ఇలా వాడండి... ఏసీ బిల్లు కూడా కూల్ గా వుంటుంది!

ఏసీ (ఎయిర్ కండిషనర్) నేడు అన్ని ఇళ్లల్లోనూ సాధారణ వినియోగ వస్తువుగా మారుతోంది. అయితే, ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాతే ఏసీ కొనడం మంచిది. లేదంటే బిల్లు వాచిపోతుంది. నెలకు వేల రూపాయల్లో బిల్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఏసీ బిల్లు తగ్గించుకుని కూల్ గా ఉండే టిప్స్ ఏంటో చూద్దాం.

ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి
ఏసీ ఫిల్టర్లను వారానికోసారి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉన్నట్టయితే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దాంతో గది తొందరగా చల్లబడుతుంది. దీంతో కొంత విద్యుత్ ఆదా అవుతుంది.

గదిలో ఎంత మేర ఉష్ణోగ్రత
representational imageఏసీ టెంపరేచర్ 25-27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా సూచనీయం. దీనివల్ల గది చల్లబడడం, బిల్లు తగ్గడం రెండూ సాధ్యమవుతుంది. 18 డిగ్రీలను సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గే వరకూ కంప్రెషర్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. వేసవిలో బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైన ఉన్నప్పుడు గదిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలంటే ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికం అవుతుంది. 24 డిగ్రీలకు పైన టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగాన్ని తగ్గించొచ్చు.

గది చల్లబడేందుకు
ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయి. గది విస్తీర్ణం, విండో ఎంత పరిమాణంలో ఉంది, దానికి అద్దాలు ఎంత మేర ఉన్నాయి, గదిలో ఉన్న ఫ్లోరింగ్, తూర్పు లేదా పడమర దిక్కులో ఆ గది ఉందా, గదిలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎన్ని ఉన్నాయి, గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలు, గదిలో ఎంత మంది ఉన్నారు ఈ అంశాలన్నీ గదిలోని ఉష్ణోగ్రత, చల్లబడే అంశాలను ప్రభావితం చేస్తాయి.

సీలింగ్ ఫ్యాన్ అవసరమా?
representational imageగదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఆన్ చేయడం చాలా మంది చేస్తుంటారు. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే చల్లదనం గది అంతా వ్యాపిస్తుందని భావిస్తారు. కానీ, సీలింగ్ ఫ్యాన్ కారణంగా గది పైకప్పు నుంచి వేడి కిందకు వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల మరింత చల్లదనం అవసరపడుతుంది. పైగా సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేసి ఉంచడం వల్ల గదిలో ఉన్న దుమ్ము గది అంతా వ్యాపిస్తుంది. దీంతో ఆ దుమ్ము ఏసీ ఫిల్టర్లలోకీ చేరుతుంది. కనుక సీలింగ్ ఫ్యాన్ బదులు టేబుల్ ఫ్యాన్ వాడుకోవడం ఉపయోగకరం. లేదంటే సీలింగ్ ఫ్యాన్ ను ఒక్క పాయింట్ లో ఉంచి ఆన్ చేసుకోవాలి. అలాగే ఏసీ ఉన్న గదిలో రోజూ వెట్ క్లాత్ తో తుడుచుకోవాలి.  

తరచూ ఆన్, ఆఫ్ వద్దు
ఏసీని తరచూ ఆన్, ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత 25-27 డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ స్థాయిలో చల్లదనం విడుదలవుతూ ఉంటుంది. గదిలో సమ శీతోష్ణస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఆఫ్ చేసేస్తే గదిలో ఉన్న చల్లదనం అంతా ఆవిరైపోతుంది. కొంత సేపటికి ఆన్ చేస్తే తిరిగి గదిని చల్లబరిచేందుకు వీలుగా ఏసీ కంప్రెషర్ అధిక వేగంతో ఎక్కువ సమయం పాటు తిరుగుతుంది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఈ అవసరం లేకుండా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలు వస్తున్నాయి. ఈ టెక్నాలజీలో గదిలో ఉష్ణోగ్రత చల్లబడిన తర్వాత కూడా కంప్రెషర్ ఆగకుండా తక్కువ వేగంతో తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల అధిక విద్యుత్ వినియోగం అవసరం ఏర్పడదు.

ఇవి చేస్తే బెటర్representational image

  • గది తలుపులు తరచూ తెరిచి, మూసేయవద్దు. ఇలా తెరిచిన ప్రతీసారీ బయటి నుంచి వేడి గాలి లోపలికి చొరబడుతుంది. దాంతో గదిలో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది.
  • విండో ఏసీ కంటే స్ల్పిట్ ఏసీ సూచనీయం. ఎందుకంటే వేడి గాలి తేలికగా ఉంటుంది. దాంతో అది గదిలో ఫై భాగంలోకి చేరుతుంది. స్ల్పిట్ ఏసీ గోడకు పై భాగంలో బిగించేది కనుక గాలి తొందరగా చల్లబడుతుంది.
  • తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనే ముందే పవర్ ఇన్ పుట్ చూడండి. సాధారణంగా ఒక టన్ను ఏసీకి 5 స్టార్ రేటింగ్ ఉన్నవి 930 యూనిట్ల నుంచి 980 యూనిట్ల వరకు వినియోగించుకుంటాయి.
  • ఏసీ ఇండోర్ యూనిట్ కు వీలైనంత తక్కువ దూరంలో అవుట్ డోర్ యూనిట్ (కంప్రెషర్)ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, రెండు యూనిట్ల మధ్య ట్యూబుల ఇన్సులేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.
  • ఏసీని గది మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు 12/18 సైజు ఉన్న గదిలో 18 అడుగుల గోడ మధ్య భాగంలో ఏసీనీ ఫిట్ చేయడం వల్ల గది అంతా చల్లగాలి సమంగా పంపిణీ అవుతుంది.
  • ఏసీని ఆన్ చేసిన తర్వాత వేగంగా చల్లబడాలని ముందు 16 డిగ్రీల్లో ఉంచేసి తర్వాత తగ్గించడం సరైన ఆలోచన కాదు. విద్యుత్ ఆదాను కోరుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచీ ఒకటే ఉష్ణోగ్రతలో ఉంచాలి. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది. కాకపోతే గది చల్లబడేందుకు కొంచెం సమయం పడుతుంది.
  • విండోలు, తలుపులు సహా ఏ మార్గంలోనూ ఏసీ లీకేజీ లేకుండా చూసుకోవాలి. విండో ఉండి, దానికి గ్లాస్ లు ఉంటే కర్టెన్ తప్పనిసరిగా బిగించుకోవాలి. దీనివల్ల గదిలోకి వేడి తక్కువగా ప్రవేశిస్తుంది. 
  • గదిలో పై కప్పుకు సీలింగ్ చేసుకోవడం వల్ల కూడా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
  • గదిపైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సెమ్ కోటింగ్ వేసుకోవడం వల్ల గదిలోకి ఉష్ణోగ్రత ప్రవేశించడం చాలా వరకు తగ్గిపోతుంది.
  • గదికి అవసరమైన పరిమాణం కంటే కొంచెం అధిక సామర్థ్యం గల ఏసీని ఎంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఉదాహరణకు ఒక టన్ను అవసరమైన చోట ఒకటిన్నర టన్ను ఏసీని ఎంచుకోవడం, దాన్ని 26 డిగ్రీల వద్ద సెట్ చేసుకోవడం ఫలితాన్నిస్తుంది.
ఏసీ ఎలా పనిచేస్తుంది...?
ఏసీ గదిలోకి చల్లటిగాలిని విడుదల చేస్తుందని తెలుసు. ఆ గాలి ఎక్కడి నుంచో తీసుకునేది కాదు. గదిలోని వేడిగాలిని గ్రహించి దాన్ని ఎవాపరేటర్ కాయిల్ ద్వారా పంపిస్తుంది. దాంతో ఆ గాలి చల్లబడుతుంది. దాన్ని తిరిగి గదిలోకి విడుదల చేస్తుంది.
 
థర్మోస్టాట్
ఏసీలో ఉండే థర్మోస్టాట్ మనం నిర్ణయించిన టెంపరేచర్ ఆధారంగా గదిలోని ఉష్ణోగ్రతను పరిశీలించి కంప్రెషర్ కు సంకేతమిస్తుంది. దాంతో గదిలో నిర్ణయించిన ఉష్ణోగ్రతకు తగినట్టు చల్లదనం ఏర్పడేంత వరకు కంప్రెషర్ పనిచేస్తుంది. తక్కువ టెంపరేచర్ నిర్ణయిస్తే కంప్రెషర్ ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి వస్తుంది. దాంతో ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. గదిలో గాలి 18 డిగ్రీలకు బదులు 25 డిగ్రీలకు తగినట్టు మారడం తొందరగా అయ్యే పని అన్న విషయం తెలిసిందే. దాంతో విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది. వేగంగా చల్లబరిచే క్విక్ కూల్ ఆప్షన్ వినియోగించుకున్నా విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది.

కంప్రెషర్ ఆగిపోతే...
representational imageగదిలో నిర్ణయించిన మేరకు చల్లదనం వచ్చిన తర్వాత కంప్రెషర్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏసీలో ఫ్యాన్ ఒక్కటే తిరుగుతుంది. దీంతో విద్యుత్ ఖర్చూ తగ్గుతుంది. గదిలో చల్లదనం నిర్ణయించిన దానికంటే తగ్గిందని థర్మోస్టాట్ గుర్తించిన వెంటనే కంప్రెషర్ తిరిగి తిరగడం మొదలు పెడుతుంది. ఏసీ యూనిట్ లో ఎక్కువ విద్యుత్ వాడేసేది కంప్రెషరే. గదిలో కోరుకునే ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రత మధ్య ఎక్కువ తేడా ఉంటే... గదిలో గాలిని చల్లబరించేందుకు వీలుగా ఏసీ ఎక్కువ విద్యుత్ ను తీసుకుంటుంది. పాత తరం ఏసీలకు ఈ థర్మోస్టాట్ ఉండేది కాదు. కాకపోతే లో, మీడియం, హై కూల్ అనే ఆప్షన్లు ఉండేవి. గదిలో చల్లదనం అవసరాన్ని బట్టి మనమే మార్చుకుంటూ ఉండాల్సి వచ్చేది.


More Articles