వాటర్ మంత్ర... రోజుకు ఎన్ని లీటర్లు తాగాలి... ఎప్పుడు, ఎలా?

మన భూమి ఉపరితలం 70 శాతం నీటితో నిండుకుని ఉంది. మన దేహంలో 60 శాతం నీరే. మన శరీర బరువులో సగం నీటి కారణంగా ఉండేదే. మరి, ప్రాణాధారమైన నీరు ఏ మేరకు తీసుకోవాలి...? నీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి...

నీటితో ఏం పని?
representational imageమన శరీరంలో జీవక్రియలకు నీరు అవసరం. శరీరం నుంచి హానికారకాలను స్వేదం, మూత్రం ద్వారా బయటకు పంపాలంటే నీరు కావాలి. తిన్నది అరగాలంటే నీరు కావాలి. కణాలకు పోషకాలు, ఆక్సిజన్ సరఫరా కావాలంటే నీరు ఉండాలి. శరీరంలో లవణాలు (సోడియం, పొటాషియం) తగినంత ఉండాలన్నా...తీసుకున్న ఏ ఆహారమైనా జీర్ణమై సాఫీగా విసర్జితం కావాలన్నా నీరు కావాల్సిందే. కీళ్లలో లూబ్రికేషన్ కు, కుషన్ కు, శరీరంలోని ఉష్ణోగ్రత బ్యాలన్స్ కు ఇలా చెప్పుకుంటూ పోతే శరీరంలోని ప్రతీ జీవ క్రియకూ నీటి అవసరం ఎంతో ఉంది. మన శరీరమంతటా నిరంతరం ప్రవహించే రక్తంలోనూ ఉండేది నీరే. వ్యాధులపై పోరాడే రోగ నిరోధక వ్యవస్థలో లింఫ్ గంధుల్లో ఉండే స్రవాలు కీలకం. మరి ఈ గ్రంధుల్లోనూ నీరు ఉంటుంది. తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను నీరు నయం చేయగలదు.

నీరు తీసుకోకపోతే...?
ఆహారం కంటే కూడా ముందు నీరే ప్రాణాధారం. నీరు లేకుండా మహా అంటే ఓ వారం మాత్రమే బతకగలం. కానీ ఆహారం తీసుకోకుండా ఓ నెల రోజుల వరకు ప్రాణాలతో ఉండొచ్చు. నీరు లేకపోతే శరీరంలో రక్త పరిమాణం సైతం తగ్గిపోతుంది. మొదటి దశ డీహైడ్రేషన్ (నీరు, లవణాలు లోపించడం) తో తలతిరగడం, చిరాకు, తలనొప్పి వస్తాయి. రెండో దశలో అలసిపోవడం, కంటి చూపు మందగించడం జరుగుతుంది. చివరి దశలో తలతిరగడంతో పాటు వాంతులు కనిపిస్తాయి. ఇక ఈ దశలో కూడా నీరు తీసుకోకపోతే కోమాలోకి వెళ్లి ప్రాణం పోవడం జరుగుతుంది. నీరు తగ్గుతున్న కొద్దీ జీవ క్రియలు ఒక్కొక్కటి పని చేయడం నిలిచిపోతుంది. కేవలం వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లోనూ డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) స్థితికి లోనయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.

అధికంగా నీరు తీసుకుంటే
అపరిమితంగా నీరు తీసుకోవడం వల్ల హైపోనట్రేమియా అనే స్థితికి దారితీస్తుంది. శరీరంలో సోడియం స్థాయులు చాలా తక్కువ స్థితికి చేరుకోవడమే హైపోనట్రేమియా. అధికంగా నీరు తీసుకోవడం వల్ల అది కణాలకు చేరి వాపునకు కారణమవుతుంది. మెదడులోని కణాలు ఉబ్బిపోవడం వల్ల తలనొప్పి, వికారం, తిమ్మిర్లు, గందరగోళం, మూర్ఛ, అలసట, కోమా, ప్రాణం పోవడం వంటివి జరుగుతాయి.
   
నీరు ఎంత సరిపోతుంది...?
representational imageఆరోగ్యవంతులైన పెద్దవారు రోజులో ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల(మధ్య సైజు) నీటిని (రెండు లీటర్లు సుమారు) తాగాలన్నది ఒక సూత్రం. కానీ, వయసు, లింగం, వారి శారీరక చర్యలు, గర్భంతో ఉన్న వారు, పాలిచ్చే తల్లులు ఇలా వివిధ అంశాలను బట్టి తీసుకోవాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి చెమట పట్టదు. మూత్ర విసర్జన ద్వారానే నీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి వారు రోజులో రెండున్నర లీటర్లకు మించి తీసుకోకూడదట. ఇంతకుమించితే మూత్ర పిండాల్లో నీటి గాఢత పెరిగి ఎడెమాకు దారితీస్తుందంటున్నారు బెంగళూరుకు చెందిన పోషకాహార నిపుణులు డాక్టర్ అంజుసూద్.

రూపాలి దత్తా అనే మరో న్యూట్రిషనిస్ట్ ఒక కేజీ బరువుకు 35 మిల్లీ లీటర్ల నీటిని రోజులో తీసుకోవాలంటున్నారు. అంటే 50 కిలోల బరువున్న వ్యక్తి 1.75లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. 60 కిలోలుున్న వ్యక్తి 2.1 లీటర్ల నీటిని తాగాలి. వేసవిలో కొంచెం ఎక్కువ పరిమాణం అవసరం ఉంటుంది. వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కారణంగా శరీరం అధిక పరిమాణంలో నీటిని కోల్పోతుంది. అందుకే సాధారణ రోజుల్లో కంటే వేసవిలో కనీసం 20 శాతం అధిక పరిమాణంలో నీరు అవసరం. అది కూడా సాధారణ స్వచ్ఛమైన నీరే మంచిదన్నది నిపుణుల సూచన. టీ, కాఫీలు ద్రవ పదార్థాలైనప్పటికీ ఇవి నీటికి ప్రత్యామ్నాయం కాదు. వీటితోపాటు ఆల్కహాల్ శరీరంలో సహజ నీటికి విఘాతం. ఉదయం లేచిన తర్వాత 400 ఎంఎల్ నుంచి 800 ఎంఎల్ వరకూ నీటిని తీసుకోవచ్చంటున్నారు. శారీరక శ్రమ ఉండే వారు మూడు లీటర్ల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. నీరు తగినంత ఉందా? లేదా? అని తెలుసుకోవడం చాలా సులభం. మూత్రం లేత పసుపు రంగులో ఉందంటే సరిపడా నీరు ఉన్నట్టు. చిక్కటి పసుపు రంగులో ఉంటే శరీరంలో నీరు తక్కువగా ఉన్నట్టు.  

పరగడుపునే నీటిని తీసుకోవడం
పరగడుపున ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయన్నది వైద్యులు చెప్పే మాట. కడుపును శుభ్రం చేయడమే కాకుండా ఎన్నో వ్యాధులను నివారిస్తుందట. పెద్ద పేగును శుభ్రం చేసి తిన్న ఆహారం నుంచి పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించేలా మారుస్తుంది. చర్మం కాంతులీనుతూ ఉండాలంటే ఇలా నీరు తీసుకోవడం మంచిది. ఇలా పరగడుపునే నీటిని తీసుకోవడం జీవక్రియలకు మంచి బూస్ట్ నిస్తుందంటున్నారు నిపుణులు. కణాల ఉత్పత్తికీ సహకరిస్తుందట. బరువు తగ్గేందుకూ ఉపయోగపడుతుందంటున్నారు. రాత్రి నిద్రించిన తర్వాత నుంచి చాలా గంటల పాటు నీటిని తీసుకోకుండా ఉంటాం గనుక తగ్గిన నీటి పరిమాణాన్ని ఉదయమే తాగిన నీరు భర్తీ చేస్తుందట. పైగా, ఇలా నీరు తాగిన వెంటనే ఏ ఆహారాన్ని వెంటనే తీసుకోరాదు. కనీసం గంట విరామం ఇవ్వాలి..

రాగి పాత్రలో రాత్రంతా ఉంచిన నీటిని తాగితే...
representational imageరాగి పాత్రలో రాత్రి నిద్రించే ముందు నీటిని పోసి ఆ నీటిని ఉదయాన్నే తీసుకోవడం మంచిదన్న వాదన ఒకటుంది. మన శరీరంలో కొన్ని జీవ క్రియలకు కాపర్ అవసరం. రోజులో 1.3ఎంజీ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పాలు, యాపిల్స్, అరటి పండ్లు, చేపలు, కూరగాయల ద్వారా కాపర్ లభిస్తుంది. ఒకవేళ ఈ విధమైన వనరుల ద్వారా లోటు ఏర్పడితే... రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన పరిమాణంలో పావు శాతం లభిస్తుంది. నీటిలోకి రాగి పరమాణులు వచ్చి చేరడం వల్ల ఇలా జరుగుతుంది. రాగి పాత్రలో నీరు ఉంచడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ విధంగానూ మంచిదే. రాగి పాత్రలో రాత్రి వేళ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఉదయాన్నే వేడి నీరా... లేక చల్లటి నీరా...?
representational imageన్యూట్రిషనిస్ట్ డాక్టర్ నేహా సన్వల్క వెల్లడించిన సమాచారం మేరకు.. ఉదయాన్నే వెచ్చటి నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారి అజీర్ణ సమస్య తగ్గుతుంది. పేగులకు రక్త ప్రసారం మెరుగుపడుతుంది. దీనివల్ల మలబద్ధక సమస్య తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. హానికారక టాక్సిన్లను బయటకు పంపేందుకు వెచ్చటి నీరు తోడ్పడుతుంది. మొటిమలు ఇతర సమస్యలను కూడా నివారిస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల ముక్కులు, గొంతులో పట్టేసిన బాధ ఉంటే, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చల్లటి నీరు ఎప్పుడు...?
వ్యాయామాలు చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని చల్లబరిచేందుకు ఆ సమయంలో చల్లటి నీరును తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. వ్యాయామాలు చేసిన తర్వాత వేడి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు. ఇది తప్ప మిగిలిన వేళల్లో వేడి నీటిని తాగడం వల్లే మంచి ఫలితాలను పొందొచ్చన్నది నిపుణులు సూచన. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో, తీసుకున్న తర్వాత చల్లటి నీటిని తాగరాదు. దీనివల్ల ఉష్ణోగ్రతను పెంచేందుకు శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణప్రక్రియ నిదానించి అజీర్ణానికి దారి తీస్తుంది.

వాటర్ మంత్ర...
representational imageముంబైకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుజ్ శ్రీవాస్తవ ఆరోగ్యంగా ఉండేందుకు నీటి మంత్రాన్ని ఈ విధంగా వెల్లడించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్ నీటిని తాగాలన్నది ఆయన మొదటి సూచన. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన 40 నిమిషాలకు వేడి నీటిని తాగాలి. దానివల్ల  కొవ్వు కరిగిపోతుంది. మూడో సూచన ఏమంటే... నీటిని కూర్చునే తాగాలి. నించుని తాగరాదు. ఈ మూడు సూచనలను అనుసరిస్తే 99 శాతం వ్యాధులు నయమవుతాయని అనుజ్ అంటున్నారు.వీటితోపాటు మన శరీర పీహెచ్ స్థాయిలకు సమానంగా పీహెచ్ ను కలిగి ఉండే నీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందంటున్నారు. మన శరీర పీహెచ్ 7.4... కనుక 7.5 నుంచి 8.5 మధ్య పీహెచ్ ఉన్న వాటర్ ను తాగడం వల్ల మినరల్స్, అల్కనిటీలను శరీరం మంచిగా గ్రహించగలదని ఆయన చెబుతున్నారు. ఈ విధమైన పీహెచ్ కలిగిన నీరు మన దేశంలో ఒక్క గంగోత్రి వద్దే ఉంది.  కావాల్సిన స్థాయిలకు నీటిలోని పీహెచ్ ను తీసుకొచ్చే పీహెచ్ కన్వర్షన్ వాటర్ మెషిన్స్ కూడా ఉన్నాయని అనుజ్ తెలిపారు.


More Articles