మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...
మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
కాకరకాయ
షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రోజూ ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
మెంతి
మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.
అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)
అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
దాల్చిన చెక్క
గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు మార్పును గుర్తిస్తారు.
పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.
బీన్స్
బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.
బార్లీ
బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.
క్యారెట్స్
క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఉపకరించేదన్న విషయాన్ని గుర్తించాలి.
తోటకూర
రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.
పాలు
ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.
ఓట్ మీల్
ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
క్యాబేజీ
క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
కొద్ది కొద్దిగా ఆహారం
షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.
నట్స్
నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.
దానిమ్మ (పొమెగ్రనేట్స్)
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.
పుచ్చకాయ (వాటర్ మెలాన్)
ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.
కమలాలు
డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.
జామ
మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.
నేరేడుపండ్లు (జామూన్)
ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.
యాపిల్స్
యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.
ఉసిరి
ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.
వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం
సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది. ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.
ఈ వేళల్లో తప్పనిసరిగా....
ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్ తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.
వేకప్ స్నాక్
రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.
బ్రేక్ ఫాస్ట్
ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.
స్నాక్ (11 గంటల సమయంలో)
యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.
లంచ్
బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.
సాయంత్రం స్నాక్
టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.
డిన్నర్
మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.