బంగారం వంటి ‘బిట్ కాయిన్’!
అంతర్జాతీయంగా ఆన్ లైన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కరెన్సీ ఒకటుంది. ఒక కాయిన్ విలువ ఏకంగా 1.8 లక్షల రూపాయలకు చేరి ఔరా అనిపించిన వండర్ ఫుల్ కరెన్సీ అది. అందరి నోటా నానుతూ ప్రపంచాన్ని వెర్రెక్కిస్తున్న ఆ కరెన్సీయే బిట్ కాయిన్. దీని గురించి తెలుసుకోవడం సందర్భనీయం.
సాధారణంగా ఓ దేశ కరెన్సీ విలువ అంతర్జాతీయంగా డాలర్ తో పోల్చితే పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. ఇది సాధారణం. కానీ, ఇది మహా అయితే ఓ 10 శాతంలోపే ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బిట్ కాయిన్ అలా కాదు. ఇది గత ఏడాది కాలంలో ఐదు రెట్లు పెరిగింది. అంటే 500 శాతం. అందుకే దీని పట్ల అందరిలో ఆకర్షణ ఏర్పడుతోంది.
బిట్ కాయిన్ అంటే?
బిట్ కాయిన్ పూర్తిగా ఎలక్ట్రానిక్ కరెన్సీ. డిజిటల్ రూపంలో కొన్ని కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఏ దేశ నియంత్రణలోనూ లేదు. అదే సమయంలో ఏ దేశ ఆమోదం కూడా లేనిది. అనధికారిక కరెన్సీ. అయినా దీనికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. దీన్ని ఆన్ లైన్ లో కొనగలరు. ఆన్ లైన్లోనే అమ్ముకోగలరు. ఆన్ లైన్లో కొన్ని రకాల ఈ కామర్స్, షాపింగ్ సైట్లలో కొనుగోళ్లకు ఈ కరెన్సీని వాడుకునేందుకు అవకాశం ఉంది.
అవసరమైనప్పుడు కరెన్సీని ముద్రించి దాన్ని వ్యవస్థలోకి విడుదల చేయడం, అవసరమైనప్పుడు మార్కెట్లో ఎక్కువ ఉన్న లిక్విడిటీని వెనక్కి తీసుకోవడం సెంట్రల్ బ్యాంకులు చేసే పని. కానీ, ఈ వ్యవస్థలకు వెలుపల అవతరించిందే బిట్ కాయిన్. నియంత్రణ లేని వర్చువల్/క్రిప్టో కరెన్సీ అవసరమని భావించి దీన్ని 2008లో సృష్టించడం జరిగింది. జపాన్ కు చెందిన నకమోటో అనే వ్యక్తి దీనికి ఆద్యుడు. అత్యంత భద్రతతో కూడిన కంప్యూటర్ నెట్ వర్క్ పరిధిలో బిట్ కాయిన్ల ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది.
ఈ వ్యవస్థలో ఎక్కువలో ఎక్కువ 2.1 కోట్ల బిట్ కాయిన్ల సృష్టికే అవకాశం ఉంది. ఇప్పటికే 1.2 కోట్ల బిట్ కాయిన్ల సృష్టి జరిగిందన్నది సమాచారం. కొనుగోలుదారులు పెరిగినా, డిమాండ్ ఎంత పెరిగినా గానీ బిట్ కాయిన్ల సంఖ్య పెరగదు. ఈ విధమైన పరిమితి ఉండడం వల్లే ఒక బిట్ కాయిన్ 2,800 డాలర్ల స్థాయికి (రూ.1.82 లక్షలు) చేరింది. అయితే, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టు ఒక బిట్ కాయిన్ ను చిన్న చిన్న భాగాలు(సతోషిలు)గా విభజిస్తారు. ఇలా ఒక బిట్ కాయిన్ ను 10 కోట్ల సతోషిలుగా విడగొట్టే అవకాశం ఉంటుంది. దాంతో డిమాండ్ కు తగ్గట్టు సరిపడా మినీ బిట్ కాయిన్లు లభ్యమవుతాయి. సామాన్య ఇన్వెస్టర్లు సైతం ఆన్ లైన్ లో ఒక సతోషి నుంచి ఎంత మేరకైనా కొనుక్కోవచ్చు.
ఈ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది?
అమేజాన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు బిట్ కాయిన్ ను అనుమతిస్తున్నాయి. బిట్ కాయిన్లతో బంగారం కొనేందుకు, ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకునేందుకు కొన్ని అవకాశం కల్పిస్తున్నాయి. అంతర్జాలంలో క్రమంగా బిట్ కాయిన్ ను ఆమోదించే సంస్థలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చాలా మంది దీన్నొక పెట్టుబడి సాధనంగా, ట్రేడింగ్ సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
బిట్ కాయిన్లపై ఆరోపణలు, సంచలనాలు
2011-13 మధ్య కాలంలో బిట్ కాయిన్లు పెద్ద సంచలనానికి కారణమయ్యాయి. నేరస్థులు, అక్రమ వ్యాపారులు బిట్ కాయిన్లను భారీగా కొనేశారు. చట్టబద్ధమైన సంస్థలు, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఈ వర్చువల్ కరెన్సీని నమ్ముకున్నారు. దాంతో దీని ధర బాగా పెరగడం మొదలైంది.
కొనుగోలు, అమ్మకం ఎక్కడ?
ఆన్ లైన్ వెబ్ సైట్లు, యాప్ ల ద్వారా బిట్ కాయిన్ల కొనుగోలుకు అవకాశం ఉంది. కాకపోతే కొనుగోలుదారులు ముందుగా వారి పేరిట ఖాతాను తెరవాలి. ఆ తర్వాత కొనుగోలు చేసిన బిట్ కాయిన్లు ఈ ఖాతా/వ్యాలెట్ లో ఉంటాయి. ధర కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మన దేశంలో zebpay, coinsecure, unocoin ఈ మూడు సంస్థలూ కూడా స్వయం నియంత్రణతో తమ ప్లాట్ ఫామ్ లను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నాయి. కేవైసీ వివరాలు, కస్టమర్ గుర్తింపు ధ్రువీకరణ, పాన్ కార్డు వివరాలతోనే ఇవి కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్ బీఐ వంటి నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగినా తమ ప్లాట్ ఫామ్ లపై అన్ని వివరాలూ పారదర్శకంగా ఉంచడం ద్వారా ఇన్వెస్టర్లు నష్టపోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. బిట్ కాయిన్ లావాదేవీలపై స్వల్ప చార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి. కావాల్సినప్పుడు విక్రయించి క్యాష్ చేసుకునే అవకాశాన్నీ ఇస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు సదుపాయాలతో ఎంత విలువ నుంచైనా బిట్ కాయిన్ కొనుగోలుకు అవకాశం ఉంది.
బిట్ కాయిన్ల సృష్టి ఎలా?
బిట్ కాయిన్ల లావాదేవీల వివరాల కోసం లెడ్డర్ ఫైల్ ఉంటుంది. దీన్నే బ్లాక్ చెయిన్ అంటారు. ఒక బ్లాక్ చెయిన్ ఫైల్ సైజు చాలా చిన్నది. మన స్మార్ట్ ఫోన్ లో పెద్ద మెస్సేజ్ అంత ఉంటుంది. ప్రతీ బిట్ కాయిన్ బ్లాక్ చెయిన్ లోనూ మూడు భాగాలుంటాయి. అవి... చిరునామా గుర్తింపు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు (లెడ్జర్) వివరాలు . మూడో భాగం ప్రైవేటు కీ హెడర్. ఇదే డిజిటల్ సిగ్నేచర్ ను సేకరించి ప్రతీ బిట్ కాయిన్ లావాదేవీని ధ్రువీకరిస్తుంటుంది. ప్రతీ బిట్ కాయిన్ యూజర్ కు సంబంధించి ప్రత్యేకమైన డిజిటల్ సిగ్నేచర్ కీ ఉంటుంది. ఈ సిగ్నేచర్ ‘కీ’లే బిట్ కాయిన్లలో భద్రతకు సంబంధించినవి. డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చిన సెకండ్లలోనే లావాదేవీ జరిగిపోతుంది. పైగా ప్రతీ లావాదేవీ తర్వాత ఓ యూజర్ దగ్గర ఎన్ని బిట్ కాయిన్లు ఉన్నాయో కూడా అప్ డేట్ అవుతుంది. దీనివల్ల బిట్ కాయిన్ల నకిలీ సృష్టికి వీలు పడదు. బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ను మాత్రమే రికార్డుల్లో నమోదు చేస్తారు. దీన్నే పబ్లిక్ కీ అంటారు. కొనుగోలు చేసిన వారికి ప్రైవేటు కీ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి లావాదేవీ నిర్వహిస్తారు.. దీంతో ప్రతీ బిట్ కాయిన్ లావాదేవీని డిజిటల్ రూపంలో ధ్రువీకరించడమే కాకుండా పూర్తి గోప్యంగా ఉంచుతారు. ప్రతీ యూజర్ బిట్ కాయిన్ హిస్టరీని చూడగలుగుతారు. కొనుగోలు దారుల పేర్లు మాత్రం ఎక్కడా ఉండవు. కేవలం పబ్లిక్ కీనే కనిపిస్తుంది.
బిట్ కాయిన్ మైనింగ్
స్ట్రాంగ్ కంప్యూటర్ల సాయంతో ఎవరైనా బిట్ కాయిన్ మైనింగ్ (సృష్టించడం) చేయవచ్చు. కాకపోతే ఆ కంప్యూటర్ 24 గంటలూ పనిచేయడంతోపాటు గణితపరంగా వచ్చే సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఒక బిట్ కాయిన్ కు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిచేందుకు ఒక కంప్యూర్ నిరంతరాయంగా పనిచేస్తే రెండు మూడు రోజులు పడుతుంది. అందుకే ఓ వ్యక్తి చాలా పరిమితంగానే బిట్ కాయిన్లను సృష్టించగలరు. పైగా ఓ బిట్ కాయిన్ కు సంబంధించి బ్లాక్ చెయిన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా మైనర్ల విధుల్లో భాగమే. ఇందుకు గాను వారికి కొంత ఆదాయం లభిస్తుంది.
రిస్క్
బిట్ కాయిన్లను ఏ దేశ సెంట్రల్ బ్యాంకు కూడా నియంత్రించలేదు. ప్రైవేటు వ్యక్తుల అధీనంలోనిది ఇది. దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజీ లేదు. ఈ కరెన్సీ ట్రేడింగ్, డిజిటల్ స్టోరేజ్ అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల అధీనంలో జరిగేదే. ధరల హెచ్చు, తగ్గుల్లో వారి పాత్ర ఉండే అవకాశం లేకపోలేదు. సెంట్రల్ బ్యాంకులు వీటిపై చర్యలకు దిగే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. కానీ, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేం. బిట్ కాయిన్ల వంటి అనుమతి లేని వర్చువల్ కరెన్సీల్లో పెట్టుబడులతో నష్టపోవద్దని, ఇందులో ఏవైనా జరిగితే బాధ్యత వారే వహించాల్సి ఉంటుందని ఇటీవలే ఆర్ బీఐ ఓ ప్రకటనలో సూచించింది. అయితే, కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు బిట్ కాయిన్ విషయంలో మార్గదర్శకాలు జారీ చేశాయి. ఆర్ బీఐ కూడా నిషేధం కాకుండా నియంత్రించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే బిట్ కాయిన్ భవిష్యత్తులో మరింతగా పెరిగేందుకు అవకాశం లేకపోలేదు.
భద్రత ఏ మాత్రం
బిట్ కాయిన్లను ఎవరూ చోరీ చేయలేరని చెబుతుంటారు. కానీ 2014 ఫిబ్రవరిలో జపాన్ లోని బిట్ కాయిన్ ఎక్సేంజ్ మౌంట్ గాక్స్ దివాలా తీసింది. డిటిజల్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేసి కరెన్సీని దొంగిలించారని ఈ సంస్థ ఆరోపించింది. దీనివల్ల సుమారు రూ.3,000 కోట్లకుపైనే నష్టం వాటిల్లిందంటూ దివాలా పిటిషన్ వేసింది. ఎక్సేంజ్ పరిధిలో 17.5 లక్షల బిట్ కాయిన్లు చోరీకి గురైనట్టు పేర్కొంది. కెనడాలోని ఆల్బెర్టాలోనూ ఫ్లెక్స్ కాయిన్ అనే బిట్ కాయిన్ బ్యాంకుపైనా హ్యాకర్ల దాడి జరిగింది. సుమారు 7 లక్షల బిట్ కాయిన్లు చోరీకి గురయ్యాయి. ఎంత భద్రత ఉన్నప్పటికీ, హ్యాకర్ల బారిన పడితే బిట్ కాయిన్ కరెన్సీ వారి పరమైనట్టేనన్న ఆందోళన అయితే ఉంది.
ఆటుపోట్లు ఎక్కువ
బిట్ కాయిన్ ధరలో ఒడిదుడుకులు ఎక్కువనే చెప్పాలి. 2016లో 600 డాలర్ల స్థాయిలో ఉన్న ఒక బిట్ కాయిన్ ధర 2017లో 3,100 డాలర్లకు చేరింది. అక్కడి నుంచి 2,120 డాలర్ల స్థాయికి జూన్ లో పడిపోయింది. తిరిగి కొన్ని రోజులకే మళ్లీ 2,800 డాలర్ల స్థాయికి చేరింది. ఇదంతా అనేక అంశాల ఆధారంగా చోటు చేసుకునే ఆటు పోట్లు. బిట్ కాయిన్ ధర అనూహ్యంగా పెరిగిపోవడానికి గతేడాది డీమోనిటైజేషన్ నిర్ణయం కూడా ఒక కారణమని చెబుతారు. ఎందుకంటే ఈ నిర్ణయానికి ముందు 600 డాలర్ల స్థాయలో ఉన్న బిట్ కాయిన్ కాస్తా ఆ తర్వాత రెట్టింపైపోయింది. నిజానికి బిట్ కాయిన్ల తరహా వర్చువల్ కరెన్సీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అయినా అన్నింటినీ తలదన్నింది మాత్రం బిట్ కాయినే. ఆదరణ, డిమాండ్ దీనికే ఎక్కువ.