వాట్సాప్ లో కొత్త ఫీచర్స్.. వాటి విశేషాలు!
ఉచిత మెస్సేజ్ ల ద్వారా ప్రపంచంలో కోట్లాది మందిని అనుసంధానిస్తున్న వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్స్ ను తన యాప్ లో ప్రవేశపెట్టింది. వీటిని పొందాలంటే తమ మొబైల్ లో ఉన్న యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
1. పిన్న్ డ్ చాట్స్
వాట్సాప్ లో ఎంతో మందితో నిరంతరం చాట్ చేస్తుంటాం. ఇక వాట్సాప్ గ్రూపులు కూడా ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా, ఎంత మందితో సంభాషణ చేసినప్పటికీ... వాటిలో ముఖ్యమైనవి ఓ రెండో, మూడో ఉంటాయి. ఇలా ముఖ్యమైనవి అనుకున్నవి చాట్స్ లిస్ట్ లో ముందుండేందుకు పిన్న్ డ్ చాట్ ఆప్షన్ ను వాట్సాప్ తెచ్చింది. ఓ మూడు కాంటాక్టులను ముఖ్యమైనవిగా ఎంపిక చేసుకోవచ్చు. కావాల్సిన చాట్ కాంటాక్టును ప్రెస్ చేసి ఉంచితే యాప్ పై భాగంలో పిన్ సింబల్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే ఆ కాంటాక్టు చాట్ లిస్ట్ లో పైన కనిపిస్తుంది. ఎంత మంది నుంచి మెస్సేజ్ లు వచ్చినప్పటికీ మీరు ఇలా పిన్ చేసుకున్న కాంటాక్ట్స్ మాత్రమే పై భాగంలో ఉంటాయి.
2. రెండంచెల ఆథెంటికేషన్
ఈ ఏడాది వాట్సాప్ రెండంచెల ధ్రువీకరణ ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఇది కొన్ని నెలలుగా బీటా టెస్టింగ్ లో ఉంది. అనంతరం విజయవంతంగా అందుబాటులోకి వచ్చేసింది. రెండు దశల యూజర్ ధ్రువీకరణ ఆప్షన్ తో వారి అకౌంట్ ను మరొకరు దుర్వినియోగం చేయకుండా రక్షణ ఉంటుంది. ఒకరి ఫోన్ నంబర్ తో మరొకరు సులభంగా ఖాతాను వాడుకునే అవకాశం లేకుండా ఆరు అంకెల పాస్ వర్డ్ కోడ్ ను ఇస్తేనే తిరిగి యాప్ ఇన్ స్టాల్ అవుతుంది. ఈ ఫీచర్ ను ఇప్పటికే ట్విట్టర్, యాపిల్, గూగుల్, ఇన్ స్టా గ్రామ్ అమలు చేస్తున్నాయి.
3. టెక్ట్స్ స్టాటస్ ఫీచర్ మళ్లీ
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో టెక్ట్స్ స్టాటస్ స్థానంలో స్టాటస్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. యూజర్లు ఇమేజ్ లను, వీడియోలను, జిఫ్ లను తమ స్టాటస్ కింద యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే 24 గంటల తర్వాత ఆటోమేటిక్ గా ఇది డిలీట్ అయిపోతుంది. దీంతో చాలా మంది యూజర్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో తిరిగి పాత ఆప్షన్ నే అందుబాటులోకి తెచ్చింది.
4. వీడియో కాలింగ్ బటన్
వీడియో కాల్ చేయడం ఇకపై మరింత సులభం. వాట్సాప్ పై భాగంలోనే వీడియో కాలింగ్ సింబల్ ను తీసుకొచ్చారు. భారత్ లో ఒక రోజులో 5 కోట్లకు పైగా వీడియో కాల్సింగ్స్ ఉంటున్నాయని, వీడియో కాలింగ్ ఆప్షన్ వినియోగంలో భారతీయులే ముందున్నారని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ లో ఏదైనా కాంటాక్ట్ తో చాట్ ఓపెన్ చేయగానే పై భాగంలోనే వీడియో కాలింగ్, మామూలు కాలింగ్ సింబల్స్ కనిపిస్తాయి.
5. మెస్సేజ్ లను చదివి వినిపిస్తుంది...
ఈ ఆప్షన్ యాపిల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే. యాపిల్ ఐవోఎస్ 10.3 వెర్షన్ ను వినియోగిస్తున్న వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇక యాప్ ఓపెన్ చేయగానే పైన చాట్స్, స్టాటస్, కాల్స్ ఆప్షన్లతో పాటు పక్కనే కెమెరా సింబల్ ను కూడా చేర్చారు. చాట్ చేస్తున్నప్పుడు టైప్ చేసే చోట కూడా ఈ సింబల్ ఉంటుంది. దీనికి అదనంగా పైన కూడా ప్రవేశపెట్టారు.