చిన్నారులకు గొప్ప చదువు చెప్పించేదెలా...?
విద్యే మనిషి ఉన్నతికి పునాది. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలన్నదే తల్లిదండ్రుల లక్ష్యం. అందుకే ప్రతీ దంపతులు తమ శక్తి మేర పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఈ లక్ష్యం భారీ బడ్జెట్ తో కూడుకున్నది. విద్య వ్యాపార వస్తువుగా మారిన పరిస్థితుల్లో నాణ్యమైన విద్యకు లక్షల రూపాయలు ధారపోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు మంచి విద్య చెప్పించడం అన్నది అంత సులభమేమీ కాదు. కనుక సామాన్యులు పిల్లల చదువు విషయంలో ముందు నుంచే సరైన నిర్ణయాలను ఆచరణలో పెట్టాలి. అవేంటన్నది చూద్దాం.
ఏటేటా ఫీజులలో భారీగా పెరుగుదల
2018 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ లో రెండేళ్ల మేనేజ్ మెంట్ కోర్సుకు ఫీజు రూ.19.5 లక్షలు. ఇదే స్కూల్లో 2007నాటి ఫీజుతో పోలిస్తే ఇది 400 శాతం ఎక్కువ. ఏటా 20 శాతం సగటున కోర్సుల ఫీజులు పెరుగుతాయనుకున్నా... ఇదే విద్యా సంస్థలో రెండేళ్ల కోర్సుకు 2025లో రూ.95 లక్షలు అవుతుంది. ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను ఏడాదికి రూ.90,000 నుంచి రూ.2 లక్షలకు పెంచేసిన విషయం తెలిసిందే. ఇది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాలంటే రూ.8 లక్షలు వ్యయం అవుతుంది. ఏటా 10 శాతం విద్యా ద్రవ్యోల్బణం ఉంటుందని భావిస్తే ఇదే కోర్సుకు మరో ఎనిమిదేళ్ల తర్వాత రూ.17 లక్షలు వ్యయం చేయాల్సి వస్తుంది. 2030లో ఇదే కోర్సుకు రూ.30 లక్షలు ఖర్చవుతుంది. చివరికి ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం కోచింగ్ సంస్థలు సైతం భారీగా ఫీజులు గుంజుతున్నాయి. మరి ఇంత ఖరీదైన విద్యను అందుకోవాలంటే ఆ మేరకు పొదుపు, మదుపులు చేయాల్సిందే.
లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు
ఇన్వెస్ట్ మెంట్స్ ఎందులో చేయాలన్నది లక్ష్యాలు, ఆశిస్తున్న రాబడులను బట్టి ఉంటుంది. పిల్లల వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ముందు నుంచే పెట్టుబడులు మొదలు పెడితే కాంపౌండింగ్ వడ్డీ ఫలితంగా ఎక్కువ నిధి సమకూరుతుంది. బాబు లేదా పాప ఏడాది వయసున్నప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే వారు కాలేజీ చదువుకు రావడానికి 15 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. చెన్నైకు చెందిన శరవణన్, సముద్ర ఇద్దరూ భార్యాభర్తలు. వారికి 4 ఏళ్ల కుమారుడు. తమ కుమారుడి ఉన్నత చదువుల కోసం 90 లక్షల నుంచి కోటి రూపాయలు సమకూర్చుకోవాలన్నది వీరి లక్ష్యం. వీరు ప్రతీ నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో మూడు మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులు ప్రారంభించారు. ఏటేటా సిప్ మొత్తాన్ని రూ.5,000 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. ఈ లెక్కన 13 ఏళ్లలో వారు కోటి రూపాయల నిధిని సమకూర్చుకోగలరు. 18 ఏళ్లకు రూ.25 లక్షలు కావాలన్నది మరో దంపతుల ప్రణాళిక అనుకుందాం. అప్పుడు వారు తమ పాప లేదా బాబు కోసం మూడేళ్ల వయసు నుంచి అయితే ప్రతీ నెలా రూ.5,004 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆరేళ్ల వయసు వచ్చే వరకు ఆగి అప్పుడు మొదలు పెడితే ప్రతీ నెలా రూ.9,195 సిప్ చేయాలి. మరో మూడేళ్లు ఆలస్యం చేసి 9 ఏట నుంచి పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే ప్రతీ నెలా రూ.23,875 అవసరం అవుతాయి. ఇవి కేవలం ఈక్విటీ ఫండ్స్ లో రాబడుల అంచనాలు.
రిస్క్ సామర్థ్యాన్ని బట్టి...
లక్ష్యానికి గడువు దూరం ఉంటే కొంచెం రిస్క్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే వ్యవధి తక్కువగా ఉంటే సంప్రదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా చేసేదేమీ ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఐదేళ్ల కాల వ్యవధికి పైన సగటున 15 శాతం రాబడులకు అవకాశం ఉంటుంది. అదే సంప్రదాయ డిపాజిట్లు, బాండ్లలో వచ్చే రాబడి 7 శాతం దాటదు. అసలు రిస్క్ భరించలేని వారికి రాబడులు తక్కువగానే ఉంటాయి. కనుక ఈ తరహా వ్యక్తులు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్ కమ్ ప్లాన్స్ ను వీరు పరిశీలించొచ్చు. ఇవి 80 శాతం వరకు సంప్రదాయ సాధానాల్లో ఇన్వెస్ట్ చేసి మిగిలిన 20 శాతాన్ని తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడతాయి. అలాగే పోస్టాఫీసు ఆర్డీని కూడా పరిశీలించొచ్చు. ఇందులో 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే, 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి ఆర్డీ అనుకూలం కాదు. పన్ను భారం పోను మిగిలేది తక్కువే. అందుకే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో మూడేళ్లకుపైన పెట్టుబడులు కొనసాగించడం ద్వారా పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు. రాబడులు 7-8 శాతం స్థాయిలో ఉంటాయి. ఇన్ కమ్ ఫండ్స్ లో అయితే ఏటా పన్ను వసూలు ఉండదు. ఉపసంహరించుకున్న సమయంలోనే పడుతుంది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని రాబడుల నుంచి మినహాయించి మిగిలిన ప్రయోజనంపైనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీల్లో పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు అయితే, లక్ష్యానికి ఐదేళ్ల ముందు నుంచే తగ్గించుకుంటూ వెళ్లాలి. సంప్రదాయ బాండ్లు, డిపాజిట్లలోకి మళ్లించాలి. దీనివల్ల రాబడులకు రక్షణ ఉంటుంది.
చైల్డ్ ప్లాన్స్ లో వద్దు
బీమా కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ప్లాన్స్ ను ఎంచుకోవద్దు. ఇవి సంప్రదాయ లేదా యూనిట్ లింక్డ్ ఆధారిత పాలసీలు అయి ఉంటాయి. చైల్డ్ పాలసీల్లో తండ్రి పాలసీదారుడిగా, వారి పిల్లల్లో ఒకరు నామినీగా ఉంటారు. పాలసీ కాలం పూర్తయ్యే వరకూ పాలసీదారుడు జీవించి ఉంటే... నిర్దేశించిన సమయానికి చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ పాలసీదారుడు ఆకస్మిక మరణానికి లోనైతే పాలసీ ప్రయోజనాలు నామినీకి బదిలీ అవుతాయి. దీనికి బదులు ఇన్వెస్ట్ మెంట్ కోసం ఆర్థిక సలహాదారుల సూచనలతో, రిస్క్ భరించే సామర్థ్యానికి తగ్గ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ప్రతీ నెలా సిప్ మోడ్ లో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. మరోవైపు సంబంధిత పేరెంట్ తన పేరిట టర్మ్ పాలసీ తీసుకోవాలి. తాను లేకపోతే తన పిల్లల పూర్తి విద్యకు అయ్యే వ్యయం, తన కుటుంబ పోషణ అవసరాలను తీర్చే స్థాయిలో బీమా కవరేజీ ఎంచుకోవాలి. దీనివల్ల చాలా తక్కువకే బీమా రక్షణ లభిస్తుంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై మంచి రాబడులను అందుకోవచ్చు. ఉదాహరణకు చైల్డ్ ప్లాన్ లో ప్రతీ నెలా రూ.3,000 చొప్పున 15 ఏళ్ల పాటు పెడితే, చివరి వరకూ పాలసీదారుడు జీవించి ఉంటే రూ.6,50,000 అందుకుంటారు. ఇందులో బీమా కవరేజీ 4.5 లక్షలకే లభిస్తుంది. ఇప్పుడు ఈ రూ.3,000 నుంచి ప్రతీ నెల రూ.2,900 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. 100 రూపాయలు బీమాకు కేటాయించాలి. దీనివల్ల రూ.6,00,000 బీమా కవరేజీ లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో రాబడులు 10 శాతం అనుకుంటే చివర్లో రూ.12లక్షలు, 12 శాతం రాబడి లెక్కన రూ.14.5 లక్షలు లభిస్తాయి.
విద్యా వ్యయం
ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కు రూ.లక్ష అవసరం అవుతుందనుకుంటే పదేళ్ల తర్వాత రూ.7 లక్షలు, 20 ఏళ్ల తర్వాత అయితే రూ.15 లక్షలు అవసరం అవుతాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ప్రస్తుతం రూ.10 లక్షలు అవసరం అనుకుంటే 10 ఏళ్ల తర్వాత రూ.22 లక్షలు, 20 ఏళ్ల తర్వాత రూ.80 లక్షలు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఒకటి ఎన్నేళ్ల కాల వ్యవధి ఉంది, రెండు ఎంత మొత్తం సమకూరాలి, రిస్క్ ఎంత వరకూ భరించగలరు... ఈ మూడు అంశాలనుబట్టి ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం తెలుస్తుంది.
కాల వ్యవధిని బట్టి పెట్టుబడి
రూ.30 లక్షలు అవసరం. అందుకు వ్యవధి 20 ఏళ్లు ఉంది. అప్పుడు 8 శాతం రాబడి వచ్చే పథకాల్లో అయితే ప్రతీ నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో అయితే నెలకు రూ.4,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 12 శాతం రాబడినిచ్చే వాటిలో ప్రతి నెలా రూ.3,000, 14 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.2,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.
రూ.30 లక్షలు అవసరం. అందుకు వ్యవధి 15 ఏళ్లు ఉంది. 8 శాతం రాబడి వచ్చే పథకాల్లో అయితే ప్రతీ నెలా రూ.8,000 చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో అయితే నెలకు రూ.7,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 12 శాతం రాబడినిచ్చే వాటిలో ప్రతి నెలా రూ.6,000, 14 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.5000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.
రూ.30 లక్షలు అవసరం. అందుకు వ్యవధి 10 ఏళ్లు మాత్రమే ఉంది. అప్పుడు 8 శాతం రాబడి వచ్చే పథకాల్లో అయితే ప్రతీ నెలా రూ.15,000 చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో అయితే నెలకు రూ.13,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 12 శాతం రాబడినిచ్చే వాటిలో ప్రతి నెలా రూ.12,000, 14 శాతం రాబడినిచ్చే పథకాల్లో రూ.11,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.
ఏ తరహా ఫండ్స్
స్వల్ప కాలం కోసం రిస్క్ వద్దనుకునే వారికి షార్ట్ టర్మ్ ఫండ్స్, ఇన్ కమ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి సాధనాలున్నాయి. ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధి ఉంటే ఫిక్స్ డ్ ఇన్ కమ్ ఇనుస్ట్రుమెంట్స్ లోనే పెట్టుబడులు పెట్టుకోవాలి. ఇవి తక్కువ రాబడులను ఇచ్చినాగానీ భద్రత ఉంటుంది. పీపీఎఫ్ కూడా మంచి పథకమే. కానీ డబ్బులతో అవసరం 3 నుంచి 4 ఏళ్లలోపు ఉంటుందనుకుంటే అందుకు పీపీఎఫ్ అనుకూలం కాదు. ఈక్విటీ, డెట్ కలగలిసిన బ్యాలన్స్ డ్ ఫండ్స్ సైతం మంచివే.
ఈక్విటీ ఫండ్స్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఐదేళ్ల రాబడులు 20.57శాతం, పదేళ్ల రాబడులు 22.98 శాతంగా ఉన్నాయి. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ లో ఐదేళ్ల రాబడులు 15 శాతం, పదేళ్ల రాబడులు 20 శాతంగా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ మిడ్ క్యాప్ అపార్చునిటీస్ ఫండ్ లో ఐదేళ్ల సగటు రాబడులు 22 శాతం, పదేళ్ల రాబడులు 17.58 శాతం ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్ ఐదేళ్ల రాబడులు 26 శాతంగా ఉన్నాయి. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ లో ఐదేళ్ల సగటు రాబడులు 30 శాతం.
బ్యాలన్స్ డ్ ఫండ్స్
ఈక్విటీ, డెట్ కలగలసిన బ్యాలన్స్ డ్ ఫండ్స్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాలన్స్ డ్ ఫండ్ లో ఐదేళ్ల రాబడులు 19 శాతంగా ఉన్నాయి. బిర్లా సన్ లైఫ్ బ్యాలన్స్ డ్ ఫండ్ లో ఐదేళ్ల రాబడులు 19 శాతంగా, పదేళ్ల కాలంలో రాబడులు 14 శాతంగా ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్ డ్ ఫండ్ లో మూడేళ్ల కాలంలో (ఈ పథకం 2013లో ప్రారంభమైంది) రాబడులు 17.57 శాతంగా ఉన్నాయి. ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం తోపాటు ఏడాదికోసారి వాటి పనితీరును గమనించాలి. నష్టాల్లో ఉంటే అందులో పెట్టుబడులను ఆపేసి మరో మంచి ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పటి వరకూ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ నష్టాల్లో ఉంది కనుక దాన్ని వెంటనే అమ్మొద్దు. కొంత కాలం వేచి చూడడం మంచిది. ఏడాది కోసారి ఫండ్స్ పనితీరు ఆధారంగా పెట్టుబడుల పోర్ట్ ఫోలియోని రీబ్యాలన్స్ చేసుకోవాలి. రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన ఫండ్ ను ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోంచకూడదన్న సూత్రాన్ని ఎల్ల వేళలా అనుసరించాలి.
సుకన్య సమృద్ధి యోజన
ఇది ఆడపిల్లల ఉన్నత విద్య, వివాహాలకు అనువైన పథకం. ఇందులో గరిష్టంగా పదేళ్ల వయసు వరకూ ఉన్న కుమార్తెల పేరిట పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఏటా 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిపై ఎటువంటి పన్ను విధించరు. 18 ఏళ్ల వయసు వచ్చిన అనంతరం ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది.
పీపీఎఫ్
పిల్లల ఉన్నత విద్యకు 15 ఏళ్ల గడువు ఉన్నవారు, రిస్క్ తో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ మెంట్ కు సుముఖంగా లేని వారికి పీపీఎఫ్ అనువైనది. ఇందులో 8.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంది.