ఆరోగ్యాన్ని కాపాడే దశాహారం... అవేంటో చూద్దాం!
‘ఆరోగ్యమే మహాభాగ్యం’... ప్రతీ ఒక్కరూ అంగీకరించే వాస్తవం ఇది. అన్నింటిలోకి గొప్ప సంపద ఆరోగ్యమేనంటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ తగ్గిపోతూ, జీవనం సుఖమయమైపోతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే ఓ పది ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
వెల్లుల్లి
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి, వెల్లుల్లి ఒకే జాతికి చెందినవే. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు ముక్త కంఠంతో దీన్ని అంగీకరిస్తారు. వెల్లుల్లిలో బ్యాక్టీరియా వ్యతిరేక, ఫంగల్ వ్యతిరేక గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లకు వ్యాధులపై పోరాడే మంచి శక్తి ఉంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో ఎక్కువ ప్రయోజనాలు గుండెను కాపాడేందుకు ఉపయోగపడేవే. వారంలో కనీసం ఆరు వెల్లుల్లి రెబ్బలను తినే వారిలో చెడు కొలెస్ట్రాల్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కడుపు, ప్రొస్టేట్ కేన్సర్ ముప్పులను కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజూ కనీసం ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలన్నది ప్రమాణం. తినడానికి ముందు వెల్లుల్లి రెబ్బల పొట్టును తొలగించి వాటిని ముక్కలుగా కోసి ఓ పది నిమిషాల పాటు అలా ఉంచేయాలి. దీనివల్ల అందులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు విడుదల అవుతాయి.
ఆలివ్ ఆయిల్
చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) ను తగ్గించడం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) ను పెంచడం ఆలివ్ ఆయిల్ తో సాధ్యం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు రావు. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందుకు వీలు కల్పిస్తాయి. ఇంకా ఆలివ్ ఆయిల్ లో ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ధమని గోడల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ప్రతి రోజూ ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను భోజనంలో భాగం చేసుకుంటే చాలు. ఆలివ్ ఆయిల్ లో విర్జిన్, ఎక్స్ ట్రా విర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ రకాలే మంచివి. ఆలివ్ గింజలను ప్రెస్ చేయడం ద్వారా నూనెను తీస్తారు. అలాకాకుండా సాల్వెంట్లు, వేడి చేయడం ద్వారా తీసే నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అంతగా ఉండవు.
బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ (నల్ల ద్రాక్ష మాదిరిగా ఉండే) లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో రకలా అనారోగ్యాలను నివారించగలవు. 40 రకాల పండ్లు, కూరగాయలతో పోలిస్తే బ్లూ బెర్రీస్ లో ఎక్కువ వ్యాధులను నివారించే గుణాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. గుండె వ్యాధుల నుంచి రక్షించే వీటిని బ్లూ గార్డ్ గా చెబుతారు. కేన్సర్, వయసు పై బడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలను నివారించే గుణాలు ఈ పండ్లలో ఉన్నాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించడంలో వీటికివే సాటి. ఇందులో ఉండే ఎపికేటచిన్స్ వల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది. ఇది మూత్రాశయ గోడలపై బ్యాక్టీరియా తిష్ట వేయకుండా నివారిస్తాయి. అర కప్పు బ్లూ బెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
బ్రొక్కోలి
కేన్సర్ పై పోరాడడంలో బ్రొక్కోలి నంబర్ 1గా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ అనే సల్ఫర్ కాంపౌండ్ల వల్ల ఇది సాధ్యమవుతుంది. బ్రొక్కోలిని ఉడకబెడుతున్నప్పుడు వచ్చే ఘాటైన వాసనలు దీనివే. ఈ కాంపౌండ్లు మన శరీరంలో కేన్సర్ కు కారణమయ్యే వాటిని సమర్థవంతంగా నిర్వీర్యం చేసే ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచాలంటూ మన జన్యువులకు బ్రొక్కోలిలో ఉండే కాంపౌండ్లు సంకేతాలిస్తాయి. బ్రొక్కోలిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా బ్రెస్ట్, ఊపరితిత్తుల కేన్సర్, కడుపు, కొలన్ కేన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. అరకప్పు ఉడికించిన బ్రొక్కోలిని తీసుకోవాలి. మన దగ్గర బ్రొక్కోలీకి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడుకోవచ్చు. బ్రొక్కోలీలో లభించే అన్ని కాంపౌండ్లు క్యాబేజీలోనూ ఉన్నాయి.
పెరుగు
పెరుగు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఇందులో కేల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ అనే బ్యాక్టీరియా నిజంగా ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే పెరుగు తినాలి. పెరుగును ఎక్కువగా తీసుకుంటే ఇన్ఫ్లమ్మేటరీ బవెల్ వ్యాధి(ఆహారం తీసుకున్నప్పుడల్లా విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది) తగ్గించుకోవచ్చు. అలాగే, అల్సర్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ పెరుగు పాత్ర ఎంతో. 175 గ్రాముల తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగును రోజులో తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
ఓట్స్
ఓట్స్ గురించి ఈ తరానికి తెలిసింది తక్కువే. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఉండే బీటా గ్లూటెన్ కు చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించే శక్తి కలదు. బీటా గ్లూటెన్ అనేది ఓ రకమైన కరిగిపోయే ఫైబర్ వంటిది. రోజూ ఒక కప్పు ఉడికించిన ఓట్ బ్రాన్ లేదా కప్పున్నర ఓట్ మీల్ ను తినడం వల్ల లభించే బీటా గ్లూటెన్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను 5 శాతం మేర తగ్గిస్తుందట. అలాగే, హార్ట్ ఎటాక్ ముప్పును 10 శాతం తగ్గిస్తుంది. ఓట్స్ ను ఎక్కువ మంది ఉదయం పాలు లేదా నీటిలో ఉడికించి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు.
హోల్ ఓట్స్ లో పాలీ ఫెనాల్స్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్ల గ్రూపు అవెంత్రమైడ్స్ ఉంటాయి. అవెంత్రమైడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో అడ్డుంకులు తొలగి సాఫీగా రక్త ప్రసరణ జరిగేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడానికి సాయపడుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్ ను పెంచుతుంది. కడుపునిండిన భావన కలగుతుంది. జీర్ణకోశ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఓట్స్ లో ఉండే బీటా గ్లూటెన్ పనిచేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి ఓట్ మీల్ తో ఉన్న మరో ప్రయోజనం ఆ బరువును సులభంగా తగ్గించుకోవడమే. ఉదయం ఓట్ మీల్ ను బ్రేక్ ఫాస్ట్ లో ఓ నెల పాటు తీసుకుని బరువు చెక్ చేసుకోండి రిజల్ట్ తెలుస్తుంది.
ఫ్లాక్స్ సీడ్
ఫ్లాక్స్ సీడ్ (అవిసె) గింజలను ఒక టేబుల్ స్పూన్ మేర రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఉండే లింగాన్స్ (భారీ కెమికల్ కాంపౌండ్లు) శరీరంలో ఈస్ట్రోజన్ మాదిరిగా పనిచేస్తాయి. కణాలపై ఉండే ఈస్ట్రోజెన్ గ్రాహకాలను బ్లాక్ చేస్తాయి. దాంతో పలు హార్మోన్లకు సంబంధించిన కేన్సర్ రేటును తగ్గించడానికి తోడ్పడుతుంది. వీటిలో బ్రెస్ట్ కేన్సర్ కూడా ఒకటి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ శక్తి ఆస్తమా, మొటిమల బారిన పడకుండా కాపాడుతుంది. కనీసం ఒక స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల మేర ఫ్లాక్స్ సీడ్ ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
దాల్చిన చెక్క (చిన్నమోన్)
వ్యాధులను సమర్థవంతంగా నివారించే సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి ఇది ఒక సహజ ఔషధంగా చెబుతారు. రక్తంలో చక్కెరలను నియంత్రించే శక్తి దీనికుంది. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ జాజికాయ పొడి, అర టీ స్పూర్ లవంగాలు, ఒక టీ స్పూన్ యాలకులు, ఒక టీ స్పూన్ మసాలాతో కలిపి చేసే యాపిల్ పీ స్పైస్ తీసుకుంటే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందట. అలాగే, దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ గుణాలున్నాయి. ‘ఈ-కొలి’ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను అణగదొక్కగలదని పరిశోధనల్లో రుజువైంది. ప్రతి రోజూ పావు టీ స్పూన్ మేర ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తుంది. టోటల్ కొలెస్ట్రాల్ సైతం 12 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. లేదంటే కొంత దాల్చిన చెక్క పొడిని కాఫీ, టీలో వేసుకుని తాగినా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ వేరు, సాధారణ టీ వేరు. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. గుండెకు చేటు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ను సైతం తగ్గిస్తాయి. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రోక్, కేన్సర్ ల రిస్క్ ను తగ్గించేందుకు సాయపడతాయి. రక్తనాళాల్లో అడ్డంకులను సైతం తొలగించి, రక్తనాళాల పనితీరును సైతం మెరుగుపరుస్తాయి. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల మేర గ్రీన్ టీ తీసుకునే వారిలో రక్తనాళాలు కుచించుకుపోవడం 46 శాతం తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.గ్రీన్ టీలో పోషకాలు కూడా ఉంటాయి. ఇందులోని ఈజీసీజీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఏర్పడడాన్ని తగ్గించి కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇంకా గ్రీన్ టీలో మినరల్స్ సైతం స్వల్ప పరిమాణంలో ఉంటాయి. గ్రీన్ టీ తాగే మహిళల్లో 22 శాతం మేర బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. మరో పరిశోధనలో గ్రీన్ టీ తాగే పురుషుల్లో 48 మందికి ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు తగ్గిందని తేలింది. చైనాలో 69,710 మహిళలపై అధ్యయనం చేయగా, వీరు గ్రీన్ టీ తాగడం వల్ల 57 శాతం కొలరెక్టల్ కేన్సర్ రిస్క్ తగ్గిందని గుర్తించారు.
బీన్స్
బీన్స్ గుండెకు మేలు చేసేవి. వీటిలో ఉండే సొల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిపోయేలా చేస్తుంది. దీంతో ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలపై పేరుకునే లోపే వాటిని శరీరం బయటకు పంపిచేస్తుంది. అందుకే గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలున్నవారు పీచు పదార్థాలు ఉండే వాటిని అధికంగా తీసుకోవాలి. సొల్యుబుల్ ఫైబర్ అధికండా ఉండే బీన్స్ తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ 15 శాతం వరకు తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. రోజులో ఒక కప్పు మేర బీన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బీన్స్ లో 2 నుంచి 3 శాతమే ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. మాంసాహారం తీసుకోని వారు తినాల్సిన చక్కని ప్రత్యామ్నాయం ఇది. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉండేందుకు బీన్స్ ఉపయోగపడతాయి.