచెడు వస్తువులతో తిరిగొస్తారు. సూపర్ మార్కెట్లలో గమనించే ఉంటారు. వస్తువుల అలంకరణ చాలా అందంగా ఉంటుంది. అందమైన బిస్కెట్ ప్యాకెటో, డ్రింకో చూడగానే కొనేయాలనిపిస్తుంది. చివరికి బిల్లింగ్ కౌంటర్ దగ్గర సైతం రూ.50 లోపు ధర ఉన్న తినే ఐటమ్స్ ను డిస్ ప్లే లో ఉంచుతారు. దాంతో ఒకవైపు బిల్లింగ్ అవుతుంటే మరోవైపు మీ కన్ను పక్కనున్న వాటిపైకి మళ్లుతుంది. ఒకటో రెండో తీసుకుని మీ సరుకుల్లో వేసేసుకుంటారు. వీటినే మార్కెటింగ్ ట్రిక్స్ అంటారు. ఇలా కస్టమర్ తో సాధ్యమైనంత మేర అదనంగా వస్తువులను కొనుగోలు చేయించడమే వ్యాపారుల లక్ష్యం. అందుకే కచ్చితంగా షాపింగ్ కు వెళ్లేటప్పుడు తప్పకుండా లిస్ట్ తో వెళ్లాలి. ఆ లిస్ట్ కే కట్టుబడాలి.
లేదంటే...
పైన చెప్పిన విధంగా క్రమశిక్షణతో వ్యవహరించడం మీ వల్ల కాదనుకుంటే మరో మార్గం ఉంది. ఏమేమి కావాలో ఓ చీటీలో రాసుకుని దాన్ని తీసుకెళ్లి కాస్త హోల్ సేల్ ధరలకు అందించే కిరాణా షాపుకు వెళ్లడమే. అక్కడ ఆ చీటిని ఇస్తే వాళ్లే అన్నింటినీ తీసుకొచ్చి బిల్లు వేసిస్తారు. దాంతో కంటికి కనిపించినవన్నీ కొనే ప్రమాదం తప్పుతుంది. వీలుంటే నెలకోసారి లేదంటే వారానికోసారి కావల్సిన సరుకులు అన్నింటినీ తెచ్చేసుకోండి. టీ పొడి కావాలని ఓసారి, షుగర్ కావాలని మరోసారి, అది కూడా కొన్ని రోజులకు సరిపడానే కొనుగోలు చేయడం వల్ల వ్యాపారులు తగ్గించరు. ఎందుకంటే అది చిల్లర వర్తకం అవుతుంది. ఉదాహరణకు రూ.40 విక్రయంపై వ్యాపారికి ఓ నాలుగు రూపాయలు మిగులుంటే తగ్గించాలని అనిపించదు. ఇక గోధుమ పిండి నెలలో ఐదు కేజీలు పడుతుందనుకోండి. కేజీ ప్యాకెట్లు ఐదు తీసుకోవడం కంటే ఐదు కేజీల ప్యాక్ తీసుకోవడం వల్ల ఆదా అవుతుంది.
స్థానిక స్టోర్లలో విచారణ
సమయం వెసులుబాటు ఉంటే నెల సరుకులు కొనే ముందు సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్లు లేదా సాధారణ కిరాణా షాపుల్లో ధరల వ్యత్యాసం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనివల్ల నాణ్యమైనవి ఎక్కడ తక్కువకు లభిస్తుంటే అక్కడ కొనుగోలు చేయవచ్చు. ఇలా చేసే ముందు ఆన్ లైన్ లో బిగ్ బాస్కెట్, అమేజాన్ సైట్లను పరిశీలించండి. ఈ మధ్య ఈ సైట్లు తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తున్నాయి.
ప్రముఖ బ్రాండ్లవే ఎందుకు...?
మార్కెట్లో గోధుమలు సైతం లభిస్తాయి. వాటిని మర పట్టించుకుంటే ఓ ఐటీసీనో, పిల్స్ బరీ గోధుమ పిండి కంటే తక్కువకే వచ్చేస్తుంది. అలాగే, హిందూస్తాన్ యూనిలీవర్ సర్ఫ్ఎక్సెలే ఎందుకు...? ఆ మాత్రం నాణ్యత ఉన్న ఉత్పాదన మరో కంపెనీ తక్కువకే అందిస్తుంటే దాన్నే కొనుగోలు చేయవచ్చు. కొందరికి కొన్ని బ్రాండ్లు అంటే అంతులేని నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత వాటిని మార్చడానికి ఇష్టపడరు. సరిగ్గా ఈ బలహీనతనే కంపెనీలు క్యాష్ చేసుకుంటాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం కోల్గేట్ టోటల్ టూత్ పేస్ట్ 80 గ్రాములు రూ.40. ఇప్పుడు రూ.100. ఒక్కసారి కస్టమర్లు ఆదరించిన ఉత్పత్తులపై కంపెనీలు ఏడాదిలో రెండు సార్ల చొప్పున క్రమక్రమంగా ధరలు పెంచుకుంటూ పోతుంటాయి. అందుకే బ్రాండెడ్ ఉత్పత్తుల పట్ల ఉన్న అభిమానాన్ని వీడి పొదుపు చేసుకునే మార్గాలను వెతుక్కోవడం మంచిది. వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. శాంసంగ్ 32 అంగుళాల టీవీని రూ.25వేలకు అమ్ముతుంటే అదే ఉత్పత్తిని ప్యానాసోనిక్ రూ.19వేలకే అందిస్తోంది. ఏవో కొన్ని ఫీచర్లలో మార్పులు తప్ప పెద్ద తేడాలు ఏమీ ఉండవు.
ఆఫర్ల సమయంలో...
ఏడాదికోసారి వస్త్రాలను కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అది కూడా ఆఫర్ల సమయంలో పెట్టుకుంటే బెటర్. దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి, ఉగాది పండుగలకు ముందు ఆన్ లైన్ లోనూ, బయట కూడా షాపుల్లో భారీ ఆఫర్లు ఉంటుంటాయి. అప్పుడు కొనుగోలు చేయడం వల్ల కనీసం 30 శాతమైనా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
కూరగాయలను మీ వీధి చివర్లో ఉన్న షాపులో కొనుగోలు చేయడం సరైన నిర్ణయం కాదు. వారపు సంతలో లేదంటే రైతు బజారులో, లేదంటే మీ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ కు వెళ్లి వారం రోజులకు సరిపడా కూరగాయలను ఒక్కసారే తెచ్చుకోవడం వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయి. బిగ్ బాస్కట్ తరహా సంస్థలు ఆర్డర్ ఇస్తే తాజా కూరగాయలు, పండ్లను ఇంటికే తెచ్చిస్తున్నాయి. అదీ పోటీ ధరలకే. వారానికి మించిన కూరగాయలను నిల్వ చేసుకోవడం ఆరోగ్యానికీ అంత మంచిదేమీ కాదు.
వాయిదా...
ఏదైనా వస్తువు కొనాలని అనిపిస్తే వెంటనే కొనొద్దు. దాన్ని ఒక నెల పాటు వాయిదా వేయండి. ఈ మధ్యలో అది అవసరమా? లేదా? ఆలోచించండి. నెల గడిచిన తర్వాత మరోసారి ఆ వస్తువు కావాలనే అనిపిస్తే కొనండి. దీనివల్ల కొన్ని సార్లు అనవసరమైనవి మీ ఇంటి వరకు రాకుండా ఆగిపోతాయి.
వాతలు పెట్టుకోవద్దు
పొరుగింటి వ్యక్తి కొత్త బైక్ కొన్నాడనో... స్నేహితుడు నెలకో కొత్త జతతో కనిపిస్తున్నాడనో... సమీప బంధువు కారు కొన్నాడనో ఇలా పక్కవారిని చూసి తానూ కొనాలన్న వాతలు పెట్టుకోవద్దు. మీ అవసరాలు, మీకున్న స్తోమత... ఇవే చూసుకోవాల్సింది.
విద్యుత్తు ఆదా
పనేమీ లేకపోతే టీవీ ముందు కుర్చీలో కాళ్లు బార్లా చాపి గంటల తరబడి కూర్చోవద్దు. దాని వల్ల కంటి, వెన్ను ఆరోగ్యం దెబ్బతింటుంది. కరెంటు బిల్లు పెరిగిపోతుంది. మధ్య మధ్యలో పుస్తక పఠనం వంటి ఇతర పనులవైపు మళ్లాలి. అలాగే, టీవీని రిమోట్ లో ఆఫ్ చేయకుండా స్విచ్ కట్టేయాలి. ఫ్రిడ్జ్ డోర్ ను అస్తమానం తీయకుండా ఉండడం, పనికిరాని వన్నీ ఫ్రిడ్జ్ లో ఖాళీ ఉంది కదాని తీసుకెళ్లి పెట్టడం వంటివి చేయొద్దు. ఎల్ఈడీ బల్బుల వినియోగం, ఫైవ్ స్టార్ బీఈఈ రేటింగ్ ఉన్న విద్యుత్తు ఉపకరణాలు వాడడం వల్ల బిల్లు ఆదా అవుతుంది.