ప్రాణాల్ని నిలబెట్టే ప్రాథమిక వైద్య సాయం.. ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి!

ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక వైద్య సాయం)... ప్రాణాలను కాపాడే అపురూపమైన సాయం. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అందించే చిన్న సాయంతో వారి జీవితాలను నిలబెట్టవచ్చు. మన దేశంలో ఏటా ప్రమాదాల కారణంగానే వేల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తక్షణం వైద్య సాయం అందితే వీరిలో మూడింట ఒక వంతు మంది ప్రాణాలు నిలబడతాయి. ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకుంటే అవసరంలో ఉన్నవారికి ప్రాణం పోయొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ పోర్టల్ ఇస్తున్న సమాచారం ఇలా ఉంది.

ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండేవి ఇవే
representational imageడ్రస్సింగ్ కోసం స్టెరిల్ గాజ్ ప్యాడ్లు. గాయంపై పెట్టేందుకు వీలుగా చిన్న, మధ్య, పెద్ద సైజులవి తీసుకోవాలి. గ్యాజ్ ప్యాడ్ కదలకుండా కట్టు కట్టేందుకు రోలర్ బ్యాండేజ్ లు. అడెసివ్ టేప్. అడెసివ్ బ్యాండేజెస్. కత్తెర. ట్వీజర్ (చిన్న పట్టకార). సేఫ్టీ పిన్లు. యాంటీసెప్టిక్ వైప్స్. ఇన్ఫెక్షన్ రాకుండా నివారించే డెట్టాల్ లేదా శావలాన్. నొప్పి నివారిణి ఐబూప్రోఫెన్ మాత్రలు. థెర్మోమీటర్. లేటెక్స్ హ్యాండ్ గ్లోవ్స్. వీటిలో కొన్నింటికి ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. ఆ తేదీ తర్వాత వాడిని వాడకూడదు. కనుక ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఐటమ్స్ పై ఉన్న తేదీలను గమనిస్తూ గడువు దాటిన వాటిలో కొత్తవి కొనుగోలు చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ను ఎండ తగలని పొడి, చల్లటి ప్రదేశంలో ఉంచాలి.

రక్తస్రావం అధికంగా అవుతుంటే...?
representational imageప్రమాదం జరిగినప్పుడు వెంటనే అత్యవసర సహాయ ఫోన్ నంబర్108కి కాల్ చేయడం మొదట చేయాల్సిన పని. నిపుణులైన సిబ్బంది వెంటనే వాహనంలో అక్కడికి చేరుకుంటారు. కాల్ చేసి సమాచారం ఇచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా రక్తస్రావాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి. గాయం నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుంటే వెంటనే గాజుగుడ్డతో గాయంపై బలంగా అదిమి ఉంచాలి. దాంతో రక్త ప్రవాహం నిదానిస్తుంది. అత్యవసర వైద్య సిబ్బంది అప్పటికీ రాకుంటే స్వయంగా లేదంటే ఇతరుల సాయంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. అప్పటి వరకూ గాయంపై చేతిని అదిమే ఉంచాలి. ఇలా రక్తస్రావాన్ని చేతితో అదుపు చేసే ముందు అందుబాటులో గ్లోవ్స్ ఉంటే వాటిని చేతికి ధరించడం రోగికి సురక్షితం. అధికంగా రక్తస్రావం అయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కడగరాదు. దీనివల్ల రక్తాన్ని గడ్డకట్టించే కణాలు కూడా వెళ్లిపోయి మరింత రక్తస్రావం అవుతుంది. చిన్న గాయాలైతే కొద్ది సేపటికి రక్తస్రావం ఆగిపోతుంది. ఆ తర్వాత గాయంపై మట్టి, మురికి పోయేందుకు శుభ్రమైన నీటితో కడిగి యాంటీ సెప్టిక్ లోషన్ తో క్లీన్ చేసి గాజుగుడ్డతో కట్టేయవచ్చు.

ముక్కుల్లోంచి రక్తం వస్తుంటే..
ముక్కులోపలి రక్తనాళాలు చిట్లడం వల్లే రక్తస్రావం అవుతుంది. ఇలా చిన్న గాయం కారణంగానూ జరుగుతుంది. ఎందుకంటే ముక్కలోపలి రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ముక్కు నుంచి రక్తం కారుతుంటే తలను వెనక్కి వాల్చకుండా చూసుకోవాలి. ఎందుకంటే  తలను వెనక్కి వాల్చితే ముక్కునుంచి విడుదలయ్యే రక్తం శ్వాస నాళిక ద్వా ఊపరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ముక్కు రంధ్రాల నుంచి రక్తస్రావం కనిపించినప్పుడు ముక్కు పై భాగంలోని ఎముకను పట్టుకోకుండా పక్క నుంచి రెండు వేళ్లతో పట్టుకుని పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవాలని సూచించొచ్చు. పది నిమిషాలకు కూడా రక్తస్రావం నియంత్రణలోకి రాకపోతే, తలనొప్పి, తల తిరగడం, చెవుల్లో మోత, కంటిచూపులో తేడా వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కొన్ని సార్లు చెవుల్లోంచి కూడా రక్తస్రావం కనిపించొచ్చు. అంతర్భాగంలో గాయం అవడం వల్ల ఇలా జరుగుతుంది.

సీపీఆర్
representational imageప్రమాదానికి గురైన వ్యక్తిలో నాడి స్పందనలు లేకుంటే, శ్వాస తీసుకోవడం లేదంటే వెంటనే సీపీఆర్ చేయాలి. అంటే గుండెని తిరిగి పనిచేసేలా చేయడం. కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయాల్లో వెంటనే గుండె పై భాగంలో రెండు చేతులను ఉంచి కుదుపునకు గురి చేయాలి. బాధితుని నోరు తెరిచి తమ నోటితో లోపలికి గాలిని గట్టిగా వదలడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తున్న సమయంలో చేతి వేళ్లతో బాధితుని ముక్కు రంధ్రాలను మూసివేసి ఉంచాలి. రక్త ప్రసరణ, శ్వాస తీసుకోవడం తిరిగి ఆకస్మికంగా ప్రారంభమయ్యే వరకూ ఈ చర్యల్ని కొనసాగించాలి.

హార్ట్ ఎటాక్
representational imageమనకు సమీపంలో ఎవరైనా హార్ట్ ఎటాక్ కు గురైనట్టు గుర్తిస్తే వారిని కూర్చోబెట్టాలి. వారిని మాడ్లాడించకుండా ఉండాలి. ఛాతీనొప్పి లేదా గుండెకు సంబంధించి ఏవైనా మందులు వాడుతున్నారేమో కనుక్కుని వాటిని (నైట్రోగ్లిజరిన్ వంటివి) వెంటనే వేయవచ్చు. నైట్రో గ్లిజరిన్ ఇచ్చిన మూడు నిమిషాల తర్వాత కూడా నొప్పిగానే ఉంటే... బాధితుడు అపస్మారకస్థితిలోకి వెళుతుంటే, లేక స్పందించలేని స్థితిలో ఉంటే నిమిషాల్లోనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి నోటి ద్వారా మందు బిళ్ల తప్ప ఇతరత్రా ఇంకేదీ ఇవ్వకూడదు. వీరికి ఈ సమయంలో సీపీఆర్ ప్రక్రియ చేయడం ప్రాణాలను నిలబెడుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే వారిని బల్లపై లేదా ఫ్లాట్ గా ఉన్న చోట పడుకోబెట్టి చాతీపై రెండు చేతులతో కుదుపునకు గురిచేయాలి. ముక్కును మూసి నోటిలో నోరు పెట్టి గట్టిగా గాలిని వదలాలి. చేతితో గుండె పై భాగంలో 30 సార్లు ఒత్తిడితో కుదుపునకు గురి చేసిన తర్వాత నోటిలో నోరు పెట్టి గాలి వదలడాన్ని రెండు సార్లు చేయాలి. ఇలా వైద్య నిపుణుల వద్దకు సదరు వ్యక్తిని చేర్చే వరకూ లేదా 108 సిబ్బంది వచ్చే వరకూ కొనసాగించాలి. 1 - 8 ఏళ్లలోపు వయసున్న చిన్నారులైతే ఒక్క చేతినే కుదుపునకు వినియోగించాలి. ఏడాదిలోపు చిన్నారులైతే రెండు వేళ్లతోనే కుదుపునకు గురిచేయాలి. నోటిలో నోరు పెట్టి బలంగా కాకుండా చిన్నగా గాలి వదలాలి. తలను వెనక్కి వాల్చడం, గడ్డాన్ని పైకి ఎత్తడం చేయరాదు.

ఇవి చేయరాదు...
ఒకవేళ బాధితుడికి ప్రాణాపాయం లేకుంటే, వెన్నుపూస గాయం అయినట్టు అనిపిస్తే రోగిని ప్రమాద స్థలం నుంచి కదిలించే ప్రయత్నం చేయరాదు. ఫ్రాక్చర్ అయితే ఆ భాగంలో పట్టుకోరాదు.

ఒళ్లు చల్లబడితే
పాలిపోయిన శరీరంతో ఒళ్లంతా చల్లబడి, మగత స్థితిలోకి వెళుతున్నట్టు కనిపిస్తే... దీనర్థం శరీరమంతటా రక్తప్రసరణ సరిగా జరగడం లేదని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా భావించాలి. ఈ స్థితిలో ఆలస్యం చేస్తే ప్రాణాలు దక్కవు. ఇలా ఉంటే శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందక హార్ట్ ఎటాక్ లేదా అవయవ వైఫల్యాలకు దారితీస్తుంది. షాక్ కు గురైనట్టు అనిపిస్తే వెంటనే ఆ వ్యక్తి కాళ్లను ఎత్తులో పెట్టాలి. దీంతో గుండె, మెదడుకు రక్తం అందుతుంది. దానివల్ల ప్రాణాలు నిలబడతాయి. శరీరంలో ఛాతీ పై భాగంలో గాయాల కారణంగా రక్తస్రావం అవుతుంటే నివారించేందుకు తల భాగాన్ని ఎత్తులో ఉంచేలా చూడాలి.

తలకు గాయమైతే
తలకు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళితే వెంటనే అత్యవసర సహాయ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలి. మైకంలో ఉండడం, తలనొప్పి, అయోమయం, అస్వస్థతగా ఉండడం, చూపు మసకబారడం, ఏం జరిగిందో తెలియకపోవడం ఇవన్నీ కూడా తలకు గాయం కారణంగా, షాక్ వల్ల ఎదురయ్యే లక్షణాలు. ఈ సమయాల్లో నొప్పి నివారిణి మాత్రలు ఇవ్వరాదు. దీనివల్ల తీవ్ర గాయం తాలూకూ లక్షణాలను తెలియకుండా అవి చేస్తాయి.

షాక్ కు గురైతే...
representational imageమెదడుకు తగినంత రక్త సరఫరా జరగదు. అంటే ఆక్సిజన్ తగినంత అందదు. దీంతో మూర్చపోవడం, తల తిరగడం వంటివి కనిపిస్తాయి. ప్రమాదానికి గురై రక్తాన్ని కోల్పోయినప్పుడు, వంట్లో నీరు, లవణాలను కోల్పోయినప్పుడు, ఏదైనా సీరియన్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, తీవ్రంగా కాలిన గాయలైనప్పుడు షాక్ కు లోనవుతారు. రక్తనాళాల్లో తగినంత రక్తం లేనప్పుడు రక్తపోటు బాగా పడిపోతుంది. దాంతో మెదడుకు ఆక్సిజన్ చాలా తక్కువగా వెళుతుంది. ఈ సమయాల్లో వ్యక్తులను బల్లపరుపుగా ఉన్న చోట పడుకోబెట్టి కాళ్లను పైకి ఎత్తి ఉంచాలి. వ్యక్తి శరీరం వెచ్చగా, సౌకర్యంగా ఉండేలా చూడాలి. ఈ స్థితిలో దుప్పటి కప్పడం మంచిది. తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. సదరు వ్యక్తి వాంతులు చేసుకుంటున్నా, నోటి నుంచి రక్తం బయటకు వస్తున్నా ఓ పక్కకు తిరిగి పడుకోబెట్టాలి. సత్వరమే వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి.

అగ్ని ప్రమాదం.. కాలిన గాయాలు
representational imageకాలిన గాయాలకు గురైతే వెంటనే సాధారణ చల్లదనంతో ఉన్న నీటి ధార కింద ఉంచాలి. ఐస్ పెట్టకూడదు. కాలిన భాగాలపై ఎటువంటి ప్లాస్టర్లు, బ్యాండేజ్ క్లాత్ లు చుట్టడం చేయరాదు. దీనివల్ల గాయం పెద్దదవుతుంది. శుభ్రమైన పాలిథిన్ బ్యాగ్ తో కప్పడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. గాయాలకు వస్త్రాలు అతుక్కుపోతే విడిపించే ప్రయత్నం చేయవద్దు. గాయాలకు అతుక్కుని లేకపోతే శరీరంపై ఉన్న వస్త్రాలు, ఆభరణాలను తొలగించడం మంచిది. పది నిమిషాల నుంచి అరగంట పాటు కాలిన గాయాలపై నీటి ధార పడేలా చేయవచ్చు. కళ్లకు కాలిన గాయమైతే వెంటనే నీటిని చిమ్ముకోవడం లేదా సెలైన్ సొల్యూషన్ తో కడుక్కోవడం మంచిది. కాలిన గాయాలపై వెన్న, గ్రీజు, లోషన్లను రాయకూడదు. ఐస్ ను కూడా వాడవద్దు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బాధితుడు దగ్గుతున్నా, కళ్లు నీళ్లతో నిండి ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి.

డయేరియా
డయోరియాలో ఒంట్లో నీరంతా కోల్పోవడం జరుగుతుంది. విరేచనాలు, వాంతుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బాధితులకు ద్రవ పదార్థాలు ఇస్తూ ఉండాలి. పళ్ల రసాలు ఇవ్వవచ్చు. పాలు, పాల పదార్థాలు, టీ, కాఫీలు ఇవ్వకూడదు. చిన్నారులైతే మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తూ వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైన వారిలోనూ ఒంట్లో నీరు చాలా వరకు తగ్గిపోతుంది. వీరికి సైతం ఓఆర్ఎస్, పళ్ల రసాలు, నీరు ఎక్కువగా ఇస్తూ ఉండాలి.

కంట్లో రసాయనాలు
కంట్లో ఏదైనా రసాయనం పడితే వెంటనే నలపకుండా నీటితో కొన్ని నిమిషాల పాటు కడిగి వైద్యుల సలహా పొందాలి. సొంత వైద్యం చేయరాదు.

జ్వరం
ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి జ్వరం వస్తే నివారిణిగా పారాసెటమాల్ వేసుకోవచ్చు. పెద్దలు అయితే పారాసెటమాల్ టాబ్లెట్... పిల్లలు అయితే డ్రాప్స్ లేదా సిరప్ ను వాడుకోవచ్చు. వైద్యుల వద్దకు వెళ్లేందుకు సమయం పట్టేట్టు అయితే ఒకటి రెండు డోసేజ్ ల కింద వాడుకోవచ్చు. అసలుకే వైద్యుల వద్దకు వెళ్లకుండా దీన్ని వాడుకోవడం సురక్షితం కాదు.

గొంతులో ఏదైనా అడ్డుపడితే
గొంతులో ఏదైనా అడ్డుపడి మాట్లాడలేకుంటే, మింగలేకుంటే అటువంటి వారిని తలను ముందుకు వంచి దగ్గమని సూచించవచ్చు. ఫలితం లేకుంటే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

పాము కాటు
representational imageప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మన దేశంలో ఏటా 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది వరకు మరణిస్తున్నారు. ముఖ్యంగా పాము కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉంటున్నారు. ఆ తర్వాత నిర్మాణ రంగ పనివారు, కొండలు, అడవుల్లో ట్రెక్కింగ్, క్యాంప్ లకు వెళ్లే వారు పాము కాటుకు గురవుతున్నారు. మనదేశంలో 250 పాము రకాలుంటే అందులో 50 రకాలు విషపూరితమైనవి. ఓ ఐదు మాత్రం అత్యంత విషపూరితం. వీటిలో ఎక్కువ మంది ప్రాణాలను బలితీసుకుంటున్నవి నాలుగే. అవి నాగుపాము (కోబ్రా), కట్లపాము, రక్తపింజరి, ఇసుక పింజరి. ఏదైనా పాము లేదా జంతువు కాటు వేసినట్టయితే వెంటనే కాటు వేసిన పై భాగంలో గుడ్డతో గట్టిగా బిగించి కట్టాలి. వేడి నీరు, సోప్ తో ఆ భాగాన్ని కడిగి, యాంటీ బయోటిక్ క్రీమ్ రాయాలి. 108, అత్యవసర వైద్య సిబ్బంది కోసం ఎదురు చూడకుండా వెంటనే ఆస్పత్రకి తరలిస్తే బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.


More Articles