వాట్సాప్ ఫీచర్స్ అదుర్స్... వీటి గురించి మీకు తెలుసా?
వాట్సాప్ ఇన్ స్టంట్ మెస్సెంజర్ నేడు చాలా మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉపయోగించే యాప్. అతిపెద్ద సమాచార వారధి. మెస్సేజ్ వస్తే చూసుకోవడం, రిప్లయ్ ఇవ్వడం, స్వయంగా మెస్సేజ్ పోస్ట్ చేయడం, ఫొటోలు, వీడియో పంపుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం ఇవన్సీ వాట్సాప్ తో బాగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడివారితోనో అనుసంధానిస్తున్న ఈ డీజిటల్, సామాజిక మాధ్యమంలో ఎన్నో ఫీచర్లున్నాయి. అయితే అన్నింటి గురించి తెలిసింది తక్కువ మందికే
టు స్టెప్ వెరిఫికేషన్
ఇది అధిక భద్రతనిచ్చే ఫీచర్. వాట్సాప్ వాడడం చాలా సులభం అన్న విషయం తెలిసిందే. యాప్ డౌన్ లోడ్ చేసుకుని మీ మొబైల్ నంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ ను యాప్ లో టైప్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ ను ఎవరైనా కొట్టేశారనుకోండి, అప్పుడిక పరిస్థితి ఏంటి..? మీ వాట్సాప్ ఖాతాను వేరే వాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే దీన్ని నివారించేందుకు టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ను వాట్సాప్ తెచ్చింది. దీనికి మీరు ఆరు అంకెల పాస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఏ ఫోన్లో అయినా, మీ వాట్సాప్ ఖాతాను యాక్టివేట్ చేసుకునే ముందు ఈ పాస్ కోడ్ ను వాట్సాప్ అడుగుతుంది. ఇది ఇస్తేనే మీ ఖాతా పనిచేస్తుంది. ఒకవేళ దీన్ని మర్చిపోతే ఈ మెయిల్ ద్వారా రీసెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆప్షన్ అకౌంట్ విభాగంలో ఉంటుంది.
గ్రూపులో ఫనాలా మెస్సేజ్ కు రిప్లయ్లా ఎలా?
వాట్సాప్ గ్రూపులో 250 మంది వరకూ సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది. గ్రూపులో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఆ గ్రూపులో మీరు కూడా ఉన్నారనుకోండి. గ్రూపు అన్న తర్వాత ప్రతీ రోజూ పదుల సంఖ్యలో సందేశాలు పోస్ట్ చేస్తుంటారు. వారిలో ప్రత్యేకంగా ఎవరో ఒకరి పోస్ట్ కు స్పందించాలనుకుంటున్నారు... వాళ్లెవరో తెలియదు. అలాంటప్పుడు నేరుగా వారి పోస్ట్ కే స్పందిస్తున్నట్టు తెలియజేసే అవకాశం ఉంది. ఏ పోస్ట్ కు అయితే స్పందించాలనుకుంటున్నారో ఆ పోస్ట్ పై ప్రెస్ చేసి ఉంచాలి. అది సెలక్ట్ అయిన వెంటనే ఆండ్రాయిడ్ యాప్ అయితే పై భాగంలో యారో మార్కులు రెండు కనిపిస్తాయి. ఒకటి ఎడమ చేతి వైపు తిరిగి ఉంటుంది. ఇంకోటి కుడిచేతి వైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు యారో మార్కును సెలక్ట్ చేసుకున్న వెంటనే అసలు మెస్సేజ్ ను కాపీ చేసి ఓ బాక్స్ క్రియేట్ అవుతుంది. దానిపై మీరు టెక్స్ట్ రాసి పోస్ట్ చేయడమే.
గ్రూపులో మీ మెస్సేజ్ ఎవరు చదివారు...?
గ్రూపులో చాలామంది సభ్యులుంటారు. కానీ ఒక సందేశాన్ని ఎవరైనా చూశారా? లేదా అన్నది ఎలా తెలుస్తుంది...? విడిగా ఓ కాంటాక్టుతో చాట్ చేస్తే, వారు మీ మెస్సేజ్ చూసిన వెంటనే బ్లూరంగులో డబుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది. కానీ గ్రూపులో ఏ మార్కూ కనిపించదు. అయినప్పటికీ మీరు పోస్ట్ చేసిన మెస్సేజ్ ను ఎవరు చూసిందీ తెలుసుకునే సదుపాయం ఉంది. ఇందుకు మీరు పోస్ట్ చేసిన మెస్సేజ్ ను ప్రెస్ చేసి ఉంచితే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యాప్ పై భాగంలో i మార్కు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చూసినవారి జాబితా కనిపిస్తుంది.
వాయిస్ మెస్సేజ్ లను రహస్యంగా వినడం
కొందరికి టెక్స్ట్ పోస్ట్ చేయడం అంటే తెగ బద్ధకం. సులభంగా వాయిస్ రూపంలో మెస్సేజ్ పంపుతుంటారు. పొరపాటున దాానిపై వేలు పడినా ఆ వాయిస్ బయటకు వినబడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది. ఆ సమయంలో మీరు వెంటనే ఆ ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకుంటే చాలు. ఇక ఆ వాయిస్ ఓపెన్ స్పీకర్ నుంచి ఇయర్ స్పీకర్ కు మారిపోతుంది. దాంతో మీ చెవికి వినిపిస్తుందేగానీ బయటకు కాదు.
మీ టెక్స్ట్ మంచిగా కనిపించాలంటే...?
పోస్ట్ చేసే లెటర్స్ మరింత ప్రత్యేకంగా కనిపించాలంటే అందుకు వీలుంది. వాట్సాప్ లో మీ టెక్స్ట్ కు ముందు, తర్వాత * గుర్తుతో పోస్ట్ చేయండి. దాంతో అవి బోల్డ్ గా కనిపిస్తాయి. అలాగే మెస్సేజ్ కు ముందు, తర్వాత _ అండర్ స్కోరు గుర్తుతో పోస్ట్ చేయండి అవి ఇటాలియన్ స్టయిల్ లో కనిపిస్తాయి. అలాగే, స్పెషల్ కేరక్టర్లు (బ్రాకెట్లు, కామాలు, డేష్ లు) టెక్స్ట్ కు అటువైపు, ఇటువైపు టైప్ చేసి పోస్ట్ చేసినా అవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.
ఒకే మెస్సేజ్ ఎక్కువ మందికి
ఒకటే సందేశాన్ని ఒకే సమయంలో ఎక్కువ మందికి పంపించాలంటే విడివిడిగా ఒక్కొక్కరి కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకుంటూ పంపాల్సిన పనిలేదు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పై భాగంలో మూడు చుక్కలతో ఉన్న మెనూను క్లిక్ చేస్తే ‘న్యూ బ్రాడ్ కాస్ట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే కాంటాక్టు లిస్ట్ లోకి వెళతారు. కాంటాక్టుల్లో మీరు ఎవరికైతే పంపాలనుకున్నారో వారి కాంటాక్టును సెలక్ట్ చేసుకుంటే బ్రాడ్ కాస్ట్ లిస్ట్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత అది కాంటాక్టుల్లో అన్నింటికంటే పైన కనిపిస్తుంది. కావాలనుకున్నప్పుడు బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ను ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త పేర్లను యాడ్ చేసుకోవడం, ఉన్నవారిని తొలగించడం వంటివి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా మెస్సేజ్ ను పంపుతున్న సమయంలో కాంటాక్టు లిస్టుల్లో కనిపించే బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ను ఎంచుకుంటే ఒకేసారి అందరికీ చేరుతుుంది.
డేటా వినియోగం తగ్గించుకోవాలా...?
వాట్సాప్ లో డిఫాల్ట్ గా ఓ ఆప్షన్ ఉంటుంది. వాట్సాప్ లో ఎవరైనా పంపిన ఇమేజెస్, వీడియోలు డౌన్ లోడ్ అయిపోతాయి. దీనివల్ల డేటా వినియోగం బాగా పెరిగిపోతుంది. అంతేకాదు ఫోన్ మెమరీ మొత్తం నిండిపోతుంది. ఈ ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఆటోమేటికల్లీ డౌన్ లోడ్ ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి మీకు ఎవరైనా ఫొటోలు, వీడియోలు పంపితే మీరు వాటిని టాప్ చేసి డౌన్ లోడ్ చేసుకుంటేనే డౌన్ లోడ్ అవుతాయి. దీనివల్ల డేటా వినియోగం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకుంటే అవసరం అనుకున్న వీడియోలు, ఫొటోలనే డౌన్ లోడ్ చేసుకుంటారు గనుక. ఇక మీడియా డౌన్ లోడెడ్ ఆప్షన్ లోనూ డేటా, వైఫై అన్న ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. అంటే ఒకవేళ వైఫై డేటాపై డౌన్ లోడ్ కోరుకుంటే దాన్ని ఓకే చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ లో డేటా యూసేజ్ ఆప్షన్ కు వెళ్లాలి. దీనికి తోడు లోడేటా యూసేజ్ అనే ఆప్షన్ కూడా ఉంది. వాట్సాప్ కాల్ చేసుకున్నప్పుడు తక్కువ డేటా ఉపయోగించుకునేందుకు ఇది. అలాగే, మీడియా (ఫొటోలు, వీడియోలు) ఏ నెట్ వర్క్ లో డౌన్ లోడ్ కావాలన్నదీ సెట్ చేసుకోవచ్చు. అంటే వైఫ్ కు కనెక్ట్ అయినప్పుడా లేక మొబైల్ లో డేటా ఆన్ చేసినప్పుడు డౌన్ లోడ్ కావాలా అన్నది నిర్ణయించవచ్చు.
చాట్స్, గ్రూపుల ను మ్యూట్ చేసేద్దాం
కొన్ని చాట్ కాంటాక్టుల నుంచి అదే పనిగా మెస్సేజ్ లు వస్తున్నాయా...? గ్రూపులో వందల మంది సభ్యులు చేసే పోస్ట్ లు, ఆ నోటిఫికేషన్లతో చిరాకు అనిపిస్తోందా..? అయితే వాటిని మ్యూట్ చేసేయండి. ఆడియో రూపంలో అలర్ట్ ను, నోటిఫికేషన్ ను కూడా మ్యూట్ చేయవచ్చు. దాంతో మెస్సేజ్ వచ్చినాగానీ మీకు తెలియదు. ప్రత్యేకంగా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడే ఆయా మెస్సేజ్ లు వచ్చినట్టు తెలుస్తుంది. మ్యూట్ చేసేందుకు కాంటాక్టును లేదా గ్రూపును సెలక్ట్ చేసుకుంటే మెనూ మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
గోప్యత/రహస్యం
వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ లోనే ఉన్న మీ సన్నిహితులు, స్నేహితులు మీరు చివరిగా ఎప్పుడు వాట్సాప్ లోకి వచ్చారు, వారు పంపిన సందేశాలను మీరు చూశారా లేదా తెలుసుకోవచ్చు. వాట్సాప్ ఓ కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత పై భాగంలో ఆ కాంటాక్టుకు చెందిన వ్యక్తి ఎప్పుడు వాట్సాప్ లోకి వచ్చిందో సమయాన్ని పేర్కొంటూ లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది. ఇక మీరు మీరు మెస్సేజ్ లు, ఫొటో, వీడియోలను చూస్తే వాటిపై బ్లూ రంగు డబుల్ టిక్ మార్క్ ఉంటుందని తెలుసు కదా. ఇలా మీరు చూసింది ఎదుటి వారికి తెలియకూడదంటే లాస్ట్ సీన్ ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవాలి. బ్లూకలర్ టిక్ మార్క్ ను కనిపించేదాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో అకౌంట్ విభాగంలోకి వెళితే ప్రైవసీ అనే ఆప్షన్ ఒకటుంది. ఈ ప్రైవసీలో గోప్యతకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. అయితే, మీరు మీ ఉనికిని కనిపించకుండా ప్రైవసీ సెట్టింగ్స్ పెడితే మాత్రం ఎదుటి వారు మీ మెస్సేజ్ లు, ఫొటోలు చూసినదీ మీకు తెలియదు. అలాగే, మీ కాంటాక్టుల్లోని వారు చివరిసారిగా వాట్సాప్ కు ఎప్పుడు వచ్చినదీ కూడా తెలియదు. మీరు ఏవైతే ప్రైవసీ కావాలనుకున్నారో, అదే ప్రైవసీ మీ కాంటాక్టులకు కూడా వాట్సాప్ అమలు చేస్తుంది.
డాక్యుమెంట్ల షేరింగ్
వాట్సాప్ లో ఫొటోలు, వీడియోలతోపాటు డాక్యుమెంట్లను కూడా పంపుకోవచ్చు. పీడీఎఫ్, ఎక్సెల్, వర్డ్ ఫైల్స్ ను పంపుకోవచ్చు.
హోమ్ స్క్రీన్ పై చాట్ షార్ట్ కట్
మీరు కొన్ని కాంటాక్టులతో తరచుగా చాట్ చేస్తుంటే తరచూ వాట్సాప్ లో వారి కోసం సెర్చ్ చేసుకునే శ్రమ లేకుండా షార్ట్ కట్ పెట్టేసుకుంటే సరి. ఇందుకోసం వాట్సాప్ లో చాట్స్ లిస్ట్ కు వెళ్లి కాంటాక్టుపై ప్రెస్ చేసి పైన మూడు చుక్కలున్న మెనూలో ‘యాడ్ చాట్ షార్ట్ కట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే ఆ కాంటాక్టు ఐకాన్ హోమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేరుగా ఆ కాంటాక్టు ఓపెన్ అవుతుంది.కం
ప్యూటర్ పై వాట్సాప్
కంప్యూటర్ పై పనిచేసుకుంటున్నారు. అదే సమయంలో వాట్సాప్ ను కూడా వాడుకోదలిస్తే మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ను కంప్యూటర్ పైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం కంప్యూటర్ బ్రౌజర్ లో http://web.whatsapp.com ను ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ ను ఫోన్ లో ఓపెన్ చేసి మెనూ (మూడు చుక్కులతో కుడి చేతి వైపు పై భాగంలో) ఓపెన్ చేయాలి. అందులో వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. దాని సాయంతో వెబ్ వాట్సాప్ డాట్ కామ్ సైట్ లో కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. దాంతో కనెక్ట్ అవుతుంది. ఈ అనుసంధానానికి డేటా కీలకం.
మీకు మీరే మెస్సేజ్ పంపుకోండి
వాట్సాప్ లో ఓ కాంటాక్టుకు మెస్సేజ్ పంపడానికి ముందు దాన్ని మీకే పంపుకుని టెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయండి. అందులో ఒకిరిద్దర్ని యాడ్ చేయండి. ఆ తర్వాత వారిని డిలీట్ చేస్తే మీరు ఒక్కరే ఉంటారు. అప్పుడు అక్కడ మెస్సేజ్ పంపుకుంటే మీకు మాత్రమే వస్తుంది.
ఫోన్ నుంచి కంప్యూటర్ కు ఫైల్స్ పంపడం
ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీకు మీరే ఫైల్స్ పంపుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా కంప్యూటర్ లో వాట్సాప్ ఓపెన్ చేసుకుని ఆ పంపిన ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
నోటిఫికేషన్ కనిపించకూడదంటే
వాట్సాప్ లో మెస్సేజ్ వస్తే పైకి నోటిఫికేషన్ ఐకాన్ కనిపించకూడదనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి వాట్సాప్ నోటఫికేషన్ ను డిసేబుల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏ మెస్సేజ్ వచ్చినా వాట్సాప్ నుంచి మీకు నోటిఫికేషన్ రాదు. తిరిగి ఆన్ చేసుకుంటే తప్ప.
ప్రపంచంలో ఎక్కడికైనా కాల్
వాట్సాప్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నవారికైనా కాల్ చేసుకోవచ్చన్న విషయం తెలిసే ఉంటుంది. ఇందుకు అదనంగా ఎటువంటి చార్జీలు చెల్లించక్కర్లేదు. కేవలం డేటా ఉంటే చాలు. నెట్ నిదానంగా ఉన్నా కాల్స్ చేసుకోవచ్చు. కానీ, అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటువైపు సరిగ్గా వినిపించేందుకు కొన్ని సెకన్ల పాటు అదనంగా సమయం తీసుకుంటుంది. వీడియో కాల్ సదుపాయం ఉండడం ఆకర్షణీయాంశం.
వద్దనుకున్న వారిని బ్లాక్ చేసేయండి
గుర్తు తెలియని వారి నుంచి మీకు తరచుగా మెస్సేజ్ లు వస్తుంటే వాటిని బ్లాక్ చేయవచ్చు. వారి నుంచి మెస్సేజ్ వచ్చినప్పుడు కింద మూడు ఆప్షన్లు... రిపోర్టు స్పామ్, బ్లాక్, యాడ్ టు కాంటాక్స్ట్ కనిపిస్తాయి. అక్కడ బ్లాక్ ఆప్షన్ ఓకే చేసుకోవచ్చు. అది స్పామ్ అనుకుంటే స్పామ్ సెలక్ట్ చేసుకోవాలి. మీకు తెలిసిన వారయితే వారిని యాడ్ టు కాంటాక్ట్ అని యాడ్ చేసుకునేది చివరి ఆప్షన్. స్పామ్ అని రిపోర్ట్ చేస్తే ఇక ఆ తర్వాత ఆ కాంటాక్టు నుంచి మీకు ఎటువంట మెస్సేజ్ లు రావు. ఒకవేళ ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటే ఇబ్బంది కదా. అందుకే పంపిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని సాయంతో పంపిన వారి వివరాలను తెలుసుకుని అప్పుడు ఓ నిర్ణయానికి రావచ్చు.
వాట్సాప్ లో ఓ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలంటే..
మెనూలో న్యూ గ్రూప్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే కాంటాక్టుల లిస్ట్ కు వెళుతుంది. అక్కడ గ్రూపులో ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్టులను సెలక్ట్ చేసుకోవాలి. అలా సెలక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లోనే కింది భాగాన కుడిచేతివైపు యారో మార్క్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసుకుంటే గ్రూపు సబ్జెక్ట్ (పేరు) అడుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్న టిక్ మార్క్ ను సెలక్ట్ చేస్తే గ్రూపు ఏర్పాటవుతుంది.
ఒకేసారి ఒకటికిమించిన వాటిని తొలగించడం
వాట్సాప్ లో ఎవరితో అయినా చాట్ చేసిన తర్వాత వాటన్నింటినీ డిలీట్ చేసుకోవడం పెద్ద ప్రయాసగా ఉండేది. ఇప్పుడు నచ్చని మెస్సేజ్ పై రెండు సెకన్లపాటు ప్రెస్ చేసి ఉంచితే సెలక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏవి డిలీట్ చేయాలనుకుంటే వాటిని సెలక్ట్ చేసుకుంటే చాలు. చివరిగా డిలీట్ సింబల్ ను ఓకే చేస్తే అన్నీ ఒకేసారి ఒక్క సెకన్ లో డిలీట్ అయిపోతాయి.
నచ్చిన మెస్సేజ్ లకు స్టార్ గుర్తుతో హైలైట్
చాట్ లో ముఖ్యమైనవి అనుకున్నవి, నచ్చినవాటికి స్టార్ గుర్తు కేటాయించి వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా మెస్సేజ్ లపై కొంచెం ఎక్కువ సమయం పాటు (అంటే సెకనుకు మించి) ప్రెస్ చేస్తే వాట్సాప్ పై భాగంలో స్టార్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆయా మెస్సేజ్ ల పక్కన స్టార్ గుర్తు చేరిపోతుంది. వీటిని ఫేవరైట్ గా చాట్ పేజ్ లోనే సేవ్ అయ్యేలా ఉంచుకోవచ్చు. డిలీట్ చేయాలనుకుంటే స్టార్ మెస్సేజ్ లు తప్ప మిగిలిన వాటిని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. చాట్ లో పై భాగంలో ఉండే మూడు చుక్కల మెనూ భాగంలోకి వెళితే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే అందులో క్లియర్ చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసిన వెంటనే సంబంధిత చాట్ లోని మెస్సేజ్ లు డిలీట్ అయిపోవడానికి రెడీ అయినట్టు. దానికంటే ముందు ‘కీప్ స్టార్డ్ మెస్సేజ్’ సెలక్ట్ అయి కనిపిస్తుంది. దాన్ని అలానే ఉంచి ఓకే చేస్తే స్టార్ గుర్తు కేటాయించినవి మినహా అన్నీ డిలీట్ అయిపోతాయి. స్టార్ కేటాయించినవి కూడా డిలీట్ కావాలంటే ఆ సెలక్షన్ ను ఆఫ్ చేస్తే సరిపోతుంది.
తర్వాత చదువుదామనుకుంటే
ఏదైనా చాట్ ను తర్వాత చదువుదామనుకుంటే అందుకు గుర్తు పెట్టుకునే మార్గం ఉంది. ఉదాహరణకు మీరున్న ఓ గ్రూపులో 35 మెస్సేజ్ లు చదవాల్సి ఉంది. ఓపెన్ చేశారు. ఈ లోపే అత్యవసర పని ఉందనుకోండి. అప్పుడు వెనక్కి వచ్చేసి ఆ చాట్ గ్రూపుపై గట్టిగా సెలక్ట్ చేసుకుని పైన మెనూ భాగంలో చూస్తే మార్క్ యాజ్ అన్ రీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసుకోవాలి.
నోటిఫికేషన్ బార్ నుంచే రిప్లయ్
ఎవరి నుంచి అయినా మెస్సేజ్ వస్తే ఫోన్ స్క్రీన్ పై భాగంలో వాట్సాప్ మెస్సేజ్ లు వచ్చినట్టు సింబల్ కనిపిస్తుంది. దానికి మీరు రిప్లయ్ ఇవ్వాలనకుంటే అక్కడి నుంచే ఇవ్వవచ్చు. కాకపోతే ఒక్క కాంటాక్టు నుంచి మెస్సేజ్ వచ్చినప్పుడే ఈ ఆప్షన్ ఉంటుంది.
స్పేస్ లేకుంటే గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్
వాట్సాప్ లో అన్ని చాట్ లు, ఫైల్స్ ను గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ తీసుకోవచ్చు. మీరు ఫోన్ మార్చినప్పుడు, ఒకవేళ ఫోన్ పోయినప్పుడు ఈ ఆప్షన్ చక్కగా ఉపయోగపడుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాకప్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాకప్ ఏవి చేయాలన్న వెసులుబాటు కూడా ఉంది. అంటే కేవలం చాట్స్ వరకేనా, మీడియా, డాక్యుమెంట్లు కూడానా అన్నది ఉంటుంది. అయితే, ఇలా గూగుల్ కు బ్యాకప్ తీసుకుంటే ఆ మేరకు డేటా వినియోగం అవుతుంది.
మెయిల్ కు పంపుకోవచ్చు
ముఖ్యమైన చాట్స్ ను భద్రంగా ఉంచుకోవాలంటే చాట్ స్క్రీన్ లో ఆప్షన్స్ మెనూకి వెళ్లి మోర్ ఎంచుకోవాలి. అక్కడ ఈ మెయిల్ చాట్ అని ఉంటుంది. దాన్ని ఓకే చేసుకోవడం ద్వారా ఈ మెయిల్ కు పంపుకోవచ్చు.
వాల్ పేపర్ మార్చుకోవచ్చు
చాట్ స్క్రీన్ ను విభిన్నంగా ఉంచుకోవాలంటే వాట్సాప్ వరకూ ప్రత్యేకంగా వాల్ పేపర్ ను పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ లో చాట్స్ ను ఎంచుకుని అక్కడ వాల్ పేపర్ కు వెళ్లి సెట్ చేసుకోవచ్చు.
తెలుగులో కావాలా...
నచ్చిన భాషను కూడా ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు సహా 11 భారతీయ భాషలను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఆప్షన్స్ లో చాట్స్ కు వెళ్లి యాప్ లాంగ్వేజ్ ఉంటుంది. అక్కడ భాషను సెలక్ట్ చేసుకోవచ్చు.
సెర్చ్ ఆప్షన్
మీరు ఓ పెద్ద గ్రూపులో ఉన్నారనుకోండి. అలాగే, ఒకే వ్యక్తితో సుదీర్ఘమైన చాట్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు ఆ మెస్సేజ్ లలో ఫలానాది కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. యాప్ పై భాగంలో ఆప్షన్లలో సెర్చ్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని టెక్ట్స్ టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే ఆ మెస్సేజ్ ను చూపిస్తుంది. ఉదాహరణకు లైక్ పేరుతో ఉన్న మెస్సేజ్ కావాలంటే లైక్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకోవడమే.
అప్ డేట్స్ ముందుగా మీకు
వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చే ఫీచర్ల గురించి యూజర్ల కంటే ముందుగా మీకు తెలియాలనుకుంటే బీటా టెస్టర్ గా మారడమే. ఇందుకోసం వాట్సాప్ వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా కొత్త ఫీచర్ ను యూజర్ల ముందుకు తీసుకురాడవడానికి కంటే ముందు దాన్ని బీటా టెస్టర్లకు వాట్సాప్ రిలీజ్ చేస్తుంది. అందులో ఉండే సమస్యల గురించి తెలుసుకుని అప్ డేట్ చేసి ఆ తర్వాత యూజర్లు అందరికి విడుదల చేస్తుంది.
మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో మ్యాప్ సాయంతో చెప్పేయవచ్చు
వాట్సాప్ లోని గొప్ప ఫీచర్లలో ఇదీ ఒకటి. ఎవరినయినా కలవాలనుకుంటే మీరున్న లొకేషన్ ను అవతలి వ్యక్తికి మ్యాప్ సాయంతో తెలియజేయవచ్చు. ఇందుకోసం జీపీఎస్ ఆప్షన్ ఉండాలి. దాన్ని ఓకే చేసుకుని అటాచ్ మెంట్ ఐకాన్ ను సెలక్ట్ చేయాలి. తర్వాత మీరున్న లొకేషన్ ను ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎక్కడున్నది పిన్ చేసి దాన్ని వాట్సాప్ ద్వారా పంపుకోవచ్చు. అవతలి వ్యక్తి మీ నుంచి వచ్చిన మెస్సేజ్ ను క్లిక్ చేస్తే వారి ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. అందులో చూపిస్తున్న డైరెక్షన్ ను ఫాలో అయితే సరిపోతుంది.
కాంటాక్టులను షేర్ చేసుకోవడం
గతంలో ఒకరి కాంటాక్టు నంబర్ గురించి ఇతరులకు తెలియజేయాలంటే ఫోన్ కాల్ చేసి చెప్పడం, మెస్సేజ్ పంపడం లేదంటే మెయిల్ చేయడం చేసేవారు. కానీ వాట్సాప్ లో సులభంగా పంపుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ లో పంపదలచిన కాంటాక్టును ఓపెన్ చేసి పైన మెనూ భాగంలో వ్యూ కాంటాక్టు ఉంటుంది. అది ఓకే చేస్తే వారి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ పై భాగంలోని మెనూలో షేర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత కాంటాక్టుల్లోకి వెళతారు. అక్కడ ఎవరిరెవరికి పంపదలిచారో వారి కాంటాక్టులను ఓకే చేసుకుని కింది భాగంలో గ్రీన్ మార్క్ ఓకే చేస్తే సరిపోతుంది.
పొరపాటుగా పంపిన మెస్సేజ్ లను వెనక్కి
ఒక్కోసారి మెస్సేజ్ పొరపాటుగా పంపడం జరుగుతుంది. లేదంటే ఒకరికి బదులు మరొకరికి ఇటువంటి సమయంలో వెంటనే వాటిని డిలీట్ చేయాలంటే అవి చేరేలోపే ఎయిర్ ప్లేన్ మోడ్ ఆన్ చేయాలి. చాలా వేగంగా వ్యవహరిస్తే ఒక్కోసారి వీలవుతుంది. సాధారణంగా డేటా కనెక్షన్ కొంచెం బలహీనంగా ఉన్న సమయాల్లో, అప్పుడప్పుడు మెస్సేజ్ అవతలి వారిని చేరడానికి కొన్ని సెకన్లు పట్టొచ్చు. ఈ లోపే మీరు వేగంగా వ్యవహరించగలగాలి.
పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ లోకి
వాట్సాప్ లోని డేటాను కొత్త ఫోన్ లోకి మార్చుకోవాలంటే ముందుగా గూగుల్ డ్రైవ్ లోకి బ్యాకప్ తీసుకోవాలి. ఆ తర్వాత కొత్త ఫోన్ లో వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకుని పాత నంబర్ తో యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాతే అదే అడుగుతుంది గూగుల్ డ్రైవ్ లోని డేటాను రీస్టోర్ చేసుకోవాలా? అని. ఓకే చేస్తే సరిపోతుంది.
ఒకే ఫోన్ లో ఒకటికి మించిన వాట్సాప్ నంబర్లు
ఇందుకు అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న లింక్ ను సందర్శించగలరు.
https://www.ap7am.com/telugu-articles-262-article.html
వాట్సాప్ అకౌంట్ క్లోజ్ చేయడం, నంబర్ మార్చడం
ఒక నంబర్ కు బదులుగా వాట్సాప్ కు మరో నంబర్ వాడాలనుకుంటే సాధ్యమే. లేదా మీ కాంటాక్టు నంబర్ మారిపోవచ్చు. అలాంటప్పుడు వాట్సాప్ లో సెట్టింగ్స్ ను ఎంచుకోవాలి. అందులో అకౌంట్ ఆప్షన్ కు వెళితే అక్కడే ప్రైవసీ, సెక్యూరిటీ, టూ స్టెప్ వెరిఫికేషన్, చేంజ్ నంబర్, డిలీట్ మై అకౌంట్ ఉంటుంది. అకౌంట్ వద్దనుకుంటే డిలీట్ మై అకౌంట్ ఓకే చేసుకోవాలి. ఆ తర్వాత నంబర్ ఇచ్చి మరో స్టెప్ ముందుకు వెళితే డిలీట్ అయిపోతుంది. నంబర్ మార్చుకోవాలనుకుంటే చేంజ్ నంబర్ ఎంచుకోవాలి. అక్కడ పాత నంబర్, కొత్త నంబర్ ఇస్తే పాత నంబర్ నుంచి కొత్త నంబర్ కు అకౌంట్ మారిపోతుంది. ఇంకా వాట్సాప్ లోనే మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. అందుకే ముందుగా యాప్ లోని అన్ని ఆప్షన్లను ఓసారి పూర్తిగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.